06.08.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బంధన్ముక్త ఆత్మ యొక్క గుర్తులు.

అవ్యక్త స్థితిలో స్థితులై వ్యక్త దేహాన్ని ఆధారంగా తీసుకుని చూస్తున్నాను అనే అనుభవం చేసుకుంటున్నారా? ఎలా అయితే ఏదైనా స్థూల స్థానంలో ప్రవేశిస్తారో అలాగే ఈ స్థూల దేహంలో ప్రవేశించి కార్యం చేస్తున్నాను అని అనుభవం అవుతుం*దా? ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రవేశించాలి మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు అతీతం అవ్వాలి. ఇలా అనుభవం చేసుకుంటున్నారా? ఒక సెకనులో ధారణ చేయాలి మరియు ఒక సెకనులో వదలాలి, ఈ అభ్యాసం ఉందా? స్థూల వస్తువులను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటారు మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేస్తారు కదా! అదేవిధంగా ఈ దేహభ్రాంతిని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేసి ఆత్మాభిమానిగా అవ్వాలి. స్థూల వస్తువులను ఎంత సహజంగా వదిలేస్తున్నారో అంత సహజంగా ఈ అభ్యాసం ఉందా? రచయిత ఎప్పుడు కావాలంటే అప్పుడు రచనను ఆధారం తీసుకుని, ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయాలి. ఇలాంటి రచయిత అయ్యారా? ఎప్పుడు కావాలంటే అప్పుడు అతీతం, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రియం అవ్వాలి. ఇంత బంధనముక్తులు అయ్యారా? ఈ దేహం కూడా బంధన. దేహం తన బంధనలో బంధిస్తుంది. దేహబంధన నుండి ముక్తులైతే దేహం బంధన వేయదు. కానీ కర్తవ్యానికి ఆధారంగా భావించి ఆధారాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే అభ్యాసం నడుస్తుందా? దేహభ్రాంతిని వదలడానికి లేదా దాని నుండి అతీతం అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? ఒక సెకను పడుతుందా? సదా ఒక సెకను పడుతుందా లేక అప్పుడప్పుడు ఒకవిధంగా, అప్పుడప్పుడు మరికొంత సమయం పడుతుందా? (అప్పుడప్పుడు ఒక్కో విధంగా ఉంటుంది) అంటే సర్వ బంధనాల నుండి ఇప్పుడు ఇంకా ముక్తి కానట్లు తెలుస్తుంది. ఎంత బంధన్ముక్తులుగా ఉంటారో అంత యోగయుక్తులుగా ఉంటారు. ఎంత యోగయుక్తంగా ఉంటారో అంత జీవన్ముక్తిలో ఉన్నత పదవి లభిస్తుంది. బంధన్ముక్తులుగా కాకపోతే యోగయుక్తులుగా కూడా కాలేరు. వారిని మాస్టర్ సర్వశక్తివంతులు అని అంటారా? దేహ సంబంధాలు మరియు దేహ పదార్థాల తగుల్పాటు నుండి ముక్తి అవ్వటం సరళమే, కానీ దేహభ్రాంతి నుండి ముక్తి అవ్వటం కష్టమైన విషయం. ఇప్పుడు ఏ బంధన మిగిలిపోయింది? దేహభ్రాంతి. దేహభ్రాంతి నుండి ముక్తి అవ్వాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యక్తంలోకి రావాలి. ఈ అభ్యాసం ఇప్పుడు ఎక్కువగా చేయాలి. ఎలా అయితే బాబా ఇప్పుడు ఆధారాన్ని తీసుకుని మాట్లాడుతున్నారో అలాగే మేము కూడా ఈ దేహాన్ని ఆధారంగా తీసుకుని కర్మ చేస్తున్నాము అని భావించండి. ఈ అతీత స్థితిననుసరించే ప్రియంగా అవుతారు. ఎంత ఈ అతీత స్థితి యొక్క అభ్యాసంలో ముందు ఉంటారో అంతగానే విశ్వానికి ప్రియంగా అనిపించటంలో ముందు ఉంటారు. సర్యులకి స్నేహిగా అయ్యేటందుకు మొదట అతీతంగా అవ్వాలి. సేవ చేస్తూ, సంకల్పం చేస్తున్నా కూడా మీకు మరియు ఇతరులకు కూడా వీరు అతీతం మరియు అతి ప్రియంగా ఉన్నారు అని అనుభవం అవ్వాలి. ఎంత ఎవరైతే స్వయం అతీతంగా అవుతారో అంత ఇతరులని బాబా ప్రియంగా చేయగలరు.

సేవ యొక్క సఫలతా స్వరూపం ఏమిటి? (అందరు రకరకాల ఆలోచనలు చెప్పారు). సేవ యొక్క సఫలతా స్వరూపం ఏమిటంటే సర్వ ఆత్మలని బాబాకి స్నేహిగా మరియు బాబా యొక్క కర్తవ్యంలో సహయోగిగా మరియు పురుషార్థంలో ఆ ఆత్మలను శక్తి రూపంగా చేయాలి. ఇదే సేవ యొక్క సఫలతా స్వరూపం. ఏ ఆత్మలకి సేవ చేసినా కానీ ఆ ఆత్మలలో ఈ మూడు లక్షణాలు ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. ఒకవేళ మూడింటిలో ఏ ఒక్క గుణం లోపంగా ఉన్నా కానీ సేవ యొక్క సఫలతలో కూడా లోపం ఉన్నట్లు. అర్థమైందా!

ఈ సఫలతా స్వరూపాన్ని ప్రత్యక్షంలోకి తీసుకురావడానికి ముఖ్యంగా ఏ విషయం ధ్యాసలో ఉంచుకోవాలి మరియు కర్మలో ఏమి ధారణ చేయాలి? ఆ విషయం ఏమిటి? చాలా సహజం. కష్ట విషయంపై ధ్యాస ఉంచి ధారణ చేస్తారు మరియు సహజ విషయాన్ని వదిలేయటం వలన సహజ ధారణ ఆలస్యం అవుతుంది. ఇది తెలుసా? ఇది పెద్ద విషయమేమీ కాదు, అయిపోతుంది అంటున్నా మరలా ఏమౌతుంది? అయిపోతుంది. అయిపోతుంది అంటూ ధ్యాస నుండి ఆ విషయం తొలగిపోతుంది. అందువలనే ధారణ రూపం కూడా ఉండటంలేదు. ఆ విషయం ఏమిటి? ఒకవేళ ఆ విషయాన్ని ధారణ చేస్తే సఫలతా స్వరూపంగా కాగలరు.(సాక్షిస్థితి) అవును, ఇది సరైన విషయం. ఈ రోజు బాప్ దాదా కూడా సాక్షిస్థితి యొక్క రాఖీ కట్టడానికి వచ్చారు. సదా సాక్షిస్థితి యొక్క రాఖీ కట్టుకుని ఉంటే సేవలో సఫలత చాలా త్వరగా వస్తుంది. ఇప్పుడు ఏ కర్తవ్యానికి అయితే నెల రోజులు పడుతుందో ఆ కర్తవ్యానికి ఒక గంట కూడా పట్టదు. సాక్షిస్థితి యొక్క రాఖీ కట్టుకోవాలి. ఇతరులకైతే పవిత్రత యొక్క రాఖీ కడుతున్నారు. కానీ బాప్ దాదా ఈ రోజు సాక్షిస్థితి యొక్క రాఖీ కడుతున్నారు. ఎంత సాక్షిగా ఉంటారో అంత సాక్షాత్కార మూర్తిగా మరియు సాక్షాత్తు మూర్తిగా అవుతారు. సాక్షిస్థితి తక్కువగా ఉన్న కారణంగా సాక్షాత్తు మరియు సాక్షాత్కార మూర్తిగా కూడా తక్కువ అయ్యారు. అందువలన ఈ ఈ అభ్యాసం చేయండి. ఏ అభ్యాసం? ఇప్పుడిప్పుడే ఆధారం తీసుకున్నారు, ఇప్పుడిప్పుడే అతీతం అయిపోయారు ఈ అభ్యాసాన్ని పెంచుకోవటం అంటే సంపూర్ణతను మరియు సమయాన్ని సమీపంగా తీసుకురావటం. అయితే ఇప్పుడు ఏ ప్రయత్నం చేయాలి? సమయాన్ని మరియు సంపూర్ణతని సమీపంగా తీసుకురండి. మరొక విషయం ధ్యాసలో ఉంచుకోవాలి - మీ రికార్డ్ మంచిగా ఉంచుకునేటందుకు సర్వులకు గౌరవాన్ని ఇవ్వండి. ఎవరు ఎంతగా సర్వులకి గౌరవాన్ని ఇస్తారో అంతగా తమ రికార్డ్ మంచిగా ఉంచుకుంటారు. ఇతరులకు గౌరవం ఇవ్వటం అంటే మీ రికార్డ్ మంచిగా తయారు చేసుకోవటం, ఒకవేళ గౌరవం తక్కువ ఇస్తున్నారు అంటే మీ రికార్డులో లోపం చేసుకుంటున్నారు. అందువలన ఈ ముఖ్య విషయం అవసరం. అర్థమైందా! ఎలా అయితే యజ్ఞ సహాయకారి అవ్వటమే సహాయం తీసుకోవటమో అలాగే గౌరవం ఇవ్వటమే గౌరవం తీసుకోవటం. ఇచ్చేదే తీసుకునేటందుకు. ఒకసారి ఇవ్వడం ద్వారా అనేకసార్లు తీసుకోవడానికి హక్కుదారులుగా అవుతున్నారు. చిన్నవారికి ప్రేమ, పెద్దలకి గౌరవం ఇవ్వాలి అంటారు కదా! కానీ అందరినీ పెద్ద వారిగా భావించి గౌరవం ఇవ్వటమే సర్వుల స్నేహం పొందడానికి సాధనం. ఈ విషయంపై కూడా విశేష ధ్యాస ఉండాలి.

ప్రతి విషయంలో 'మొదట మీరు' అనాలి. ఈ విషయాన్ని వృత్తి, దృష్టి మరియు వాణి, కర్మలోకి కూడా తీసుకురావాలి. ఎంత మొదట మీరు అంటారో అంతగానే విశ్వానికి తండ్రి అయిన బాబా సమానంగా అవుతారు. విశ్వ తండ్రి సమానం అంటే అర్ధం ఏమిటి? విశ్వానికి తండ్రి అయిన బాబా సమానంగా అవ్వటం. ఎప్పుడైతే విశ్వమహారాజు అవుతారో అప్పుడు మిమ్మల్ని విశ్వానికి తండ్రి అంటారు కదా! విశ్వమహారాజు విశ్వానికి తండ్రి కదా! కనుక విశ్వానికి కూడా తండ్రి అవుతారు మరియు విశ్వ తండ్రి సమానంగా కూడా అవుతారు. దేని ద్వారా? 'మొదట మీరు' అనటం ద్వారా.
నిర్మానంగా అవ్వటం ద్వారా ప్రత్యక్ష ప్రమాణంగా అవుతారు. నిర్మానంగా అవ్వటం ద్వారా విశ్వనిర్మాణం చేయగలరు. అర్థమైందా! ఈ స్థితిని ధారణ చేయడానికి సాక్షిస్థితి యొక్క రాఖీ కట్టుకోవాలి. ముందుగానే సాక్షిస్థితి అనే రాఖీ కట్టుకుని వెళ్లే రాఖీ యొక్క సేవ సఫలతా పూర్వకం అవుతుంది.