27.07.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


అవ్యక్త స్థితి తయారయ్యేటందుకు ముఖ్య శక్తుల యొక్క ధారణ.

ఈ రోజు బాప్ దాదా ఏ రూపంలో చూస్తున్నారు? ఒక్కొక్కరి ముఖంలో ఏమి చూస్తున్నారో తెలుసుకోగలరా? ప్రతి ఒక్కరు ఎంత వరకు అవ్యక్తమూర్తి, ఆకర్షణమూర్తి, అలౌకికమూర్తి మరియు హర్షితమూర్తి అయ్యారు అని చూస్తున్నారు. ఈ నాలుగు లక్షణాలు ముఖం ద్వారా కనిపిస్తాయి. ఎవరెవరు ఎంత వరకు తయారయ్యారు అనేది ముఖం సాక్షాత్కారం చేయిస్తుంది. ఎలా అయితే అద్దంలో స్థూల ముఖం చూసుకుంటారో అలాగే దర్పణంలో ఈ లక్షణాలు కూడా చూసుకుంటున్నారా? చూడటం ద్వారా ఏమి సాక్షాత్కారం అయ్యింది? నాలుగు లక్షణాలలో విశేషంగా ఏ లక్షణం మీలో కనిపిస్తుంది? మిమ్మల్ని మీరు చూసుకునే అభ్యాసం ప్రతి ఒక్కరికీ ఉండాలి. అంతిమ స్థితి ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరి ముఖంలో ఈ సర్వ లక్షణాలు ప్రసిద్ధ రూపంలో కనిపిస్తాయి. ఇప్పుడు కొన్ని గుప్తంగా, కొన్ని ప్రత్యక్షంగా ఉన్నాయి. కొన్ని గుణాలు విశేషంగా ఉన్నాయి, కొన్ని తక్కువగా ఉన్నాయి. కానీ సంపూర్ణ స్థితిలో ఈ లక్షణాలన్నీ సమాన రూపంలో మరియు ప్రత్యక్షరూపంలో కనిపిస్తాయి. దీని ద్వారా అందరు నెంబరువారీగా ప్రత్యక్షం అవుతారు. ఎంతెంత ఎవరిలో ప్రత్యక్షరూపంలో గుణాలు వస్తాయో అంతంత ప్రత్యక్షత కూడా అవుతుంది. ఈరోజు విశేషంగా ఏ కార్యం కొరకు వచ్చారు? పాండవ సేన కోసం. పాండవుల భట్టి ప్రారంభం అయ్యింది. మీలో ఏమి కొత్తదనం తీసుకురావాలో తెలుసా?

విశేష భట్టీకి వచ్చారు. కనుక విశేషంగా ఏమి ధారణ చేస్తారు? (ప్రతి ఒక్కరు తమ లక్ష్యం చెప్పారు). ఈ పాండవ సేన ద్వారా ఏమేమి చేయించాలో టీచర్స్ చెప్పండి. ముందుగానే వినటం ద్వారా తమలో అన్ని పాయింట్స్ నింపుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఇక మీరు శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. మీరు వీరి నుండి ఏమి కోరుకుంటున్నారు? వీరు ఒక్క సెకనులో తమని తాము మార్చుకోగలరు, కష్టం అనేది ఉండదు. మరియు నిమిత్తం అయిన వారి సహాయం కూడా చాలా మంచిగా లభిస్తుంది. పాండవ సేనకి కల్పపూర్వం యొక్క ప్రసిద్ధత ఉంది. పాండవుల కర్తవ్యానికి స్మృతి చిహ్నానికి ప్రసిద్ధత ఉంది. కల్పపూర్వం జరిగినది ఇప్పుడు కేవలం రిపీట్ చేయాలి. అవ్యక్తంగా అయ్యేటందుకు లేదా మీకు ఏవైతే లక్ష్యం వినిపించానో దానిని పూర్తి చేయడానికి మీలో ఏమేమి ధారణ చేయాలి? అది ఈ రోజు వినిపిస్తున్నాను. పాండవులందరూ మిమ్మల్ని మీరు ఏమని పిలిపించుకుంటున్నారు? సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క పిల్లలు అంటున్నారు కదా!

అవ్యక్తంగా అయ్యేటందుకు ముఖ్యంగా మీలో ఏ శక్తులను ధారణ చేయాలి? అప్పుడే ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో దానిని పూర్తి చేయగలరు. భట్టీలో ఏ ముఖ్య శక్తులు ధారణ చేసి వెళ్ళాలో చెప్తున్నాను. చాలా ఉన్నాయి కానీ ముఖ్యంగా 1. సహనశక్తి 2. పరిశీలనా శక్తి మరియు 3. విస్తారాన్ని సారం చేసి శక్తి, మరలా 4. సారాన్ని విస్తారం చేసే శక్తి ఉండాలి. అక్కడక్కడ విస్తారం తక్కువ చేయవలసి ఉంటుంది మరియు అక్కడక్కడ విస్తారం కూడా చేయవలసి ఉంటుంది. సర్దుకునే శక్తి, ఇముడ్చుకునే శక్తి, ఎదుర్కునే శక్తి మరియు నిర్ణయశక్తి కూడా కావాలి. వీటన్నిటితో పాటు వెనువెంట సర్వులను స్నేహి మరియు సహయోగి చేసుకునే అంటే అందరినీ కలుపుకునే శక్తి కూడా కావాలి. కనుక ఈ అన్ని శక్తులను ధారణ చేయాలి. అప్పుడే అన్ని లక్షణాలు వస్తాయి. వస్తాయి కూడా కాదు, రావాలి. ధారణ చేసే వెళ్ళాలి.... ఇవి నిశ్చయబుద్ధి గల వారి మాటలు. దీని కొరకు విశేషంగా ఒక విషయం ఉండాలి. ఆత్మీయతను ధారణ చేయాలి మరియు వెనువెంట ఈశ్వరీయ నషా. ఈ రెండు విషయాలను ధారణ చేయాలి. మరియు ఒక విషయం వదలాలి. అది ఏమిటి? (కొందరు అహంకారం వదలాలి అని చెప్పారు, కొందరు నీచస్థితి వదలాలి అని చెప్పారు) ఇవి మంచివే. అక్కడక్కడ స్వయంపై నమ్మకం లేని కారణంగా కొన్నికార్యాలలో విజయం లభించటం లేదు. అందువలనే నీచస్థితి వదలాలి, అహంకారం కూడా వదలాలి. మరియు ఏవైతే రకరకాల రూపాలు మారుస్తున్నారో, అప్పుడప్పుడు ఒకవిధంగా, అప్పుడప్పుడు మరో విధంగా ఇలా రకరకాల రూపాలను మార్చటం వదలి ఒకే అవ్యక్త మరియు అలౌకిక రూపం బట్టీలో ధారణ చేసి వెళ్ళాలి. మంచిది.

తిలకం అయితే పెట్టుకుని ఉన్నారు కదా! ఇప్పుడు కేవలం భట్టీ యొక్క బహుమతి ఇవ్వాలి. బహుమతి ఏమి ఇవ్వాలి? తిలకం పెట్టబడి ఉంది, కిరీటధారిగా ఉన్నారా లేక కిరీటం ఇవ్వాలా! ఒకవేళ ఇప్పుడు చిన్న కిరీటం ధారణ చేస్తే భవిష్యత్తులో కూడా లోపం వచ్చేస్తుంది. విశ్వమహారాజుగా అవ్వడానికి భట్టీకి వచ్చారు. అందరికంటే పెద్ద కిరీటం విశ్వమహారాజుకే ఉంటుంది. వారికి ఏమేమి బాధ్యతలు ఉంటాయి అనే పాఠం కూడా చదువుకోవాలి. ఇది మంచి కలయిక, మీ టీచర్ (చంద్రమణి దాది) చాలా సంతోషపబడుతున్నారు. ఎందుకంటే మా విద్యార్థులందరూ విశ్వమహారాజులు అవుతారు అని. ఈ గ్రూప్ యొక్క పేరు ఏమిటో తెలుసా? ఒకొక్కరిలో విశేషగుణాలు ఉన్నాయి. అందువలన ఇది విశేష ఆత్మల గ్రూప్. మిమ్మల్ని మీరు విశేష ఆత్మగా భావిస్తున్నారా? కీచైన్ (త్రిమూర్తి కీచైన్) బహుమతి ఇస్తున్నారు. లక్ష్యాన్ని చూసి అలాంటి లక్షణాలు ధారణ చేయాలి. ఒకరి సంస్కారాలని ఒకరు కలుపుకోవాలి మరియు వెనువెంట ఏదైతే తాళంచెవి గుర్తు ఇచ్చారో అంటే చెప్పిన సర్వశక్తుల తాళంచెవి తీసుకుని వెళ్ళాలి. కానీ ఎప్పుడైతే రచయిత మరియు రచన యొక్క యదార్ధ ఙ్ఞానం స్మృతిలో ఉంటుందో అప్పుడే ఈ రెండు విషయాలు స్థిరంగా ఉంటాయి. అందువలన ఇది బహుమతిగా ఇస్తున్నాను. మిమ్మల్ని మీరు సఫలతా మూర్తులుగా భావిస్తున్నారా? సఫలత అంటే సంపూర్ణ గుణాలను ధారణ చేయటం. సర్వ విషయాలలో సఫలత ఉంటే వారి పేరే సంపూర్ణమూర్తి, "సఫలతా సితారను నేను" అనే స్మృతిలో ఉండి ప్రతి కార్యం చేయటం ద్వారా సఫలత యొక్క అధికారం లభిస్తుంది. సఫలతా సితారగా అవ్వటం ద్వారా ఇముడ్చుకునే శక్తి వస్తుంది. సఫలతను ఎదురుగా ఉంచుకోవటం ద్వారా సమస్య కూడా పరివర్తన అయిపోతుంది, మరియు సఫలత కూడా ప్రత్యక్షంగా వస్తుంది. సమీప సితారల లక్షణాలు ఏమిటి? ఎవరి సమీపమో వారి సమానంగా అవ్వాలి. సమీప సితారలలో బాప్ దాదా యొక్క గుణాలు మరియు కర్తవ్యం ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఎంత సమీపతయో అంత సమానత కనిపిస్తుంది. వారి ముఖం బాప్ దాదాని సాక్షాత్కారం చేయించే దర్పణంగా ఉంటుంది. వారికి బాగా పరిచయం ఇచ్చే ప్రయత్నం తక్కువ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వారు స్వయమే పరిచయం ఇచ్చే మూర్తిగా ఉంటారు. వారిని చూస్తూనే బాప్ దాదా యొక్క పరిచయం లభిస్తుంది. సేవలో ఈవిధమైన ప్రత్యక్ష ఉదాహరణ చూస్తారు. మిమ్మల్నే చూస్తారు కానీ ఆకర్షణ బాప్ దాదా వైపు ఉంటుంది. పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేయటం అంటే ఇదే. స్నేహం సమీపంగా తీసుకువస్తుంది. మీ స్నేహమూర్తి గురించి తెలుసా? స్నేహం ఎప్పుడూ గుప్తంగా ఉండదు. స్నేహి యొక్క ప్రతి అడుగు ద్వారా ఎవరితో వారికి స్నేహం ఉందో వారి ప్రభావం కనిపిస్తుంది. ఎంత హర్షితమూర్తియో అంత ఆకర్షణమూర్తి అవ్వాలి. సదా ఆకర్షణ మూర్తిగా అవ్వాలంటే ఆకార రూపధారి అయ్యి సాకార కర్తవ్యంలోకి రావాలి. అంతర్ముఖి మరియు ఏకాంతవాసి ఈ రెండు లక్షణాలు ధారణ చేయటం ద్వారా ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో అది సహజంగా పొందగలరు. సాధన ద్వారా సిద్ది లభిస్తుంది కదా!

సేవలో సదా సంపూర్ణ సఫలత పొందడానికి విశేషంగా ఏ గుణాన్ని ఎదురుగా ఉంచుకోవాలి? సాకారరూపంలో ఏ విశేషగుణం కారణంగా సఫలత పొందారు? (ఉదారచిత్త్) ఎంత ఉదారచిత్త్ అవుతారో అంత అందరి ఉద్దరణకు నిమిత్తం అవుతారు. ఉదారచిత్త్ అవ్వటం ద్వారా సహయోగం తీసుకునేటందుకు పాత్రులు అవుతారు. మేము సర్వ ఆత్మల ఉద్దరణకి నిమిత్తం అని భావించండి. అందువలన ప్రతి విషయంలో ఉదారచిత్త్ గా ఉండాలి. మనసా, వాచా, కర్మణాలో కూడా ఉదారచిత్త్ అవ్వాలి. సంపర్కంలో కూడా అవ్వాలి. అవుతూ ఉన్నారు, మరియు అవుతూనే ఉండాలి. ఎవరు ఎంత ఉదారచిత్త్ అవుతారో అంత ఆకర్షణ మూర్తిగా కూడా అవుతారు. ఈ ప్రయత్నంలో ముందుకు వెళ్ళి ప్రత్యక్షతలోకి తీసుకురావాలి. మధువనంలో ఉంటూ మధురత మరియు బేహద్ వైరాగ్యవృత్తిని ధారణ చేయాలి. ఇది మధువనం యొక్క ముఖ్య లక్షణం. దీనినే మధువనం అంటారు. బయట ఉంటూ కూడా ఈ లక్షణాలు ఉంటే మధువన నివాసీలే. ఇక్కడ ఎంత బాధ్యత తీసుకుంటారో అంత అక్కడ ప్రజల ద్వారా గౌరవం లభిస్తుంది. సహయోగం తీసుకోవడానికి స్నేహి అవ్వాలి. సర్వులకి స్నేహి, సహయోగి అవ్వాలి.. ఎంతెంత చక్రవర్తి అవుతారో అంత సర్వుల సంబంధంలోకి రాగలరు. ఈ గ్రూప్ విశేషంగా చక్రవర్తిగా అవ్వాలి. ఎందుకంటే సర్వుల సంబంధంలోకి రావటం ద్వారా సర్వులకి సహయోగం ఇవ్వగలరు మరియు సర్వుల నుండి సహయోగం తీసుకోగలరు. ప్రతి ఆత్మ యొక్క విశేషతలను చూస్తూ, వింటూ, సంప్రదింపుల్లోకి వస్తూ ఉంటే ఆ విశేషతలు స్వయంలో వచ్చేస్తాయి. కనుక ప్రత్యక్షంలో సర్యులకి సహయోగి అవ్వాలి. అందువలన పాండవసేన చక్రవర్తి అవ్వాలి. యోగాగ్ని సదా వెలుగుతూ ఉండాలి. దీని కొరకు మనసా, వాచా, కర్మణా మరియు సంబంధం ఈ నాలుగు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఈ అగ్ని అవినాశిగా ఉంటుంది. మాటిమాటికి ఆర్పేస్తూ మరలా వెలిగిస్తూ ఉంటే సమయం వ్వర్థం అయిపోతుంది, మరియు పదవి కూడా తక్కువ అయిపోతుంది. ఎంత స్నేహమో అంత శక్తి కూడా ఉంచుకోండి. ఒక సెకనులో ఆకారి మరియు ఒక సెకనులో సాకారిగా కాగలరా? ఇది కూడా అవసరమైన సేవ. ఎలా అయితే సేవకి అనేక సాధనాలు ఉన్నాయో అలాగే ఈ అభ్యాసం కూడా అనేక ఆత్మల కళ్యాణానికి ఒక సాధనం. ఈ సేవ ద్వారా ఏ ఆత్మనైనా ఆకర్షితం చేయగలరు. దీనిలో ఏ ఖర్చు ఉండదు. తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం. ఇదే ప్లాన్ తయారుచేయండి. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఏదొక విశేష శక్తి ఉంది, కానీ సర్వశక్తులూ వచ్చేస్తే ఎలా అయిపోతారు? మాస్టర్ సర్వశక్తివంతులు. అన్ని గుణాలలో శ్రేష్టంగా అవ్వాలి. ఇష్టదేవతలలో సర్వశక్తులు సమాన రూపంలో ఉంటాయి. కనుక ఈ పురుషార్ధం చేయాలి. మంచిది.