20.03.1969        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ఏడు విషయాలు వదలండి మరియు ఏడు విషయాలు ధారణ చేయండి.

 అందరు ఏ స్మృతిలో కూర్చున్నారు? ఏ దేశంలో కూర్చున్నారు? వ్యక్తదేశంలోనా లేక అవ్యక్త దేశంలోనా? అవ్యక్తుడిని వ్యక్తదేశంలోకి తీసుకువచ్చారా లేక మీరు అవ్యక్తం అయ్యారా? అవ్యక్తునికి వ్యక్త దేశంలోకి రమ్మని ఆహ్వానం ఇచ్చారు. కనుక అవ్యక్త బాప్ దాదా వ్యక్తదేశంలోని అవ్యక్తరూపంతో సంభాషణ చేస్తున్నారు. అవ్యక్తరూపాన్ని వ్యక్తరూపంలోకి తీసుకురావటానికి ఎంత సమయం కావాలి? (ఇప్పుడు ఇలా తయారవుతున్నాం! పురుషార్ధం చేస్తున్నాం!) ఇప్పుడు ఎంత సమయం అవసరం? సంపూర్ణస్థితిని సాకారరూపంలో తీసుకురావటానికి ఎంత సమయం కావాలి? దర్పణంలో చూసుకుంటున్నారు కదా? సంపూర్ణస్థితి యొక్క చిత్రం సాకారంలో చూసారా? సాకార తనువు ఏదైతే ఉందో అది సంపూర్ణ కర్మాతీత స్థితి కాదు. దాని ప్రకారం చెప్పండి. వారి సమానంగా అవ్వాలి. గుణాలనే ధారణ చేయాలి. ఆ అంతిమ స్థితిలో మరియు మీ వర్తమాన స్థితిలో ఎంత తేడా ఉందని భావిస్తున్నారు? దాని కొరకు ఎంత సమయం కావాలి! సాకార ఉదాహరణని ఈ కళ్ళతో చూసారు. వారి ప్రతి కర్మ, ప్రతి గుణాన్ని మీ కర్మ మరియు వాణితో పోల్చుకుని పరిశీలించుకుంటే తెలుస్తుంది. ఇప్పటి సమయానుసారంగా అయితే 25% తేడా కూడా చాలా ఎక్కువ. పురుషార్థ సమయం చాలా తక్కువగా ఉంది. అందువలన మీరు ఎలా అయితే స్మృతిలో చార్ట్ పెట్టుకుంటున్నారో వెనువెంట ఇప్పుడు ఆ చార్ట్ కూడా పెట్టుకోవాలి. సాకార బాబా ఏ కర్మ చేసేవారో, ఏ స్థితి, ఏ స్మృతి ఉండేవో వాటన్నింటిలో మీరు కలవాలి. మంచిది. ఈరోజు కుమారీలకు పరీక్ష తీసుకుంటున్నాను. అందరు ఏదైతే పురుషార్ధం చేస్తున్నారో దానిలో ముఖ్యంగా ఏడు విషయాలు ధారణ చేయాలి మరియు ఏడు విషయాలు వదలాలి. అవి ఏమిటి? (ప్రతి కుమారి చెప్పింది) వదలవలసినవి అయితే అందరికీ చెప్తున్నారు.

1.పంచ వికారాలు మరియు వాటితో పాటు ఆరవది బద్దకం మరియు ఏడవది భయం. ఈ భయం కూడా పెద్ద వికారం. శక్తుల ముఖ్య గుణమే నిర్భయత. అందువలన భయాన్ని కూడా వదలాలి. ఇప్పుడు ఏమి ధారణ చేయాలి? మీ స్వరూపాన్ని తెలుసుకోవాలి. కనుక స్వరూపము, స్వధర్మం, స్వదేశం, సుకర్మ, స్వలక్ష్యం, స్వలక్షణాలు మరియు స్వదర్శన చక్రధారి అవ్వాలి. ఈ ఏడు విషయాలు ధారణ చేయాలి. వీటిని ధారణ చేయటం ద్వారా ఎలా అవుతారు? శీతలదేవి అవుతారు, కాళిక కాకూడదు. ఇప్పుడు శీతలదేవి అవ్వాలి. వికారాలపై కాళికాదేవిగా అవ్వాలి. అసురీల ఎదుట కాళికా అవ్వాలి కానీ మీ బ్రాహ్మణ కులంలో శీతల దేవి అవ్వాలి.