ఓంశాంతి. ఏ మార్గములో నడవాలి? గురువు యొక్క మార్గంలో నడవాలి. వీరు ఏ గురువు? లేస్తూ-కూర్చుంటూ మనుష్యుల నోటి నుండి వాహ్ గురు అని వెలువడుతుంది. గురువులైతే అనేకమంది ఉన్నారు. వాహ్ గురు అని ఎవరిని అంటారు? ఎవరి మహిమను గానం చేస్తారు? సద్గురువు ఒక్క తండ్రి మాత్రమే. భక్తి మార్గములో అనేకమంది గురువులున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని మహిమ చేస్తారు. సత్యమైన సద్గురువు వారొక్కరేనని పిల్లల బుద్ధిలో ఉంది, వారినే వాహ్, వాహ్ అని అనడం జరుగుతుంది. సత్యమైన సద్గురువు ఉన్నారంటే తప్పకుండా అసత్యమైన వారు కూడా ఉంటారు. సత్యమైనవారు సంగమయుగములోనే ఉంటారు. భక్తిమార్గములో కూడా సత్యం యొక్క మహిమను గానం చేస్తారు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి మాత్రమే సత్యమైనవారు, వారే ముక్తిదాతగా, మార్గదర్శకునిగా కూడా అవుతారు. ఈ రోజుల్లో గురువులు గంగా స్నానాలకు లేక తీర్థయాత్రలకు తీసుకువెళ్ళేందుకు మార్గదర్శకులుగా అవుతారు. ఈ సద్గురువు అయితే అటువంటివారు కాదు. అందరూ వారిని ఓ పతితపావనా రండి అని గుర్తు చేస్తారు. పతిత పావనుడని సద్గురువును మాత్రమే అంటారు. వారే పావనంగా తయారుచేయగలరు. ఆ గురువులు పావనంగా తయారుచేయలేరు. నన్నొక్కడినే స్మృతి చేయండి అని వారెవ్వరూ ఈ విధంగా చెప్పరు. గీతను కూడా చదువుతారు కానీ అర్థము ఏ మాత్రమూ తెలియదు. ఒకవేళ సద్గురువు ఒక్కరేనని భావిస్తే స్వయాన్ని గురువు అని పిలిపించుకోరు. డ్రామానుసారంగా భక్తి మార్గపు డిపార్టుమెంటే వేరు, అందులో అనేకమంది గురువులు, అనేకమంది భక్తులు ఉన్నారు. వీరైతే ఒక్కరే. తర్వాత ఈ దేవీ దేవతలు మొదటి నంబరులోకి వస్తారు. ఇప్పుడు వారు చివర్లో ఉన్నారు. తండ్రి వచ్చి వీరికి సత్యయుగం యొక్క రాజ్యాధికారాన్ని ఇస్తారు, మిగిలినవారందరూ ఆటోమెటిక్ గా తిరిగి వెళ్ళాలి, కనుక సర్వుల సద్గతిదాత ఒక్కరేనని అంటారు. కల్ప-కల్పము సంగమయుగంలోనే దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతుందని మీరు అర్థం చేసుకుంటారు. మీరు పురుషోత్తములుగా అవుతారు. మీరు ఇంకే పనీ చేయరు. గతి-సద్గతిదాత ఒక్కరేనని గాయనము కూడా చేయబడుతుంది. ఈ మహిమ కేవలం తండ్రిది మాత్రమే. గతి-సద్గతి సంగమయుగములోనే లభిస్తుంది. సత్యయుగంలోనైతే ఒకే ధర్మముంటుంది. ఇది కూడా అర్థము చేసుకోవలసిన విషయము కదా. కానీ ఈ బుద్ధినిచ్చేది ఎవరు? తండ్రియే వచ్చి యుక్తిని తెలియజేస్తారని మీరు అర్థం చేసుకుంటారు. శ్రీమతాన్ని ఎవరికి ఇస్తారు? ఆత్మలకు. వారు తండ్రి కూడా, సద్గురువు కూడా, టీచరు కూడా. వారు జ్ఞానాన్ని నేర్పిస్తారు కదా. మిగిలిన గురువులందరూ భక్తిని మాత్రమే నేర్పిస్తారు. తండ్రి జ్ఞానము ద్వారా మీకు సద్గతి లభిస్తుంది. తర్వాత ఈ పాత ప్రపంచము నుండి వెళ్ళిపోతారు. ఇది మీ అనంతమైన సన్యాసము కూడా. ఇప్పుడు మీ 84 జన్మల చక్రము పూర్తయ్యిందని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు ఈ ప్రపంచము సమాప్తమవ్వనున్నది. ఏ విధంగానైతే ఎవరికైనా వ్యాధి సీరియస్ గా ఉంటే, ఇప్పుడు ఇతను మరణించనున్నాడు, ఇతడిని ఏమి గుర్తు చేసుకుంటాము అని అంటారు. శరీరము సమాప్తమైపోతుంది. ఇకపోతే ఆత్మ వెళ్ళి మరొక శరీరం తీసుకుంటుంది. ఆశ పోతుంది. బెంగాల్ లోనైతే బ్రతుకుతారనే నమ్మకం లేకపోతే గంగ వద్దకు తీసుకువెళ్ళి ప్రాణము పోవాలని ముంచేస్తారు. మూర్తులను కూడా పూజించి వెళ్ళి మునిగిపో, మునిగిపో..... అని అంటారు. ఈ పాత ప్రపంచమంతా మునిగిపోనున్నదని మీకిప్పుడు తెలుసు. వరదలు వస్తాయి, నిప్పు అంటుకుంటుంది, ఆకలితో మనుష్యులు మరణిస్తారు. ఈ పరిస్థితులన్నీ రానున్నాయి. భూకంపాలలో ఇళ్ళు మొదలైనవి కూలిపోతాయి. ఈ సమయంలో ప్రకృతికి కోపమొస్తే అందరినీ సమాప్తము చేసేస్తుంది. ఈ పరిస్థితులన్నీ ప్రపంచమంతటికీ రానున్నాయి. అనేక రకాలుగా మృత్యువు వస్తుంది. బాంబులలో కూడా విషము నిండి ఉంటుంది. కొద్దిగా వాసన రావడంతోనే స్పృహ కోల్పోతారు. ఏమేమి జరగనున్నాయి అనేది పిల్లలైన మీకు తెలుసు. ఇవన్నీ ఎవరు చేయిస్తారు? తండ్రి అయితే చేయించరు. ఇది డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. ఎవ్వరి పైనా దోషం మోపరు. డ్రామా ప్లాను తయారుచేయబడి ఉంది. పాత ప్రపంచమే మళ్ళీ తప్పకుండా కొత్తదిగా అవుతుంది. ప్రాకృతిక వైపరీత్యాలు వస్తాయి. వినాశనము జరగాల్సిందే. ఈ పాత ప్రపంచము నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి, దీనిని అనంతమైన సన్యాసమని అంటారు.
వాహ్ సద్గురువు వాహ్! మాకు ఈ మార్గాన్ని తెలియజేసారని ఇప్పుడు మీరు అంటారు. వీరిని నిందింపజేసే విధమైన నడవడికను నడవకండి అని పిల్లలకు కూడా అర్థం చేయిస్తారు. మీరిక్కడ జీవిస్తూనే మరణిస్తారు. దేహాన్ని విడిచి స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. దేహము నుండి అతీతమైన ఆత్మగా అయి తండ్రిని స్మృతి చేయాలి. వాహ్ సద్గురువు వాహ్! అని వీరు చాలా బాగా అంటారు. పారలౌకిక సద్గురువుకు మాత్రమే వాహ్-వాహ్ జరుగుతుంది. లౌకిక గురువులైతే అనేకమంది ఉన్నారు. సత్యాతి సత్యమైన సద్గురువు ఒక్కరే, మళ్ళీ భక్తి మార్గములో కూడా వారి పేరు కొనసాగుతూ వస్తుంది. సృష్టి అంతటికీ తండ్రి అయితే ఒక్కరే. కొత్త సృష్టి స్థాపన ఎలా జరుగుతుంది అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. ప్రళయం జరిగిందని, తర్వాత రావి ఆకు పై శ్రీ కృష్ణుడు వచ్చారని శాస్త్రాలలో చూపిస్తారు. రావి ఆకు పై ఎలా వస్తారు అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. కృష్ణుని మహిమ చేయడం వలన లాభమేమీ ఉండదు. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కే కళలోకి తీసుకువెళ్ళేందుకు సద్గురువు లభించారు. మీ ఎక్కే కళతో అందరికీ మేలు జరుగుతుందని అంటారు కదా. కనుక ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు. 84 జన్మలు కూడా ఆత్మయే తీసుకుంది. ప్రతి ఒక్క జన్మలో నామ రూపాలు మారిపోతాయి. ఫలానావారు 84 జన్మలు తీసుకున్నారని అనరు. ఆత్మ 84 జన్మలను తీసుకుంది. శరీరాలైతే మారిపోతూ ఉంటాయి. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. ఎవరు వచ్చినా వారికి అర్థం చేయించాలి. ఆదిలో దేవీదేవతల రాజ్యము ఉండేది, తర్వాత మధ్యలో రావణ రాజ్యం వచ్చింది. మెట్లు దిగుతూ వచ్చారు. సత్యయుగంలో సతోప్రధానమని అంటారు, తర్వాత సతో, రజో, తమోలలోకి దిగిపోతారు. చక్రము తిరుగుతూ ఉంటుంది. మమ్మల్ని 84 జన్మల చక్రములోకి తీసుకురావలసిన అవసరం బాబాకు ఏమి వచ్చింది అని కొంతమంది అంటారు. కానీ ఈ సృష్టిచక్రము అనాదిగా తయారుచేయబడి ఉంది, దీని ఆదిమధ్యాంతాలను తెలుసుకోవాలి. మనుష్యులు అయి ఉండి ఒకవేళ ఇది తెలుసుకోకపోతే వారు నాస్తికులైనట్లు. తెలుసుకోవడంతో మీకు ఎంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. ఈ చదువు ఎంత ఉన్నతమైనది. పెద్ద పరీక్షను పాస్ అయిన వారి హృదయంలో, మేము అన్నింటికన్నా పెద్ద పదవిని పొందుతామని సంతోషము ఉంటుంది కదా. ఈ లక్ష్మీ-నారాయణులు తమ పూర్వ జన్మలో నేర్చుకుని మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారని మీకు తెలుసు.
ఈ చదువు ద్వారా ఈ రాజధాని స్థాపనవుతుంది. చదువు ద్వారా ఎంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. ఇది అద్భుతము కదా. ఇంత పెద్ద-పెద్ద మందిరాలను ఎవరైతే నిర్మిస్తారో లేక గొప్ప-గొప్ప విద్వాంసులు మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, వారిని సత్యయుగం ఆదిలో వీరు జన్మ ఎలా తీసుకున్నారని అడిగితే, వారు చెప్పలేరు. ఇది గీత యొక్క రాజయోగమేనని మీకు తెలుసు. గీతను చదువుతూ వచ్చారు కానీ దాని వలన లాభమేమీ లేదు. ఇప్పుడు తండ్రి కూర్చొని మీకు వినిపిస్తారు. బాబా, మేము 5 వేల సంవత్సరాల క్రితము కూడా మిమ్మల్ని కలిసామని మీరంటారు. ఎందుకు కలిసారు? స్వర్గ వారసత్వము తీసుకునేందుకు, లక్ష్మీ-నారాయణులుగా అయ్యేందుకు కలిసారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు మొదలైనవారు ఎవరు వచ్చినా సరే, ఇది తప్పనిసరిగా నేర్చుకునే వస్తారు. ఇదే లక్ష్యము-ఉద్దేశ్యము. ఇది సత్యనారాయణుని సత్యమైన కథ కదా. రాజ్యం స్థాపనవుతుందని కూడా మీకు తెలుసు. ఎవరైతే మంచి రీతిగా అర్థము చేసుకుంటారో, వారికి ఆంతరిక సంతోషము ఉంటుంది. రాజ్యం తీసుకునే ధైర్యముంది కదా అని బాబా అడుగుతారు. ఎందుకు లేదు బాబా, మేము నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకే చదువుకుంటున్నాము అని అంటారు. ఇంత కాలం మేము స్వయాన్ని దేహమని భావిస్తూ కూర్చున్నాము, ఇప్పుడు తండ్రి మనకు ధర్మ యుక్తమైన మార్గాన్ని తెలియజేసారు. దేహీ-అభిమానులుగా అవ్వడంలో శ్రమ అనిపిస్తుంది. పదే-పదే తమ నామ, రూపాలలో చిక్కుకుంటారు. ఈ నామ-రూపాలకు అతీతంగా అవ్వాలి అని తండ్రి అంటారు. ఇప్పుడు ఆత్మ అనేది కూడా పేరే కదా. తండ్రి సుప్రీమ్ పరమపిత, లౌకిక తండ్రిని పరమపిత అని అనరు. పరమ అనే పదము ఒక్క తండ్రికి మాత్రమే ఇచ్చారు. వాహ్ గురువు అని కూడా వీరినే అంటారు. మీరు సిక్కులకు కూడా అర్థము చేయించవచ్చు. గ్రంథ్ సాహెబ్ లో అయితే పూర్తిగా వర్ణించబడింది. గ్రంథ్ లో, జప్ సాహెబ్ లో, సుఖమణిలో ఉన్నంత వర్ణన ఇంకే శాస్త్రములోనూ లేదు. ముఖ్యమైన పదాలు ఈ రెండే ఉన్నాయి. సాహెబ్ ను స్మృతి చేసినట్లయితే మీకు 21 జన్మలకు సుఖము లభిస్తుందని తండ్రి అంటారు. ఇందులో తికమకపడే విషయమేమీ లేదు. తండ్రి చాలా సహజం చేసి అర్థము చేయిస్తారు. ఎంతమంది హిందువులు ట్రాన్స్ఫర్ అయి సిక్కులుగా అయ్యారు.
మీరు మనుష్యులకు మార్గము తెలిపేందుకు ఎన్నో చిత్రాలు మొదలైనవి తయారుచేస్తారు. ఎంత సహజంగా అర్థం చేయించగలరు. మీరు ఒక ఆత్మ, తర్వాత రకరకాల ధర్మాలలోకి వచ్చారు. ఇది వెరైటీ ధర్మాల వృక్షము, క్రీస్తు ఎలా వస్తారు అనేది ఇతరులెవ్వరికీ తెలియదు. కొత్త ఆత్మకు కర్మభోగముండదని తండ్రి అర్థము చేయించారు. క్రీస్తు ఆత్మ శిక్షలు అనుభవించేందుకు వికర్మలేమీ చేయలేదు. వారు సతోప్రధాన ఆత్మగా వస్తారు, ఎవరిలోకైతే వారు వచ్చి ప్రవేశిస్తారో వారిని శిలువ పైకి ఎక్కిస్తారు, క్రీస్తును కాదు. వారు వెళ్ళి మరో జన్మ తీసుకుని గొప్ప పదవిని పొందుతారు. పోప్ చిత్రము కూడా ఉంది.
ఈ సమయంలో ఈ ప్రపంచమంతా పూర్తిగా పైసకు కూడా కొరగాని విధంగా ఉంది. మీరు కూడా అలాగే ఉండేవారు. ఇప్పుడు మీరు ఎంతో విలువైనవారిగా అవుతున్నారు. వారి వారసులు చివర్లో తింటారని కాదు, అలాంటిదేమీ ఉండదు. మీరు మీ చేతులను నిండుగా చేసుకుని వెళ్తారు, మిగిలినవారంతా ఖాళీ చేతులతో వెళ్తారు. మీరు నిండుగా అయ్యేందుకే చదువుకుంటున్నారు. ఎవరైతే కల్పక్రితము వచ్చారో, వారే వస్తారని కూడా మీకు తెలుసు. కొంచెము విన్నా కూడా వచ్చేస్తారు. అందరినీ కలిసి ఒకేసారి చూడలేరు కూడా. మీరు అనేకమంది ప్రజలను తయారుచేస్తారు, బాబా అందరినీ చూడలేరు. ఎంతోకొంత విన్నా కూడా ప్రజలుగా అయిపోతూ ఉంటారు. మీరు లెక్కపెట్టలేరు కూడా.
పిల్లలైన మీరు సేవలో ఉన్నారు, బాబా కూడా సేవలోనే ఉన్నారు. బాబా సేవ చేయకుండా ఉండలేరు. రోజూ ఉదయం సేవ చేసేందుకు వస్తారు. సత్సంగాలు మొదలైనవి కూడా ఉదయమే చేస్తారు. ఆ సమయంలో అందరికీ తీరిక ఉంటుంది. బాబా అంటారు - పిల్లలైన మీరు ఇంటి నుండి చాలా ఉదయము కూడా రాకూడదు, అలాగే రాత్రి కూడా రాకూడదు ఎందుకంటే మున్ముందు ప్రపంచము చాలా పాడైపోతూ ఉంటుంది కనుక ప్రతి వీధిలోను సెంటర్లు ఎంత సమీపంగా ఉండాలంటే, ఇంటి నుండి బయటకు రాగానే సెంటరుకు వచ్చేయగలగాలి, సహజమైపోవాలి. మీ వృద్ధి జరుగుతుంది, అప్పుడు రాజధాని స్థాపనవుతుంది. తండ్రి చాలా సహజంగా అర్థం చేయిస్తారు. ఈ రాజయోగము ద్వారా స్థాపన చేస్తున్నారు. ఇకపోతే ఈ మొత్తం ప్రపంచము ఉండనే ఉండదు. ప్రజలైతే ఎంతోమంది తయారవుతారు. మాల కూడా తయారవ్వనున్నది. ముఖ్యమైన విషయమేమిటంటే, ఎవరైతే అనేకుల సేవ చేసి తమ సమానంగా తయారుచేస్తారో, వారే మాలలో మణులుగా అవుతారు. మనుష్యులు మాలను తిప్పుతారు కానీ దాని అర్థము తెలియదు. చాలామంది గురువులు బుద్ధి అందులో నిమగ్నమవ్వాలని మాలను తిప్పడానికి ఇస్తారు. కామము మహాశత్రువు, రోజు రోజుకు చాలా కఠినమైపోతూ ఉంటుంది. తమోప్రధానంగా అవుతూ ఉంటారు. ఈ ప్రపంచము చాలా అశుద్ధమైనది. మేమైతే చాలా విసిగిపోయాము, త్వరగా సత్యయుగములోకి తీసుకువెళ్ళండని చాలామంది బాబాకు అంటారు. తండ్రి అంటారు, కాస్త ఓర్పు వహించండి, స్థాపన జరిగి తీరుతుంది, ఇది పాలన. ఈ పాలనయే మిమ్మల్ని తీసుకువెళ్తుంది. ఆత్మలైన మీరు పరంధామము నుండి వచ్చారు, మళ్ళీ అక్కడకు వెళ్ళాలి, మళ్ళీ పాత్రను అభినయించేందుకు వస్తారు అని కూడా పిల్లలకు తెలియజేసారు. కావున పరంధామాన్ని గుర్తు చేయాల్సి ఉంటుంది. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని తండ్రి కూడా అంటారు. ఈ సందేశమునే అందరికీ ఇవ్వాలి, ఇంకే సందేశకులు, మెసెంజర్లు ఎవరూ లేరు. వారైతే ముక్తిధామము నుండి క్రిందకు తీసుకొస్తారు, తర్వాత వారు మెట్లు క్రిందికి దిగవలసిందే. ఎప్పుడైతే పూర్తిగా తమోప్రధానంగా అయిపోతారో, అప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి అందరినీ సతోప్రధానంగా తయారుచేస్తారు. మీ కారణంగా అందరూ తిరిగి వెళ్ళవలసి ఉంటుంది ఎందుకంటే మీకు కొత్త ప్రపంచము కావాలి కదా. ఇది కూడా డ్రామా తయారుచేయబడి ఉంది. పిల్లలకు చాలా నషా ఉండాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ దేహము యొక్క నామ-రూపాల నుండి అతీతంగా అయి దేహీ-అభిమానులుగా అవ్వాలి. సద్గురువును నిందింపజేసే విధమైన నడవడికను నడవకూడదు.
2. మాలలోని మణులుగా అయ్యేందుకు చాలామందిని తమ సమానంగా తయారుచేసే సేవ చేయాలి. రాజ్యం తీసుకునేందుకు మేము చదువుకుంటున్నాము అనే ఆంతరిక సంతోషములో ఉండాలి. ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యే చదువు.