24.06.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


అంతర్ముఖీ అవ్వటం ద్వారా లాభాలు.

ఏదైనా కొత్త ఆవిష్కరణ చేస్తున్నప్పుడు, ఆ ఆవిష్కరణ ఎంత శక్తివంతమైనదో అంతగా భూమి అంతర్భాగంలో ఉండి చేస్తుంటారు. అదేవిధంగా మీ యొక్క ఆవిష్కరణ కూడా రోజు రోజుకి శక్తివంతంగా ఉండాలి. వారు భూమి అంతర్భాగంలో ఆవిష్కరణలు చేస్తారు. మీరు అంతర్ముఖత అనే అండర్ గ్రౌండ్ లో ఎంతగా ఉంటారో అంతగా క్రొత్త క్రొత్త ఆవిష్కరణల కోసం ఐడియాలు వస్తూ ఉంటాయి. భూమి యొక్క అంతర్భాగంలో ఉండటం వలన 1. వాయుమండలం నుండి రక్షణగా ఉంటారు. 2. ఏకాంతంగా ఉండటం వలన మనన శక్తి కూడా పెరుగుతుంది. 3.మాయ యొక్క విఘ్నాల నుండి రక్షణా సాధనం కూడా ఇదే. కనుక స్వయం సదా అండర్ గ్రౌండ్ లో అనగా అంతర్ముఖీగా ఉండేటందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. భూమి యొక్క అంతర్భాగంలో ఉండి కూడా సర్వ కార్యవ్యవహారాలు ఎలాగైతే చేస్తారో అలాగే మీరు కూడా అంతర్ముఖులై కార్యం చేయగలుగుతున్నారా? ఏ కార్యం చేయకుండా ఉండాలని కాదు, అన్ని కార్యాలు చేయాలి, కానీ అంతర్ముఖులై కూడా కార్యం చేయవచ్చు. అంతర్ముఖులై కార్యం చేయటం ద్వారా 1. విఘ్నాల నుండి రక్షణ 2. సమయం పొదుపు అవుతుంది. 3. సంకల్పాలు కూడా పొదుపు అవుతాయి. అభ్యాసం అయితే ఉంది కదా! అప్పుడప్పుడు అనుభవం కూడా చేసుకుంటారు. అంతర్ముఖులై మాట్లాడాలి. బాహర్ముఖతలోకి వస్తూ కూడా అంతర్ముఖులుగా, హర్షితముఖిగా, ఆకర్షణామూర్తులుగా ఉండాలి. కర్మ చేస్తూ ఈ విధంగా ఉండడాన్ని అభ్యసించాలి. స్థూల కార్యవ్యవహారాన్ని కార్యక్రమం తయారు చేసుకుంటారు కదా! అదేవిధంగా మీ బుద్ధి యొక్క కార్యవ్యవహారం ఏమిటి? బుద్ధి ద్వారా ఏయే పనులు చేయాలి? కార్యక్రమం తయారు చేసుకునే అభ్యాసిగా అయితే వారి యొక్క ప్రతీ పని సమయానికి అయిపోతాయి. అదేవిధంగా మీకు సూక్ష్మ కార్యవ్యవహారాలు కూడా ఉన్నాయి. ఒక్క సెకనులో బుద్ధి ఎక్కడికైనా వెళ్ళి రాగలదు. చాలా ఎక్కువ పనులు ఉన్నప్పుడు కార్యక్రమం తయారు చేసుకుంటే సమయం పొదుపు అవుతుంది. మరియు సఫలత కూడా అధికంగా లభిస్తుంది. అలాగే బుద్ధి కోసం కూడా మధ్యమధ్యలో కార్యక్రమం తయారు చేసుకోండి. అది సదాకాలికంగా ఉండాలి. స్థూల కార్యవ్యవహారాల యొక్క కార్యక్రమాన్ని తయారు చేసుకుని చేసుకుని అభ్యాసిగా అయిపోయారు. అదేవిధంగా ఈ అభ్యాసం కూడా చేస్తూ చేస్తూ అభ్యాసిగా అయిపోవాలి. దీని కోసం ప్రత్యేక సమయం తీయాల్సిన పని లేదు. ఏ స్థూల కార్యం అయినా ఎక్కువగా ఉంటే వాటిని చేస్తూ కూడా మీ కార్యక్రమాన్ని తయారు చేసుకోవచ్చు. కార్యక్రమాన్ని తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఒకటి లేదా రెండు నిమిషాలు కూడా ఎక్కువే. కనుక ఈ అభ్యాసం కూడా చేయాలి. అమృతవేళలో మీ బుద్ధి యొక్క కార్యవ్యవహారాల కోసం కార్యక్రమం ముందుగానే నిర్ణయించుకోవాలి. కార్యక్రమం తయారు చేసుకున్నారు, తిరిగి పరిశీలించుకుంటారు. ఈ కార్యం అయ్యిందా? ఎంత వరకు అయ్యింది మరియు ఎంత అవ్వలేదు అని అలాగే దీని కోసం కూడా కార్యక్రమం తయారు చేసుకుని మధ్యమధ్యలో పరిశీలించుకోవాలి. గొప్పవాళ్ళు కార్యక్రమం లేకుండా ఏ చోటికి వెళ్ళరు. ఎలా అనిపిస్తే అలా చేసేయటం అనేది ఉండదు. వారి యొక్క ఒకొక్క సెకనుకి కార్యక్రమం నిర్ణయం అయ్యి ఉంటుంది. మీరు కూడా శ్రేష్టాత్మలు. కనుక కార్యక్రమాన్ని తయారు చేసుకోవాలి. కొందరికి కార్యక్రమం తయారు చేసుకునే పద్ధతి వస్తుంది, కొందరికి రావటం లేదు. కార్యక్రమం సెట్ చేసుకోవటం వస్తే మీ స్థితిని కూడా సెట్ చేసుకోగలరు. కార్యక్రమం తయారుచేసుకోకపోతే పనులన్నీ ఎలా అటుఇటు అయిపోతాయో, అదేవిధంగా స్థితి కూడా పైకి క్రిందకి అవుతుంది. సెట్ అయ్యి ఉండదు. మంచిది.