15.09.1969        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


స్మృతి ఆధారంగా స్మృతిచిహ్నం

ధ్వనికి అతీతంగా వెళ్ళాలా లేక బాబాని కూడా ధ్వనిలోకి తీసుకురావాలా? మీరందరూ మాటలకి అతీతంగా వెళ్తున్నారు. మరియు బాప్ దాదాని మరలా మాటలలోకి తీసుకువస్తున్నారు. మాటలలోకి వస్తూ కూడా అతీంద్రియ సుఖంలో ఉండగలుగుతున్నప్పుడు ఇక మరలా మాటలకి అతీతంగా వెళ్ళే ప్రయత్నం ఎందుకు? ఒకవేళ మాటలకి అతీతంగా నిరాకారి రూపంలో స్థితులై మరలా సాకారంలో వస్తే ఇతరులకి కూడా ఆ స్థితిలోకి తీసుకురాగలరు. ఒక సెకనులో నిరాకారి, ఒక సెకనులో సాకారి ఈ వ్యాయామం నేర్చుకోవాలి. ఇప్పుడిప్పుడే నిరాకారి ఇప్పుడిప్పుడే సాకారి అవ్వాలి. ఇటువంటి స్థితి ఉన్నప్పుడే సాకార రూపంలో ప్రతి ఒక్కరికీ నిరాకార రూపం యొక్క సాక్షాత్కారం మీ ద్వారా అవుతుంది. మిమ్మల్ని మీరు సాక్షాత్కారం చేసుకున్నారా? బ్రాహ్మణ రూపంలో అయితే ఉన్నారు. మీ సాక్షాత్కారం చేసుకున్నారా? అయితే మీ నెంబర్ సాక్షాత్కారం అయ్యిందా? మీ యొక్క మరో రూపం ఏదైనా సాక్షాత్కారం చేసుకున్నారా? మీ అసలైన రూపాన్ని మర్చిపోయారా? వర్తమాన సమయంలో మీరు ఏ రూపం ద్వారా యుక్తియుక్త సర్వీస్ చేయగలరు? జగన్మాత రూపంలో. ఈ రోజు విశేషంగా మాతల కార్యక్రమమే కదా! మాతరూపంలోనే ఉండాలి కానీ జగన్మాత అవ్వాలి. మాత కాకుండా పాలన చేయలేరు. ఈ రోజు మాతలను ఎందువలన పిలిచారు? వారసత్వానికి అధికారి అయిపోయారా లేక అవ్వాలా? వారసులుగా అయిపోయారా లేక అవ్వడానికి వచ్చారా? వారసులైతే వారసత్వం లభిస్తుంది. లేక వారసులుగా అయ్యారు కానీ వారసత్వం లభించలేదా? వారసత్వానికి అధికారిగా అయిపోయారు. అయితే ఇప్పుడు ఏ కార్యం కోసం వచ్చారు? బాప్ దాదా విశేషంగా ఏదో కార్యం కొరకు పిలిచారు. చదువు అయితే మీ సేవా కేంద్రాలలో కూడా చదువుకుంటారు. కోర్సు కూడా పూర్తి చేసుకున్నారు. ముఖ్య జ్ఞానం యొక్క చదువు అయితే చదువుకున్నారు కానీ ఇక ఏమి మిగిలి ఉంది? మాతలకి ఒక అభ్యాసం ఉంటుంది. ఆ అభ్యాసాన్ని పక్కా చేయించడానికి పిలిచాను. ఆ అభ్యాసం కుమారీలలో ఉండదు, మాతలలోనే ఉంటుంది. ఆ అభ్యాసం ఏమిటి? పతివ్రతగా అయ్యే అభ్యాసం. పతివ్రత అవ్వటం అంటే పూర్తిగా బలి అవ్వటం, పతివ్రతల ముఖ్యగుణం ఏమిటి? సంలగ్నత జోడించి కూర్చుంటుంది. సంలగ్నత తర్వాత సంలగ్నత యొక్క ప్రత్యక్ష రూపం చూపించాలి.

పతివ్రత అవ్వడానికి త్యాగం కూడా కావాలి. నష్టోమోహులు అవ్వాలి. సత్యమైన స్నేహి అయినప్పుడే నష్టోమోహులుగా కాగలరు. సత్యమైన స్నేహీలే పతివ్రత కాగలరు. అగ్నిలో కాలుతారు. కాలిన తర్వాతే పతివ్రత అవుతారు. మీరు ఏ అగ్నిలో కాలాలి? అగ్నిలో కాలిన తర్వాత పరివర్తన అవుతారు. ఏ వస్తువునైనా అగ్నిలో వేసిన తర్వాత దాని రంగు, రూపం అన్నీ మారిపోతాయి. ఏవైతే ఆసురీగుణాలు, లోక మర్యాదలు, కర్మబంధన యొక్క త్రాళ్ళు, మమత యొక్క దారం ఏవైతే బంధించుకున్నారో వాటన్నింటినీ కాల్చేయాలి. బాబా స్నేహం అనే అగ్నిలో ఆహుతి అయిపోతే ఇవన్నీ వదిలిపోతాయి. పతివ్రత అవ్వడానికి సంలగ్నత జోడించారు కానీ స్నేహి అయినప్పుడు ఆ స్నేహం యొక్క సంలగ్నత అనే అగ్నిలో వాటన్నింటినీ కాల్చాలి. అంటే పరివర్తన తీసుకురావాలి. మీ రంగు, రూపం అన్నీ మారాలి. ఈ సంలగ్నత అగ్నిలో పడి పరివర్తన అవ్వడానికి తయారుగా ఉన్నారా? కాలిపోయిన వస్తువు సమాప్తి అయిపోతుంది, కనిపించదు. ఇలా మీలో పరివర్తన తీసుకువచ్చే ధైర్యం ఉందా? మీ అందరి స్మృతి చిహ్నం ఇప్పటివరకు కూడా స్థిరంగా ఉంది. మీ స్మృతి చిహ్నం దేని ఆధారంగా ఉంటుంది? ఎంతెంత స్మృతి ఉంటుందో అంత మీ అందరి స్మృతిచిహ్నం తయారయ్యి ఉంది. ఇప్పటివరకు కూడా స్థిరంగా ఉంది. కనుక మీ స్మృతి ఆధారంగా అందరి స్మృతి చిహ్నం తయారయ్యి ఉంది. ఒకవేళ స్మృతి తక్కువగా ఉంటే స్మృతిచిహ్నం కూడా అలాగే ఉంటుంది. ఒకవేళ స్మృతి చిహ్నం స్థిరంగా ఉంచుకోవాలంటే మొదట స్మృతిని స్థిరంగా ఉంచుకోండి. దాని ఆధారంగా స్మృతి చిహ్నం తయారవుతుంది. ప్రతి ఒక్కరి విశేష గుణంపై ప్రతి ఒక్కరి ధ్యాస వెళ్ళాలి. ఒక్కొక్కరిలో ఉన్న విశేషగుణం మీలో ధారణ చేస్తే ఎలా అయిపోతారు? సర్వగుణ సంపన్నంగా అయిపోతారు ఎలా అయితే ఆత్మరూపాన్ని చూస్తున్నారో అలాగే కర్మలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి విశేష గుణం చూడండి. అప్పుడు మిగిలిన విషయాలు మర్చిపోతారు. గుణాలనే మీలో నింపుకునే ప్రయత్నం చేయాలి. ఈ రోజు మాతలకి చంద్రుని తిలకం పెడుతున్నాను. చంద్రుని గుణాలు మీలో ధారణ చేయాలి. కానీ చంద్రునికి సూర్యునితో లోతైన సంబంధం ఉంటుంది. కనుక చంద్రునితో సంబంధం మరియు సమాన గుణాలను ధారణ చేయాలి. మరియు చంద్రుని కర్తవ్యం ఏమిటి? శీతలతతో పాటు వెలుగుని కూడా ఇస్తాడు. మంచిది, వీడ్కోలు.