17.05.1969        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


గారడీ మంత్రం యొక్క దర్పణం

ఈ అవ్యక్త కలయిక యొక్క విలువ ఎంతో తెలుసా? అవ్యక్త రూపంలో కలయిక మరియు వ్యక్త రూపంలో కలయిక రెండింటిలో తేడా ఉంది. అవ్యక్త కలయికకి విలువ ఉంది. తెలుసా? అవ్యక్త కలయిక యొక్క విలువ వ్యక్త భావాన్ని వదలటం. ఈ విలువ ఎవరు ఎంతగా ఇస్తారో అంతగానే అవ్యక్త అమూల్య కలయిక యొక్క అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మేము ఎంత వరకు మరియు ఎంత సమయం ఇచ్చాము అని మిమ్మల్ని మీరు అడగండి. వర్తమాన సమయంలో అవ్యక్త స్థితిలో స్థితులయ్యే అవసరం ఉంది. కానీ ఫలితం ఏమిటో ప్రతి ఒక్కరు స్వయం కూడా మరియు పరస్పర ఫలితం కూడా మంచిగా పరిశీలన చేయగలరు. అందువలన అవ్యక్త స్థితి యొక్క అవసరం ఏదైతే ఉందో దానిని పూర్తి చేయాలి. అవ్యక్తస్థితి యొక్క పరిశీలన మీ అందరి జీవితంలో ఏమి ఉంటుందో తెలుసా? వారి ప్రతి కర్మలో అలౌకికత మరియు ప్రతి కర్మ చేస్తూ ప్రతి కర్మేంద్రియం ద్వారా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి ఉంటుంది. వారి ముఖకవళికలు, నడవడిక ప్రతి సమయం అతీంద్రియసుఖంలో ఉంటాయి. అలౌకికత మరియు అతీంద్రియ సుఖం యొక్క మెరుపు వారి ప్రతి కర్మలో కనిపిస్తాయి. దాని ద్వారా వీరు వ్యక్తంలో ఉంటూ అవ్యక్త స్థితిలో స్థితులైనట్లు తెలుస్తుంది. కనుక ఈ రెండు విషయాలు మీలో కనిపిస్తే అవ్యక్త స్థితిలో స్థితులైనట్లు అర్థం చేసుకోండి. ఒకవేళ లేకపోతే లోపంగా భావించి పురుషార్థం చేయాలి. అవ్యక్త స్థితిని పొందడానికి ఆది నుండి ఒక స్లోగన్ వినిపిస్తూ వచ్చాను. ఆ స్లోగన్ స్మృతి ఉంటే ఎప్పుడూ మాయా విఘ్నాలతో ఓడిపోరు. ఆవిధమైన సర్వోత్తమ స్లోగన్ - ప్రతి ఒక్కరికి స్మృతి ఉందా? ప్రతి మురళీలో రకరకాల రూపంలో ఆ స్లోగన్ వస్తుంది. మన్మనాభవ, మేము బాబా సంతానం ఇదైతే ఉంది కానీ పురుషార్థం చేస్తూ చేస్తూ మాయా విఘ్నాలు వస్తే వాటిపై విజయం పొందడానికి ఏమి స్లోగన్ ఉంది? "స్వర్గం యొక్క స్వరాజ్యం మా జన్మ సిద్ధ అధికారం" మరియు "సంగమ సమయంలో బాబా యొక్క ఖజానా జన్మసిద్ధ అధికారం”. ఈ స్లోగన్ మర్చిపోయారు. అధికారం మర్చిపోతే ఏమౌతుంది! మనం ఏయే వస్తువులకి అధికారులం? ఇదైతే తెలుసుకున్నారు. కానీ మన యొక్క ఈ విషయాలన్నీ జన్మ సిద్ధ అధికారం. మిమ్మల్ని మీరు అధికారిగా భావిస్తే మాయకి ఆధీనం కారు. ఆధీనం అవ్వటం నుండి రక్షించుకునేటందుకు మిమ్మల్ని మీరు అధికారిగా భావించాలి. మొదట సంగమయుగి సుఖం యొక్క అధికారులు మరియు మరలా భవిష్యత్తులో స్వర్గసుఖాలకు అధికారులు, కనుక మీ అధికారాన్ని మర్చిపోకండి. ఎప్పుడైతే మీ అధికారాన్ని మర్చిపోతారో అప్పుడు ఏదోక విషయానికి ఆధీనం అయిపోతారు, మరియు పరాధీనులు ఎప్పుడూ కూడా సుఖీగా ఉండలేరు. పరాధీనులు ప్రతి విషయంలో మనసా, వాచా, కర్మణా దు:ఖం యొక్క ప్రాప్తిలో ఉంటారు మరియు ఎవరైతే అధికారిగా ఉంటారో వారు అధికారి నషా మరియు సంతోషంతో ఉంటారు. సంతోషం కారణంగా సుఖాల సంపత్తి వారి కంఠహారం అవుతుంది. సత్యయుగ సుఖాలు తెలుసా? సత్యయుగంలో ఆటబొమ్మలు ఎలా ఉంటాయి? అక్కడ రత్నాలతో ఆడుకుంటారు. మీరు సత్యయుగ సుఖాలు మరియు కలియుగ దు:ఖాల లిస్ట్ తీసారు. కానీ సంగమయుగ సుఖాల లిస్ట్ తీస్తే దానికంటే రెట్టింపు ఉంటాయి. ఆ సత్యయుగ సంస్కారాలు ఇప్పుడు నింపుకోవాలి. ఎలా అయితే చిన్న పిల్లలు రోజంతా ఆటలో లీనమై ఉంటారు. ఏ విషయం గురించి చింత ఉండదు. అదేవిధంగా ప్రతి సమయం సుఖాల లిస్ట్, రత్నాల లిస్ట్ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి లేక ఈ సుఖాల రూపి రత్నాలతో ఆడుకుంటూ ఉంటే డ్రామా యొక్క ఆటలో ఎప్పుడు ఓడిపోరు. ఇప్పుడైతే అక్కడక్కడ ఓడిపోతున్నారు.

బాప్ దాదాకి పిల్లలతో ఎంత స్నేహం ఉంది? బాప్ దాదా స్నేహం అవినాశి. కానీ పిల్లల స్నేహం ఒకప్పుడు ఒక విధంగా, ఒకప్పుడు ఒక విధంగా ఉంటుంది, ఏకరసంగా ఉండదు. అప్పుడప్పుడు చాలా స్నేహమూర్తిగా కనిపిస్తారు. అప్పుడప్పుడు స్నేహమూర్తికి బదులు ఏ మూర్తిగా కనిపిస్తున్నారు? ఒకోసారి స్నేహమూర్తి మరోసారి కష్టమూర్తిగా కనిపిస్తున్నారు. మీ మూర్తిని చూసుకోవడానికి మీ దగ్గర ఏమి ఉంచుకోవాలి? దర్పణం. ప్రతి ఒక్కరి దగ్గర దర్పణం ఉందా? ఒకవేళ దర్పణం ఉంటే మీ ముఖం చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకోవటం ద్వారా ఏదైనా లోపం ఉంటే దానిని తొలగించుకుంటారు. దర్పణం లేకపోతే లోపం తొలగించుకోలేరు. అందువలన ప్రతి సమయం మీ దగ్గర దర్పణం ఉంచుకోవాలి. కానీ ఈ దర్పణం ఎలా ఉంటుందంటే మీరు, మీ దగ్గర ఉంది అనుకుంటారు. కానీ మధ్య మధ్యలో మాయం కూడా అయిపోతుంది, ఆ గారడి మంత్రం గల దర్పణం. ఒక సెకనులో మాయం అయిపోతుంది. దర్పణం అవినాశిగా, స్థిరంగా ఉంచుకోవటం ఎలా? దానికి ఏ లక్షణాలు కావాలి? ఎవరైతే అర్పణ అవుతారో వారి దగ్గర దర్పణం ఉంటుంది. అర్పణ కాకపోతే దర్పణం కూడా అవినాశిగా ఉండదు. దర్పణం ఉంచుకోవడానికి మిమ్మల్ని మీరు పూర్తిగా అర్పణ చేసుకోండి. వీరినే మరోమాటలో సర్వస్వత్యాగి అంటారు. సర్వస్వత్యాగి దగ్గర దర్పణం ఉంటుంది. ఎవరైతే అవ్యక్త స్థితిలో స్థితులవుతారో వారే అవ్యక్త కలయిక కూడా జరుపుకోగలరు. వర్తమాన సమయంలో అవ్వక స్థితిలో ఎక్కువ లోపం కనిపిస్తుంది. 1. వర్ణన 2. మననం. ఈ రెండు విషయాలు మంచిగా ఉన్నాయి కదా! ఈ రెండూ సహజమే. మూడవ విషయం కొంచెం సూక్ష్మమైనది. వర్తమాన సమయంలో ఫలితం చూస్తే మననం కంటే చెప్పటం ఎక్కువగా ఉంది. మిగిలిన మూడవ విషయం ఏమిటి? 1.మననం చేయటం 2. మగ్నం అవ్వటం ఇది పూర్తిగా లవలీన స్థితి. వర్తమాన సమయంలో మననం కంటే చెప్పటం ఎక్కువగా ఉంది. మొదటి నెంబర్ దీనిలో విజయీ అయ్యారు. రెండవ నెంబర్ మననంలో, మూడవ నెంబర్ మగ్న స్థితిలో స్థితులవ్వటం దీనిలో లోపం కనిపిస్తుంది. దీనిని నింపుకోవాలి. ఎవరైతే మగ్నస్థితిలో ఉంటారో వారి నడవడికలో ఏమి కనిపిస్తుంది? అలౌకికత మరియు అతీంద్రియ సుఖం. మగ్న స్థితిలో ఉన్న వారికి ఈ గుణం ప్రతి నడవడిక ద్వారా తెలుస్తుంది. కనుక ఈ లోపం ఏదైతే ఉందో దీనిని నింపుకోవడానికి పురుషార్ధం చేయాలి. అందరు పురుషార్థులే. అందువలనే ఇక్కడి వరకు చేరుకున్నారు. ఇప్పుడు కేవలం పురుషార్థిగా అయ్యే సమయం కాదు, ఇప్పుడు తీవ్ర పురుషార్థిగా అయ్యే సమయం. తీవ్ర పురుషార్ధిగా అవ్వవలసిన సమయంలో కేవలం పురుషార్ధిగా అయితే ఏమౌతుంది? గమ్యానికి దూరంగా ఉండిపోతారు. ఇప్పుడు తీవ్ర పురుషార్థిగా అయ్యే సమయం నడుస్తుంది. దీని ద్వారా ఎంత లాభం తీసుకోవాలో అంత తీసుకున్నానా లేక లేదా అని ప్రతి ఒక్కరు పరిశీలించుకోండి. అందువలనే ప్రతి సమయం మీ దగ్గర దర్పణం ఉంచుకుంటే లోపం వెంటనే తెలుస్తుంది అని చెప్పాను. అప్పుడు మీ పురుషార్థం తీవ్రం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు.

మంచిది, ఈరోజు కుమారీల సేవాతిలకధారణ రోజు. ఎలా అయితే మీరు మ్యూజియంలో పట్టాభిషేకం యొక్క చిత్రం చూపిస్తారు కదా! కానీ మీ సేవాతిలకధారణ రోజున ఎంతమంది వచ్చారో చూడండి. ఇంత సంతోషం ఉంటుందా? అందరి ముందు తిలకం పెట్టుకుంటున్నారు. మిమ్మల్ని అందరు చూస్తున్నారు, ఇది స్మృతి ఉంచుకోవాలి. అందరి మధ్యలో తిలకం పెట్టుకుంటున్నారు దానిని మర్చిపోకూడదు. ఇంత ధైర్యవంతులుగా అవ్వాలి. ఈ తిలకం యొక్క గౌరవాన్ని కాపాడాలి. తిలకం యొక్క గౌరవం అనగా బ్రాహ్మణ కులం యొక్క గౌరవం. బ్రాహ్మణకులం యొక్క మర్యాద ఏమిటో వినిపించాను కదా! ఇలా పురుషోత్తములుగా అయ్యే ధైర్యం ఉన్నవారే తిలకం పెట్టించుకుంటారు. ఈ తిలకం సాధారణమైనది కాదు. ఇక్కడ కూడా సభ అంతా చూస్తుంది. కన్యల తిలకధారణ కోసం ఇంతమంది బ్రాహ్మణులు కలిసారు. సర్వీస్ చేసేవారు ఒక విశేష గుణంపై ధ్యాస పెట్టుకోవాలి. ఎవరైతే ఆల్‌రౌండ్ సేవ చేస్తారో వారికి విశేషంగా ఒక విషయంపై ధ్యాస ఉండాలి. ఎటువంటి స్థితి అయినా కానీ మీ స్థితి ఏకరసంగా ఉండాలి. అప్పుడే ఆల్‌రౌండ్ సేవ యొక్క సఫలత లభిస్తుంది. ఈరోజు అందరితో నయనాల ద్వారా ఆత్మిక సంభాషణ చేశారు, దూరంగా ఉన్నా కానీ యోగ్యత మరియు శక్తిననుసరించి బాప్ దాదాకి సమీపమే. భలే ఎవరు ఎంత దూరంగా కూర్చున్నా కానీ తమ స్నేహంతో బాబా నయనాలలో ఇమిడి ఉన్నారు. అందువలనే కంటిరత్నాలు అని అంటారు. నయన రత్నాలతో ఈరోజు నయనాలతో సంభాషణ చేస్తున్నారు. ఒకరికంటే ఒకరు అందరు ప్రియమైనవారే. అందువలన విశేషంగా ఏమీ చేయటం లేదు. సాకారంలో సమయం అనుసరించి ఈ సూచన లభిస్తూనే ఉండేది. పిల్లలకి ఇలాంటి సమయం వస్తుంది. కేవలం దూరం నుండే సంభాషణ జరుగుతుంది. ఇప్పుడు అలాంటి సమయాన్ని చూస్తున్నారు. అందరికి మరియు బాప్ దాదాకి కూడా కోరిక ఉంటుంది. కానీ ఆ సమయం ఇప్పుడు మారిపోనున్నది. సమయంతో పాటు కలయిక యొక్క సౌభాగ్యం కూడా ఇప్పుడు లేదు. అందువలనే ఇప్పుడు అవ్యక్త రూపంతోనే అందరితో సంభాషణ చేస్తున్నారు. మంచిది. అందరికీ నమస్తే మరియు వీడ్కోలు.