05.03.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


అభిషేకం చేయటం అనగా ప్రతిజ్ఞ చేయటం.

ఈరోజు శివజయంతి జరుపుకోవటానికి పిలిపించారు. ఎలా జరుపుకోవాలని అనుకుంటున్నారు? కలుసుకొవటమే జరుపుకోవటం. బయటవారు కలుసుకోవడానికి జరుపుకున్నారు. కానీ పిల్లలైన మీరు కలుసుకోవటాన్నే జరుపుకోవటంగా భావిస్తున్నారు. కలుసుకున్నారు అంటే జరుపుకున్నారు. ఇప్పుడు ఇక ఏమి మిగిలి ఉంది? పిల్లలైన మీరు జరుపుకోవటం అంటే 1. కలుసుకోవటం 2. మీ సమానంగా తయారుచేయటం. అంటే కలుసుకోవటం మరియు తయారుచేయటం ఇదే జరుపుకోవటం. ఈ రోజు ఈ రెండు విషయాలు చేయాలి. కలయిక అయితే జరుపుకుంటూ ఉన్నారు. ఇక మీ సమానంగా ఇతరులను తయారుచేయాలి. ఈ రెండు విషయాలు చేయటమే శివజయంతి జరుపుకోవటం. భక్తులు అభిషేకం చేయించడానికి వస్తారు, మధ్యలో బ్రాహ్మణులు ఉంటారు. వారి ద్వారా చేయిస్తారు. అలాగే మీరు కూడా బ్రాహ్మణులు. ఎలాగైతే భక్తులు అభిషేకం చేయిస్తారో అలాగే పిల్లలైన మీరు ఆత్మలచే బాబాకు అభిషేకం చేయిస్తున్నారు. జలం లేదా పాలతో అభిషేకం చేసే పద్ధతి ఎందువలన తయారైంది? పాలతో లేదా నీటితో అభిషేకం చేసే సమయంలో మనస్సులో ఏ సంకల్పం చేస్తారో తెలుసా? అభిషేకం చేయటం అంటే - ఏదైనా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు చేతిలోకి జలం తీసుకుంటారు, సూర్యుని ముందు నీళ్లు వదులుతూ లోపల ప్రతిజ్ఞ చేస్తారు. అలాగే మీ దగ్గరకు కూడా ఎవరైనా వస్తే మొట్టమొదట వారికి ప్రతిజ్ఞ అనే నీటిని తీసుకోనివ్వండి. ఒక ప్రతిజ్ఞ చేయిస్తారు కదా - ఈరోజు నుండి మేము శివబాబా వారిగా అయ్యే ఉంటాం అని. ఇలా ముందుగా వారితో ప్రతిజ్ఞ చేయిస్తారు. అందువలనే బయటివారు కూడా లోపల ప్రతిజ్ఞ చేసుకుని స్వయం సన్ముఖంగా వచ్చి దేవతలకు అర్పణ అయిపోతారు. పూర్తిగా భక్తులైన వారు మొత్తం అర్పణ అయిపోవడానికి సిద్ధపడతారు. అంటే స్వయాన్ని అర్పితం చేసుకుంటారు. అదేవిధంగా మీరు కూడా మొదట వారితో ప్రతిజ్ఞ చేయిస్తారు, వారు పక్కా అయిపోయిన తర్వాత సంపూర్ణ స్వాహా చేయిస్తారు. అటువంటి సేవ చేయాలి. పూర్తిగా అర్పణ చేయించాలి. మీరు ఎంతమందిచే అర్పణ చేయించారు? ఎవరు ఎంత స్వయం అర్పణ అవుతారో అంతగానే ఇతరులను అర్పణ చేయించగలరు. స్వయమే సంపూర్ణ సమర్పణ కాకపోతే ఇతరులని కూడా అంతగానే మీ సమానంగా తయారు చేస్తారు. ఇప్పుడు బలిహారం అవ్వటంలో శ్రమ మరియు సమయం పడుతున్నాయి. కానీ కొంచెం సమయం తర్వాత బలిహారం అయిపోయే వారి వరుస ఉంటుంది. కత్తుల బావిలో దూకి చనిపోయే స్మృతిచిహ్నం ఉంది కదా! ఇష్టపూర్వకంగా చనిపోవడానికి తయారవుతారు. అలాగే ఇక్కడ కూడా తయారవుతారు. మీరు వారికి బలిహారం అవ్వమని కోరిక కలిగించవలసిన శ్రమ కూడా చేయక్కర్లేదు. తమకు తామే తమ ఇష్టంతో జంప్ చేయడానికి తయారవుతారు. ఇలా వరుసలో ఉంటారు. ఇప్పుడు ఈ వరుస లేదు. దీనికి కూడా కారణం ఉంది. పిల్లలకి ఇప్పుడు ఏ క్యూ లైన్ ఉంది? ఎప్పుడైతే ఈ క్యూ సమాప్తి అయిపోతుందో అప్పుడు ఆ క్యూ వస్తుంది. ఇప్పుడు మీకు ఏ క్యూ ఉందో తెలుసా? (సంకల్పాల క్యూ), సంకల్పాలలో కూడా ముఖ్యమైనవి ఏవి? వాటి వలనే పురుషార్ధంలో బలహీనత వస్తుంది. సంకల్పాలకి ముఖ్య కారణం ఏమిటి? పాత సంస్కారాలు ఏ రూపంలో వస్తాయి? వ్యర్థ సంకల్పాలకి బీజం ఏమిటో ఒక్క మాటలో చెప్పండి. వ్యర్ధసంకల్పాలు లేదా వికల్పాలు అనేవి ఒకే మాట వలన బుద్ధిలోకి వస్తాయి. ఇది ఎందుకు జరిగింది? ఈ ఎందుకు అనే దాని వలనే వ్యర్గసంకల్పాల క్యూ ప్రారంభం అవుతుంది. ఇంగ్లీషులో కూడా ఎందుకు? అని ప్రశ్నించే ప్రశ్నార్ధకం అన్నింటికంటే వంకరగా ఉంటుంది. ఎందుకు అనే వరుస చాలా పెద్దది. ఈ వరుసలో సమాప్తి అయిన తర్వాతే సంపూర్ణత వస్తుంది. తర్వాత ఆ క్యూ ఉంటుంది. ఎందుకు అనే మాట తొలగినప్పుడే డ్రామా యొక్క నిర్ణయంపై ఏకరసస్థితిలో ఉండగలరు. ఇప్పుడు ఎందుకు అనే వరుసని సమాప్తి చేయాలి, అర్థమైందా! ఎందుకు అనే ఒక్క మాట ద్వారా సంకల్పాలు ఉద్భవిస్తాయి? ఎందుకు అనే దాని ద్వారా కల్పన ప్రారంభమవుతుంది. బాబా కూడా పిల్లలతో ఈ విషయానికి నీళ్ళు వదిలించేటందుకు వచ్చారు. ఏదైనా ప్రతిజ్ఞ చేసేటప్పుడు ఆ నీటిని సాక్షిగా పెట్టి చేస్తారు. ఇప్పుడు ఈ విషయంలో నీళ్ళు వదలాలి.

మధువనంలో విశేష బాధ్యత పాండవ దళానిది. కనుక ఈ దళంలో ఇప్పుడు బలంగా ఉండాలి. పాండవ దళంలో బలం ఉంటే ఈ పాండవ భవనంలోకి అసురీ సంపద్రాయం వారే కాదు కానీ ఆసురీ సంకల్పాలు గల వారు కూడా రాలేరు. ఇంత కాపలా ఉండాలి. స్థూలంగా కాపలా ఉండటం సహజం. ఎలాగైతే స్థూల ద్వారం వద్ద రక్షణగా ఉంటున్నారో అలాగే మాయా ద్వారం నుండి కూడా సంభాళించుకోవాలి. ఆసురీ సంస్కారాలను, ఆసురీ సంకల్పాలని కూడా ఈ పాండవ భవనంలోకి రానివ్వకుండా ఉండేలా పాండవ సేన తయారుగా ఉన్నారా? ఎప్పుడైతే మొదట మీలో ఈ కాపలా గట్టిగా ఉంటుందో అప్పుడు పాండవ భవనంలో గట్టితనం తీసుకురాగలరు. ఇలా కాపలా కాస్తున్నారా? ఎవరెవరు మేము పాండవ భవనాన్ని ఇలా రక్షిస్తాము అని ధైర్యం పెట్టుకుంటున్నారు? పాండవులైన మీరు ఇంతగా రక్షిస్తే అప్పుడు పాండవ భవనం ఒక గారడీ ఇల్లులా అవుతుంది. ఎటువంటి ఆత్మ వచ్చినా కానీ వస్తూనే ఆసురీ సంస్కారాలను మరియు వ్యర్థ సంకల్పాల నుండి ముక్తి అవ్వాలి. ఇలా నిర్వికల్పంగా తయారు చేసే గారడీ ఇల్లు అవుతుంది. ఇటువంటి సేవ చేసినప్పుడే ప్రత్యక్షత అవుతుంది. ఒకరి నుండి ఒకరు విని ప్రజలు పరుగు పెట్టుకుంటూ వస్తారు. సమయం ముందుకు వెళ్ళే కొలదీ దు:ఖం, అశాంతి పెరుగుతాయి అందువలన ప్రతి ఆత్మ సుఖశాంతులకు దాహంతో ఉంటుంది. అలా దాహంతో అల్లాడుతున్న ఆత్మలు ఈ పాండవభవనంలోకి రాగానే సెకనులో సుఖ, శాంతి యొక్క అనుభవం చేసుకుంటారు. అప్పుడే ప్రభావం పడుతుంది. ఒకొక్కరు చైతన్యమూర్తి వలె దర్శనీయమూర్తులు అయిపోతారు. ఒకొక్క రత్నాన్ని దర్శించుకోవడానికి దూరదూరాల నుండి దాహంతో ఉన్న ఆత్మలు వస్తారు. కానీ అలాంటి కాపలా ప్రారంభించినప్పుడే ఇలా జరుగుతుంది. సంఘటనా బలం ఉంది, స్నేహం బలం ఉంది, .ఒకరికొకరి సహయోగ బలం కూడా ఉంది. ఇప్పుడు కేవలం మరో బలం కావాలి. ఆ బలం యొక్క లోపం కారణంగానే మాయ ప్రవేశిస్తుంది. అది సహనశీలత యొక్క బలం. సహనశీలతా బలం ఉంటే మాయ ఎప్పుడు యుద్ధం చేయలేదు. కనుక ఈ నాలుగు బలాలు కావాలి.

ఈరోజు బాప్ దాదా పుట్టినరోజుతో పాటు అందరి పుట్టినరోజు. ఈ రోజున ఈ నాలుగు బలాలను మీలో ధారణ చేస్తే అప్పుడు ఈ పాండవ భవనం మొత్తం ప్రపంచంలో చూడవలసిన మరియు అనుభవం చేసుకునే స్థానంగా లెక్కించబడుతుంది. ఈ పాండవ భవనం యొక్క గొప్పతనం మొత్తం విశ్వంలో ఉంటుంది. గొప్పతనం పెంచేవారు ఎవరు? పాండవసేన మరియు శక్తి సేన, మధువన నివాసీలే మధువనం యొక్క గొప్పతనం పెంచుతారు. పాండవులకి ప్రసిద్ధత ఉంది. వారు ప్రతిజ్ఞలో ఎప్పుడూ చలించరని. ఒక శాతం లోపంగా ఉన్నా దానిని లోపమే అంటారు. పాండవసేన ఉదాహరణగా అవ్వాలి. మిమ్మల్ని చూసి ఇతరులకి ప్రేరణ లభించాలి. ఎవరు మధువనానికి వచ్చినా ఈ విశేషతను చూడాలి - ఇంతమంది ఉన్నా కానీ వీరందరు ఒకటే మరియు ఒకని సంలగ్నతలో నిమగ్నం అయ్యేవారు మరియు ఏకరస స్థితిలో స్థితులై ఉన్నారు అని. ఇటువంటి దృశ్యం కనిపించినప్పుడే ప్రత్యక్షత జరిగే గుర్తులు కనిపిస్తాయి. మీ అందరి ప్రతిజ్ఞయే ప్రత్యక్షతని తీసుకువస్తుంది. కనుక ఈ రోజు ముందుగా ప్రతిజ్ఞ అనే నీటిని వదలాలి. ఆ తర్వాత బహుమతి కూడా లభిస్తుంది. ప్రతిజ్ఞకి మూడురేఖలు చూపిస్తారు. మారేడుదళం కూడా మూడు ఆకులు కలిసి ఉంటుంది. కనుక ఈ రోజు మూడు ప్రతిజ్ఞలు చేయించాను.

1.సహనశీలతా బలాన్ని మాలో ధారణ చేస్తాం. 2. ఎందుకు అనే వరుసని సమాప్తి చేస్తాం మరియు 3. ఆసురి సంస్కారాలకు కాపలా ఉంటాం. ఇలా మూడు ప్రతిజ్ఞలనే మారేడుదళాన్ని వేయాలి. భక్తులు ఆట ఆడతారు కానీ జ్ఞాన సహితంగా ఆట ఆడటం అనేది పిల్లలకే తెలుసు. అందువలనే ఈ రోజు శివరాత్రికి స్మృతి చిహ్నంగా భక్తిలో ఈ నియమరూపంలో ఉంటుంది. మొదట పిల్లలే జ్ఞానసహితంగా ప్రారంభిస్తారు, తర్వాత భక్తులు అంధశ్రద్ధతో కాపీ చేస్తారు. చేసినప్పుడే స్మృతిచిహ్నం తయారయ్యింది కదా! భక్తులు పిల్లలకి వందేమాతరం అంటారు. ఎంత తేడా వచ్చింది? ఇంత సంతోషం ఉంటుందా? ఏ తండ్రికి మనం అనేక నమస్కారాలు చేసామో ఆ తండ్రి వచ్చి వందేమాతరం అని చెప్తున్నారు. ఈ నషాకి గుర్తు ఏమిటి? వారి నయనాలు, ముఖం, నడవడిక, మాట అన్నీ సంతోషంతో ఉంటాయి. ఈ సంతోషం చూసి అనేకుల దు:ఖం తొలగిపోతుంది. ఏ మాతలకు అయితే బాబా వందనం చెప్తున్నారో ఆ మాతల గుర్తు సంతోషం. ముఖమే అనేక ఆత్మలని సంతోషం చేస్తుంది. అజ్ఞానీ ప్రజలు ఉదయం లేవగానే ఎవరి ముఖం అయినా చూస్తే వారి ముఖం చూడటం వలన ఇలా జరిగింది అంటారు. మీ హర్షిత ముఖం చూసి అందరికి సంతోషం వస్తుంది. ఇలా జరగనుంది. మంచిది. ఎంతగా మిమ్మల్ని మీరు చెకింగ్ చేసుకుంటారో అంత మార్పు వస్తూ ఉంటుంది. అడుగడుగులో సంకల్పము, కర్మ, సమయము, సంస్కారము ఈ నాల్గింటిని చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి రోజు ఎదో ఒక స్లోగన్ ముందు ఉంచుకుని దానిని ప్రాక్టికల్లోకి తీసుకురావాలి.