03.06.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


నిరంతర యోగయుక్తులు అయ్యేటందుకు కమలపుష్ప ఆసనం.

ఈరోజు ఏరోజు? భట్టీ యొక్క రోజు. భట్టీ రోజుని ఏ రోజు అని అంటారు? భట్టీ యొక్క ప్రారంభ రోజు అనగా జీవితాన్ని నిర్ణయించుకునే రోజు. భట్టీకి ఎందుకు వస్తారు? జీవితాన్ని సదాకాలికంగా నిర్ణయించుకునేటందుకు. అందరూ ఈ లక్ష్యంతో వచ్చారా? ఎందుకంటే భట్టీకి రావటం ద్వారా బాప్ దాదా నుండి లేదా అనన్య పిల్లల నుండి ఒక బహుమతి లభిస్తుంది. అది ఏమిటి? ఏమి లభిస్తుందో చెప్పటం కూడా సహజమే (ఇద్దరు ముగ్గురు తమ తమ ఆలోచనలు చెప్పారు) మీరు ఏవైతే చెప్పారో ఆ విషయాలన్నింటి ప్రాప్తికి ఆధారం ఈ బహుమతి. అది ఏమిటి? అది ఏమిటంటే బుద్ధి యొక్క పరివర్తన. రజోగుణి లేదా వ్యక్త భావం యొక్క బుద్ధి మారిపోయి సతోగుణి అవ్వక్త భావం యొక్క బుద్ధి లభిస్తుంది. ఈ దివ్యబుద్ధి ప్రాప్తించటం ద్వారా అవ్యక్త స్థితిని లేదా యోగయుక్త స్థితిని ప్రాప్తింప చేసుకోగలరు. అయితే బహుమతి ఏది ? దివ్య సతోగుణి బుద్ధి. బుద్ధి పరివర్తన అవ్వటంతోనే జీవితం పరివర్తన అవుతుంది. కనుక దివ్యబుద్ధి అనే బహుమతి విశేషంగా భట్టీలో ప్రాప్తిస్తుంది. ఇప్పుడు ఆ కానుకను ఉపయోగించుకోవాలి లేదా సదాకాలికంగా దాచుకోవాలి, ఇది మీ చేతుల్లోనే ఉంది. బహుమతి అయితే అందరికీ లభిస్తుంది. ఎవరైతే భట్టీకి వచ్చారో దివ్య సతోగుణి బుద్ధి యొక్క బహుమతి ద్వారా స్వయాన్ని చాలా సహజంగా మరియు చాలా త్వరగా పరివర్తన చేసుకోగలరు. కనుక ఈరోజు జీవిత పరివర్తన రోజు. ఈరోజు ఏదైతే బహుమతి ప్రాప్తిస్తుందో దానిని ధారణ చేస్తూ ఉండాలి. జ్ఞానం అయితే వింటూనే ఉంటారు. కానీ భట్టీకి ఏమి చేసేటందుకు వస్తారు? జ్ఞాన స్వరూపం అయ్యేటందుకు వస్తారు. యోగం యొక్క ఙ్ఞానం ఉంది లేదా యోగాభ్యాసం కూడా చేస్తున్నారు. కానీ సదా యోగయుక్తులుగా అయ్యి ఉండే పాఠాన్ని పక్కా చేసుకునేటందుకు భట్టీకి వస్తారు. నిరంతర యోగయుక్తులుగా అయ్యేటందుకు ఏ సహజ యుక్తిని భట్టీ ద్వారా ప్రాప్తింప చేసుకోవాలి? హఠయోగులు హఠంగా ఏదైతే తపస్సు చేస్తారో ఆ సమయంలో ఆసనంపై ఉంటారు. భిన్న భిన్న ఆసనాలు ఉంటాయి. అలాగే మీకు సదా యోగయుక్తంగా అయ్యేటందుకు ఆసనం ఏది? నిరంతరం యోగయుక్త స్థితి సహజంగా ఉండాలి. దీని కోసం బాప్ దాదా సహజ ఆసనం వినిపిస్తున్నారు. అది ఏమిటంటే కమల పుష్ప ఆసనం. కమలాసనధారి అని అంటూంటారు కదా! దేవతల చిత్రం తయారు చేస్తారు, దేవతలు దేనిపై నిల్చున్నట్లు లేదా కూర్చున్నట్లు చిత్రిస్తారు? కమల పుష్పంపై, అనగా నిరంతరం కర్మ చేస్తూ కూడా సహజంగా యోగయుక్తులు అయ్యేటందుకు సదా కమలాసనం అనగా మీ స్థితి కమల పుష్ప సమానంగా ఉంటే నిరంతర యోగయుక్తులు అయిపోతారు. కానీ కమల పుష్పంగా అయ్యి ఈ ఆసనంపై ఈ స్థితిలో ఉండేటందుకు ఏమి చేయాలి? స్వయాన్ని లైట్ గా చేసుకోవాలి అనగా తేలికతనం మరియు ప్రకాశ స్వరూపంగా. కమలపుష్పం ఎంత జ్ఞానయుక్తమైనది; కమల పుష్పాన్ని చూసి జ్ఞానం స్మృతిలోకి వస్తుందా? ఈవిధంగా కమలాసనంపై విరాజమానం అవ్వటం ద్వారా సదా యోగయుక్తులుగా కాగలరు. ఆసనాన్ని ఎప్పుడూ కూడా వదలకండి. కమలపుష్ప సమాన స్థితి యొక్క ఆసనంపై సదా స్థిరంగా ఉండండి. ఎంతగా కమలాసనంపై సదా స్థితి అయ్యి ఉంటారో అంతగానే భవిష్యత్తులో కూడా రాజ్య సింహాసనం లభిస్తుంది. ఈ ఆసనంపై కూర్చోలేకపోతే, ఈ స్థితిలో స్థితులు కాలేకపోతే సింహాసనాన్ని కూడా పొందలేరు. రాజ్య సింహాసనాన్ని ప్రాప్తింప చేసుకునేటందుకు మొదట కమలాసనంపై స్థితులయ్యే అభ్యాసం చేయాలి. స్వయాన్ని సర్వ రకాల బంధనాల నుండి ముక్తి చేసుకుని తేలికగా తయారయ్యేటందుకు, సదా కమలపుష్ప సమాన స్థితిలో స్థితులై ఆసనంపై విరాజమానమై ఉండే అభ్యాసం చేసేటందుకు భట్టీకి వచ్చారు. కనుక అన్ని రకాల భారాలను భట్టీలో సమాప్తం చేసుకుని వెళ్ళాలి. మనస్సు యొక్క సంకల్పాల భారం, సంస్కారాల భారం, ప్రపంచంలోని ఏ వినాశి వస్తువు పట్ల అయినా ఆకర్షితం అయ్యే భారం, లౌకిక సంబంధీకుల పట్ల మమకారం యొక్క భారం, ఇవన్నీ భారాలు లేదా బంధనలు, వీటిని సమాప్తి చేసుకునేటందుకు భట్టీకి వచ్చారు. మీ జీవితం యొక్క ఉన్నతికి స్వర్ణిమ అవకాశం ఈ భట్టీ. ఈ అవకాశాన్ని ఎవరు ఎంతగా తీసుకుంటారో అంతగా సదాకాలికంగా మీ జీవితాన్ని ముందుకి తీసుకువెళ్ళగలరు. ఏ లక్ష్యం పెట్టుకుని భట్టీకి వచ్చారు? సంస్కారాలను పరివర్తన చేసుకున్న తర్వాత ఏ విధంగా తయారవ్వాలనే లక్ష్యం పెట్టుకున్నారు? అన్ని గ్రూపుల కంటే ఈ గ్రూపు ఏ విషయంలో మంచివారో తెలుసా? ఈ గ్రూపులో చాలా మంచి విశేషత ఒకటి ఉంది. బంగారంలో కల్తీ కలిస్తే ఆ బంగారాన్ని మలచలేము. స్వచ్ఛమైన బంగారం అయితే మలచగలము. అదేవిధంగా మీరు సత్యమైన బంగారం, దీనిలో ఏ కల్తీ లేదు, మీ యొక్క ఈ విశేషత మీకు తెలుసా? ఈ గ్రూపుని చూసి ఏమనిపిస్తుందంటే ఒక మొక్కని క్రొత్తగా నాటినప్పుడు మొదట చాలా కోమలమైన మరియు సుందరమైన చిన్న చిన్న ఆకులు వస్తాయి. అవి అందరికీ ప్రియమనిపిస్తాయి. అదేవిధంగా ఈ గ్రూపులోని వారు కొత్త ఆకులు కానీ కోమలమైనవారు. కోమలంగా ఉండే వస్తువు మరియు గట్టిగా ఉండే వస్తువు. కోమలము అనగా సంస్కారాలు అనే ఎముకలు అంత గట్టిగా లేవు, పరివర్తన కానంత గట్టిగా లేవు. చిన్న పిల్లల ఎముకలు మొదట కోమలంగా ఉంటాయి. పెరిగే కొలది గట్టిగా అవుతాయి. ఈ గ్రూపులోని వారు కూడా కోమల సంస్కారం గలవారు. కనుక సంస్కారాల పరివర్తన సహజం, కఠినమైన సంస్కారం గలవారు కాదు. (దాదీజీ రెండు రోజులు సేవార్థం మద్రాసు వెళ్ళేటందుకు అనుమతి తీసుకుంటున్నారు). ఎవరైతే విశ్వ మహారాజులు ఉంటారో వారి యొక్క విశేషత ఏమిటంటే వారు సర్వాత్మలను రాజీ చేసుకుంటారు. మహారథీ అయిన వారి ప్రతి అడుగులో కోటానుకోట్ల సంపాదన ఉంటుంది. (సీతామాత శెలవు తీసుకుంటున్నారు). స్వయాన్ని సమర్ధ ఆత్మగా భావించి ఈ శరీరాన్ని చూస్తున్నారా? సాక్షి స్థితిలో స్థితులవ్వటం ద్వారా శక్తి లభిస్తుంది. ఎవరైనా శారీరకంగా బలహీనంగా ఉంటే శక్తి నింపేటందుకు గ్లూకోజ్ ఎక్కిస్తారు కదా! అదేవిధంగా ఎప్పుడైతే మీరు స్వయాన్ని శరీరానికి అతీతంగా అశరీరి ఆత్మగా భావిస్తారో ఆ సాక్షిస్థితి శక్తి నింపుతుంది. ఎంతెంత సాక్షిస్థితి ఉంటుందో అంతంతగా బాబా తోడుగా ఉన్నారు అనేది గుర్తుంటుంది మరియు తోడుగా కూడా ఉంటారు. కనుక తోడు మరియు సాక్షి. 1. సాక్షిస్థితి యొక్క శక్తి 2. బాబా తోడుగా ఉన్నారనే సంతోషం యొక్క భోజనం. ఈ రెండూ ఉంటే ఏవిధంగా అయిపోతారు? నిరోగి అయిపోతారు. శక్తి రూపం అనగా అతీతం మరియు అతి ప్రియం. ఈ సమయంలో ఈ విధంగా అతీతం మరియు అతి ప్రియ స్థితిలో ఉన్నారా? ఈ స్థితి ఎంత శక్తివంతమైనదంటే ఎలా అయితే డాక్టర్లు కరెంట్ యొక్క కిరణాల ద్వారా కీటాణువులను సమాప్తి చేస్తారో అలాగే ఈ శక్తిశాలి స్థితి ద్వారా ఒక్క సెకనులో అనేక వికర్మల రూపి కీటాణువులు భస్మం అయిపోతాయి. వికర్మలు భస్మం అయిపోతే స్వయం తేలికగా మరియు శక్తిశాలిగా ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు. సదా మీ ప్రవృత్తిని కూడా సేవాభూమిగా భావించాలి. స్వయాన్ని బాప్ దాదాకి అతి ప్రియమైన వారిగా భావిస్తున్నారా? ఎందుకు? ఏ విషయం ఆధారంగా బాబాకి అతి ప్రియం అయ్యారు? ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు. ఈవిధంగా ఒకని యొక్క సంలగ్నతలోనే ఉండేవారు బాబాకి అతిప్రియమైనవారు. అర్ధమైందా! మంచిది.