23.01.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సేవలో సఫలత పొందే యుక్తులు.

సేవ కారణంగా అతి కష్టమ్మీద మాట్లాడవలసి వస్తుంది అని అనుభవం చేసుకుంటున్నారా? సేవ సమాప్తి అయిపోయిన తర్వాత ధ్వని స్థితి కూడా సమాప్తి అయిపోతుంది. (బొంబాయి పార్టీ బాప్ దాదాతో బొంబాయిలో జరిగే సమ్మేళనం గురించి సలహా తీసుకుంటున్నారు). ఈ రోజుల్లో మీరు ఏదైతే సేవ చేస్తున్నారో దానిలో ఏ విశేషత ఉండాలి? ఉపన్యాసం అయితే అనేక సంవత్సరాల నుండి చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఉపన్యాసాలలో కూడా ఏమి అవ్యక్త స్థితి నిండి ఉండాలంటే - మీరు మాట్లాడుతున్నప్పుడు అందరు అనుభవం చేసుకోవాలి - వీరు అశరీరి అయ్యి ధ్వనికి అతీతమైన స్థితిలో మాట్లాడుతున్నారని. ఇప్పుడు ఈ సమ్మేళనంలో ఈ క్రొత్తదనం ఉండాలి. బయట ఉపన్యాసకులు మరియు బ్రాహ్మణ ఉపన్యాసకులు దూరం నుండే వేరుగా కనిపించాలి. అప్పుడే సమ్మేళనం యొక్క సఫలత వచ్చినట్లు. ఎవరైనా అజ్ఞానులు సభలో ప్రవేశించినా కానీ దూరం నుండే అనుభవం చేసుకోవాలి, ఎవరో అమూల్యమైనవారు మాట్లాడుతున్నారు. వాచాలో ఉన్న బలం కేవలం చెవుల వరకే వెళ్తుంది. కానీ అవ్యక్తస్థితిలో స్థితులై మాట్లాడిన మాటలు కేవలం చెవుల వరకే కాదు, మనస్సు వరకు వెళ్తాయి. వినసొంపుగా ఉండే ఉపన్యాసాలు చాలామంది చెప్తారు, కానీ మనస్సు వరకు వెళ్ళే ఉపన్యాసం చెప్పేవారు ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ లేరు.

బాబా పిల్లలైన మీ ముందు ప్రత్యక్షం అయ్యారు, కానీ పిల్లలైన మీరు బయట ప్రత్యక్షం అవ్వాలి. కనుక ఈ సమ్మేళనం సాధారణ రీతిలో జరుపకూడదు. మీటింగులో కూడా చెప్పాలి. చిత్రాలలో కూడా చిత్రం చైతన్యంగా అయ్యి సాక్షాత్కారం చేయించాలి. ఎప్పుడైతే చిత్రంలో చైతన్య భావం ఉంటుందో ఆ చిత్రమే బావుంటుంది. అంటే చిత్రకళ గురించి కాదు. బయట రూపంతో పాటు లోపల కూడా అలాగే ఉండాలి. బాప్ దాదా ఇదే క్రొత్త దనం చూడాలనుకుంటున్నారు. తక్కువ మాట్లాడాలి, కానీ కర్తవ్యం గొప్పగా చూపించాలి. ఇదే బ్రాహ్మణుల పద్ధతి, ఆచారం. ఈ సమ్మేళనం అమూల్యంగా ఎలా చేయాలి అనే ధ్యాస ఉండాలి. ఈ చిత్రాలలో కూడా అవ్యక్త చైతన్యత ఉండాలి. దూరం నుండే అనుభవం అవ్వాలి. లేకపోతే ఇంతమంది ప్రజలు ఎలా తయారవుతారు? కేవలం నోటితో కాదు కానీ ఆంతరంగిక స్థితి ద్వారా ఎవరైతే ప్రజలు తయారవుతారో దానినే అంతరంగిక సుఖ అనుభవం అంటారు. మీరు ఇప్పటి వరకు ఫలితం చూశారు - దానిలో వ్యక స్థితి యొక్క అనుభవం ద్వారా వచ్చినవారు ఆది నుండి సహజంగా మరియు నిర్విఘ్నంగా నడుస్తున్నారు. మరియు ఎవరైతే అవ్యక్తస్థితితో పాటు మరలా ఏదోక ఆధారాన్ని తీసుకువచ్చారో వారికి మధ్యలో విఘ్నాలు, కష్టాలు మొదలైన కఠిన పురుషార్థం కనిపిస్తుంది. ఇప్పుడు అవ్యక్త స్థితి యొక్క పునాది ద్వారా కొంచెం సమయంలో మరియు సహజంగానే తమ లక్ష్యాన్ని పొందే ప్రజలని తయారుచేయాలి. ఎంతగా స్వయం సహజ పురుషార్ధిగా ఉంటారో, అవ్యక్తశక్తితో ఉంటారో అంతగానే ఇతరులను కూడా మీ సమానంగా చేయగలరు. అంశం ఏదైనా కానీ స్థితి ఉన్నతంగా ఉండాలి. ఉన్నత స్థితి ఉంటే అంశాన్ని ఎలాగైనా మలుచుకోవచ్చు. ఇప్పుడు ఉపన్యాసం ఆధారంగా కాదు, స్థితి ఆధారంగా సఫలత పొందాలి. ఎందుకంటే ఉపన్యాసం అంటే భాషా ప్రావీణ్యత ఉన్నవారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, కానీ ఆత్మలో శక్తిని అనుభవం చేయించేవారు మీరే. కనుక ఇప్పుడు ఈ నవీనతనే తీసుకురావాలి. ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు మొదట వాయుమండలాన్ని తప్పక అవ్యక్తంగా చేసుకోవాలి. ఇది చాలా అవసరం.

ఎలాగైతే ఇతర అలంకరణల యొక్క ధ్యాస ఉంచుకుంటున్నారో అలాగే ఇది కూడా ముఖ్య అలంకరణ. కానీ ఏమౌతుందంటే నడుస్తూ నడుస్తూ ఆ సమయంలో బాహర్ముఖత ఎక్కువ అయిపోతుంది. కనుక చివరికి ఆ వాయుమండలం కారణంగా ఫలితం కూడా అలాగే వస్తుంది. అలా చేస్తాం, ఇది చేస్తాం అని చాలా ఆలోచిస్తారు, కానీ చివరి సమయంలో ఎక్కువ కర్తవ్యాన్ని చూసి బాహర్ముఖతలోకి వచ్చేస్తున్నారు. అలాగే వినేవారు కూడా ఆ సమయంలో చాలా బావుంది అంటున్నారు, కానీ మరలా వెంటనే బాహర్ముఖతలోకి వచ్చేస్తున్నారు. అందువలన ఎవరైనా ఎదురుగా రాగానే మొదట అవ్యక్త ప్రభావం అనుభవం అవ్వాలి. ఇలాంటి కార్యక్రమం పెట్టుకోవాలి. ఇది సమ్మేళనం యొక్క సఫలతకి సాధనం. కొన్నిరోజుల ముందే ఇలాంటి వాతావరణం తయారు చేసుకోవాలి. కేవలం ఆరోజే చేయటం కాదు. వాయుమండలాన్ని శుద్ధం చేసుకున్నప్పుడే నవీనత కనిపిస్తుంది. సాకార బాబా శరీరంలో ఉంటూనే దూరం నుండే అలౌకికత కనిపించేది. అలాగే పిల్లలలో కూడా ఈ వ్యక్త శరీరం ద్వారా అలౌకికత కనిపించాలి.

ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఫలితం బావుంటే చేయండి, కానీ ముందుగా వారిని కలుసుకుని వారిని సహాయకారులుగా చేసుకోవాలి, ఇది చాలా అవసరం. సమయం వచ్చినప్పుడు వారితో పని చేయించుకోవటం మరియు సమయం కంటే ముందు వారిని సహాయకారులుగా చేయటంలో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మీ బుద్ది లైన్ ని స్పష్టంగా ఉంచుకుంటే అన్నీ స్పష్టం అవుతూ ఉంటాయి. మీ ప్రదర్శనీలో స్విచ్ ఆన్ చేయగానే జవాబు లభించే ఏర్పాటు ఉంది కదా! అదేవిధంగా పురుషార్థం యొక్క లైన్ క్లియర్ గా ఉండటం ద్వారా సంకల్పం అనే స్విచ్ వేశారు, అయిపోయింది. అంతే అలా అనుభవం చేసుకుంటారు. కేవలం వ్యర్థ సంకల్పాల యొక్క నియంత్రణా శక్తి ఉండాలి. వ్యర్థ సంకల్పాలు నడుస్తున్న కారణంగా ఏదైతే బాప్ దాదా ద్వారా సహజ ప్రేరణ లభిస్తుందో లేక శుద్దమైన జవాబు లభిస్తుందో దానిలో కల్తీ వచ్చేస్తుంది. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు అధికంగా ఉంటున్నాయి. వ్యర్థ సంకల్పాలను అదుపులో ఉంచుకునే శక్తి ఉంటే ఒకే జవాబు స్పష్టంగా తెలుస్తుంది. బుద్ది ట్రాన్స్ లైటుగా ఉంటే దానిలో ప్రతీ విషయం యొక్క జవాబు స్పష్టంగా మరియు యదార్థంగా వస్తుంది, కల్తీ ఉండదు. ఎవరికైతే వ్యర్థ సంకల్పాలు నడవవో వారు తమ అవ్యక్త స్థితిని ఎక్కువ పెంచుకుంటారు. శుద్ధ సంకల్పాలు కూడా నడవాలి, కానీ వాటిని కూడా అదుపులో పెట్టుకునే శక్తి ఉండాలి. ఎక్కువమందిలో వ్యర్ధ సంకల్పాల తుఫాను ఎక్కువగా ఉంది.

ఏదైనా కార్యం ప్రారంభించినప్పుడు ఉదాహరణ మంచిగా తయారు చేస్తారు కదా! ఇక్కడ కూడా ఈ సమ్మేళనం యొక్క ఉదాహరణ అందరి ముందు పెట్టాలి. అందరూ ఈ విధంగా అనుభవం చేసుకోవాలి - మేము బొంబాయిలో లేము కానీ అవ్యక్త వతనంలోకి వచ్చాము. ఒకవేళ బొంబాయిలో అందరికీ అవ్యక్త వతనం యొక్క అనుభవం అయితే అది ఒక టైమ్ బాంబ్ అవుతుంది.

అవ్యక్త స్థితి అంటే ఏమిటో అనుభవం చేయించండి. మీ కార్యకలాపాలలో అందరూ సమయం యొక్క గడియారాన్ని చూడాలి. సమయం యొక్క గడియారం అయ్యి వెళ్తున్నారు! సాకారంలో బాబా కూడా సమయం యొక్క గడియారం అయ్యారు కదా! అలాగే శరీరంలో ఉంటూ అవ్యక్త స్థితి యొక్క గంటలు మ్రోగించే గడియారం అవ్వాలి. ఈ సేవ అన్నింటికంటే మంచిది. వ్యక్తంలో ఉంటూ అవ్యక్త స్థితి యొక్క అనుభవం ఎలా ఉంటుంది అనేది అందరికీ ప్రత్యక్షంగా పాఠం చదివించాలి. మంచిది.

బాప్ దాదా మరియు దైవీ పరివారం అందరి స్నేహ సూత్రంలో మణిగా అవ్వాలి. స్నేహ సూత్రంలో గ్రుచ్చబడిన మణిని నేను అనే నషా ఉండాలి. మణి ఎక్కడ పెడతారు? మాల యొక్క మణులను చాలా శుభ్రంగా ఉంచుతారు. తీయటం కూడా చాలా శుద్ద పూర్వకంగా తీస్తారు. మనం కూడా అలాంటి అమూల్య మణులం అని భావించాలి. (కొందరు సేవ కోసం సలహా అడిగారు) వారికి మాట ద్వారా సేవ జరగదు. కానీ ఎప్పుడయితే చరిత్ర ప్రభావశాలిగా ఉంటుందో, మార్పు చేస్తారో అప్పుడు స్వయం ఆకర్షితం అయ్యి వస్తారు.

కొంతమందికి తమ గురించి అహంకారం కూడా ఉంటుంది కదా! కనుక వాణి ద్వారా అహంకారం యొక్క గొడవలోకి వచ్చేస్తారు. కానీ ప్రత్యక్ష జీవితం ద్వారా గొడవలోకి రారు. అందువలన అటువంటి వారికి చెప్పడానికి సాధనం ఇదే - వాయుమండలాన్ని అవ్యక్తంగా చేసుకోవాలి. ఏవైతే సేవాకేంద్రాలు ఉన్నాయో ఆ సేవా కేంద్రాలలో వాయుమండలాన్ని ఆకర్షణీయంగా తయారు చేసుకోవాలి. దాని ద్వారా వారు అవ్యక్త వతనం చూడాలి. ఎవరైనా రాగానే దూరం నుంచి అనుభవం చేసుకోవాలి. ఈ ఇంటిలో ఏదో దీపం ఉందని, దీపం దూరం నుండే వెలుగుని ఇస్తుంది. తన వైపు ఆకర్షితం చేసుకుంటుంది. అలాగే దీపం వలె మీరు కూడా ప్రకాశిస్తూ కనిపించాలి. అప్పుడే సఫలత వస్తుంది. అవ్యక్త భట్టీలోకి వచ్చి అవ్యక్త స్థితి యొక్క అనుభవం చేసుకున్నారా?

ఇక్కడ ఏదైతే అనుభవం అవుతుందో దానిని మరలా ఏమి చేస్తారు! వెంట తీసుకువెళ్తారా లేక ఇక్కడే వదిలేస్తారా? ఈ విధంగా తోడుగా చేసుకోవాలి - ఈ అవ్యక్త ఆకర్షణ యొక్క తోడుని ఎవరైనా వదిలించాలని అనుకున్నా కానీ వదలకూడదు. లౌకికాన్ని పారలౌకిక లేదా అలౌకిక పరివారంగా చేసుకున్నారు. కొద్దిగా కూడా లౌకికస్థితి ఉండకూడదు. ఎలా అయితే ఒక శరీరం వదిలి మరో శరీరం తీసుకుంటే పూర్వ జన్మ యొక్క ఏ విషయం స్మృతిలో ఉండదు కదా! అలాగే ఇక్కడ కూడా మీరు మరజీవ అయ్యారు. కనుక పూర్వ జీవితం యొక్క స్మృతి, దృష్టి కూడా అలాగే సమాప్తం అయిపోవాలి. లౌకికంలో అలౌకికం నింపుకున్నప్పుడే అలౌకిక సేవ జరుగుతుంది. అలౌకిక సేవ ఏమి చేస్తున్నారు? ఆత్మ యొక్క సంబంధం పవర్ హౌసుతో జోడించే సేవ చేస్తున్నారా! వైరుని వైరుతో కలిపేటప్పుడు పైన ఉన్న రబ్బరు తొడుగుని తొలగించవలసి ఉంటుంది. అలాగే మీ కర్తవ్యం - మొదట ఆత్మగా భావించి శరీర అభిమానం నుండి వేరుగా ఉండాలి మరియు ఇతరులను కూడా శరీర అభిమానం నుంచి వేరు చేయాలి. ఇక్కడ ముఖ్య సబ్జక్టులు ఎన్ని, అవి ఏవి? ముఖ్య సబ్జక్టులు నాలుగు - జ్ఞానం, యోగం, ధారణ మరియు సేవ. వీటిలో కూడా ముఖ్యమైనది ఏమిటి? ఇక్కడ నుండే శాంతి స్టాక్ ని జమ చేసుకున్నారా? ఆశీర్వాదాలు ఎలా లభిస్తాయో తెలుసా? ఎంతెంత ఆత్మాభిమాని అవుతారో అంతంత స్వతహాగా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇక్కడ స్థూలంగా ఆశీర్వాదాలు లభించవు. ఒకవేళ బాప్ దాదా యొక్క ఆశీర్వాదాలు లేకపోతే ఇక్కడి వరకు ఎలా చేరుకుంటారు? ప్రతి సెకను బాప్ దాదా పిల్లలకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు. కానీ తీసుకునేవారు ఎంత తీసుకుంటే అంత తమ దగ్గర ఉంచుకుంటారు. మీ యొక్క మరో భాగ్యస్వామి ఎవరు? సదా వెంట ఉండే భాగ్యస్వామి ఎవరు? ఇక్కడ సదా దంపతుల రూపంలో ఉంటే అక్కడ దంపతుల రూపంలో రాజ్యం చేస్తారు. అందువలన భాగ్యస్వామిని ఎప్పుడూ వేరు చేయకూడదు. ఎలా అయితే చతుర్భుజాలు కలిసి ఉంటాయో అలాగే కలిసి ఉండాలి. శివబాబాని మీ నుండి ఎప్పుడూ వేరు చేయకూడదు. ఇటువంటి భాగ్యస్వామిని ఎప్పుడైనా చూశారా? 84 జన్మలలో 84 భాగ్యస్వాములలో ఇటువంటి భాగ్యస్వామి ఎప్పుడైనా లభించారా? కల్పంలో ఒకేసారి లభిస్తారు. కనుక పూర్తిగా వెంట ఉంచుకోవాలి కదా! ఇప్పుడు మేము దంపతులం అని స్మృతి ఉంచుకోవాలి, ఒంటరి కాదు. ఎలా అయితే శారీరకంగా శ్రమ చేసేవారు దృఢంగా ఉంటారో అలాగే ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనస్సు మారకుండా ఉండేలా మనస్సు యొక్క స్థితిలో కూడా దృఢంగా ఉండాలి. దృఢంగా ఉన్న వస్తువు చలించదు కదా! అలాగే స్థితి మరియు కర్మ రెండూ దృఢంగా ఉండాలి. ఎవరిపై ఎక్కువ స్నేహం ఉంటుందో వారిని వెంట ఉంచుకుంటారు కదా! కనుక సదా మేము దంపతులం అని భావించండి. భాగ్యస్వామి వెంట ఉంటే మాయ రాలేదు. దంపతులుగా భావించాలి - ఇదే ఉన్నతోన్నతమైన యుక్తి. అడుగడుగులో వెంట ఉంచుకుంటే ధైర్యం ఉంటుంది. శక్తి ఉంటుంది అప్పుడు మాయ రాదు.

మీ పేరు (శ్రీనివాస్) పురుషార్ధం మరియు ప్రాప్తి రెండింటినీ స్మృతి ఇప్పిస్తుంది. శ్రీగా ఎప్పుడు అవుతారు? శ్రీ అనేది దేవతల బిరుదు. అంటే అది భవిష్య స్మృతి, మరియు నివాస్ అంటే నివాస స్థానం ఏది? నివాసం అనే మాట ద్వారా ఆత్మిక రూపం యొక్క స్మృతి వస్తుంది. కనుక శ్రీతో భవిష్య పదవి స్మృతి వస్తుంది మరియు నివాసం స్మృతిలో ఉండటం ద్వారా మీ స్వరూపం స్మృతిలో వస్తుంది. కనుక శ్రేష్టంగా అవ్వాలి మరియు ఏ ఇంటి నుండి అయితే వచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళాలని పక్కాగా స్మృతి ఉంచుకోవాలి. మీరు భగవంతుని విద్యార్ధులే డబల్ విద్యార్థులుగా అయ్యి ఇక ముందు కొరకు ఏ లక్ష్యం పెట్టుకుంటారు. ఉన్నత పదవి ఏది? లక్ష్మీనారాయణులుగా అవుతారా? ఎటువంటి లక్ష్యం పెట్టుకున్నారో లక్ష్యంతో పాటు ఏమి ధారణ చేయాలి? లక్షణాలు అంటే దైవీగుణాలు, లక్ష్యం ఉన్నతంగా పెట్టుకున్నారు. కనుక లక్షణాలు కూడా ఉన్నతంగా ఉంచుకునే ధ్యాస పెట్టుకోవాలి. చిన్న కుమారి చాలా పెద్ద కార్యం చేయగలదు. మీ ప్రత్యక్ష స్థితిలో స్థితులై ఎవరికైనా చెప్తే పెద్దవారి కంటే కూడా ఎక్కువ ప్రభావం పడుతుంది. కనుక సదా చిన్నగా ఉన్న నేను చాలా పెద్ద కర్తవ్యం చేసి చూపించాలి అనే లక్ష్యం పెట్టుకోండి. దేహం చిన్నదైనా కానీ ఆత్మ యొక్క శక్తి గొప్పది. ఎవరైతే ఎక్కువ పురుషార్ధం చేసే కోరిక పెట్టుకుంటారో వారికి సహాయం కూడా లభిస్తుంది. కేవలం మీ కోరికను దృఢంగా పెట్టుకోవాలి. అప్పుడు సహాయం కూడా దృఢంగా లభిస్తుంది. ఎవరు ఎంత చలింపచేసినా కానీ ఈ సంకల్పం గట్టిగా ఉంచుకోవాలి. సంకల్పం గట్టిగా ఉంటే సృష్టి కూడా ఆవిధంగా తయారవుతుంది. ఒకవేళ సంకల్పం గట్టిగా లేకపోతే శారీరక సేవ కూడా చేస్తూ ఉండండి. శారీరక సేవ (ఉదోగ్యం) కూడా ఒక సాధనము. ఈ సాధనము ద్వారా సేవ చేయవచ్చు .ఈ సేవా సంబంధంలోకి ఎవరైతే వస్తున్నారో ఆ ఆత్మలకి సందేశం ఇవ్వడానికి ఇది సాధనం అని భావించాలి. సేవలో అయితే అనేకమంది ఆత్మలు సంబంధంలోకి వస్తారు. ఇక్కడికి వచ్చేసిన వారిని కూడా సేవ కొరకు సంబంధీకుల దగ్గరకు పంపారు కదా! అదేవిధంగా సేవ కోసమే ఈ స్థూల సేవ చేస్తున్నాము అని భావించండి. అప్పుడు మనస్సు కూడా దానివైపు ఉంటుంది. మరియు సంపాదన కూడా అవుతుంది. లౌకికాన్ని కూడా అలౌకికంగా భావించి చేయండి. ఇక ఏ ఇతర వాతావరణంలోకి వెళ్ళరు. ఎంతెంత అవ్యక్త స్థితిలో ఉంటారో అంత మాట్లాడటం కూడా తక్కువ అయిపోతుంది. తక్కువ మాట్లాడటం ద్వారా ఎక్కువ లాభం ఉంటుంది. తరువాత యోగశక్తితో సేవ చేస్తారు. యోగబలం మరియు జ్ఞాన బలం రెండూ కలిసి ఉంటాయి. ఇప్పుడు జ్ఞానబలం ద్వారా సేవ జరుగుతుంది, యోగబలం గుప్తంగా ఉంది. కానీ ఎంత యోగబలం మరియు జ్ఞానబలం రెండింటిలో సమానత తీసుకువస్తారో అంతగా సఫలత వస్తుంది.

రోజంతటిలో జ్ఞానబలం ఎంత ఉంది? యోగబలం ఎంత ఉంది? అని పరిశీలించుకోవాలి. అప్పుడు ఎంత తేడా ఉందో తెలుస్తుంది. సర్వీస్లో బిజీ అయిపోతే విఘ్నాలు మొదలైనవి స్వతహాగానే తొలగిపోతాయి. దృఢ నిశ్చయం ముందు ఏ విఘ్నం రాలేదు. మంచిగా నడుస్తున్నారు. అలసిపోనివారిగా మరియు ఏకరసంగా రెండు గుణాలు ఉన్నాయి. సదా తండ్రిని ఫాలో చేయాలి. సాకారంలో బాబా అలసిపోనివారిగా మరియు ఏకరస స్థితికి ఉదాహరణ అయ్యి చూపించారు. అలాగే ఇతరులకి ఉదాహరణ అయ్యి చూపించాలి. ఇదే సేవ. సేవ చేయడానికి సమయం లభించక పోయినా కానీ చరిత్ర ద్వారా కూడా సేవ చేయవచ్చు. కేవలం వాచా ద్వారా కాదు. మీ చరిత్ర ఆ విచిత్ర తండ్రి యొక్క స్మృతి ఇప్పించాలి. ఇది సహజ సేవ కదా! కొందరు తమ గురువు యొక్క లేదా స్త్రీ తన భర్త యొక్క ఫోటోని లాకెట్లో పెట్టుకుంటారు కదా! ఇది కూడా స్నేహానికి గుర్తు. అలాగే మీ యొక్క మస్తకం ద్వారా విచిత్రుడు అయిన బాబా యొక్క చరిత్ర చూపించాలి. ఈ నయనాలు విచిత్రుని చిత్రం చూపించాలి. ఈ విధమైన అవినాశి లాకెట్ ధరించాలి. దీని ద్వారా మీ స్మృతి ఉంటుంది మరియు సేవ కూడా జరుగుతుంది. మధువనానికి వచ్చి ముఖ్య కర్తవ్యం ఏమి చేసారు? ఏదైనా ఖజానా దగ్గరికి వెళ్తే ఏమి చేస్తారు? ఖజానా నుంచి ఎంత తీసుకోగలరో అంత తీసుకుంటారు. కేవలం కొంచెమే తీసుకోరు. అలాగే మధువనం అంటే సర్వప్రాప్తుల ఖజానా. మీరు మీ ఖజానా దగ్గరకి వచ్చారు. మిగిలిన సేవాకేంద్రాలన్నీ ఖజానా యొక్క శాఖలు (బ్రాంచ్). ఖజానా దగ్గరకి వెళ్ళటం ద్వారా ఎంత తీసుకోవాలనే సంకల్పం ఉంటుంది. ఇక్కడ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇక్కడ ప్రతీ వస్తువు, ప్రతీ బ్రాహ్మణ ఆత్మకి చాలా శిక్షణ మరియు శక్తి ఇచ్చేదిగా ఉంటుంది.

బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంచెం కాదు. అన్నీతీసుకుని వెళ్ళాలని. బాప్ దాదాకి పిల్లలపై స్నేహం ఉంది. కనుక ఒకొక్కరిని సంపన్నం చేయాలి అని కోరుకుంటున్నారు. ఎంత ఇక్కడ తీసుకోవటంలో సంపన్నం అవుతారో అంతగానే భవిష్యత్తులో రాజ్యం పొందటానికి సంపన్నం అవుతారు. అందువలన ఈ అమూల్య రోజుల ఒక్క సెకను కూడా పోగొట్టుకోకూడదు. ఒక్క సెకనులో కోట్ల సంపాదన చేసుకోవచ్చు. పదమాపద భాగ్యశాలురు. కనుకే ఈ భూమికి చేరుకున్నారు. కానీ ఈ కోట్ల భాగ్యాన్ని స్థిరంగా ఉంచుకోవటానికి సదా సంపూర్ణత యొక్క పురుషార్ధం చేయాలి. ఎలాంటి బీజమో అలాంటి ఫలం వస్తుంది. ఆమీరు ఎలాంటి బీజం వేస్తారో లేదా పునాదిని గట్టిగా వేసుకుంటారో అంతగానే భవనం కూడా గట్టిగా ఉంటుంది. అందువలన సదా మేము పునాది అని భావించండి. మీపై మొత్తం బిల్డింగ్ ఆధారపడి ఉంది. స్మృతికి జవాబు లభిస్తుందా? బాప్ దాదా అయితే ఇప్పుడు కూడా అందరి వెంట ఉన్నారు. ఎందుకంటే సాకారంలో అయితే ఒక స్థానంలోనే వెంట ఉండగలిగేవారు. ఇప్పుడు అయితే అందరి వెంట ఉండగలరు. ఒకే మతం ద్వారా ఒకే ఫలితం వస్తుంది. సదా ఇదే ధ్యాస ఉంచుకోవాలి. ఈ గుణాన్ని పరివర్తనలోకి తీసుకురావాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ మిమ్మల్ని గట్టిగా ఉంచుకోండి. ఇతరులకి కూడా మీ గుణాన్ని దానం చేయాలి. దానం చేయటం ద్వారా భవిష్యత్తులో ఫలం లభిస్తుంది కదా! అలాగే ఈ గుణదానం చేయటం ద్వారా ఉన్నత పాలబ్దం లభిస్తుంది. ఎవరైతే ఏకమతంగా ఉంటారో వారే ఒకరికి ప్రియంగా అవుతారు. బాప్ దాదాలు ఇద్దరైనప్పటికీ కూడా ఒకరే కదా! అలాగే ఎంతమంది ఉన్నప్పటికీ ఒకే మతంపై నడవాలి. బాబా ఇంటికి వచ్చి ఏ విశేష ఖజానా తీసుకున్నారు? బాబా ఇంటిలో విశేషతలు నిండి ఉన్నాయి కదా! అసలైన స్వరూపంలో స్థితులవ్వటానికి మీ ఇంటికి వచ్చారు. మీ వాస్తవిక స్వరూపం అసలైన స్థితి ఏమిటి? జ్ఞాపకం వస్తుందా? ఆత్మ యొక్క వాస్తవ స్థితి ఏమిటి? ఆదిలో ఆత్మ పరంధామ నివాసిగా, సర్వగుణ స్వరూపంగా ఉండేది. అలాగే ఇక్కడ కూడా మీ వాస్తవ స్థితి యొక్క అనుభవం చేసుకోవడానికి వచ్చారు. ఈ స్థితిని పరిశీలించుకోవడానికి మధువనం వచ్చారు. పరిశీలించుకున్న తర్వాత దానిని సదాకాలికంగా తయారుచేసుకోవాలి. పేరే మధువనం. మధు అంటే మధురత లేదా స్నేహం మరియు శక్తి. రెండూ వరదానాల రూపంలో పొందాలి. ఇక్కడ మధువనంలో ఈ రెండు గుణాలు వరదాన రూపంలో లభిస్తున్నాయి. మరలా బయటికి వెళ్తే ఈ గుణాల కోసం మీరు పురుషార్ధం చేయవలసి ఉంటుంది. అందువలన ఇక్కడ వరదాన రూపంలో లభిస్తున్న వాటిని అవినాశిగా పొందండి. వరదాన రూపంలో లభిస్తున్నప్పుడు ఇక పురుషార్ధం చేయటం ఎందుకు? గురువు వరదానం ఇస్తే ఏమైనా చేయవలసి ఉంటుందా?

తమని తాము అర్పణ చేసుకున్నప్పుడే వరదానం లభిస్తుంది. కనుక ఇక్కడ కూడా మిమ్మల్ని మీరు ఎంత అర్పణ చేసుకుంటే అంత వరదానం లభిస్తుంది. వరదానం అందరికీ లభిస్తుంది. కానీ ఎక్కువ అర్పణ అయినవారు ఎక్కువ వరదానానికి పాత్రులు అవుతారు. వరదానాలతో జోలె ఎప్పుడూ ఖాళీ కాకుండా ఉండేలా నింపుకోండి. ఎవరు ఎంత నింపుకోవాలనుకుంటే అంత నింపుకోవచ్చు. ఈ విధంగా ధ్యాస పెట్టుకుని ఈ కొద్దిరోజులలో అలసిపోకుండా లాభం పొందండి. ఒక్కొక్క సెకను సఫలం చేసుకునే రోజులివి. ఇప్పటి ఒక సెకనులో చాలా లాభం ఉంది మరియు చాలా నష్టం కూడా అంటే ఒక సెకనులో అనేక సంవత్సరాల సంపాదన కూడా పోగొట్టుకుంటున్నారు కదా! ఇప్పుడు ఒక సెకను కూడా ఇంత పెద్దది. ఈ త్యాగం కూడా తక్కువ విషయం కాదు.

ఈ త్యాగానికి కూడా చాలా భాగ్యం తయారవుతుంది. కానీ మనస్సులో కూడా సంకల్పం ఉత్పన్నం కాకూడదు. ఎప్పుడైనా పశువుని బలి ఇస్తున్నప్పుడు ఆ పశువు ఒకవేళ కొద్దిగా అరిచినా లేక కళ్ళ నుండి నీళ్ళు వచ్చినా దానిని దేవికి స్వీకరింపచేయరు. ఒక్కసారిగా బలి అవ్వాలి కదా! ఒక దెబ్బతో ఏదైనా వస్తువుని సమాప్తి చేయటం మరియు మాటిమాటికి కొట్టడంతో తేడా ఉంటుంది కదా! బాప్ దాదా దగ్గర కూడా ఏ పిల్లలు స్వీకారం అవుతారు? ఎవరికైతే మనస్సులో కూడా సంకల్పం రారో వారినే మహాబలి అంటారు.

ఇలా మహాబలి అయిన వారికే గొప్పబలం లభిస్తుంది. సర్వశక్తివంతుని పిల్లలకు శక్తి లేకపోతే బావుంటుందా! బాబా యొక్క పూర్తి ఆస్తికి హక్కుదారులుగా అవ్వాలి కదా! సర్వశక్తివంతుడైన బాబా యొక్క సర్వశక్తుల ఆస్తి యొక్క అధికారాన్ని ఎదురుగా ఉంచుకోండి. సర్వశక్తివంతుని ముందు బలహీనత నిలవగలదా? ఈ రోజు నుంచి బలహీనతను సమాప్తి చేయాలి. కేవలం శక్తులే కాదు. పాండవులు కూడా శక్తి రూపమే. ఒక దీపం ద్వారా అనేక దీపాలు వెలుగుతాయి. (వైద్యులతో) డబల్ ఆపరేషన్ చేస్తున్నారా? శరీరానికి మరియు మనస్సుకి రెండింటికీ మార్గాలు చెప్పడానికి మంచి అవకాశం లభిస్తుంది. ఎలా అయితే స్థూల సేవ చేస్తే జీతం లభిస్తుందో అలాగే ఈశ్వరీయ సేవ చేయటం ద్వారా ఏ జీతం లభిస్తుంది? (స్వర్గం యొక్క చక్రవర్తిత్వం లభిస్తుంది) అది అయితే అక్కడ లభిస్తుంది. కానీ ఇప్పుడు ఏమి లభిస్తుంది? ప్రత్యక్షఫలం అనుభవం అవుతుందా? భవిష్యత్తు అయితే తయారవుతుంది కానీ భవిష్యత్తు కంటే ఎక్కువగా ఇప్పుడు లభిస్తుంది. ఇప్పుడు లభించే ఈశ్వరీయ అతీంద్రియ సుఖం భవిష్యత్తులో లభించదు. ఈ అతీంద్రియ సుఖం కల్పంలో మరెప్పుడూ లభించదు. అటువంటి ఖజానా ఇప్పుడు బాబా ద్వారా లభిస్తుంది. చాలా సమయం నుండి ఇంద్రియాల సుఖం మరియు ఒక్క సెకనులో అతీంద్రియ సుఖం అనుభవం అవుతుందా?

శివబాబా మరియు మీరు దంపతులుగా అయ్యారా? దేహధారి దంపతులు సుఖంలో తోడుగా ఉంటారు. ఇక్కడ బాబా దు:ఖ సమయంలో తోడు అవుతారు. కనుక అటువంటి భాగస్వామితో ఒక్క సెకను కూడా వేరు అవ్వకూడదు. తోడు ఉంచుకోవటం అంటే శక్తి రూపంగా అవ్వటం. బ్రాహ్మణ పరివారాన్ని చూశారా? ఇంత పెద్ద బ్రాహ్మణ పరివారం ఎప్పుడైనా లభిస్తుందా? కేవలం సంగమయుగంలోనే ఇంత పెద్ద పరివారం లభిస్తుంది. మేము ఇంత గొప్ప పరివారంలోని వాళ్ళం అనే నషా ఉంటుందా? ఎంత పెద్ద పరివారం ఉంటుందో అంత సంతోషం ఉంటుంది. మొత్తం ప్రపంచంలో కొద్దిమందికే ఇంత పెద్ద పరివారం లభిస్తుంది. ఈ నిశ్చయం మరియు నషా ఉండాలి. కోట్లలో కొద్దిమంది అని మహిమ చేసే ఆత్మలం మేమే అనే సంతోషం ఉండాలి. ఇలాంటి సౌభాగ్యం లభిస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? అకస్మాత్తుగా అదృష్టం (లాటరీ) లభించింది. లాటరీ తగిలే సంతోషం ఉంటుంది కదా! ఇది అవినాశి లాటరీ. ఇది ఎప్పుడూ సమాప్తి అవ్వదు. ఇటువంటి లాటరీ మాకు లభించింది అనే నషా ఉంటుందా? మూలమూలల నుండి బాప్ దాదా ఎవరెవరిని ఎన్నుకున్నారో చూడండి. ఎన్నుకున్న వారిలో మీరు విశేషమైన వారు. ఈ స్మృతి ఉంటుందా? బాప్ దాదాకి ఏ రత్నాలు ఇష్టం అనిపిస్తారు? సాధారణమైనవారు. ఈ విధమైన సంతోషం సదా అవినాశిగా ఉండాలి.

దీపం సదా వెలుగుతూ ఉండడానికి నూనె మరియు వత్తి రెండూ అవసరం. ఇక్కడ కూడా సంతోషం అనే దీపం సదా వెలుగుతూ ఉండాలి. దీని కోసం రెండు విషయాలు ఙ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞానం అనే నూనె మరియు యోగం అనే వత్తి. ఈ రెండు మంచిగా ఉంటే సంతోషం అనే దీపం అవినాశిగా వెలుగుతూ ఉంటుంది ఎప్పుడూ ఆరిపోదు. ఈ సంగమయుగంలో 15 రోజులు కూడా చాలా ఎక్కువ. మేము 15 రోజుల పిల్లలం అని భావించకండి. సంగమయుగం యొక్క సమయం చాలా తక్కువ. అందువలన ఆ లెక్కతో చూస్తే 15 రోజులు కూడా చాలా ఎక్కువ. అందువలన చివర వచ్చినా ముందుకి వెళ్లాలి అని భావించండి. తప్పిపోయిన పిల్లలు రాగానే తీవ్ర పురుషార్థంలో నిమగ్నం అయిపోతారు. పిల్లలు ధైర్యం పెట్టుకుంటారు. తండ్రి సహాయం చేస్తారు. ఒక కుమారి 100 మంది బ్రాహ్మణుల కంటే ఉత్తమం అని మహిమ చేయబడుతుంది. ఒకరిలో 100 మంది శక్తి ఉంటే చేయలేని విషయం ఏది? కేవలం మీ పాదాన్ని గట్టిగా చేసుకోండి. ఎవరు ఎంత చలింపచేసినా కానీ చలించకూడదు. అచలఘర్ కూడా మీ స్మృతిచిహ్నం కదా! అచంచలం అంటే ఎవరూ చలింపచేయలేరు. మూడు నెలల్లో, మూడు వారసత్వాలు తీసుకుంటున్నారా? బాప్ దాదా ఏ మూడు వారసత్వాలు ఇస్తున్నారు? సుఖం, శాంతి మరియు శక్తి ఎంత ఇక్కడ ఈ అధికారం తీసుకుంటే అంత అక్కడ రాజ్యధికారి అవుతారు. సంపూర్ణ అధికారం పొందే లక్ష్యం పెట్టుకోవాలి. ఎందుకంటే తండ్రి కూడా సంపూర్ణులు కదా!

దంపతులుగా ఉంటూ ఒంటరిగా ఉంటున్నారా? లేక దంపతుల రూపంగా ఉంటున్నారా? ఒంటరి రూపం ఏమిటి? ఆత్మ ఒంటరియే కదా? ఒంటరిగా వస్తుంది, ఒంటరిగా వెళ్ళిపోతుంది.
కనుక దంపతుల రూపంలో పాత్ర అభినయిస్తూ కూడా ఆత్మిక స్థితిలో ఉండాలి. అంటే ఒంటరిగా అయ్యి మరలా ఆత్మిక దంపతులుగా అవ్వాలి. అది అయితే దేహం యొక్క దాంపత్యం, ఇది ఆత్మ, పరమాత్మల దాంపత్యం. ఆత్మని ప్రేయసి లేదా సీత అని అంటారు కదా?

పరమాత్మ ప్రియుడు, రాముడు. కనుక ఆత్మిక దంపతులుగా అవ్వాలి. దేహధారి దంపతుల రూపం కాదు. దేహధారి దంపతుల రూపం సమాప్తి అయిపోయింది. అనేక జన్మలు దేహధారి దంపతుల రూపాన్ని చూశారు. ఇప్పుడు ఆత్మ మరియు పరమాత్మల దంపతుల రూపంగా అవ్వాలి. ఈ స్థితిలో ఉంటున్నారా? ఈ అద్భుతమైన దంపతుల ఎదురుగా ఆ దంపతులు ఎందుకూ పనికిరారు. దేహాభిమానం సమాప్తి అయిపోతుంది. అందరికంటే ప్రియమైనవారు ఎవరు? ప్రియమైనవారు మంచిగా అనిపిస్తారు కదా! అయితే ఆ ప్రియమైన వారిని వదిలి ఇతరులని ఎలా ప్రియంగా చేసుకోగలరు? ఒంటరిగా మరియు దంపతులుగా కూడా అవ్వాలి. కొంతమందికి రావటంతోనే లాటరీ లభిస్తుంది. కొంతమందికి ప్రయత్నం ద్వారా లభిస్తుంది. మిమ్మల్ని మీరు అటువంటి ఉన్నత భాగ్యశాలి ఆత్మలుగా భావిస్తున్నారా? కుమారులకు కూడా సహజమార్గం. ఎందుకంటే వ్యతిరేక మెట్లు ఎక్కి దిగవలసిన పని లేదు. అందువలన కుమారీ, కుమారులకు ఇంకా సహజం. ఎవరైతే బంధన్ముక్తులుగా ఉంటారో వారే త్వరగా పరుగు పెట్టగలరు. అందువలన అన్ని విషయాలలో నిర్భందనులు అవ్వాలి. ఎటువంటి పరిస్థితి అయినా మీ స్థితిని ఉన్నతంగా ఉంచుకోవాలి. ఉన్నత జీవితం యొక్క లక్ష్యానికి దూరం కాకూడదు.