24.05.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


మీ పొజిషన్లో మీరు ఉండటం ద్వారా అపోజిషన్ సమాప్తి.

సర్వాత్మల పట్ల సుఖము మరియు శాంతికర్తగా అయ్యారా? ఎందుకంటే మీరు. దుఃఖహర్త, సుఖకర్త యొక్క గారాబ పిల్లలు. కనుక తండ్రి యొక్క కర్తవ్యం ఏదయితే ఉందో అదే పిల్లల యొక్క కర్తవ్యం. మరి ఎవరైతే విశ్వ కళ్యాణకర్తలు లేదా సుఖకర్తలుగా ఉంటారో వారి దగ్గరికి ఎపుడైనా కానీ దుఃఖం యొక్క అల స్వప్నంలో లేదా సంకల్పంలోనైనా రాగలదా? ఇలాంటి స్థితిని తయారు చేసుకున్నారా లేక ఈ స్థితిలో స్థితులై ఉంటున్నారా? క్రొత్త జన్మ తీసుకున్నారు. బాప్ దాదాకి గారాబ పిల్లలుగా అయ్యారు, సర్వశక్తివంతుని సంతానం అయిన వారి దగ్గరకి ఏ రకమైన సంతాపం అయినా రాగలదా? సంతాపం అనగా దు:ఖం యొక్క అల. దు:ఖం ఉన్నంత వరకు సర్వశక్తివంతుడైన బాబా యొక్క స్మృతి లేనట్లే. లేదా ప్రత్యక్షంగా ఆ తండ్రికి పిల్లలుగా అవ్వలేనట్లే. సుఖసాగరుడైన తండ్రి యొక్క సంతానానికి దుఃఖం యొక్క అల ఎలా ఉంటుందో కూడా తెలియదు. సుఖం యొక్క అలలోనే తేలియాడుతూ ఉంటారు. మాయ ఎందుకు వ్యతిరేకిస్తుంది? వ్యతిరేకతకి నివారణ చాలా సహజం. అపొజిషన్ అనే మాటలో కేవలం "అ" అనే అక్షరాన్ని తీసేయండి. అప్పుడు ఏమవుతుంది? పొజిషన్ పొజిషన్లో ఉండటం ద్వారా అపోజిషన్ ఉంటుందా? మీ పొజిషన్ అనగా మీ స్థితిలో మీరు స్థితులై ఉంటే మాయ యొక్క అపోజిషన్ ఉండదు. కేవలం ఒక అక్షరాన్ని తీసివేయాలి అంతే. అదే స్మృతియాత్ర. మీరు ఎవరో, మీరు ఎవరికి చెందినవారో స్మృతి ఉండాలి. ఇది కష్టమా? ఎవరు ఎలాంటివారో ఆవిధంగా స్వయాన్ని అంగీకరించటంలో కష్టం ఉంటుందా? మీరు అసలైన దానిని మర్చిపోయారు. మీ స్థితిలో స్థితులై చేసేటందుకే శిక్షణ లభిస్తుంది. అసలు రూపంలో స్థితులవ్వటం కష్టమనిపిస్తుందా? లేక నకిలీ రూపంలో స్థితులవ్వటం కష్టమనిపిస్తుందా? హోలీ పండుగ లేదా దసరా రోజులో చిన్న పిల్లలు నకిలీ ముఖాలు (మాస్క్) పెట్టుకుంటారు. ఆ నకిలీ ముఖాన్ని తీసేసి అసలు రూపంలో ఉండండి అంటే అది వారికి ఏమైనా కష్టంగా అనిపిస్తుందా మరియు ఎంత సమయం పడుతుంది? మీరు కూడా ఈ ఆట ఆడారు కదా! ఏమేమి ముఖాలు పెట్టుకున్నారు? ఒకసారి కోతి ముఖం, ఒకసారి రాక్షస ముఖం, ఒకసారి రావణ ముఖం. ఇలా నకిలీ ముఖాలు ఎన్ని పెట్టుకున్నారు! ఇప్పుడు బాబా ఏమి చెప్తున్నారు? ఆ నకిలి ముఖాలన్ని తీసేయండి. దీంట్లో కష్టం ఏమిటి? సదా ఇదే నషా పెట్టుకోండి - మా అసలు స్వరూపం, అసలు ధర్మం మరియు అసలు కర్మ ఏమిటి? అసలైన జ్ఞానంలో మేము మాస్టర్ జ్ఞానసాగరులం అనే నషా తక్కువగా ఉంది. ఈ నషా సదా ఉంటే ఏవిధంగా అయిపోతారు, ఎలా అవుతారో ఆ స్మృతిచిహ్నం చూశారా? దిల్ వాడ మందిరం అనేది తపస్వి కుమార్ మరియు తపస్వి కుమారీల స్మృతిచిహ్నం. సదా నషాలో స్థిరంగా ఉండేవారి స్మృతిచిహ్నం ఏది? అచల్ ఘర్ అంటే సదా నషాలో ఉండటం ద్వారా అచంచలంగా స్థిరంగా అయిపోతారు. అప్పుడు మాయ సంకల్పం రూపంలో కూడా కదపలేదు. అలాంటి అచంచలంగా అయిపోతారు. స్మృతిచిహ్నం ఉంది కదా - రావణ సాంప్రదాయం వారు పాదం కదపడానికి ప్రయత్నించారు, కానీ కొంచెం కూడా కదపలేకపోయారు. ఇది మా స్మృతిచిహ్నమే అనే నషా ఉంటుందా? లేక ఇది పెద్ద పెద్ద మహారథీల స్మృతిచిహ్నం అని భావిస్తున్నారా? ఇది నా స్మృతిచిహ్నం అనే నిశ్చయబుద్దిగా అవ్వటం ద్వారా విజయం తప్పక ప్రాప్తిస్తుంది. ఇది ఎవరో మహారథీలది, మేమయితే పురుషార్థీలం అని ఎప్పుడూ అనుకోకండి. ఎందుకంటే నిశ్చయంలో లేదా స్వరూపం యొక్క స్మృతిలో బలహీనత ఉంటే కర్మలో కూడా బలహీనత వచ్చేస్తుంది. కనుక సదా ప్రతీ సంకల్పం నిశ్చయబుద్దిగా ఉండాలి. కర్మ చేసే ముందు నిశ్చయం పెట్టుకోండి మాకు విజయం లభించే ఉంది, అనేక కల్పాలు విజయీ అయ్యాము, అనేక కల్పాలు అనేకసార్లు విజయీ అయ్యి విజయీమాలలో గ్రుచ్చబడినవారు, పూజ్యులు మీరు. ఇప్పుడు దానిని పునరావృతము చేయరా? జరిగిన ఆ కర్మనే మరోసారి పునరావృతము చేయాలి. అందువలనే అంటారు - ఇది తయారైపోయిన డ్రామా తయారయ్యి ఉంది, కానీ ఇప్పుడు మరలా పునరావృతము చేసి తయారైన డ్రామా అనే మాట ఏదయితే ఉందో దానిని రుజువు చేయాలి. నేను ఇది, నేను ఇది చేయాలి, చేయగలను కూడా అనే నిశ్చయం ఉంటే నషా ఎక్కుతుంది. నిశ్చయం లేకపోతే నషా కూడా ఎక్కదు. నిశ్చయం ఉంటే నషా యొక్క సాగరంలో తేలియాడుతూ ఉంటారు. ఇలాంటి స్థితి యొక్క అనుభవీమూర్తిగా ఎప్పుడైతే అయిపోతారో అప్పుడు మీ మూర్తి ద్వారా మీకు నేర్పించినవారి ముఖం కనిపిస్తుంది. కనుక తండ్రి మరియు శిక్షకుని యొక్క ముఖం మీ మూర్తి ద్వారా ప్రత్యక్షం చేసే అనుభవీమూర్తిగా అవ్వాలి. ఈ విధంగా తయారయ్యారా లేక తయారవుతున్నారా? సఫలతా సితారలా లేక ఆశా సితారలా? సఫలత అనేది జన్మసిద్ధ అధికారం. ఎందుకంటే సర్వశక్తివాన్ అని అంటున్నారు కదా! అసఫలతకి కారణం శక్తిహీనత. శక్తి తక్కువగా ఉన్న కారణంగానే మాయతో ఓడిపోతున్నారు. ఎప్పుడైతే సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క స్మృతిలో ఉంటారో అప్పుడు సర్వశక్తివంత పిల్లలు అయిపోతారు. కనుక సఫలత మీ జన్మసిద్ధ అధికారం అయిపోయింది. ప్రతీ సెకనులో సఫలత నిండి ఉండాలి. అసఫలత యొక్క రోజులు సమాప్తం అయిపోయినవి. ఇప్పుడు సఫలత అనేది మన నినాదం, ఇది స్మృతిలో ఉంచుకోండి. చాలా సరళమైన సహజమైన మార్గం ఇది. సెకనులో నకిలీ స్వరూపం నుండి అసలు స్వరూపాన్ని తయారు చేసుకోగలుగుతున్నారా? ఇంత సరళ మార్గం ఎప్పుడు లభిస్తుంది? మరెప్పుడూ లభించదు. మాయకి ఎందుకు ఆధీనం అయిపోతున్నారు? సర్వశక్తివంతుని పిల్లలం అనేది మర్చిపోతున్నారు. ఈ రోజుల్లో ఏదో చిన్న చిన్న అధికారం గలవారు కూడా ఎంత గర్వంలో ఉంటున్నారు? మరి సర్వశక్తివంతుని సంతానం అయిన మీరు ఎంత సంతోషంలో ఉండాలి. శాస్త్రవాదులు తమకి శాస్త్రాల యొక్క అధికారం ఉందని భావిస్తారు కనుక ఎంతో నషాలో ఉంటారు, అదంతా వ్యతిరేక జ్ఞానం కానీ నిశ్చయంలో ఉంటారు. ఎవరు చెప్పారో, ఎవరు చూశారో కొంచెం కూడా ఏమీ తెలియదు. అయినా కానీ శాస్త్రాల యొక్క అధికారం ఉందని భావిస్తూ తమ ఓటమిని ఎప్పుడూ కూడా ఒప్పుకోరు. మీది అయితే అన్నింటికంటే శ్రేష్టమైన అధికారం, ఇలాంటి అధికారంతో ఎవరి ముందుకి వెళ్ళినా కానీ అందరూ శిరస్సు వంచుతారు. మీరు వంగరు. మీ అథారిటీని స్థిరంగా ఉంచుకోండి. విశ్వమంతటినీ వంగింప చేసుకునేవారు మీరు. విశ్వమంతటినీ వంగింప చేసుకునేవారు ఎవరి ముందు వంగరు. కనుక ఆ అథార్టీ యొక్క సంతోషంతో ఏ ఆత్మకి అయినా కళ్యాణం చేయగలరు.ఇలాంటి సంతోషాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. చాలా సమయం మర్చిపోనివారిగా అవ్వటం ద్వారా భవిష్యత్తులో కూడా చాలా కాలం యొక్క రాజ్యభాగ్యాన్ని ప్రాప్తింప చేసుకుంటారు. ఒకవేళ అల్పకాలికంగా ఈ సంతోషంలో ఉన్నట్లయితే రాజ్య భాగ్యం కూడా అల్పకాలికంగానే ప్రాప్తిస్తుంది. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? సదాకాలిక వారసత్వాన్ని తీసుకునేటందుకు. కానీ అల్పకాలికానికి కాదు. కేవలం రెండు విషయాలను వెనువెంట గుర్తుంచుకోండి. విషయం ఒకటే కానీ మాటలు రకరకాలు. అతి సహజమైన రెండు విషయాలు సరళమైన మాటల్లో నేర్పించాలంటే ఎలా? రెండు - రెండు మాటలు సదా వెనువెంట గుర్తుంచుకోవాలి. అప్పుడు స్థితి అలజడి అవ్వదు. "తండ్రి మరియు వారసత్వం" ఈ రెండింటినీ గుర్తుంచుకున్నా కానీ స్థితి అలజడి అవ్వదు. ఇలా రెండు మాటల యొక్క విషయాలు ఏమీ తెలియని చిన్నపిల్లవాడికి కూడా తండ్రి మరియు వారసత్వం గుర్తుంచుకోమని చెప్తే మర్చిపోతారా? మరి మాస్టర్ సర్వశక్తివంతులైన మీరు మర్చిపోతున్నారా? ఏ సమయంలో విస్మృతి యొక్క స్థితిలో ఉంటారో ఆ సమయంలో మీతో మీరు ఇలా మాట్లాడండి - నేను మాస్టర్ సర్వశక్తివాన్ అయ్యిండి తండ్రి మరియు వారసత్వాన్ని మర్చిపోయాను. ఇలా మీతో మీరు మాట్లాడటం ద్వారా ఏదయితే శక్తిని కోల్పోయారో అది మరలా స్మృతిలోకి వస్తుంది. కేవలం వర్ణన మరియు మననం చేయాలంతే. మొదట మననం చేయండి, ఆ తర్వాత వర్ణన చేయండి. ఏ విషయాలైతే మీరు మననం చేస్తారో వాటిని వర్ణన చేయటం సహజం. కనుక మననం చేస్తూ మరియు వర్ణన చేస్తూ వెళ్ళండి. ఇవి కూడా రెండు మాటలు కదా! మననం చేస్తూ చేస్తూ ఉంటే మగ్న స్థితి స్వతహాగానే వచ్చేస్తుంది. ఎవరికైతే మననం చేయటం తెలియదో వారు మగ్న స్థితిని కూడా అనుభవం చేసుకోలేరు. కిరీటం మరియు సింహాసనాధికారిగా ఇప్పుడు అయ్యారా లేక భవిష్యత్తులో అవుతారా? ఇప్పుడయితే కిరీటం మరియు సింహాసనం లేదు కదా! బికారులు కదా! సంగమయుగం యొక్క సింహాసనం తెలియదా? కల్పమంతటిలో అన్నింటికంటే శ్రేష్ట సింహాసనం గురించి తెలియదా? బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారిగా అవ్వలేదా? గుర్తు ఉన్నప్పుడే కూర్చోగలరు కదా! సింహాసనం ఉంటే కిరీటం కూడా ఉంటుంది. కిరీటం లేకుండా సింహాసనం కూడా ఉండదు. ఏ కిరీటాన్ని ధరిస్తే సింహాసనాధికారి అవుతారు? బాప్ దాదా సంగమయుగంలో కిరీటధారిగా మరియు సింహాసనాధికారిగా తయారు చేస్తున్నారు. ఈ కిరీటం మరియు సింహాసనం ఆధారంగా భవిష్య కిరీటం మరియు సింహాసనం లభిస్తాయి. ఇప్పుడు ధారణ చేయకపోతే భవిష్యత్తులో ఏవిధంగా ధారణ చేస్తారు? ఆధారం అయితే సంగమయుగం కదా! కిరీటం కూడా ధారణ చేయాలి, తిలకం కూడా ధారణ చేయాలి మరియు సింహాసనాధికారిగా కూడా అవ్వాలి. తిలకం సదా ఉంటుందా లేక అప్పుడప్పుడు చెరిగిపోతుందా? కిరీటం, సింహాసనం మరియు తిలకం ఈ మూడూ సంగమయుగం యొక్క గొప్ప ప్రాప్తులు. ఈ ప్రాప్తి ముందు భవిష్వ రాజ్యం ఏమీ కాదు. ఎవరైతే సంగమయుగం యొక్క కిరీటం మరియు సింహాసనం పొందలేదో వారు ఏమీ పొందలేనట్లే. విశ్వ కళ్యాణం యొక్క భాద్యతా కిరీటం, ఈ కిరీటాన్ని ధారణ చేయనంతవరకు బాబా యొక్క హృదయ సింహాసనంపై విరాజమానమై ఉండలేరు. మీ హక్కుని జమ చేసుకుని వెళ్లాలి. లేకపోతే చాలా కష్టం అవుతుంది. మధువనంలో కిరీటధారిగా, సింహాసనాదికారిగా తయారయ్యి వెళ్ళాలి. ఎప్పుడైతే ధైర్యవంతులుగా నిశ్చయబుద్దిగా అవుతారో అప్పుడే మధువనంలో పట్టాభిషేకం చేసుకోవటానికి రాగలరు. కిరీటం లేకుండా వెళ్ళకూడదు. బాప్ దాదా యొక్క సింహాసనం ఎంత పెద్దది అంటే ఎవరు ఎంతగా కావాలంటే అంతగా విరాజమానమై ఉండవచ్చు. ఆ సింహాసనంపై అయితే అందరూ కూర్చోలేరు. కానీ ఈ సింహాసనం చాలా పెద్దది. ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క పిల్లలు ఉన్నతోన్నత సింహాసనాధికారిగా ఉంటారు.