25.01.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


స్మృతి చిహ్నాన్ని స్థిరంగా చేసుకునే విధి.

అవ్యక్త స్థితియే ముఖ్య సబ్జక్ట్. వ్యక్తంలో ఉంటూ కర్మ చేసూ కూడా అవ్యకస్థితిలో ఉండాలి. ఈ సబ్బక్టులోనే పాస్ అవ్వాలి. మీ బుద్ది లైన్ స్పష్టంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మార్గం స్పష్టంగా ఉంటుందో అప్పుడు త్వరత్వరగా పరుగు పెట్టి గమ్యానికి చేరుకుంటారు. పురుషార్థం యొక్క మార్గంలో ఏదైనా విఘ్నం వస్తే దానిని తొలగించి లైన్ స్పష్టంగా చేసుకునే సాధన ద్వారానే అవ్యక్త స్థితి వస్తుంది. మధువనానికి వచ్చి ఏదోక విశేష గుణం అందరికీ ఇవ్వటమే స్మృతి చిహ్నం. అది అయితే జడ స్మృతిచిహ్నం. కానీ ఇక్కడ మీ గుణాలను ఇవ్వాలి, ఇది చైతన్య స్మృతిచిహ్నం. దానిని సదా స్మృతి ఉంచుకోవాలి. ఎప్పుడు, ఎక్కడికి వెళ్ళినా స్మృతి చిహ్నం స్థిరం చేసుకోవాలి అనే లక్ష్యం పెట్టుకోండి. ఇక్కడ నుండి విశేష స్నేహం మీలో నింపుకుని వెళ్తే ఆ స్నేహం రాయిని కూడా నీరుగా చేసేస్తుంది. ఆత్మిక స్నేహం యొక్క ఈ బహుమతిని వెంట తీసుకువెళ్ళాలి. దీని ద్వారా ఎవరిపైనైనా విజయం లభిస్తుంది. సమయం ఎక్కువగా ఉందని భావిస్తున్నారా లేక తక్కువ అని భావిస్తున్నారా? కనుక ఇప్పుడు తక్కువ సమయంలో 100% వరకు చేరుకునే ప్రయత్నం చేయాలి. ఎంత మీకు ధైర్యం ఉంటే అంత ఉపయోగించాలి. ఒక సెకను కూడా వ్యర్థంగా పోకూడదు, ఇంత ధ్యాస ఉంచుకోవాలి. సంగమయుగం యొక్క ఒక సెకను ఎంతో గొప్పది! మీ సమయం మరియు సంకల్పం రెండింటినీ సఫలం చేసుకోవాలి. ఏ కార్యం అయితే పెద్దవారు చేయలేరో అది చిన్నవారు చేయగలరు. ఇప్పుడైతే ఈ కార్యం కూడా మిగిలి ఉంది. ఇప్పటి వరకు పరుగు పెట్టారు. అది అయిపోయింది. కానీ ఇప్పుడు జంప్ చేయాలి. అప్పుడే లక్ష్యానికి చేరగలరు. సెకనులో చాలా విషయాలను పరివర్తన చేసుకోవడమే జంప్ చేయటం. ఇంత ధైర్యం ఉందా? ఏదైతే విన్నారో దానిని జీవితంలోకి తీసుకువచ్చి చూపించాలి. ఎవరితో స్నేహం ఉంటుందో వారి సమానంగా తయారవుతారు. కనుక బాప్ దాదా యొక్క గుణాలను స్వయంలో ధారణ చేయటమే స్నేహి ఆత్మల కర్తవ్యం. బాబాలో ఏదైతే శ్రేష్టత ఉందో దానిని మీలో ధారణ చేయాలి. అదే స్నేహం. ఒక విశేషతలో కూడా లోపం ఉండకూడదు. ఎప్పుడైతే సర్వగుణాలు మీలో ధారణ చేస్తారో అప్పుడే భవిష్యత్తులో సర్వగుణ సంపన్న దేవతగా అవుతారు. సర్వగుణ సంపన్నంగా అవుతాము అనే లక్ష్యం పెట్టుకోండి. బాబా గుణాలను ఎదురుగా ఉంచుకుని ఎంత వరకు ధారణ చేశాను అని పరిశీలించుకోండి. తక్కువ శాతం కూడా ఉండకూడదు. శాతం కూడా సంపూర్ణంగా ఉన్నప్పుడే అక్కడ కూడా సమీప సంబంధంలోకి వస్తారు. ఇప్పుడు ఆత్మనే చూడాలి, శరీరాన్ని చూసి చూసి అలసిపోయారు. అందువలన ఇప్పుడు ఆత్మనే చూడండి. శరీరాన్ని చూడటం ద్వారా ఏమి లభించింది? దు:ఖీగా అయ్యారు. ఇప్పుడు ఆత్మ, ఆత్మని చూస్తే మార్గం లభిస్తుంది. వీరులు కదా! వీరుల గుర్తు ఏమిటి? వారికి ఏ విషయం దాటడం కష్టం అనిపించదు. సమయం కూడా పట్టదు. వారి సమయం సేవలో తప్ప తమ విఘ్నాలు మొదలైనవి తొలగించుకోవటంలో పోదు. వారినే వీరులు అంటారు. మీ సమయం మీ విఘ్నాలలో కాదు, సేవలో ఉపయోగించాలి. ఇప్పుడు సమయం చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఈ లెక్కతో చూస్తే ఈ విషయాలన్నీ బాల్యం వంటివి. చిన్న పిల్లలు నాజూకుగా ఉంటారు. పెద్దవారు వీరులుగా ఉంటారు. కనుక పురుషార్థంలో చిన్నవారిగా ఉండకూడదు. వీరులుగా ఉండాలి. ఎటువంటి పరిస్థితి అయినా, ఏమైనా, వాయుముండలం ఎలాంటిది అయినా బలహీనం కాకూడదు. అలాంటి వారినే వీరులు అంటారు. శారీరక బలహీనత ఉంటే వాతావరణానికి, గాలికి ప్రభావితం అయపోతారు. అలాగే ఇక్కడ కూడా వాయుమండలం యొక్క ప్రభావం కూడా నాజూకుగా ఉండేవారిపై పడుతుంది. వాయుమండలం రచయిత కాదు రచన. రచయిత ఉన్నతమా? లేక రచన ఉన్నతమా? (రచయిత). మరి రచయిత రచనకి ఎందుకు అధీనం అయిపోతున్నారు? ఇప్పుడు వీరులుగా అయ్యే స్మృతి దినమును స్మృతిలో ఉంచుకోవాలి. ఈ స్మృతిని మరచిపోకూడదు. ఈ చిత్రం ద్వారా బాబాని చూడాలి. అటువంటి చిత్రంగా అయ్యి వెళ్ళండి. మీ సంపూర్ణత యొక్క చిత్రాన్ని చూపించాలి. ధైర్యం ఉంటే తప్పక సహాయం లభిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బలహీనత లేదు అని భావిస్తున్నారు. ఇప్పుడు పురుషార్ధంలో బలహీనత రాకూడదు. సంపూర్ణ హక్కు తీసుకోవడానికి సంపూర్ణ ఆహుతి అవ్వాలి. ఏదైనా యజ్ఞం రచిస్తే అది సంపూర్ణంగా ఎప్పుడు సఫలం అవుతుంది? తక్కువ ఆహుతి చేస్తే అది సఫలం కాదు. ఇక్కడ కూడా ప్రతీ ఒక్కరు ఆహుతి చేసానా? అని చూసుకోవాలి. కొద్దిగా ఆహుతి తక్కువైనా సంపూర్ణం సఫలత లభించదు. ఎంత చేస్తే అంత అనే లెక్క ఉంటుంది. లెక్క చేయటంలో బాబా ధర్మరాజు కూడా. ఆయన దగ్గర ఏ లెక్కా తేడా ఉండదు. అందువలన ఏదైతే ఆహుతి చేయాలో అది సంపూర్ణంగా చేయాలి. ఆ తర్వాత సంపూర్ణంగా తీసుకోవాలి. ఇవ్వటంలో సంపూర్ణత లేకపోతే తీసుకోవటంలో

కూడా సంపూర్ణత ఉండదు. ఎంత ఇస్తే అంతే తీసుకుంటారు. దేని ద్వారా సఫలత వస్తుందో తెలిసి కూడా సఫలం చేసుకోకపోతే ఏమౌతుంది? లోపం ఉండిపోతుంది. అందువలన ఎక్కడైనా కొద్దిగా కూడా మిగిలిపోలేదు కదా! అని సదా ధ్యాస ఉంచుకోండి. మనస్సులో, వాణిలో, కర్మలో కొంచెం కూడా ఎక్కడా లోపం ఉండకూడదు. ఏదైనా కార్యక్రమం సమాప్తి అయిపోతే ఆ రోజున నలువైపులా ఏమీ వదిలేయలేదు కదా అని చూస్తారు. అలాగే ఇప్పుడు కూడా సమాప్తి యొక్క సమయం. ఒకవేళ కొంచెం ఉండిపోయినా అక్కడే ఉండిపోతుంది. తర్వాత ఇక స్వీకరించబడదు. అప్పుడు దానిని సంపూర్ణ ఆహుతి అని అనరు. అందువలన ఇంత ధ్యాస ఉంచుకోవాలి. ఇప్పుడు లోపం ఉంచుకునే సమయం గడిచిపోయింది. ఇప్పుడు సమయం వేగంగా వస్తుంది. సమయం వేగంగా వెళ్ళిపోతున్నప్పుడు స్వయం డీలాగా ఉంటే ఏమౌతుంది? గమ్యానికి చేరుకోగలరా? సత్యయుగీ గమ్యానికి బదులు త్రేతాయుగంలోకి వెళ్ళిపోతారు. సమయం ఎలా అయితే వేగంగా పరుగు పెడుతుందో స్వయం కూడా అలా వేగంగా పరుగు పెట్టాలి. స్థూలంగా కూడా బస్సు దొరకాలంటే సమయాన్ని చూసుకుంటారు కదా! లేకపోతే ఆగిపోతారు. ఈ సమయం అయితే నడుస్తూనే ఉంటుంది. ఎవరి కోసం సమయం ఆగదు.

ఇప్పుడు బలహీనంగా నడిచే రోజులు వెళ్ళిపోయాయి. పరుగు పెట్టే రోజులు కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు హైజంప్ చేసే రోజులు. ఏ విషయంలో అయినా లోపం ఉంది అనిపిస్తే దానిని ఒక సెకనులో పరివర్తన చేసుకోవాలి. దీనినే జంప్ చేయటం అంటారు. ఇది చూడడానికి చాలా ఉన్నతంగా కనిపిస్తుంది. కానీ చాలా సహజం. కేవలం నిశ్చయం మరియు ధైర్యం కావాలి. నిశ్చయం ఉన్నవారికి కల్పపూర్వం కూడా విజయం లభించింది. ఇప్పుడు కూడా లభిస్తుంది. మిమ్మల్ని మీరు ఇంత గట్టిగా తయారుచేసుకోవాలి. సెకను సెకను మనసా, వాచా, కర్మణాని చూసుకోవాలి. బాప్ దాదాకి అయితే ఇది చూడటం కష్టమేమి కాదు. ఇప్పుడు చూడడానికి ఏ ఆధారం అవసరం లేదు. ఎక్కడి నుండి అయినా చూడగలరు. పాతవారికంటే క్రొత్తవారిలో మేము చేసి చూపిస్తాము అనే ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. అటువంటి విద్యార్థులు కూడా ఉంటారు. క్రొత్తవారే అద్భుతం చేయగలరు ఎందుకంటే వారికి సమయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సమయం, పరిస్థితుల సహయోగం ఉంది. ఇప్పుడు పురుషార్థం ఎలా చేయాలో పరిస్థితులు కూడా చూపిస్తున్నాయి. పరీక్షలు ప్రారంభం అయిపోతే పురుషార్థం చేయలేరు. ఇక అంతిమ పరీక్ష మొదలవుతుంది. పరీక్ష కంటే ముందుగానే చేరుకున్నారు. సరైన సమయానికి చేరుకున్నారు. ఇది కూడా మీ సౌభాగ్యంగా భావించాలి. పరీక్ష వ్రాసేటందుకు యోగ్యులయ్యారు. పరీక్ష మొదలైపోతే తలుపు మూసేస్తారు. మొదట్లో వచ్చిన వారికి వైరాగ్యం ఇప్పించేవారు, ఈ రోజుల్లో పరిస్థితులే వైర్యాగం ఇప్పిస్తున్నాయి. మీరు భూమిని తయారు చేయడానికి ఆలస్యం లేదు. జ్ఞానంపై నిశ్చయం అనే పక్కా బీజం వేశారు మరియు ఫలం తయారయిపోతుంది. ఇది ఎలాంటి బీజం అంటే చాలా తొందరగా ఫలాన్నిస్తుంది. ఈ బీజం చాలా శక్తిశాలి. కానీ దానిని పాలన చేయటం, సంభాళించటం మీ పని. బాబా సర్వశక్తివంతుడు కానీ పిల్లలకు సంకల్పాలను ఆపుకునే శక్తి కూడా లేదు. బాబా సృష్టిని మారుస్తున్నారు. కాని పిల్లలు స్వయాన్ని కూడా మార్చుకోవటం లేదు. బాబా ఏమిటి, మేము ఏమిటి అని ఆలోచిస్తే మీ గురించి మీకే సిగ్గు అనిపిస్తుంది. మీ నడవడికను పరివర్తనలోకి తీసుకురావాలి. వాణి ద్వారా ఇతరులు అంతగా అర్ధం చేసుకోలేరు. కానీ మీ పరివర్తన చూసి వారే అడుగుతారు. మిమ్మల్ని ఈ విధంగా తయారు చేసినవారు ఎవరు? అని. ఎవరైనా మారి చూపిస్తే అందరూ వారిని ఏమైంది, ఎలా చేసారు అని అడుగుతారు. అలాగే మీ నడవడికను చూసి వారే ఆకర్షితం అవుతారు. మీది కేవలం నిమిత్త సేవా కేంద్రం కానీ ముఖ్యకేంద్రం అయితే అందరిదీ ఒకటే, ఇలా బేహద్ దృష్టిలో ఉంటున్నారు కదా! ముఖ్యకేంద్రంతోనే అందరి సంబంధం ఉంటుంది.

ఆత్మలందరికీ ఒకనితోనే సంబంధం ఉండాలి. ఒకనితోనే సంబంధం ఉంటే స్థితి కూడా ఏకరసంగా ఉంటుంది. ఇంకా వేరే సంబంధం ఉంటే స్థితి ఏకరసంగా ఉండదు. అందువలన ఏకరస స్థితి తయారుచేసుకోవాలంటే కేవలం ఒకరిని తప్ప మిగిలినవి చూస్తూ కూడా చూడకండి. ఇప్పుడు మీరు ఏవైతే వస్తువులు చూస్తున్నారో అవి శాశ్వతమైనవి కాదు. మనతో అవినాశిగా ఉండేవారు బాబా ఒక్కరే, ఒకరి స్మృతిలోనే సర్వప్రాపులు లభిస్తాయి. సర్వులని స్మృతి చేస్తే ఏ ప్రాప్తి ఉండదు. అయితే ఏ వ్యాపారం మంచిది? చూసిన తర్వాత వ్యాపారం చేస్తారా లేక చెప్పటం ద్వారా చేస్తారా? మీకు ఈ తెలివి కూడా లభించింది కదా - మాయ సదాకాలికంగా వీడ్కోలు తీసుకోవడానికి కొద్ది సమయం ముఖం చూపిస్తుంది అని. ఇప్పుడు వీడ్కోలు తీసుకోవడానికి వస్తుంది, కానీ ఓడించడానికి కాదు. సెలవు తీసుకోవడానికి వస్తుంది. భయపడితే బలహీనత అని అంటారు, బలహీనత ద్వారా మరలా మాయ యుద్ధం చేస్తుంది. ఇప్పుడు శక్తి లభించింది కదా! సర్వశక్తివంతునితో సంబంధం ఉంటే ఆయన శక్తి ముందు మాయా శక్తి ఏమిటి? సర్వశక్తివంతుల పిల్లలం అనే నషా మర్చిపోకూడదు. మర్చిపోతేనే మరలా మాయ యుద్ధం చేస్తుంది. మూర్చితులుగా కాకూడదు. తెలివిగా ఉండేవారు తెలివిలో ఉంటారు. ఈ రోజుల్లో దొంగలు కూడా కొన్ని కొన్ని పదార్థాలతో మూర్చితులుగా చేస్తున్నారు. మాయ కూడా అలాగే చేస్తుంది. చతురంగా ఉండేవారు దీని పద్ధతి ఇది అని తెలుసుకుని ముందే జాగ్రత్తగా ఉంటారు. తమ తెలివిని పోగొట్టుకోరు. ఈ సంజీవని మూలికను సదా వెంట ఉంచుకోవాలి. వచ్చి కేవలం ఒక నెల అయినా కానీ చాలా ఎక్కువ, ఒక్క సెకనులో కూడా పరివర్తన కావచ్చు. మేము ఇప్పుడే వచ్చాం, క్రొత్తవాళ్ళం అని భావించకూడదు. ఇది సెకనులో చేసే వ్యాపారం. ఒక్క సెకనులో జన్మ సిద్ద అధికారం తీసుకోవచ్చు. అందువలన ఎదురుగా వచ్చినా ఒక్క సెకనులో మారిపోవాలి అనే లక్ష్యం పెట్టుకోండి. మొత్తం కల్పంలో ఇదే సమయం. ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు అనే మంత్రం జ్ఞాపకం ఉంచుకోండి. పాత సంస్కారాలు, ప్రవర్తన మారి ఈశ్వరీయ సంస్కారాలుగా అయిపోవాలి. ఏ పాత సంస్కారాలూ, అలవాట్లు ఉండకూడదు. మీ పరివర్తన ద్వారా అనేకమంది సంతుష్టం అవుతారు. మా నడవడిక ద్వారా ఎవరికీ దు:ఖం కలగకూడదు అని ప్రయత్నం చేయాలి. నా నడవడిక, సంకల్పం, వాక్కు, కర్మ సుఖదాయిగా ఉండాలి. ఇది బ్రాహ్మణ కులం యొక్క విధానం, ఆచారం. దూరం నుండే వీరు మనకి అతీతులు అని అర్థం చేసుకోవాలి. అతీతంగా మరియు ప్రియంగా ఉండాలి. ఇదే పురుషార్థం. ఇతరులని కూడా అలా తయారు చేయాలి. తయారవ్వాలి మరియు తయారు చేయాలి అనే లక్ష్యం ఉంచుకోండి. ఎవరు ఎంత తయారవుతారో అంత తయారు చేస్తారు. మీ జీవితంలో అలౌకికత వచ్చిందా? మిమ్మల్ని చూసి ఇతరులు వీరు అతీతమైనవారు అని అనుకుంటున్నారా? అని మిమ్మల్ని మీరు చూసుకోండి. బాబా స్మృతిని మర్చిపోతున్నారు అంటే బుద్ది ఎక్కడ ఉంటుంది? ఒకవైపు మర్చిపోతున్నారు అంటే రెండవవైపు తగులుకుని ఉంటుంది కదా!

అవ్యక్త స్థితి నుండి క్రిందకి వచ్చేస్తున్నాం అంటే ఏ వ్యక్తం వైపు బుద్ది వెళ్తుందని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఏదైనా కొద్దిగా మిగిలిపోతే అక్కడికి బుద్ధి వెళ్ళిపోతుంది. కొన్ని విషయాలు ఆకర్షించడం ద్వారా ఆకర్షితం అయిపోతాయి. గాలిపటాన్ని పైకి ఎగరవేయడానికి బలహీనంగా వదులుతారు. ఈ విధంగా ఆకర్షితం కాకుండా ఉండాలంటే బలహీనంగా వదలాలి. ఈ విఘ్నాలను తొలగించుకునే యుక్తి - సదా స్మృతి ఉంటే పురుషార్ధంలో బలహీనత రాదు. యుక్తులును మర్చిపోతే కనుక పురుషార్ధం కూడా బలహీనం అయిపోతుంది. ఒక్కొక్క విషయానికి ఎన్ని యుక్తులు లభిస్తున్నాయి? ప్రాప్తి ఎంత గొప్పది మరియు మార్గం ఎంత సరళమైనది. అనేక జన్మల నుండి పురుషార్ధం చేసినా ఎవరూ పొందలేరు. అటువంటి దానిని మీరు ఒక జన్మలో కొన్ని సెకనులలో పొందుతున్నారు. ఇంత సంతోషం ఉంటుంది కదా! “ ఇచ్చా మాత్రం అవిద్యా " స్థితిని పొందే పద్ధతి చెప్పాను. ఇంత ఉన్నతమైన జ్ఞానం మరియు ఎంత లోతైనది. మేమే దేవతగా ఉండేవాళ్ళం అని ఎప్పుడైనా ఆలోచించారా! జీవితంలో నేను దేవత అవుతాను అనే ఉన్నత లక్ష్యం ఎవరూ పెట్టుకోరు. మీరు ఆలోచించినది ఏమిటి మరియు తయారయ్యింది ఎలా? అడగకుండానే అమూల్యరత్నాలు లభిస్తున్నాయి. ఇలా మిమ్మల్ని మీరు పదమాపద భాగ్యశాలిగా భావిస్తున్నారా? ప్రెసిడెంట్ మొదలైనవారు కూడా మీ ముందు ఎవరు? ఇంత ఉన్నత దృష్టి, ఉన్నత స్వమానం స్మృతి ఉంటుందా లేక మర్చిపోతున్నారా? స్పృతి - విస్మృతి యొక్క మెట్లు ఎక్కుతూ - దిగుతూ ఉన్నారా! (స్మృతి మర్చిపోతున్నాం) మురికి నుండి దోమలు, పురుగులు వస్తాయి. అందువలన దానిని తొలగిస్తారు. అలా మీ బలహీనత ద్వారా మాయా పురుగు పట్టుకుంటుంది. బలహీనతను రానివ్వకండి. అప్పుడు మాయ రానే రాదు. సర్వశక్తివంతునితో మా సంబంధం ఉందని సదా స్మృతి ఉంచుకోండి. ఇక బలహీనత ఎందుకు? సర్వశక్తివంతుని బాబా పిల్లలైనప్పటికీ కూడా మాయా శక్తిని సమాప్తి చేయలేరా? నా తండ్రి సర్వశక్తివంతుడు అని సదా స్మృతి ఉంచుకోండి. మేము అందరికంటే శ్రేష్ట సూర్యవంశీయులం. మాపై మాయ యుద్ధం ఎలా చేయగలదు? మీ తండ్రిని, మీ వంశాన్ని స్మృతి ఉంచుకుంటే మాయ ఏమీ చేయలేదు. స్మృతి స్వరూపంగా అవ్వాలి. అన్ని జన్మల నుంచి విస్మృతిలో ఉన్నారు. అయినప్పటికీ విస్మృతి ఇష్టంగా అనిపిస్తుందా? 63 జన్మలు విస్మృతిలో మోసపోయారు. ఇప్పుడు ఒక జన్మ ఆ మోసం నుంచి రక్షించుకోవటం కష్టం అవుతుంది. ఒకవేళ మాటిమాటికి బలహీనం అవుతూ పరిశీలన చేసుకోకపోతే వారి స్వభావమే బలహీనత అయిపోతుంది. స్థితిని పరిశీలించుకుని స్వయాన్ని శక్తివంతులుగా చేసుకోవాలి. బలహీనతను మార్చుకుని శక్తిని తీసుకురావాలి.

ఇక్కడ కూర్చున్న వారందరూ మిమ్మల్ని మీరు సూర్యవంశీ సితారలుగా భావిస్తున్నారా? సూర్యవంశీ సితారల కర్తవ్యం ఏమిటి? సూర్యవంశీ సితారలు మాయకి ఆధీనం అవుతారా? అందరు మాయాజీత్ అయ్యారా? అయ్యారా లేక అవ్వాలా? మాయాజీత్ టైటిల్ ధారణ చేసారా? దంపతులలో కూడా ఒకరు మాయాజీత్ అయ్యాము అని చెప్తున్నారు. ఒకరు అవుతున్నాము అని చెప్తున్నారు. ఒకే చదువు, చదివించేవారు ఒకరే అయినప్పటికీ కొందరు విజయీ అయ్యారు, కొందరు అవుతున్నారు. ఈ తేడా ఎందువలన? ఇప్పటివరకు లోటు ఉంటే లోటు ఉన్నవారు త్రేతాయుగంలోకి వెళ్తారు. మరియు ఎవరైతే పురుషార్థులు అవుతారో వారు సత్యయుగంలోకి వెళ్తారు. మొదటి నుంచే పూర్తి అభ్యాసం ఉన్నవారికి ఆ అభ్యాసం వారికి సహాయం చేస్తుంది. ఒకవేళ అప్పుడప్పుడు స్మృతి, అప్పుడప్పుడు విస్మృతి యొక్క అభ్యాసం ఉంటే అంతిమ సమయంలో విస్మృతి వచ్చే అవకాశం ఉంది. ఏదైతే చాలా సమయం సంస్కారం ఉంటుందో అదే అంతిమ స్థితి అవుతుంది. లౌకికంగా ఎవరైనా శరీరం వదిలేస్తే, ఏదైనా సంస్కారం దృఢంగా ఉంటే తినటం, త్రాగటం, ధరించటం వాటిలో ఏ సంస్కారం ధృడంగా ఉంటుందో అంతిమం వరకు కూడా ఆ సంస్కారాలు ఉంటాయి. అందువలన ఇప్పటి నుండి స్మృతి సంస్కారాన్ని నింపుకోండి. అంతిమంలో విజయీ అవ్వటంలో అదే సహాయకారి అవుతుంది. విద్యార్థి చాలా సమయం నుంచి చదువు మంచిగా చదవకపోతే పరీక్ష సరిగా వ్రాయలేరు. చాలా సమయం యొక్క అభ్యాసం కావాలి. అందువలన ఇప్పుడు ఈ విస్మృతి మరియు ఓడిపోయే సంస్కారాలు తొలగిపోవాలి. ఇప్పుడు ఈ సమయం అయిపోయింది. ఎందుకంటే సాకారంలో సంపూర్ణత యొక్క ఋజువు చూసారు. ఇప్పుడు ఏమి చేస్తారు? సమయం యొక్క గంటలు మ్రోగాయి. గంటలు మ్రోగిన తర్వాత పురుషార్ధం చేస్తే ఏమౌతుంది? తయారవ్వగలరా? మొదట ఈల మ్రోగింది, రెండవది కూడా మ్రోగింది. మొదటి ఈల - సాకారంలో మమ్మాది మరియు రెండవ ఈల - బ్రహ్మాబాబాది. ఇప్పుడు మూడవ ఈల మ్రోగాలి. రెండు ఈలలు తయారవ్వటానికి, మూడవ ఈల ప్రయాణం అయిపోవటానికి. మూడవ ఈల తర్వాత ఎవరైనా ఉండిపోతే ఇక వారు ఉండిపోతారు. ఇంత కొద్ది సమయం ఉంది. కనుక ఇప్పుడు ఏమి చేయాలి? ఒకవేళ మూడవ ఈలకి సంస్కారాలని సర్దుకోవటం ప్రారంభిస్తే ఇక ఉండిపోతారు. పెట్టె, బెడ్డింగ్ ఏమిటో చెప్పాను కదా! వ్యర్థ సంకల్పాలు అనే బెడ్డింగ్ మరియు సమస్యలు అనే పెట్టె రెండింటిని సమాప్తి చేయాలి. రెండూ సర్దుకుని తయారయినప్పుడే వెళ్ళగలరు. ఒకవేళ కొంచెం ఉండిపోయినా బుద్ధియోగం తప్పక అటువైపు వెళ్తుంది. అప్పుడు ప్రయాణం చేయలేరు అనగా విజయీ కాలేరు. ఇప్పుడు ఏమి చేయాలి? ఎప్పుడో చేస్తాం అనే "ఎప్పుడో" అనే మాటను సమాప్తి చేయండి. “ఇప్పుడు" అనే మాటను ధారణ చేయండి. ఎప్పుడో చేస్తాము, నెమ్మది నెమ్మదిగా చేస్తాము .... ఇలా ఆలోచించేవారు దూరంగానే ఉండిపోతారు. అలాంటి సమయం ఇప్పుడు రానున్నది. అందువలన బాప్ దాదా చెపున్నారు. మరలా ఏ నింద చేయకండి. 7 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి అని చెప్పారు. కానీ దీనిని కూడా ఆధారంగా చేసుకోకూడదు. ఒకవేళ సమయం ఆధారంగా ఉంటే ఏ ప్రాప్తి రాదు. సమయానికి ముందే మారితే మీరు చేసిన దానికి ఫలం లభిస్తుంది. ఎవరు చేస్తే వారు పొందుతారు. సమయం ప్రకారం చేస్తే అది సమయం యొక్క అద్భుతం అయ్యింది. మీ శ్రమ చేయాలి. బాబాకి పిల్లలపై స్నేహం ఉంటుంది. కనుక స్నేహానికి గుర్తు సంపూర్ణంగా అవ్వటం, ఇప్పుడు నడుస్తున్నారు కానీ వేగాన్ని కూడా చూసుకోవాలి. ఇప్పుడు సంపూర్ణత యొక్క లక్ష్యం పెట్టుకోవాలి. అప్పుడే సంపూర్ణ రాజ్యంలోకి వస్తారు. ఏదైనా లోపం ఉండిపోతే సంపూర్ణ రాజ్యం పొందలేరు. ఎంత ఎక్కువ ప్రజలని తయారు చేస్తే అంత సమీపంగా వస్తారు. దూరంగా ఉంటే దూరం నుండే చూస్తారు. సమీపంగా ఉండే వారు ప్రతి కార్యంలో వెంట ఉంటారు నెంబర్ వన్ శక్తులా లేక పాండవులా? ఇతరులని ముందు పెట్టడం కూడా స్వయం ముందు ఉండటం, ముందుకి తీసుకువెళ్ళేవారికి పేరు వస్తుంది కదా! మధ్యమధ్యలో పరిశీలన కూడా కావాలి. ప్రతి కార్యం చేసే ముందు మరియు తర్వాత పరిశీలించుకుంటూ ఉండండి, కార్యం చేస్తున్నప్పుడు ఆ స్థితిలో ఉండి కార్యం చేస్తున్నానా అని? పరిశీలించుకోండి, మరలా మధ్యలో పరిశీలన చేసుకుంటూ ఉండండి. ఎంత సమయం స్మృతికి ఉంది అని. కార్యం చేసే ముందు పరిశీలన ద్వారా ఆ కార్యం కూడా సఫలం అవుతుంది, మరియు స్థితి కూడా ఏకరసంగా ఉంటుంది. కేవలం రాత్రి చార్జ్ పరిశీలించుకుంటే మొత్తం రోజంతా అలాగే గడిచిపోతుంది. కానీ ప్రతి కర్మలో ప్రతి గంట పరిశీలించుకోవాలి. అభ్యాసం అయితే ఆ అభ్యాసం అవినాశి అవుతుంది. దైర్యం పెట్టుకుంటే సహజం అవుతుంది. కష్టం అని ఆలోచిస్తే కష్టం అనిపిస్తుంది. మీ పురుషార్థాన్ని ఎప్పుడు వేగం చేసుకుంటారు? ఇప్పుడు సమయం ఎక్కడ ఉంది? మొత్తం కల్పం యొక్క అదృష్టం ఈ సెకనులోనే తయారు చేసుకోవాలి అనే ధ్యాస ఉంచుకుని నడవాలి. మొత్తం కల్పం యొక్క అదృష్టాన్ని తయారు చేసుకునే సమయం ఇదే. ఈ సమయాన్ని అమూల్యంగా భావించి ఉపయోగించండి. అప్పుడు సంపూర్ణం అవుతారు. ఒక సెకనులో కోట్ల సంపాదన చేసుకోవాలి. ఒక సెకను పోగొట్టుకున్నారు అంటే కోట్లు పోగొట్టుకున్నారు ఇంత ధ్యాస పెట్టుకుంటే విజయీ అవుతారు. ఒక సెకను కూడా వ్యర్ధంగా పోకూడదు. సంగమయుగం యొక్క ఒక సెకను కూడా చాలా గొప్పది. ఒక సెకనులో ఎలా ఉన్నవారు ఎలా కాగలరు. ఈ లెక్క ఉంచుకోవాలి. మంచిది.