ఓంశాంతి. దీని అర్థము పిల్లలకు తెలియజేయడం జరిగింది. ఓం అంటే నేను ఆత్మను. జీవాత్మ అనేది తప్పకుండా ఉందని అందరూ అంటారు, అలాగే ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. శరీరాలకు తండ్రులు వేర్వేరుగా ఉంటారు. హద్దు తండ్రి ద్వారా హద్దు యొక్క వారసత్వము మరియు అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వము లభిస్తుందని కూడా పిల్లల బుద్ధిలో ఉంది. ఇప్పుడు విశ్వంలో శాంతి ఏర్పడాలని ఈ సమయంలో మనుష్యులు కోరుకుంటారు. ఒకవేళ చిత్రాలను ఉపయోగించి శాంతి కోసం అర్థం చేయించాలంటే, కలియుగాంతం మరియు సత్యయుగం ఆది యొక్క సంగమయుగము వద్దకు వారిని తీసుకురావాలి. ఇది సత్యయుగము, కొత్త ప్రపంచము, అక్కడ ఒకే ధర్మముంటుంది కనుక పవిత్రత-శాంతి-సుఖము ఉంటాయి, దీనిని స్వర్గమని అంటారు అని చెప్పాలి. ఇది అందరూ అంగీకరిస్తారు. కొత్త ప్రపంచములో సుఖముంటుంది, దుఃఖముండదు. ఇది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. శాంతి మరియు అశాంతి అనే విషయాలు ఇక్కడ విశ్వములోనే ఉంటాయి. అదైతే నిర్వాణధామము, అక్కడ శాంతి-అశాంతి అనే ప్రశ్నే తలెత్తదు. పిల్లలు భాషణ చేసేటప్పుడు మొట్టమొదట, విశ్వంలో శాంతి యొక్క విషయమే మాట్లాడాలి. మనుష్యులు శాంతి కోసం చాలా కష్టపడతారు, వారికి బహుమతులు కూడా లభిస్తూ ఉంటాయి. వాస్తవానికి ఇందులో పరుగులు తీసే విషయం లేదు. కేవలం మీ స్వధర్మములో స్థితి అయినట్లయితే వికర్మలు వినాశనమౌతాయి అని తండ్రి చెప్తున్నారు. స్వధర్మములో స్థితులైతే శాంతి ఏర్పడుతుంది. మీరు సదా శాంతిగా ఉండే తండ్రి పిల్లలు. ఈ వారసత్వము వారి నుండి లభిస్తుంది. దీనిని ఎవరూ మోక్షమని అనరు. మోక్షము అయితే భగవంతుడికి కూడా లభించదు. భగవంతుడు కూడా తప్పకుండా పాత్రను అభినయించాల్సిందే. కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమయుగములో నేను వస్తానని వారు చెప్తున్నారు. మరి భగవంతుడికే మోక్షము లేనప్పుడు పిల్లలు మోక్షమును ఎలా పొందుతారు. ఈ విషయాలు రోజంతా విచార సాగర మథనము చేయవల్సినవి. పిల్లలైన మీకు మాత్రమే తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీకు, అర్థము చేయించే అభ్యాసము ఎక్కువగా ఉంది. శివబాబా అర్థం చేయిస్తున్నారంటే బ్రాహ్మణులైన మీరందరూ మాత్రమే అర్థము చేసుకుంటారు. విచార సాగర మథనము మీరే చేయాలి ఎందుకంటే సేవలో పిల్లలైన మీరే ఉన్నారు. మీరైతే చాలా అర్థం చేయించాల్సి ఉంటుంది. రాత్రి-పగలు సేవలో ఉంటారు. మ్యూజియంలో రోజంతా వస్తూనే ఉంటారు. కొన్నిచోట్ల రాత్రి 10-11 గంటల వరకు కూడా వస్తారు. అక్కడక్కడ ఉదయం 4 గంటల నుండే సేవలో నిమగ్నమౌతారు. ఇది ఇల్లు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర్చోవచ్చు. సెంటర్లలోనైతే దూర-దూరాల నుండి బయట నుండి వస్తారు కనుక సమయం నిర్ణయించాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఏ సమయములోనైనా పిల్లలు లేవవచ్చు. కానీ పిల్లలు లేచిన తర్వాత కునికిపాట్లు పడే విధంగా రాత్రి అంత టైం వరకూ చదవకూడదు, అందుకే ఉదయం సమయాన్ని పెట్టడం జరుగుతుంది. అప్పుడు స్నానం మొదలైనవి చేసుకొని ఫ్రెష్ అయి వస్తారు, అయినా సమయానికి రాకపోతే వారిని ఆజ్ఞాకారులు అని అనరు. లౌకిక తండ్రికి కూడా సుపుత్రులు మరియు కుపుత్రులైన పిల్లలుంటారు కదా. అనంతమైన తండ్రికి కూడా ఉంటారు. సుపుత్రులైనవారు వెళ్ళి రాజులుగా అవుతారు, కుపుత్రులు వెళ్ళి ఊడుస్తారు. అంతా తెలిసిపోతుంది కదా.
కృష్ణ జన్మాష్టమిని గురించి కూడా అర్థం చేయించారు. కృష్ణుని జన్మ జరిగినప్పుడు స్వర్గముంటుంది. ఒకే రాజ్యముంటుంది. విశ్వములో శాంతి ఉంటుంది. స్వర్గంలో చాలా కొద్దిమంది మనుష్యులు ఉంటారు. అది ఉన్నదే కొత్త ప్రపంచము. అక్కడ అశాంతి ఉండదు. ఒకే ధర్మమున్నప్పుడు శాంతి ఉంటుంది. ఆ ధర్మాన్ని తండ్రి స్థాపన చేస్తారు. తర్వాత ఇతర ధర్మాలు వచ్చినప్పుడు అశాంతి ఏర్పడుతుంది. అక్కడ ఉండేదే శాంతి, 16 కళా సంపూర్ణులు కదా. చంద్రుడు కూడా సంపూర్ణమైనప్పుడు ఎంత శోభనీయంగా ఉంటాడు, దానిని ఫుల్ మూన్ (పౌర్ణమి) అని అంటారు. త్రేతా యుగములో 3/4 భాగమంటారు, ఖండితమైపోయింది కదా. 2 కళలు తగ్గిపోతాయి. సంపూర్ణ శాంతి సత్యయుగంలో ఉంటుంది. సృష్టి 25 శాతము పాతదిగా అయితే ఎంతో కొంత అలజడి ఉంటుంది. 2 కళలు తగ్గిపోవడంతో శోభ తగ్గిపోతుంది. స్వర్గంలో పూర్తిగా శాంతి, నరకంలో పూర్తిగా అశాంతి ఉంటుంది. ఇది మనుష్యులు విశ్వంలో శాంతిని కోరుకునే సమయము, విశ్వంలో శాంతి ఉండాలనే శబ్దం ఇంతకుముందు లేదు. ఇప్పుడు శబ్దం వినిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు విశ్వములో శాంతి ఏర్పడుతుంది. విశ్వంలో శాంతి ఏర్పడాలని ఆత్మ కోరుకుంటుంది. మనుష్యులైతే దేహాభిమానములో ఉన్న కారణంగా విశ్వములో శాంతి ఏర్పడాలని కేవలం చెప్తూ ఉంటారు. ఇప్పుడు 84 జన్మలు పూర్తయ్యాయి. ఈ విషయాలు తండ్రి మాత్రమే వచ్చి అర్థం చేయిస్తున్నారు. తండ్రినే స్మృతి చేస్తారు. వారు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు, వారి పేరే హెవెన్లీ గాడ్ ఫాదర్. స్వర్గమును ఎలా రచిస్తారో ఎవ్వరికీ తెలియదు. శ్రీ కృష్ణుడైతే రచించలేడు. వారిని దేవత అని అంటారు. మనుష్యులు దేవతలకు నమస్కరిస్తారు. వారిలో దైవీ గుణాలున్నాయి, అందువలన దేవతలని అంటారు. మంచి గుణాలు కలిగినవారిని వీరైతే దేవత వలె ఉన్నారని అంటారు కదా. కొట్లాడడం-గొడవపడడం చేసేవారిని వీరైతే అసురుల వలె ఉన్నారని అంటారు. మనము అనంతమైన తండ్రి ఎదురుగా కూర్చున్నామని పిల్లలకు తెలుసు. మరి పిల్లల నడవడిక ఎంత బాగుండాలి. అజ్ఞాన కాలములో కూడా బాబా చూసారు, 6-7 కుటుంబాలు కలిసి ఉండేవి, వారంతా పూర్తిగా క్షీరఖండం వలె నడుచుకునేవారు. కొన్నిచోట్ల ఇంట్లో కేవలం ఇద్దరే ఉన్నా కూడా కొట్లాడుతూ-గొడవపడుతూ ఉంటారు. మీరు ఈశ్వరీయ సంతానము. చాలా-చాలా క్షీరఖండంగా అయి ఉండాలి. సత్యయుగంలో క్షీరఖండం వలె ఉంటారు, ఇక్కడ క్షీరఖండం వలె ఉండడం మీరు నేర్చుకుంటారు కనుక చాలా ప్రేమగా ఉండాలి. నేను ఎటువంటి వికర్మనైతే చేయలేదు కదా, ఎవ్వరికీ దుఃఖమునివ్వలేదు కదా అని లోపల చెక్ చేసుకోండి అని తండ్రి చెప్తున్నారు. ఈ విధంగా ఎవ్వరూ కూర్చొని చెక్ చేసుకోరు. ఇవి బాగా అర్థము చేసుకోవాల్సిన విషయం. పిల్లలైన మీరు విశ్వంలో శాంతిని స్థాపన చేసేవారు. ఒకవేళ ఇంట్లోనే అశాంతిని కలిగించేవారుంటే మరి వారు శాంతిని ఎలా స్థాపిస్తారు. లౌకిక తండ్రిని కొడుకు విసిగిస్తే, ఆ కొడుకు చనిపోయినా బాగుండేది అని అంటారు. దేనికైనా అలవాటు పడితే అది పక్కా అయిపోతుంది. మేము అనంతమైన తండ్రి పిల్లలము, మేము విశ్వంలో శాంతిని స్థాపన చేయాలి అన్న వివేకం ఉండదు. శివబాబా పిల్లలు ఒకవేళ అశాంతిగా అయితే శివబాబా వద్దకు రండి. వారు వజ్రము, ఈ విధంగా శాంతి కలుగుతుందని మీకు వెంటనే యుక్తిని తెలియజేస్తారు. శాంతి యొక్క ఏర్పాట్లు చేస్తారు. దైవీ వంశంలోకి వచ్చే నడవడిక లేని వారు చాలామంది ఉన్నారు. మీరిప్పుడు పుష్పాల ప్రపంచంలోకి వెళ్ళేందుకు తయారవుతున్నారు. ఇది ఉన్నదే అశుద్ధ ప్రపంచము వేశ్యాలయము, దీనిపై అసహ్యము కలుగుతుంది. కొత్త ప్రపంచములో విశ్వంలో శాంతి ఉంటుంది. సంగమయుగంలో ఉండదు. ఇక్కడ శాంతిగా అయ్యే పురుషార్థము చేస్తారు. పురుషార్థము పూర్తిగా చేయకపోతే మళ్ళీ శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. నాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు కదా. లెక్కాచారాలు పూర్తి చేసుకునే సమయము వచ్చినప్పుడు చాలా దెబ్బలు తింటారు. కర్మభోగము తప్పకుండా ఉంటుంది. అనారోగ్యం కూడా కర్మభోగమే కదా. తండ్రి కన్నా పైన ఎవ్వరూ లేరు. పిల్లలూ, పుష్పాలుగా అయినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు లేకపోతే ఎటువంటి లాభమూ ఉండదు అని అర్థం చేయిస్తున్నారు. భగవంతుడైన తండ్రి, ఎవరినైతే అర్థకల్పము స్మృతి చేశామో, అటువంటివారి నుండి వారసత్వము తీసుకోకపోతే ఇక పిల్లలు దేనికి పనికొస్తారు. కానీ డ్రామానుసారంగా ఇది తప్పకుండా జరగాలి. అర్థం చేయించే యుక్తులు కూడా చాలా ఉన్నాయి. విశ్వంలో శాంతి అయితే సత్యయుగంలో ఉండేది, అక్కడ ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. యుద్ధము కూడా తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే అశాంతిగా ఉంది కదా. కృష్ణుడు మళ్ళీ సత్యయుగములో వస్తారు. కలియుగంలో దేవతల నీడ కూడా పడదని అంటారు. ఈ విషయాలు పిల్లలైన మీరే ఇప్పుడు వింటున్నారు. శివబాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. ధారణ చేసేందుకు మొత్తం ఆయుష్షు పడుతుంది. జీవితమంతా అర్థం చేయించినా కూడా అర్థము చేసుకోలేదని అంటారు కదా.
అనంతమైన తండ్రి చెప్తున్నారు - ముఖ్యమైన విషయాలు మొట్టమొదట అర్థం చేయించండి - జ్ఞానము వేరు మరియు భక్తి వేరు. అర్థకల్పము పగలు, అర్థకల్పము రాత్రి. శాస్త్రాలలో కల్పము యొక్క ఆయుష్షు గురించే విరుద్ధంగా వ్రాసేశారు. అలాగైతే సగము - సగము కూడా ఉండదు. మీలో శాస్త్రాలు మొదలైనవి ఎవరూ చదివి ఉండకపోతే మంచిది. చదివి ఉంటే వారికి సంశయాలు వస్తాయి, ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాస్తవానికి వానప్రస్థ అవస్థ వచ్చినప్పుడు భగవంతుడిని స్మృతి చేస్తారు. ఎవరో ఒకరి మతము ద్వారా స్మృతి చేస్తారు. ఇక తర్వాత, గురువు ఎలా నేర్పిస్తే అలా చేస్తారు. భక్తి కూడా నేర్పిస్తారు. భక్తి నేర్పించని వారెవ్వరూ ఉండరు. వారిలో భక్తి యొక్క శక్తి ఉంది, అందుకే ఇంతమంది శిష్యులు ఏర్పడతారు. శిష్యులను భక్తులు, పూజారులు అని అంటారు. ఇక్కడ అందరూ పూజారులు. అక్కడ పూజారులెవ్వరూ ఉండరు. భగవంతుడు ఎప్పుడూ పూజారిగా అవ్వరు. అనేక పాయింట్లు అర్థం చేయించడం జరుగుతుంది, నెమ్మది - నెమ్మదిగా పిల్లలైన మీలో కూడా అర్థము చేయించే శక్తి వస్తూ ఉంటుంది.
ఇప్పుడు మీరు కృష్ణుడు వస్తున్నాడని తెలియజేస్తారు. సత్యయుగంలో కృష్ణుడు తప్పకుండా ఉంటాడు. లేకపోతే ప్రపంచ చరిత్ర - భూగోళాలు ఎలా రిపీట్ అవుతాయి. కేవలం ఒక్క కృష్ణుడు మాత్రమే ఉండడు, యథా రాజా-రాణి తథా ప్రజలు ఉంటారు కదా. ఇందులో కూడా అర్థము చేసుకునే విషయాలున్నాయి. మనము అయితే తండ్రి పిల్లలము అని పిల్లలైన మీరు భావిస్తారు. తండ్రి వారసత్వమునిచ్చేందుకు వచ్చారు. స్వర్గములోకి అందరూ రారు. త్రేతాయుగంలో కూడా రాలేరు. వృక్షము నెమ్మది-నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షము. అక్కడ ఆత్మల వృక్షము ఉంటుంది. ఇక్కడ బ్రహ్మా ద్వారా స్థాపన, తర్వాత శంకరుని ద్వారా వినాశనం తర్వాత పాలన...... పదాలు కూడా ఈ నియమానుసారంగా చెప్పాలి. ఈ సృష్టిచక్రము ఎలా తిరుగుతుంది, రచన ఎలా జరుగుతుంది అని పిల్లల బుద్ధిలో ఈ నషా ఉంది. ఇది కొత్త చిన్న రచన కదా. ఇది పిల్లి మొగ్గలాట వంటిది. మొదట అనేక మంది శూద్రులుంటారు, తర్వాత తండ్రి వచ్చి బ్రహ్మా ద్వారా బ్రాహ్మణుల రచనను రచిస్తారు. బ్రాహ్మణులు పిలకగా అవుతారు. పిలక మరియు పాదము రెండూ కలుస్తాయి. మొదట బ్రాహ్మణులు కావాలి. బ్రాహ్మణుల యుగము చాలా చిన్నదిగా ఉంటుంది. తర్వాత దేవతలు. ఈ వర్ణాల చిత్రము కూడా ఉపయోగపడుతంది. ఈ చిత్రాలు అర్థము చేయించడం చాలా సులభము. వెరైటీ మనుష్యుల వెరైటీ రూపాలు. అర్థం చేయించడంలో ఎంత ఆనందం అనిపిస్తుంది. బ్రాహ్మణులున్నప్పుడు అన్ని ధర్మాలు ఉంటాయి. శూద్రుల నుండి బ్రాహ్మణుల అంటు కట్టబడుతుంది. మనుష్యులైతే వృక్షాలకు అంటు కడతారు. తండ్రి కూడా విశ్వములో శాంతి ఏర్పడేందుకు అంటు కడతారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మనము ఈశ్వరీయ సంతానమనే స్మృతి సదా ఉండాలి. మనము క్షీరఖండంగా అయి ఉండాలి. ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు.
2. మా ద్వారా ఎటువంటి వికర్మ జరగడం లేదు కదా, అశాంతిగా అయ్యి లేక అశాంతిని వ్యాపింపజేసే అలవాటు లేదు కదా అని స్వయాన్ని లోపల చెక్ చేసుకోవాలి.