25.08.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ముఖ్యమైన ఏడు బలహీనతలు మరియు వాటిని తొలగించుకునేటందుకు ఏడు రోజుల కోర్సు.

ఒక్క సెకెనులో వాణీకి అతీతమైన స్థితిలో స్థితులు కాగలుగుతున్నారా? ఇతర కర్మేంద్రియాలను ఎప్పుడు కావాలంటే, ఎలా కావాలంటే అలా కదపగలుగుతున్నారు. అదేవిధంగా బుద్ధి యొక్క సంలగ్నతను ఎక్కడ కావాలంటే, ఎప్పుడు కావాలంటే ఆవిధంగా మరియు అప్పుడు స్థితులు చేయగలుగుతున్నారా? ఇటువంటి శక్తివంతులుగా అయ్యారా? ఈ విధి వృద్ధి అవుతూ ఉందా? విధి యదార్థంగా ఉంటే విధి ద్వారా సిద్ధి అనగా, సఫలత మరియు శ్రేష్టత రోజురోజుకు తప్పకుండా వృద్ధి అవుతున్నట్లు అనుభవం చేసుకుంటారు. ఈ పరిణామం ద్వారా మీ పురుషార్థం యొక్క యదార్ధ స్థితిని పరిశీలించుకోగలరు. ఈ స్థితియే విధిని పరిశీలించేటందుకు ముఖ్య గుర్తు. ఏ విషయాన్ని అయినా పరిశీలించేటందుకు కొన్ని గుర్తులు ఉంటాయి కదా! అదేవిధంగా ఈ గుర్తులతో మీ బుద్ధి యొక్క సంపూర్ణతను పరిశీలించగలుగుతున్నారా? వర్తమాన సమయంలో పురుషార్థుల యొక్క పురుషార్ధం ఏదైతే నడుస్తుందో ఆ పురుషార్థంలో ముఖ్యంగా ఏ బలహీనతలు కనిపిస్తున్నాయి? 1) స్మృతిలో సమర్ధత లేదు. 2) దృష్టిలో దివ్యత మరియు అలౌకికత శక్తిననుసరించి నెంబర్ వారీగా వచ్చింది. 3) వృత్తిలో విల్ పవర్ లేని కారణంగా వృత్తి ఏకరసంగా ఉండడం లేదు, చలిస్తుంది. 4) నిరాకారి స్థితిపై శ్రద్ధ తక్కువగా ఉన్నకారణంగా ముఖ్య వికారాలైన దేహాభిమానం, కామము మరియు క్రోధము ఈ మూడింటి యొక్క యుద్ధం సమయానుసారంగా జరుగుతుంది. 5) సంఘటనలో ఉంటూ, సంప్రదింపుల్లోకి వస్తూ వాయుమండలం లేదా తరంగాలు తమ ప్రభావాన్ని వేస్తున్నాయి. 6) అవ్యక్త ఫరిస్తా స్థితి తక్కువగా ఉన్నకారణంగా మంచి లేదా చెడు విషయాల యొక్క ఫీలింగ్ లోకి వచ్చేసి ఫెయిల్ అయిపోతున్నారు. 7) స్మృ తియాత్రతో సంతుష్టత అనేది తక్కువగా ఉంది. పురుషార్థీల యొక్క పురుషార్ధం యొక్క నెంబర్ వారీ ఫలితాలు ఇవి.

ఇప్పుడు ఈ ఏడు విషయాలను తొలగించే పనిలో మీరు మరలా ఏడు రోజుల కోర్సు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడు విషయాలను ఎదురుగా ఉంచుకుని ఏడురోజుల కోర్సు ఏదైతే మీరు ఇతరులకు చెబుతారో అది మీకోసం పునరావృతం చేసుకోవాలి. మురళీలను ఎలా అయితే రివైజ్ చేసుకుంటారో, రివైజ్ చేయడం ద్వారా అనగా మరలా మరలా చదవడం ద్వారా కొత్తదనం మరియు శక్తి పెరిగినట్లు అనుభవం అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏకాంతంలో కూర్చుని అమృతవేళ ఈ ఏడు విషయాలు ఏవైతే చెప్పానో ఆ ఒక్కొక్క విషయం యొక్క నివారణ గురించి ప్రతిరోజూ పాఠంలో ఏవేవి పాయింట్లు వచ్చాయో వాటిని మననం చేసి వెన్న అనగా సారం తీయాలి. మరియు పరస్పరంలో వాటిని ఇచ్చిపుచ్చుకోవాలి. కోర్సు అయితే చేశారు, కానీ జిజ్ఞాసువులకు కోర్సు చెప్పిన తరువాత ఆ పాఠానికి సంబంధించిన యుక్తి చెబుతారు కదా! లేదా వారికి శ్రద్ధ ఇప్పిస్తారు కదా! అదేవిధంగా మీ ప్రతి ఒక్కరు రెగ్యులర్ గాడ్లీ స్టూడెంట్. కనుక ఇప్పుడు మరలా ఒక వారం రోజుల పాటు ఒక్కొక్క పాఠాన్ని అభ్యాసంలోకి మరియు ధారణలోకి తీసుకురండి. ఏడు రోజుల పాఠం చెబుతారు కదా! సేవలో మీరు పవిత్రతా సప్తాహం లేదా శాంతి సప్తాహం అనే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. అదేవిధంగా ఇప్పుడు మీ స్వ ఉన్నతి కోసం ప్రతి పాఠాన్ని సప్తాహికంగా అనగా ఏడు రోజుల పాటు అభ్యాసంలోకి లేదా ధారణలోకి తీసుకురండి. ఇలా ఇలా పునరావృతం చేయడం ద్వారా ఏమవుతుంది? సఫలత అనేది సమీపంగా, సహజంగా మరియు స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు శ్రేష్టంగా కూడా అయిపోతారు. స్వయాన్ని ప్రతి సంకల్పం లేదా ప్రతి కర్మలో మహాన్ గా తయారుచేసుకునేటందుకు అన్నింటికంటే సహజమైన యుక్తి మూడు మాటల్లో చెప్పండి? మనసా, వాచా, కర్మణాలో మహానత తీసుకురావడానికి అడుగుతున్నాను. మహాన్ గా అయ్యేటందుకు ఒకటి - మిమ్మల్ని మీరు ఈ పాత ప్రపంచంలో అతిథిగా భావించండి, రెండు - ఏ సంకల్పం చేస్తున్నా, కర్మ చేస్తున్నా మహాన్ తేడాను బుద్ధిలో పెట్టుకుని ఆ సంకల్పం మరియు కర్మ చేయండి. మూడు - బాబా యొక్క లేదా మీ దైవీ పరివారంలోని ప్రతి ఆత్మ యొక్క గుణాలను మరియు శ్రేష్ఠ కర్తవ్యం యొక్క మహిమ చేస్తూ ఉండండి. ఒకటి - మెహమాన్ అనగా అతిథి. రెండు - మహాన్ అంతర్ అనగా మహాన్ తేడా మరియు మూడు - మహిమ. ఈ మూడు విషయాలు ఉంటే ఏడు బలహీనతలు సమాప్తం అయిపోతాయి. అతిథిగా భావించని కారణంగా ఏదో ఒక రంగు, రూపం యొక్క ఆకర్షణలోకి వెళ్లిపోతున్నారు లేదా ద్యాస అటు వెళ్లిపోతుంది. మహాన్ తేడాను ఎదురుగా పెట్టుకోవడం ద్వారా ఎప్పుడు కూడా దేహ అహంకారం లేదా క్రోధం యొక్క అంశం, వంశము ఉండలేదు. మూడవ విషయం బాబా యొక్క లేదా ప్రతి ఆత్మ యొక్క గుణాల గురించి మహిమ చేయండి. లేదా కర్తవ్యం గురించి మహిమ చేస్తూ ఉండడం ద్వారా ఎవరి ద్వారా ఏ విషయం యొక్క ఫీలింగ్ లోకి రారు. సదా గుణాలను మరియు కర్తవ్యాలను మహిమ చేయడం ద్వారా స్మృతియాత్ర బావుంటుంది, అసంతుష్టత కూడా నిరంతర లేదా సహజ స్మృతిలోకి పరివర్తన అయిపోతుంది. కనుక ఈ మూడు మాటలను సదా స్మృతిలో ఉంచుకోండి. అప్పుడు సమర్థవంతులుగా అయిపోతారు. దృష్టి, వృత్తి వాయుమండలం అన్నీ పరివర్తన అయిపోతాయి. ద్వాపరయుగం నుండి మొదలుకుని ఈ రోజు వరకు మీ యొక్క మరియు మీ దైవీ పరివారంలోని ఆత్మల యొక్క మహిమ చేస్తూ వచ్చారు. కీర్తిస్తూ వచ్చారు. ఇప్పుడు చైతన్యంగా పరిచయమైన ఆత్మల యొక్క అవగుణాలను లేదా బలహీనతలను ఎందుకు చూస్తున్నారు? లేదా బుద్ధిలో ఎందుకు ధారణ చేస్తున్నారు? కనుక ఇప్పుడు కూడా ప్రపంచం అంతటిలో ఎన్నుకున్నటువంటి శ్రేష్టాత్మల యొక్క గుణగానం చేయండి. బుద్ధి ద్వారా గ్రహించండి మరియు నోటి ద్వారా ఒకరినొకరి గుణగానం చేసుకోండి. అప్పుడు దృష్టి, వృత్తి చంచలం అవుతాయా? ఏదైనా బలహీనత యొక్క అనుభవం అవుతుందా? మీకు కూడా అనుభవం ఉంది కదా - ఏదైనా మందిరంలోని మూర్తి ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, అలంకరించబడి సుందరంగా ఉన్నా ఎప్పుడు కూడా దృష్టి ఆ సుందరత లేదా అలంకరణవైపు వెళ్లి సంకల్ప మాత్రంగా కూడా చంచలత రాదు. అక్కడే ఏదైనా సినిమా లేదా పుస్తకాల్లో ఉన్నటువంటి స్త్రీల చిత్రాలు లేదా అలాంటి బోర్డు ఏదైనా చూసినప్పుడు, వారి యొక్క ఆకర్షణ లేదా అలంకరణ చూసినప్పుడు వృత్తి, దృష్టి చంచలం అవుతాయి. ఎందుకని? ఆకర్షణ అనేది విగ్రహాల్లో కూడా ఉంటుంది. అలంకరణ, ముఖకవళికలు, సుందరత ఇవన్ని విగ్రహాల్లో కూడా ఉంటాయి. అయినా కానీ వృత్తి మరియు దృష్టి చంచలం ఎందుకు అవ్వడం లేదు? రెండు చిత్రాలను ఎదురుగా పెట్టుకోండి లేదా ఒక గదిలో రెండు చిత్రాలను పెట్టండి. మీ దృష్టి ఒక సెకెను అటువైపు వెళ్తే చంచలం అవుతుంది. ఇటువైపు వెళ్తే పవిత్రం అవుతుంది. ఇలా పవిత్రతకు - అపవిత్రతకు కారణం ఏమిటి? స్మృతి. వీరు దేవి అనే స్మృతిలో ఉంటారు. అందువలన ఆ స్మృతి ద్వారా దృష్టి, వృత్తి పవిత్రంగా ఉంటాయి. వీరు ఆడవారు అనే స్మృతిలో చూసినప్పుడు వృత్తి, దృష్టి అపవిత్రత వైపు ఆకర్షించబడతాయి. అక్కడ రూపాన్ని చూస్తారు మరియు ఇక్కడ ఆత్మీయతను చూస్తారు. గతంలో మీకు ఇలాంటి అనుభవం ఉంది కదా? వర్తమానంలో కూడా కొంచెం శాతంలో ఉంది. కానీ దీనిని తొలగించుకునేటందుకు ఎప్పుడైనా కానీ, ఎక్కడ చూసినా కానీ, ఎవరితో మాట్లాడుతున్నా కానీ, ఏమి స్మృతిలో పెట్టుకుంటారు? ఆత్మగా భావించాలి. ఇదైతే మొదటి స్మృతి. కానీ కర్మ చేస్తూ, సంప్రదింపుల్లోకి వస్తూ, సంబంధంలో ఉంటూ మీరు ఇదే స్మృతి కలిగి ఉండండి - వీరందరూ జడ చిత్రాల యొక్క చైతన్య దేవీ దేవతా రూపాలు. దేవీ రూపం స్మృతిలోకి రావడం ద్వారా జడ చిత్రాలను చూసి ఎప్పుడు కూడా సంకల్పమాత్రంగా కూడా అపవిత్రత లేదా దేహ ఆకర్షణ అనేది రాదో, అదేవిధంగా చైతన్య రూపంలో కూడా అదే స్మృతి పెట్టుకోవడం ద్వారా సంకల్పంలో కూడా ఈ కంప్లైంట్ మీకు ఉండదు. మరియు మీరు కంప్లీట్ గా కూడా అయిపోతారు. అర్థమైందా! వర్తమాన పురుషార్థీల యొక్క కంప్లైంట్ మరియు కంప్లీట్ గా అయ్యే యుక్తులు ఇవి.భట్టీకి వచ్చినవారు స్వ ఉన్నతి చేసుకుంటూ ఉన్నారు. కానీ వేగం తీవ్రంగా ఉందా? భట్టీ సమాప్తం అయిపోయిన తరువాత కిందికి దిగగానే వేగం తక్కువ అయిపోకూడదు. ఇలాంటి పురుషార్ధం చేస్తున్నారు కదా! మంచిది.