02.04.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సంపూర్ణ స్థితి యొక్క గుర్తులు.

అందరిలో వినాలనే సంకల్పం ఉంది. బాప్ దాదాలో ఏమి సంకల్పం ఉంది? బాప్ దాదా వినటం మరియు వినిపించడానికి అతీతంగా తీసుకువెళ్తున్నారు. ఒక్క సెకనులో మాటలకి అతీతం అవ్వటం వస్తుందా? ఎలా అయితే మాటలలోకి ఎంత సహజంగా మరియు త్వరగా వస్తున్నారో అదేవిధంగా మాటలకి అతీతంగా కూడా అంతే సహజంగా మరియు త్వరగా వెళ్ళగలుగుతున్నారా? మిమ్మల్ని ఏమని పిలుచుకుంటున్నారు? మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలు. ఇప్పుడు మాస్టర్ సర్వశక్తివాన్ నషా తక్కువగా ఉంటుంది. అందువలనే ఒక సెకనులో మాటలలోకి రావటం, ఒక సెకనులో మాటలకి అతీతంగా అవ్వటం ఈ శక్తి యొక్క ప్రత్యక్షమెరుపు ముఖంలో కనిపించడం లేదు. ఇప్పుడిప్పుడే మాటలలోకి రావాలి, ఇప్పుడిప్పుడే మాటలకి అతీతం అవ్వాలి. ఈ అభ్యాసం సహజంగా మరియు సరళంగా అయిపోయినప్పడే సంపూర్ణత వచ్చినట్లు భావించండి. సంపూర్ణ స్థితికి గుర్తు ఇదే. అప్పుడు పురుషార్ధం అంతా సరళం అయిపోతుంది. పురుషార్ధంలో అన్ని విషయాలు వచ్చేస్తాయి. స్మృతియాత్ర మరియు సేవ రెండూ పురుషార్ధంలోకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఈ రెండింటిలో సరళత అనుభవం అవుతుందో అప్పుడు సంపూర్ణ స్థితి రానున్నట్లు భావించండి. సంపూర్ణ స్థితి గల ఆత్మలు పురుషార్ధం తక్కువ చేస్తారు, సఫలత ఎక్కువ పొందుతారు. ఇప్పుడు పురుషార్ధం ఎక్కువ చేయవలసి వస్తుంది. పురుషార్ధం కంటే సఫలత తక్కువగా వస్తుంది. ఈరోజు బాప్ దాదా అందరి ముఖంలో ఒక విశేష విషయం పరిశీలిస్తున్నారు. ఏ విషయం పరిశీలిస్తున్నారో ఎవరికైనా టచ్ (గ్రహింపు) అవుతుందా? థాట్ రీడర్స్ (సంకల్పాలను గ్రహించేవారు) సంకల్పాలను గ్రహించగలుగుతున్నప్పుడు మాస్టర్ సర్వశక్తివంతుని ఆత్మలైన మీరు గ్రహించలేరా? ఇప్పుడు జరిగిన భట్టీ యొక్క పరీక్ష తీసుకోలేదు, ఈ పరీక్ష ఇస్తున్నాను. అందరు పాస్ అవుతారు కానీ 1. పాస్ అయ్యేవారు 2.పాస్ విత్ ఆనర్ అయ్యేవారు. పాండవసేన శక్తుల కంటే ముందు ఉంటున్నారు, కొంతమంది ముందు, కొంతమంది వెనుక ఉంటున్నారు. (గోపకులతో) మీరు శక్తులకు ముందు ఉంటున్నారా లేక వెనుక ఉంటున్నారా? ముందుకి పరుగు పెట్టాలనుకునే వారిని ఎవరూ ఆపలేరు. వారి విఘ్నాలే ఆపుతాయి. కానీ ఇక ఎవరు ఆపాలనుకున్నా ఆపలేరు. అలాగే పాండవులు వెనుక ఉండటమే ముందు ఉండటం. వెనుక ఎందుకు ఉంటారు? గార్డ్ వెనుక ఉంటారు కదా! మీరు వెనుక ఉండే గార్డులా లేక ముందు ఉండేవారా? ఏ స్థానం మంచిగా అనిపిస్తుంది? గార్డ్ (రక్షకుడు) వెనుక ఉంటారు, గైడ్ (మార్గదర్శి) ముందు ఉంటారు. గైడ్ అయితే ముందే ఉంటారు. కానీ పాండవులను గార్డుగా చేసి శక్తుల రక్షణ కొరకు నిమిత్తంగా చేశారు. పాండవులు వెనుక ఉండి శక్తులను ముందు పెట్టాలి. గైడ్ గా కాకూడదు, గార్డుగా కావాలి. పాండవులు గైడ్ గా అయితే అలజడి అయిపోతుంది.

అందువలనే పాండవ సేన గార్డ్ గా అవ్వాలి. మీరు ఏ పురుషార్థుల లైన్లో ఉన్నారు? పురుషార్థులకు ఎన్ని లైన్స్ తయారై ఉన్నాయి? ఇప్పుడు బాప్ దాదా అటువంటి మాస్టర్ సర్వశక్తివాన్‌గా తయారుచేసే చదువు చదివిస్తున్నారు. ఆ చదువు ద్వారా ఎవరి ముఖం ద్వారా అయినా వారి స్థితి మరియు సంకల్పం స్పష్టంగా అనుభవం అర్ధం చేసుకోగలం. సంశయం కూడా ఉండదు. స్పష్టంగా తెలుస్తుంది. చదువు యొక్క అంతిమ స్థితి ఇదే. సాకారంలో కూడా అంతిమంలో కొద్దిగా మెరుపు చూపించారు. సాకారంలో వెంట ఉన్నవారు ఇలాంటి కొన్ని విషయాలను గమనించారు. అలాంటి స్థితి పిల్లలందరికీ కూడా నెంబరువారీగా వస్తుంది. అలాంటి స్థితి తయారైనప్పుడు అంతిమ స్వరూపం మరియు భవిష్య స్వరూపం మీ అందరికి ముఖం ద్వారా అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పటి వరకు సాక్షాత్తు సాకార రూపం తయారవ్వదో అప్పటి వరకు సాక్షాత్కారం అవ్వదు. కనుక అతి సమీప రత్నాలు ఈ సబ్జక్టుపై ధ్యాస ఉంచాలి. ఎంత సమీపంగా వస్తారో అంత స్వయం కూడా స్పష్టంగా మరియు వారి ముందు ఇతరులు కూడా స్పష్టంగా కనిపిస్తారు. ఎంతెంత ఎవరి పురుషార్ధం స్పష్టం అవుతూ ఉంటుందో అంతంత వారి ప్రాలబ్దం కూడా స్పష్టం అవుతూ ఉంటుంది. మరియు ఇతరులు కూడా వారి ముందు స్పష్టం అవుతారు. స్పష్టం అంటే సంతుష్టం అవ్వటం. ఎంత సంతుష్టం అవుతారో అంత స్పష్టంగా అవుతారు. స్పష్టమైన పిల్లలను సాకారంలో ఏమనేవారు? సత్యత మరియు స్వచ్ఛత. ఎవరిలో స్వచ్చత మరియు సత్యత ఉంటుందో వారు సదా స్పష్టంగా ఉంటారు. స్వచ్ఛత ఉన్నప్పుడే అన్ని వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ పాఠం భట్టీలోని చివరి పాఠం. ఉదాహరణగా అవ్వటం అంటే ఇదే. ఎవరు ఏ విషయంలో అయినా ఉదాహరణగా అయితే దానికి ఫలంగా వారికి పరీక్షలో ఎక్కువ మార్కులు లభిస్తాయి.

కనుక నాలుగు సబ్జెక్టులపై విశేషంగా ధ్యాస పెట్టుకోవాలి. 1.స్మృతిశక్తి 2.స్నేహశక్తి 3.సహయోగశక్తి 4.సహనశక్తి. ఈ నాలుగు విషయాలు భట్టీ యొక్క విశేష విషయాలు. ఈ నాలుగు విషయాలలో బాప్ దాదా ఏమి ఫలితం చూసారు? ఫలితం హర్షించే విధంగానే ఉంది. అన్ని శక్తులు సమాన శాతంలో లేవు, తేడా ఉంది. నాలుగు శక్తులు ఉన్నాయి, కానీ నాలుగు సమానంగా ఉండాలి. సమానత యొక్క శాతంలో తేడా ఉంది. ఫలితం ఏమిటి? 75% పాస్ అయ్యారు, 25% లోపం ఉంది. కానీ అన్ని శక్తులు సమానంగా ఉండాలి. కొందరిలో ఒక శక్తి విశేషంగా ఉంది, కొందరిలో ఒక శక్తి విశేషంగా ఉంది. నాలుగు శక్తులు సమానంగా ఉన్నప్పుడే సంపూర్ణం అయినట్లు. (ఇప్పటి స్థితిలో శరీరం వదిలేస్తే భవిష్యత్తులో ఏమి ఫలం వస్తుంది?) ఎవరైతే ఇలాంటి పురుషార్థులు ఉంటారో వారు ధైర్యవంతులే కదా! బాప్ దాదా కూడా ప్రతిజ్ఞ చేశారు - ఎవరైతే ధైర్యంతో ఉంటారో ఆ పిల్లలకు సహాయం చేస్తాను. ఇలా ధైర్యం పెట్టుకుని నడిచే పిల్లలు అంతిమం వరకు అదే ధైర్యంతో ఉంటారు. కనుక అటువంటి పిల్లలకు సహాయం కూడా లభిస్తుంది. అందరి నుండి బుద్ధియోగం తొలగించి ఒకని స్మృతిలోనే ఉండే పురుషార్థీలు ఎవరైతే ఉంటారో వారికి బాబా సహాయం కారణంగా సహజం అయిపోతుంది. స్కాలర్ షిప్ లభిస్తుందా లేదా అనేది అంతిమం వరకు ధైర్యం పెట్టుకునే విషయంపై ఆధారపడి ఉంటుంది. ఎంత తక్కువ సమయం నుండి ధైర్యంతో నడుస్తూ ఉంటారో అంత చాలా సమయం బాబాతో సంబంధం తెగని కారణంగా గమ్యాన్ని చేరుకోగలరు. ఒకవేళ ఇప్పుడు కారణంగా అయినా, అకారణంగా అయినా ధైర్యం యొక్క లింక్ తెగిపోతే స్కాలర్ షిప్ తీసుకోవటం కష్టం అవుతుంది. చాలా సమయం అనగా అంతిమం వరకు బాబాతో సంబంధం ఉంటే అదనపు సహాయం లభిస్తుంది. అందువలనే ఇప్పుడు ఈ చివరి పాఠాన్నే పక్కా చేయిస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం ఫలితంలో ఏమి చూసారు? సేవలో ఇన్చార్జ్ అవ్వటం వస్తుంది. కానీ స్మృతిలో బ్యాటరీ చార్జ్ చేసుకోవటం తక్కువగా వస్తుంది. అర్థమైందా! సాకారరూపంలో అనుభవం చూసారు కదా! సాకారబాబాకి సేవా బాధ్యత అందరికంటే ఎక్కువ ఉండేది. పిల్లలకి బాబా కంటే ఎంత తక్కువ బాధ్యత ఉంది. పిల్లలకు కేవలం సేవా బాధ్యత ఒకటే ఉంది. కానీ సాకారబాబాకి అన్ని బాధ్యతలు ఉండేవి. సంకల్పాల సాగరంగా ఉండేవారు. బాధ్యతల సంకల్పాలలో ఉండేవారు. కానీ సాగరం యొక్క అలలలో ఉన్నట్లు కనిపించేవారా లేక లోతులలో ఉన్నట్లు కనిపించేవారా? పిల్లలకు అలలలో తేలియాడటం వస్తుంది, కానీ లోతులోకి వెళ్ళటం రావటం లేదు. దీనికి సహజ సాధనం ఇంతకు ముందే చెప్పాను - అభ్యాసం చేయండి. ఇప్పుడిప్పుడే ధ్వనిలోకి రావాలి మరియు ఇప్పుడిప్పుడే మాస్టర్ సర్వశక్తివంతులై ధ్వనికి అతీతం అవ్వాలి. ఇప్పుడిప్పుడే దీని యొక్క అభ్యాసం చేయండి. ఎంత కార్యవ్యవహారాలు ఉన్నా కానీ మధ్యమధ్యలో ఒక సెకను అయినా తీసి దీనిని ఎంతగా అభ్యాసం చేస్తూ ఉంటారో అంతగా ప్రత్యక్షరూపం తయారవుతుంది. అభ్యాసం తక్కువగా ఉన్న కారణంగానే ప్రత్యక్షరూపం కూడా తక్కువగా కనిపిస్తుంది. అప్పుడప్పుడు సాగరం యొక్క అలలలోకి, అప్పుడప్పుడు సాగరం యొక్క లోతులోకి వెళ్ళే అభ్యాసం చేయండి. ఈరోజు విశేషంగా ఇదే విషయం పరిశీలన చేస్తున్నారు - పిల్లలలో ఎంత సాహసం ఉందో అంత సహనశక్తి ఉందా? సాహసం ఎంత ఉంది, మరియు సహనశక్తి ఎంత ఉంది అనేది చూస్తున్నారు. ఎంతెంత స్వయం పురుషార్ధంలో సంతుష్టంగా, స్పష్టంగా ఉంటారో అంత వారి ముందు స్పష్టంగా కనిపిస్తారు. ఇప్పుడు పరీక్ష అయిపోయింది, ఫలితం కూడా వినిపించాను. ఇక పాండవుల విషయం మిగిలిపోయింది. బాప్ దాదా దగ్గర పురుషార్థీల వరుసలు ఎన్ని ఉన్నాయి? ఇతరులను చూడకుండా మీ లైన్ చూసుకుంటూ ఉన్నారా లేక లైన్ కూడా చూడకుండా మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా?

1. తీవ్రపురుషార్థుల యొక్క వరుస 2. పురుషార్థీల యొక్క వరుస 3. గుప్త పురుషార్థీల యొక్క వరుస 4. బలహీన పురుషార్థుల యొక్క వరుస. ఇప్పుడు చెప్పండి మీరు ఏ వరుసలో ఉన్నారు? మీకే తెలుసు బాబా అనే మాట మాట్లాడవలసిన అవసరం ఉండదు. మా అందరికీ తెలుసు అనే సమయం కూడా త్వరలో రానున్నది. ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివంతులు కదా! సర్వ శక్తులు సమానంగా అయిపోతాయి. మాస్టర్ సర్వశక్తివంతులు అయిపోతారు. బాబాకి ఇంత నిశ్చయం ఉంది. నిశ్చయబుద్ధిగా ఉన్నవారికి విజయం లభించే తీరుతుంది. బాబా మరియు స్వయం నిశ్చయబుద్ధి అయితే ఇక విజయం ఎక్కడికి వెళ్తుంది? నిశ్చయబుద్ధి వెనుకే విజయం వస్తుంది. వారు విజయం వెనుక పరుగు పెట్టరు, విజయం వారి వెనుక పరుగు పెడుతుంది. మేము విజయీగా అయ్యాం అనే సంకల్పాన్ని కూడా వారు త్యాగం చేస్తారు. అలాంటి సర్వస్వత్యాగులుగా ఉంటారు. సర్వస్వత్యాగిగా మరియు సర్వ సంకల్పాల త్యాగిగా ఉంటారు. కేవలం సర్వ సంబంధాల త్యాగమే కాదు, సర్వ సంకల్పాల ద్వారా కూడా త్యాగి అవ్వాలి - ఇదే సంపూర్ణస్థితి.