ఓంశాంతి. కాలేజ్ లేక యూనివర్సిటీలో టీచర్ కూడా విద్యార్థుల వైపు చూస్తారు. గులాబి పుష్పం ఎక్కడుంది, ముందు ఎవరు కూర్చొని ఉన్నారు అని చూస్తారు. ఇది కూడా పుష్పాలతోట కాని నంబరువారుగా అయితే ఉన్నారు. ఇక్కడే గులాబి పుష్పాన్ని చూస్తాను, ప్రక్కనే రత్నజ్యోతి పుష్పాన్ని చూస్తాను. అక్కడక్కడ జిల్లేడు పుష్పాలను కూడా చూస్తాను. తోట యజమాని అయితే చూడవలసి ఉంటుంది కదా! మీరు వచ్చి ఈ ముళ్ళ అడవిని సమాప్తం చేసి పుష్పాలకు అంటు కట్టండి అని ఆ తోట యజమానినే పిలుస్తారు. ముళ్ళ నుండి పుష్పాల అంటును ఎలా కడతారో పిల్లలైన మీరు ప్రాక్టికల్ గా తెలుసుకున్నారు. ఈ విషయాల గురించి చింతన చేసేవారు మీలో కూడా చాలా కొద్ది మందే ఉన్నారు. వారు తోట యజమాని, నావికుడు కూడా, అందరినీ తీసుకువెళ్తారని కూడా పిల్లలైన మీకు తెలుసు. పుష్పాలను చూసి తండ్రి కూడా సంతోషపడతారు. మేము ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నామని ప్రతి ఒక్కరూ భావిస్తారు. జ్ఞానం ఎంత ఉన్నతమైనదో చూడండి. ఇది అర్థం చేసుకునేందుకు కూడా చాలా గొప్ప బుద్ధి కావాలి. వీరు కలియుగీ నరకవాసులు. మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. సన్యాసులు ఇంటిని వదిలి పారిపోతారు. మీరు పారిపోకూడదు. కొందరి ఇళ్ళల్లో ఒకరు ముల్లుగా ఉంటే ఒకరు పుష్పంగా ఉంటారు. బాబా, పిల్లలకు వివాహం చేయమంటారా అని కొందరు బాబాను అడుగుతారు. చేస్తే చేయండి అని బాబా చెప్తారు. ఇంట్లో ఉంచుకోండి, సంభాళించండి. అడగుతున్నారంటేనే ధైర్యం లేదని అర్థమవుతుంది. అందుకే, బాబా కూడా చేయండి అనే చెప్తారు. మేమైతే అనారోగ్యంగా ఉంటాము, తర్వాత కోడలు వస్తుంది, ఆమె చేతి వంట తినవలసి వస్తుంది అని అంటారు. తింటే తినండి అని బాబా అంటారు. వద్దు అని అంటారా! పరిస్థితులు కూడా అలానే ఉంటాయి, తినవలసే వస్తుంది ఎందుకంటే మోహం కూడా ఉంటుంది కదా. ఇంటికి కోడలు వచ్చినట్లయితే ఇక విషయమే అడగకండి. దేవి వచ్చినంతగా సంతోషపడిపోతారు. ఇప్పుడైతే ఇది అర్థం చేసుకోవలసిన విషయం. మనం పుష్పాలుగా అవ్వాలంటే పవిత్రుల చేతి భోజనాన్ని తినాలి. దీని కొరకు మన ఏర్పాట్లను చేసుకోవాలి, ఇందులో అడగవలసిందేమీ లేదు. మీరు దేవతలుగా అవుతారు, ఇందులో ఈ పత్యం అవసరమని తండ్రి అర్థం చేయిస్తారు. ఎంత ఎక్కువగా పత్యమునుంచుతారో అంతగా మీ కళ్యాణం జరుగుతుంది. ఎక్కువగా పత్యం పాటించడంలో కొద్దిగా కష్టం కూడా కలుగుతుంది. దారిలో ఆకలేస్తుంది, భోజనాన్ని మీతోపాటుగా తీసుకువెళ్ళండి. ఏదైనా ఇబ్బందైతే, నిస్సహాయులుగా ఉంటే స్టేషన్ వాళ్ళ నుండి బ్రెడ్ ను తీసుకొని తినండి. కేవలం తండ్రిని స్మృతి చేయండి. దీనినే యోగబలం అని అంటారు. ఇందులో హఠయోగం విషయమే లేదు, శరీరాన్ని బలహీనపరుచుకోకూడదు. దధీచి ఋషి వలె ఎముక-ఎముకనూ ఇవ్వాలి, ఇందులో హఠయోగం విషయమే లేదు. ఇవన్నీ భక్తిమార్గపు విషయాలు. శరీరాన్ని పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. యోగం ద్వారా 21 జన్మలకు ఆరోగ్యవంతులుగా అవ్వాలి. ఈ అభ్యాసం ఇక్కడే చేయాలి. ఇందులో అడగవలసిన అవసరమేమీ లేదని బాబా అర్థం చేయిస్తారు. ఒకవేళ ఏదైనా పెద్ద విషయంలో తికమకపడితే అడగవచ్చు. చిన్న-చిన్న విషయాలను బాబాను అడిగితే ఎంత సమయం వ్యర్థం అవుతుంది. గొప్ప వ్యక్తులు చాలా తక్కువగా మాట్లాడ్తారు. శివబాబాను సద్గతిదాత అని అంటారు. రావణుడిని సద్గతిదాత అని అనరు. ఒకవేళ సద్గతిదాత అయితే వారిని ఎందుకు తగలబెడతారు? రావణుడు ప్రసిద్ధమైనవాడని పిల్లలకు తెలుసు. రావణునిలో శక్తి అయితే చాలా ఉంది, కాని శత్రువు కదా. అర్ధకల్పం రావణుని రాజ్యం నడుస్తుంది. కాని ఎప్పుడైనా మహిమను విన్నారా? ఏమీ లేదు. పంచ వికారాలను రావణుడు అని అంటారని మీకు తెలుసు. సాధు-సన్యాసులు పవిత్రంగా ఉన్నప్పుడు వారిని మహిమ చేస్తారు కదా. ఈ సమయంలో మనుష్యులందరూ పతితులే. ఎవరు వచ్చినా సరే, ఎవరైనా గొప్ప వ్యక్తి బాబాను కలిసేందుకు వచ్చారనుకోండి, బాబా వారిని ఏం అడుగుతారు? రామరాజ్యం మరియు రావణరాజ్యం అని ఎప్పుడైనా విన్నారా అని వారిని అడుగుతారు. మనుష్యులు మరియు దేవతలు అని ఎప్పుడైనా విన్నారా? ఈ సమయంలో మనుష్యుల రాజ్యముందా లేక దేవతలదా? మనుష్యులెవరు, దేవతలెవరు? దేవతలు ఏ రాజ్యంలో ఉండేవారు? దేవతలైతే సత్యయుగంలో ఉంటారు. యథా రాజా రాణి తథా ప్రజా..... ఇది కొత్త సృష్టియా లేక పాతదా? సత్యయుగంలో ఎవరి రాజ్యముండేది? ఇప్పుడు ఎవరి రాజ్యముంది? అని మీరు అడగవచ్చు. చిత్రాలైతే ఎదురుగానే ఉన్నాయి. భక్తి ఏమిటి? జ్ఞానం ఏమిటి? ఇది తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు.
బాబా, ధారణ జరగడం లేదని పిల్లలు చెప్పినప్పుడు వారికి బాబా చెప్తారు - 'అల్ఫ్ (భగవంతుడు) మరియు బే (వారసత్వం)', ఇది సహజమే కదా. తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తే ఆస్తి లభిస్తుందని అల్ఫ్ అయిన తండ్రే చెప్తున్నారు. భారత్ లో శివజయంతి కూడా జరుపుకుంటారు కాని భారత్ లోకి ఎప్పుడు వచ్చి స్వర్గంగా చేశారు? భారతదేశం స్వర్గంగా ఉండేదని ఎవ్వరికీ తెలియదు, మర్చిపోయారు. మేము స్వర్గానికి యజమానులుగా ఉండేవారమన్నది మాకు కూడా ఏమీ తెలియదని మీరు చెప్తారు. ఇప్పుడు తండ్రి ద్వారా మళ్ళీ దేవతలుగా అవుతున్నాము. అర్థం చేయించేవాడిని నేనే. సెకెండులో జీవన్ముక్తి అన్న గాయనం ఉంది. కాని దీని అర్థం కూడా తెలియదు. సెకెండులో మీరు స్వర్గంలోని దేవకన్యలుగా అవుతారు కదా! దీనిని ఇంద్రసభ అని కూడా అంటారు, కాని వారు వర్షాలు కురిపించే వారిని ఇంద్రుడు అని అంటారు. ఇప్పుడు వర్షాలు కురిపించే వారి సభ ఏమైనా జరుగుతుందా? ఇంద్రుని వజ్రాయుధం, ఇంద్రసభ అని ఏవేవో వినిపిస్తూ ఉంటారు.
ఇప్పుడు మళ్ళీ ఈ పురుషార్థాన్ని చేస్తున్నారు, ఇది చదువు కదా. బ్యారిస్టరీ చదువుతున్నప్పుడు, రేపు మేము బ్యారిస్టర్ గా అవుతామని భావిస్తారు. నేడు చదువుకుంటారు, రేపు శరీరాన్ని వదిలి రాజ్యంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు. మీరు భవిష్యత్తు కోసం ప్రారబ్ధాన్ని పొందుతారు. ఇక్కడ నుండి చదువుకొని వెళ్తారు, మళ్ళీ మన జన్మ సత్యయుగంలో జరుగుతుంది. రాకుమార-రాకుమారీలుగా అవ్వడమే ముఖ్య ఉద్దేశ్యం. రాజయోగం కదా! బాబా, మా బుద్ధి వికసించడం లేదని కొందరు అంటారు, మరి మీ భాగ్యం అలా ఉంది. డ్రామాలో పాత్ర అలా ఉంది. అది బాబా ఎలా మార్చగలరు? స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు అయితే అందరూ హక్కుదారులే. కాని నంబరువారుగా అయితే ఉంటారు కదా. అందరూ చక్రవర్తులుగా అవుతారని కాదు. ఈశ్వరీయ శక్తినే ఉంటే అందరినీ చక్రవర్తులుగా చేయండి అని కొందరు అంటారు. అటువంటప్పుడు ప్రజలు ఎక్కడి నుండి వస్తారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. ఇప్పుడున్నవారు కేవలం నామమాత్రానికే మహారాజులు-మహారాణులుగా ఉన్నారు. బిరుదులు కూడా ఇచ్చేస్తారు. లక్ష, రెండు లక్షలు ఇవ్వడంతో రాజా-రాణి అనే బిరుదు కూడా లభిస్తుంది. అటువంటప్పుడు నడవడికను కూడా అలాగే ఉంచుకోవలసి ఉంటుంది.
మేము శ్రీమతమనుసారంగా మా రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అక్కడ అందరూ సుందరంగా, తెల్లగా ఉంటారు. ఈ లక్ష్మీ నారాయణుల రాజ్యముండేది కదా. శాస్త్రాలలో కల్పం యొక్క ఆయువు ఎక్కువగా వ్రాయడంతో మనుష్యులు మర్చిపోయారు. నల్లగా ఉన్న మీరు సుందరంగా అయ్యేందుకు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు దేవతలేమైనా నల్లగా ఉంటారా? కృష్ణుడిని నల్లగా, రాధను తెల్లగా చూపిస్తారు. సుందరంగా ఉంటే ఇద్దరూ సుందరంగా ఉంటారు కదా. తర్వాత కామచితిపై ఎక్కి ఇద్దరూ నల్లగా అయిపోతారు. అక్కడ ఉన్నది సుందరమైన ప్రపంచానికి యజమానులు, ఇది నల్లని ప్రపంచం. పిల్లలైన మీకు, ఒకటైతే ఆంతరికంగా సంతోషం ఉండాలి మరియు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. బాబా, బీడీని వదలలేకపోతున్నానని కొందరు అంటారు. అచ్ఛా, బాగా త్రాగండి అని బాబా అంటారు. అలా అడిగితే ఏం చెప్తారు! పత్యం పాటించకపోతే పడిపోతారు. మీకు మీ తెలివి ఉండాలి కదా. మనం దేవతలుగా అవుతామంటే మన నడవడిక, ఆహార-పానీయాలు ఎలా ఉండాలి. మేము లక్ష్మిని, నారాయణుడిని వరిస్తాము అని అందరూ అంటారు. అచ్ఛా, అటువంటి గుణాలు ఉన్నాయా అని స్వయంలో చూసుకోండి. మేము బీడీ తాగితే నారాయణునిగా అవ్వగలమా? నారదుని కథ కూడా ఉంది కదా. నారదుడు ఎవరో ఒక్కరైతే కాదు కదా. మనుష్యులందరూ భక్తులే (నారదులే).
తండ్రి అంటారు - దేవతలుగా అయ్యే పిల్లలూ, అంతర్ముఖులుగా అయి మీతో మీరే మాట్లాడుకోండి - మేము దేవతలుగా అవుతున్నామంటే మా నడవడిక ఎలా ఉండాలి? మనం దేవతలుగా అవుతున్నాము కావున మద్యం సేవించకూడదు, బీడీ తాగకూడదు, వికారాల్లోకి వెళ్ళకూడదు, పతితుల చేతి వంటను తినకూడదు. లేకపోతే మీ స్థితిపై ప్రభావం పడుతుంది. ఈ విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. డ్రామా రహస్యం కూడా ఎవ్వరికీ తెలియదు. ఇది నాటకం, అందరూ పాత్రధారులే. ఆత్మలైన మనం పై నుండి క్రిందికి వస్తాము, ప్రపంచంలో ఉన్న పాత్రధారులందరూ పాత్రను అభినయించాల్సిందే. అందరికీ తమ-తమ పాత్ర ఉన్నది. ఎంత మంది పాత్రధారులున్నారు, ఏ విధంగా పాత్రను అభినయిస్తారు, ఇదంతా వెరైటీ ధర్మాల వృక్షం. ఒక్క మామిడి వృక్షాన్ని వెరైటీ వృక్షమని అనడం జరగదు. అందులోనైతే మామిడికాయలు మాత్రమే ఉంటాయి. ఇది మనుష్య సృష్టి వృక్షం, కాని దీని పేరు - వెరైటీ ధర్మాల వృక్షం. బీజం ఒక్కటే, మనుష్యుల వెరైటీలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఒకరు ఒక రకంగా, మరొకరు మరో రకంగా ఉన్నారు. ఇది బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు, మనుష్యులకైతే ఏమీ తెలియదు. మనుష్యులను బాబాయే పారసబుద్ధి కలవారిగా చేస్తారు. ఈ పాత ప్రపంచంలో ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది అని మీకు తెలుసు. కల్పక్రితం వలె అంటు కట్టడం జరుగుతుంది. మంచి ప్రజలు, సాధారణ ప్రజల అంటు కూడా కట్టబడుతుంది. ఇక్కడే రాజధాని స్థాపన అవుతుంది. పిల్లలు ప్రతి విషయంలోనూ బుద్ధిని నడిపించవలసి ఉంటుంది. మురళీ విన్నామా, వినలేదా అన్నది కాదు. ఇక్కడ కూర్చున్నా బుద్ధి బయట పరిగెడుతూ ఉంటుంది. మురళీని సమ్ముఖంలో విని చాలా పులకరించిపోయేవారు కూడా కొందరు ఉన్నారు. మురళి కోసం పరుగు పెడతారు. భగవంతుడు చదివిస్తున్నారు, కావున ఇటువంటి చదువును వదలకూడదు. టేపులో ఖచ్చితంగా నింపడం జరుగుతుంది, అది వినాలి. ధనవంతులు కొన్నారంటే పేదవారు కూడా వింటారు. ఎంతోమంది కళ్యాణం జరుగుతుంది. పేద పిల్లలు కూడా తమ భాగ్యాన్ని చాలా ఉన్నతంగా తయారుచేసుకోవచ్చు. బాబా పిల్లల కోసం ఇళ్ళు కట్టిస్తున్నారు, పేదవారు రెండు రూపాయలను మనీ ఆర్డరు చేస్తారు - "బాబా, దీనితో ఒక్క ఇటుకను ఇంటి కోసం ఉపయోగించండి". ఒక్క రూపాయిని యజ్ఞంలో వేయండి. హుండీని నింపేవారు కూడా కొందరుంటారు కదా. మనుష్యులు ఆసుపత్రి మొదలైనవి కట్టిస్తారు, ఎంత ఖర్చవుతుంది, ధనవంతులు ప్రభుత్వానికి చాలా సహయోగం చేస్తారు. వారికి ఏం లభిస్తుంది! అల్పకాలిక సుఖం. ఇక్కడ మీరేదైతే చేస్తారో, అది 21 జన్మల కోసం. బాబా అయితే అంతా ఇచ్చేసి, విశ్వాధిపతిగా నంబరువన్ గా అవ్వడం చూస్తున్నారు. 21 జన్మల కొరకు ఇటువంటి వ్యాపారాన్ని ఎవ్వరూ చేయరు. భోళానాథుడని అందుకే అంటారు కదా. అది ఇప్పటి విషయమే. ఎంత భోళాగా ఉన్నారు, ఏమి చేయాలనుకుంటున్నారో, అది చేసెయ్యండి అని చెప్తారు. ఎంత పేద పిల్లలున్నారు, బట్టలు కుట్టి పొట్టను నింపుకుంటారు. వీరు చాలా ఉన్నత పదవిని పొందుతారని బాబాకు తెలుసు. సుదాముని ఉదాహరణ కూడా ఉంది కదా. పిడికెడు అటుకులకు బదులుగా 21 జన్మలకు మహళ్ళు లభించాయి. ఈ విషయాలు మీకు నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసు. నేను భోళానాథుడిని కూడా కదా అని తండ్రి చెప్తారు. ఈ దాదా భోళానాథుడు కారు. శివబాబా భోళానాథుడు కావున వారిని వ్యాపారస్థుడు, రత్నాకరుడు, ఇంద్రజాలికుడు అని అంటారని వీరు కూడా చెప్తారు. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇక్కడ భారత్ బికారిగా ఉంది, ప్రజలు ధనవంతులుగా ఉన్నారు, ప్రభుత్వం నిరుపేదగా ఉంది. భారతదేశం ఎంత ఉన్నతంగా ఉండేదో ఇప్పుడు మీకు తెలుసు. స్వర్గంగా ఉండేది. దాని గుర్తులు కూడా ఉన్నాయి. సోమనాథుని మందిరం వజ్ర-వైఢూర్యాలతో ఎంతగా అలంకరింపబడి ఉండేది! ఒంటెలపై నింపుకొని వజ్ర-వైఢూర్యాలను తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఈ ప్రపంచం తప్పకుండా పరివర్తన అవ్వాల్సిందేనని పిల్లలైన మీకు తెలుసు. దాని కొరకు మీరు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరైతే చేస్తారో వారు పొందుతారు. మాయ చాలా వ్యతిరేకిస్తుంది. మీరు ఈశ్వరుని సంతానం. మిగిలినవారంతా రావణుని బానిసలు. మీరు శివబాబాకు చెందినవారు. శివబాబా మీకు వారసత్వాన్నిస్తారు. బాబా తప్ప వేరే విషయాలేవీ బుద్ధిలోకి రాకూడదు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. అంతర్ముఖులుగా అయి మీతో మీరే మాట్లాడుకోవాలి - మనం దేవతలుగా అవుతామంటే మన నడవడిక ఎలా ఉంది! అశుద్ధ అన్నపానాదులేవీ లేవు కదా!
2. తమ భవిష్యత్తును 21 జన్మల కోసం ఉన్నతంగా తయారుచేసుకునేందుకు సుదాముని వలె ఉన్నదంతా భోళానాథుడైన తండ్రికి అర్పణ చేయండి. చదువు విషయంలో ఎటువంటి సాకులూ చెప్పకండి.