ఓంశాంతి. భోళానాథుడని ఎవరిని అంటారో మధురాతి-మధురమైన పిల్లలకు తెలుసు. ఇది సంగమయుగీ పిల్లలైన మీరు మాత్రమే తెలుసుకోగలరు, కలియుగ మనుష్యులకు ఏమాత్రం తెలియదు. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి మాత్రమే, వారే సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని అర్థము చేయిస్తారు, తమ పరిచయాన్నిస్తారు. పిల్లలైన మీరు ఇప్పుడు ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారు, ఇంతకుముందు ఏమీ తెలియదు. నేనే వచ్చి భారత్ ను స్వర్గంగా తయారుచేస్తాను, అనంతమైన వారసత్వాన్నిస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఆ వారసత్వాన్ని మీరిప్పుడు తీసుకుంటున్నారు. మనము అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన సుఖ వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఇది తయారై తయారవుతున్న డ్రామా, ఇందులో ఒక్క పాత్రధారి కూడా కలవలేరు, ఒక్క పాత్రధారి కూడా తగ్గలేరు. అందరికీ తమ-తమ పాత్ర లభించి ఉంది. మోక్షాన్ని పొందలేరు. ఎవరెవరు ఏయే ధర్మానికి చెందినవారో, వారు మళ్ళీ ఆ ధర్మములోకే వెళ్తారు. బౌద్ధులు లేక క్రిస్టియన్లు మొదలైనవారు, మేము స్వర్గములోకి వెళ్ళాలి అని కోరుకున్నా వెళ్ళలేరు. వారి ధర్మస్థాపకులు వచ్చినప్పుడే వారి పాత్ర ఉంటుంది. ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మొత్తం ప్రపంచములోని మనుష్యమాత్రులందరూ ఈ సమయంలో నాస్తికులుగా ఉన్నారు అనగా అనంతమైన తండ్రి గురించి తెలియనివారిగా ఉన్నారు. మనుష్యులే తెలుసుకుంటారు కదా. ఇది మనుష్యుల నాటకశాల. ప్రతి ఒక్క ఆత్మ నిర్వాణధామము నుండి పాత్రను అభినయించేందుకు వస్తుంది, మళ్ళీ నిర్వాణధామానికి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తుంది. బుద్ధుడు నిర్వాణం చెందారని అంటారు. ఇప్పుడు బుద్ధుని శరీరమైతే వెళ్ళలేదు, వెళ్తే ఆత్మనే వెళ్తుంది. కానీ అలా ఎవరూ వెళ్ళలేరని బాబా అర్థము చేయిస్తున్నారు. అసలు నాటకము నుండి బయట పడలేరు. మోక్షము పొందలేరు. ఇది తయారై-తయారవుతున్న డ్రామా కదా. కొందరు మనుష్యులు మోక్షము లభిస్తుందని భావిస్తారు, కావున దాని కోసం పురుషార్థము చేస్తూ ఉంటారు. ఏ విధంగా జైనులు పురుషార్థము చేస్తూ ఉంటారు, వారికి వారి ఆచార-పద్ధతులు ఉంటాయి, వారికి తమ గురువు ఉంటారు, ఆ గురువును నమ్ముతారు, కానీ మోక్షము ఎవ్వరికీ లభించదు. మనము ఈ డ్రామాలో పాత్రధారులమని మీకైతే తెలుసు. మనము ఎప్పుడు వచ్చామో, మళ్ళీ ఎలా వెళ్తామో, ఇది ఎవ్వరికీ తెలియదు. జంతువులకైతే తెలియదు కదా. మేము యాక్టర్స్, పాత్రధారులమని మనుష్యులే అంటారు. ఇది ఆత్మలు ఉండే కర్మక్షేత్రము. దానిని కర్మక్షేత్రమని అనరు. అది నిరాకారీ ప్రపంచము. అక్కడ ఎటువంటి ఆటపాటలూ ఉండవు, పాత్ర ఉండదు. నిరాకార ప్రపంచము నుండి సాకార ప్రపంచములోకి పాత్రను అభినయించేందుకు వస్తారు, ఇదంతా మళ్ళీ పునరావృతమౌతూ ఉంటుంది. ప్రళయము ఎప్పుడూ జరగనే జరగదు. మహాభారత యుద్ధంలో యాదవులు మరియు కౌరవులు మరణించారని, తర్వాత కేవలం ఐదుగురు పాండవులే మిగిలారని, వారు కూడా పర్వతాలపై కరిగిపోయారని, ఇంకేమీ మిగలలేదని శాస్త్రాలలో చూపిస్తారు. దీని కారణంగా ప్రళయము జరిగిపోయిందని భావిస్తారు. ఈ కథలన్నీ కూర్చుని తయారుచేశారు, ఇక తర్వాత సముద్రములో రావి ఆకుపై ఒక బాలుడు నోట్లో బొటన వ్రేలును చప్పరిస్తూ వచ్చినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు, వీరి నుండి మళ్ళీ ప్రపంచము ఎలా జన్మిస్తుంది. మనుష్యులు ఏదైతే వింటారో, అది సత్యమేనని అంటూ ఉంటారు. శాస్రాలలో కూడా ఏవేవో రాసారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఇవన్నీ భక్తిమార్గములోని శాస్త్రాలు. భక్తులకు ఫలమునిచ్చేవారు ఒక్క భగవంతుడైన తండ్రి మాత్రమే. కొందరు ముక్తిలోకి, కొందరు జీవన్ముక్తిలోకి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్క పాత్రధారి ఆత్మ, తన పాత్ర వచ్చినప్పుడు మళ్ళీ వస్తుంది. ఈ డ్రామా రహస్యం పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదు అని అంటారు. డ్రామా పాత్రధారులుగా ఉంటూ, డ్రామా యొక్క ఆదిమధ్యాంతాలు, గడువు మొదలైనవాటి గురించి తెలియకపోతే బుద్ధిహీనులు అని అంటారు కదా. అర్థము చేయించినా కూడా అర్థము చేసుకోరు. 84 లక్షల జన్మలు అని భావించిన కారణంగా గడువును కూడా లక్షల సంవత్సరాలుగా చూపించారు.
బాబా, మేము మీ ద్వారా కల్ప-కల్పము స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకుంటామని మీరిప్పుడు అర్థము చేసుకున్నారు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు మిమ్మల్ని కలిసాము. యథా రాజా-రాణి తథా ప్రజా, అందరూ విశ్వానికి యజమానులుగా అవుతారు. మేము విశ్వానికి యజమానులము అని ప్రజలు కూడా అంటారు. మీరు విశ్వానికి యజమానులుగా అయినప్పుడు, ఆ సమయంలో చంద్రవంశీ రాజ్యముండదు. పిల్లలైన మీకు మొత్తం డ్రామా యొక్క ఆదిమధ్యాంతాలు తెలుసు. మనుష్యులకు భక్తిమార్గములో ఎవరినైతే పూజిస్తారో, వారి గురించి కూడా తెలియదు. ఎవరికైతే భక్తి చేయవలసి ఉంటుందో, వారి చరిత్రను కూడా తెలుసుకోవాలి. పిల్లలైన మీరిప్పుడు తండ్రి ద్వారా అందరి చరిత్రను తెలుసుకున్నారు. మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు. తండ్రి జీవిత చరిత్ర గురించి తెలుసు. ఆ తండ్రి పతిత-పావనుడు, లిబరేటర్ (ముక్తిదాత), గైడ్ (మార్గదర్శకుడు). మిమ్మల్ని పాండవులని అంటారు. మీరు అందరికీ గైడ్ గా అవుతారు, అందరికీ మార్గము తెలియజేసేందుకు అంధులకు చేతికర్రగా అవుతారు. పిల్లలైన మీరు కూడా గైడ్ అయిన తండ్రి వలె తయారవ్వాలి. అందరికీ మార్గాన్ని తెలియజేయాలి. మీరు ఆత్మలు, వారు పరమాత్మ, వారి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. భారత్ లో అనంతమైన రాజ్యముండేది, అది ఇప్పుడు లేదు. మనము అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని తీసుకుంటాము అనగా మనుష్యుల నుండి దేవతలుగా అవుతాము అని పిల్లలైన మీకు తెలుసు. మేమే దేవతలుగా ఉండేవారము, తర్వాత 84 జన్మలు తీసుకుని శూద్రులుగా అయ్యాము. తండ్రి వచ్చి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేస్తారు. యజ్ఞములో బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. ఇది జ్ఞాన యజ్ఞము, భారత్ లో చాలా యజ్ఞాలు రచిస్తారు. విశేషంగా ఆర్య సమాజము వారు చాలా యజ్ఞాలు రచిస్తారు. ఇప్పుడిది రుద్రజ్ఞాన యజ్ఞము, ఇందులో పాత ప్రపంచము పూర్తిగా స్వాహా అవ్వనున్నది. ఇప్పుడు బుద్ధి ద్వారా ఆలోచించవలసి ఉంటుంది. కలియుగంలో ఎంతోమంది మనుష్యులుంటారు, ఇంతటి పాత ప్రపంచం మొత్తం సమాప్తం అయిపోతుంది. ఏ వస్తువూ పనికి రాదు. సత్యయుగములో మళ్ళీ అన్నీ కొత్తవే ఉంటాయి. ఇక్కడైతే ఎంత అశుద్ధత ఉంది. మనుష్యులు ఎంత అశుద్ధంగా ఉంటారు. ధనవంతులు చాలా మంచి మహళ్ళలో ఉంటారు. పేదవారు పాపం మురికిలో, గుడిసెలలో ఉంటారు. ఇప్పుడు ఈ గుడిసెలను పడగొడుతూ ఉంటారు, వారికి మరో స్థానము ఇచ్చి ఆ భూమిని మళ్ళీ అమ్మేస్తూ ఉంటారు. ఖాళీ చేయకపోతే బలవంతంగా ఖాళీ చేయిస్తారు. పేదలు చాలా దుఃఖితులుగా ఉన్నారు, ఎవరైతే సుఖంగా ఉన్నారో వారికి కూడా స్థిరమైన సుఖము లేదు. ఒకవేళ సుఖముంటే, అది కాకిరెట్ట సమానమైన సుఖమని ఎందుకు అంటారు.
శివ భగవానువాచ, నేను ఈ మాతల ద్వారా స్వర్గ ద్వారాలు తెరుస్తున్నాను. మాతలపై కలశము పెట్టాను. వారు మళ్ళీ అందరికీ జ్ఞానామృతాన్ని తాగిస్తారు. కానీ మీది ప్రవృత్తి మార్గము. మీరు సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులు కనుక అందరినీ జ్ఞానచితిపై కూర్చోబెడతారు. ఇప్పుడు మీరు దైవీ సంప్రదాయానికి చెందినవారిగా అవుతున్నారు. ఆసురీ సంప్రదాయమంటే రావణ రాజ్యము. గాంధీజీ కూడా రామరాజ్యము ఉండాలని అనేవారు. ఓ పతిత-పావనా రండి, అని పిలుస్తారు కానీ స్వయాన్ని పతితులమని భావించరు. తండ్రి పిల్లలను మేల్కొల్పుతున్నారు, మీరు గాఢమైన అంధకారము నుండి ప్రకాశంలోకి వచ్చారు. గంగా స్నానము చేస్తే పావనంగా అవుతామని మనుష్యులు భావిస్తారు. గంగలోకి హరిద్వార్ లోని మొత్తం చెత్త వచ్చి చేరుతుంది. తర్వాత ఆ చెత్తను మొత్తం పొలాలలోకి తీసుకువెళ్తారు. సత్యయుగంలో ఇటువంటి పనులు ఉండవు. అక్కడైతే లెక్కలేనంత ధాన్యముంటుంది. ధనము ఖర్చు చేయవలసిన అవసరముండదు. బాబా అనుభవజ్ఞులు కదా. మొదట్లో ధాన్యము ఎంత చౌకగా లభించేది. సత్యయుగంలో చాలా కొద్దిమంది మనుష్యులే ఉంటారు, ప్రతి వస్తువు చౌకగా ఉంటుంది. అందుకే తండ్రి చెప్తున్నారు - మధురమైన పిల్లలూ, ఇప్పుడు మీరు పతితము నుండి పావనంగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తారు. ఆత్మలోనే మలినము చేరడం వలన అపవిత్రంగా అయిపోతుంది. ఎవరైతే పారసబుద్ధి కలవారిగా ఉండేవారో, వారే ఇప్పుడు రాతిబుద్ధి కలవారిగా అయ్యారు. పిల్లలైన మీరిప్పుడు రాతినాథుల నుండి పారసనాథులుగా అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చారు. అనంతమైన తండ్రి మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు, అది కూడా స్వర్ణిమయుగ విశ్వానికి యజమానులుగా చేస్తారు. ఇది ఇనుపయుగ విశ్వము. తండ్రి కూర్చుని పిల్లలను పారసపురికి యజమానులుగా చేస్తారు. ఇక్కడ ఉన్న ఇన్ని మహళ్ళు మొదలైనవేవీ పనికి రావని మీకు తెలుసు. అన్నీ సమాప్తమైపోతాయి. మరి అసలు ఇక్కడేముంది! అమెరికా వద్ద ఎంత బంగారం ఉంది! ఇక్కడైతే మాతల వద్ద ఉన్న కొద్ది బంగారాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే అప్పును బంగారం రూపంలో తీర్చవలసి ఉంటుంది. మీ వద్ద అక్కడ బంగారమే బంగారముంటుంది. ఇక్కడ గవ్వలు, అక్కడ వజ్రాలు ఉంటాయి. దీనిని ఇనుపయుగమని అంటారు. భారత్ యే అవినాశీ ఖండము, ఇది ఎప్పుడూ వినాశనమవ్వదు. భారత్ అన్నిటికన్నా ఉన్నతాతి ఉన్నతమైనది. మాతలైన మీరు మొత్తం విశ్వాన్ని ఉద్ధరిస్తారు. మీ కోసం తప్పకుండా కొత్త ప్రపంచము కావాలి, పాత ప్రపంచము వినాశనమవ్వాలి. ఇవి ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయాలు. శరీర నిర్వహణార్థము వ్యాపారాలు మొదలైనవి కూడా చేయాలి. దేనినీ విడిచిపెట్టవలసిన అవసరం లేదు. అన్నీ చేస్తూ నన్ను స్మృతి చేస్తూ ఉండండి అని బాబా చెప్తున్నారు. మీరు వచ్చి నల్లగా ఉన్న మమ్మల్ని సుందరంగా తయారుచేయండి అని భక్తిమార్గములో కూడా మీరు ప్రియుడినైన నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. వారిని యాత్రికుడు అని అంటారు. మీరందరూ యాత్రికులే కదా. ఆత్మలన్నీ నివసించే ఆ స్థానము మీ ఇల్లు.
మీరు అందరినీ జ్ఞానచితిపై కూర్చోబెడతారు. మీరు లెక్కాచారాలన్నీ సమాప్తము చేసుకుని వెళ్తారు. మళ్ళీ కొత్తగా మీరు వస్తారు. ఎంతగా స్మృతిలో ఉంటారో, అంతగా పవిత్రంగా అవుతారు మరియు ఉన్నత పదవిని పొందుతారు. మాతలకైతే తీరిక ఉంటుంది. పురుషుల బుద్ధి వ్యాపారము మొదలైనవాటి వైపు పరుగెడుతూ ఉంటుంది, అందుకే తండ్రి కలశాన్ని కూడా మాతలపై పెట్టారు. పతియే నీకు ఈశ్వరుడు, గురువు, సర్వసమూ, నీవు అతనికి దాసివి అని ఇక్కడ స్త్రీకి చెప్తారు. ఇప్పుడు తండ్రి మాతలైన మిమ్మల్ని మళ్ళీ ఎంత ఉన్నతంగా చేస్తున్నారు. నారీమణులైన మీరే భారత్ ను ఉద్ధరిస్తారు. ఈ రాకపోకల నుండి విడుదల అవ్వగలమా అని కొంతమంది బాబాను అడుగుతారు. అవును, కానీ కొంత సమయానికి మాత్రమే అని బాబా అంటారు. పిల్లలైన మీరు ఆది నుండి అంతిమం వరకు ఆల్ రౌండ్ పాత్రను అభినయిస్తారు. మిగిలినవారు ముక్తిధామములో ఉంటారు. వారి పాత్ర కొద్దిగానే ఉంటుంది. వారు స్వర్గములోకి వెళ్ళేవారు కాదు. ఎవరైతే చివర్లో వచ్చి వెంటనే వెళ్ళిపోతారో, వారి విషయంలో, రాకపోకల నుండి మోక్షం అని చెప్తారు. వారు జ్ఞానము మొదలైనవి వినలేరు. ప్రారంభము నుండి అంతిమం వరకు పాత్రను అభినయించినవారు మాత్రమే వింటారు. మేము అక్కడే కూర్చుని ఉంటాము, మాకైతే ఇదే ఇష్టము అని కొందరంటారు. కానీ అలా జరగదు. వారు అక్కడకు వెళ్ళి మళ్ళీ చివర్లో తప్పకుండా వస్తారు, ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. వారు మిగిలిన సమయమంతా శాంతిధామములో ఉంటారు. ఇది అనంతమైన డ్రామా. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులుగా అయి అందరికీ జ్ఞానామృతాన్ని తాగించాలి. జ్ఞానచితిపై కూర్చోబెట్టాలి.
2. శరీర నిర్వహణార్థం వ్యాపారాలు మొదలైనవన్నీ చేస్తూ పతితం నుండి పావనంగా అయ్యేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి మరియు అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించాలి.