18.04.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


మనస్సు యొక్క భావాలను తెలుసుకునే విధి మరియు లాభాలు.

ఇక్కడ కూర్చున్న వారందరు మన్మనాభవ యొక్క స్థితిలో స్థితులయ్యారా? ఎవరైతే స్వయం మన్మనాభవ స్థితిలో ఉంటారో, వారే ఇతరుల మనోభావాలను తెలుసుకోగలరు. ఏ వ్యక్తి అయినా మీ ఎదురుగా వస్తే మన్మనాభవ స్థితిలో స్థితులై వారి మనోభావాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలరా? ఎందుకంటే ఎప్పుడైతే మీ స్థితి సూక్ష్మంగా, మన్మనాభవగా ఉంటే ఆ సూక్ష్మ స్థితి సూక్ష్మ భావాన్ని గ్రహించగలదు. ఈ అభ్యాసం అనుభవంలోకి వస్తుందా? మాట ఏదైనా కానీ ఎవరి భావం ఏమిటో తెలుసుకునే అభ్యాసం చేస్తూ వెళ్ళండి. ఎవరి మనోభావాలను అయినా అర్ధం చేసుకుంటే ఏమి ఫలితం వస్తుంది? ప్రతీ ఒక్కరి మనస్సులోని భావం తెలుసుకోవటం ద్వారా వారి యొక్క కోరిక లేదా ఏ ప్రాప్తి పొందాలనుకుంటున్నారో వారికి అది లభిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మీరు వారిని ఏవిధంగా తయారుచేయాలని అనుకుంటారో వారు ఆవిధంగా తయారవుతారు; అనగా సేవలో సఫలత చాలా త్వరగా వస్తుంది. ఎందుకంటే వారి కోరిక అనుసారంగా వారికి ప్రాప్తి లభించింది కనుక. ఎవరికైనా శాంతి యొక్క దాహం ఉందనుకోండి, వారికి శాంతి లభిస్తే ఏమవుతుంది? ప్రాప్తి లభించటం ద్వారా అవినాశి పురుషార్ధిగా అయిపోతారు. కనుక మనస్సులోని భావాన్ని పరిశీలించటం ద్వారా లేదా అర్ధం చేసుకోవటం ద్వారా ఏమి పరిణామం వస్తుంది? కొంచెం సమయంలోనే సేవ యొక్క సఫలత ఎక్కువ వస్తుంది. అంటే సఫలతా స్వరూపులుగా అయిపోతారు. ఇప్పుడు పురుషార్ధ స్వరూపులుగా ఉన్నారు. ఈ లక్షణాలు రావటం ద్వారా సఫలతా స్వరూపులు అయిపోతారు. అర్ధమైందా! ఇప్పుడు సఫలతను పొందేటందుకు మీ సమయం, సంకల్పం, సంపద శక్తి చాలా ఉపయోగించవలసి ఉంటుంది. కానీ అప్పుడు ఏమవుతుంది? సఫలత తనకు తానే మీ ఎదురుగా వస్తుంది. సంపద ఉపయోగించవలసిన అవసరం లేదు, సంపద స్వయంగా మీ ముందు స్వాహా అయిపోతుంది. అర్ధమైందా! ఒక్క విషయాన్ని ధారణ చేయటం ద్వారా ఇంత తేడా కనిపిస్తుంది. ఆ ఒక్క విషయం ఏమిటి? మన్మనాభవ అయ్యి ప్రతీ ఒక్కరి మనస్సులోని భావాన్ని తెలుసుకోవాలి. ప్రకృతి దాసి అవుతుంది అని ఏదయితే మహిమ ఉందో అది సత్యయుగంలో జరుగుతుందా? సత్యయుగంలో అయితే అలా జరిగిందని ఆ విషయం తెలియనే తెలియదు. కానీ ఇప్పుడు ప్రకృతిపై విజయీగా అవ్వటానికి ఇంత పురుషార్ధం చేస్తున్నారు. అలా ప్రకృతిపై విజయం లేదా ప్రాప్తి అనేది ఈ శ్రేష్ట జన్మలోనే చూస్తారు. ప్రకృతి మిమ్మల్ని ఆధీనం చేసుకోలేదు. మీరు అధికారులై ప్రకృతి యొక్క కర్తవ్యాన్ని చూస్తారు. అర్ధమైందా! ఏ రకమైన ఆధీనత ఉండదు, అన్నింటిపై అధికారాన్ని అనుభవం చేసుకుంటారు, అదే సంపూర్ణ స్థితి. ఈ విధంగా తయారయ్యేటందుకు ఏమి చేయాలి?

1. ఆత్మీయత 2. ఈశ్వరీయ నషా మీ ముఖంలో కనిపించాలి. 3. సేవలో దయాహృదయం యొక్క సంస్కారం లేదా గుణం ప్రత్యక్ష రూపంలో ప్రతీ ఆత్మకి అనుభవంఅవ్వాలి. మూడు విషయాలు - ఆత్మీయత, నషా మరియు దయా హృదయం అనే గుణం, ఈ మూడు విషయాలు ప్రత్యక్షంగా స్థితిలో, ముఖంలో, సేవలో అనగా కర్మలో కనిపించాలి అప్పుడు సఫలత మాకు సమీపంగా వస్తూ ఉందని భావించండి. ఈ మూడూ వెనువెంట కావాలి. ఇప్పుడు ఏమి జరుగుతుంది. దయా హృదయులు అవుతున్నారు. కానీ దయాహృదయులతో పాటు నషా కూడా కనిపించాలి. రెండూ వెనువెంట కనిపించటం లేదు. దయాహృదయం లేదా నషా ఏదో ఒకటే కనిపిస్తుంది. కానీ నషాతో పాటు ఆత్మీయత కూడా కనిపించాలి. మూడూ వెనువెంట ప్రత్యక్షంగా కనిపించాలి. దీనిలో అర్జునులుగా అయినవారు తక్కువగా ఉన్నారు. అందరు అభ్యాసిలుగా ఉన్నారు. ఇప్పుడు స్వయాన్ని అందరికంటే మహాన్ ఆత్మగా భావిస్తున్నారు, కానీ మహాన్ ఆత్మ అయ్యి ప్రతీ సంకల్పం మరియు ప్రతీ కర్మ చేస్తున్నారా? లక్ష్యంగా భావించి దానిని ప్రత్యక్షం చేయాలి. సర్వాత్మలకంటే నేను శ్రేష్టాతి శ్రేష్టమైన మహాన్ ఆత్మను... ఈ స్మృతిలో ఎవరి ఎదురుగా వెళ్ళినా కానీ అందరూ ఏవిధంగా అనుభవం చేసుకుంటారు? మీ మహానత ముందు అందరూ శిరస్సు వంచుతారు. ఈనాటి కలియుగంలో గొప్ప గొప్ప పదవులు కలిగిన వారు కూడా మీ జడచిత్రాల ముందు ఏమి చేస్తారు? శిరస్సు వంచుతారు. చిత్రాల ముందు శిరస్సు వంచుతున్నప్పుడు చైతన్య చరిత్రవంతులు, సర్వ గుణాలలో తండ్రి సమానంగా చైతన్యమూర్తిగా ఉన్నవారి ముందు శిరస్సు వంచరా? ఇది భవిష్యత్తులో లభించే ఫలితం అని భావిస్తున్నారా? లేక ఇప్పుడే జరగాలా? ఎప్పుడు? అంతిమానికి కూడా ఇప్పుడు ఎంత సమయం ఉంది? మీరు వంగి వారిని వంచితే గొప్ప విషయం ఏమి ఉంది? సేవ కారణంగా అక్కడక్కడ వంగవలసి ఉంటుంది అంటున్నారు. కానీ ఈ లక్ష్యం పొరపాటు. ఈ లక్ష్యంలోనే బలహీనత ఉంది. బీజమే బలహీనం అయితే ఫలం ఎలాంటిది లభిస్తుంది? కొత్తగా స్థాపన చేసేవారు ఇలా ఆలోచించరు - కొంచెం వంగి చేయాలని, కొంతమంది ఆత్మలు కూడా అందరినీ వంగింపచేయాలనే లక్ష్యం పెట్టుకుని తమ ముందు వంగింప చేసుకుంటారు. ఆ రకంగా చూస్తే ఈ స్థాపన కార్యం ఎంత గొప్పది మరియు ఎవరి మతం అనుసారం ఉంది? వారి ముందు సర్వాత్మలు వంగవలసిందే, ఈ లక్ష్యం పెట్టుకుని, ఈ ఈశ్వరీయ నషాని ధారణ చేసి ఎవరి ఎదురుగానైనా వెళ్తే ఏమి ఫలితం వస్తుందో చూడండి. మహానత కొరకు జ్ఞానం యొక్క మహీనతలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఎంతెంత జ్ఞానం యొక్క మహీనతలోకి (లోతులకు) వెళ్తారో అంతగా స్వయాన్ని మహాన్ గా తయారు చేసుకోగలరు. మహానత తక్కువగా ఉందంటే ఙ్ఞానం యొక్క మహీనత యొక్క అనుభవం తక్కువగా ఉందని అర్ధం. స్వయాన్ని పరిశీలించుకోండి. మహాన్ ఆత్మల కర్తవ్యం ఏమిటి? ఇది స్మృతిలో ఉంచుకోండి. మామూలుగా కూడా మహాన్ కర్తవ్యం చేసి చూపించేవారినే మహానాత్మ అని అంటారు. మహానాత్మల కర్తవ్యం కూడా మహాన్ గా ఉండాలి, రోజంతటి దినచర్యలో ఇది పరిశీలించుకోండి - మహాన్ ఆత్మనైన నేను రోజంతటిలో ఏ మహన్ కర్తవ్యాన్ని చేశాను? మహాదానిగా అయ్యానా? మహానాత్మలు దాన పుణ్యాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీరయితే అందరికంటే మహానాత్మలుగా పిలవబడుతున్నారు. కనుక ఈరోజంతటిలో ఎంతమందికి దానం ఇచ్చాను మరియు ఏ దానం ఇచ్చాను? మహాన్ ఆత్మల భోజనం, ఆహారం అన్నీ మహాన్ గా ఉంటాయి. అదేవిధంగా ఈరోజు మా బుద్ధి యొక్క భోజనం మహాన్ గా ఉందా అని చూసుకోండి. శుద్ధ భోజనాన్ని స్వీకరించారా? మహాన్ అత్మగా పిలువబడేవారు అశుద్ద భోజనాన్ని స్వీకరిస్తే అందరూ ఏమంటారు? వీరు మహానాత్మ అని అంటారా? మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి - ఈరోజు నేను బుద్ధి ద్వారా అశుద్ధ సంకల్పాల యొక్క భోజనాన్ని స్వీకరించలేదు కదా? మహానాత్మల యొక్క ఆహారవిహారాలను పరిశీలిస్తూ ఉంటారు కదా! అదేవిధంగా ఈరోజు రోజంతటిలో నా బుద్ధి యొక్క ఆహారం ఏవిధంగా ఉంది? ఒకవేళ ఏదైనా అశుద్ధ సంకల్పం లేదా వికల్పం లేదా వ్యర్ధ సంకల్పాన్ని అయినా బుద్ధి గ్రహిస్తే ఈరోజు నా ఆహారంలో అశుద్ధత వచ్చింది అని భావించండి. మహానాత్మల యొక్క ప్రతి వ్యవహారం అనగా నడవడిక ద్వారా సర్వాత్మలకు సుఖం యొక్క దానాన్ని ఇచ్చే లక్ష్యం కలిగి ఉంటుంది. వారు సుఖం ఇస్తారు మరియు సుఖం తీసుకుంటారు. ఈ విధంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి - మహానాత్మను అయిన నేను ఈరోజు ఏ ఆత్మకి దు:ఖం ఇవ్వలేదు కదా? పుణ్య కార్యం అంటే ఏమిటి? పుణ్యము అనగా ఎవరికైనా ఏదైనా ఇస్తే ఆ ఆత్మ మనస్సు నుండి మనకు ఆశీర్వాదాలు రావాలి, దానినే పుణ్య కార్యం అని అంటారు. ఎవరికైనా మీరు సుఖాన్నిస్తే వారు మీకు ఆశీర్వాదాలు ఇస్తారు. ఇదే పుణ్యకర్మ మరియు మహానాత్మల ముఖ్య లక్షణం - అహింస. కనుక మీరు రోజంతటిలో ఇది కూడా పరిశీలించుకోవాలి - నేను ఏ హింస చేయలేదు కదా! హింస అంటే ఏమిటి? దీనిని కూడా పరిశీలించుకోవాలి. మీరు స్వయాన్ని డబల్ అహింసకులుగా పిలుచుకుంటున్నారు. మనస్సులో మీ సంస్కారాలతో యుద్ధం కూడా చాలా జరుగుతుంది. మాయను చంపే హింస చేస్తున్నారు కదా! అది యుద్ధం అయినప్పటికీ దానిని అహింస అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే ఆ యుద్ధ పరిణామంగా సుఖం, శాంతి వస్తాయి. హింస అనగా దాని ద్వారా దు:ఖం, అశాంతి ప్రాప్తిస్తాయి. కానీ దేని ద్వారా అయితే సుఖం, శాంతి ప్రాప్తిస్తాయో లేదా కళ్యాణం జరుగుతుందో దానిని హింస అని అనరు. కనుక మీరు డబల్ అహింసకులు అయ్యారు. మహానాత్మల యొక్క లక్షణాలు ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ చూసుకోవాలి. ఈరోజు దినచర్యలో ఏ హింస చేయలేదు కదా నేను అని చూసుకోవాలి. ఒకవేళ మీ మాటల ద్వారా ఎవరి స్థితిని అయినా అలజడి చేశారంటే అది కూడా హింసయే అవుతుంది. బాణం వేసి గాయపరచటం ఎలాగైతే హింసయో అదేవిధంగా కొన్ని మాటల ద్వారా ఎవరి యొక్క ఈశ్వరీయ స్థితిని అయినా అలజడి చేస్తే అనగా గాయపరిస్తే అది కూడా హింసయే. మీ యొక్క సతోప్రధాన సంస్కారాలు లేదా ఆత్మ యొక్క వాస్తవిక ఈశ్వరీయ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి అణిచివేసి ఇతర సంస్కారాలను ప్రత్యక్షంలోకి తీసుకువస్తుంటే అది కూడా హింసగానే పరిగణించబడుతుంది. మీ వాస్తవిక సతోప్రధాన స్థితి యొక్క సంస్కారాలను అణిచివేయటం కూడా హింసయే. అర్థమైందా! ఈ లక్షణాలన్నీ ఎంత వరకు మీలో ప్రత్యక్షంగా ఉన్నాయో పరిశీలించుకోవాలి. మహానాత్మల లక్షణాలు ఏమిటో ఇప్పుడు అర్థమైందా! రోజంతా దానం కూడా చేస్తూ ఉండండి, పుణ్య కర్మ కూడా చేయండి మరియు అహింసకులుగా కూడా అవ్వండి. అప్పుడు స్థితి ఏవిధంగా తయారయిపోతుందో చెప్పండి. ఇలా మహీనతలోకి వెళ్ళేవారికి, సంపూర్ణ స్థితిలో స్థితులయ్యే మహానాత్మల ముందు అందరూ తప్పక తలవంచుతారు. స్థూలమైన శిరస్సు వంచుతారా? శిరస్సు అనేది అన్నింటికంటే పైన ఉంటుంది, ఆ శిరస్సుని వంచారంటే అన్నీ వంచినట్లే. అదేవిధంగా ఈనాడు ఎవరైతే అన్నింటికంటే తమని గొప్పవారిగా లేదా తమ కర్తవ్యాన్ని గొప్పగా భావిస్తున్నారో వారందరు తలవంచుతారు. అనగా ఈ ఈశ్వరీయ కర్తవ్యం ముందు మా కర్తవ్యాలు అసలు ఏమి గొప్ప కాదు అని అనుభూతి చెందుతారు. తమ శ్రేష్ఠతని శ్రేష్టంగా కాకుండా సాధారణంగా భావిస్తారు, అదే తలవంచటం. దీనినే సర్వాత్మలు మీ ముందు తలవంచటం అని అంటారు. ఇప్పుడు అర్ధమైందా, ఏమి పరిశీలించుకోవాలో! రోజంతటిలో మహానాత్మల యొక్క మహాన్ కర్తవ్యం లేదా లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఎంత వరకు ప్రత్యక్షంలోకి తీసుకువచ్చాను? ఈ ఫలితం తర్వాత అడుగుతాను. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా - మీరు త్రిమూర్తి తండ్రి యొక్క పిల్లలు, మీ ద్వారా మూడు లైట్లు కనిపించాలని అనగా మీ ఒకొక్కరి ద్వారా మూడు లైట్ల యొక్క సాకాత్కారం జరగాలి. అనగా ఎవరు మీ ఎదురుగా వచ్చినా 1. మస్తక మణి కనిపించాలి. 2. మీ రెండు నయనాలలో రెండు కాంతివంతమైన బల్బ్ లు వెలుగుతున్నట్లు కనిపించాలి. 3. మస్తకంపై ప్రకాశ కిరీటం కనిపించాలి. మీ ద్వారా ఈవిధంగా మూడు లైట్లు కనిపించాలి. కొందరికి అయితే అవుతున్నాయి కూడా. స్మృతియాత్రలో కూర్చోపెట్టినప్పుడు రెండు నయనాలు రెండు ప్రకాశ గోళాల వలె కనిపిస్తున్నాయి. కొందరి మసకంపై ప్రకాశ కిరీటం కూడా అనుభవం అవుతుంది. ఎప్పుడైతే ఇలా మీ ద్వారా మూడు లైట్ల యొక్క సాక్షాత్కారం జరుగుతుందో అప్పుడు ఏమవుతుంది? స్వయం కూడా లైట్ గా అయిపోతారు. అనుభవీలే కదా! సాకార రూపంలో చూశారు కదా - మస్తకం ద్వారా, నయనాల ద్వారా పవిత్రత యొక్క ప్రకాశ కిరీటం అనేకమందికి సాక్షాత్కారం జరిగింది.

అదేవిధంగా తండ్రిని అనుసరించాలి. అలాంటి స్వరూపాన్ని మీరు కూడా అందరికీ సాక్షాత్కారం చేయించినట్లయితే సేవలో సఫలత మీ పాదాల ముందు వంగుతుంది. ఎవరి ఎదురుగా వెళ్ళినా కానీ వారికి సాక్షాత్కారం అవ్వాలి, అలాంటి మహానాత్మగా అవ్వండి. అప్పుడు చెప్పండి సాక్షాత్కారమూర్తులు అయిన మీ ముందు వారు తల ఎత్తగలరా? వంగిపోతుంది. ఇక్కడ ఈ విధంగా శిరస్సు వంచితేనే మీ జడచిత్రాల ముందు స్థూలంగా శిరస్సు వంచుతారు. ఎవరైతే ఎంతెంతగా ఎంతమందిని ఇప్పుడే శిరస్సుని వంగింప చేసుకుంటారో అంతగా వారి జడచిత్రాల ముందు అంతమంది శిరస్సు వంచుతారు. ప్రజలతో పాటు భక్తులను కూడా తయారు చేసుకోవాలి కదా! ద్వాపరయుగం యొక్క భక్తులు కూడా ఇప్పుడే తయారవుతారు. మీ భక్తులలో కూడా మీ ద్వారా భక్తి యొక్క అనగా భావన యొక్క సంస్కారం ఇప్పుడే నింపాలి. వీరు చాలా ఉన్నతమైనవారు ఈ భావన యొక్క సంస్కారాన్ని నింపటం ద్వారానే వారు మీకు భక్తులుగా అవుతారు. కనుక భక్తులను కూడా ఇప్పుడే తయారు చేసుకోవాలి. ఇప్పటి వరకు ప్రజలను తయారు చేసుకోవటంలోనే శ్రమిస్తున్నారు. మీ స్థితి ఎంతగా ప్రత్యక్షం అవుతూ ఉంటుందో అంతంతగా మీ వారసులు అనగా మీ ఉన్నత కుటుంబం, మీ ప్రజలు, మీ భక్తులు ముగ్గురూ కూడా ప్రత్యక్షం అవుతారు. ఇప్పుడైతే అందరు కలిసి ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ స్తితియే ఇంకా నిర్ణయం కాలేదు. అందువలన అందరూ కూడా కలిసిపోయి ఉన్నారు. ఆ తర్వాత ప్రత్యక్షంగా కనిపిస్తారు. వీరు నా భక్తులు అని మీరు అనుభవం చేసుకుంటారు. ఎందుకంటే మీలో త్రికాలదర్శి అనే గుణం ప్రత్యక్షం అయిపోతుంది. అప్పుడు మీ యొక్క మూడు కాలాల ప్రాలబ్దాన్ని స్పష్టంగా చూసుకోగలరు. దివ్యదృష్టి ద్వారా కాదు, ప్రత్యక్ష సాక్షాత్కారం ద్వారా. మంచిది.