03.05.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


లామేకర్ (నియమాన్ని తయారుచేసేవారి)గా అవ్వండి- బ్రేకర్ (నియమాన్ని ఉల్లంఘించేవారి)గా కాదు.

స్వయాన్ని లవ్ ఫుల్‌గా అంటే ప్రేమ స్వరూపంగా మరియు లాఫుల్‌గా అంటే నియమ స్వరూపంగా భావిస్తున్నారా? ఎంతగా ప్రేమ స్వరూపంగా ఉంటారో అంతగానే నియమస్వరూపంగా కూడా ఉండాలి. ఎప్పటి వరకు లవ్ ఫుల్‌గా అవ్వరో అప్పటి వరకు లాఫుల్‌గా కూడా కాలేరు. అలాగే లా ఫుల్‌గా కానంత వరకు లవ్ ఫుల్‌గా కూడా కాలేరు. ఈ రెండు వెనువెంట ఒకే సమయంలో, కర్మలో లేదా మీ స్వరూపంలో కనిపిస్తున్నాయా? లవ్ మరియు లా ఎందుకంటే, ఎప్పటి వరకు ఈ ప్రేమ మరియు నియమం రెండు సమానంగా ఉండవో అంత వరకు మీరు ఏదైతే కార్యం చేస్తున్నారో ఆ కార్యంలో సదా సఫలతామూర్తిగా కాలేరు. కనుక సదా సఫలతా మూర్తిగా, సంపూర్ణమూర్తిగా అయ్యేటందుకు ఈ రెండు విషయాలు తప్పకుండా ఉండాలి. స్వయాన్ని లాఫుల్‌గా తయారు చేసుకోవాలి మరియు ఇతరుల కొరకు లవ్ ఫుల్‌గా అవ్వాలి. అలాగే లాఫుల్‌గా కూడా అవ్వాలి. ఎవరైతే స్వయం పట్ల లాఫుల్‌గా అవుతారో వారు ఇతరుల పట్ల కూడా లాఫుల్‌గా తయారవుతారు. ఒకవేళ స్వయం మీరు ఏదైనా లా అంటే నియమాన్ని ఉల్లంఘిస్తే ఇతరుల పట్ల కూడా మీరు ఆ నియమాన్ని నడిపించలేరు. ఇతరులను నియమ స్వరూపంగా తయారు చేయాలంటే స్వయం నియమ స్వరూపంగా తయారవ్వాలి. మీరు కాకుండా ఇతరులను తయారు చేయాలని ప్రయత్నించినా తయారు చేయలేరు. అందువలన స్వయాన్ని నేను స్వయం పట్ల, ఇతరుల పట్ల నియమ స్వరూపంగా అయ్యానా? అని పరిశీలన చేసుకోండి. ఉదయం నుండి రాత్రి వరకు మనసా సంకల్పంలో, మాటలో, కర్మలో, సంపర్కంలో, ఒకరికొకరు సహయోగం ఇవ్వటంలో, సేవలో ఎంత వరకు నేను ఏ రకమైన లాను అంటే నియమాన్ని వ్యతిరేకించలేదు కదా? అని పరిశీలించుకోండి. ఎవరైతే లాని వ్యతిరేకిస్తారో వారు క్రొత్త ప్రపంచాన్ని తయారు చేసేవారిగా కాలేరు. పీస్ మేకర్ అంటే శాంతిదూతలుగా, న్యూ వరల్డ్ మేకర్ అంటే క్రొత్త ప్రపంచ నిర్మాతలుగా కాలేరు. కనుక స్వయాన్ని నేను క్రొత్త ప్రపంచ నిర్మాతగా, శాంతిదూతగా, నియమ రూపకర్తగా ఉన్నానా? లేదా? బాబా యొక్క నియమాన్ని ఉల్లంఘిస్తున్నానా అని పరిశీలన చేసుకోండి. ఎవరైతే స్వయం నియమ రూపకర్తలుగా ఉంటారో వారే నియమాన్ని ఉల్లంఘిస్తే అటువంటి వారిని నియమ రూపకర్తలు అని అంటారా? ఈశ్వరీయ నియమం ఏమిటి? ఇది తెలుసుకున్నారా లేదా ఇప్పుడు తెలుసుకోవాలా? తెలుసుకోవటం అంటే అర్ధం ఏమిటి? నియమాన్ని తెలుసుకోవటం అంటే నియమం ప్రకారం నడవటం. తెలుసుకున్న తర్వాత అంగీకరించాలి.అంగీకరించిన తర్వాత దాని ప్రకారం నడవాలి. ఇక్కడ కూర్చున్న వారందరూ నియమాన్ని పూర్తిగా తెలుసుకున్నారా? అంటే నియమానుసారం నడుస్తున్నాం. అమృతవేళ నుండి మీరు ఏదైతే దినచర్య గడుపుతున్నారో అదంతా ఈశ్వరీయ నియమం ప్రకారం గడుపుతున్నారా లేక దానిలో శాతం ఉందా? ఆ నియమాలను తెలుసుకోవటంలో శాతం ఉందా? ఒకవేళ తెలుసుకోవటంలో శాతం లేకపోతే నడవటంలో శాతం ఎలా వస్తుంది? యదార్థ రూపంలో తెలుసుకోలేనప్పుడే నడవలేకపోతారు. కానీ మీరు తెలుసుకున్నారు. కానీ నడవలేకపోతున్నారు అంటే ఏమంటారు? తెలుసుకోవటం, అంగీకరించటం, నడవటం ఇవన్నీ ఒకలాగే ఉన్నాయి. అయినా కానీ తేడా ఎందుకు వస్తుంది? అజ్ఞానులకు మీరు ఆత్మ అని తెలుసుకోండి, తెలుసుకుంటున్నారు కానీ అంగీకరించి నడవటం లేదు అని మీరు చెప్తారు కదా! మరి మీరు కూడా ఇవి ఈశ్వరీయ నియమాలు అని తెలుసుకుంటున్నారు. కానీ ఆవిధంగా నడుచుకోవటం లేదు. తెలుసుకుని కూడా నడవటం లేదు అంటే ఈ స్థితిని ఏమంటారు? పిల్లలు పురుషార్థం అంటారు అని చెప్పారు. కనుక ఈ పురుషార్థి జీవితంలో పొరపాట్లు క్షమించబడతాయి అని అనుకుంటున్నారా? ఎలా అయితే డ్రామా అనే ఢాలుని తోడుగా చేసుకుంటున్నారో అలాగే ఈ పురుషార్థం అనే మాటను కూడా మీరు తోడుగా చేసుకుంటున్నారు. అందువలనే ఓడిపోతున్నారు. అసఫలత వచ్చేస్తుంది. ఓడిపోవటంలో, అసఫలతలో ఈ పురుషార్థం అనే మాట ఢాలులా పనిచేస్తుంది. అలంకారాలలో ఢాలు చూపిస్తారు కదా! ఎందుకు చూపిస్తారు? ఇలా ఢాలుని పట్టుకున్న వారిని పురుషార్థి అని అంటారా? పురుషార్థం అంటే అర్థం ఏమిటి? పురుషార్థం అంటే ఈ రథంలో ఉంటూ స్వయాన్ని పురుషునిగా అంటే ఆత్మగా భావించి నడవాలి. ఇటువంటి వారిని పురుషార్థి అంటారు. ఇలా పురుషార్థం చేసేవారు అంటే ఆత్మిక స్థితిలో ఉండేవారు, ఈ రథానికి పురుషులు అంటే యజమానులు. మరి ఈ రథానికి యజమాని ఎవరు? ఆత్మ కదా! పురుషార్థి అంటే స్వయాన్ని రథిగా అంటే ఆత్మగా భావించటం. ఇటువంటి పురుషార్థులు ఎప్పుడు ఓడిపోరు. కనుక పురుషార్థం అనే మాటను ఈ విధంగా ఉపయోగించకండి. మేము పురుషార్థులం కదా! అందువలనే ఓడిపోతున్నాము అని. ఒకవేళ పురుషార్థం మంచిగా ఉంటే ఎప్పుడూ ఓటమి అనేదే ఉండదు. తెలుసుకోవటంలో, నడవటంలో మీకు తేడా వస్తుంది అంటే ఆ స్థితిని పురుషార్థి స్థితి అని అనరు. పురుషార్థీలు ఎప్పుడూ గమ్యాన్ని ఎదురుగా పెట్టుకుని నడుస్తారు. ఎప్పుడూ ఆగరు.మార్గమధ్య దృశ్యాలను చూస్తూ ఆగిపోరు. చూస్తూ కూడా చూడనట్లుగా ఉంటారు. ఏ విషయం ఎదురుగా వచ్చినా వాటిని చూస్తూ కూడా చూడనట్లుగా ఉండేవారినే పురుషార్థి అంటారు. వాటిని చూస్తూ ఆగిపోయేవారిని పురుషార్థి అనరు.పురుషార్థులు ఎప్పుడు కూడా మార్గ మధ్య దృశ్యాలను చూసి తమ ధైర్యాన్ని, ఉల్లాసాన్ని వదలరు. వారికి ధైర్యం, ఉల్లాసం సదా వెంట ఉంటాయి. సదా విజయం వెంట ఉంటుంది. ఉల్లాసానికి బదులు ఏదోక సోమరితనానికి వశమైపోయినప్పుడే ధైర్యహీనులు అయిపోతారు. అప్పుడే ఓడిపోతారు. చిన్న పొరపాటు చేస్తున్నారు. అందువలనే నియమ స్వరూపులుగా, నియమ రూపకర్తలుగా అవ్వటానికి బదులు నియమాన్ని ఉల్లంఘించేవారిగా అయిపోతున్నారు. ఆ చిన్న పొరపాటు ఏమిటి? ఒక మాట యొక్క పొరపాటు చేస్తున్నారు. ఆ మాట యొక్క తేడాతో నియమ రూపకర్తలుగా అవ్వటానికి బదులు నియమాన్ని ఉల్లంఘించేవారిగా అయిపోతున్నారు. ఇలా సదా సమర్పణ అయిపోతే సఫలతామూర్తులుగా, విజయీ మూర్తులుగా అయిపోతారు. కానీ అప్పుడప్పుడు బాబాకి సమర్పణ అవ్వడానికి బదులు మీ మతాన్ని కూడా నడిపిస్తున్నారు. అందువలనే ఓడిపోతున్నారు. ఆ ఒక్క మాట యొక్క తేడా ఏమిటంటే శివునికి బదులు శవాన్ని చూస్తున్నారు. శవాన్ని చూడటం ద్వారా శివుడిని మర్చిపోతున్నారు. శవాన్ని చూడటం ద్వారా శివ అనే శబ్దం మారి మీలో విషం వచ్చేస్తుంది. విషం అంటే ఏమిటి? వికారాల విషం. ఇలా చిన్న మాట తేడా కారణంగా వ్యతిరేకంగా అయిపోయి విషం నింపుకుంటున్నారు. కనుక దాని ఫలితం కూడా అలాగే వస్తుంది. మీరు వ్యతిరేక పదాన్ని ధారణ చేసిన కారణంగా ఫలితం కూడా వ్యతిరేకంగానే వస్తుంది. అందువలన బాబా చెప్తున్నారు. సదా శివుడినే చూడండి.శవాన్ని అంటే ఈ దేహాన్ని చూడకండి. దీనిని చూడటం ద్వారా, శరీర అభిమానంలోకి రావటం ద్వారా నియమం ఉల్లంఘించేస్తున్నారు. కనుక ఈ నియమంలో - సదా స్థిరంగా ఉండండి. శవాన్ని చూడకూడదు. శివుడినే చూడాలి అని. అప్పుడు మీకు ఏ విషయంలో ఓటమి ఉండదు.మాయ యుద్ధం చేయదు. ఎప్పుడైనా మాయ మీపై యుద్ధం చేస్తుంది, మీరు ఓడిపోతున్నారు అంటే అర్థం ఏమిటి? మాయ అసలు యుద్ధమే చేయకపోతే అసలు ఓటమి ఎలా వస్తుంది? కనుక స్వయాన్ని ప్రతి సంకల్పంలో బాబాకి బలిహారం చేసుకోండి. అప్పుడు ఎప్పుడూ ఓటమి రాదు. ఒకవేళ సంకల్పంలో బాబాకి బలిహారం కాకపోతే సంకల్పం కర్మలోకి వచ్చి ఓడింపచేస్తుంది. అందువలన స్వయాన్ని లా మేకర్ అంటే నియమ రూపకర్తలుగా భావించండి. ఎప్పుడు కూడా ఈ నియమాన్ని వ్యతిరేకించకండి. నాకు ఏదైతే సంకల్పం వస్తుందో ఆ సంకల్పం బాబాకు బలిహారం చేసే యోగ్యంగా ఉందా? అని పరిశీలన చేసుకోండి. శ్రేష్ట దేవతలకు బలి ఇచ్చేటప్పుడు యోగ్యమైన దానినే ఎంచి బలి ఇస్తారు. ఎలా అంటే అలా ఇచ్చేయరు.పరిశీలించి యోగ్యమైనదే దేవతకు బలి ఇస్తారు. అలాగే మీరు కూడా బాబాకు బలిహారం చేసేటప్పుడు ప్రతి సంకల్పం, ప్రతి కర్తవ్యం పరిశీలించి బాబాకు బలిహారం చేయాలి. ఉన్నతోన్నతమైన బాబాకు బలిహారం చేయటం అంటే మన సంకల్పం కూడా ఉన్నతంగా ఉండాలి. వ్యర్థసంకల్పం, వికల్పం ఇవి బాబాకు బలి చేయకూడదు. ఇవి బాబా స్వీకరించరు. ఈ రోజుల్లో శక్తులకు, దేవతలకు నైవేద్యం పెట్టేటప్పుడు ఆ భోజనాన్ని కూడా శుద్ధపూర్వకంగా ఉంచుతారు కదా! దానిలో కూడా ఏదైనా అశుద్ధత ఉంటే దేవి స్వీకరించదు అని చెప్తారు. భక్తులకు కూడా ఇది అనుభవమే. మరి మీరు శ్రేష్టాత్మలు కనుక శుద్ధపూర్వక విషయాలనే బాబా కూడా స్వీకరిస్తారు. మీరు కూడా శుద్ధపూర్వకమైన వాటినే స్వీకరించాలి.లేదంటే స్వీకరించకూడదు. ఉన్నతోన్నతమైన బాబా ముందు కూడా శుద్ధపూర్వకమైన వాటినే పెట్టాలి. కనుక ప్రతి సంకల్పంలో శ్రేష్టత నింపుకోండి. ప్రతి సంకల్పంలో బాబా మరియు బాబా కర్తవ్యాన్ని గుర్తు పెట్టుకుని అప్పుడు బలి చేయండి. అప్పుడిక ఎప్పుడూ ఓడిపోరు. ఇప్పుడు ఏవిధమైన వ్యర్థ, అశుద్ధ సంకల్పాలు నడిపించకండి. వీటిని నడిపిస్తే ప్రత్యక్ష రూపంలో మీకు శిక్ష లభిస్తుంది. ఇక ముందు కర్మ ద్వారా పొరపాటు చేస్తే దానికి శిక్ష తప్పనిసరిగా ఉంటుంది. అంతేకాకుండా ముందు ముందు ఏదైనా ఒక అశుద్ధ సంకల్పం చేసినా, వ్యర్ధసంకల్పం చేసినా దానికి ప్రత్యక్ష శిక్షలు కూడా అనుభవం చేసుకుంటారు. ఎందుకంటే మీరు వ్యర్థ సంకల్పాలు చేస్తున్నారు. సంకల్పం కూడా ఒక ఖజానా కదా! ఖజానాను వ్యర్థంగా పోగొట్టుకుంటే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ధనం కూడా ఒక ఖజానా. దీనిని వ్యర్థంగా పోగొట్టుకునే వారి ఫలితం ఎలా ఉంటుంది? దివాళా తీసేస్తారు కదా! మీ శ్రేష్ట సంకల్పాలు కూడా ఒక ఖజానా. వీటిని వ్యర్థంగా పోగొట్టుకుంటూ బాబా ద్వారా ఏదైతే వారసత్వం లభిస్తుందో ఆ ప్రాప్తిని అనుభవం చేసుకోలేకపోతున్నారు. ఎవరైనా దివాళా తీస్తే వారి గతి ఎలా ఉంటుంది! అలాగే మీ స్థితి కూడా అలాగే అయిపోతుంది. అందువలన ఇప్పుడు ఏదైతే సమయం నడుస్తుందో దీనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు యాత్రికులు నడుస్తూ, నడుస్తూ ఇప్పుడు మీ ఉన్నత గమ్యానికి చేరుకోవాలి. ఉన్నత గమ్యానికి చేరుకునేటప్పుడు అడుగు అడుగుపై కూడా చాలా ధ్యాస పెట్టుకోవాలి. ప్రతి అడుగులో కూడా పరిశీలించుకోవాలి. ఒకవేళ ఒక అడుగులోనైనా మీకు ధ్యాస లేకపోతే ఫలితం ఏమి వస్తుంది? ఉన్నతంగా వెళ్ళటానికి బదులు క్రిందికి పడిపోతారు. కనుక వర్తమాన సమయంలో మీకు ఇంత ధ్యాస ఉందా లేక సోమరిగా ఉన్నారా? ఆదిలో సమయం ఎలా ఉండేది, ఇప్పుడు ఆ సమయం గడిచిపోయింది. అప్పుడు సమయానుసారం పరిస్థితుల సమయంలో బాబా దయాహృదయుడుగా అయ్యి ఏదోక సహయోగాన్ని ఇస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు అది కూడా సమాప్తి అయ్యే సమయం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక బాబా దయాహృదయులుగా కూడా ఉండరు. ఇప్పటి వరకు దయాహృదయుడు ఆత్మలపై దయ చూపిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు దయారూపం కాదు. కనుక ఇప్పుడు పిల్లలు ఉన్నత గమ్యానికి వెళ్ళాలి. కనుక చాలా జాగ్రత్తగా ఉంటూ స్వయంపై స్వయం దయ చూపించుకోవాలి. ఏది చేసినా పర్వాలేదు. బాబా దయాహృదయుడు కదా అని అనుకోకండి. కానీ ఇప్పుడు బాబా ఒక పొరపాటు చేస్తే ఆ పొరపాటుకి వేల రెట్లు శిక్ష విధించే సమయం వచ్చేస్తుంది. ఒక పొరపాటుకి వేల రెట్లు శిక్ష యొక్క కర్మల ఖాతా పూర్తి చేసుకోవాలి. అందువలన ఇప్పుడు కొద్దిగా కూడా పొరపాటు చేసే సమయం కాదు. అడుగు అడుగులో జాగ్రత్తగా ఉంటూ అడుగు అడుగులో కోట్ల సంపాదన చేసుకుంటూ కోట్లాధిపతిగా అవ్వండి. మీ పేరే కోటానుకోట్ల భాగ్యశాలి ఆత్మలు కదా! ఎటువంటి పేరుయో అటువంటి కర్మ ఉండాలి. కనుక ప్రతి అడుగులో కోట్ల సంపాదనచేసుకునే పదమాపతిగా అయ్యారా? ఒకవేళ పదమాపతిగా కాకపోతే పదమాపద భాగ్యశాలి అని ఎలా అంటారు? కనుక ఒక అడుగు కూడా కోట్ల సంపాదన లేకుండా వేయకూడదు. కనుక ఇలా పరిశీలించుకుంటున్నారా లేదా ఆ అడుగు వ్యర్ధం అయిపోయిన తర్వాత మీకు తెలివి వస్తుందా? అందువలన బాబా మొదటే జాగ్రత్త ఇప్పిస్తున్నారు. అంతిమ స్వరూపం - శక్తి స్వరూపం. బాబా యొక్క అంతిమ రూపం - దయారూపం కాదు. శక్తిరూపం అంటే సదా సంహారి రూపాన్ని చూపిస్తారు కదా! కనుక ఇప్పుడు సంహారం చేసే సమయం కూడా సమీపంగా వస్తుంది. ఈ సంహారి సమయంలో బాబా దయాహృదయుడుగా అవ్వరు. సంహారి సమయంలో సంహారి రూపాన్నే ధారణ చేస్తారు. అందువలన ఇప్పుడు బాబా యొక్క దయాహృదయ పాత్ర కూడా సమాప్తి కానున్నది. బాబా తండ్రి సంబంధంతో పిల్లల సోమరితనం, అల్లరి చూస్తూ కూడా ముందుకు తీసుకువెళ్ళారు. కానీ ఇప్పుడు ఏదోక రకంగా పావనంగా చేసి ఇంటికి తీసుకువెళ్ళే సద్గురువు పాత్రలోకి వచ్చారు. ఎలా అయితే తండ్రి పిల్లలు సోమరితనంతో ఉన్నా, అలరి చేస్తున్నా ప్రేమతో చెప్తూ నడిపిస్తారు. అది తండ్రి రూపం. సద్గురువు రూపం కాదు. కానీ సద్గురువు అంటే సత్య సంకల్పం, సత్య మాట. సత్య కర్మను తయారుచేసేవారు. ఇది జ్ఞానం ద్వారా అయినా, పురుషార్థం ద్వారా అయినా తయారుచేస్తారు లేదా ఇలా కూడా తయారు కాకపోతే శిక్షలు విధించి అయినా తయారుచేస్తారు. సద్గురువు అంటే అల్లరి, సోమరితనం చూడరు. కనుక ఇప్పుడు సమయాన్ని, బాబా యొక్క రూపాన్ని తెలుసుకోండి. బాబా యొక్క ఈ అంతిమ రూపాన్ని తెలుసుకోకుండా మీ చిన్నతనం యొక్క సోమరితనంలోకి వచ్చేసి స్వయాన్ని మోసం చేసుకోకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు శక్తులు తమ సంహారి రూపాన్ని ధారణ చేయాలి. అసురీ సంస్కారాలను శక్తులు ఎదుర్కున్నట్లుగా చూపిస్తారు కదా! అసురీ సంస్కారాలు శక్తుల ఎదురుగా కళ్ళెత్తి కూడా చూడకూడదు. అటువంటి సంహారి రూపంగా అయ్యి స్వయంలో అసురీ సంస్కారాల సంహారం చేయండి. అలాగే ఇతరుల సంస్కారాలను కూడా సంహరించే సంహారిమూర్తిగా అవ్వండి. ఇంత ధైర్యం ఉందా? భలే మీరు మాత రూపంలో దయాభావంతో ఉంటారు. కానీ శక్తి రూపంలో దయ ఉండదు. ఇప్పటివరకు మాతగా అయ్యి చాలా పాలన చేసారు. మాత ముందు పిల్లల అల్లరి కనిపిస్తుంది, కానీ శక్తుల ముందు సోమరితనంగా ఉండేవారికి వచ్చే ధైర్యమే ఉండదు. కనుక ఇప్పుడు స్వయం సంహారి అవ్వండి.అసురీ సంస్కారాలు, సంకల్పాలు మీ ముందు నిలవకూడదు. ఇటువంటి వారినే దృష్టితో అసుర సంహారం చేసేవారు అని అంటారు. మరి ఈ సంకల్పాలను పరివర్తన చేసుకోవటంలో ఎంత సమయం పడుతుంది? సెకను పట్టాలి. దృష్టి ద్వారా అద్భుతం చేయటంలో ఎంత సమయం పడుతుంది? ఒక సెకను. కనుక దృష్టి ద్వారా అసురీలను సంహరించేవారిగా అంటే ఒక్క సెకనులో అసురీ సంస్కారాలను సంహారం చేసేవారిగా అయ్యారా? లేదా అసురీ సంస్కారాలకు వశీభూతం అయిపోతున్నారా? అసురీ సంస్కారాలకు వశీభూతం అయ్యేవారిని ఏ సాంప్రదాయంలోకి లెక్కిస్తారు? మీరందరు ఎవరు? ఈశ్వరీయ సాంప్రదాయం వారు కదా! ఈశ్వరీయ సాంప్రదాయం వారి దగ్గరకు అసురీ సాంప్రదాయం వారు రాకూడదు. మరి అప్పుడప్పుడు ఈ సంస్కారాలు వస్తున్నాయా లేదా భస్మం చేసేసారా? పిల్లలు వస్తున్నాయి అని చెప్తున్నారు. ఎలా తయారవుతున్నారు? మీ రూపాన్ని మార్చి బహురూపిగా అయిపోతున్నారా? ఇప్పుడిప్పుడే ఈశ్వరీయ సాంప్రదాయం, ఇప్పుడిప్పుడే ఆసురీ సాంప్రదాయానికి వశమైపోతున్నారా? ఎలా అవుతున్నారు? బహురూపి అయిపోతున్నారా? ఒకవేళ మీ యొక్క అసురీ సంస్కారాలను భస్మం చేసుకునే ధైర్యం పెట్టుకోకపోతే సంహారిమూర్తిగా ఎలా అవుతారు? కనుక ధైర్యం పెట్టుకుని సంహారి రూపంగా అయ్యేవారికి శుభాకాంక్షలు. ఇప్పుడు సూక్ష్మశిక్షలతో పాటు వెనువెంట స్థూలశిక్షలు కూడా అనుభవించాల్సి ఉంటుంది. కనుక ఇప్పుడు ఇది కూడా ధ్యాస పెట్టుకోండి. సూక్ష్మశిక్షయే కదా లోపల అనుభవించేయవచ్చు అని అనుకోకండి. సూక్ష్మశిక్షలు, స్థూలశిక్షలు ఈ రెండు కూడా అనుభవం అవుతాయి. సూక్ష్మశిక్షలు సూక్ష్మంగా లభిస్తూ ఉంటాయి, కానీ స్థూల శిక్షలు స్థూలంగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా రోజు రోజుకి శిక్షలు పెరిగిపోతాయి. ఈశ్వరీయ మర్యాదలకు వ్యతిరేకంగా ఏదైనా ఒక అమర్యాద కర్తవ్యం చేస్తే మర్యాదను ఉల్లంఘించారు. కనుక ఆ మర్యాదను ఉల్లంఘించిన దానికి,అమర్యాదగా ప్రవర్తించిన దానికి స్థూలశిక్షలు కూడా అనుభవించాల్సి ఉంటుంది. అప్పుడు ఏమౌతుంది? మీ దైవీ పరివారం యొక్క సంబంధం నుండి, సంపర్కం నుండి, వర్తమాన సమయం సంపత్తి ఖజానా నుండి వంచితం అయిపోతారు. అందువలన ఇప్పుడు చాలా ఆలోచించి అర్థం చేసుకుని అడుగు వేయండి. ఇటువంటి నియమాలు శక్తుల ద్వారా స్థాపన కానున్నాయి. కనుక మొదటే జాగ్రత్తగా ఉండాలి, మాకు తెలియదు ఇది క్రొత్త విషయం అనకండి. మొదటే చెప్తున్నాను- సూక్షశిక్షలతో పాటు స్థూల శిక్షలు కూడా ఉంటాయి. సూక్ష్మ నియమాలతో పాటు స్థూల నియమాలు కూడా ఉంటాయి. ఎలాంటి పొరపాటు చేసారో దాని అనుసారంగా పొరపాటుకి సంబంధించిన శిక్ష కూడా ఉంటుంది. అందువలన నియమ రూపకర్తలుగా అవ్వండి. కానీ నియమాన్ని ఉల్లంఘించేవారిగా అవ్వకండి. ఒకవేళ నియమ రూపకర్తలుగా అయ్యి ఉండి నియమాన్ని ఉల్లంఘిస్తే నియమ పూర్వక రాజ్యానికి అధికారిగా ఎలా అవుతారు? స్వయమే నియమపూర్వకంగా నడవనప్పుడు వారు నియమపూర్వక రాజ్యాన్ని ఎలా నడిపిస్తారు? అందువలన ఇప్పుడు స్వయాన్ని నియమ రూపకర్తగా భావించి ప్రతి అడుగు నియమస్వరూపంగా వేయండి. అంటే బాబా శ్రీమతానుసారం వేయండి.మన్మతాన్ని మిక్స్ చేయకండి. బాబా శ్రీమతాన్ని మార్చేసి మన్మతాన్ని కలిపేస్తే మీరు మాయకు వశం అయిపోతారు. మాయకు వశమై మన్మతాన్నే శ్రీమతంగా భావిస్తున్నారు. అందువలనే పరిశీలనా శక్తిని ఉపయోగించండి. పరిశీలించటంలో తేడా వస్తే నష్టపోతారు.అందువలన ఎక్కడైనా ఒకవేళ స్వయం పరిశీలన చేసుకోకపోయినా నిమిత్తమైన శ్రేష్టాత్మల చేత చేయించుకోండి. ఇది శ్రీమతమా లేదా మన్మతమా అని శ్రేష్టాత్మల చేత పరిశీలన చేయించుకోండి. అప్పుడు ప్రత్యక్షంలోకి తీసుకురండి. ఈ విధంగా లా ఫుల్ మరియు లవ్ ఫుల్ రెండు వెనువెంట ఉంచుకుని నడిచే ఆత్మలకు బాప్ దాదా యొక్క నమస్తే.