04.03.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


అధికారిగా అయ్యేటందుకు ఆధీనతను వదలండి.

ఈరోజు విశేషంగా ఎందువలన వచ్చారు? తెలుసా? భవిష్యత్తులో విశేషతను చూపించే విశేషాత్మలను కలుసుకునేటందుకు వచ్చారు. స్వయాన్ని విశేషాత్మలుగా అంటే విశేషతను చూపించేవారిగా భావిస్తున్నారా? ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఏ గ్రూప్ చూపించని విశేషతను చూపించాలి. దీని కోసం ఏదైనా ప్లాన్ ఆలోచించారా? పాస్ విత్ ఆనర్‌గా అయ్యే లక్ష్యం, బాబాని ప్రత్యక్షం చేసే లక్ష్యం అందరికి ఉంది. కానీ మీరు విశేషంగా ఏ నవీనత చూపించాలి? నవీనత లేక విశేషత ఇదే చూపించాలి, లేదా చూపించే నిశ్చయం పెట్టుకోవాలి. ఏ విఘ్నంలోనైనా, ఏ కార్యంలోనైనా శ్రమ లేకుండా ఇతరాత్మలను నిర్విఘ్నంగా మరియు ప్రతి కార్యంలో సహాయకారిగా చేస్తూ సహజంగా సఫలతామూర్తిగా అవుతాము లేదా తయారుచేస్తాము అని అంటే సదా సహజయోగిగా, సదా బాబాకి స్నేహిగా, బాబా కార్యంలో సహయోగిగా, సదా సర్వ శక్తులను ధారణ చేస్తూ శృంగార మూర్తిగా, శస్త్రధారి శక్తిగా అయ్యి మీ చిత్రం ద్వారా, నడవడిక ద్వారా బాబా యొక్క చరిత్రను మరియు కర్తవ్యాన్ని ప్రత్యక్షం చేయాలి. ఈ విధమైన ప్రతిజ్ఞ స్వయంతో చేస్తున్నారా? చిన్న, చిన్న విషయాలలో శ్రమ అనిపించటం లేదు కదా? మాయా ఆకర్షణలో మోసపోవటం లేదు కదా? ఎవరైతే స్వయం మాయతో మోసపోతూ ఉంటారో వారు ఇతరులను మాయ నుండి రక్షించలేరు. కనుక సదా ఇదే స్మృతి ఉంచుకోండి - మేము దు:ఖహర్త, సుఖకర్త బాబా యొక్క పిల్లలం అని. ఇతరుల దు:ఖాన్ని తొలగించే మీరు స్వప్నంలో, సంకల్పంలో కూడా దు:ఖం యొక్క అలలోకి రాకూడదు. సంకల్పంలోనై నా దు:ఖం యొక్క అలలోకి వస్తే మిమ్మల్ని సుఖ సాగరుడైన బాబా సంతానం అని ఎలా అంటారు? బాబా యొక్క మహిమను వర్ణన చేసేటప్పుడు సుఖ సాగరుడు అని వర్ణిసారు కదా! లేదా అప్పుడప్పుడు దుఃఖం అనేది కూడా వస్తుందా? మరి బాబా సమానముగా కావాలి కదా? దు:ఖం యొక్క అల రాకూడదు. ఈవిధమైన ప్రతిజ్ఞ చేయాలి. మీరు శక్తిరూపం కాదా? మీకు శక్తి ఎలా లభిస్తుంది? సదా బుద్ధి యొక్క సంబంధం ఒకే బాబాతో తగులుకుని ఉంటే ఆ సంబంధం ద్వారా సర్వశక్తులు వారసత్వ రూపంలో మీకు లభిస్తాయి. కానీ అధికారిగా భావించి ప్రతి కర్మ చేస్తూ ఉండాలి. సంకల్పంలో కూడా అడిగేటువంటి కోరిక ఉంచుకోకూడదు. కానీ మీకు అధికారం ప్రాప్తించని కారణంగా అక్కడక్కడ ఏదోక రకంగా అధీనం అయిపోతున్నారు. ఆధీనత కారణంగా అధికారాన్ని పొందలేకపోతున్నారు. దేహాభిమానానికి ఆధీనం అయినా, పాత సంస్కారాలకు ఆధీనం అయినా, గుణాల యొక్క ధారణలో లోపం ఉన్నా నిర్బలత, బలహీనత వచ్చేస్తుంది. అందువలనే అధికారి స్థితిని అనుభవం చేసుకోలేకపోతున్నారు. అందువలనే బాబా చెప్తున్నారు, సదా మేము ఆధీన ఆత్మలం కాదు, అధికారి ఆత్మలం అని భావించండి. పాత సంస్కారాలపై, మాయపై విజయం పొందే అధికారులు మీరు. మీ దేహాభిమానం లేదా దేహసంబంధాలు, దేహ సంపర్కాలు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా విజయం పొందే అధికారి ఆత్మలు మీరు. ఈ అధికారం మీకు సదా స్మృతి ఉంటే సర్వశక్తుల యొక్క ప్రాప్తి మీకు అనుభవం అవుతుంది. ఈ అధికారి స్థితిని మర్చిపోతున్నారా? ఎవరైతే ఆధీనం అయిపోతూ ఉంటారో వారు సదా అడుగుతూ ఉంటారు. అధికారిగా ఉండేవారు సదా సర్వప్రాప్తి స్వరూపంగా ఉంటారు. బాబా దగ్గర సర్వశక్తుల ఖజానా ఎవరి కోసం ఉంది? మరి ఎవరివి అయితే వారు పొందరా? కనుక సదా ఇదే నషా ఉంచుకోండి - సర్వశక్తులు మా యొక్క జన్మసిద్ద అధికారం అని. అధికారిగా అయ్యి నడుస్తూ ఉండండి. సదా బుద్ధిలో శ్రేష్ట సంకల్పం ఉండాలి. సంకల్పం శ్రేష్టంగా ఉంటే మాట మరియు కర్మ కూడా శ్రేష్టంగా అవుతాయి. సంకల్పంలో శ్రేష్టత లేకపోతే మాటలో, కర్మలో కూడా శ్రేష్టత రాదు. అందువలన సంకల్పాన్ని శ్రేష్టంగా చేసుకోండి మరియు సర్వశక్తివంతుడైన బాబాతో బుద్ధి యొక్క సాంగత్యాన్ని ఉంచండి. ఇలా సదా సాంగత్యం యొక్క రంగులో ఉంటున్నారా? అనుభవం చేసుకుంటున్నారా లేదా ఇప్పుడు వెళ్ళిన తర్వాత కూడా అనుభవం చేసుకుంటారా? సదా ఇలా భావించండి - ఆలోచించటం లేదా మాట్లాడటం లేదా చేయటం అద్భుతంగా ఉండాలి. సాధారణంగా ఉండకూడదు. సాధారణ సంకల్పం చేస్తే ప్రాప్తి కూడా సాధారణంగానే ఉంటుంది. ఎటువంటి సంకల్పమో అటువంటి సృష్టి తయారవుతుంది కదా? ఒకవేళ సంకల్పం శ్రేష్టంగా లేకపోతే మీ క్రొత్త సృష్టి ఏదైతే రచించబడుతుంతో దానిలో పదవి కూడా మీకు సాధారణంగానే లభిస్తుంది. అందువలన సదా పరిశీలన చేసుకోండి - మా సంకల్పం సాధారణంగా ఉందా లేదా శ్రేష్టంగా ఉందా అని. సాధారణ సంకల్పం లేదా నడవడిక సర్వాత్మలు చేస్తారు. సర్వశక్తివంతుని బాబా సంతానంగా అయిన తర్వాత కూడా సాధారణ సంకల్పం, కర్మ చేస్తే ఇక మీ శ్రేష్టత ఏమిటి? విశేషత ఏమిటి? కనుక నేను విశేషాత్మను కనుక అన్నీ విశేషంగా ఉండాలి అనే సంకల్పం పెట్టుకోండి. మీ పరివర్తన ద్వారా ఆత్మలను మీ వైపు అంటే మీ బాబా వైపు ఆకర్షితం చేయాలి. మీ దేహం వైపు కాదు, మీ వైపు అంటే ఆత్మ యొక్క ఆత్మీయత వైపు ఆకర్షితం చేయాలి. మీ యొక్క పరివర్తనయే సృష్టిని పరివర్తనలోకి తీసుకువస్తుంది. ఇప్పుడు సృష్టి యొక్క పరివర్తన కూడా శ్రేష్టాత్మలైన మీ పరివర్తన కోసమే ఆగి ఉంది. పరివర్తన తీసుకు రావాలి అనుకుంటున్నారా లేదా ఈ సాధారణ జీవితమే మంచిగా అనిపిస్తుందా? కనుక స్మృతి, వృత్తి మరియు దృష్టి అలౌకికంగా ఉంటే ఈ లోకం యొక్క ఏ వ్యక్తి, వస్తువు మనల్ని ఆకర్షితం చేయవు. ఒకవేళ ఆకర్షిస్తుంది అంటే మన స్మృతిలో, వృత్తిలో, దృష్టిలో అలౌకికత లోపంగా ఉన్నట్లే. కనుక లోపాన్ని సెకనులో పరివర్తన చేసుకోవాలి. ఈ గ్రూప్ ఇదే విశేషత చూపించాలి. మీ సాంస్కారాలను, సంకల్పాలను, సెకనులో పరివర్తన చేసుకునే ధైర్యం ఉందా? ఆలోచించటంలో ఎంత సమయం పడుతుందో చేయటంలో కూడా అంత సమయం పడుతుందా? ఇంత ధైర్యం ఉందా? ఈ గ్రూప్ సాహసం చేసే గ్రూప్. ఎవరైతే ధైర్యం పెట్టుకుంటారో వారికి సదా బాప్ దాదా సహయోగిగా ఉంటారు. అందువలన ఎప్పుడు ధైర్యాన్ని వదలకండి. ధైర్యం మరియు ఉల్లాసం సదా ఉండాలి. ధైర్యం ద్వారానే సదా హర్షితంగా ఉండగలరు. ఉల్లాసం ద్వారా ఏమి జరుగుతుంది? ఉల్లాసం దేనిని సమాప్తి చేస్తుంది? సోమరితనాన్ని సమాప్తి చేస్తుంది. ఈ సోమరితనం కూడా విశేషమైన వికారం, పురుషార్థి మార్గంలో నడుస్తున్నప్పుడు వర్తమాన సమయంలో మాయ ఈ సోమరితనం రూపంలో రకరకాల రూపాలలో మన ఎదురుగా వస్తుంది. కనుక ఈ సోమరితనాన్ని సమాప్తి చేసుకునేటందుకు సదా ఉల్లాసంలో ఉండండి. సంపాదన చేసుకునే ఉల్లాసం మీకు ఉంటే సోమరితనం స్వతహాగానే సమాప్తి అయిపోతుంది. ఇప్పుడు కూడా ఏదైనా కార్యం చేసేటప్పుడు ఉల్లాసం లేకపోతే తప్పనిసరిగా మీకు సోమరితనం వచ్చేస్తుంది. అందువలన ఎప్పుడు ఉల్లాసాన్ని తక్కువ చేసుకోకూడదు. సోమరితనానికి వశమై మీ యొక్క శ్రేష్టకర్మ నుండి వంచితం కాకూడదు. సోమరితనం కూడా రకరకాలుగా ఉంటుంది. మీ పురుషార్థంలో ముందుకి వెళ్ళటంలో ఈ సోమరితనమే మీకు చాలా విఘ్నంగా అవుతుంది. వారు ఆలోచిస్తాము, ఈ కార్యం చేస్తాము, అయిపోతుంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇదే సోమరితనానికి గుర్తు. చేస్తాము, అయిపోతుంది, చేసే తీరతాము, చేయవలసి వస్తుంది ఇలా మాట్లాడతారు. బాబా యొక్క జ్ఞానం, ధారణలు ఏవైతే లభించాయో వాటిని బుద్ధిలో ధారణ చేస్తున్నారు. కానీ ప్రత్యక్షంలోకి వచ్చేటప్పుడు ఈ సోమరితనం అనేది విఘ్నరూపంగా అయిపోతుంది. రేపటి నుండి చేసేస్తాము, ఫలానా వారు చేస్తే మేము కూడా చేస్తాము. ఈరోజు ఆలోచించి రేపటి నుండి చేస్తాము, ఈ పని అయిపోయిన తర్వాత ఆ పని చేస్తాము. ఇలాంటి సంకల్పాలు కూడా సోమరితనం యొక్క రూపాలే. ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఇప్పుడే చేయాలి. ఎంత చేయాలనుకుంటున్నారో అది ఇప్పుడే చేయాలి. చేస్తాము, ఆలోచిస్తాము ఇలా అంటూ ఉంటే ఇది చిన్నతనం యొక్క గుర్తు. చిన్న పిల్లలు చేస్తాము, చేస్తాము అంటారు కదా! ఇది సోమరితనానికి గుర్తు. అందువలన ఎప్పుడు కూడా సోమరితనం యొక్క రూపాన్ని మీ దగ్గరకు రానివ్వకండి. సదా ఉల్లాసంలో ఉండండి. ఎందుకంటే మీరు నిమిత్తమయ్యారు కదా! నిమిత్తంగా ఉన్నవారు పురుషార్థంలో సదా ఉల్లాసంగా ఉంటే వారిని చూసి ఇతరులు కూడా ఉల్లాసంలోకి వస్తారు. నడుస్తూ, నడుస్తూ పురుషార్ధంలో అలసిపోవటం, నడుస్తూ, నడుస్తూ పురుషార్ధం సాధారణ వేగంలోకి వచ్చేయటం ఇది ఎవరి గుర్తు? విఘ్నాలు లేవు కాని మీ యొక్క సంలగ్నత శ్రేష్ఠంగా ఉండటం లేదు, అంటే దీనిని కూడా సోమరితనం అంటారు. కొంతమంది మాకు ఏ విఘ్నాలు లేవు, మేము మంచిగా నడుచుకుంటున్నాము అని అంటారు. కాని సంలగ్నత లేకపోవటం అంటే ఉల్లాసం, ఉత్సాహం కూడా లేనట్లే. ఇది కూడా సోమరితనానికి గుర్తు. ఈ సోమరితనం కూడా అనేక రకాలుగా ఉంటుంది. కనుక ఈ సోమరితనాన్ని ఎప్పుడు రానివ్వకండి. ఈ సోమరితనం అనేది నెమ్మది, నెమ్మదిగా మొదట మిమ్మల్ని సాధారణ పురుషార్ధిగా చేస్తుంది. తర్వాత బాబా యొక్క సమీపత నుండి దూరం చేస్తుంది. తర్వాత దూరం చేస్తూ, చేస్తూ మోసం కూడా చేస్తుంది, బలహీనంగా కూడా చేసేస్తుంది. నిర్భలంగా కూడా చేసేస్తుంది. నిర్భలంగా, బలహీనంగా అవ్వటం ద్వారా మీలో లోపాలు కూడా ప్రవేశిస్తాయి. అందువలన సదా నా బుద్ధి యొక్క సంలగ్నత బాబాతో, బాబా కర్తవ్యంతో కొద్దిగా కూడా దూరంగా లేదు కదా? అని పరిశీలించుకోండి, సమీపంగా ఉందా అని. ఈ రోజుల్లో ఎవరైనా హత్య చేయాలనుకున్నప్పుడు లేదా ఏదైనా భ్రష్టాచార కార్యం చేయాలనుకున్నప్పుడు వారిని దూరంగా తీసుకెళ్ళిపోతారు. వారిని ఒంటరిగా, బలహీనంగా చేసి ఆ తర్వాత వారిపై యుద్ధం చేస్తారు. అలాగే మాయ కూడా చాలా చతురమైనది. మొదట సర్వశక్తివంతుడైన బాబాతో మీ బుద్ధిని దూరం చేస్తుంది. తర్వాత మిమ్మల్ని బలహీనం చేస్తుంది. తర్వాత మీపై యుద్ధం చేస్తుంది. ఎందుకంటే అప్పుడు మీకు తోడు ఎవరు ఉండరు. కనుక ఏది ఏమైనప్పటికి బాబాతో మీ బుద్ది దూరం అవ్వకూడదు. ఎవరిపైనైనా యుద్ధం జరుగుతున్నప్పుడు వారు తమని తాము రక్షించుకునేటందుకు అరుస్తారు కదా! గొడవ చేస్తారు కదా, ఎవరైనా దూరంగా తీసుకువెళ్ళండి అని. అలాగే ఇక్కడ కూడా మాయ మీ బుద్ధి యొక్క సంలగ్నతను బాబా నుండి దూరం చేయటానికి ప్రయత్నిస్తుంది. కనుక మీ లోపల బాబా యొక్క గుణాలు మహిమ చేస్తూ ఉండండి. మహాన్ కర్తవ్యంలో నిమగ్నమవ్వండి, అరవకండి. భక్తిలో దేవతలకు గుణగానం చేస్తారు కదా! ఈ స్మృతిచిహ్నం కూడా ఎప్పటి నుండి తయారయ్యింది? మీరు మనస్సులో బాబా యొక్క మహిమ చేసినదే వారు నోటి యొక్క మహిమలోకి తీసుకువస్తారు. యదార్థంగా మీరే బాబా యొక్క గుణగానం చేస్తున్నారు కదా! కనుక ఇప్పుడు యదార్థ రూపంలో, మనసా సంకల్పంలో, స్మృతి స్వరూపంలో బాబా గుణగానం చేస్తూ ఉండండి. అప్పుడు భక్తిలో స్థూలతలోకి వచ్చి నోటి ద్వారా మహిమ చేస్తారు. ఈ అన్ని ఆచారాలు, పద్ధతులు ఇక్కడి నుండే ప్రారంభం అయ్యాయి. కనుక బాబా యొక్క గుణాలను మహిమ చేయండి. స్వయాన్ని అధికారిగా భావించి సర్వశక్తులను కార్యంలోకి తీసుకురండి. అప్పుడు ఇక ఎప్పుడు మాయ మీ యొక్క సంలగ్నతను బాబా నుండి చేయదు, దూరం అవ్వరు, మీరు బలహీనం అవ్వరు, ఓడిపోరు, సదా విజయీగా ఉంటారు. కనుక ఇప్పుడు ఈ స్లోగన్ జ్ఞాపకం ఉంచుకోండి - మేము అనేక సార్లు విజయీ అయ్యాము, ఇప్పుడు కూడా విజయీ అయ్యే చూపిస్తాము అని. ఎవరైతే అనేక సార్లు విజయీ అయ్యారో వారు ఎప్పుడైనా ఓడిపోతారా? ఓడిపోరు. ఓడిపోవటం వారికి అసంభవం. ఎలా అయితే అజ్ఞాని ఆత్మలకు విజయం పొందటం అసంభవంగా అనిపిస్తుందో అలాగే మీకు ఓడిపోవటం అసంభవంగా అనిపించాలి. ఇలాంటి ఆత్మిక శక్తిని మీలో నింపుకుంటున్నారా? స్వయాన్ని సర్వ సమర్పణ చేసుకున్నారా? సర్వ సమర్పణ అంటే సంకల్పంలో కూడా దేహాభిమానం ఉండకూడదు, దీనిని సర్వ సమర్పణ అంటారు. మీ దేహం యొక్క అభిమానాన్ని కూడా అర్పణ చేయాలి. నేను ఫలానా అనే సంకల్పాన్ని కూడా అర్పణ చేయాలి. ఇటువంటి వారిని సర్వ సమర్పణ అయినవారు అని అంటారు. సర్వ గుణాలతో సంపన్న ఆత్మలు అంటారు. ఇలా సర్వగుణాలతో సంపన్నం అయినవారినే సంపూర్ణం అని అంటారు. ఏ గుణం యొక్క లోపం ఉండకూడదు. ఇప్పుడు మీరు ఈ లోపం ఉంది అని వర్ణిస్తున్నారు కదా! అంటే అర్థం ఏమిటి? మీకు ఇంకా సంపూర్ణస్థితి రాలేదు. సర్వగుణాలతో సంపన్నం అయ్యారా? సర్వ సమర్పణ అయ్యి, సర్వగుణ సంపన్నంగా అయ్యి సంపూర్ణ స్థితి పొందుతాము అని లక్ష్యం పెట్టుకున్నారు కదా? అటువంటి పురుషార్థీలకు బాబా కూడా సదా విజయీభవ అనే వరదానాన్ని ఇస్తున్నారు. కనుక ప్రతి సంకల్పంలో అద్భుతం చేసి చూపించండి. ఈ విశేషతను చూపించండి. జీవితాన్ని నిర్ణయించుకోవడానికి బాబా దగ్గరకు వచ్చారు కదా! స్వయంలో స్వయం నిర్ణయించుకుని వచ్చారా? ఏ సంస్కారానికి వశం కాకూడదు. జగత్ జీతులుగా కావాలి. జగత్తునే జయించగలుగుతున్నప్పుడు దేనికి వశం కాకూడదు. ఎవరైతే స్వయం సర్వాత్మలకు దృష్టి ద్వారా అద్భుతం చేస్తారో వారి దృష్టి ఇక ఎక్కడికి వెళ్ళదు. ఇటువంటి ధృడ నిశ్చయబుద్ది అయ్యారా? మీ అన్ని బలహీనతలను మట్టిలో స్వాహా చేసారా లేదా చేయాలా? కొద్దిగా ఉన్నాయి అని అనరు కదా! ఇప్పుడు మనస్సు అనే జేబుని మంచిగా పరిశీలించుకోండి. మీ జేబులో కొద్ది కొద్దిగా ఏ మూల అయినా కొద్దిగా ఉండిపోయినవా అని. జేబు ఖర్చు కోసం దాచుకున్నారా? ఇది మంచిగా పరిశీలించుకోండి, మీరు నమ్మకదారి గ్రూప్ కదా! నమ్మకదారులు కూడా, విజయీ ఆత్మలు కూడా. ఈ గ్రూప్ వారు అనేక సార్లు విజయం పొందారు. మేము విజయీలం అనే నమ్మకం మీకు ఉంది. ఇటువంటి విజయీ ఆత్మలే విజయీ మాలలో మణులుగా అవుతారు. కేవలం నమ్మకమే కాదు 100 శాతం మేము విజయీలం అనే నిశ్చయం మీకు ఉంది. మాయ కూడా తక్కువైనది కాదు, మాయ కూడా చాలా మెరుపు చూపిస్తుంది. అన్ని వైపుల నుండి, అన్ని రూపాలతో వచ్చే మాయ యొక్క జ్ఞానాన్ని కూడా అర్థం చేసుకున్నారు కదా? మాయ అంటే ఏమిటి? ఏ రూపంతో, ఏ విధముగా వస్తుంది అని. దీని యొక్క పూర్తి జ్ఞానం మీకు ఉందా? లేక ఈ విషయంలో మాకు జ్ఞానం లేదు అంటారా? ఇలా తెలివి తక్కువవారిగా అయ్యి మిమ్మల్ని మీరు చిక్కింపచేసుకోకండి. చాలా మంది ఇలా కూడా జరుగుతుందని మాకు తెలియదు అంటారు, ఏమేమి చేస్తూ ఉన్నారు? తెలివి తక్కువతనంతో మోసంలోకి కూడా వచ్చేస్తున్నారు. కానీ మీరందరు మాస్టర్ జ్ఞానసాగరులు. కనుక తెలివి తక్కువ వారిగా అవ్వకూడదు, నాకు ఈ విషయంలో జ్ఞానం లేదు అని మీ నోటి నుండి రాకూడదు. ఇది కూడా బలహీనతే. జ్ఞాని అంటే జ్ఞానిగానే ఉండాలి. ఏ విషయం యొక్క అజ్ఞానం మీలో ఉన్నా మిమ్మల్ని జ్ఞాని అంటారా? జ్ఞానస్వరూపం అంటే ఏ విషయం యొక్క అఙ్ఞానం మీలో ఉండకూడదు. యోగయుక్తంగా ఉండాలి. యోగయుక్తంగా ఉండేవారికి మొదటే అన్నీ తెలిసిపోతాయి. మీరు తికాలదర్శి ఆత్మలు కదా! ఇక మీకు తెలియనది అంటూ ఏమి ఉంటుంది? మాస్టర్ జ్ఞానసాగరులుగా కూడా అయ్యారు, విజయీగా కూడా అయ్యారు. మరి మీకు ఓటమి అనేది అసంభవంగానే అనుభవం అవుతుంది కదా! ఇప్పుడు ఈ గ్రూప్ ఎటువంటి మెరుపు చూపిస్తుందో చూస్తాను. మీ మెరుపు ద్వారా అందరికి బాబా యొక్క మెరుపు చూపించాలి. ఇప్పుడు ఎంతోమంది ఆత్మలు బాబా యొక్క మెరుపు కోసం తపిస్తున్నారు. ఇప్పుడు బాబా యొక్క మెరుపు మీ మెరుపు ద్వారా చూపించాలి. అర్థమైందా! ఇది విజయీ గ్రూప్. ఉల్లాసం ద్వారా సోమరితనాన్ని పారద్రోలేవారు మీరు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూపించండి. ఇప్పుడు మీ అభ్యాసాన్ని ప్రత్యక్షంలోకి ఎంత వరకు తీసుకువచ్చారు, ఇది కూడా తెలుస్తుంది. ఏ స్థానంలోకి వెళ్ళినా అద్భుతాన్ని చేసి చూపించండి. ఎవరితో సేవలో సహాయకారి అవుతున్నా వారి వైపు నుండి కూడా అద్భుతం తప్ప ఇక ఏ విషయం కనిపించకూడదు. ఒకొక్క వరుసలో అద్భుతం అని వ్రాయాలి. అప్పుడు మిమ్మల్ని విజయీ గ్రూప్ అంటారు. బాబా సమానంగా అయ్యి చూపించండి. ఇలా అద్భుతం చేసి చూపించండి. పెద్దవారు కూడా బాబా యొక్క మహిమ చేయాలి, వీరు నిజంగా నిర్విఘ్నగ్రూప్ అని. బాబా యొక్క సంలగ్నతలో నిమగ్నమై ఉండేవారు అని. ఒక్క బాబా తప్ప ఇక ఏదీ మిమ్మల్ని ఆకర్షించకూడదు. ఒకే బాబా యొక్క సంలగ్నత, బాబా కర్తవ్యం యొక్క సంలగ్నత ఇది తప్ప ఇంకేదీ ఉండకూడదు. ఇక ప్రపంచంలో ఏ వ్యక్తి, వస్తువు మీకు అనుభవం కాకూడదు. ఇలా ఒకే సంలగ్నత, ఒకే నమ్మకంలో, ఏకరస స్థితిలో ఎగిరేకళలో ఉండేవారిగా అయ్యి చూపించండి. అప్పుడే అద్భుతం అని అంటారు. ఒక్కసారిగా భస్మం చేసేవారిగా ఉండాలి. ఏమైనా కారణాలు ఎదురుగా ఉన్నా ఆ కారణాలను నివారణ చేసి నివారణా రూపం తయారుచేయండి, కారణం అని చెప్పకండి. ఎన్ని కారణాలలో నేను నివారణా స్వరూపంగా అయ్యాను? అనేది చూసుకోండి. కారణాలను చూసి బలహీనం కాకండి. కారణాలను నివారణలోకి పరివర్తన చేసే గ్రూప్ మీరు. మిమ్మల్ని విజయీ అంటారు. ఇటువంటి శ్రేష్ట లక్షణధారులే భవిష్యత్తులో లక్ష్మిగా అవుతారు. లక్ష్మి అంటే లక్షణాలు కలిగిన ఆత్మ. కనుక ఇప్పుడు మీ ముఖంలో, నడవడికలో ఆ మెరుపు కనిపించాలి. ఇప్పుడు ఇక్కడ నేర్చుకుంటున్నాము, అక్కడికి వెళ్ళి చూపిస్తాము అని అనకండి. ఇక్కడ మీరు ఎంత వరకు ఋజువు చూపించరో అక్కడ కూడా ఋజువు చూపించలేరు. అర్థమైందా! ఇప్పుడు మీరందరు సేవాధారులు. సేవాధారులు ఎప్పుడూ కూడా సంకల్పంలో కూడా సంశయించరు. సంశయంతో ఉండరు. సర్వసంబంధాల అనుభవం చేసుకోవటం ఇది వేరే విషయం, కానీ సదా స్మృతిలో స్వయాన్ని సేవాధారి స్వరూపంగా భావించాలి. కానీ మీరు అలంకరించుకుంటూ సేవను మర్చిపోతున్నారు. నేను సేవాధారిని, విశ్వ పరివర్తన చేసే పతిత పావనిని, ఈ స్వరూపాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. పతిత పావని ఆత్మపై ఏ పతిత ఆత్మ యొక్క దృష్టి యొక్క నీడ కూడా పడదు. పతిత పావని ఎదురుగా రావటం ద్వారానే పతితులు కూడా పావనంగా పరివర్తన అయిపోవాలి. ఇంత శక్తి మీలో ఉండాలి. పతిత ఆత్మల యొక్క పతిత సంకల్పం కూడా నడవకూడదు. అటువంటి శక్తిశాలిగా బ్రేక్ ఉండాలి. ఎప్పుడైతే వారి పతిత సంకల్పం కూడా నడవదో అప్పుడు వారి పతిత స్థితి యొక్క ప్రభావం మీపై ఎలా పడుతుంది? కనుక నేను పావనాత్మను అని ఆలోచించటం కాదు, ఆ పతిత ఆత్మ యొక్క ప్రభావం కూడా మనపై పడకూడదు. ఆ ప్రభావం పడటం కూడా బలహీనతే. ప్రభావం పడింది అంటే మీరు ప్రభావశాలిగా లేనట్లే. అప్పుడే వారి యొక్క ప్రభావానికి మీరు ప్రభావితం అవుతారు. పతిత పావని అంటే పతిత సంకల్పాల ప్రభావంలోకి కూడా రారు. పతిత పావని కలలో కూడా పతిత స్థితి యొక్క సంకల్పం, దృశ్యంలోకి రాదు. ఒకవేళ కలలో అయినా పతిత స్థితి యొక్క దృశ్యాలు వస్తున్నాయి అంటే పతిత స్థితి యొక్క సంస్కారాలు మీలో ఉన్నట్లు భావించండి. దీనిని కూడా తేలికగా తీసుకోకండి. స్వప్నంలో కూడా ఎందుకు వస్తున్నాయి? కనుక ఇంత కఠినమైన వృత్తి, కఠినమైన దృష్టి, కఠినమైన స్మృతి స్వరూపంగా ఉండాలి. పతిత ఆత్మ శస్త్రధారి శక్తి అయిన నా ముందు ఒక్క సెకనులో భస్మం అయిపోవాలి అనుకోవాలి. వ్యక్తి భస్మం కారు. కానీ వారి పతిత సంస్కారాలు భస్మం అయిపోతాయి. ఆసురీ సంస్కారాలను భస్మం చేయాలి. కనుక నేను పతిత పావని, ఆసురీ పతిత సంస్కారాల సంహారిని అనుకోండి. ఎవరైతే స్వయం సంహారిగా ఉంటారో వారు ఎప్పుడు ఎవ్వరికి ప్రభావితం అవ్వరు. ఇంత ప్రత్యక్ష ప్రభావం మీలో ఉండాలి. ఎవరు ఎదురుగా వచ్చినా ఏ పతిత సంకల్పం చేసినా ఆ సంకల్పంతో వారు మూర్చితులు అయిపోవాలి. ఇటువంటి కాళికా రూపంగా కావాలి. ఒక్క సెకనులో వారి పతిత సంకల్పం మీ ముందు బలి ఇచ్చేయాలి. ఇటువంటి బలవంతులుగా కావాలి. ఏ ఛాయ కూడా మీపై పడకూడదు, కోమలంగా ఉండకూడదు. కోమలంగా ఉండేవారు నిర్బలంగా ఉంటారు. కనుక శక్తులు కోమలంగా ఉండకూడదు, మాయపై దయ చూపించకూడదు, మాయను తిరస్కరించేవారిగా ఉండాలి. ఎంతగా మాయను తిరస్కరిస్తారో అంత దైవీ పరివారం ద్వారా, భక్తుల ద్వారా సత్కారం పొందుతారు. మాయపై దయ చూపించకూడదు. పురుషార్ధంలో సహాయకారి అయ్యి ఆత్మలపై దయ చూపించాలి. కానీ మాయపై దయ చూపించకూడదు.