11.03.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


పరిస్థితులను దాటేటందుకు సాధనం - స్వస్థితి.

వ్యక్తంలో ఉంటూ అవ్యక స్థితిలో ఉండే అభ్యాసం ఇప్పుడు సహజం అయిపోయిందా! ఎప్పుడు ఎక్కడ మీ బుద్దిని ఉపయోగించాలంటే ఉపయోగించగలగాలి - ఈ అభ్యాసాన్ని పెంచుకునేటందుకు మీ ఇంటికి లేదా భట్టీకి వస్తున్నారు. ఇక్కడ ఈ కొద్ది సమయం యొక్క అనుభవం సదాకాలికంగా ఉండేటందుకు ప్రయత్నించాలి. ఇక్కడ భట్టీలో లేదా మధువనంలో నడుస్తూ తిరుగుతూ ఎలా స్వయాన్ని అవ్యక్త ఫరిస్తాగా భావిస్తున్నారో అదేవిధంగా కర్మక్షేత్రం లేదా సేవాభూమిలో కూడా ఈ అభ్యాసం మీతో పాటే ఉంచుకోవాలి. ఒకసారి చేసుకున్న అనుభవం ఎక్కడైనా కానీ గుర్తు చేసుకోగలరు. కనుక ఇక్కడి అనుభవం అక్కడ కూడా గుర్తు ఉంచుకోవటం ద్వారా, ఇక్కడి స్థితిని అక్కడ కూడా ఉంచుకోవటం ద్వారా బుద్ధికి అలవాటు అవుతుంది. లౌకిక జీవితంలో కూడా అలవాటు అనేది వద్దనుకున్నా కానీ ఆకర్షిస్తుంది, అదేవిధంగా అవ్యక్త స్థితిలో స్థితులయ్యే అభ్యాసం అయిపోతే ఆ అలవాటు కూడా తన వైపుకి ఆకర్షిస్తూ ఉంటుంది. ఇంత పురుషార్ధం చేస్తూ కూడా కొంతమంది ఆత్మలు ఇప్పటికీ కూడా నా అలవాటు అని అంటున్నారు. ఈ జవాబు ఇప్పటికీ ఇస్తున్నారు. అదేవిధంగా ఈ స్థితి లేదా ఈ అభ్యాసం కూడా అలవాటుగా అయిపోవాలి. అప్పుడు అనుకోనప్పటికీ ఈ అవ్యక్త స్థితి యొక్క అలవాటు తన వైపుకి ఆకర్షించుకుంటుంది. ఈ అలవాటు మిమ్మల్ని న్యాయస్థానానికి వెళ్ళనివ్వకుండా రక్షిస్తుంది. అర్ధమైందా! చెడ్డ అలవాట్లు చేసుకోగలిగినప్పుడు ఈ అలవాటు చేసుకోలేరా? ఏ విషయాన్ని అయినా కానీ రెండు లేదా నాలుగు సార్లు చేస్తూ ఉంటే అదే అభ్యాసం అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ భట్టీలో లేదా మధువనంలో ఈ అభ్యాసాన్ని కూడా అభ్యసిస్తున్నారు కదా! ఇక్కడ చేస్తూ ఉంటే అదే అభ్యాసం అయిపోతుంది. అభ్యాసం చేస్తూ చేస్తూ ఏవిధంగా అయిపోవాలి? అదే సహజంగా మరియు స్వభావంగా అయిపోవాలి. అర్థమైందా! ఇది నా స్వభావం అని అంటారు కదా! అదేవిధంగా ఈ అభ్యాసం అభ్యసించటం ద్వారా సహజంగా మరియు స్వభావంగా అయిపోవాలి. ఈ స్థితియే మీ స్వభావంగా అయిపోతే ఏమవుతుంది? ప్రాకృతిక ఆపదలు సంభవిస్తాయి. ఇది మీ స్వభావంగా అవ్వని కారణంగా ప్రాకృతిక ఆపదలు ఆగి ఉన్నాయి. ఎందుకంటే ఎదుర్కోవలసిన వారు తమ స్వ స్థితితో పరిస్థితులను దాటలేకపోతే ఆ పరిస్థితులు ఎలా రాగలవు? ఎదుర్కోవలసిన వారు ఇప్పుడింకా తయారవ్వలేదు. అందువలన ఈ పరదా తొలగటంలో ఆలస్యమవుతుంది. ఈ పాత అలవాట్లతో, పాత సంస్కారాలతో, పాత విషయాలతో, పాత ప్రపంచంతో, పాత దేహ సంబందీకులతో ఇప్పటికీ ఇంకా వైరాగ్యం రాలేదా? ఎక్కడికైనా వెళ్ళవలసినప్పుడు ఏవి వదలాలో వాటివైపు వెన్ను పెట్టాలి. ఇప్పుడు వెన్ను పెట్టటం రాలేదా? అటువైపు వెన్ను పెట్టటం లేదు, సాధనను అభ్యసించటం లేదు. సీత మరియు రావణుని బొమ్మ చూశారు కదా! రావణుని వైపు సీత ఏమి పెట్టింది? వెన్ను చూపింది కదా! వెన్ను చూపితే సహజంగానే ఆ ఆకర్షణ నుండి రక్షించుకోగలదు. కానీ మీరు వెన్ను చూపటం లేదు. స్మశానం దగ్గరకి రాగానే ముఖం అటువైపు, తల ఇటువైపు పెడతారు కదా! ఇక్కడ వెన్ను చూపటం రావటం లేదు. ముఖం చూపుతున్నారు అందువలన అక్కడక్కడ ఆకర్షణలో చిక్కుకుంటున్నారు. రెండు రకాలుగా వెన్ను చూపటం రావటం లేదు. మాయ చాలా ఆకర్షణీయ రూపాలను రచిస్తుంది. అందువలన వెన్ను చూపటానికి బదులు అనుకోకుండానే ఆకర్షణలోకి వచ్చేస్తున్నారు. ఆ ఆకర్షణలో పురుషార్ధాన్ని మర్చిపోయి, ముందుకి వెళ్ళటం మరచి ఆగిపోతున్నారు. అప్పుడు ఏమవుతుంది? గమ్యానికి చేరటం ఆలస్యం అయిపోతుంది. కుమారుల భట్టీ కదా! కుమారులు ఈ బొమ్మను ఎదురుగా ఉంచుకోవాలి. మాయ వైపు ముఖం తిప్పుతున్నారు. మాయ వైపుకి ముఖం త్రిప్పితే మాయ ద్వారా వచ్చే పరిస్థితులను ఎదుర్కోలేకపోతున్నారు. అటువైపుకి అసలు ముఖం త్రిప్పకుండా ఉంటే ఎదుర్కోగలరు. అర్థమైందా!

కుమారులు సదా పవిత్రంగా సతో ప్రధానంగా ఉన్నదానికి స్మృతి చిహ్నం ఏది? తెలుసా! సనంత్ కుమార్. అతని విశేషత ఏమి చూపిస్తారు? అతనికి సదా చిన్న కుమారుని రూపమే చూపిస్తారు. అతనికి ఎప్పుడూ 5 సంవత్సరాలు వయస్సే అని చెప్తారు. ఇది పవిత్రతకి మహిమ. 5 సంవత్సరాల పిల్లవాడు పూర్తి పవిత్రంగా ఉంటాడు. సంబంధాల ఆకర్షణకి దూరంగా ఉంటాడు. లౌకిక పరివారంలో ఉన్నా కానీ స్థితి చిన్నపిల్లవాని వలె పవిత్రంగా ఉండాలి. పవిత్రతకి గుర్తు ఇది. కుమారుడు అనగా పవిత్ర స్థితి. దాంట్లో కూడా ఒక్కరు కాదు, సంఘటనగా చూపించారు. ఉదాహరణలో అయితే కొద్దిమందినే చూపిస్తారు. మీ సంఘటన అందరి యొక్క పవిత్రతకి స్మృతిచిహ్నం ఇది. ఎలాంటి పవిత్రత ఉంటుందంటే దాంట్లో అపవిత్రత యొక్క సంకల్పం లేదా అనుభవం కూడా ఉండదు. ఇలాంటి స్థితిని స్మృతిచిహ్నంగా తయారు చేసుకుని వెళ్ళాలి. అందువలనే భట్టీకి వచ్చారు కదా! ఈ ప్రాపంచిక విషయాలతో, సంబంధాలతో పూర్తిగా అతీతం అవ్వాలి అప్పుడే దైవి పరివారానికి, బాప్ దాదాకి మరియు విశ్వమంతటికీ ప్రియంగా అవుతారు. మాములుగా కూడా ఏ సంబంధికుల నుండి అయినా అతీతం అయిపోతే, అనగా లౌకిక రీతిలో వేరు అయిపోతే అలా అతీతం అయిన తర్వాత మరింత ప్రియంగా అవుతారు. అలా కాకుండా వారితోనే ఉంటూ లేదా వారి సంబంధం యొక్క తగుల్పాటులోనే ఉంటే అంత ప్రియంగా ఉండరు. అది లౌకిక విషయం. కానీ ఇక్కడ జ్ఞాన సహితంగా అతీతం అవ్వాలి. కేవలం బాహ్యంగా అతితం అవ్వటం కాదు. మనస్సు యొక్క తగుల్పాటు ఉండకూడదు. ఎంతెంత అతీతంగా అవుతారో అంతంతగా ప్రియంగా తప్పకుండా అవుతారు. ఎప్పుడైతే మీరు మీ దేహం నుండి కూడా అతీతం అయిపోతారో ఆ అతీత స్థితి మీకు కూడా ప్రియమనిపిస్తుంది. ఇలాంటి అనుభవం ఎప్పుడైనా చేసుకున్నారా? మీ అతీత స్థితి మీకే ప్రియమనిపిస్తుంది, మరయితే తగుల్పాటు నుండి అతీత స్థితి ప్రియంగా అనిపించదా? ఏ రోజు అయితే తగుల్పాటు ఉంటుందో, అతీత స్థితి ఉండదో మీకు మీరు కూడా ప్రియంగా అనిపించరు, అలజడి అవుతూ ఉంటారు. ఈ అనుభవం అయితే అందరికీ అయ్యి ఉంటుంది. కేవలం ఇలాంటి అనుభవాలను . సదాకాలికంగా చేసుకోలేరు. ఈ అతీత మరియు అతి ప్రియ స్థితి యొక్క అనుభవం చేసుకోనివారు ఎవరూ ఉండి ఉండరు. స్వయాన్ని యోగిగా పిలిపించుకుంటున్నారా? మిమ్మల్ని మీరు సహజరాజయోగిగా పిలుచుకుంటున్నప్పుడు ఈ అనుభవం చేసుకోకపోవటం అనేది జరగదు. లేకపోతే ఈ టైటిల్ మీకు మీరు ఇచ్చుకోలేరు. యోగి అనగా ఈ యోగ్యత ఉండాలి. అప్పుడే యోగి అంటారు. లేకపోతే మీ పరిచయం ఇచ్చేటప్పుడు మేము సహజ రాజయోగ చదువు యొక్క విధ్యార్థులం అని చెప్పాలి. విద్యార్థులు కదా! విద్యార్ధులకి చదువు యొక్క అనుభవం ఉండకపోవటం అనేది ఉండదు. కనుక ఈ అనుభవాన్ని ఎంత వరకు సదాకాలికంగా తయారు చేసుకోగలిగారు లేదా అల్పకాలికంగానే అనుభవం చేసుకుంటున్నారా అనేది తప్పక తెలుసుకోవాలి. ఈ తేడా ఉంటుంది. ఇప్పటి వరకు అల్పకాలిక అనుభవమే ఉంటే ఏమవుతుంది? సంగమయుగం యొక్క వారసత్వం మరియు భవిష్య వారసత్వం - రెండూ అల్పకాలికంగానే పొందగలరు, అర్థమైందా? పూర్తి సమయం వారసత్వాన్ని పొందలేరు, కొంచెం సమయమే పొందగలరు. దీనిలోనే సంతుష్టమా ఏమిటి?

ఈరోజు కుమారుల భట్టీ యొక్క ప్రారంభ రోజు. భట్టీ యొక్క ప్రారంభం అనగా గట్టిపడటం యొక్క ప్రారంభం. కొందరు స్వాహా అవుతారు. కొందరు భట్టీలో గట్టిపడతారు, కొందరు పవిత్రత యొక్క సంకల్పాన్ని ధృడంగా చేసుకుంటారు. ఇవి చేయడానికే వచ్చారు కదా! కనుక ఏదైతే చెప్పారో అది చేశామా అని ఇప్పుడు చూసుకోవాలి. ఈ గ్రూపు మాయతో అమాయకులు మరియు ఙ్ఞానంతో తెలివైనవారుగా అయ్యి వెళ్ళాలి. సత్యయుగి ఆత్మలు ఇక్కడికి వచ్చిప్పుడు వికారాల యొక్క విషయాల జ్ఞానంతో అమాయకులుగా ఉంటారు కదా! చూశారు కదా! మేము సత్యయుగంలో ఉనప్పుడు ఎలా ఉండేవారమో అని జ్ఞాపకం వచ్చింది కదా! మాయ యొక్క ఙ్ఞానంతో అమాయకులుగా ఉండేవారు. గుర్తు వస్తుందా? మీ యొక్క ఆ సంస్కారాలు గుర్తు వస్తున్నాయా? లేక కేవలం విన్నారు కనుక అలా భావిస్తున్నారా? మీ యొక్క ఈ జన్మలోని బాల్య విషయాలు స్పష్టంగా ఎలా అయితే స్మృతిలోకి వస్తాయో అదేవిధంగా మీకు ఉన్న నిన్నటి సంస్కారాలు ఈ జీవితం యొక్క సంస్కారాల వలె స్పష్టంగా స్మృతిలోకి వస్తున్నాయా? చేయి ఎత్తండి. అవి స్పష్టంగా స్మృతిలోకి రావాలి. సాకార రూపంలో (బ్రహ్మాబాబాలో) స్పష్టంగా స్మృతి ఉండేవి. ఈ స్మృతి ఎప్పుడు ఉంటుందంటే మీ ఆత్మిక స్వరూపం యొక్క స్మృతి స్పష్టంగా మరియు సదాకాలికంగా ఉన్నప్పుడు. ఇప్పుడు అత్మిక స్వరూపం యొక్క స్మృతి, అప్పుడప్పుడు దేహం అనే పరదా లోపల దాగిపోతుంది. అందువలన ఈ స్మృతి కూడా పరదా లోపలే కనిపిస్తుంది. స్పష్టంగా కనిపించటం లేదు. ఆత్మిక స్మృతి స్పష్టంగా మరియు చాలాకాలం ఉండటం ద్వారా మీ భవిష్య వారసత్వం లేదా మీ భవిష్య సంస్కారాల స్వరూపం ఎదురుగా వస్తుంది. మీ చిత్రాలలో ఏమి చూపించారు? ఇతరుల గురించా లేక మీ స్థితి గురించా? కనుక భవిష్య సంస్కారాలను స్పష్టంగా స్మృతిలోకి తెచ్చుకునేటందుకు ఆత్మిక స్వరూపం యొక్క స్మృతి సదాకాలికంగా మరియు స్పష్టంగా ఉండాలి. ఎలాగైతే ఈ దేహం స్పష్టంగా కనిపిస్తుందో, అదేవిధంగా మీ ఆత్మ స్వరూపం స్పష్టంగా కనిపించాలి అనగా అనుభవంలోకి రావాలి. ఇప్పుడు కుమారులు ఏమి చేయాలి? తెలివైనవారిగా కూడా అవ్వాలి మరియు అమాయకులుగా కూడా అవ్వాలి. సహజమైన చదువు కదా! రెండు మాటల్లో కోర్సు అంతా పూర్తయిపోతుంది. ఈ ముద్ర వేసుకుని వెళ్ళాలి. బలహీనత, అలజడి మొదలైన విషయాలంటే ఏమిటో తెలియనివారిగా అవ్వాలి. బలహీనత అనే మాట కూడా సమాప్తం అవ్వాలి. ఈ గ్రూపుకి పేరు ఏమిటి? సాధారణత మరియు పవిత్రతలో ఉండే గ్రూపు. సాధారణంగా ఉన్నవారే సుందరంగా ఉంటారు. సాధారణత కేవలం వస్త్రధారణ విషయంలోనే కాదు, అన్ని విషయాలలో అనగా నిరహంకారిగా ఉండటం కూడా సాధారణంగా ఉండటం. క్రోధం లేకుండా ఉండటం కూడా సాధారణత. లోభం లేకుండా ఉండటం సాధారణత. ఈ సాధారణత పవిత్రతకి సాధనం. మంచిది. ఏమి స్లోగన్ గుర్తుంచుకుంటారు? కుమారులు ఏది కావాలంటే అది చేయగలరు. ఏ విషయం చెప్పినా కానీ మొదట చేస్తాం, చూపిస్తాము తర్వాత చెప్తాము అని అనాలి. మొదట చెప్పటం కాదు. మొదట చేస్తాము, చూపిస్తాము ఆ తర్వాత చెప్తాము. ఈ స్లోగన్ గుర్తుంచుకోవాలి. మంచిది.