02.02.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ప్రీతి బుద్ది ఆత్మల యొక్క గుర్తులు.

అందరు అవ్యక్త స్థితిలో స్థితులై ఉన్నారా? అవ్యక్త స్థితిలో స్థితులైన వారికి అవ్యక్త కలయిక జరుగుతుంది. కనుక అవ్యక్త స్థితిలో స్థితులయ్యే అనుభవీ మూర్తిగా ఎంత వరకు తయారయ్యాను? అని స్వయాన్ని అడగండి. ఇలా ఎవరైతే అవ్యక్త స్థితిలో స్థితులవుతారో వారి ప్రతి సంకల్పం, ప్రతి కార్యం అలౌకికంగా ఉంటుంది. ఇలా అవ్యక్త భావంలో ఉండేవారు వ్యక్తదేశంలోకి, వ్యక్త కార్యంలోకి వస్తూ కూడా కమలపుష్ప సమానంగా అతీతంగా ఒకే బాబాకు ప్రియంగా ఉంటారు. ఇలా ఎవరైతే అవ్యక్త స్థితిలో, అలౌకిక స్థితిలో సదా ఉంటారో వారినే భగవంతుని పిల్లలు అని అంటారు. అలాగే వారి యొక్క టైటిల్ ఏమిటంటే - ప్రీతిబుద్ది ఆత్మలు. ప్రీతిబుద్ధి, విపరీత బుద్ది ఆత్మలు మీకు రెండింటి యొక్క అనుభవం ఉంది కదా! అందువలనే మీ ముఖ్య స్లోగన్ ఏమిటంటే - ప్రీతి బుద్ధి ఉన్న పాండవులు విజయం పొందుతారు మరియు విపరీత బుద్ధి ఉన్నవారు వినాశన సమయంలో వినాశనం అయిపోతారు. ఈ స్లోగన్ గుర్తు పెట్టుకోండి. మొత్తం రోజంతటిలో ఎంత సమయం ప్రీతి బుద్ధిగా ఉన్నాను అంటే విజయీగా ఉన్నాను? ఎంత సమయం విపరీతబుద్దిగా అయ్యి అంటే బాబాని మర్చిపోయి ఓడిపోతున్నాను అనేది పరిశీలించుకోండి. ఓడిపోతున్నారంటే బాబాతో ప్రీతి ఉన్నాట్లా? ప్రీతి బుద్ది అంటే విజయీ ఆత్మలు. ఇతరులకు చెప్తారు కదా - విపరీతబుద్ధి కలిగిన వారిగా అవ్వకండి, వినాశనం అయిపోతారు అని. ప్రీతి బుద్ధి కలిగినవారిగా అవ్వండి అని. స్వయం మీకు మీరు చూసుకోండి - ఈ సమయంలో నేను ప్రీతి బుద్ధితో ఉన్నానా? లేదా విపరీత బుద్ధితో ఉన్నానా? అని. ప్రీతిబుద్ది ఆత్మ యొక్క గుర్తు ఏమిటంటే - వారికి బాబా శ్రీమతానికి వ్యతిరేకంగా ఒక్క సంకల్పం కూడా రాదు. ఒకవేళ శ్రీమతానికి వ్యతిరేకంగా సంకల్పం, మాట లేదా కర్మ జరుగుతుందనుకోండి, వారిని ప్రీతి బుద్ధి అంటారా? ప్రీతిబుద్ది అంటే బుద్ధి యొక్క సంలగ్నత లేదా ప్రేమ మీ ప్రియతమునితో ఉండాలి. ఎప్పుడైతే ఒకే బాబాతో సదా ప్రీతి ఉంటుందో ఇక ఏ వ్యక్తి, వైభవాలతో ప్రీతి ఉండదు. ప్రీతి బుద్ది అంటే ఆ ఆత్మలు సదా బాప్ దాదాని సన్ముఖంగా అనుభవం చేసుకుంటారు. ఎప్పుడైతే బాబా సదా సన్ముఖంలో ఉంటారో అప్పుడు ఎప్పుడూ బాబాకి విముఖంగా అవ్వరు. విముఖంగా అయ్యారు అంటే బాబా సన్ముఖంగా ఉండలేరు. కనుక ప్రీతి బుద్ధి ఆత్మలు సదా సన్ముఖంగా ఉన్న కారణంగా వారి బుద్ధి నుండి, వారి హృదయం నుండి సదా ఇదే మాట వస్తుంది - నీతోనే తింటాను, నీతోనే కూర్చుంటాను, నీతోనే మాట్లాడతాను, నీతోనే వింటాను, నీతోనే సర్వ సంబంధాలు జోడిస్తాను, నీతోనే సర్వ ప్రాప్తులు అనుభవం చేసుకుంటాను. వారి నయనాలు, వారి ముఖం మాట్లాడకపోయినా వారి ద్వారా ఈ స్థితి అనుభవం అవుతూ ఉంటుంది. ఇలా ప్రీతి బుద్ధి కలిగిన ఆత్మలుగా అయ్యి ఒకే బాబా సంలగ్నతలో, ఏకరస స్థితిలో ఉండగలుగుతున్నారా? ఎలా అయితే సాకార రూపంలో, సాకార దేశంలో వరదాన భూమి అయిన మధువనంలో బాబాకి సన్ముఖంగా వస్తున్నారు కదా! అలాగే సదా బాబా యొక్క ప్రీతిని అనుభవం చేసుకుంటున్నారా? అనుభవం వినిపిస్తారు కదా! బుద్ధియోగం ద్వారా సదా బాప్ దాదాకు సన్ముఖంగా ఉండేటువంటి అభ్యాసం చేస్తే సదా ప్రీతిబుద్దిగా కాలేరా? ఎవరి సన్ముఖంగా సదా బాప్ దాదా ఉంటారో ఎలా అయితే సూర్యుడిని ఎదురుగా చూడటం ద్వారా సూర్య కిరణాలు మనపై తప్పకుండా పడతాయి. అదేవిధంగా జ్ఞానసూర్యుడైన బాబాకి సదా సన్ముఖంగా ఉన్నట్లైతే జ్ఞానసూర్యుడైన బాబా యొక్క సర్వ గుణాల రూపి కిరణాలు సదా మీలో అనుభవం అవుతాయి. జ్ఞానసూర్యుని యొక్క కిరణాలు స్వతహాగానే మీలో ధారణ అయినట్లుగా అనుభవం అవుతాయి. కానీ ఇది సదా బాబాకి సన్ముఖంగా ఉన్నప్పుడే జరుగుతుంది. అలాగే ఇలా ఎవరైతే సదా బాబాకి సన్ముఖంగా ఉంటారో వారి ముఖంలో ఏమి కనిపిస్తుంది? దీని ద్వారా అందరికి వీరు సదా బాప్ దాదాకు సన్ముఖంగా ఉన్నారు అని అర్థమౌతుంది. సాకారంలో బ్రహ్మాబాబాని చూసినప్పుడు ముఖం ద్వారా ఏమి అనుభవం అయ్యేది? సాకారంలో బ్రహ్మాబాబా ఎదురుగా ఉండటం ద్వారా సహజంగా అనుభవం అయ్యేది కదా! పాత మాటయే, అది ఏమిటి? ఇప్పుడు రివైజ్ కోర్స్ నడుస్తుంది. కనుక ఆ పాత మాటనే బాబా రివైజ్ చేస్తున్నారు. ఇది కూడా బుద్ధి యొక్క వ్యాయామం. ఇది ఆలోచించటం ద్వారా బుద్ధిలో మననశక్తి వస్తుంది. ఆ ఆత్మల యొక్క గుర్తులు ఏమిటంటే - వారి ముఖంలో అంతర్ముఖత యొక్క మెరుపు కనిపిస్తుంది మరియు వారిలో సంగమయుగం యొక్క భవిష్యత్తు యొక్క అన్ని స్వమానాల నిశ్చయం కనిపిస్తుంది. ఒకటి మెరుపు కనిపిస్తుంది, రెండు నిశ్చయం కనిపిస్తుంది. ఇలా సదా నిశ్చయం, మెరుపు రెండు కనిపిస్తాయో వారే నిశ్చయబుద్ది ఆత్మలు. అలాగే వారిలో హర్షితముఖతతో పాటు అంతర్ముఖత కూడా కనిపిస్తుంది. ఇటువంటి ఆత్మలను సదా బాబాకి సన్ముఖంగా ఉండేటువంటి ప్రీతి బుద్ది ఆత్మలు అంటారు. సదా ఈ స్మృతిలో ఉండండి - ఈ తనువు ఏదోక సమయంలో వినాశనం అయిపోతుంది. ఇలా వినాశన సమయం యొక్క స్మృతి ఉండటం ద్వారా కూడా బాబాకు ప్రీతి బుద్దిగా అయిపోతారు. వినాశన సమయంలో అజ్ఞాని ఆత్మలు కూడా బాబాని స్మృతి చేయటానికి తప్పకుండా ప్రయత్నిస్తారు. కానీ బాబా యొక్క పరిచయం లేని కారణంగా వారి ప్రీతి బాబాతో జోడించబడదు. అలాగే మీరు సదా స్మృతిలో ఉంచుకోండి - ఇది అంతిమ ఘడియ. మీది అంతిమజన్మ కూడా కాదు, అంతిమ ఘడియ. ఇది స్మృతి ఉండటం ద్వారా ఇక ఇతర విషయాలు ఏమీ జ్ఞాపకం రావు, మరి సదా ఇలా ప్రీతి బుద్ధి అయ్యారా? బాబా శ్రీమతానికి వ్యతిరేకంగా నడవటంలేదు కదా? ఒకవేళ మనస్సులో అయినా శ్రీమతానికి వ్యతిరేకంగా వ్యర్థ సంకల్పం లేదా వికల్పం వస్తే మిమ్మల్ని ప్రీతిబుద్ది అని అంటారా? ఇలా ఎవరైతే సదా ప్రీతి బుద్ధిగా ఉంటారో వారే విజయీ రత్నాలుగా అవుతారు. కనుక విజయీరత్నాలుగా అయ్యేటందుకు స్వయాన్ని ప్రీతి బుద్దిగా తయారుచేసుకోండి. లేకపోతే ఉన్నత పదవి పొందటానికి బదులు తక్కవ పదవికి అధికారిగా అవుతారు. ఇలా స్వయాన్ని విజయీ రత్నాలుగా భావిస్తున్నారా? ఎక్కడ, ఏ రకంగా, ఎవ్వరితో ప్రేమ లేదు కదా? లేకపోతే విపరీతబుద్ధి అయిపోతారు. ఎలా అయితే ప్రజలకు ప్రదర్శినీలో సంగమయుగం యొక్క చిత్రం దగ్గరకు తీసుకువెళ్ళి ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఎవరు? అని అడుగుతారు కదా! సంగమయుగం దగ్గరే నిలబడి ఎందుకు అడుగుతారు. ఎందుకంటే సంగమయుగం అంటే ఉన్నతోన్నతమైన స్థానం, ఉన్నతోన్నతమైన యుగం. అదేవిధంగా మీ యొక్క స్థితిని ఎంత ఉన్నతంగా తయారుచేసుకుంటారో అంత మీకు ఉన్నత పదవి లభిస్తుంది. కనుక స్వయాన్ని నేను సదా ప్రీతి బుద్ధిగా ఉంటున్నానా లేక లేదా అడగండి. అప్పుడప్పుడు తొలగిపోతున్నానా? ఒకవేళ ఇప్పటి వరకు సదా ప్రీతి బుద్ధిగా కాకపోతే అక్కడక్కడ ఏదైనా సూక్ష్మరూపంలో కానీ, స్థూలంగా కానీ ఎవరితోనైనా, ఎక్కడైనా ప్రేమ జోడించబడి ఉంటే ఇప్పుడు వర్తమాన సమయంలో చదువు యొక్క కోర్స్ సమాప్తి అయిపోతుంది. రివైజ్ కోర్స్ కూడా నడుస్తుంది. కనుక ఇప్పుడు పరీక్షా సమయం చాలా సమీపంగా వస్తుంది అని అర్ధం చేసుకోండి. కనుక మనం ఒకే బాబాతో సదా ప్రీతి బుద్ధిగా ఉండాలి. ఎవ్వరితో ప్రేమ ఉండకూడదు. ఎలా అయితే గవర్నమెంట్ వారు కూడా మధ్య మధ్యలో యూనిట్ పరీక్షలు పెడతారు కదా! వాటిలో వచ్చిన మార్కులు అంతిమ పేపర్లో జమ చేస్తారు. అలాగే వర్తమాన సమయంలో మీరు ఏ కర్మ చేస్తున్నా నాకు ప్రత్యక్ష పేపర్ నడుస్తుంది అని భావించండి. ఈ సమయంలో ఈ ప్రత్యక్ష పేపర్ యొక్క ఫలితం అంతిమ పేపర్ లో జమ అవుతుంది. కనుక ఇప్పుడు కొద్ది సమయంలో ఏదైనా వికర్మ చేసినా ఆ వికర్మ యొక్క శిక్ష సూక్ష్మ రూపంలో మీకు అనుభవం అవుతుంది. ఎలా అయితే ప్రీతి బుద్ధి కలిగిన ఆత్మలు నడుస్తూ, తిరుగుతూ బాబా యొక్క, బాబా చరిత్ర యొక్క, బాబా కర్తవ్యం యొక్క స్మృతిలో ఉండటం ద్వారా ప్రత్యక్షంగా బాబా కలయిక యొక్క అనుభవం చేసుకుంటారో అలాగే విపరీతబుద్ధి కలిగిన ఆత్మలు బాబాకి విముఖంగా అయిన కారణముగా సూక్ష్మ రూపంలో శిక్షలు అనుభవం చేసుకుంటారు. అందువలన బాప్ దాదా మొదటే చెప్తున్నారు - ఆ శిక్షల అనుభవం చాలా కఠినంగా ఉంటుంది. వారి ముఖం ద్వారా ఈ సమయంలో ఈ ఆత్మ ఈ శిక్ష అనుభవిస్తుంది అని అందరికి తెలిసిపోతుంది. వారు ఎంత దాచుకోవటానికి ప్రయత్నించినా దాగదు. ఆ ఒక్క సెకను యొక్క శిక్ష అనేక జన్మల దు:ఖాన్ని అనుభవం చేయించేదిగా ఉంటుంది. ఎలా అయితే బాబాకి సన్ముఖంగా రావటం ద్వారా, బాబా కలయిక ద్వారా ఆత్మ ఒక్క సెకనులో అనేక జన్మల దాహాన్ని తీర్చుకుంటుందో అలాగే బాబాకి విముఖంగా అయిన ఆత్మ ఒక్క సెకనులో అనేక జన్మల శిక్షను అనుభవిస్తుంది. తర్వాత ఆ శిక్షల నుండి విడిపించుకుని మరలా తన స్థితిలోకి రావటానికి చాలా శ్రమ పడుతుంది. అందువలనే మొదటే బాబా మనందరికి వార్నింగ్ ఇస్తున్నారు ఇప్పుడు పరిక్షా సమయం నడుస్తుంది, మరలా నన్ను నిందించకండి. ఈ కర్మకి ఇంత గుహ్యగతి ఉందని మాకు తెలియదు బాబా అని అనకండి. అందువలన ఈ సూక్ష్మ శిక్షల నుండి రక్షించుకునేటందుకు స్వయం మీకు మీరే జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు పొరపాట్లు చేయకండి. ఇప్పుడు కొద్ధిగా పొరపాటు జరిగినా ఒకటికి వంద రెట్లు శిక్ష ఉంటుంది. ఎలా అయితే ఏదైనా మంచి చేస్తే ఒకటికి వంద రెట్లు లాభం లభిస్తుందో అలాగే ఇప్పుడు ఒకటికి వందరెట్లు శిక్ష లభించే సమయం వస్తుంది. ఇప్పుడు ఆ మాట కూడా ప్రత్యక్షంగా మీకు అనుభవం అవుతుంది. కనుక సదా బాబాకి సన్ముఖంగా, ప్రీతి బుద్ధి అయ్యి ఉండండి. ఇలా సదా బాబాకు సన్ముఖంగా ఉండే అదృష్ట సితారలకు బాబా యొక్క నమస్తే.