27.09.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


స్నేహ శక్తి ద్వా రా సత్యత యొక్క ప్రత్యక్షత.

ఈ సమయంలో అందరి స్మృతిలో లేదా నయనాలలో ఏమి ఉంది? ఒకే విషయం ఉందా లేక రెండు విషయాలు ఉన్నాయా లేక ఒకటిలోనే రెండు ఉన్నాయా? (ఒకే బాబా ఉన్నారు) ఈరోజు అందరూ ఏకమతంగా మరియు ఒకే విషయంపై ఉన్నారు. మంచిది, ఈ సమయంలో అయితే ఒకే విషయం ఉంది. కానీ వర్తమాన సమయంలో స్మృతిలో లేదా నయనాలలో సదా ఏమి ఉంటుంది? ఇంటికి వెళ్ళాలి; కేవలం ఇదే స్మృతి ఉంటుందా? సేవ చేయకుండా ఎలా వెళ్తారు? మీ వారసత్వం అయితే మీకు గుర్తుంది. కానీ ఇతరులకు కూడా వారసత్వాన్ని ఇప్పించాలి ఇది కూడా గుర్తుంచుకోవాలి. ప్రతీ అడుగులో బాబా స్మృతి మరియు దాంతోపాటు సేవ కూడా స్మృతి ఉండాలి, ఉంటుందా లేక కేవలం స్మృతియే ఉంటుందా? నడుస్తూ, తిరుగుతూ, కర్మ చేస్తూ సదా మేము ఈశ్వరీయ సేవ కొరకు నిమిత్తమై ఉన్నాము, స్థూల కార్యం కూడా ఈశ్వరీయ సేవార్ధమే అని స్మృతి ఉన్నట్లయితే, సదా నిమిత్తంగా భావించటం ద్వారా అకళ్యాణం జరిగే కర్మ ఏదీ మీ ద్వారా జరగదు. ఈ స్మృతిని మర్చిపోయినప్పుడే సాధారణ కర్మ లేదా సాధారణ రీతిలో సమయాన్ని గడిపేస్తారు. ఏదైనా విశేష సేవార్థం నిమిత్తమైనప్పుడు ఎంత సమయం విశేష సేవ యొక్క రూపం ఎదురుగా ఉంటుందో అంత సమయం స్థితి మంచిగా ఉంటుంది కదా! సేవ కోసం ఈ సమయంలో మేము అందరి ఎదురుగా ఉన్నాము అని భావిస్తారు కనుక. అదేవిధంగా స్థూల కార్యం చేస్తూ కూడా ఈ సమయం మనస్సు ద్వారా విశ్వ పరివర్తన చేసే సేవ ఉపస్థితి అయ్యి ఉన్నాను అని స్మృతి ఉండాలి. అప్పుడు స్థితి ఎలా ఉంటుంది? ధ్యాస ఉంటుంది మరియు పరిశీలన ఉంటుంది. అదేవిధంగా సదా స్వయాన్ని విశ్వ వేదికపై విశ్వ కళ్యాణ సేవార్ధం ఉన్నట్లుగా భావిస్తే సాధారణ స్థితి లేదా సాధారణ నడవడిక లేదా సోమరితనం ఉంటుందా? అప్పుడు ఎంత సమయం వ్యర్ధం అవ్వటం నుండి రక్షించబడుతుంది? ఎవరిపైన అయినా కానీ చాలా పెద్ద భాద్యత ఉందనుకోండి, వారి యొక్క ఒకొక్క సెకను చాలా అమూల్యమైనదిగా భావిస్తారు. ఒకటి లేదా రెండు నిమిషాలు వ్యర్థంగా వెళ్ళినా కానీ వారికి ఆ రెండు నిమిషాలు కూడా చాలా ఎక్కువ సమయంగా కనిపిస్తుంది. మరయితే అందరి కంటే చాలా పెద్ద భాద్యత మీపై ఉంది. ఈ సమయంలో మీపై ఎంత పెద్ద భాద్యత ఉంది? విశ్వమంతటికీ కళ్యాణం చేయాలి మీరు, జడము మరియు చైతన్యము రెండింటినీ పరివర్తన చేయాలి. ఎంత పెద్ద భాద్యత ఇది. ఈ సమయంలో బాబా నాకు ఏమి భాద్యత అప్పగించారు? ఇది ఎప్పుడూ స్మృతి ఉండాలి. ఒక కంటిలో బాబా యొక్క స్నేహం, రెండవ కంటిలో బాబా ద్వారా లభించిన కర్తవ్యం అనగా సేవ. స్నేహం మరియు సేవ రెండూ వెనువెంట ఉండాలి. స్నేహి ఆత్మలు ప్రియమే కానీ సేవాధారి జ్ఞాని ఆత్మలు అతి ప్రియం. కనుక రెండూ వెనువెంట ఉండాలి. రెండూ వెనువెంట స్మృతి ఉన్నప్పుడు సేవ చేసే సమయంలో కూడా మీ స్థితి స్నేహమూర్తిగా ఉంటుంది. కానీ కేవలం స్నేహం ఒకటే కాదు, స్నేహంతో పాటు మరేమి కావాలి? (శక్తి రూపం) శక్తిరూపం అయితే ఉంటుంది. కానీ శక్తి రూపం ప్రత్యక్షంగా ఏ రూపంలో కనిపిస్తుంది? సేవాఫలితంలో నెంబరు దేని ఆధారంగా లభిస్తుంది? వాచాలో సారం నిండి ఉండాలి, మాటల్లో స్నేహంతో పాటు సారం కూడా ఉండాలి దానితో వారి హృదయం చలించిపోవాలి. ఇప్పటి వరకు ఫలితం ఏమిటి? కేవలం సారం చెప్తున్నారు లేదా కేవలం స్నేహం చూపిస్తున్నారు. లేదా పూర్తిగా తేల్చేసి సాధారణంగా మాట్లాడుతున్నారు. లేదా బాగా ఆవేశంగా చెప్తున్నారు. కానీ ఎలా చెప్పాలి? ఒకొక్క మాటలో స్నేహ రేఖలు ఉండాలి, ఆ తర్వాత ఎంత కఠినమైన మాటలు మాట్లాడినా కానీ అవి కఠినంగా అనిపించవు, వాస్తవాలుగా అనిపిస్తాయి. గట్టిగా మాట్లాడితే రూపం కూడా ఆవేశంగా కనిపిస్తుంది. దీని వలన కొందరు మీకు అభిమానం అని అనుకుంటారు. లేదా వారిని అవమానం చేస్తున్నాం అని అంటారు. కానీ ఒకవైపు చెప్తూ ఉండండి, మరోవైపు స్నేహం ఇస్తూ ఉండండి. మీ స్నేహ మూర్తి ద్వారా తిరస్కారాన్ని అనుభూతి చెందరు. కానీ వీరు మాపై దయ చూపిస్తున్నారు అని భావిస్తారు. తిరస్కారానికి బదులు దయని అనుభూతి చెందుతారు. కనుక రెండూ వెనువెంట ఉండాలి కదా! మెత్తని (ముఖమల్) చెప్పుతో కొట్టినట్లు అని అంటూంటారు కదా! అందువలన సేవలో ఒకవైపు దయా భావం మరియు దాంతోపాటు అయదార్ధ విషయాలు చెప్తారు కదా! వారు దానికి బదులు యదార్ధ విషయాలను చెప్పే సంతోషం కూడా ఉండాలి. అన్ని విషయాలు స్పష్టంగా చెప్పాలి. కానీ స్నేహంతో, స్నేహమూర్తి అవ్వటం ద్వారా వారికి జగన్మాత రూపం అనుభవం అవుతుంది. తల్లి తన పిల్లలకు ఎలాంటి మాటలతో శిక్షణ ఇచ్చినా కానీ తల్లి యొక్క స్నేహం కారణంగా ఆ మాటలు కోపంగా లేదా కఠినంగా అనిపించవు. తల్లికి మేమంటే స్నేహం, మా కళ్యాణకారి అని అనుకుంటారు కదా! అదేవిధంగా మీరు ఎంత స్పష్టమైన మాటలతో చెప్పినా కానీ వారు అలా అనుభూతి చెందరు. కనుక రెండు స్వరూపాలు సమానంగా పెట్టుకుని సేవ చేయాలి. అప్పుడే సేవలో సఫలత సమీపంగా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ నిర్భయంగా వెళ్ళండి. సత్యతా శక్తి స్వరూపంగా అయ్యి సర్వశక్తివంతుని ప్రభుత్వ సి.ఐ.డి ఆఫీసర్ అయ్యి ఆ నషాలో వెళ్ళండి, ఆ నషాతో మాట్లాడండి, నషాతో చూడండి. మేము అనుచరులం, ఇదే స్మృతితో అయదార్ధంలో ఉన్నవారిని యదార్థంలోకి తీసుకురావాలి. సత్యాన్ని ప్రసిద్ధం చేయాలి, దాచకూడదు. కానీ రెండు స్వరూపాలు సమానంగా ఉండాలి. ఎవరినైనా చూస్తున్నప్పుడు లేదా వింటున్నప్పుడు దయా భావనతో వింటున్నారా? చూస్తున్నారా లేదా నేర్చుకోవాలని, అనుసరించాలని చూస్తున్నారా? ఈనాటి అల్పకాలిక సుఖాలు అనుభవించే ఆత్మలు ప్రకృతి దాని యొక్క షోలో కనిపిస్తున్నారు. వారి షో చూసి మీ స్థితి ఏవిధంగా ఉంటుంది? ఈ ఆత్మలు ఈ పద్దతిలో లేదా ఈ ఆచార వ్యవహారాల్లో ప్రకృతిని దాసి చేసుకున్న రూపంలో వేదికపై ప్రత్యక్షమయ్యారు. అందువలన మేము కూడా ఆవిధంగా చేయాలి. మనము కూడా వీరి వలె మారాలి అని సంకల్పం వచ్చిందనుకోండి, వారిని ఏమంటారు? దాత యొక్క పిల్లలు బికారులను అనుసరిస్తారా? వారు ఎంత ఆర్బాటంగా అలంకరించుకుని మీ ఎదురుగా వచ్చినా కానీ వారు కానున్న బికారీలు, ఆ ఆత్మలందరు బాప్ దాదా యొక్క పిల్లల నుండి ఎంతో కొంత శక్తి యొక్క బిందువులు తీసుకున్న వారు, మీ శక్తిని మీ దోసిలితో ఇచ్చారు. దాని ఫలితంగా ఈరోజు వారికి ప్రకృతి దాసి అయ్యే ఫలాన్ని పొందుతున్నారు. అలా దోసిలి నుండి తీసుకున్నవారిని చూసి సాగరుని పిల్లలు ఏవిధంగా అయిపోతున్నారు? ప్రభావితులు అయిపోతున్నారు. వారందరు కొద్ది సమయంలోనే మీ అందరి పాదాల ముందు పడడానికి తపిస్తారు. అందువలన స్నేహంతో పాటు సేవ యొక్క నషా కూడా ఉండాలి. ఆదిలో స్నేహం కూడా ఉంది మరియు నషా కూడా ఉంది. నిర్భయంగా ఉండేవారు. వాతావరణం మరియు వాయుమండలం యొక్క ప్రభావానికి అతీతంగా ఉండేవారు. అందువలనే సేవ యొక్క ఉత్సాహ, ఉల్లాసాలు, నషా ఏకరసంగా ఉండేవి. కానీ ఇప్పుడు వాయుమండలం లేదా వాతావరణాన్ని చూసి అక్కడక్కడ మీ రూపురేఖ మార్చేస్తున్నారు. అందువలనే సఫలత ఒకసారి ఒకవిధంగా, మరోసారి మరోవిధంగా వస్తుంది. కలియుగం యొక్క అంతిమంలోని ఆత్మలు తమ సత్యతను రుజువు చేసుకోవడానికి నిర్భయంగా అయ్యి వేదిక పైకి వస్తున్నారు. మరయితే పురుషోత్తమ సంగమయుగి సర్వ శ్రేష్ట ఆత్మలు తమని తాము సత్యంగా రుజువు చేసుకోవటంలో వాయుమండలాన్ని అనుసరించి రూపురేఖ తయారుచేసుకుంటున్నారా? మీరు మాస్టర్ రచయితలు కదా! వారందరు మీ రచన కదా! మాస్టర్ రచయితలు రచనని చూడటం ఏమిటి? మాస్టర్ రచయిత స్థితిలో స్థితులై చూస్తే అప్పుడు ఇదంతా ఏ ఆటగా కనిపిస్తుంది? దృశ్యం ఎలా కనిపిస్తుంది? కప్పలు కొద్దిపాటి నీటిలో ఉండి సాగరంలో ఉన్నట్లు భావిస్తాయి. ట్రా ట్రా.... అంటూ నాట్యం చేస్తాయి. కానీ అది అల్పకాలిక సుఖాలనే నీరు, అదేవిధంగా ఇది కూడా కప్పల నాట్యంలా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే అల్పకాలిక సుఖాలలో పొంగిపోతూ సమాప్తం అయిపోతారు. మాస్టర్ రచయితగా అయ్యి చూస్తే ఇలా కనిపిస్తుంది. నిస్సారంగా, అర్థం లేని మాటలుగా అనిపిస్తాయి. మరయితే సత్యతను రుజువు చేసే ధైర్యం, ఉత్సాహ, ఉల్లాసాలు వస్తున్నాయా? లేక సత్యాన్ని రుజువు చేయటానికి ఇంకా సమయం ఉందా? ఫలితం కూడా ఉండాలి మరియు మెరుపు కూడా ఉండాలి. సత్యం ముందు మా అందరి అల్పకాలిక డంభాలు నడవవు అని.... వికారాలు చేతులు జోడించి వీడ్కోలు తీసుకుంటున్నట్లు, తల వంచినట్లు ప్రత్యక్ష డ్రామాను విశ్వ వేదికపై చూపించాలి. ఈ డ్రామాను బేహద్ వేదికపై చేయండి. దానినే సేవ అని అంటారు. ఇలాంటి సేవాధారులు విజయీ మాలలో విశేష మణులు అవుతారు. ఇలాంటి సేవాధారులుగా అవ్వాలి. ఇప్పుడు దీని కొరకు అభ్యాసం చేస్తున్నారు. మొదట అభ్యాసం కోసం చిన్న చిన్న వాటిని వేటాడాలి, ఆ తర్వాత పులిని వేటాడాలి. అంతిమ ప్రత్యక్ష పాత్ర అచ్చం ఈ చిన్న డ్రామా వలె ఉంటుంది. అప్పుడు ఒకవైపు జయ జయ కారాలు మరియు మరోవైపు హాహా కారాలు వస్తాయి. రెండూ ఒకే వేదికపై. మంచిది.