24.07.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బిందురూప స్థితి సహజంగా ఎలా తయారవుతుంది?

అందరు ఇప్పుడు ఏ స్థితిలో కూర్చున్నారో ఆ స్థితిని ఏమంటారు? వ్యక్తంలో అవ్యక్తస్థితి ఉందా! బాప్ దాదాతో ఆత్మిక సంభాషణ చేసే సమయంలో బిందురూపి స్థితిలో స్థితులు కాగలుతున్నారా? (ప్రతి ఒక్కరు తమ ఆలోచన చెప్పారు) బిందురూపి స్థితి విశేషంగా ఏ సమయంలో తయారవుతుంది? ఏకాంతంలో కూర్చున్నప్పుడే ఉంటుందా లేక నడుస్తూ తిరుగుతూ కూడా ఉండవచ్చా? అంతిమ పురుషార్ధం - స్మృతియే. అందువలన స్మృతి స్థితిని లేదా అనుభవాన్ని కూడా బుద్ధిలో స్పష్టంగా తెలుసుకోవటం అవసరం. బిందురూపి స్థితి అంటే ఏమిటి మరియు అవ్యక్త స్థితి అంటే ఏమిటి? రెండింటి అనుభవం ఏమిటి? ఎందుకంటే పేర్లు రెండు చెప్తున్నారు అంటే తప్పకుండా రెండింటి అనుభవంలో తేడా ఉంటుంది కదా! నడుస్తూ, తిరుగుతూ బిందురూపి స్థితి అనేది తక్కువ ఉండటం కూడా కాదు, కానీ అసలు లేనట్లే ఉంది. ఈ స్థితి యొక్క అభ్యాసం కూడా చేయాలి. మధ్యమధ్యలో ఒకొక్క నిమిషం తీసి ఈ బిందురూపం యొక్క అభ్యాసం చేయాలి. కొన్ని విశేష రోజులలో మొత్తం నడుస్తూ, తిరుగుతూ ఉన్న ట్రాఫిక్ ని ఆపి 3 నిమిషాలు శాంతి యొక్క అభ్యాసం చేయిస్తారు. నడుస్తున్న అన్ని కార్యాలు ఆపేస్తారు. మీరు కూడా ఏ కార్యం చేస్తున్నా లేక మాట్లాడుకుంటున్నా కానీ ఆపి ఈ అభ్యాసం చేయాలి. ఒకవేళ ఈ అభ్యాసం చేయకపోతే బిందురూపి స్థితి యొక్క శక్తిశాలి స్థితి ఎప్పుడు మరియు ఎలా తీసుకురాగలరు? అందువలన ఈ అభ్యాసం చేయటం అవసరం. మధ్యమధ్యలో ఈ అభ్యాసం ప్రత్యక్షంగా చేస్తే ఈరోజు ఏదైతే బిందురూప స్థితి కష్టమనిపిస్తుందో అదే సరళంగా అనిపిస్తుంది కదా! ఎక్కువ మందికి అవ్యక్తస్థితి సహజంగా అనిపిస్తుంది. ఈ అభ్యాసం చేస్తే బిందురూప స్థితి కూడా సహజంగానే అనిపిస్తుంది. మొదట్లో అవ్యక్తస్థితి యొక్క అభ్యాసం చేసేటప్పుడు వ్యక్తంలో అవ్యక్త స్థితిలో ఉండటం కూడా కష్టం అనిపించేది. కానీ ఇప్పుడు అవ్యక్త స్థితిలో స్థితులై కార్యం చేయటం సహజం అయ్యింది. అలాగే ఈ బిందురూప స్థితి కూడా సహజం అయిపోతుంది. మహారథులు ఇప్పుడు ఈ అభ్యాసం చేయాలి. అర్థమైందా! ఫరిస్తా రూపం యొక్క స్థితి అంటే అవ్యక్త స్థితి ఎవరికైతే సదాకాలికంగా ఉంటుందో వారు బిందురూప స్థితిలో కూడా సహజంగా స్థితులు కాగలరు. ఒకవేళ అవ్యక్త స్థితి లేకపోతే బిందురూప స్థితిలో ఉండటం కూడా కష్టం అనిపిస్తుంది. అందువలన ఇప్పుడు ఈ అభ్యాసం చేయండి. ఆదిలో అవ్యక్త స్థితిని అభ్యాసం చేయడానికి ఏకాంతంలో కూర్చుని ఎంతో వ్యక్తిగత పురుషార్ధం చేసేవారు. అదేవిధంగా ఈ అంతిమ స్థితి యొక్క పురుషార్థానికి కూడా మధ్యమధ్యలో సమయం తీయాలి. అంతిమ స్థితి. ఈ స్థితికి చేరుకోవడానికి ఒక విషయంపై విశేష ధ్యాస పెట్టుకోవాలి. ఈ రోజులలో కౌరవ గవర్నమెంట్ ఏమి స్కీమ్ తయారుచేస్తుంది? వారి ప్లాన్స్ అన్నీ కూడా ఎప్పుడు సఫలం అవుతాయంటే అన్ని విషయాలలో పొదుపు యొక్క లక్ష్యం పెట్టుకున్నప్పుడు అవుతాయి. పొదుపు గురించి ఆలోచిస్తున్నారు కదా! సమయం, ధనం, శక్తి కూడా పొదుపు చేయాలనుకుంటున్నారు. తక్కువ శక్తిని ఉపయోగించి ఎక్కువ పని జరగాలని అనుకుంటున్నారు. అన్ని రకాల పొదుపు గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పాండవ గవర్నమెంట్ ఏ స్కిమ్ పెట్టాలి? చెప్పాను కదా - బిందురూపం యొక్క సంపూర్ణ సిద్ధిని పొందడానికి పురుషార్ధం చేయాలి. ఇప్పుడు నడిచే పద్ధతిని అనుసరించి అందరు ఇదే చెప్తున్నారు - చాలా బిజీగా ఉంటున్నాము, ఏకాంతానికి సమయం తక్కువ లభిస్తుందని. మననానికి కూడా సమయం తక్కువ లభిస్తుందని. కానీ సమయం ఎలా లభిస్తుంది? రోజు రోజుకి సేవ కూడా పెరుగుతూ ఉంటుంది, సమస్యలు కూడా పెరగుతాయి మరియు సంకల్పాల వేగం కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పుడు ఒక సెకనులో 10 సంకల్పాలు చేస్తే వీటికంటే రెండు రెట్లు, మూడు రెట్లు పెరిగిపోతాయి. ఈ రోజులలో జనసంఖ్య లెక్క తీస్తున్నారు కదా! ఒక రోజులో ఎంతగానో పెరిగిపోతుంది. అలాగే ఇక్కడ సంకల్పాల వేగం పెరిగిపోతుంది. ఒక వైపు సంకల్పాలు, రెండవవైపు ప్రేతాత్మలు కూడా వృద్ధి అవుతాయి. కానీ దీని కొరకు ఒక విశేష ధ్యాస ఉంచుకోవాలి. ఆ విషయం ద్వారా అన్ని విషయాలను ఎదుర్కోగలరు. అది ఏమిటంటే - ఏ విషయాన్నైనా స్పష్టంగా తెలుసుకోవడానికి రెండు మాటలు స్మృతి ఉంచుకోవాలి. 1.బేధము 2.మంత్రము. ఏ విషయం వచ్చినా ఇది యదార్ధమా లేక అయదార్ధమా అనే బేధాన్ని గుర్తించండి. బాప్ దాదా సమానంగా ఉందా లేక లేదా? బేధాన్ని చూసి ఒక్క సెకనులో నాట్ లేదా డాట్ పెట్టాలి. అంటే చేయకూడదు అంటే బిందువు పెట్టేయాలి, చేయాలంటే చేయాలి. నాట్ మరియు డాట్. ఈ రెండూ కూడా స్మృతిలో ఉంచుకోవాలి. బేధము మరియు మంత్రము రెండూ ప్రత్యక్షంలోకి వస్తాయి. రెండింటిని మర్చిపోకపోతే ఏ సమస్య లేదా ఏ ప్రేతాత్మ యుద్ధం చేయలేదు. ఒక్క సెకనులో సమస్య భస్మం అయిపోతుంది. ప్రేతాత్మ మీ ముందు నిలబడలేదు. కనుక ఈ పురుషార్థం చేయాలి అర్థమైందా! (ప్రేతాత్మ యొక్క రూపం ఏమిటి?) ప్రేతాత్మ యొక్క స్పష్ట రూపం - ఎవరొకరిలో ప్రవేశించడం. కానీ ప్రేతాత్మలు కొన్ని గుప్తరూపంలో కూడా ఉంటాయి. నడుస్తూ, నడుస్తూ కొందరిలో విశేషంగా ఏదొక చెడు సంస్కారం పూర్తిగా ప్రభావశాలి రూపంలో కనిపిస్తుంది. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే వారి బుద్దిలో ఇప్పుడిప్పుడే ఒక విషయం మరలా ఇప్పుడిప్పుడే మరో విషయం ఉంటుంది. అది కూడా ఫోర్సుతో చెప్తారు. వారి స్థితి కూడా స్థిరంగా ఉండదు. వారు తమని తాము అలజడి చేసుకుంటారు, ఇతరులని కూడా అలజడి చేస్తారు. స్పష్ట రూపంలో ప్రేతాత్మ వస్తే పరిశీలించి, తొలగించటం సహజమే, కానీ మీ దగ్గరికి స్పష్టరూపంలో తక్కువగా వస్తాయి. గుప్త రూపంలో చాలా వస్తాయి. దీనినే మీరు సాధారణ మాటలలో అనుకుంటారు - వీరి బుద్ది కొంచెం పిచ్చిగా ఉంది ఏమిటో అంటారు. ఆ సమయంలో వారిలో ఈ ప్రేతాత్మ అంటే పాత సంస్కారాల ఫోర్సు ఎలా ఉంటుందంటే ఆ ప్రేతాత్మ సమానంగానే ఉంటుంది. స్థూలంగా ప్రేతాత్మ ప్రవేశించిన వారు చాలా ఇబ్బంది.పెడతారు కదా! అదేవిధంగా వీరు కూడా చాలా ఇబ్బంది పెడతారు. ఇలా చాలా జరుగునున్నవి. అందువలన చెప్పాను కదా - ఇప్పుడు సమయం, సంకల్పాలు మరియు శక్తిని పొదుపు చేసుకునే ప్లాన్ తయారు చేసుకుని మధ్యమధ్యలో బిందురూప స్థితిని పెంచుకోండి. బిందురూప స్థితి ఎంతగా ఉంటుందో అంత ఏప్రేతాత్మ లేదా చెడు సంస్కారాల ఫోర్సు మీపై యుద్ధం చేయదు. మరియు మీ శక్తిరూపమే వాటిని ముక్తి చేస్తుంది. ఈ సేవ కూడా చేయాలి. ప్రేతాత్మలను కూడా ముక్తి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అంతిమ సమయం యొక్క అంతిమం. కనుక ప్రేతాత్మలు మరియు చెడు సంస్కారాలు కూడా అతిలోకి వెళ్ళి అంతం అయిపోతాయి. చెత్త అంతా బయటికి వచ్చేసి భస్మం అయిపోతాయి. అందువలన వీటిని ఎదుర్కోవడానికి ఒకవేళ మీ సమస్యలతోనే ముక్తి కాకపోతే ఈ సమస్యలను ఎలా ఎదుర్కోగలరు? అందువలన పొదుపు యొక్క స్కీమ్ తయారుచేయండి మరియు ప్రత్యక్షంలోకి తీసుకురండి. అప్పుడే మీకు రక్షణ మరియు సర్వాత్మలను రక్షించగలరు. కేవలం ఉపన్యాసం చెప్పటం, అర్థం చేయించే సేవయే కాదు. ఇప్పుడు సేవ యొక్క రూపం కూడా చాలా సూక్ష్మం అవుతుంది. అందువలన మీ సూక్ష్మస్వరూపం యొక్క స్థితిని కూడా పెంచుకోండి. ఇవన్నీ ప్రత్యక్షం అయ్యి తర్వాత ప్రాయలోపం అయిపోతాయి. పదిమంది చేసే కార్యం ఒక్కొక్కరు చేయవలసి వస్తుంది. అంతగా సేవ పెరుగుతుంది. శక్తులకు ఎన్ని భుజాలు చూపిస్తారు? భుజాలకు అర్థం - సేవలో అంతగా సహాయకారి అవ్వాలి. శక్తులకే భుజాలు అని పాండవులు అనుకుంటున్నారా! పాండవులకు ఏమి చూపిస్తారో తెలుసా? భారీ శరీరాన్ని చూపిస్తారు. అంటే అది కూడా పాండవులు అంత ఎక్కువ సహాయకారి అయిన దానికి గుర్తు. పెద్ద శరీరం కాదు కానీ విశాలబుద్ది. వీరు ముందుకు వెళ్ళటం అంటే శక్తులు ముందు వెళ్ళటం. శక్తులని ముందు పెట్టడం ఇదే వీరి యొక్క పరుగుకి గుర్తు.