01.03.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సిద్ది స్వరూపంగా అయ్యేటందుకు సహజ విధి.

అందరు మాస్టర్ త్రికాలదర్శిగా అయ్యారా? త్రికాలదర్శి అవ్వటం ద్వారా ఏ కార్యం అసఫలం అవ్వదు. ఏ కార్యం చేసే ముందు అయినా మీ యొక్క త్రికాలదర్శి స్థితిలో మీరు స్థితులై ఆ కార్యం యొక్క ఆది మధ్య అంత్యాలను తెలుసుకుని ఆ కర్తవ్యం చేయటం ద్వారా సదా సఫలత లభిస్తుంది. అనగా సఫలతామూర్తి అయిపోతారు లేదా సంపూర్ణమూర్తి అయిపోతారు. యోగులకు మంత్రతంత్రాలు ప్రాప్తిస్తాయనే మహిమ ఉంది కదా! అవి ఏ సిద్ధులు? సంకల్ప సిద్ధి మరియు కర్తవ్య విధి. ఈ రెండు ఉండటం ద్వారా జన్మసిద్ద అధికారాన్ని సహజంగా పొందగలరు. సంకల్ప సిద్ధి ఎలా వస్తుందో తెలుసా? సంకల్పాలు సిద్దించకపోవడానికి కారణం ఏమిటి? వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా నడుస్తున్నాయి కనుక. వ్యర్ధ సంకల్పాలు కలవటం వలన సమర్థంగా అవ్వలేరు. రచించిన సంకల్పం సిద్ధించదు. వ్యర్థ సంకల్పాలకు సిద్ధి లభించదు.కనుక సంకల్ప సిద్ధిని పొందేటందుకు ముఖ్య పురుషార్ధం ఏమిటంటే వ్యర్థ సంకల్పాలు రచించకుండా సమర్ధ సంకల్పాలు రచించండి. అర్థమైందా! ఎక్కువ రచన రచిస్తున్నారు, అందువలన వాటిని పూర్తిగా పాలన చేసి వాటిని ఉపయోగించటం రావటం లేదు. లౌకిక రచన ( పిల్లలు ) కూడా అధికంగా రచిస్తే వారిని యోగ్యులుగా తయారు చేయలేరు. అదేవిధంగా సంకల్పాల స్థాపన అధికంగా చేస్తున్నారు. సంకల్పాల రచన ఎంత తక్కువగా ఉంటే అంత శక్తివంతంగా ఉంటుంది. రచన ఎంత ఎక్కువ ఉంటే అంతగానే శక్తిహీనంగా ఉంటుంది. కనుక సంకల్పాల సిద్ధిని పొందేటందుకు పురుషార్థం చేయవలసి ఉంటుంది. వ్యర్ధ రచనను సమాప్తం చేయండి. ఈ రోజుల్లో వ్యర్ధ రచన చేసి వాటిని పాలన చేయటంలో చాలా సమయం వ్యర్థం చేస్తున్నారు. సంకల్పాల సిద్ధి మరియు కర్మలలో సఫలత తక్కువ లభిస్తుంది. కర్మలలో సఫలత పొందడానికి యుక్తి - మాస్టర్ త్రికాలదర్శి అవ్వండి. కర్మ చేసే ముందు ఆది, మధ్య, అంత్యాలను తెలుసుకుని కర్మ చేయండి. అంతేకానీ కర్మ చేసేసిన తర్వాత అంతిమంలో ఫలితాన్ని చూసి ఆలోచనలో పడటం కాదు. అందువలన సంపూర్ణంగా అయ్యేటందుకు ఈ రెండు విషయాలపై శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది.

ఇది ప్రవృత్తిలో ఉండేవారి గ్రూపు. ప్రవృత్తిలో ఉంటూ ఈ రెండు విషయాలపై శ్రద్ధ పెట్టడం ద్వారా సేవాధారిగా కాగలరు. సేవ అనేది కేవలం నోటి ద్వారానే జరగదు, శ్రేష్ట కర్మల ద్వారా కూడా సేవ చేయవచ్చు. ఎవరైతే గ్రూపు వచ్చారో వారు తమని తాము సేవాధారి గ్రూపుగా భావిస్తున్నారా? ఈ గ్రూపులో ఎవరు స్వయాన్ని సేవాధారిగా భావిస్తున్నారో చేయి ఎత్తండి. ఎవరైతే చేయి ఎత్తారో వారు సేవ కోసం సమయం తీసి సహాయకారులు కాగలరా? మాతల సహాయం ద్వారా బాబా పేరు చాలా ప్రసిద్ధి అవుతుంది. ఎంతమంది వచ్చారో వారందరు ,సేవలో సహాయకారులు అయిపోతే చాలా త్వరగా పేరు ప్రసిద్ధి అవుతుంది. ఎందుకంటే దంపతులుగా నడిచేవారు మీరు. కనుక సేవ బాగా చేయగలరు. మీరు ఎలాంటి కర్తవ్యం చేసి చూపించాలంటే కర్తవ్యం ద్వారా ప్రతీ ఒక్క ఆత్మ మీకు ఆకర్షితం అవ్వాలి. మాతల గ్రూపు, దంపతులు ఇరువురు జ్ఞానంలో నడుస్తున్న మాతలకు సేవ కోసం సమయం తీయటం సహజం అవుతుంది. ఇప్పుడు కూడా అలాగే వచ్చారు కదా! ఇప్పుడు కూడా అక్కడ మీ కుటుంబం నడుస్తుంది కదా మీరు లేకున్నా. ఈ విషయం (భట్టీ) తప్పనిసరి అని భావించి బంధనాలను విడిపించుకుని వచ్చారు కదా! అదేవిధంగా ప్రతి సమయం మీ కుటుంబ బంధనాలను వదిలించుకుని సేవలో ఎంత సహాయకారులు అవుతారో అంతగానే ఈ కర్మల ఖాతా త్వరగా పూర్తయిపోతుంది. కనుక మాతలు ఈవిధంగా సహాయకారులు అవ్వటమే స్వ ఉన్నతికి సాధనంగా భావించాలి. వినటం మరియు వినిపించటం రెండింటిని అనుభవం చేసుకోవాలి. తండ్రి ఎలాగైతే సహాయకారి అవుతారో అలాగే మీరు కూడా సహాయకారి అవ్వాలి. ఇదే సహాయం తీసుకోవటం. మీ బంధనాలను విడిపించుకుని సేవలో సహాయకారులు కాగల శక్తిని ఈ గ్రూపు నింపుకుని వెళ్ళాలి. లేకపోతే, ఈ సబ్జెక్టులో లోపం ఉండిపోతే పూర్తి మార్కులు ఎలా తీసుకుంటారు? లక్ష్యం అయితే పూర్తిగా పాసవ్యాలనే పెట్టుకున్నారు కదా! అందువలన ఈ గ్రూపు విశేషంగా దీని కొరకు యుక్తులను రచించే ట్రైనింగ్ తీసుకుని వెళ్ళాలి. భట్టి నుండి ఏవిధంగా తయారయ్యి వెళ్ళాలో అర్థమైందా? సేవాధారి మరియు సహాయకారి. ఇంట్లో ఉంటూ శక్తి స్వరూపం యొక్క స్మృతి సదా ఉండటం ద్వారా కర్మబంధన విఘ్నం వేయలేదు. ఇంట్లో ఉంటున్నారు కానీ శక్తి రూపానికి బదులు పవిత్ర కుటుంబం యొక్క ధ్యాస ఎక్కువగా ఉంటుంది. కానీ శక్తిరూపం యొక్క వృత్తి తక్కువగా ఉంటుంది. అందువలనే ఇప్పటి వరకు కూడా కర్మబంధన ఉంది, ఏమి చేయము, ఎలా చేయము, కర్మబంధాలను ఎలా తెంచుకోము ఇలాంటి మాటలు వస్తున్నాయి. శక్తిరూపం యొక్క అలంకారం సదా స్థిరంగా ఉంచుకోలేకపోతున్నారు. అందువలనే ఇలాంటి మాటలు వస్తున్నాయి. కనుక ఈ భట్టీలో మీ స్మృతి మరియు స్వరూపాన్ని మార్చుకుని వెళ్ళాలి. అందువలన రెండు విషయాలు సదా స్మృతి ఉంచుకోవాలి. 1. పరివర్తన అవ్వాలి 2. శపధం చేయాలి. శక్తిరూపంలో మీ వృత్తి మరియు స్వరూపాన్ని కూడా పరివర్తన చేసుకోవాలి. మరియు ఎంతెంత స్వయాన్ని పరివర్తన చేసుకుంటూ ఉంటారో అంతగా ఇతరులకు శపధం కూడా చేయగలరు. అందువలన ఈ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. సుకర్మ చేసినప్పుడు తండ్రి యొక్క స్నేహ రూపం ఎదురుగా వస్తుంది. ఒకవేళ ఏదైనా వికర్మ చేస్తున్నప్పుడు బాబా యొక్క విరాట రూపాన్ని ఎదురుగా తెచ్చుకోవాలి. మీరు స్నేహిలు కదా! స్నేహిలు సదా సుకర్మ చేసేవారిగా ఉంటారు. ఏ వికర్మ జరగకూడదు, ఇది సదా స్మృతిలో ఉంచుకోవాలి. ఎందుకంటే మీరందరు సృష్టి అనే వేదికపై హీరో పాత్రధారులు. హీరో పాత్రధారులపై అందరి దృష్టి ఉంటుంది. అందువలన స్వయాన్ని ప్రవృత్తిలో ఉండేవారిగా భావించకుండా వేదికపై హీరో పాత్రధారిగా భావించి ప్రతీ కర్మ చేస్తూ వెళ్తే ఏ కర్మ తప్పుగా జరగదు.

విజ్ఞానం యొక్క పరమాణు శక్తి ఈరోజు ఏమేమి చేసి చూపిస్తుందో కదా! అదేవిధంగా శాంతిశక్తి దళం ప్రవృత్తిలో ఉంటూ ఉదాహరణగా అయ్యేవారు. అది పరమాణు శక్తి, మీరు సృష్టికి ఒక ఉదాహరణ లేదా రుజువు. రుజువుగా మీరు కూడా చాలా సేవ చేయగలరు. మాతలు చాలా అవసరం. మాతల కారణంగా కోనకోనల్లో సందేశం వ్యాపించటం ఇప్పుడు మిగిలి ఉంది. కొంతమంది ఆత్మలకి సందేశం లభించకపోవటానికి కారణం మీరు. కనుక ఈ గ్రూపు ఈ విధంగా తయారవ్వాలి. ఈ గ్రూపు సమయానుసారం సేవలో సహాయకారులు కాగలరు అశావంతులు. అదర్ కుమారుల గ్రూపు కూడా చాలా ఆశావంతుల గ్రూపు. వీరు కూడా కానున్న సహాయకారులు. కానీ సహాయకారులుగా అవ్వటం ఎలా, దీనికి కూడా యుక్తి ఉంది. కానీ శక్తి లేదు. అందువలన మీ స్వరూపాన్ని పరివర్తన చేసుకున్నట్లుగా మీ టీచరు నుండి సర్టిఫికెట్ తీసుకుని వెళ్ళాలి. ఒకొక్క కుమారీ 100 మంది బ్రాహ్మణుల కంటే ఉత్తమమైనదిగా ఎలా మహిమ చేస్తారో అలాగే ఒకొక్క మాత జగన్మాత. ఎక్కడ 100మంది బ్రాహ్మణులు - ఎక్కడ జగత్తు అంతా! అయితే ఎవరి మహిమ ఉన్నతం! ఒకొక్క మాత జగన్మాతయై జగత్తులోని ఆత్మలపై దయ, స్నేహం మరియు కళ్యాణ భావన పెట్టుకోండి. అందువలన ఈ గ్రూపు వారు ఒక ప్రతిజ్ఞ చేయాలి. ప్రతిజ్ఞ చేసే ధైర్యం ఉందా? ఏమి ప్రతిజ్ఞయో వినిన తర్వాత ధైర్యం పెట్టుకుంటారా? ఏ ప్రతిజ్ఞ అయినా కానీ ధైర్యం ఉందా? ఏమని భావిస్తున్నారు? ప్రతిజ్ఞ ఏదైనా కానీ ధైర్యం ఉందా? ప్రతిజ్ఞ కష్టమైనది అయితే తర్వాత ఆలోచిస్తారా? ప్రతీ ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలి - సమయానుసారం సేవలో సహాయకారితో పాటు వెనువెంట శక్తి స్వరూపమై విఘ్న వినాశకులమై ప్రవృత్తిలో ఉంటాము. ప్రతిజ్ఞ సహజమైనదే కదా! విఘ్నాలు వస్తే అరవము, భయపడము కానీ శక్తి అయ్యి ఎదుర్కుంటాం. ఈ ప్రతిజ్ఞ సదాకాలికం కొరకు మీతో మీరు చేయండి. ఏ రకమైన ఆసక్తి ఉన్నా మాయ వచ్చేస్తుంది. ఆసక్తి వలన మాయ వస్తుంది. అనాసక్తంగా అయిపోతే మాయ రాలేదు. ఆసక్తి సమాప్తం అయిపోతే శక్తి రూపంగా కాగలరు. మీ దేహంపై లేదా సంబంధీకులపై, పదార్థాలపై ఎక్కడైనా కానీ కొంచెం అయినా కానీ ఆసక్తి ఉంటే మాయ వస్తుంది మరియు శక్తిగా కాలేరు. అందువలన శక్తిరూపంగా అయ్యేటందుకు ఆసక్తిని అనాసక్తిలోకి మార్చుకోండి. ఒక దీపం అనేక దీపాలను వెలిగించగలదు అని మీరు ఇతరులకు చెప్తారు కదా! అదే విధంగా మీరు ఒకొక్కరు విశ్వమంతటి కళ్యాణానికి నిమిత్తంగా కాగలరు. కనుక మీ కర్తవ్యాన్ని మరియు మీ స్వరూపాన్ని రెండింటిని గుర్తుంచుకుని నడవండి. బ్రహ్మ యొక్క భుజాలు కదా! స్వయాన్ని బ్రహ్మ యొక్క భుజంగా భావిస్తున్నారా? బ్రహ్మ యొక్క భుజాల కర్తవ్యం ఏమిటి? బ్రహ్మ యొక్క కర్తవ్యం స్థాపన. కనుక బ్రహ్మ యొక్క భుజాలు కూడా సదా స్థాపనా కర్తవ్యంలో తత్పరులై ఉండాలి. హద్దులోని సంబంధాలలోకి ఏవిధంగా రావాలో వీరికి నేర్పించండి. స్వయాన్ని నిర్బంధనగా తయారు చేసుకోగలరు కానీ ఆ పద్దతి రావటం లేదు. 1. పద్దతి తెలియదు 2. శక్తి లేదు. కనుక శక్తిని కూడా నింపుకోవాలి మరియు పద్దతిని కూడా తెలుసుకోవాలి. అయినా కానీ బాప్ దాదా ఆశావంతుల గ్రూపు అని అంటున్నారు. ఇప్పుడు చూస్తాను - ప్రతీ ఒక్కరు ఎన్నిసార్లు సేవకి అవకాశం తీసుకుంటారో! చెప్తే చేయటం ద్వారా అవకాశం లభించదు. ఎవరెవరు స్వయంగా అవకాశం ఇస్తారో ఇప్పుడు చూస్తాను. స్నేహిలే కానీ స్నేహితో పాటు సహయోగిగా కూడా అవ్వండి. ఈ గ్రూపుకి ఏమి పేరు పెట్టాలి? నామకరణం చేస్తారు కదా! ఎందుకంటే పరివర్తనా భట్టికి వచ్చారు. మీరు కూడా నామకరణ మహోత్సవానికి వచ్చారు. ఈ గ్రూపు పేరు ఏమిటి? సదా సహయోగి మరియు శక్తి స్వరూప గ్రూపు. మీ శక్తిని మీరు పోగొట్టుకుంటే రావణుడు కూడా చూస్తూ ఉంటాడు - వీరు తమ శక్తిని కోల్పాయారు అని చూసి బాగా ఏడిపిస్తాడు. శక్తిని పోగొట్టుకోవటం అనగా రావణుడిని పిలవటం. అందువలన ఎప్పుడూ కూడా మీ శక్తిని తక్కువ చేసుకోకూడదు. పెంచుకోవటం నేర్చుకోండి. భవిష్య 21 జన్మల కొరకు శక్తిని జమ చేసుకోండి. ఇప్పటి నుండి జమ చేసుకుంటేనే జమ అవుతుంది. కనుక ఎంత జమ చేసుకున్నాను అని సదా చూసుకుంటూ ఉండండి. మంచిది.