20.08.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


అన్నింటికంటే శ్రేష్ఠ సింహాసనం మరియు కిరీటం.

ఈరోజు ఈ భట్టీకి ఈ గ్రూపు డబల్ భట్టీ చేసుకునేందుకు వచ్చారు. ఏ డబల్ భట్టీ? డబల్ భట్టీ యొక్క రహస్యం ఏమిటో తెలుసా? మధువనం ఒక భట్టీ, మధువనం అనే భట్టీలో విశేషంగా ఏ భట్టీకి మీరు వచ్చారు? మీలో మిగిలిపోయిన సంస్కారాలను భస్మం చేసుకునేటందుకు వచ్చారు కదా. డబల్ భట్టీలో శక్తి కూడా పెరుగుతుంది. ఎందుకంటే డబల్ కోర్సు లభిస్తుంది. ఒకటి అందరికీ లభించే జనరల్ కోర్సు, రెండు వ్యక్తిగత కోర్సు. ఈ డబల్ కోర్సు కారణంగా శక్తి కూడా డబల్ గా పెరుగుతుంది. డబల్ శక్తి లభించింది. అదేవిధంగా సదా స్వయాన్ని డబల్ కిరీటధారిగా భావించి నడిస్తే ఈ డబల్ కోర్సు సదా ఫోర్సులో ఉంటుంది. డబల్ కిరీటాలు ఏవి? ఇప్పుడు డబల్ కిరీట ధారులేనా? లేక భవిష్యత్తులో అవుతారా? ఇప్పటి డబల్ కిరీటాలు ఏవి? ఒకటి పవిత్రతకు గుర్తుగా - ప్రకాశ కిరీటం. సంగమయుగంలో సర్వ ప్రాప్తులు లభిస్తాయి. ఆ శక్తి ద్వారా బాధ్యతను ధారణ చేయగలరు. కనుక ఒకటి - ప్రకాశ కిరీటం. రెండు - శక్తి యొక్క కిరీటం. ఒకటి - పవిత్రత, రెండు - శక్తి. ఈరెండు కిరీటాలను నిరంతరం ధారణ చేసేవారు మీరు, అప్పుడు డబల్ శక్తి సదా స్థిరంగా ఉండలేదా? రెండు అవసరమే. రెండూ సదా స్థిరంగా ఉండడం ద్వారా సదా శక్తిశాలీ స్వరూపం కనిపిస్తుంది. సేవలో సఫలత పొందేటందుకు కూడా ఈ రెండు కిరీటాలు అవసరం. ఎవరెవరు ఎంతగా నెంబరువారీగా వీటిని ధారణ చేశారో దానిని అనుసరించి స్వరూపంలో సఫలత లేదా మీ పురుషార్థంలో సఫలతను పొందుతూ ఉన్నారు. డబల్ కిరీటాలు కూడా కావాలి మరియు డబల్ సింహాసనాలు కూడా కావాలి. డబల్ అనగా రెండు సింహాసనాలు ఏవి? (ప్రతి ఒక్కరు తమ తమ జవాబు చెప్పారు) ఒకటి- బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారిగా కావాలి; ఇది అన్నింటికంటే శ్రేష్టమైన సింహాసనం. దాంతో పాటు ఈ సింహాసనంపై కూర్చునేటందుకు కూడా అచంచల, స్థిరమైన ఏకరస స్థితి యొక్క సింహాసనం కావాలి. ఈ స్థితి అనే సింహాసనంపై స్థితులు కాలేకపోతే బాప్ దాదా యొక్క హృదయ సింహాసనంపై కూడా స్థితులు కాలేరు. అందువలన అచంచలంగా, స్థిరంగా ఏకరసంగా ఉండే సింహాసనం చాలా అవసరం. ఈ సింహాసనం నుండి మాటిమాటికి కదిలిపోతున్నారు. అకాల సింహాసనాధికారిగా అవ్వని కారణంగా ఏకరస స్థితి అనే సింహాసనంపై కూడా స్థితులు కాలేకపోతున్నారు. మీ భృకుటి అనే సింహాసనంపై అకాలమూర్తి అయి స్థితులు అయితేనే ఏకరస సింహాసనంపై కూర్చుని బాప్ దాదా యొక్క హృదయ సింహాసనంపై విరాజమానం కాగలరు. కనుక డబల్ కిరీటధారులుగా కూడా అవ్వాలి, డబల్ సింహాసనాధికారులుగా కూడా అవ్వాలి. మీకేదైతే జ్ఞానం లభిస్తుందో ఆ జ్ఞానం కూడా ముఖ్యంగా రెండు విషయాలకు సంబంధించింది. అవి ఏమిటి? జ్ఞానం యొక్క ముఖ్యమైన రెండు విషయాలు ఏమిటి? తండ్రి మరియు వారసత్వం అనండి లేదా రచయిత మరియు రచన అనండి. రచనలో జ్ఞానమంతా వచ్చేస్తుంది. రచయిత మరియు రచన. ఈరెండు ముఖ్యవిషయాల్లో జ్ఞానసాగరులు అయిపోతే శక్తిశాలిగా కూడా కాగలరు. రచన యొక్క జ్ఞానంలో కూడా పూర్తి జ్ఞానవంతులు కాకపోతే బలహీనులైతే స్థితి అలజడి అవుతుంది. కనుక రచన యొక్క పూర్తి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవడం అనగా కేవలం వినటం కాదు, తెలుసుకోవడం అనగా అంగీకరించడం మరియు నడవడం. అలాంటి వారినే జ్ఞాన సాగరులు అని అంటారు. వారు తెలుసుకుంటారు, అంగీకరిస్తారు మరియు నడుస్తారు కూడా అంగీకరించడం మరియు నడవడం లేకపోతే జ్ఞానసాగరులు లేదా జ్ఞాన స్వరూపులు అని అనరు. అంగీకరించడం మరియు నడవడం అనగా స్వరూపంగా తయారవడం. రచయిత మరియు రచన యొక్క జ్ఞానం ఎంతో కొంత తక్కువగా ఉన్న కారణంగా పురుషార్థంలో లోపం వస్తుంది. కనుక జ్ఞానమంతటి యొక్క ఈ రెండు విషయాలను ధ్యాసలో పెట్టుకుని నడవండి. మంచిది. ఇది జ్ఞానం గురించి, అదేవిధంగా కర్తవ్యాలు కూడా రెండు చేయాలి, ఆ డబల్ కర్తవ్యాలు ఏవి? ఈ రోజు రెండు అనే లెక్క చెబుతున్నాను. కనుక రెండు కర్తవ్యాలు చెప్పండి. రోజంతటిలో మీ యొక్క రెండు కర్తవ్యాలు జరుగుతుంటాయి. ముఖ్య కర్తవ్యం - వినాశనం మరియు స్థాపన. కొన్ని వినాశనం చేయాలి మరియు కొన్ని రచన చేయాలి. అన్ని రకాల రచనలు రచిస్తున్నారు. ఒకటి - మీ సేవ ద్వారా, మీ రాజధానిని రచన చేస్తున్నారు. రెండవది బుద్ధిలో శుద్ద సంకల్పాలను రచించాలి. వ్యర్థ సంకల్పాలు లేదా వికల్పాల యొక్క వినాశనం చేసే పద్దతి మీకు తెలిసిపోయింది కదా! రచన అనేది మనసు ద్వారా మరియు మాట ద్వారా కూడా రెండు రకాలుగానే రచిస్తారు. ఈరకంగా డబల్ కర్తవ్యాలు చేస్తున్నారు. ఇదే పనిలోరోజంతా బిజీగా ఉండండి. అప్పుడు చెప్పండి స్థితి ఏకరసంగా ఉండదా? ఏకరస స్థితి ఉండకపోవడానికి కారణం - రచనను రచించడం రావడం లేదు లేదా వినాశనం చేయడం రావడం లేదు. రెండు కర్తవ్యాల్లో లోపం ఉన్న కారణంగా స్థితి ఏకరసంగా ఉండడం లేదు. అందువలన ఈ రెండు కర్తవ్యాలలో ఉండాలి. ఈ రెండు కర్తవ్యాలను కూడా మీ స్థితిలో స్థితులైనప్పుడే చేయగలఋ. అలాగే మీ రెండు పదవులు ఏవి? ఈ సమయం గురించి అడుగుతున్నారు. దేవతా పదవి కంటే ఈ సమయం యొక్క ఈశ్వరీయ పదవి ఉన్నతమైనది. మీ యొక్క పొజిషన్ ఏమిటంటే, ఈశ్వరీయ సంతానం బ్రహ్మాకుమారీ కుమారులు. ఇది సాకారీ పొజిషన్. ఇక రెండవది నిరాకారీ పొజిషన్, ఆత్మలందరికంటే మనము హీరో పాత్రధారులం. శ్రేష్ఠాత్మలం. ఈ రెండు పొజిషన్లు స్మృతిలో ఉంచుకుంటే కర్మ మరియు సంకల్పం రెండూ కూడా శ్రేష్టం అయిపోతాయి. మిమ్మల్ని మీరు శ్రేష్ఠాత్మగా లేదా హీరోగా భావించడం ద్వారా ఈశ్వరీయ మర్యాదలు లేదా బ్రాహ్మణకులం యొక్క మర్యాదలకు వ్యతిరేకమైన వ్యవహారం ఏదీ చేయరు. కనుక మీయొక్క ఈ రెండు స్థితులను స్మృతిలో ఉంచుకున్నా కూడా మాయ యొక్క వ్యతిరేకత సమాప్తం అయిపోతుంది. కనుక ఈ డబల్ పొజిషన్లను సదా స్మృతిలో ఉంచుకోండి. అలాగే మీ రెండు గమ్యాలు ఏవి? ఎవరికైతే డబల్ నషా ఉంటుందో వారికే రెండు గమ్యాలు కనిపిస్తాయి. ఒకటి - నిరాకారీ గమ్యం అనగా సదా స్వయాన్ని నిరాకార దేశవాసీగా భావించండి మరియు నిరాకారీ స్థితిలో స్థితులు అవ్వండి. సాకారంలో ఉంటూ స్వయాన్ని నిరాకారిగా భావించి నడవాలి. ఒకటి - ఆత్మాభిమానిగా అయ్యే గమ్యం మరియు రెండు నిర్వికారీ స్థితి. దీంట్లో మానసికంగా కూడా నిర్వికారీ స్థితిని తయారుచేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి నిరాకారీ గమ్యం, రెండు సాకారీ గమ్యం. నిరాకారీ మరియు నిర్వికారీ ... ఇవి రెండు గమ్యాలు. రోజంతా యోగిగా మరియు పవిత్రంగా అయ్యేటందుకు పురుషార్ధం చేస్తున్నారు. ఎప్పటి వరకు పూర్తి ఆత్మాభిమానిగా అవ్వరో, అప్పటి వరకు నిర్వికారీగా కూడా అవ్వలేరు. నిర్వికారీ స్థితి యొక్క గమ్యం మరియు నిరాకారీ స్థితి యొక్క గమ్యం దీనినే ఫరిస్తా లేదా కర్మాతీత స్థితి అని అంటారు. ఫరిస్తాగా కూడా ఎప్పుడు కాగలరు? ఏ అపవిత్రత అనగా పంచతత్వాల యొక్క ఆకర్షణ కూడా ఆకర్షించదో వారే ఫరిస్తా. మనసా సంకల్పంలో కూడా కొంచెం కూడా అపవిత్రత ఉండకూడదు. అప్పుడే ఫరిస్తా స్థితి అనే గమ్యంలో స్థితులు కాగలరు. ఈ రెండు గమ్యాలను సదా స్మృతిలో ఉంచుకోండి మరియు డబల్ ప్రాప్తులు ఏవి? అతీంద్రియ సుఖం యొక్క ప్రాప్తి. దీంట్లో శాంతి ఉంటుంది మరియు సంతోషం కూడా ఉంటుంది. ఇది సంగమయుగీ వారసత్వం. ఇప్పుడు ప్రాప్తించేది ఇంకెప్పుడూ ప్రాప్తించదు. కనుక రెండు ప్రాప్తులు ఏమిటంటే తండ్రి మరియు వారసత్వం, బాబాని కూడా కల్పం అంతటిలో పొందలేరు. బాబా ద్వారా ఏదైతే వారసత్వం లభిస్తుందో అది కూడా కల్పం అంతటిలో ఇప్పుడే లభిస్తుంది, మరెప్పుడూ లభించదు. కనుక అతీంద్రియ సుఖం మరియు పూర్తి జ్ఞానం అనేవి ఈ సమయం యొక్క ప్రాప్తులు. ఇవి ఇప్పుడు తప్ప మరెప్పుడూ లభించదు. రెండు మాటల్లో రెండు ప్రాప్తులు. ఒకటి - తండ్రి మరియు రెండవది - వారసత్వం. దీంట్లో జ్ఞానం కూడా వచ్చేస్తుంది. అతీంద్రియ సుఖం కూడా వచ్చేస్తుంది మరియు ఆత్మికసంతోషం కూడా వచ్చేస్తుంది, ఆత్మిక శక్తి కూడా వచ్చేస్తుంది. ఇదే డబల్ ప్రాప్తి. అరమైందా?

ఇలా ఈ రెండు రెండు విషయాలన్నింటినీ ఎప్పుడు ధారణ చేయగలరంటే ఎప్పుడైతే స్వయాన్ని కంబైండ్ గా భావిస్తారో అప్పుడు. బాబా మరియు నేను. ఇద్దరు కలిసి ఉన్నట్టుగా భావించడం ద్వారా ఈ అన్ని రెండు రెండు విషయాలను సహజంగా ధారణ చేయగలరు. భట్టీకి వచ్చారు కదా! ఈ రెండు రెండు విషయాలను విన్నారు కదా! మంచిగా వీటి యొక్క స్మృతి స్వరూపంగా అయి భట్టీ నుండి వెళ్లాలి. కేవలం విని వెళ్లడం కాదు. వినడం అయితే చాలా విన్నారు. వినడం అంటే అంగీకరించడం, నడవడం అనగా స్వరూపంగా తయారవడం. మీరందరూ జ్ఞానులే కానీ జ్ఞాన స్వరూపంగా అయి వెళ్లాలి. యోగులే కానీ యోగయుక్తంగా, యుక్తీయుక్తంగా అయి వెళ్లాలి. తపస్వీ కుమారులే కాని త్యాగమూర్తులై వెళ్లాలి. త్యాగమూర్తిగా కాకుండా తపస్వీమూర్తిగా కాలేరు. తపస్వీలు కూడా కానీ వెనువెంట త్యాగమూర్తులు కావాలి. బ్రహ్మాకుమారులే కానీ బ్రహ్మాకుమారుల లేదా బ్రాహ్మణుల యొక్క కుల మర్యాదలను తెలుసుకుని మర్యాదా పురుషాత్తములుగా అయి వెళ్లాలి. మీరు ఎలాంటి మర్యాదా పురుషోత్తములుగా అవ్వాలంటే మీ యొక్క ఒక్కొక్క సంకల్పం వాయుమండలం పైన ప్రభావం వేయాలి. అంత శక్తిశాలి అయ్యి వెళ్లాలి. శక్తి ఉంది కానీ శక్తిసాగరులై వెళ్లాలి. పూర్తిగా అన్నీ ఉంటే ఎప్పుడూ ఫెయిల్ అవ్వరు. పూర్తిగా ఉన్నదానికి గుర్తు - ఎప్పుడూ ఫెయిల్ అవ్వకపోవడం మరియు ఎప్పుడూ ఫీల్ అవ్వకపోవడం మరియు లోపం లేనివారిగా అవ్వడం (ఫీల్, ఫెయిల్ మరియు ప్లా లెస్). కనుక పూర్తిగా అయ్యి, నిండుగా అయ్యి వెళ్లాలి. అందువలనే భట్టీకి వచ్చారు. ఏమి నేర్చుకోవాలి? చాలా పాఠాలు చదువుకున్నారు. ఈ పాఠాలన్నీ ప్రత్యక్షంగా చదువుకుని వెళ్లాలి. పాఠం ఎంత పక్కా చేసుకోవాలంటే మీ ప్రత్యక్ష నడవడికే ఒక పాఠంగా అయిపోవాలి. నోటితో చెప్పే పాఠం ఒకటి, కర్మ ద్వారా నేర్పించే పాఠం ఒకటి. నోటితో చదివిస్తారు, కర్మతో నేర్పిస్తారు. కనుక ప్రతి నడవడిక ఒక పాఠంలా ఉండాలి. పాఠం చదువుకోవడం ద్వారా ఉన్నతి ఎలా పొందుతారో అదేవిధంగా మీ అందరి నడవడికతో అందరూ పాఠం చదువుకోవాలి లేదా వారికి నేర్పించాలి మరియు ఉన్నతి పొందుతూ వెళ్లాలి. కనుక చదువుకోవాలి కూడా మరియు చదివించాలి కూడా. ఏడురోజుల కోర్సు అయితే అందరూ చేశారు. కదా! ఏడు రోజుల కోర్సు శక్తివంతంగా చేసారా లేదా కేవలం కోర్సు మాత్రమే తీసుకున్నారంతేనా? కోర్సు తీసుకోవడం అంటే మీలో ఫోర్స్ అనగా శక్తిని నింపుకోవడం. శక్తి నిండలేదంటే కోర్సు చేసినట్లేంటి? నిర్బల ఆత్మ నుండి శక్తిశాలి ఆత్మగా తయారుచేసేటందుకు కోర్సు చేస్తారు. కోర్సు యొక్క ఫోర్సు లేకపోతే అది కోర్సు అవుతుందా! కనుక శక్తిశాలి కోర్సు చేసేటందుకు ఇక్కడకు వచ్చారు. డబల్ తిలకధారిగా కూడా అవ్వాలి, రెండు తిలకాలు ఏవి? రోజూ మీ తిలకం చూసుకుంటున్నారా? అమృతవేళ జ్ఞాన స్నానం చేసినప్పుడు తిలకం కూడా పెట్టుకుంటున్నారా? ఆత్మిక స్మృతి లేదా ఆత్మిక స్వరూపంలో ఉండడం తిలకం పెట్టుకోవడం కదా! రెండవది నిశ్చయం యొక్క తిలకం. ఒకటి - ఆత్మిక తిలకం, రెండవది - మేము విజయీ రత్నాలం అనే తిలకం. ప్రతి సంకల్పం, ప్రతి అడుగులో విజయం , సఫలత నిండి ఉండాలి. విజయీ తిలకం దిద్దుకోవాలి. విజయము మరియు విజయ రూపం యొక్క తిలకం మీది. ఈ రెండు తిలకాలు సదా స్మృతిలో ఉండాలి. స్మృతిలో పెట్టుకోవడమే తిలకధారిగా అవ్వడం. కనుక రెండు తిలకాలను ఎప్పుడూ మర్చిపోకూడదు. నేను విజయీని, ఈ స్మృతిలో ఉండడం ద్వారా ఎప్పుడూ కూడా రకరకాల పరిస్థితులు ఏవీ కూడా మిమ్మల్ని కదపలేవు. విజయం లభించే ఉంది, వర్తమాన సమయంలో మీ స్థితి అలజడి అవుతుంది. కనుక విజయం అనగా సఫలతలో కూడా అలజడి కనిపిస్తుంది. కానీ ప్రతి కర్తవ్యంలో విజయం లభించే ఉంది. వాతావరణం సరిగా లేనప్పుడు టీవీ కూడా స్పష్టంగా రాదు కదా! అదేవిధంగా మీ స్థితి అలజడిగా ఉన్న కారణంగా విజయం లేదా సఫలత కూడా స్పష్టంగా అనుభవం అవ్వడం లేదు. కారణం ఏమిటి? మీ స్థితి యొక్క అలజడి స్పష్టంగా ఉన్న విషయాన్ని కూడా అస్పష్టంగా తయారుచేస్తుంది. అలజడుల్లో ఉన్న కారణంగా ఉజ్వలంగా కాలేకపోతున్నారు. మీ స్థితి అలజడి అవ్వకపోతే, మీ స్మృతి స్పష్టంగా ఉంటుంది. అక్కడ వాతావరణం క్లియర్ గా ఉండాలి, ఇక్కడ స్మృతి క్లియర్ గా ఉండాలి, మీ స్మృతి క్లియర్ గా ఉంటే సఫలత కూడా క్లియర్ గా అంటే స్పష్ట రూపంలో కనిపిస్తుంది. స్మృతి స్పష్టంగా లేదు లేదా మీపై మీకు జాగ్రత్త లేదు. జాగ్రత్త తక్కువగా ఉన్న కారణంగా ఫలితం కూడా పూర్తిగా కనిపించడం లేదు. స్వయం పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటారో, అంత స్పష్టంగా ఉండగలరు మరియు మీ పురుషార్ధంలో లేదా సేవలో సఫలత అనేది కూడా స్పష్టంగా మరియు సమీపంగా కనిపిస్తుంది. టీవీలో దూరదృశ్యం కూడా స్పష్టంగా మరియు సమీపంగా వస్తుంది కదా! అదేవిధంగా ఏకరసస్థితి ఉంటే, మీపై మీకు జాగ్రత్త ఉంటే మరియు స్పష్టంగా ఉంటే సఫలత సమీపంగా మరియు స్పష్టంగా కనిపిస్తుంది. అర్థమైందా! ఈ రెండింటిలో ఒకటి తక్కువైనా కానీ సఫలత అనుభవం చేసుకోలేరు. తరువాత మరలా అలజడి అవుతారు. ఏమి చేయను, ఇదెలా అవుతుందో, ఇలా బలహీనత యొక్క భాష మాట్లాడతారు. కనుక రెండు విషయాలను ధారణ చేస్తూ వెళ్లినట్లయితే సఫలతామూర్తులు అయిపోతారు. కంఠానికి హారం ఎంత సమీపంగా ఉంటుందో సఫలత మీకు అంత సమీపంగా ఉంటుంది. సఫలత కూడా మీ కంఠహారం అయిపోతుంది. మంచిది.