18.05.1969        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ఆత్మిక జ్ఞాన యోగాల జ్యోతిష్యం

మీరందరూ బాప్ దాదాని పిలిచారా లేక బాప్ దాదా మిమ్మల్నందరినీ పిలిచారా? ఎవరు, ఎవరిని పిలిచారు? ఏ పిల్లలైతే బాప్ దాదా కర్తవ్యంలో నిమిత్తం అయ్యి ఉన్నారో వారు ప్రతి సమయం స్మృతి ఉంచుకోవాలి - మేము ప్రతి సమయం, ప్రతి పరిస్థితిలో ఎవరెడీ మరియు ఆల్ రౌండ్ గా ఉండాలని, ఒకవేళ అందరిలో ఈ రెండు విషయాలు వచ్చేస్తే సేవలో ప్రత్యక్షత శ్రేష్టంగా వస్తుంది. కానీ నెంబర్ వారీగా పురుషార్థం అనుసరించి ఈ విషయాలు ఉంటాయి. నిమిత్త పిల్లలైన మీరు ఈ స్లోగన్ స్మృతి ఉంచుకోవాలి - " నేను ఏ కర్మ చేస్తే నన్ను చూసి అందరు చేస్తారు." ప్రతి సమయం ఇలా భావించండి. డ్రామా స్టేజ్ పై అందరి ఎదురుగా మేము పాత్ర అభినయిస్తున్నాము. 1.మనకి మనం రిహార్సల్స్ చేసుకోవటం. 2.స్టేజ్ పై అందరితో ఎదురుగా పాత్ర అభినయించడం. స్టేజ్ పై పాత్ర అభినయించే వారికి తమపై ఎంత ధ్యాస ఉంటుంది. ప్రతి ఒక్క పాత్ర పైన ప్రతి సమయం ధ్యాస ఉంటుంది. చేతులపై, పాదాలపై, కళ్ళపై అన్నిటి ధ్యాస ఉంటుంది. ఒకవేళ ఏదైనా విషయం పైకి, కిందకి అయితే పాత్రధారి పాత్రలో శోభ ఉండదు. ఇలా మిమ్మల్ని మీరు భావించి నడవాలి. మూడు నిముషాల పాటను రికార్డ్ చేస్తున్నప్పుడు ఎంత ధ్యాస పెట్టుకుంటారు! మీరందరూ కూడా మీ యొక్క 21 జన్మలలో రికార్డ్ నింపుకునే సమయంలో చాలా ధ్యాస పెట్టాలి. రికార్డులో కొద్దిగా తేడా వచ్చినా ఆ రికార్డ్ సదాకాలికంగా రద్దు అయిపోతుంది. అలాగే మీ యొక్క 21 జన్మల సత్యయుగీ రాజధాని యొక్క రికార్డ్ ఏదైతే నిండుతుందో అది రద్దు కాకూడదు. మా ప్రతి కర్మపై అందరి కళ్ళు ఉన్నాయి అని భావించాలి. పాత్రధారులకి మమ్మల్ని అందరూ చూస్తున్నారనే ధ్యాస చాలా ఉంటుంది. ఎవరూ చూసేవారు లేకపోతే సోమరిగా ఉంటారు కనుక సదా ఇలా భావించాలి - మేము ఒంటరిగా చేస్తున్నా కానీ సృష్టి ఎదురుగా ఉన్నాము అని. మొత్తం సృష్టిలోని ఆత్మలు నలువైపుల నుండి మనల్ని చూస్తున్నారు. ఒకవేళ ఒక్కొక్క పుష్పం ఇలా సంపూర్ణంగా మరియు సుందరంగా అయితే ఈ తోట యొక్క సువాసన ఎంతగానో వ్యాపిస్తుంది! కానీ ఎందుకు వ్యాపించటం లేదు, దీనికి కారణం ఏమిటి? సువాసనతో పాటు అక్కడక్కడ మధ్యలో ఇంకో విషయం కూడా వచ్చేస్తుంది. ఎంత సువాసన ఉన్నా కానీ సువాసన కంటే కూడా తొందరగా వ్యాపించే చెడువాసన మొత్తం సువాసనని సమాప్తి చేస్తుంది. అవినాశి సువాసన ఉన్నవారినే సదా గులాబీ అంటారు. 1. సదా గులాబి 2. గులాబి 3. ఆత్మిక గులాబి. మొదటి నెంబర్ - ఆత్మిక గులాబి. వీరు ఆత్మిక స్థితిలో ఉంటారు, మరియు ఆత్మిక తండ్రికి సదా సమీపంగా ఉంటారు. మరియు రెండవరకం వారు సర్వీస్లో చాలా మంచిగా ఉంటారు, కానీ ఆత్మిక స్థితిలో లోపం ఉంటుంది. సర్వీస్లో, ధారణలో మంచిగా ఉంటారు. సంస్కారాలు శీతలంగా ఉంటాయి. మిమ్మల్ని మీరు ఏమని భావిస్తున్నారు? ఏ నెంబర్ పుష్పంగా భావిస్తున్నారు? ముళ్ళు అయితే ఇక్కడ ఉండవు. అవ్వడానికి అందరూ గులాబీలే కానీ గులాబీలలో కూడా తేడా ఉంటుంది. ఎవరైతే ఆత్మిక గులాబీగా ఉంటారో వారి గుర్తు ఏమిటి? మీకు మస్తకరేఖలను పరిశీలించటం వస్తుందా? జ్యోతిష్యులుగా అయ్యారా లేక లేదా? బాప్ దాదా జ్ఞాన యోగాల జ్యోతిష్యం చూపిస్తున్నారు. ఆ జ్యోతిష్యం ద్వారా వేటిని చూస్తారు? ప్రతి ఒక్కరి ముఖం ద్వారా, నయనాల ద్వారా, మస్తకం ద్వారా తెలుస్తుంది. మీరు జ్యోతిష్యులుగా అయ్యి ప్రతి ఒక్కరినీ పరిశీలిస్తున్నారా? నయనాలలో మరియు మస్తకంలో ఆ రేఖలు తప్పకుండా ఉంటాయి. ఎవరినైనా పరిశీలించడం అనేది కూడా జ్యోతిష్య విద్య. ఇలా పరిశీలించే విద్య కొంతమందిలో తక్కువగా ఉంది. జ్ఞానం మరియు యోగం నేర్చుకుంటున్నారు. కానీ పరిశీలించే ఈ జ్యోతిష్య విద్య కూడా తెలుసుకోవాలి. ఏ వ్యక్తి ఎదురుగా వచ్చిన మీరు ఒక సెకనులో వారి మూడు కాలాలను పరిశీలించాలి. గతంలో వారి జీవితం ఎలా ఉండేది, వర్తమాన సమయంలో వారి వృత్తి, దృష్టి ఎలా ఉంది? భవిష్యత్తులో ఎంతవరకు ప్రాప్తి తయారు చేసుకుంటారు? వీటిని తెలుసుకునే అభ్యాసం ఉండాలి. ఈ పరిశీలనతో జ్ఞానం చాలా తక్కువగా ఉంది. ఈ లోపం ఇప్పుడు పూరించుకోవాలి. వర్తమాన సమయంలో వచ్చేవారిని పరిశీలించే గుణం లేకపోతే, దీనిలో లోపం ఉంటే మోసపోతారు. ఎందుకంటే కొంతమంది అనుకుంటున్నారు - వీరు కేవలం చెప్తున్నారు, అంతే అని. మీ ఎదురుగా వచ్చే అత్మలలో కొంతమంది లోపల ఒకటి, బయటికి ఇంకోలా ఉంటారు. పరీక్షించడానికి వస్తారు. కొంతమంది కృత్రిమ రంగు రూపాన్ని ధరించి కూడా పరిశీలించడానికి వస్తారు. రకరకాల రూపాలతో వస్తారు. వీరు ఎందుకోసం వచ్చారు అని పరిశీలించే ధ్యాస ఉండాలి. వీరి వృత్తి ఏమిటి? అని పరిశీలించాలి మరియు అశుద్ధ ఆత్మల నుండి కూడా చాలా సంభాళించుకోవాలి. ఇలాంటి కేసులు రోజు రోజుకి చాలా వస్తాయి. చాలామంది పాప ఆత్మలు తయారవుతారు. అపదలు, అకాల మృత్యువులు, పాపకర్మలు పెరిగిపోతే వారి కోరికలను తీర్చుకోవడానికి అశుద్ధ ఆత్మల రూపంలో భ్రమిస్తాయి. అందువలన వీటి నుండి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, రక్షించుకోవాలి. ఎవరిలోనైనా అశుద్ధ ఆత్మ ప్రవేశిస్తే దానిని పోగొట్టడానికి ధూపం వెలిగిస్తారు, మరియు అగ్నిలో వస్తువు కాల్చి వాత పెడతారు, ఎండు మిరపకాయలు తినిపిస్తారు. కానీ మీరు యోగాగ్నితో ఎదుర్కోవాలి. ప్రతి ఒక్క కర్మేంద్రియాన్ని యోగాగ్నిలో కాలిస్తే మరలా ఏదీ యుద్ధం చేయదు. కొద్దిగా ఎక్కడైనా ఏ కర్మేంద్రియం అయినా బలహీనంగా ఉంటే ప్రవేశించే అవకాశం ఉంది. ఆ అశుద్ధ ఆత్మలు కూడా చాలా శక్తిశాలిగా ఉంటాయి. మాయాశక్తి కూడా తక్కువగా ఉండదు. దీనిపై చాలా ధ్యాస ఉంచుకోవాలి మరియు ప్రకృతి ఆపదలు కూడా తమ కర్తవ్యం చేస్తాయి. వాటిని ఎదుర్కోవడానికి మీలో ఈశ్వరీయ శక్తిని ధారణ చేయాలి. ఆ సమయంలో స్నేహం పెట్టుకోకూడదు. ఆ సమయంలో శక్తిరూపం అవసరం. ఏ సమయంలో స్నేహమూర్తి, ఏ సమయంలో శక్తిరూపం అవ్వాలి అనేది కూడా ఆలోచించాలి. అన్ని విషయాలలో శక్తిరూపం అవసరం. ఒకవేళ ఎవరైనా అలాంటి వారు వచ్చినప్పుడు మీరు ఎక్కవ స్నేహం చూపించినా కూడా నష్టపోతారు. బాప్ దాదాతో మరియు దైవీ పరివారంతో స్నేహం చేయాలి, మిగిలిన అందరితో శక్తి స్వరూపంతో ఎదుర్కోవాలి. కొంతమంది పిల్లలు పొరపాటు చేస్తున్నారు, వారి స్నేహంలోకి వచ్చేస్తున్నారు. ఆ స్నేహం వృద్ధి అయ్యి బలహీనం చేసేస్తుంది. అందువలన ఇప్పుడు శక్తి రూపం యొక్క అవసరం ఉంది. అంతిమంగా కూడా భారతమాత శక్తి అవతారం అని మహిమ ఉంది. గోపీమాత అని అనరు. ఇప్పుడు శక్తిరూపం యొక్క పాత్ర నడుస్తుంది. గోపికల పాత్ర సాకారంలో ఉండేది. ఇప్పుడు అవ్యక్తరూపంలో శక్తి యొక్క పాత్ర. ప్రతి ఒక్కరు శక్తి రూపంలో స్థితులైపోతే ఇంత అందరి శక్తి కలసి అద్భుతం చేసి చూపిస్తుంది. స్మృతి చిహ్నం రూపంలో అంతిమ చిత్రం ఏమి చూపించారు? పర్వతానికి వ్రేలు ఇవ్వటం చూపించారు అంటే శక్తి అనే వ్రేలు ఇవ్వాలి. దీని ద్వారా కూడా కలియుగ పర్వతం సమాప్తి అయిపోతుంది. దీని కొరకు అందరి వ్రేలు అవసరం. ఇప్పుడు ఆ వ్రేలు పూర్తిగా ఇవ్వటం లేదు, వ్రేలు ఎత్తుతున్నారు. అప్పుడప్పుడు సరిగా అప్పుడప్పుడు వంకరగా అవుతుంది. ఎప్పుడైతే పూర్తి వ్రేలు ఇస్తారో అప్పుడు ప్రభావం పడుతుంది. ఒకే విధంగా వ్రేలు ఇవ్వాలి. ఈ కలియుగ పర్వతానికి తొందరగా వ్రేలు ఇచ్చి సత్యయుగీ ప్రపంచాన్ని తీసుకురావాలి. సాకారబాబాతో స్నేహం ఉంటే త్వరత్వరగా ఈ పాత ప్రపంచం నుండి వెళ్ళిపోవడానికి తయారీలు చేయండి. ఇప్పుడు ఇంకా సేవ పూర్తి కాలేదు కదా అంటారు. సేవ కూడా ఎందువలన ఆగి ఉంది? ఒకవేళ ప్రతి ఒక్కరు శక్తి రూపంలో స్థితులైతే మీ భ్రమించే భక్తులు స్వతహాగానే అయస్కాంతం అయిన మీ వైపుకి వచ్చేస్తారు. ఆలస్యం అవ్వదు. మంచిది.