15.09.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


మాస్టర్ జ్ఞాన సూర్య ఆత్మల యొక్క కర్తవ్యం.

ఈ సంఘటనని ఏ సంఘటన అని అంటారు? ఈ సంఘటన యొక్క విశేషత ఏమిటి? విశేషతను అనుసరించే పేరు పెట్టాలి కదా! ఇతర సంఘటనల్లో లేని విశేషత ఈ సంఘటనలో ఏమి ఉంది? మీ సంఘటన యొక్క విశేషత ఏమిటో తెలుసా? ఈ సంఘటన బ్రాహ్మణ పరివారం అంతటిలో ఉన్న విశేషాత్మల సంఘటన. కానీ ఈ విశేషాత్మల సంఘటనలో విశేషత ఏమిటంటే సర్వ ప్రసిద్ధ నదుల యొక్క మేళా ఇది. విశేష రోజుల్లో నదుల మేళా జరుగుతుంది కదా! కానీ ఈ మేళా ప్రసిద్ధ నదుల మేళా. జ్ఞాన సాగరుని నుండి వెలువడిన పతిత పావని నదుల మిలనం. స్వయాన్ని పతిత పావనిగా భావిస్తున్నారా? పతిత పావని అయితే, పతిత పావనిగా ఎవరు అవుతారో ఆ ముఖ్య విషయం తెలుసా? పతిత పావనిగా అయ్యేటందుకు ఏ ముఖ్య విషయం స్మృతిలో ఉంచుకోవాలి - దాని ద్వారా ఎటువంటి పతితులు అయినా పావనంగా అయిపోవాలి. పతిత ఆత్మల యొక్క ఏ సంకల్పం అయినా తొలగిపోవాలి. దీని కొరకు ముఖ్యంగా ఇదే విషయం సదా బుద్దిలో ఉండాలి - నేను సర్వాత్మల యొక్క పతిత సంకల్పాలను లేదా వృత్తులను లేదా దృష్టిని భస్మం చేసే మాస్టర్ జ్ఞాన సూర్యుడిని. మాస్టర్ జ్ఞాన సూర్యులై ఏ పతిత ఆత్మను అయినా చూస్తే ఎలాగైతే సూర్యుడు తన కిరణాల ద్వారా చెత్త మురికి యొక్క కీటాణువులను భస్మం చేసేస్తాడో, అదేవిధంగా ఏ పతిత ఆత్మ యొక్క పతిత సంకల్పం అయినా కానీ పతిత పావని ఆత్మపై యుద్ధం చేయలేదు. అంతేకాదు ఆ పతిత ఆత్మలు పతిత పావని అయిన మీకు బలిహారం అయిపోతారు. ఒకవేళ పతిత పావని పట్ల ఏ పతిత ఆత్మకి అయినా పతిత సంకల్పం ఉత్పన్నం అయ్యిందంటే మీరు మైక్ అయ్యారు. కానీ మైట్ హౌస్ (శక్తి స్వరూపం)గా అవ్వలేదు. అని భావించండి. మైక్ లో వచ్చే ధ్వని చాలా మధురంగా అనిపిస్తుందో అదేవిధంగా మైక్ గా అయిన వారి మాట చెవులకు ఇంపుగా ఉంటుంది. కానీ మైట్ హౌస్ స్థితి అనేది మనస్సు యొక్క రసాన్ని అనుభవం చేయిస్తుంది. ఒకసారి అయినా కానీ ఇంద్రియాల రసనను అనుభవం చేస్తే ఆ రసన అనేక అల్పకాలిక రసనల వైపుకి ఆకర్షితం చేసేస్తుంది. ఏ పతిత ఆత్మ యొక్క, ఏ కర్మేంద్రియం యొక్క రసనకి అనగా వినాశి రసనకి ఆకర్షితం అవ్వకూడదు. వస్తూనే అలౌకిక అతీంద్రియ సుఖం యొక్క రసన లేదా మనస్సు యొక్క రసన అనుభవం అవ్వాలి. దీని కొరకు మొదట పతిత పావని ఆత్మలకి మన్మనాభవ స్థితి ఉండాలి. ఒకవేళ స్వయమే దేహాభిమానానికి లేదా దేహ ప్రపంచం అనగా పాత ప్రపంచం యొక్క ఏ వస్తువు యొక్క రసనలో అయినా కొంచెంగానైనా చిక్కుకున్నారంటే అలాంటి వారు ఇతరులకు మనస్సు యొక్క రసనని ఎలా అనుభవం చేయించగలరు? ఇనుప సంకెళ్ళు, పెద్ద పెద్ద సంకెళ్ళను తెంచుకున్నారు. కానీ చాలా లోతైన దారాలు అక్కడక్కడ బంధన్ముక్తులు కానివ్వటం లేదు. ఆ లోతైన దారాలు ఏవి? వీటిని పరిశీలించటం కూడా కష్టం కాదు, ఈ గ్రూపు వారికి. తెలుసు కూడా మరియు త్రెంచుకోవాలని అనుకుంటున్నారు కూడా కానీ ఇంకా ఏమి మిగులుతుంది? అన్నింటికంటే అతి లోతైన దారం ఏది? జ్ఞానిగా అయిన తర్వాత ఆ బంధన మొదలవుతుంది. (ప్రతీ ఒక్కరు చెప్పారు) ఇవన్నీ వ్రాసుకోండి. మీకు పనికొస్తాయి. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఈ గ్రూపులో గంగ - యమునలు కలుసుకున్నాయి. ఇది విశేషం కదా! సరస్వతి గుప్తంగా ఉంటుంది. గంగ ఎవరు మరియు యమున ఎవరు? ఇది కూడా గుప్త రహస్యం. అయితే ముందుగా ఇది చెప్పండి - అన్నింటికంటే లోతైన దారం ఏది? దీని ద్వారా మీకే తెలిసిపోతుంది గంగ ఎవరో, యమున ఎవరో! అన్నింటికంటే లోతైన మరియు అతి సుందర దారం ఏదో ఒక మాటలో చెప్పాలంటే అది - "నేను" అనే మాట. నేను అనే మాటయే దేహాభిమానానికి అతీతంగా తీసుకువెళ్తుంది, మరియు నేను అనే మాటయే దేహి అభిమాని నుండి దేహాభిమానంలోకి తీసుకువస్తుంది. నేను శరీరాన్ని కాదు అని అనుకుంటూ దీనికి అతీతంగా అవ్వటానికి అభ్యాసం చేస్తూ ఉన్నారు. నేను ఫలానా, నాకు అన్నీ తెలుసు, నేను ఏ విషయంలో తక్కువ, నేను ఇది చేశాను లేదా ఇది చేయగలను, నేను ఏమిటో ఎలా ఉంటానో నాకు తెలుసు, నేను ఎలా సహిస్తున్నానో, సమస్యలను ఎలా ఎదుర్కుంటున్నానో నాకు తెలుసు, నేను ఎంత త్యాగం చేసి నడుస్తున్నానో నాకు తెలుసు.... ఈ విధంగా నేను అనే జాబితా సవ్యంగా ఉండడానికి బదులు విరుద్ధంగా ఉంటుంది. ఇదే లోతైన సుందర దారంగా అవుతుంది. ఇది అన్నింటికంటే పెద్ద లోతైన దారం. అతీతంగా అవ్వటానికి బదులు బాబాకి ప్రియంగా తయారు చేయటానికి బదులు ఏదోక ఆత్మకి లేదా ఏదోక గౌరవానికి, ఎవరోక విశేషాత్మకి ప్రియంగా తయారు చేస్తున్నారు. ఈ దారాన్ని త్రెంచుకునేటందుకు, ఈ దారం నుండి బంధన్ముక్తులు అయ్యేటందుకు ఏమి చేయాలి? ఎలా పరివర్తన చేయాలి? బాధ్యతాధారి, కిరీటధారి గ్రూపునే అడిగాను కదా! నిరహంకారులేనా? నిరాకారులేనా? నిరాకారి స్థితిలో స్థితులై నిరహంకారిగా అయితే నిర్వికారిగా స్వతహాగానే అయిపోతారు. నిరహంకారిగా అవుతున్నారు కానీ నిరాకారి అయ్యి నిరహంకారిగా అవ్వటం లేదు. యుక్తులను ఉపయోగించి అల్పకాలికంగా నిరహంకారిగా తయారు చేస్తున్నారు. కానీ నిరంతరం నిరాకారి స్థితిలో స్థితులై సాకారంలోకి వచ్చి ఈ కార్యం చేస్తున్నాను - ఈ స్మృతి యొక్క అభ్యాసం సహజంగా మరియు స్వభావంగా అవ్వని కారణంగా నిరంతరం నిరహంకారి స్థితిలో సితులు కాలేకపోతున్నారు. కొందరు ఒకచోట నుండి వస్తారు, మరికొందరు మరో చోట నుండి వస్తారు, నేను ఇక్కడి నుండి వచ్చాను అని సదా గుర్తుంటుంది కదా! అదేవిధంగా నేను నిరాకారి నుండి సాకారంలోకి వచ్చి ఈ కార్యం చేస్తున్నాను అని సదా స్మృతిలో ఉండాలి. మధ్యమధ్యలో ప్రతీ కర్మ చేస్తూ ఈ స్థితి యొక్క అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. కొద్ది సమయానికి నిరాకారిగా కూడా తయారు చేస్తున్నారు. కానీ ఇప్పుడు దీనిని సదాకాలికంలోకి మార్చండి. నిరాకారిగా అయ్యారు, వైరాగ్య వృత్తి కూడా ఉంది. కానీ సదాకాలిక బేహద్ వైరాగిగా అవ్వండి. లేకపోతే ఏదోక హద్దులోని వస్తువు వైరాగ్య వృత్తిని తొలగించడానికి నిమిత్తం అవుతుంది. యోగయుక్తులు కూడా కానీ యోగయుక్తుల యొక్క గుర్తులు ప్రత్యక్ష కర్మలో చూపించండి. మీ యొక్క ప్రతీ కర్మ, ప్రతీ మాట భోగిని యోగిగా చేయాలి. ప్రతీ సంకల్పం, ప్రతి కర్మ యుక్తియుక్తంగా రహస్యయుక్తంగా, రాజయుక్తంగా ఉండాలి. ప్రత్యక్షంగా, యోగయుక్తంగా ఉండటం అంటే ఇదే. మీ సంకల్పం, మాట, కర్మలో ఈ మూడు విషయాలు లేవంటే అది వ్యర్థం. రాజయుక్తంగా లేకపోతే ఎలా ఉంటుంది? వ్యర్ధంగా, యోగాభ్యాసిగా అయ్యాను కానీ ప్రత్యక్ష యోగిగా ఇంకా అవ్వలేదని అనుకోండి. ఇప్పుడు ఈ విషయంపై శ్రద్ధ అవసరం. అప్పుడు ఏ సమస్య లేదా విఘ్నం, పరిస్థితి మీపై యుద్ధం చేయలేవు. ప్రత్యక్ష యోగయుక్తులుగా, జ్ఞానయుక్తులుగా, స్నేహయుక్తులుగా, దివ్య అలౌకిక మూర్తిగా అయితే విశ్వం ముందు ప్రత్యక్ష రుజువుగా అయిపోతారు. మాయ అంటని వారిగా అయ్యేటందుకు - నేను జ్ఞాన యోగాలకు ప్రత్యక్ష ఉదాహరణ అని భావించండి. వీటి యొక్క ప్రత్యక్ష రుజువుగా అవ్వటం అంటే ఆత్మల యొక్క కోరికలను పూర్తి చేసేవారిగా అవ్వటం. ప్రతీ సంకల్పం, ప్రతీ అడుగు సదా బాబా యొక్క శ్రీమతానుసారంగా నడిచేవారు ఇతరాత్మల కోరికలను సమాప్తం చేయగలరు. మీలో కూడా పురుషార్ధం గురించి, సఫలత గురించి కోరిక మిగిలి ఉందంటే దానికి కారణం ఏమిటంటే బాబా యొక్క ఏదోక ఆజ్ఞను పాలన చేయటం లేదు. ఏ ఘడియలో అయినా మీ పురుషార్థం గురించి కానీ, సేవా సఫలత గురించి కానీ, సర్వుల స్నేహం, సహయోగం ప్రాప్తించటంలో కానీ కొంచెమైనా లోటు లేదా అలజడి వస్తుందంటే బాబా యొక్క ఏ ఆజ్ఞను పాటించటం లేదో పరిశీలించుకోండి. దాని వలనే ఆ సెకండు ఆవిధంగా అనుభవం చేసుకుంటున్నారు. ఆజ్ఞ అనేది కేవలం ముఖ్య విషయాల గురించే కాదు, ప్రతీ సమయం ప్రతీ కర్మ కోసం ఆజ్ఞ లభించింది. ఉదయం అమృతవేళ నుండి మొదలు రాత్రి వరకు మీ దినచర్య గురించి ఏవైతే ఆజ్ఞలు లభించాయో వాటి గురించి పరిశీలించుకోండి. వృత్తిని, దృష్టిని, సంకల్పాలను, స్మృతిని, సేవను సంబంధాలను అన్నింటినీ పరిశీలించండి. ఏదైనా యంత్రం పని చేస్తూ చేస్తూ వేగం తగ్గిపోయిందనుకోండి. అన్ని భాగాలను పరిశీలిస్తారు కదా! నాలుగు వైపులా పరిశీలిస్తారు. అదేవిధంగా మీరు కూడా నాలుగు వైపులా పరిశీలించుకోవటం ద్వారా మీ వేగాన్ని పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆగిపోవటం అనేది లేదు, సమాప్తి అయిపోయింది. కానీ ఇప్పుడు వేగం పెంచుకునేది ఉంది. ఏ స్థితి గురించి అయితే విన్నారో ఆ స్థితిలో ఉంటున్నారు కూడా, పురుషార్ధంలో విశేషాత్మలు కూడా, స్థితిని పరిశీలించుకోవటంలో మంచిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమి చేయాలి? శాతాన్ని పెంచుకోండి. శాతం తక్కువగా ఉంది. పరీక్ష ఏదైతే పెట్టారో దాని ఫలితం ఇది. జ్ఞానశక్తి ద్వారా స్థితిని తయారు చేసుకుంటున్నారు. కానీ ఆ శాతంతో స్వయం కూడా సంతుష్టంగా లేరు. ఇప్పుడు దీనిని సంపూర్ణం చేసుకోవాలి. ఙ్ఞాన శక్తితో పాటు మహీనత గురించి ఏదైతే చెప్పానో ఆ కారణంగా నకిలీ మరియు నష్టం చేసే శక్తి కూడా కలిసిపోతుంది. నకిలీ లేదా నష్టం చేసే శక్తి కలవకూడదు, దాని కోసం ఏ విషయం స్మృతిలో పెట్టుకుంటారు? ప్రతీ ఆత్మ పట్ల దయా భావన సదాకాలికంగా ఉంటే ఎవరినీ తిరస్కరించరు. ఎవరి వలన మీరు తిరస్కరించబడినట్లు భావించరు. ఎక్కడ దయా హృదయులు అవ్వాలో అక్కడ దయా హృదయులు అవ్వటానికి బదులు అహంకారిగా అయిపోతున్నారు. ఇక్కడే విశ్వ మహారాజుగా కాదు, కానీ తమ రాష్ట్రానికి యజమానులుగా భావిస్తున్నారు. రాష్ట్ర మంత్రులందరు ఇక్కడికి వచ్చారు కదా! ఇలా రాష్ట్రానికి యజమానులుగా భావించటం ద్వారా నిరాకారి మరియు .నిరహంకారి స్థితిని మర్చిపోతున్నారు. రాష్ట్ర సేవాధారులు మీరే, అంతేకానీ ఎవరి నుండి సేవ తీసుకునేవారు కాదు. నేను ఇంత చేశాను కనుక నాకు కొంచెం పేరు గౌరవం మహిమ లభించాలి .... ఇలాంటి సంకల్పాలు ఎవరికైనా వస్తుంటే అది కూడా తీసుకోవటం అనే భావనలోకే వస్తుంది. దాత యొక్క పిల్లలు వీటిని తీసుకోవాలనే భావన కలిగి ఉన్నట్లయితే దాతగా కాలేనట్లే కదా! ఇచ్చేవారికి ఇలా తీసుకోవటం అనేది శోభించదు. అలాంటి వారినే బేహద్ వైరాగి అని అంటారు. సేవాదారులకి ఈ సంకల్పాలు కూడా రాకూడదు. అప్పుడు రాష్ట్రము నుండి విశ్వ యజమానులుగా అయ్యే పదవిని పొందుతారు. మంచిది. ఎవరైతే నిష్కామిగా ఉంటారో వారే విశ్వ కళ్యాణకారిగా అవుతారు, దయా హృదయలు అవుతారు. కర్తవ్యానికి ప్రాప్తి అనేది స్వతహాగానే లభిస్తుంది, అది వేరే విషయం కానీ కోరుకుని పొందటం అనేది వేరే విషయం. ఇలా చేస్తే పొందుతారు కానీ అల్పకాలికంగా. అంతేకాదు ఈ ప్రాప్తి అనేది అనేక జన్మల ప్రాప్తి నుండి వంచితం చేసేస్తుంది. ప్రాప్తియే అప్రాప్తికి సాధనం అవుతుంది. ఫలం ప్రాప్తించటం అనేది వేరే విషయం. ప్రకృతి దాసి అవ్వటం అనేది వేరే విషయం. కనుక అల్పకాలిక ప్రాప్తి యొక్క రూపాన్ని పరిశీలించుకుని నడవాలి. శక్తి లేదు అని కొందరు భావిస్తున్నారు, ఎందువలన? వ్యర్ధం ఎక్కువగా ఉంది. వ్యర్ధం ఎక్కువగా ఉంటే స్థితి పెరుగదు. మంచిది.