29.06.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సమర్పణ యొక్క విశాల రూపం.

 మీ యొక్క నాలుగు మూర్తులు మీకు తెలుసా? ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి ఇప్పటి అనగా సంగమయుగం యొక్క (భవిష్యత్తుది కాదు) నాలుగు మూర్తులను చూస్తున్నారు. ఆ నాలుగు మూర్తులు ఏవి? (కొందరు చెప్పారు) ఇప్పుడు ఏవైతే వర్ణన చేసారో అలాంటి మూర్తులుగా తయారైపోయారా లేక తయారవ్వాలా? ఎప్పుడు అవుతారు? అంతిమంలో ముందుకు వెళ్ళిపోతాము అని ఆలోచిస్తున్నారా! కానీ అంతిమంలో ముందుకి వెళ్ళగలరా? ఎంత చాలా సమయం నుండి సఫలతా మూర్తులు అవుతారో అంతగానే అక్కడ సంపూర్ణ రాజ్యాధికారిగా అవుతారు. ఒకవేళ ఎవరైనా చాలా సమయం నుండి సఫలతా మూర్తిగా కాకపోతే దాని ప్రకారంగానే రాజ్యాధికారం కూడా కొంచెం సమయమే లభిస్తుంది. సంపూర్ణ సమయం లభించదు. ఎవరైతే చాలా సమయము నుండి సంపూర్ణంగా అయ్యే పురుషార్ధంలో నిమగ్నమవుతారో వారే సంపూర్ణ సమయం రాజ్యాధికారి అవుతారు. ఏ నాలుగు మూర్తులను చూస్తున్నారు? ఇది కూడా సంపూర్ణంగా అయ్యే లక్ష్యం. 1. జ్ఞానమూర్తి 2. గుణమూర్తి 3. దానమూర్తి మరియు 4.సంపూర్ణ సఫలతా మూర్తి. చెప్పాను కదా - సేవ చేయటం అంటే మహాదానిగా అవ్వటం. ప్రతి ఒక్కరి నాలుగు మూర్తులను చూస్తున్నారు. చతుర్ముఖాలకి కూడా మహిమ ఉంది కదా! ఒక మూర్తి నాలుగు మూర్తులను అందరికి సాక్షాత్కారం చేయించాలి. ఒకవేళ ఒక మూర్తి లోపంగా ఉంటే అక్కడ కూడా అంతే లోపం వస్తుంది. ఎలా అయితే ఇక్కడ మీరు వెంట తీసుకువెళ్ళే సామాన్లు బుక్ చేసుకుంటే అక్కడ లభిస్తాయి కదా! అలాగే ఇది కూడా బుకింగ్ ఆఫీస్. ఇక్కడ ఎంత బుక్ చేసుకుంటే అంత అక్కడ ప్రాప్తి ఉంటుంది. చతుర్ముఖి అయ్యారా? ఎంత ఇక్కడ మీ మూర్తిలో సర్వ విషయాలను ధారణ చేస్తారో అంతగానే భవిష్య రాజ్యం అయితే లభిస్తుంది. కానీ ద్వాపర యుగంలో తయారయ్యే జడచిత్రాలు కూడా ఈ సంగమయుగీ మూర్తిననుసరించే తయారవుతాయి. అర్థమైందా! ఇప్పుడు సంపూర్ణ మూర్తి అవ్వడానికి ఏ లక్ష్యం ఎదురుగా పెట్టుకుంటారు? భక్తి మార్గం వారికి మీరు చెప్తారు కదా - చిత్రాన్ని చూపించి వారు ఏ పురుషార్ధంతో అలా తయారయ్యారో అర్ధం చేస్కోండి అని చెప్తారు కదా! అలాగే మీరు సంపూర్ణమూర్తి అవ్వడానికి ఏ లక్ష్యం ఎదురుగా పెట్టుకుంటారు? వారు ఏ లక్ష్యం పెట్టుకున్నారు? ఆ సాకార బాబా యొక్క సంపూర్ణ లక్ష్యం ఒకటే కదా! ఆయన కర్మాతీతంగా అవ్వడానికి ఏ లక్ష్యం పెటుకున్నారు? ఏయే విషయాలలో సంపూర్ణం అయ్యారు? సంపూర్ణత అనే మాటని ఎంత విశాలతతో ధారణ చేసారో తెలుసా? సంపూర్ణం అనే మాట అయితే ఒకటే, కానీ ఎంత విశాల రూపంలో ధారణ చేసి ఇలా అయ్యారు? సర్వ సమర్పణ అనే లక్ష్యంతోనే సంపూర్ణం అయ్యారు. ఎంత సమర్పణయో అంత సంపూర్ణం. కానీ సమర్పణలో కూడా విశాల రూపం ఏమిటి? ఎంత విశాల రూపంతో దీనిని ధారణ చేస్తారో అంతగానే విశాలబుద్దిగా అవుతారు. మరియు విశ్వరాజ్యా ధికారిగా కూడా అవుతారు. ఆ విశాలత ఏమిటి? దీనిలో కూడా నాలుగు విషయాలు ఉన్నాయి. 1.తన ప్రతి సంకల్పం సమర్పణ 2. ప్రతి సెకను సమర్పణ అంటే సమయం సమర్పణ 3. కర్మ కూడా సమర్పణ మరియు 4. సంబంధం మరియు ధనం కూడా సమర్పణ. సర్వసంబంధాలు సమర్పణ చేయాలి. ఈ సంబంధంలో లౌకిక సంబంధం కూడా వచ్చేస్తుంది మరియు ఆత్మ మరియు శరీరం యొక్క సంబంధం కూడా సమర్పణ. ఇంతగా సంబంధాన్ని సమర్పణ చేసారు. వినాశీ ధనాన్ని సమర్పణ చేయటం గొప్ప విషయం కాదు, కాని అవినాశి ధనాన్ని అనగా జన్మసిద్ద అధికారంగా లభించే సుఖం, శాంతి, పవిత్రత, ప్రేమ, ఆనందం యొక్క ప్రాప్తిని కూడా ఇతర ఆత్మల సేవలో సమర్పణ చేసారు. పిల్లల శాంతినే స్వయం యొక్క శాంతిగా భావించారు. ఆత్మలకు శాంతిని ఇవ్వటంలోనే తన శాంతి ఉన్నట్లు భావించారు. లౌకిక ధనం మరియు వెనువెంట ఈశ్వరీయ ధనాన్ని కూడా సమర్పణ చేసి సాక్షి స్థితిలో ఉండటం అంటే ఇదే. కనుక సమర్పణ అనే మాటకి ఇంత విశాల రహస్యం ఉంది. అర్థమైందా! ఇంత విశాలరూపంలో ధారణ చేసేవారే సంపూర్ణమూర్తి మరియు సఫలతామూర్తి అవుతారు. సమర్పణ అంటే సాధారణ అర్ధంతో అర్ధం చేసుకోకూడదు. లౌకికాన్ని సమర్పణ చేయటం సహజమే, కానీ ఈశ్వరీయ ప్రాప్తిని కూడా సమర్పణ చేయాలి. అంటే మహాదాని అవ్వాలి మరియు ఇతరుల పట్ల శుభచింతకులు అవ్వాలి. దీనిలో యోగ్యత మరియు శక్తిని అనుసరించి ఉన్నారు. ఇంతగా సమర్పణ అయ్యే వారినే సంపూర్ణ సమర్పణ అంటారు. సంపూర్ణమూర్తిగా, సమర్పణమూర్తిగా అయ్యారా? నాది అనేది పూర్తిగా ఇమిడిపోవాలి. ఏ వస్తువు అయినా మరో వస్తువులో ఇమిడిపోతే రెండూ సమానం అయిపోతాయి. అంటే ఇమిడి పోవటం అంటే సమానంగా అయిపోవటం. కనుక నాది అనే భావం ఎంతగా ఇమిడి పోతుందో అంతగానే సమానమూర్తి అవుతారు. మీరు ఇతరాత్మలకి సేవ చేస్తున్నప్పుడు ఏ లక్ష్యంతో చేస్తారు? (తమ సమానంగా చేయడానికి). మీ సమానంగా కూడా కాదు, బాబా సమానంగా చేయాలి. మీ సమానంగా చేస్తే మీలో ఏదైనా లోపం ఉంటే అది వారిలో కూడా వచ్చేస్తుంది. అందువలన సంపూర్ణంగా అయ్యేటందుకు మీ సమానంగా కూడా కాదు, బాబా సమానంగా చేయాలి. బాబా తన కంటే ఉన్నతంగా చేస్తున్నారు కదా! బాబా సమానంగా చేస్తే బాబాని అనుసరించినట్లే. ఎలా అయితే బాబా తనకంటే ఉన్నతంగా చేస్తున్నారో అలాగే మీ కంటే ఉన్నతంగా, బాబా సమానంగా చేస్తే బాబాని అనుసరించినట్లే. కనుక ఇప్పుడు మీ సమానంగా కూడా కాదు. బాబా సమానంగా చేయాలి. ఒకవేళ మీ లక్ష్యమే మీ సమానంగా చేయాలి అని ఉంటే వారిలో చాలా లోపం ఉండిపోతుంది. ఎందుకంటే లక్ష్యమే మీరు అలా పెట్టుకున్నారు. అందువలన లక్ష్యం సదా సంపూర్ణంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎటువంటి లక్ష్యమో అటువంటి లక్షణాలు ఉంటాయి. లక్ష్యం శ్రేష్టంగా ఉంచుకుంటే ప్రాప్తి కూడా శ్రేష్టంగా ఉంటుంది. ఇప్పుడు మూడవ నేత్రాన్ని సదా మీ లక్ష్యంపై స్థిరంగా ఉంచాలి. ఎలా అయితే ఎవరైనా మగ్న స్థితిలో ఉన్నప్పుడు వారి నయనాలు ఒకేవైపు స్థిరంగా ఉండిపోతాయి కదా! అలాగే దివ్యబుద్ధి యొక్క నేత్రం కూడా సదా ఒకేవైపు స్థిరంగా, ఏకరసంగా ఉండాలి. ఒకేవైపు అనగా ఒకే దానిలో నిమగ్నం అయిపోయినట్లు ఉండాలి. మూడవ నేత్రం యొక్క సాక్షాత్కారం ఎలా అవుతుంది? మస్తకం ద్వారా అవుతుంది. మస్తకంలో మెరుపు, నయనాలలో నిశ్చయంగా కనిపిస్తుంది. వీటి ద్వారా వీరి యొక్క మూడవ నేత్రం నిమగ్నంగా ఉందా లేక యుద్ధస్థలంలో ఉందా అనేది తెలుస్తుంది. కళ్ళు కొంచెం బాగుగా లేకపోయినా రెప్పలు మాటిమాటికి పడుతూ ఉంటాయి. అదేవిధంగా మూడవనేత్రం కూడా యదార్ధంగా ఉంటే అనగా దివ్యబుద్ది యదార్ధ రీతిలో స్వచ్ఛంగా ఉంటే ఒకేవైపు స్థిరంగా ఉంటాయి. కళ్లలో ధూళి పడితే ఏమౌతుంది? రెప్పలు పడుతూ ఉంటాయి. ధూళికి గుర్తు ఏమిటి? రెప్పలు చలించటం. యదార్థ ఆరోగ్యానికి గుర్తు - స్థిరంగా ఉండటం. అలాగే ఈ మూడవ నేత్రం సదా స్థిరంగా ఉండాలి. ఈ విషయం యొక్క సాక్షాత్కారం మీ మస్తకం ద్వారా అవుతుంది. నయనాల ద్వారా అవుతుంది.

పరిశీలించుకోండి - నా యొక్క మూడవ నేత్రం త్వరత్వరగా మూసుకుపోతుందా లేక తెరుచుకుంటుందా లేక సదా తెరిచే ఉంటుందా? అని. ఏదైనా స్మృతిలో లీనమైపోతే కళ్ళు స్థిరంగా ఉండిపోతాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఒకని స్మృతిలో నిమగ్నం అయిపోయిన వారే సంపూర్ణ స్థితిలో ఉండగలరు. లేకపోతే కళ్ళు వలె తెరుచుకుంటూ, మూసుకుంటూ ఉంటుంది. స్థిరంగా ఉండదు. ఏదైనా మురికి ఉంటే త్వరగా తొలగించుకోండి. నవ్వు వచ్చే ఈ విషయం చెప్తాను. ఎవరైనా మిమ్మల్ని సాక్షాత్కారం చేసుకుంటున్నారు. మీ చిత్రం పైకి, కిందికి కదులుతూ ఉంటే ఏమి సాక్షాత్కారం చేసుకుంటారు? ఫోటో తీసేటప్పుడు కదలనివ్వరు కదా! కదిలితే ఫోటో పాడైపోతుంది. అలాగే మీ స్థితి చలిస్తూ ఉంటే ఏమి సాక్షాత్కారం అవుతుంది? ఫోటో తీసే సమయంలో ఎంత స్థిరంగా ఉంటారో అలాగే మీ భక్తులు ప్రతి సమయం సాక్షాత్కారం చేసుకుంటున్నారు అని భావించండి. సాక్షాత్కారమూర్తి అంటే స్థిరమూర్తిగా ఉంటారు. లేకపోతే భక్తులకి స్పష్ట సాక్షాత్కారం అవ్వదు. స్పష్ట సాక్షాత్కారం చేయించడానికి స్థిరబుద్ధి మరియు ఏకరస స్థితి అవసరం. అర్థమైందా! ఇప్పటి నుండే భక్తులు ఒకొక్కరి సాక్షాత్కారం చేసుకుంటారు. సాక్షాత్కారం యొక్క బీజం అంటే సంస్కారం ఆ భక్తి ఆత్మలలో నిండుతుంది. సంస్కారం నిండి ఉన్న కారణంగా తర్వాత ద్వాపరయుగం నుండి అదే సంస్కారం బయటికి వస్తుంది. మీరు చెప్తారు కదా - ధర్మస్థాపకులు ఇక్కడి నుండే సందేశం తీసుకుని సంస్కారం నింపుకుని వెళ్తారు, మరలా అదే బయటికి వస్తుందని. అలాగే మీ అందరి ప్రజలు మరియు భక్తులు కూడా సంస్కారాన్ని నింపుకుని వెళ్తారు. ఆ రకంగానే సంసారం ప్రత్యకం అవుతుంది. ఒకవేళ భక్తుల ఎదురుగా స్పష్ట సాక్షాత్కారం చూపించకపోతే వారిలో ఆ సంస్కారం ఎలా నిండుతుంది? ఈ కర్తవ్యం కూడా చేయాలి. కేవలం ప్రజలని తయారుచేయటం కాదు. వెనువెంట భక్తులలో కూడా ఆ సంస్కారం నింపాలి. ఎంతమంది ప్రజలు, ఎంతమంది భక్తులు తయారయ్యారు అనేది కూడా తెలుస్తుంది. భక్తుల మాల మరియు ప్రజల మాల ప్రత్యక్షం అవుతాయి. ప్రతి ఒక్కరికి తమ తమ రెండు మాలలు సాక్షాత్కారం అవుతాయి. మాలలో ఎక్కడ ఏ పూసగా గుచ్చబడి ఉన్నారో కూడా సాక్షాత్కారం అవుతుంది. కొందరికి భక్తులు ఎక్కువ, కొందరికి ప్రజలు ఎక్కువ తయారవుతారు. ఇది కూడా ఒక గుప్త రహస్యం. కొందరి రాజధాని పెద్దగా ఉన్నా ధనం తక్కువగా ఉంటుంది. కొందరి రాజధాని తక్కువగా ఉన్నా ధనం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా గుప్త రహస్యం. ఈ రహస్యం ఎప్పుడు బయటపడుతుంది? ఇప్పుడు ప్రజలను తయారుచేసే లక్ష్యం పెట్టుకోండి. భక్తులైతే అంతిమంలో నిమిషంలో తయారైపోతారు. ఇక్కడే భక్తులు నమస్కారం చేస్తారు, పూజ చేయరు. కేవలం మహిమ చేస్తారు, పూజ అక్కడ (ద్వాపరయుగంలో) చేస్తారు. ఇవన్నీ తర్వాత తెలుస్తాయి. మంచిది.