09.05.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


మీ యొక్క ముఖకవళికల ద్వారా భవిష్యత్తుని సాక్షాత్కారం చేయించండి.

అందరు సదా స్నేహి ఆత్మలేనా? ఎలా అయితే బాప్ దాదా సదా పిల్లల యొక్క స్నేహి, సహయోగి అన్ని రూపాలతో, అన్ని విధాలుగా సదా స్నేహిగా, సహయోగిగా ఉంటారో అలాగే పిల్లలు కూడా అన్ని రూపాలతో, అన్ని పద్ధతులతో సదా బాబా సమానంగా సదా స్నేహిగా, సహయోగిగా ఉంటున్నారా? సదా స్నేహి లేదా సదా సహయోగి అంటే ఒక్క సెకను కూడా బాబాతో స్నేహం తెగిపోకూడదు.ఒక్క సంకల్పం కూడా బాబా యొక్క సహయోగం లేకుండా ఉండకూడదు. ఇలా స్వయాన్ని స్నేహిగా మరియు సహయోగిగా అనుభవం చేసుకుంటున్నారా? బాప్ దాదా స్నేహం యొక్క ఋజువుని లేదా ప్రత్యక్షతను చూపించాలి. పిల్లలు బాబా సమానంగా బాబా యొక్క స్నేహానికి ఋజువు లేదా ప్రత్యక్ష ప్రమాణం చూపిస్తున్నారు కదా? స్నేహి ఆత్మ యొక్క స్నేహం ఎప్పుడు దాగదు. ఎవరు ఎంతగా తమ స్నేహాన్ని దాచాలనుకున్నా స్నేహం ఎప్పుడు గుప్తంగా ఉండదు. స్నేహం ఏదోక రూపంలో, ఏదోక కర్తవ్యంలో ముఖం ద్వారా తప్పకుండా కనిపిస్తుంది. కనుక మీ ముఖాన్ని దర్పణంలో చూసుకోండి - నా ముఖం ద్వారా బాబా స్నేహం యొక్క మూర్తి కనిపిస్తుందా? అని. ఎలా అయితే స్థూల దర్పణంలో మీ యొక్క ముఖాన్ని చూసుకుంటారు కదా! అలాగే రోజు అమృతవేళ సూక్ష్మ దర్పణంలో స్వయాన్ని చూసుకుంటున్నారా? ఎలా అయితే ప్రతి ఆత్మయొక్క లక్షణాల ద్వారా వారి లక్ష్యం తెలుస్తుంది. ఎందుకంటే ఎటువంటి లక్ష్యమో అటువంటి లక్షణాలు ఉంటాయి. కనుక లక్ష్యం అనేది దర్పణం. కనుక లక్ష్యం ద్వారా లక్షణాలు ప్రత్యక్షం అవుతాయి. కనుక మీ లక్ష్యం ద్వారా లక్షణాలను ఎంత వరకు ప్రత్యక్ష రూపంలో చూపిస్తున్నారు? ఇది స్వయాన్ని పరిశీలించుకుంటున్నారా? ఆత్మ యొక్క లక్షణాల ద్వారా అయినా ఆ ఆత్మ యొక్క భవిష్యత్తు కనిపిస్తుంది. ఉపన్యాసం ద్వారా ముఖకవళికలు తెలియటం ఇది వేరే విషయం. కానీ మీ యొక్క ముఖకవళికల ద్వారా మీ యొక్క భవిష్యత్తు కనిపించాలి. ఇది అలౌకిక ఆత్మల అలౌకికత. ఇలా నా ముఖకవళికలు తయారయ్యాయా? అని దర్పణంలో చూసుకుంటున్నారా! ఎలా అయితే స్థూల ముఖాన్ని శృంగారించుకొని అద్దంలో చూసుకుంటారు కదా! అయితే ఆ స్థూల ముఖాన్ని శృంగారించుకునేటప్పుడు కూడా విశేషంగా బిందువుపై అంటే తిలకంపై ధ్యాస పెడతారు. అలాగే ఎవరైతే బిందురూప స్థితిలో స్థితులవుతారో అంటే ఎవరైతే ఈ ధారణలతో స్వయాన్ని శృంగారించుకుంటారో, ఇలా శృంగారించబడిన మూర్తి వైపు అందరి ధ్యాస స్వతహాగానే వెళ్తుంది. మస్తకంలో ఆత్మ బిందువు వైపు అందరి ధ్యాస వెళ్తుంది. అలాగే ఏ ఆత్మ మీ సన్ముఖంలోకి వచ్చినా, మీ యొక్క అవినాశి తిలకం వైపు ఆకర్షితం అవ్వాలి. అది ఎప్పుడు అవుతుంది? మీరు స్వయం తిలకధారులుగా ఉండాలి. మీరు స్వయమే తిలకధారులుగా కాకపోతే ఇతరులకు కూడా మీ యొక్క అవినాశి తిలకాన్ని చూపించలేరు. ఎలా అయితే బాబా పిల్లల పట్ల ఇంత స్నేహం ఉన్న కారణంగా మొత్తం సృష్టిలో ఆత్మలు పిల్లలైనప్పటికీ బాబా మీ పట్లే ప్రీతి యొక్క రీతిని నిలుపుకుంటున్నారు. ప్రీతి బుద్ధిగా అవుతున్నారు. ఇలా ప్రీతి యొక్క రీతిని నిలుపుకునే మీకు, ఇతరాత్మలకు కూడా అల్పకాలిక సుఖ, శాంతులు ప్రాప్తిస్తున్నాయి. కానీ మీకు బాబా ద్వారా మొత్తం విశ్వం యొక్క సర్వ సుఖాలు సదాకాలికంగా ప్రాప్తిస్తున్నాయి. ఆత్మలందరినీ బాబా ముక్తిధామంలో కూర్చోపెట్టి ప్రీతి యొక్క రీతిని నిలుపుకునే మీకు ఈ విశ్వరాజ్యభాగ్యాన్ని ఇస్తున్నారు. ఇటువంటి స్నేహి పిల్లలకు సర్వ సంబంధాల ద్వారా సర్వ ప్రాప్తుల యొక్క పాత్ర ఉంటుంది. ఇక ఏ పిల్లలకు ఇటువంటి పాత్ర ఉండదు. ఇలా బాబా యొక్క ప్రీతిని నిలుపుకునే పిల్లల గుణాలు బాబా రాత్రి, పగలు పాడుతూ ఉంటారు. ఎవరితో అతి స్నేహం ఉంటుందో, ఆ స్నేహం కొరకు అన్నీ తొలగించి అన్నీ అర్పితం చేస్తారు కదా! ఇదే స్నేహానికి ప్రత్యక్షత. కనుక సదా సహయోగి, స్నేహి పిల్లలకు బాబా సర్వ ప్రాప్తులు ఇస్తున్నారు. మిగతా ఆత్మలందరిని ముక్తిధామంలో ఉంచుతున్నారు. ఎలా అయితే బాబా స్నేహానికి ప్రత్యక్ష ఋజువు చూపిస్తున్నారో అలాగే స్వయాన్ని కూడా అడగండి - సర్వ సంబంధాలు, సర్వ ఆకర్షణలు, సర్వ వస్తువులకు నేను అతీతంగా అయ్యి బాబాతో బుద్ధిని జోడించగలుగుతున్నానా? సర్వ రూపాలతో, సర్వ సంబంధాలతో బాబాకి అర్పణ అయ్యానా? ఇది పరిశీలించుకోండి. బాబా కర్తవ్యం తప్ప ఒక్క సెకను కూడా ఏ వ్యర్థ కార్యంలో మనం సహయోగిగా కాకూడదు. స్నేహం ఉంది అంటే మీకు యోగం తప్పకుండా ఉంటుంది.యోగం ఉంది అంటే సహయోగిగా కూడా అవుతారు. ఎక్కడ యోగం ఉంటుందో అక్కడ సహయోగం ఉంటుంది. కనుక ఒక్క బాబాతో యోగం ఉండాలి,సహయోగిగా కూడా ఉండాలి మరియు ఒకే బాబా వెంట ఉండాలి. యోగి అంటే సహయోగి.సహయోగం ద్వారానే యోగం కనిపిస్తుంది. యోగం ద్వారా సహయోగం కనిపిస్తుంది. కనుక ఏదైనా వ్యర్థ కార్యంలో సహయోగి అవుతున్నారు అంటే మీరు బాబా సహయోగి అయినట్లా? మొట్టమొదట మీరు చేసిన ప్రతిజ్ఞను సదా స్మృతిలో ఉంచుకోండి. ప్రతి కర్మ చేస్తూ భక్తిలో వలె అక్కడక్కడ పిల్లలు కూడా బాబాని మోసం చేయటం లేదు కదా! భక్తులు భగవంతుడుని అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి మోసం చేస్తూ ఉంటారు. మరి మీరు కూడా అలా బాబాని మోసం చేయటం లేదు కదా? ఒకవేళ అంతా నీదే అని చెప్పి నాది అని భావిస్తున్నారంటే మోసం చేసినట్లే కదా! చెప్పటం ఒకటి, చేయటం ఒకటి చేస్తున్నారని అంటే బాబాని మోసం చేసినట్లే కదా! తనువు, మనస్సు, ధనం అన్నీ నీవే బాబా అంటున్నారు. మరి బాబావి అయిపోయినప్పుడు మీ అధికారం ఎక్కడి నుండి వచ్చింది? మరి వాటిపై మీకు అధికారం లేనప్పుడు మీ మన్మతానుసారం వాటిని ఎలా ఉపయోగించగలుగుతున్నారు? కనుక సంకల్పాన్ని, సమయాన్ని, శ్వాసను, జ్ఞానధనాన్ని, స్థూలధనాన్ని ఒకవేళ ఏ ఖజానాను అయినా మన్మతంతో వ్యర్థంగా పోగొట్టి బాబాని మోసం చేయటం లేదు కదా అని పరిశీలించుకోండి. జన్మజన్మల యొక్క సంస్కారానికి మీరు వశం అయిపోతున్నారు. మీకు ఏ విషయం అయితే ఇష్టమనిపించటం లేదో నాకు ఇష్టం కానీ వస్తువు బాబాకి ఎందుకు ఇష్టమనిపిస్తుంది అనుకోండి. స్నేహికి ఏది ఇష్టమో ఆ వస్తువే ఇస్తారు కదా! కనుక బాబా యొక్క ప్రీతిని నేను ఎంత నిలపెట్టుకుంటున్నాను? అని స్వయాన్ని అడగండి. స్వయాన్ని ఉన్నతోన్నతమైన ఆత్మలుగా, పవిత్ర ఆత్మలుగా భావించి నడుస్తున్నారా? ఉన్నతమైన ఆత్మలు అంటే వారి ఒకొక్క మాట, ఒకొక్క కర్మ ఎంత ఉన్నతంగా ఉంటుంది అంటే బాబా సమానంగా ఉన్నతంగా ఉంటుంది. బాబా యొక్క మహిమ మీరు పాడతారు కదా! బాబా పేరు ఉన్నతం, ధామం ఉన్నతం, బాబా పని ఉన్నతం అని. మరి ఉన్నతంగా ఉండే ఆత్మలు కూడా ఎలా ఉండాలి? ఉన్నతమైన పేరుతో ఉన్నతమైన ధామంలో, ఉన్నతమైన పనిలో తత్పరులై ఉండాలి. ఏ నీచ కర్మ చేయకూడదు. మహాన్ ఆత్మగా అయ్యేవారు ఎప్పుడు ఎవరి ముందు తల వంచరు. వారి ముందు అందరు వంగుతారు. వారినే మహానాత్మ అంటారు. ఈ రోజుల్లో మహానాత్మలు చాలా మంది ఉన్నారు. కానీ మీరు వారి కంటే మీరు చాలా మహాన్, శ్రేష్ట ఆత్మలు. బాబా ఎన్నుకున్న ఆత్మలు, విశ్వరాజ్యా ధికారి ఆత్మలు, బాబా యొక్క వారసత్వానికి అధికారి ఆత్మలు, విశ్వకళ్యాణకారులు. అలాంటి ఆత్మలు ఎక్కడైనా, ఏ పరిస్థితిలో అయినా మాయ యొక్క రకరకాల ఆకర్షణలకు, రూపాలకు వంగుతారా? ఈరోజుల్లో మహానాత్మలు అనబడేవారు కూడా మీ మహానాత్మలను కాపీ చేసారు. వారు ఎప్పుడు ఎవరి ముందు తల వంచరు. అందరు వారి ముందు తల వంచుతారు. అలాగే మీరు కూడా శ్రేష్టాత్మలు కనుక ఎవరి ముందు తల వంచకూడదు. ఎలాంటి మాయా ఫోర్స్ వచ్చినా మీరు ఒంగకూడదు. మాయను వంగింపచేసుకునేవారిగా కావాలి. కానీ అక్కడక్కడ మాయకు ఒంగిపోతూ ఉండకూడదు. ఇప్పటి నుండి సదా ఒంగింప చేసుకునే స్థితిలో ఉండండి. ఈ శ్రేష్ట సంస్కారం మీలో నింపుకున్నప్పుడే ఉన్నతమైన పదవి పొందుతారు. అప్పుడు సత్యయుగంలో మీకు ప్రజలు స్వమానంతో తల వంచుతారు. ద్వాపరయుగంలో భక్తులు తల వంచుతారు. ఇక్కడ మీరు మాయ ముందు వంగే సంస్కారాన్ని సమాప్తి చేసుకోకపోతే కొద్దిగా అయినా మీరు వంగుతూ ఉండే సంస్కారాన్ని ఉంచుకుంటే, మీరు అక్కడ కూడా వంగుతూ ఉంటారు. కనుక ఏమి లక్ష్యం పెట్టుకోవాలి? మనం మాయకు వంగకూడదు, అందరిని వంగింప చేసుకోవాలి. మీరు రచించుకున్న పరిస్థితి ముందే మీరు ఒంగిపోతున్నారు అంటే ఎవరు ఉన్నతులు, పరిస్థితియా లేక మీరా? మీరు ఎప్పటి వరకు ఉన్నతులుగా కారో అప్పటి వరకు పవిత్రులుగా కూడా కారు. మీ భవిష్య స్మృతి చిహ్నాలలో సంపూర్ణ నిర్వికారులు అని మహిమ ఉంది కదా! అందుకే మిమ్మల్ని పవిత్రులు అంటే హోలీయస్ట్ అని అంటారు. సంపూర్ణ నిర్వికారులు అంటే ఏ వికారం యొక్క శాతం మీకు ఉండకూడదు. ఏ వికారం మిమ్మల్ని ఆకర్షితం చేయకూడదు, దానికి వశీభూతం కాకూడదు. ఒకవేళ కలలో అయినా, ఏదైనా వికారానికి అయినా వశం అయితే, ఏ శాతంలోనైనా వశం అయితే సంపూర్ణ నిర్వికారి అని అంటారా? ఒకవేళ స్వప్నదోషంగా అయినా, సంకల్పంలో అయినా వికారాలకు వశీభూతం అయితే మిమ్మల్ని సంపూర్ణ నిర్వికారి అని అనరు. ఇలా సంపూర్ణ పవిత్రులుగా, నిర్వికారులుగా స్వయాన్ని తయారు చేసుకుంటున్నారా? లేదా చివరిలో తీవ్రంగా వెళ్ళి స్థితిని తయారు చేసేసుకుంటాము అని అనుకోకండి, కానీ అలా జరుగదు. చాలా సమయానికే మహిమ ఉంది.కనుక మీ స్థితిని ఉన్నతంగా మరియు పవిత్రంగా తయారుచేసుకోండి. ఏ సంకల్పం చేస్తున్నా, ఏ కర్మ చేస్తున్నా ఎటువంటి ఉన్నతమైన పేరో అటువంటి ఉన్నతమైన పని చేస్తున్నానా? అని పరిశీలించుకోండి. ఒకవేళ పేరు ఉన్నతంగా, పని నీచంగా ఉంటే ఏమౌతుంది? మీరు చెడు పేరు తీసుకువచ్చినట్లే కదా! అలాంటి పని చేయటం లేదు కదా? కనుక ఇటువంటి లక్ష్యం పెట్టుకుని లక్షణాలను మీలో ధారణ చేయండి. ఇతరులకు జ్ఞానానికి విరుద్ధంగా ఏ వస్తువునైనా స్వీకరిస్తే మిమ్మల్ని జ్ఞాని అనరు అజ్ఞాని అంటారు అని ఇతరులకు చెప్తారు కదా! ఒకసారి ఏదైనా నియమాన్ని ఎవరైనా పూర్తిగా పాలన చేయకపోతే వారిని మీరు జ్ఞానానికి విరుద్ధంగా చేస్తున్నారు అని అంటారు కదా! అది మీరు స్థూలమైన నియమం గురించి చెప్తారు. కానీ సూక్ష్మంగా స్వయాన్ని పరిశీలించుకోండి. మీరు సాధారణ సంకల్పం చేస్తున్నారు అంటే మీరు ఉన్నత ఆత్మలా? కనుక మీ సంకల్పం కూడా సాధారణంగా ఉండకూడదు. ఇలా మీ సంకల్పం శ్రేష్టంగా అయిపోతే కర్మ కూడా శ్రేష్టంగా అయిపోతుంది. కనుక ఇలా స్వయాన్ని ఉన్నతంగా, పవిత్రంగా మరియు సంపూర్ణ నిర్వికారిగా తయారు చేసుకోండి. మీలో వికారాల యొక్క గుర్తులు కూడా ఉండకూడదు. ఇక వికారాల గుర్తులు లేనప్పుడు మీకు ఎలా వస్తాయి? ఎలా అయితే భవిష్యత్తులో వికారాల యొక్క గుర్తులు కూడా ఉండవో అలాగే స్వయం ఉన్నతోన్నంగా మరియు పవిత్రంగా తయారవ్వండి. అప్పుడు ఈ సంస్కారం అనేక జన్మలు నడుస్తుంది. ఇలా ఉన్నతమైన పేరు మరియు ఉన్నతమైన పని చేసే పిల్లలకు బాప్ దాదా యొక్క నమస్తే. మంచిది.