18.06.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


వృద్ధి కొరకు దినచర్య యొక్క విధి

బాప్ దాదా ఒక్క సెకండులో అవ్యక్తము నుండి వ్యక్తములోనికి వచ్చారు. ఇలాగే పిల్లలు కూడా ఒక్క సెకండులోనే వ్యక్తము నుండి అవ్యక్తములోకి రాగలరా? అవసరమున్నప్పుడే నోటి ద్వారా మాట్లాడాలి. అవసరము లేనప్పుడు మౌనముగా ఉండాలి. బుద్ధిని కూడా అవసరము ఉన్నప్పుడే ఉపయోగించాలి లేదంటే ఉపయోగించరాదు. అలాంటి అభ్యాసము కలిగియున్నామని స్వయమును తెలుసుకొనుచున్నారా? నోటియొక్క అభ్యాసము స్థూలముగా ఉన్నది. బుద్ది సూక్ష్మమైనది. నోటి వలె బుద్ధిని కూడా అవసరమైనప్పుడు ఉపయోగించు అభ్యాసమున్నదా? అభ్యాసము స్థిరముగా ఉన్నయెడల మీ స్థితిని కూడా స్థిరముగా, శక్తిశాలిగా తయారుచేసుకొనగలరు. ఇదే మీ స్థితిని అభివృద్ధి చేసుకొను విధానము. విధానము ద్వారానే వృద్ధియవుతుంది. ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి వృద్ధిని మరియు విధానమును రెండింటిని చూస్తున్నారు, బాబా ఏ దృశ్యమును చూస్తుండవచ్చునో చెప్పండి. ఉన్నతిగా తయారవుతున్నామా? అని స్వయాన్ని పరిశీలన చేసుకోండి. చాలా మంది తమ వృద్ది ద్వారా సంతుష్టులుగా ఉన్నారు. పూర్తి దినములో అవ్యక్త స్థితి ఎంత సమయము ఉంటుంది? బిందు రూపము గురించి అడుగుటలేదు. అవ్యక్తస్థితి ఎంత సమయముంటుంది? బాప్ దాదా సంపూర్ణ స్థితిని ఎదురుగా ఉంచుకొని అడుగుచున్నారు. మీరు మీ యొక్క క్రితములోని పురుషార్ధమును ఎదురుగా ఉంచుకొని ఆలోచిస్తున్నారా? ఎంత వ్యత్యాసమున్నది? వర్తమాన సమయములో చదువు యొక్క ముఖ్యమైన సబ్జెక్టు ఏమిటి? సాధ్యమైనంత ఎక్కువగా అవ్యక్త స్థితిని తయారుచేసుకోవాలి. ముఖ్యమైన సబ్జెక్టులో ఫలితము చాలా తక్కువగా ఉన్నది. నిరంతరము స్మృతిలో ఉండు సంపూర్ణస్థితి ముందు రెండు గంటలు ఎంత? ఇంతకంటే ఎక్కువగా మీ యొక్క అవ్యక్త స్థితిని తయారుచేసుకొను విధి బుద్ధిలో ఉన్నదా? ఒకవేళ బుద్ధిలో ఉన్నచో వృద్ధి ఎందువలన లేదు? కారణము ఏమిటి? విధి, విధానము యొక్క జ్ఞానము పూర్తిగా బుద్ధిలో స్పష్టముగా ఉన్నది, కానీ ఒక విషయము లేని కారణము వలన విధానము తెలిసి కూడా వృద్ధి కాలేదు. ఆ విషయమేమిటి? మంచిది వృద్ధి ఎలా అవుతుంది అను దాని పైన వినిపిస్తాము. ఆ ఒక్క విషయము ఏమిటనగా విస్తారము చేయుట మరియు విస్తారములో వెళ్లుట. కానీ అవసరముననుసరించి విస్తారమును సమీకరణ చేసుకోవాలి మరియు ఇముడ్చుకోవాలి. ఇది ఆచరణలో తక్కువగా ఉన్నది. జ్ఞానములో విస్తారముగా వెళ్లుట తెలుసుకున్నారు. కానీ జ్ఞానము యొక్క విస్తారమును ఇముడ్చుకొని జ్ఞాన స్వరూపముగా బీజ రూపముగా తయారగు ఈ అభ్యాసము ఇంకా తక్కువగా ఉన్నది. విస్తారములో వెళ్ళుట వలన చాలా సమయము వ్యర్థమవుతుంది. మరియు సంకల్పములు కుడా వ్యర్థమవుతాయి. అందువలన శక్తి ఎంత జమా కావలెనో అంత జమా కావడము లేదు. దీని కొరకు ఏమి ప్లాను చేయవలెనని ఈరోజు వినిపిస్తాము. ఈ విషయములో అందరికంటే గొప్పవారెవరు? మీరు బ్రాహ్మణులే అందరికంటే గొప్పవారు. ఏమిచేస్తారు? ఏ సాధనను ఉపయోగించుట వలన వారు పెద్ద కార్యములలో కూడా సఫలతను పొందుచున్నారు? వారు మొదట తమ సమయమును వ్యర్థము కాకుండా రక్షించుకుంటారు. వారు తమ టైంటేబుల్ ను తయారుచేసుకుంటారు. చాలా బిజీగా ఉండువారు ప్రతి గంటకు టైంటేబుల్ ను తయారుచేసుకుంటారు. టైంటేబుల్ లేనిచో సమయమును సఫలము చేసుకొనలేరు. కార్యము కూడా సఫలత కాదు. అందువలన ఇప్పటి గొప్ప వ్యక్తులైన మీరు ప్రతి సమయము యొక్క టైంటేబుల్ ను తయారు చేసుకున్నారా? ఇది కూడా ఒక విధానము అయినది. వారు ఉదయమే టైంటేబుల్ ను తయారుచేసుకున్నట్లు మీరు అమృతవేళ నుండి ప్రతిరోజూ ఏమి చేయాలని టైంటేబుల్ ను తయారుచేసుకోవాలి. శారీరక కార్యక్రమములకు టైంటేబుల్ ను తయారుచేసుకునట్లు, ఆత్మ యొక్క ఉన్నతికి టైంటేబుల్ ను తయారుచేసుకోవాలి. తెలిసినదా? దీనిలో గమనముంచుట మరియు పరిశీలన చేయుట తక్కువగా ఉన్నది. వారు ఈరోజు ఎన్ని కార్యములు పూర్తిచేయాలని ప్రణాళికను తయారు చేసుకున్నట్లు మీరు ఈరోజు స్థితి ఎంత శాతము మరియు ఎంత సమయము ఉండాలి అని ప్లాను తయారుచేసుకోండి. సమయమును అనుసరించి చేయుట వలన ఒకే దినములో అనేక కార్యములు చేయగలరు. అందువలన మీ యొక్క డైరీని తయారుచేసుకోండి. ఒక గంట యొక్క స్థూలకార్యమును తయారుచేసుకున్నట్లు ఆత్మ ఉన్నతి యొక్క కార్యమును నోట్ చేసుకోండి. స్థూలకార్యములు సమాప్తియైన తరువాత రైట్ అని టిక్ వేసినట్టు కార్యము సమాప్తమైన తరువాత ప్లాన్ ఎంతవరకు ఆచరణలోనికి వచ్చినదని పరిశీలన చేసుకోండి. ఆచరణలోకి తీసుకొని రానిచో దానికి కారణము మరియు నివారణకు సాధనమును గురించి అలోచించి ముందుకు సాగుతూ వెళ్ళండి. ఈరోజు తప్పకుండా కార్యమును చేయుదును అని స్వయములో ప్రతిజ్ఞ చేయండి. ఏదైనా కార్యమునకు ముందు ప్రతిజ్ఞ చేసి తరువాత ప్రణాళికను చేయుదురు. తరువాత కార్యము సఫలత అయినదా? లేదా? అని పరిశీలన చేసుకుంటారు. పరిశీలన తరువాత జరిగి పోయిందేదో జరిగిపోయినది. ఇక ముందు ఉన్నతి యొక్క సాధనములను చేసుకుంటారు. మీరు క్రొత్త విద్యార్థుల కొరకు వారము రోజుల పాఠముల యొక్క కార్యమును తయారుచేసారు కదా? ఈ విధముగానే ఆత్మ ఉన్నతికి ప్రణాళికను తయారుచేయవచ్చును. మధువనమునకు వచ్చినప్పుడు కొంత వదిలి వెళతారు, కొంత తీసుకుని వెళతారు. ఈవిధముగానే ప్రతి దినము కొంత వదలండి కొంత ధారణచేయండి నింపుకోండి. ఇంత గమనముంచినచో సమయమునకు ముందే సంపూర్ణముగా తయారు కాగలరు. సమయమును అనుసరించి ఒకవేళ సంపూర్ణముగా తయారు అయినచో ఇంత ప్రాప్తి ఉండదు. సమయమునకు ముందే సంపూర్ణముగా తయారు కావాలి. సంపూర్ణత అంటే ఏమిటి? దాని యొక్క అనుభవమును ఎప్పుడు చేయుదురు? ఈశ్వరీయ అతీంద్రియ సుఖము సదా ఎలా ఉంటుందని ఇక్కడనే అనుభవము చేయాలి. నియమమును అనుసరించి మీ యొక్క టైం టేబుల్ ను లేక సామూహిక కార్యక్రమములు ఎలా తయారు చేయుదురో ఇప్పుడు చూసెదము. అందరికంటే తెలివైనవారు బ్రాహ్మణులు. దేవతల కంటే కూడా బ్రాహ్మణులు తెలివైనవారు. మీరు ఎంత తెలివైనవారో పరిశీలన చేయుదుము. తెలివితో పాటు సారమును తీసుకొనుట నేర్చుకోవాలి. కొందరిలో వివేకము చాలా ఉన్నది కానీ సారాంశములో ఉండుట రాదు. రెండు అభ్యాసము చేయాలి. మీరు కూడా స్వభావములకు చికిత్స చేయువారు. పురుషార్థము సరిగా చేయలేక స్వభావ, సంస్కారముల పైన దోషము వేయుదురు. స్వభావముపై దోషము వేసి స్వయం తేలికవుతారు. మీ యొక్క కర్తవ్యమేమనగా స్వభావములను సరిచేయుట. లౌకికములో ప్రకృతి చికిత్స చేయువారు పత్యము ఉంచెదరు. మీరు ఇప్పుడు ఏమిచేయాలి? ఫాస్ట్ (వేగముగా) వెళ్ళాలి. వేగముగా వెళ్ళుటకు నియమములను తయారుచేసుకోవాలి. ఎలాంటి నియమములను తయారుచేసుకోవాలి. ఈరోజు ఫలానా నియమమును పాటించాలని ప్రతిజ్ఞ చేయండి. లౌకికములోని వారు నియమము లేక పత్యమున్నట్లు మీరు కూడా ప్రతిరోజు ఏదో ఒక లోపమును నోట్ చేసుకోండి. పురుషార్థములో నష్టమును కలిగించు విషయములను బట్టి నియమములను తయారుచేసుకోండి. తరువాత వాటిని పరిశీలన కూడా చేసుకోండి. చాలామంది వ్రతములు చేయుదురు, ఉపవాసములు చేయుదురు కానీ వారు మధ్యలోనే వదిలివేస్తారు పూర్తి చేయలేరు. ఇక్కడ కూడా ఆవిధముగా భక్తి మార్గపు అలవాటు ఉన్న వారున్నారు. ఉదయము ప్రతిజ్ఞ చేస్తారు తరువాత ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు సమస్యలు సమాప్తమైన తరువాత చేస్తామంటారు. ఇప్పుడు ఇలాంటి సంస్కారములను సమాప్తము చేయాలి. సర్దుకొనుట మరియు ఇముడ్చుకొనుట నేర్చుకోవాలి. పాత సంస్కారములను ఇముడ్చుకోవాలి. ప్రతిజ్ఞ చేసిన దానిని పాటించాలి. పెద్దవారి కార్యక్రమములు ముందే నిర్ణయించబడతాయి కదా! మీరందరు అందరికంటే గొప్పవారు కదా! మీరు కూడా కార్యక్రమములను ముందే నిర్ణయించుకోవాలి. ఫలాన కార్యము తప్పకుండా చేస్తాను. ఫలాన విధముగా తయారై తీరుతాను అని ఇంత నిశ్చయమున్న యెడల తప్పని సరిగా విజయులుగా తయారవుతారు. బాబా పైన నిశ్చయమున్నది, స్వయంలో కూడా నిశ్చయముంచుకొని కార్యములను చేసిన యెడల తరువాత విజయమే విజయముగా తయారవుతారు. విజయమునకు ముందు సమస్యలు ఏమి చేయలేవు. ఆ సమస్యలు సమస్యలుగా కాక ఒక ఆటగా అనిపిస్తాయి. ఆట అంటే సంతోషమే కదా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇది చాలా సహజమైన పని అని మీరు అంటారు కదా! ఇది కూడా బుద్ధి యొక్క ఆట అయినది. ఆటలో భయముండదు కదా! మీరు చాలా గొప్పవారు అయితే మీ స్థితి కూడా చాలా గొప్పగా ఉండాలి. మీరు గొప్ప కార్యములను చేసి చూపించాలి. తక్కువంటే 8 గంటలు అవ్యక్తస్థితిలో ఉండు లక్షణముంచుకోవాలి, 8 గంటలు అవ్యక్త స్థితిలో ఉండుట గొప్ప విషయముకాదు. అవ్యక్తబాబాను స్మృతి చేయుట అంటే అవ్యక్త స్థితిలో ఉండుట. రెండు గంటలు బాబా స్మృతి చేస్తే మిగతా సమయమంతా ఏమి చేశారు? బాబాతో స్నేహీలుగా ఉన్నారా? లేక మాయతో స్నేహీలుగా ఉన్నారా? ఎలాంటి వారితో స్నేహము చేస్తారో అలాంటి సంస్కారవంతులుగానే తప్పకుండా తయారవుతారు. సంపర్కము యొక్క ఆధారములోనే సంస్కారములు వస్తాయి. ఒకవేళ బాబాతో స్నేహముగా ఉంటూ, బాబా సంపర్కములో ఉంటే బాబా వలే సంస్కారవంతులుగా ఎందుకు తయారుకాలేదు, 2 గంటలు బాబా స్మృతిలో ఉంటూ, 22 గంటలు మాయతో స్నేహముగా ఉంటే ఏమి చెప్పాలి? సర్వీసు చేయుచున్నను స్నేహమును, సంపర్కమును వదలరాదు. సంపూర్ణ స్థితిని సమీపముగా ఉంచుకోవాలి. పాట ఉన్నది కదా "వారు మానుండి వేరు కాలేరు" అని, దూరమే కానప్పుడు మనస్సు నుండి స్నేహము ఎలా తొలగిపోతుంది? నిరంతరము ఉండాలి కదా! కానీ మీరు పురుషార్థులైన కారణము వలన ఇంకా అవకాశమిస్తున్నాను. అందువలన కనీసము 8 గంటలు స్మృతి యొక్క లక్ష్యముంచుకొని డైరీని తయారుచేసుకోండి. తరువాత వచ్చు ఫలితమును రిజల్ట్ ను కూడా చూస్తాము. టైంటేబుల్ ను తయారుచేసుకోండి తరువాత ప్రతి వారము దానిని పరిశీలన చేసుకోండి. అప్పుడు ఫలితము ఎలా ఉన్నది తెలుస్తుంది. ఫలితముననుసరించి ఇంకా ఉన్నతికి ప్లాను కూడా తయారుచేసుకోవాలి.

ఇప్పుడు నిర్లక్ష్యముగా ఉండు సమయముకాదు. చాలా సమయము నిర్లక్ష్యముగా పురుషార్థము చేసారు. ఇప్పుడు నిర్లక్ష్యముగా ఉండు సమయముకాదు. గడిచిపోయిన దానిని వదిలేయండి "ఇప్పుడు లేకున్న ఇంక ఎప్పుడూ లేదు", "ఇప్పుడు చేయలేదంటే ఇంకెప్పుడూ చేయలేము" అను ఈ స్లోగన్ సదా స్మృతిలో ఉంచుకోండి. ఇప్పుడు చేయకున్న మరి ఎప్పుడు చేయలేరు. "నేను ఎలాంటి కర్మలు చేయుదునో నన్ను చూసి ఇతరులు చేయుదురు", "సఫలత మా యొక్క జన్మసిద్ధ అధికారము", "మరణమైన స్వీకరిస్తాము కాని తొలగిపోము" అని ఈ విధముగా రోజు ఏదో ఒక స్లోగన్ ఆచరణలోకి తీసుకోండి. తరువాత చూడండి అవ్యక్త స్థితి ఎంత త్వరగా తయారవుతుందో? సూక్ష్మ దేవతలను భూమి ఎప్పుడు ఆకర్షించలేదు. వస్తారు కార్యమును సమాప్తము చేసుకొని వెంటనే వెళ్ళిపోతారు. మీరు కూడా కార్యము కొరకు వ్యక్త దేహమును ఆధారము తీసుకున్నారు. కార్యము సమాప్తమైన వెంటనే తిరిగి అవ్యక్తమగు ఈ అభ్యాసమున్నచో అలాంటి వారిని సూక్ష్మదేవతలని పిలువబడతారు.

స్వయాన్ని సాక్షాత్కారమూర్తులని తెలుసుకొనుచున్నారా? భక్తులు విగ్రహముల దగ్గరకు ఎందుకు వెళ్లుచున్నారు? వారి యొక్క మనసులోని కోరికలను పూర్తి చేసుకొనుటకు. ఏ ఆత్మలోని కోరికలనైనా పూర్తి చేయగలిగిన సాక్షాత్కారమూర్తులుగా మీరు తయారైనారా? అల్పకాలిక కోరికలు కాదు సదా కాలము యొక్క కోరికలను కూడా పూర్తిచేయగలరా? కామధేనువు అనగా సర్వుల యొక్క మనోకామనలను పూర్తిచేయువారు. స్వయంలోని సర్వ కోరికలను పూర్తి చేసుకొని యుండువారే ఇతరుల యొక్క కోరికలను పూర్తి చేయగలరు. మేము అందరి యొక్క మనోకామనలను తీర్చునట్టి మూర్తులుగా కావలెనది సదా లక్ష్యముంచుకోండి. సర్వుల కోరికలను తీర్చువారు సదా ఇచ్చామాత్రం అవిద్యాగా ఉంటారు. అంటే స్వయములో ఎలాంటి కోరికలు లేకుండా ఉంటారు. ప్రాప్తిస్వరూపులే ఇతరులకు ప్రాప్తిని కలిగించగలరు. సదా మీరు స్వయాన్ని దాత, మహాదాత అని తెలుసుకోండి. మహాజ్ఞానీ తరువాత మహాదాని యొక్క కర్తవ్యము చేయాలి. మీ ద్వారా సాక్షాత్కారములు కావాలి. ఏవిధముగా సాక్షాత్కారమూర్తికి ఎదురుగా వచ్చినప్పుడు వారివారి మనోభావనల అనుసారముగా సాక్షాత్కారము లేక అనుభవములవుతూ ఉంటాయి. అదే విధముగా మీ ద్వారా కూడా సాక్షాత్కారములు జరుగుతాయి. అలాంటి దర్శనీయమూర్తులుగా, సాక్షాత్కారమూర్తులుగా ఎప్పుడు తయారవుతారు? ఎవరు ఎదురుగా వచ్చినను శరీరము కనిపించకూడదు. సూక్ష్మవతనములోని ప్రకాశమయ స్వరూపము కనిపించాలి. కేవలము మస్తకములోనే ప్రకాశము కాదు పూర్తి శరీరము ద్వారా ప్రకాశముయొక్క సాక్షాత్కారము కావాలి. మంచిది.

పార్టీలతో:- బాబా చెప్పుచున్నారు మనస్సు స్వచ్ఛముగా ఉండాలి. స్వచ్ఛమైన మనస్సు కలవారి యొక్క కోరికలు స్వతహాగానే పూర్తి అవుతూ ఉంటాయి. స్వచ్ఛముగా, స్పష్టముగా ఉండువారి ప్రతి సంకల్పములు సఫలమవుతూ ఉంటాయి. ఒకవేళ వ్యర్థ సంకల్పముల యొక్క చెత్తను పోగు చేసుకుంటూ ఉన్నయెడల మాయకు ఇంకా వ్యర్థ సంకల్పములను తీసుకోనువచ్చు అవకాశమును కల్పించినట్టు అవుతుంది. మురికిలో ఎలాంటి ప్రయత్నము చేయకుండానే కీటకములు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అదేవిధముగా ఏదైనా వ్యర్థసంకల్పమున్నచో ఇంకా వ్యర్థసంకల్పముల యొక్క కీటకములు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అయితే అలాంటి వ్యర్థసంకల్పములను బుద్ధిలో ఎప్పుడు ఉంచుకొనరాదు. వ్యర్థము ద్వారానే సమర్థవంతులుగా తయారుకాలేకపోతున్నారు. పాత సంస్కారములు మనవికాదు. ఇతర వస్తువులను మనదిగా బావించము కదా! మీరు కూడా పాత సంస్కారములను సమాప్తము చేసుకొని దేవతా సంస్కారములను ధారణ చేయాలి. మీ యొక్క ఆది స్వరూపమును ఎదురుగా ఉంచుకున్న యెడల అన్ని అలవాట్లు సమాప్తమవుతాయి. మంచిది-ఓంశాంతి.