09.10.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


శక్తిశాలి వృత్తి ద్వారా సేవలో వృద్ధి.

ఈరోజు ఈ సంఘటన ఏ లక్ష్యంతో కలుసుకున్నారు? సంఘటనలో ప్రాప్తి లభిస్తుంది, కానీ పరస్పరం ఏ లక్ష్యం కోసం కలుసుకోవాలనుకున్నారు? ఏదైనా కొత్త పద్ధతిని ఆలోచించారా? ఎందుకంటే ఈ సంఘటన సర్వ శ్రేష్ట ఆత్మల యొక్క మరియు సమీప ఆత్మల యొక్క సంఘటన. సమీప మరియు శ్రేష్ట ఆత్మలైన మీపై అందరి దృష్టి ఉంది. కనుక శ్రేష్ఠాత్మలు అయిన మీరు సేవలో లేదా మీ సంఘటనలో శ్రేష్టత మరియు నవీనత ఎలా తీసుకురావాలో ఆలోచించాలి. నవీనత అని దేనిని అంటారు? నవీనత అనగా ఒక సహజమైన లేదా శక్తివంతమైన ప్లాన్ తయారుచేయండి. దాని ద్వారా ఆ శక్తిశాలి ప్లాన్ యొక్క పవర్ ద్వారా ఆత్మలను ఆకర్షించాలి. దూరం నుండే ఆత్మలు ఆకర్షితం అయ్యేలా ప్లాన్ చేయండి. దీపపు పురుగులు ఉంటాయి కదా! దీపం యొక్క ఆకర్షణకి ఆ దీపపు పురుగులు ఎంత దూరంలో ఉన్నా కానీ ఆకర్షించబడతాయి. లేదా ఎక్కడైనా తేజోవంతమైన అగ్ని వెలుగుతూ ఉంటే దాని యొక్క సెగ దూరం నుండే అనుభవం అవుతుంది. ఇక్కడెక్కడో అగ్ని ఉందని ఆ సెగ వలన అర్థమైపోతుంది. అదేవిధంగా బాగా చల్లనిది ఏదైనా ఉన్నా కానీ దూరం నుండే ఆ శీతలత అనుభవం అవుతుంది మరియు ఆకర్షిస్తుంది. అదేవిధంగా మీ యొక్క రూపాన్ని లేదా సేవ యొక్క రూపురేఖలను ఈ విధంగా తయారు చేయండి దాని ద్వారా ఆత్మలు దూరం నుండే ఆకర్షితమై సమీపంగా రావాలి. వాయుమండలంలో ఏదైనా వ్యాపిస్తే చాలా దూరం వరకు దాని ప్రభావం పడుతుంది. అదేవిధంగా ఇంతమంది సహజ యోగులు లేదా శ్రేష్టాత్మలు మీ యొక్క వాయుమండలాన్ని ఇంత ఆత్మీయంగా తయారు చేసుకోవాలి. ఆ వాయుమండలం ద్వారా సమీపంలోని ఆత్మలందరు మీ ఆత్మీయతకి ఆకర్షితమై మీవైపు రావాలి. వాయుమండలాన్ని తయారు చేసేటందుకు ముఖ్య యుక్తి ఏమిటి? అసలు వాయుమండలం ఏవిధంగా తయారవుతుంది? వృత్తి ద్వారానే వాయుమండలం తయారవుతుంది. ఎవరి గురించి అయినా ఎవరికైనా వృత్తిలో ఏదైనా విషయం వచ్చినట్లయితే మీరు ఏమంటారు? వాయుమండలంలో నా గురించి ఈ విషయం ఉంది అని అంటారు కదా! అనగా వాయుమండలానికి పునాది - వృత్తి. వృత్తులను ఎప్పటి వరకు శక్తివంతంగా తయారుచేసుకోరో అప్పటి వరకు వాయుమండలంలో ఆత్మీయత లేదా సేవలో వృద్ధి ఏదైతే కావాలనుకుంటున్నారో అది జరగదు. బీజం శక్తివంతంగా ఉంటే వృక్షం కూడా శక్తివంతంగా ఉంటుంది. అలాగే బీజం - వృత్తి, దాని ద్వారానే మీ సేవ యొక్క వృద్ధి జరుగుతుంది. వృద్ధికి ఆధారం - వృత్తి, మరయితే వృత్తిలో ఏమి నింపుకోవాలి? తద్వారా వృత్తి శక్తిశాలిగా అయిపోవాలి. ఆ ఒక్క విషయం ఏమిటంటే వృత్తిలో ప్రతీ ఆత్మ పట్ల దయ లేదా కళ్యాణకారి వృత్తి కలిగి ఉండండి. అప్పుడు స్వతహాగానే ఆత్మల పట్ల ఈ వృత్తి ఉన్న కారణంగా ఆ ఆత్మలకి మీ యొక్క దయ లేదా కళ్యాణ కారి తరంగాలు చేరుకుంటాయి. రేడియోలో ధ్వని ఏవిధంగా వస్తుంది? వాయుమండలంలో ఉన్న తరంగాలను అది గ్రహిస్తుంది. వైరు లేకుండానే తరంగాలను గ్రహిస్తుంది. విజ్ఞానం ద్వారా పరస్పరం మాట్లాడుకోగలుగుతున్నారు, వినగలుగుతున్నారు. అది వైర్‌లెస్ పరికరం ద్వారా కానీ ఇది ఆత్మిక శక్తి ద్వారా, ఇక్కడ కూడా మీ వృత్తి శక్తిశాలిగా ఉంటే వృత్తి ద్వారా ఏదైతే తరంగాలు ఉంటాయో అవి ఆ ఆత్మకి చాలా స్పష్టంగా అనుభవం అవుతాయి. ఎలాగైతే రేడియో స్విచ్ వేయగానే ధ్వని స్పష్టంగా వినవస్తుందో, ఈ రోజుల్లో అయితే టి.వి ద్వారా దృశ్యం మరియు ధ్వని రెండు స్పష్టంగా చూడగలుగుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు వృత్తి ద్వారా చాలా సేవ చేయగలరు. ఎలాగైతే టి.వి. లేదా రేడియో ఒకే స్థానంలో ఉంటూ కూడా కాని వీటి యొక్క దృశ్యం మరియు ధ్వని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. అలాగే మీ యొక్క సంకల్పాలలో ఎంత శక్తి ఉండాలంటే మీరు ఎక్కడ కూర్చుని ఉన్నా కానీ మీరు ఎంత శక్తిశాలి స్థితిలో ఉండాలంటే దూరం వరకు మీ సంకల్పం చేరుకోవాలి. ఇలా ఏ ఆత్మ యొక్క వృతి ఎంత శక్తిశాలిగా ఉంటుందో అంత ఆ ఆత్మ ఒకే స్థానంలో ఉంటూ నలువైపుల ఉన్న ఆత్మలను ఆకర్షితం చేయగలుగుతుంది. ఇప్పుడు ఈ సేవ చేయాలి. నోటితో జ్ఞానం చెప్పంటంతో పాటు సంకల్పం ద్వారా ఈ సేవ చేయాలి. ఈ రెండు వెనువెంట ఉండాలి, కానీ ఏమవుతుంది? సంకల్పం ద్వారా సేవ చేస్తున్నప్పుడు నోటి ద్వారా చెప్పలేకపోతున్నారు. నోటి ద్వారా చెప్తున్నప్పుడు సంకల్పశక్తి తక్కువ అయిపోతుంది. కానీ ఎలా ఉండాలి? చూడండి, ఈ రోజుల్లో సినిమాలో ధ్వని మరియు దృశ్యం రెండూ ఉంటాయి, రెండూ వెనువెంట ఉంటాయి. అలాగే మీకు కూడా సంకల్పం మరియు మాట రెండూ కూడా కలిసి ఉండాలి. మీరు ఎక్కువగా వాక్కులోకి వస్తున్న కారణంగా వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారు చేయలేకపోతున్నారు. కేవలం నోటి ద్వారా జ్ఞానం చెప్తున్న కారణంగా వారు మీ సమీపంగా లేదా సన్ముఖంగా ఉన్నంత సేపే ఆ శక్తి ఉంటుంది. తర్వాత తక్కువ అయిపోతుంది. కానీ వృత్తి అనగా సంకల్పం అనేది మాట కంటే చాలా సూక్ష్మమైనది. సూక్ష్మం యొక్క ప్రభావం ఎక్కువగా పడుతుంది. స్థూలం యొక్క ప్రభావం తక్కువగా పడుతుంది. స్థూలశక్తి, సూక్ష్మశక్తి రెండూ ఉండాలి. రెండు శక్తులు మీలో విశేషంగా కనిపించాలి. మీలో గొప్ప తేడా కనిపించాలి. ఒకే వేదికపై అందరు ఉండాలి. కానీ చాలా తేడా కనిపించాలి. సాక్షి అయ్యి చూస్తే గొప్ప తేడా కనిపించదా? ఏదైనా శక్తిశాలి వస్తువు ఉన్నప్పుడు, ఇతర వస్తువుల యొక్క ప్రభావం దానిపై ఉండదు. అలాగే మీరు కూడా ఇక్కడ స్థూల వేదికపై ఉన్నప్పుడు సూక్ష్మ స్థితిలో ఉన్నట్లయితే ఇతరులు ఎంత శక్తిశాలిగా ఉన్నా కానీ వాయుమండలంలో వారి ప్రభావం పడదు. అందువలనే స్మృతి చిహ్నంలో చూపిస్తారు కదా, స్థూల యుద్ధం చేసేటప్పుడు ఒకవైపు నుండి ఒక బాణం వస్తుంది. దానిని వారు మార్గమధ్యలోనే ఖండిస్తారు, బాణం రాగానే సమాప్తి చేసేస్తారు. అలాగే ఇక్కడ కూడా వృత్తి ద్వారానే వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేయాలి. కానీ అక్కడక్కడ మీ స్థితి లోపంగా ఉన్న కారణంగా మీ స్థితి యొక్క ప్రభావం వాయుమండలంలో ఇతరాత్మలపై పడుతుంది, ఎందుకు? కారణం ఏమిటి? వృత్తి ద్వారా ఆత్మలను ఆత్మీయత యొక్క వాతావరణంలోకి తీసుకురాలేకపోతున్నారు. ఆ ప్రభావం వేయలేకపోతున్నారు. వృత్తి ద్వారా ఆత్మీయత అనేటటువంటి వాతావరణాన్ని వ్యాపింపచేయాలి. దీని ద్వారా ఆత్మ ఆత్మిక తరంగాల నుండి బయటకు వెళ్ళకూడదు. ఇలాంటి సేవ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా ఏదోక అలజడిలో ఉంటూ అద్భుతం చూడాలనుకుంటున్నారు. వారు రిద్ధి, సిద్ధి ద్వారా అనేక గారడీలు చేస్తారు. కానీ మీరు మీ యొక్క సంకల్పం ద్వారా అద్భుతాన్ని చేసి చూపించాలి. మీ ద్వారా వారికి ఏదోక విశేషత అనుభవం అవ్వాలి. ఇప్పుడు ఒకొక్కసారి ఆత్మలపై అల్పకాలిక ప్రభావం పడుతుంది. వీరు ఎలా చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అని వారు గమనిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. మీ యొక్క అథార్టీ యొక్క శక్తి చూసి వారి దృష్టి బలహీనం అయిపోతుంది. వృత్తి, దృష్టి, మాటలో ఒక్క బాబా తప్ప మరెవ్వరు ఉండకూడదు. ఇదే మీ ప్రతిజ్ఞ కదా! ఆత్మలను చూసి వారి యొక్క ప్రభావంలోకి వెళ్ళటం ద్వారా బాబాతో లింక్ తెగిపోతుంది. మీకు ఈ లింక్ తెగిపోయిన కారణంగా సర్వశక్తివంతుని యొక్క శక్తి ఏదైతే లభిస్తుందో అది లభించటం లేదు. ఎలాగైతే ఆదిలో చాలా ఆనందంలో ఉండేవారు, జ్ఞానం యొక్క శక్తితో బాబాని ప్రత్యక్షం చేయటంలో చాలా సమర్ధత ఉండేది. ఆ సమర్థత వలన మొదటి రచన చాలా శక్తిశాలిగా ఉండేవారు. కానీ ఇప్పుడు మీరు చేసే రచన ఆదిలో రచన వలె శక్తిశాలిగా ఉంటున్నారా? ఎంత ఉత్సాహంలోకి తీసుకువస్తున్నప్పటికీ ఆదిలో పిల్లల్లో ఉన్నటువంటి సమర్ధత ఇప్పటి పిలల్లో లేదు. రోజు రోజుకీ జ్ఞానం యొక్క అనుభవీగా అయితే అవుతున్నారు. కానీ శక్తిశాలి స్థితి అనేది ఆదిలో ఉన్న పిల్లలకి, ఇప్పటి పిల్లలకి చాలా తేడా ఉంది. ఆదిలో ఉన్న పిల్లల్లో ఉన్న నిర్బయత ఇప్పటి వారిలో ఉందా? ఆదిలో పిల్లల్లో ఉన్న అథారిటీ ఇప్పటి పిల్లల్లో ఉందా, అప్పుడప్పుడు ఏదైనా పదార్థాన్ని అతి పరిశుద్ధం చేస్తే ఏమవుతుంది? పరిశుద్ధం అయితే అవుతుంది, కానీ శక్తి తగ్గిపోతుంది. ఈ రోజుల్లో పదార్థాలను అతి పరిశుద్ధం చేస్తున్నారు. ఆదిలో పిల్లలలో జ్ఞానం యొక్క ఆకర్షణ లేదు, కానీ మస్తకం మరియు నయనాలలో చాలా ఆకర్షణ ఉండేది. వారి నయనాలను చూసి వీరు భగవంతుని పిల్లలు అని అందరు అనుభవం చేసుకునేవారు. కానీ ఇప్పుడు కల్తీ కలిసిపోయిన కారణంగా మీ ముఖాలలో కూడా కల్తీ కనిపిస్తుంది. భగవంతుని పిల్లలుగా అనుభవం కాలేకపోతున్నారు. కల్తీ అయిన పదార్థాలు అల్పకాలికంగా చాలా రుచిని ఇస్తాయి. కానీ శక్తిని ఇవ్వలేవు. ఉదాహరణకి పచ్చడి చాలా రుచిగా అనిపిస్తుంది, కానీ అది తినటం ద్వారా ఏమైనా శక్తి వస్తుందా? కేవలం అల్పకాలిక రుచిని అనుభవం చేయిస్తుంది అంతే. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు కల్తీ చేస్తున్న కారణంగా అల్పకాలికంగా ప్రజలకు మంచిగా అనిపిస్తుంది. కానీ దానిలో శక్తి ఉండటం లేదు. ఎలాగైతే బలవర్ధక పదార్థం తినినప్పుడు శక్తి వస్తుంది, ఆ శక్తి సదాకాలికంగా సహాయపడుతుంది. అలాగే ఏవైతే శక్తిశాలి మరియు వాస్తవిక మాటలు ఉంటాయో అవి సదాకాలిక శక్తినిస్తాయి. కానీ మీరు కల్తీ చేసి రమణీకంగా జ్ఞానం చెప్తే అల్పకాలికంగా ఆ విషయాలు చాలా రుచిని అనుభవం చేయిస్తాయి. కానీ ఆత్మలలో రుచిని నింపాలా లేక శక్తిని నింపాలా? ఏమి చేయాలి? శక్తి నింపినప్పుడే వారిని సదాకాలికంగా ఆ శక్తి ఆకర్షిస్తుంది. కానీ రుచి ఎలా ఉంటుందంటే వినినంత సేపు బావుంటుంది, మరొకటి విన్నారంటే వారి అభిరుచి మరలా అటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు రమతాయోగిగా అవ్వండి, అనుభవం చేయించేవారిగా అవ్వండి. పెద్ద పెద్ద మహాత్మలు చాలా సమయం గుహల్లో ఉండి బయటకు వస్తారు, ఎందుకు? సేవ చేయడానికి. అలాగే మీరు వేదికపైకి వచ్చినప్పుడు ఎలా అనిపించాలంటే ఈ ఆత్మలు చాలా సమయం అంతర్ముఖత, ఆత్మీయత అనే గుహ నుండి సేవ చేయడానికి బయటకి వచ్చారు. మీ యొక్క తపస్వి రూపం అందరికీ అనుభవం అవ్వాలి. మీలో ఉన్న బేహద్ వైరాగ్యం యొక్క రేఖలు మీ ముఖం ద్వారా కనిపించాలి. ఎవరైనా వైరాగి ఆత్మలు ఉంటే వారి ముఖం ద్వారా వీరు వైరాగ్యంతో ఉన్నారని తెలుస్తుంది కదా! అలాగే మీలో బేహద్ వైరాగ్యం కనిపించాలి. వేదికపైకి సేవ చేయడానికి వచ్చినప్పుడు మీ ముఖం ఒక ప్రొజెక్టర్ యంత్రంలా కనిపించాలి. ప్రొజెక్టర్‌లో స్లైడులు మారుతూ ఉంటాయి కదా! వాటిని ఎంత ధ్యాసతో చూస్తారు ప్రజలు. ఆ దృశ్యం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అలాగే మీరు కూడా సేవ అనే వేదికపై వెళ్తున్నప్పుడు ఒకొక్కరి ముఖం ప్రొజెక్టర్ వలె కనిపించాలి. మీ ముఖం ద్వారా దయా హృదయం యొక్క గుణం కనిపించాలి. బేహద్ వైరాగులు కనుక బేహద్ వైరాగ్యం యొక్క రేఖలు ముఖం ద్వారా కనిపించాలి. మీరు సర్వశక్తివంతులు అనగా సర్వశక్తివంతుడైన బాబా ద్వారా నిమిత్తమైన ఆత్మలు. కనుక ఆ శక్తి మీలో కనిపించాలి. ఆత్మలో సర్వగుణాలు, సర్వ శక్తుల యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి మీ ముఖంలో స్పష్టంగా కనిపించాలి. దీనినే సేవ అని అంటారు. సాకార రూపంలో బ్రహ్మాబాబాని ఉదాహరణగా చూశారు, ప్రతీ గుణాన్ని ఆయన ద్వారా ప్రత్యక్ష సాక్షాత్కారం చేసుకున్నారు. మరి తండ్రిని అనుసరిస్తున్నారా? ఫాలోఫాదర్ అయ్యారా? ఎటువంటి అథారిటీ కలిగిన ఆత్మలు ఎదురుగా వచ్చినా, ఎటువంటి మానసిక స్థితి కలిగినవారు ఎదురుగా వచ్చినా, గుణాల యొక్క వ్యక్తిత్వం గల వారు ఎదురుగా వచ్చినా మీ యొక్క ఆత్మీయత యొక్క వ్యక్తిత్వం, సర్వశక్తుల యొక్క వ్యక్తిత్వం ముందు ఆ వ్యక్తిత్వం ఏమిటి? వారు మీ ముందు తలవంచుతారు. వారి ప్రభావం మీపై పడదు. మీ వృత్తి ద్వారా వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారుచేసుకున్న కారణంగా వారి వృత్తి మరియు తరంగాలలోకి మీరు వెళ్ళరు. వారి సంకల్పాలు కూడా మారిపోతాయి. మీ సంకల్పశక్తి గురించి వారందరు వర్ణన చేస్తారు. కనుక సంకల్పం మరియు వాణి ఈ రెండింటి శక్తిలో బ్రహ్మాబాబాని ఉదాహరణగా చూశారు. కనుక బ్రహ్మాబాబాను అనుసరించాలి కదా! బాబాపై స్నేహంలో అయితే మీరందరు పాస్ అయిపోయారు. కానీ ఇప్పుడు దేనిలో పాస్ అవ్వాలి? అంతిమ స్వరూపం ఏమిటంటే శక్తి స్వరూపం. ఏ ఆత్మ మీ ఎదురుగా వచ్చినా మొదట జగన్మాత అయ్యి స్నేహ రూపాన్ని ధారణ చేయాలి. కానీ వారు ఙ్ఞానంలో నడుస్తున్నప్పుడు మాయని ఎదుర్కోవలసి వచ్చిన సందర్భంలో ఆ మాయను ఎదుర్కునేటందుకు మీరు సహయోగులు అయ్యేటందుకు శక్తి రూపాన్ని ధారణ చేయాలి. నిమిత్త ఆత్మలు కేవలం స్నేహమూర్తిగానే కాదు, తమ రచన యొక్క సమస్యలను ఎదుర్కునేటందుకు శక్తి కూడా ఉండాలి. యజ్ఞంలో లేదా దైవీ పరివారంలో స్నేహిగా, సహయోగిగా కావాలి. కానీ ఎదుర్కోకూకడదు. మరలా పరిస్థితులు వచ్చినప్పుడు ఎదుర్కునే శక్తిని ధారణ చేయాలి, ఎందుకు? రచయిత యొక్క ప్రభావం రచనపై పడుతుంది. ఇప్పుడు ఏ ఆత్మలైతే ముందుకి వెళ్తూ ఉంటారో, ఎంత వరకు చేరుకున్నారో అంత వరకు మాత్రమే కాకుండా ఇంకా ముందుకి వెళ్ళేటందుకు విశేషాత్మలు ఏమి చేయాలి? శక్తి రూపమై ఏ ఆత్మలకి మీరు నిమిత్తమయ్యారో ఆ ఆత్మలలో శక్తిని నింపాలి. కేవలం మీరు తయారు చేసే ఆత్మలను స్నేహిగా తయారు చేయటమే కాదు, శక్తిశాలిగా తయారు చేయాలి. వర్తమాన సమయంలో ఎక్కువ మంది ఆత్మల ఫలితం ఏమి కనిపిస్తుంది? వెనుకకి వెళ్ళటం లేదు కానీ పురుషార్థంలో ముందుకి వెళ్ళటం లేదు, తగుల్కుని కూడా ఉండలేదు, కానీ శక్తి ఉండటం లేదు. కనుక ఇప్పుడు అదనపు శక్తిని నింపాలి. రాకెట్ కి ఫోర్స్ ఇచ్చినప్పుడు పైకి ఎగురుతుంది కదా! అలాగే ఇప్పుడు ఆత్మలు శక్తిని అనుసరించి జంప్ చేస్తున్నారు, కానీ విశేషాత్మలైన మీరు విశేషమైన శక్తిని నింపి హైజంప్ చేయించాలి. మీరు పురుషార్ధం చేస్తున్నారు. కానీ ఇప్పుడు పురుషార్ధంలో బలం ఉండాలి. ఆ బలాన్ని ఎలా ఇస్తారు మీరు? శక్తిని దానం చేయండి. జ్ఞాన దానం చేస్తున్నారు కదా! అలాగే శక్తి యొక్క బలం మీలో ఉండాలి. ఇప్పుడు వరదాత స్థితి యొక్క కర్తవ్యం చేయాలి. జ్ఞాన దాత అయ్యి జ్ఞాన దానం చాలా చేశారు, కానీ ఇప్పుడు శక్తుల యొక్క వరదాత అవ్వాలి. శక్తుల ముందుకి వెళ్ళి అందరు వరదానం అడుగుతారు కదా! శక్తి యొక్క వరదానాన్ని, సిద్దిని కోరుకుంటారు. మరి సిద్ధి ఎలా లభిస్తుంది? ఇప్పుడు ఏ సేవ చేయాలి? నిమితమైన మీరు వరదాని అయ్యి మీ రచనకు సర్వ శక్తులు అనే వరదానం ఇవ్వాలి. విశేషంగా విశేష ఆత్మలు, నిమిత్త ఆత్మలు ఈ సేవ చేయాలి. ఈ గ్రూపు విశేష ఆత్మల యొక్క గ్రూపు కదా! మైక్ గా అవ్వటం సహజమే కానీ ఇప్పుడు శక్తిని నింపే సేవ చేయాలి. ఇప్పుడు ఇది అవసరం. ఇప్పుడు మీ పురుషార్థం మీరు చేసుకునే సమయం కాదు, మీ పురుషార్ధం ద్వారా ప్రత్యక్ష ఫలాన్ని పొందే సమయం. అంటే ఇతరులపై ప్రభావం వేసే సమయం. మీ ప్రభావం ఇతరాత్మలను స్వతహాగానే ఆకర్షితం చేస్తుంది. పాండవులకి ఏమి మహిమ ఉంది? గుప్తంగా ఉన్న తర్వాత ప్రత్యక్షం అయ్యారు. కనుక ఇప్పుడు ప్రత్యక్షం అవ్వాలి. ఎలాగైతే స్థూల వేదికపై ప్రత్యక్షం అవుతున్నారో అలాగే ఇప్పుడు ఆ స్థూల వేదికపై మీ సూక్ష్మ స్థితిని ప్రత్యక్షం చేయండి. గర్జన చేయండి. ఇప్పుడు మీ బలహీన రచన రచిస్తున్నారు. దానిని పాలన చేయటంలో సమయం పోతుంది. కానీ ఇప్పుడు శక్తిశాలి రచన చేయండి మరియు అందరూ కూడా చేసేలా సహయోగి అవ్వండి. ఇప్పుడు బాబా ప్రత్యక్షత జరగాలి. దేవీల పూజలో ప్రత్యక్షత యొక్క పూజ జరుగుతుంది కదా! భజనలు చేస్తూ గట్టిగా అరుస్తూ ఉంటారు కదా! ఇది మీ యొక్క శక్తికి గుర్తు. మీలో ఏదైతే శక్తిని నింపుకున్నారో దానిని వారు ఆ రూపంలో చూపిస్తున్నారు. దేవీల పూజ నిశ్శబ్దంగా చేయరు, గట్టిగా ధ్వని చేస్తూ, భజనలు చేస్తూ, అరుస్తూ చేస్తారు. అంటే ఇది దేవీల యొక్క శక్తికి గుర్తు. మీలో ఉన్న శక్తిని ఆ రూపంలో ప్రత్యక్షం చేస్తున్నారు. కనుక శక్తులు అంటే గర్జనతో బాబా యొక్క ప్రత్యక్షత చేయాలి. మీ సిద్ధాంతాలను రుజువు చేసి ప్రత్యక్షత చూపించాలి. ఇతరాత్మలు తమ సిద్ధాంతాలను నిర్భయంగా రుజువు చేయటానికి ఎంత పురుషార్ధం చేస్తున్నారు? మరి మీరు స్వయం బాబా యొక్క సిద్ధాంతాలను రుజువు చేయటం అనేది ఎంత సంతోషంగా మరియు శక్తివంతంగా చేయాలి? కానీ మీరు వాయుమండలం యొక్క ప్రభావంలోకి వచ్చేస్తున్నారు. ఆదిలోని పాత్రను మరలా అంతిమంలో గుహ్యంగా, గోపనీయంగా పాత్రను పునరావృత్తం చేయాలి. మహిమలు, మహత్యాలు చూపేవారిని చూడండి, వారికి ఎంత నషా ఉంటుంది? ఇది అల్పకాలికమైనది వారి మనస్సుకి తెలుసు. కానీ ఎంత నషాగా ఉంటారో! మరి సత్యమైన నషాలో ఉండే మీరు ఎంత అద్భుతం చూపించవచ్చు? మీ ముందు వారి నషా ఎంత? ఇప్పుడు అంతిమ కోర్సు ఏమి మిగిలింది? శక్తిరూపంగా అవ్వాలి. జగన్మాతగా అయితే అయ్యారు కానీ ఇప్పుడు శక్తిరూపమై వేదిక పైకి రావాలి. శక్తులు ఆసురీ సంస్కారాలను ఒక్క దెబ్బతో సమాప్తి చేస్తారు. మాత అయితే నెమ్మది నెమ్మదిగా స్నేహంతో ప్రేమతో పాలన చేస్తుంది. కనుక మొదట స్నేహి మాత యొక్క రూపం అవసరం, కానీ ఇప్పుడు శక్తిరూపంగా అయ్యి ఒక్క దెబ్బతో ఆసురీ సంస్కారాలను సమాప్తి చేయాలి. బలి ఇచ్చేటప్పుడు పశువుని మొదట అలంకరిస్తారు, దానికి సమయం పడుతుంది. కానీ బలి ఇచ్చేటప్పుడు ఒక్క సెకనులో బలి ఇచ్చేస్తారు. అలాగే మీరు ఇంత వరకు అలంకారం చాలా చేశారు కానీ ఇప్పుడు ఒక్క దెబ్బతో ఆసురీ సంస్కారాలను సమాప్తి చేసే శక్తి నిండాలి. దయా స్వరూపంతో పాటు శక్తి స్వరూపం యొక్క ఆత్మీయత కూడా మీలో ఉండాలి. కేవలం దయా హృదయమే కాదు. ఎంత శక్తియో అంత దయ. మాటల్లో కూడా దయా భావం ఉండాలి ఇప్పుడు ఇటువంటి సేవ చేయాలి. దృష్టి ద్వారా అద్భుతం చేస్తారు అనే మహిమ ఉంది కదా! ఇది ఎవరి యొక్క మహిమ? శక్తుల యొక్క చిత్రాలలో కూడా సదా నయనాలను సుందరంగా చూపిస్తారు. వారి నయనాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. నయనాల ద్వారా అన్ని భావాలను ప్రకటితం చేస్తారు. అనగా దృష్టి ద్వారా అద్భుతం చేసే శక్తుల గురించే మహిమ చేసారు. నయనాలలో ఆకర్షణ ఉండాలి, ఆత్మీయత ఉండాలి, శక్తి ఉండాలి, దయ ఉండాలి... ఇలా ప్లాన్ చేసుకోండి. మధువనం నుండి విశేషాత్మలు ఎవరైతే సేవ కోసం వెళ్తున్నారో వారిని చూడగానే ఈ శక్తి సేన తమలో శక్తి నింపుకుని ప్రభావం వేయటానికి వచ్చారని, ప్రభావశాలి నడవడిక, ప్రభావశాలి వృత్తి కలిగి ఉండాలి. దైవీ పరివారం అందరి యొక్క ఉన్నతి మీపై ఆధారపడి ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఆత్మలం అయిన మాలో మరియు సేవలో ఉన్నతి వస్తుందని అందరూ భావిస్తున్నారు. కానీ మీరు కార్యక్రమాన్ని సాధారణంగా ముగిస్తే అందరూ ఆలోచనలో పడతారు. విశేషాత్మల యొక్క ఈ సంఘటన ఏమి ప్రభావాన్ని చూపిస్తుందో అని అందరూ అనుకుంటున్నారు. కనుక అంతగానే ధ్యాస పెట్టాలి.

1.సేవలో నవీనత 2 నిమిత్త ఆత్మలలో నవీనత కనిపించాలి. ఎందుకంటే సేవ అంతా కూడా విశేషాత్మలపై ఆధారపడి ఉంది. ఎలాగైతే విజ్ఞానం వారు శక్తిశాలి ఇంజక్షన్ లను తయారు చేస్తున్నారో, అలాగే ఈ శక్తిసేన కూడా శాంతి యొక్క శక్తిశాలి శ్రేష్ట శస్త్రాన్ని తయారు చేసి చూపించాలి. పరస్పరం కేవలం కలుసుకోవటం కాదు, కలిసి ఏదోక శక్తిశాలి శస్త్రాన్ని తయారు చేయాలి. ఏదైతే శక్తిశాలి వస్తువు ఉంటుందో అది భూమి యొక్క అంతర్భాగంలో ఉంటుంది. కనుక ఈ సంఘటనలోని వారందరు కూడా అంతర్ముఖులు. సాధారణ సంఘటన అయితే అందరూ చేస్తూనే ఉంటారు. మీరు కూడా సాధారణంగానే ఉంటే ఇక అద్భుతం ఎవరు చేసి చూపిస్తారు? ఇలాంటి శస్త్రాన్ని తయారు చేయాలి. అందువలనే శక్తులకి శస్త్రాలను తప్పకుండా చూపిస్తారు. ఇప్పుడు సంహారిగా అవ్వండి. మీ సంస్కారాలను సంహరించాలి, ఇతరాత్మల తమోగుణి సంస్కారాలను కూడా సంహరించాలి. శంకరుని పాత్ర ప్రత్యక్షంగా అభినయించాలి. కానీ శక్తులే శంకరుని పాత్ర అభినయిస్తారు. శంకరుడు అభినయించడు. శక్తులే సంహార రూపాన్ని ధారణ చేసి సంహరించాలి. కర్తవ్యం అయితే చేశారు కానీ ఇప్పుడు ఈ రూపం చూపించండి. ఈ రూపాన్ని ధారణ చేస్తే ఫలితం ఎలా వస్తుంది? రోజు రోజుకీ అదనపు సహాయం లభిస్తుందని మీ రచన అనుభవం చేసుకుంటారు. శక్తిననుసరించి తమ శక్తిని ఉపయోగించారు. ఇక వారి శ్రమతో వారు నడవలేరు, ఇప్పుడిక వారికి వరదానం యొక్క సహాయం కావాలి. ఈరోజు వరకు కూడా ఏ విషయాలైతే వారికి కష్టమనిపిస్తున్నాయో; మీ యొక్క ఈ శక్తిశాలి సేవ ద్వారా వారి నోటి నుండి కష్టం అనే మాట సమాప్తి అయిపోతుంది. అన్ని విషయాలు సహజంగా అనుభవం చేసుకుంటారు. మీ రచనలో ఇవి కనిపించినప్పుడు సంహారి రూపాన్ని ధారణ చేశాను అని భావించండి. ఫలితం స్పష్టంగా కనిపించాలి. అప్పుడు తుఫాను కూడా తుఫానుగా కాదు, కానుకగా అనిపిస్తుంది. రూపం ఈ విధంగా మారినప్పుడు అనుకోండి - మీ వాస్తవిక స్వరూపాన్ని సాక్షాత్కారం చేయిస్తున్నారని.

ధారణా విషయాలు అన్నింటి నుండి ముఖ్యంగా ఏ ధారణ విషయాన్ని అందరికీ ఇస్తున్నారు? అవ్యక్తంగా తయారయ్యేటందుకు ఏ విషయాలను ఇస్తున్నారు? బాబాని స్మృతి చేసేటందుకు లేదా ఆత్మిక సంభాషణ చేయాలనే ఉత్సాహం ఎలా వస్తుంది? దీని కొరకు ముఖ్య విషయం - సత్యత మరియు స్వచ్చత. పరస్పర భావాలను స్వచ్చంగా తెలుసుకోవటం అవసరం. విశేషాత్మల కొరకు సత్యత మరియు స్వచ్చత యొక్క అర్థం కూడా గుహ్యంగా ఉంటుంది. ఒకరిపట్ల ఒకరికి హృదయం పూర్తిగా స్వచ్ఛంగా ఉండాలి. బాగా స్వచ్చంగా ఉన్న వస్తువులో అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి కదా! ఎక్కడ సత్యత, స్వచ్చత ఉంటుందో అక్కడ సమీపత (దగ్గరితనం) ఉంటుంది. బాప్ దాదాకి సమీపంగా ఉన్నట్లుగా. రాజ్యం అనేది కేవలం ఒక్కరితోనే ఉండదు కదా! కనుక పరస్పరంలో కూడా సంబంధంలోకి రావాలి. అక్కడ కూడా పరస్పరంలో సమీప సంబంధాల్లోకి ఎలా వస్తారు? ఇక్కడ హృదయంతో ఒకరికొకరు సమీపంగా ఉన్నప్పుడు. ఇక్కడ మనస్సు యొక్క సమీపత అక్కడ సమీప సంబంధంలోకి తీసుకొస్తుంది. పరస్పర స్వభావం మరియు మనో భావం రెండూ కలవాలి. భిన్న స్వభావాల కారణంగానే సమీపత ఉండదు. ఎవరైనా రమణీయంగా ఉంటే సమీపత ఉంటుంది. ఎవరైనా అధికారికంగా ఉంటే సమీపంగా ఉండరు. కానీ ఇక్కడైతే సర్వ గుణ సంపన్నంగా, 16 కళా సంపూర్ణంగా అవ్వాలి కదా!. ఈ కళ కూడా ఎందుకు తక్కువ ఉండాలి? మీ స్వతహా సంస్కారం అధికారికంగా ఉండటం అనుకోండి. కానీ సమయం మరియు సంఘటన రమణీయంగా ఉందనుకోండి, స్వభావాన్ని కలుపుకునే కళ కూడా ఉండాలి కదా! అలా మీరు 16 కళా సంపన్నులు అయిపోతారు. మనస్సు యొక్క భావాలను కూడా కలుపుకోవాలి మరియు స్వభావాన్ని కూడా కలుపుకోవాలి. అప్పుడే సమీపంగా వస్తారు. ఇప్పుడు భిన్నత కనిపిస్తుంది. ఒకొక్కరి స్వతహా సంసారాలలో ఇప్పుడు తేడా కనిపిస్తుంది. ఇది సంపూర్ణతకి గుర్తు కాదు. అన్ని కళలను నింపుకోవాలి. ఫలానా వారిది సీరియస్ స్వభావం అని అన్నారంటే కూడా కళలు తక్కువగా ఉన్నట్లే. ఫలానా వారితో ఈ విషయాన్ని చెప్పలేము అన్నారంటే అది కూడా కళలు తక్కువ ఉన్నట్లే. 16 కళా సంపూర్ణం అనగా సంపూర్ణ స్థితి ఏదైతే ఉందో దాంట్లో సర్వ కళలు స్వభావంలో ఉండాలి. అలాంటి వారినే 16 కళా సంపూర్ణులు అని అంటారు. ఈ సంఘటనలో స్వభావాన్ని మరియు భావాలను సమీపంగా తీసుకురావాలి. ఇది నా స్వభావమే కాని నా భావం ఇది కాదు అని అప్పుడప్పుడు అంటూంటారు కదా! కనుక మనో భావనలు కూడా ఒకరితో ఒకరికి కలవాలి. సంపూర్ణత అనేది ఒకటే అయినప్పుడు భావ స్వభావాలు కూడా కలవాలి కదా! అచ్చం వీరందరు ఒకే సమూనా నుండి వచ్చారు. ఒకేలా మాట్లాడుతున్నారు, ఒకటే పద్ధతి అని అంటూంటారు కదా! ఇప్పుడు ఇది కనిపించాలి. సర్వ శ్రేష్ట ఆత్మల యొక్క మనస్సు యొక్క భావన మరియు స్వభావం ఒకే నమూనా నుండి వచ్చినట్లు కనిపించాలి. సత్యత మరియు స్వచ్చత యొక్క అర్ధాన్ని సామాన్యంగా తీసుకోకూడదు. ఎంత స్వచ్చత ఉంటుందో అంత తేలికతనం ఉంటుంది. ఎంత తేలికగా ఉంటారో అంత సమీపంగా ఉండగలరు మరియు ఇతరులను కూడా తేలిక చేయగలరు. తేలికగా ఉంటే ముఖంలో ప్రకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మార్పుని తీసుకురండి. మొట్టమొదట్లో మీ ముఖం ద్వారా చాలా సాక్షాత్కారాలు అయ్యేవి, ప్రకాశం కనిపించేది. ఆదిలో సేవని గుర్తు తెచ్చుకోండి. చాలా సాక్షాత్కారాలు జరిగేవి. దేవీలుగా అనుభవం చేసుకునేవారు. ఇప్పుడు ఉపన్యాసకులుగా అనుభవం అవుతున్నారు, జ్ఞానవంతులుగా కనిపిస్తున్నారు. కానీ శక్తిశాలిగా అనుభవం అవ్వటం లేదు. దీనిని ఈ సంఘటన వారు నింపుకోవాలి. వీరు ఇద్దరు (దాదీ దీదీ) ఇప్పుడు నిమిత్తమయ్యారు కానీ వీరు ఇద్దరు కాదు, ఇద్దరు ఒకటే అని అనుభవం అవ్వాలి. అందరూ ప్రత్యక్షంగా అనుభవం చేసుకుంటారు. ఒకరికొకరు సమీపంగా వస్తూ ఉంటే సమానంగా అయిపోతారు. ఇద్దరు కలిసి ఒకటిగా కనిపించినట్లు మరలా అందరు కలిసి ఒకటిగా కనిపించాలి. అప్పుడు మాల తయారయినట్లు. స్నేహం అనే త్రాడు తయారైపోతే మణులు సహజంగానే గ్రుచ్చబడతాయి. స్నేహం అనే త్రాడుతోనే ముత్యాలు అతి సమీపంగా వస్తాయి. అప్పుడే మాల తయారవుతుంది. సమీపతయే మాలను తయారు చేస్తుంది. స్నేహం అనే త్రాడు తయారయ్యింది, కానీ ఇప్పుడు మణులన్నీ ఒకదానితో మరొకటి సమీపంగా మరియు మనో భావం మరియు స్వభావం కలవాలి. అప్పుడు మాల ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇది తప్పకుండా చేయండి. ఇలా అద్భుతం చేసి చూపించండి. ఎంతో దూరదూరాల నుండి ఎక్కడెక్కడి నుండో సేవను కూడా వదిలి వచ్చారు కదా! కనుక రుజువు తప్పకుండా చూపించాలి. దూరాన్ని తగ్గించుకునేటందుకు దూరం నుండి వచ్చారు. అర్థమైందా? సర్వ శ్రేష్ట ఆతలతో పాటు బాప్ దాదా కూడా ఉంటారు కదా! సమీప ఆత్మలైన మీకు తోడు బాప్ దాదా. ఇలాంటి గ్రూపు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఈ సంఘటన తన ప్రభావాన్ని చూపిస్తుందోనని. విశేష ఆత్మల యొక్క సాధారణ కర్తవ్యం కూడా విశేషంగా లెక్కించబడుతుంది. మామూలుగా కలిసి కూర్చున్నా కానీ ప్రజలు విశేషంగా చూస్తారు. నవీనత యొక్క అనుభవం అయ్యే విధంగా ఏదో శక్తి లభించాలని ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నారు. అందరికీ శక్తినిచ్చేటందుకు నిమిత్తమైన ఆత్మలు మీరు. వారిని ఎలాంటి అవ్యక్త స్థితికి ఎక్కించాలంటే ఈ భూమి యొక్క చిన్న చిన్న ఆకర్షణలు ఏవీ వారికి లాగకూడదు. మాయ అంటని వారిగా తయారుచేయండి. మాయ అంటనివారిగా తయారు చేసి రుజువు చూపండి. విజయీ రత్నాలంటే ఏమిటో రుజువు చేసి చూపించండి. రుజువుగా ఉన్నవారందరు అందరినీ మాయ అంటనివారిగా తయారుచేయాలి. కనుక ఈ సంఘటనకి ఏమి ముద్ర వేస్తారు? 16 కళా సంపూర్ణంగా తయారవ్వాలి. ఒక్కకళ కూడా తక్కువ అవ్వకూడదు. పాత బంగారం ఎవరైతే ఉన్నారో వారు త్వరగా మలుచుకోగలరు. కళలు లేనికారణంగానే మలచుకోరు. మీరు సంపూర్ణ మరియు పూర్తి శాతం బంగారం కనుక సర్వ విశేషతలను నింపుకుని వెళ్ళాలి. ఇప్పుడు కూడా చూడండి, ప్రతీ ఒక్కరికి ఎవరి విశేషత వారికి ఉంటుంది. విశేష కార్యం ఏదైనా ఉంటే ఆ విశేషాత్మ గుర్తు వస్తారు. కానీ ఇప్పుడు ఏ కార్యం ఉన్నా కానీ సర్వ విశేషతలు కల్గిన మీరు గుర్తు రావాలి. కనుక పరస్పరంలో సహయోగం ఇవ్వాలి మరియు తీసుకోవాలి. బీజ రూపి గ్రూపు ఈ విధంగా తయారైతే బీజం ద్వారా వృక్షం స్వతహాగానే వస్తుంది. ఇది బీజరూపి ఆత్మల సంఘటన కదా! సృష్టికి బీజరూపులు కాదు, మీ రచనకి మీరు బీజరూపులు, కనుక బీజరూప సంఘటన 16 కళా సంపన్నంగా తయారైపోతే వృక్షం కూడా ఆవిధంగానే వస్తుంది. చిన్న బలహీనత కారణంగా తక్కువ వారిగా ఉండిపోయే సమయం కాదు ఇది. లోపం ఉండిపోతే నెంబరు కూడా తగ్గిపోతుంది. చిన్న చిన్న లోపాలు కారణంగా ఈ సంఘటనకి తక్కువ నెంబరు రాకూడదు. కనుక సత్యమైన దీపావళి జరుపుకోవాలి. పాత సంస్కారాలు, పాత సంకల్పాలు, పాత భావనలు, పాత స్వభావాలు అన్నింటినీ సమాప్తి చేసుకుని సంపూర్ణత యొక్క లేదా సర్వ విశేషతల యొక్క ఖాతా ప్రారంభించి వెళ్ళాలి. మొదట దీపావళిని విశేషాత్మలు జరుపుకుంటే తర్వాత ఇతరాత్మలు జరుపుకుంటారు. ఇది టీచర్స్ భట్టి, కనుక మీ యొక్క ముఖ కవళికల ద్వారా భవిష్యత్తు కనిపించాలి. అప్పుడు ఏమవుతుంది? భవిష్యత్తు వర్తమానం అయిపోతుంది. మంచిది.