24.05.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


పరివర్తనకు ఆధారం - ధృడసంకల్పం.

ఈ రోజు బాప్ దాదా సర్వ పురుషార్థి పిల్లలను చూసి చాలా సంతోషిస్తున్నారు ఎందుకంటే బాబాకి తెలుసు ఈ శ్రేష్టాత్మలే సృష్టి పరివర్తనకు నిమిత్తులు అని. ఒకొక్క శ్రేష్టాత్మ నెంబర్‌వారీగా ఎంత అద్భుతం చేస్తుంది! వర్తమాన సమయంలో ఎవరిలో, ఏదైనా లోపం ఉన్నా, బలహీనంగా ఉన్నా కానీ భవిష్యత్తులో ఈ ఆత్మలే ఎలా ఉన్నవారు ఎలా అవుతారు, ఎలా తయారు చేస్తున్నారు అని భవిష్యత్తుని చూసి, మనందరి సంపూర్ణ స్థితిని చూసి సంతోషపడుతున్నారు. బాబా అందరి కంటే ఉన్నతోన్నతమైన' గారడీ చేసేవారు కదా! ఎలా అయితే గారడీ చేసేవారు కొద్ది సమయంలోనే చాలా విచిత్రమైన ఆటలు చూపిస్తారు కదా! అలాగే మీరందరు కూడా ఆత్మిక గారడీ చేసేవారు. కనుక మీ ఆత్మీయత అనే శక్తితో విశ్వాన్ని పరివర్తన చేసేవారు. డబుల్ కిరీటధారిగా తయారు చేసేవారు. ఎంత పెద్ద కార్యం అంటే స్వయాన్ని మార్చుకునేవారు మరియు విశ్వాన్ని పరివర్తన చేసేవారు. ఇదంతా ఒకే ధృడసంకల్పంతో చేస్తున్నారు. ఒకే ధృడసంకల్పంతో మిమ్మల్ని మీరు కూడా మార్చుకుంటున్నారు. ఆ ధృడసంకల్పం ఏమిటి? ఆ ఒక్క సంకల్పంతో అనేక జన్మల విస్మృతి సంస్కారం స్మృతి నుండి తొలగిపోతుంది. ఆ ఒక్క సంకల్పం ఏమిటి? అది ఒక సెకను యొక్క విషయం. దాని ద్వారా స్వయాన్ని పరివర్తన చేసుకున్నారు. ఒకే సెకను యొక్క మరియు ఒకే సంకల్పం ధారణ చేసారు. అది ఏమిటి? నేను ఆత్మను ఈ సంకల్పాన్ని ఎప్పుడైతే ధారణ చేసారో అప్పుడు ఆత్మ యొక్క సంబంధం, ఆత్మ యొక్క పాత్ర, ఆత్మ యొక్క గుణాలు అందరికి తెలిసాయి. నేను ఆత్మను ఈ ధృడసంకల్పం ద్వారానే అన్ని విషయాలలో పరివర్తన తీసుకువచ్చారు. ఈ ఒక్క ధృడసంకల్పమే స్వయాన్ని పరివర్తన చేసింది, విశ్వాన్ని కూడా పరివర్తనలోకి తీసుకువచ్చింది. స్వయాన్ని పరివర్తన చేసే సంకల్పం - నేను ఆత్మను అలాగే విశ్వాన్ని పరివర్తన చేసే ధృడసంకల్పం - మేమే విశ్వ ఆధారమూర్తులం. అంటే విశ్వకళ్యాణకారులం. ఈ సంకల్పాన్ని ధారణ చేయటం ద్వారానే విశ్వకళ్యాణం యొక్క కర్తవ్యంలో సదా తత్పరులై ఉంటున్నారు. కనుక మీరు ఒకే సంకల్పంతో స్వయాన్ని మరియు విశ్వాన్ని మార్చేస్తున్నారు. అటువంటి గారడీ చేసేవారు మీరు. గారడి చేసేవారు అల్పకాలికంగా వస్తువులను పరివర్తన చేసి చూపిస్తారు కదా! మీరు ఆత్మిక గారడీ చేసేవారు, అవినాశి పరివర్తన,అవినాశి ప్రాప్తిని ఇచ్చేవారు. కనుక మీ యొక్క ఈ శ్రేష్ట కర్తవ్యాన్ని ఎదురుగా పెట్టుకుని ప్రతి సంకల్పం, కర్మ చేయండి. అప్పుడిక సంకల్పం, కర్మ వ్యర్ధంగా పోదు. నడుస్తూ, నడుస్తూ పాత శరీరం మరియు పాత ప్రపంచంలో ఉంటూ మీ యొక్క శ్రేష్ట కర్తవ్యాన్ని మీరు మర్చిపోతున్నారు. అందువలనే అనేక రకాలైన పొరపాట్లు జరుగుతున్నాయి. స్వయాన్ని మర్చిపోవటం కూడా పొరపాటే కదా! ఎవరైతే తమని తాము మర్చిపోతారో వారు అనేక పొరపాట్లు చేయటానికి నిమిత్తం అవుతారు. అందువలన మీ కర్తవ్యాన్ని సదా ఎదురుగా ఉంచుకోండి. సత్యమైన భక్తులు ఎవరైతే ఉంటారో వారు ప్రపంచం వారి దృష్టితో నాస్తికులుగా ఉంటారు, అజ్ఞానులు వికర్మ చేస్తారు. వికర్మలకు వశం అవుతారు, కానీ వారు ఆ వికర్మలకు దూరంగా ఉంటారు, ఎందుకు? సత్యమైన భక్తులు సదా తమ ఇష్టదేవతను ఎదురుగా పెట్టుకుంటారు. వారి ఎదురుగా తమ ఇష్టదేవత ఉన్న కారణంగా అన్ని విషయాలలో రక్షణగా ఉంటారు మరియు కొంతమంది ఆత్మల కంటే శ్రేష్టంగా అవుతారు. భక్తులు భక్తిలో తమ ఇష్టదేవతను ఎదురుగా పెట్టుకోవటం వలన నాస్తికుల కంటే గొప్పగా, అజ్ఞానుల కంటే శ్రేష్టంగా తయారవుతారు, మరి మీరెవరు? ఙ్ఞానీ ఆత్మలు. సదా మీ యొక్క శ్రేష్ట కర్తవ్యాన్ని ఎదురుగా ఉంచుకోవటం ద్వారా మీరు ఎలా తయారవుతారు? శ్రేష్టాతి శ్రేష్టాత్మలుగా తయారవుతారు. కనుక నా కర్తవ్యం నా ఎదురుగా ఉంటుందా? అని స్వయానికి స్వయం అడగండి. మీరు చాలా సమయం నుండి మర్చిపోయే సంస్కారం ధారణ చేసిన కారణంగా ఇప్పుడు కూడా ఒకవేళ మాటి మాటికి మర్చిపోతూ ఉంటే స్మృతి స్వరూపం యొక్క నషాను, సంతోషాన్ని ఎప్పుడు అనుభవం చేసుకుంటారు? స్మృతి స్వరూపం యొక్క సుఖాన్ని, స్మృతి స్వరూపం యొక్క సంతోషాన్ని ఎందుకు అనుభవం చేసుకోలేకపోతున్నారు? దీనికి ముఖ్య కారణం ఏమిటి? అంటే మీరు ఇప్పటి వరకు అన్ని రూపాలతో నష్టోమోహ కాలేదు. నష్టోమోహ అయితే మీరు ఎంత ప్రయత్నించినా స్మృతి స్వరూపంలోకి వచ్చేస్తారు. కనుక మొదట ఎంత వరకు నష్టోమోహగా అయ్యాను, మోహాన్ని తొలగించుకున్నాను? అనేది పరిశీలించుకోండి. మాటి మాటికి దేహాభిమానంలోకి వస్తున్నారు, దేహం యొక్క మమతకు అతీతం కావటం లేదు అంటే అర్థం ఏమిటి? మీరు ఇంకా నష్టోమోహ కాలేదు. నష్టోమోహ అవ్వని కారణంగా సమయం మరియు శక్తులు ఏవైతే బాబా ద్వారా మీకు వారసత్వంగా లభిస్తున్నాయో వాటిని కూడా నష్టం చేసుకుంటున్నారు. బాబాకి పిల్లలుగా అవ్వగానే బాబా ఆస్తికి, వారసత్వానికి అధికారులుగా అయిపోయారు. అంటే బాబా నుండి అందరికి లభిస్తున్నాయి, సర్వాత్మలకు బాబా నుండి సర్వశక్తులు అనే వారసత్వం లభిస్తుంది. కానీ సర్వశక్తుల యొక్క వారసత్వాన్ని కార్యంలో ఉపయోగించటం మరియు మన యొక్క ఉన్నతిలో ఉపయోగించటం ఇది నెంబర్ వారి పురుషార్ధానుసారంగా ఉంది. స్వయానికి స్వయం వేరుగా, దూరంగా ఎందుకు భావించి నడుస్తున్నారు? సీత యొక్క ఉదాహరణ చెప్తారు కదా! సీత యొక్క కధ వినిపిస్తారు కదా! సీత సదా రామునికి సన్ముఖంగా ఉంటుంది సన్ముఖంగా అంటే స్థూలంగా ఎదురుగా ఉండటం కాదు. కానీ బుద్ధి ద్వారా సదా బాప్ దాదా యొక్క సన్ముఖంగా ఉండాలి. బాప్ దాదాకు సన్ముఖంగా ఉండటం అంటే మాయ యొక్క రావణునితో విముఖంగా ఉండటం. ఎప్పుడైతే మీరు మాయకు విముఖంగా అవుతారో అప్పుడు బాబాతో బుద్ధియోగం జోడించబడుతుంది. మాయకు సన్ముకంగా ఉన్నప్పుడు బాబాకి విముఖంగా అయిపోతారు. చాలా ప్రియమైన సంబంధం ఎవరితోనైనా పెట్టుకున్నప్పుడు వారి ఎదురుగా కూర్చోవాలి,తినాలి, త్రాగాలి వారితోనే నడవాలి ఇలా వారి తోడు యొక్క అనుభవం కోరుకుంటూ ఉంటారు కదా! మరి మీకు బాబాతో చాలా ప్రేమ ఉన్నప్పుడు సదా బాప్ దాదాకి సన్ముఖంగా ఉండలేకపోతున్నారా? ఎవరైతే సదా బాబాకి సన్ముఖంగా ఉంటారో వారే అవ్యక్తస్థితిలో ఉండగలుగుతారు. మీరు ఎందుకు దూరం అయిపోతున్నారు? ఇలా చిన్నతనం యొక్క ఆటలు ఆడుతున్నారా? చిన్న పిల్లలు తల్లి, తండ్రి పిలిస్తే దగ్గరకు వస్తారు, మరలా అల్లరి చేస్తూ, చేస్తూ తుంటరిగా అయిపోయి దూరంగా పరుగు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇది బావుంటుందా? అలాగే మీరు కూడా స్వయం బాబాకి సన్ముఖంగా ఉండటం ద్వారా సదా సర్వశక్తులతో అధికారాన్ని అనుభవం చేసుకుంటున్నారు. సర్వశక్తివంతుని యొక్క అధికారాన్ని అనుభూతి చేసుకోగలుగుతున్నారు, కానీ మరలా ఒకొక్కసారి ఆ అధికారాన్ని మర్చిపోయి మాయ యుద్ధంలోకి వెళ్ళిపోయి ఓడిపోతున్నారు. ఈ రోజుల్లో అల్పకాలిక అధికారం కలిగిన ఆత్మలు కూడా ఎంత శక్తిశాలిగా ఉంటారు! మరి మీకు ఏ అధికారం లభించింది? సర్వశక్తివంతుని అధికారం. సర్వశక్తుల ముందు ఈ అల్పకాలిక శక్తి కలిగిన ఆత్మలు తల వంచాల్సిందే. యుద్ధం చేయరు, కానీ తల వంచుతారు. యుద్ధం చేయడానికి బదులు మీకు నమస్కరిస్తారు. ఇలా స్వయాన్ని సర్వశక్తివంతుని అధికారిగా భావించి ప్రతి అడుగు వేస్తున్నారా? ఈ అధికారాన్ని స్మృతి ఉంచుకోవాలి అంటే సర్వశక్తివంతుడైన బాబాని సదా వెంట ఉంచుకోవాలి. ఈ రోజుల్లో భక్తిమార్గం వారు ఏ అధికారాన్ని ఉంచుకుంటున్నారు? శాస్త్రాల యొక్క అధికారం. వారి బుద్ధిలో సదా శాస్త్రాల యొక్క పాయింట్స్ నిండి ఉంటాయి, ఏ పని చేస్తున్నా ఎదురుగా శాస్త్రాలనే తీసుకువస్తారు. మేము ఏ కర్మ చేస్తున్నా శాస్త్ర ప్రమాణంగా చేస్తున్నాము అని చెప్తారు కదా! శాస్త్రాల యొక్క అధికారం కలిగిన ఆత్మల బుద్ధిలో ఆ శాస్త్రాల యొక్క అధికారాన్ని పెట్టుకుని వారి ఎదురుగా శాస్త్రాలను శస్త్రాలుగా పెట్టుకుని అంత అధికారంతో ఉంటున్నప్పుడు మరి మీకు ఏ అధికారం ఉంది? మీ ఎదురుగా ఎవరు ఉన్నారు? సర్వశక్తివంతుడైన బాబా ఉన్నారు. సర్వశక్తివంతుడైన బాబా ద్వారా మీకు అధికారం లభించింది. మరి వారు ఏ కార్యం చేస్తున్నా శాస్త్రాల ఆధారంగా, ఆ అధికారంతో అదే సత్యకర్మగా భావించి నడుస్తున్నారు కదా! ఎంతగా వారికి చెప్పినా వారు ఆ ఆధారాన్ని వదలటంలేదు. మాటి మాటికి మేము శాస్త్రాల ఆధారంగా చెప్తున్నాము, శాస్త్రాలు అసత్యం కాదు, శాస్త్రాలలో ఉన్నది సత్యమే కదా అని స్థిరమైన నిశ్చయంతో చెప్తారు. మరి మీరెవరు? సర్వశక్తివంతుడైన బాబా యొక్క అధికారం కలిగిన ఆత్మలు, వారు ఆ అధికారంతో సర్వ కార్యాలు చేస్తున్నప్పుడు మరి మీరు స్థిరమైన నిశ్చయంతో ఎన్ని కార్యాలు చేయాలి? ఇంత స్థిరమైన నిశ్చయం ఉందా? సదా మీ యొక్క అధికారాన్ని స్మృతి ఉంచుకోండి. ఇతరుల అధికారాన్ని చూసి మీ అధికారాన్ని మర్చిపోతున్నారా? అన్నింటికంటే శ్రేష్ట అధికారంపై నడిచేవారు. ఒకవేళ సర్వశక్తివంతుడైన బాబా ఇచ్చిన ఈ అధికారాన్ని గుర్తు ఉంచుకుంటే పురుషార్థంలో మీకు ఎప్పుడు కష్టంగా అనుభవం అవ్వదు. ఎంత పెద్ద కార్యమైనా సర్వశక్తివంతుని అధికారంతో చాలా సహజంగా అనుభవం చేసుకుంటారు. ఏదైనా కర్మ చేసే ముందు బాబా ఇచ్చిన అధికారాన్ని ఎదురుగా ఉంచుకుని ఈ కర్మ చేయాలా, వద్దా అని సహజంగా నిర్ణయించుకోవచ్చు. ఎందుకంటే మీ ఎదురుగా అధికారం ఉంది. ఆ అధికారాన్ని కేవలం కాపీ చేయాలి అంతే. కాపీ చేయటం సహజమే కదా లేదా కష్టమా? అవునా, కాదా దీనికి జవాబు బాబా ఇచ్చిన అధికారాన్ని ఎదురుగా ఉంచుకోవటం ద్వారా సహజంగానే లభిస్తుంది. ఈ రోజుల్లో వైజ్ఞానికులు మిషన్స్ తయారు చేస్తున్నారు కదా! ఆ మిషనరీ ద్వారా ఏదైనా ప్రశ్నకు సమాధానం స్వతహాగా దొరుకుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం దొరకటం ద్వారా బుద్ది నడిపించవలసిన అవసరం ఉండటం లేదు. అలాగే మీ అందరికి బాబా సర్వశక్తివంతుని అధికారాన్ని ఇచ్చారు. ఆ అధికారాన్ని ఎదురుగా పెట్టుకుంటే ఏమైనా ప్రశ్నలు వచ్చినా వాటికి జవాబు సహజంగా దొరుకుతుంది. సహజమార్గంగా కూడా అనుభవం అవుతుంది. ఇంత సహజమైన శ్రేష్ట ఆధారం మీకు లభిస్తున్నప్పటికి ఈ ఆధారం మీరు పొందకపోతే ఏమంటారు? ఇది మీ యొక్క బలహీనత. కనుక ఇప్పుడు బలహీన ఆత్మగా అవ్వటానికి బదులు శక్తిశాలి ఆత్మగా అవ్వండి. ఇతరులను కూడా శక్తిశాలిగా తయారుచేయండి. స్వయాన్ని సర్వశక్తివంతుని అధికారిగా భావించటం ద్వారా మూడు విషయాలు మీలో స్వతహాగానే ధారణ అవుతాయి. అవి ఏమిటి? ఏదైనా అధికారం ఉన్నవారిలో అంటే సాధారణ అధికారం ఉన్నవారిలో కూడా మూడు విషయాలు ఉంటాయి. ఒకటి - నిశ్చయం, రెండు - నషా, మూడు - నిర్భయత. ఈ మూడు విషయాలు అధికారం కలిగిన ఆత్మలలో ఉంటాయి. అది అయదార్థమైనప్పటికి ధృడనిశ్చయంతో చెప్తారు, ధృడనిశ్చయంతో నడుస్తారు మరియు ఎంత నిశ్చయం ఉంటుందో అంత నిర్భయంగా మరియు నషాతో ఉంటారు. అలాగే మీకు మీరు చూసుకోండి. మీరు సర్వశక్తివంతుని అధికారం పొందారు, ఇంత సర్వశ్రేష్ట అధికారం పొందిన మీకు ఎంత నషా ఉండాలి? మరియు ఎంత నిశ్చయంతో మాట్లాడాలి? తర్వాత నిర్బయత కూడా ఉండాలి. మీరు ఎక్కడైనా ఓడిపోతున్నారు అంటే నిర్భయత, నిశ్చయం, నషా లేనట్లే. ఈ మూడు విషయాలు ఉంటే మీరు ఎప్పుడైనా ఓడిపోతారా? ఓడిపోరు. సదా విజయీగా ఉంటారు. విజయం రాకపోవడానికి కారణం ఏమిటంటే - ఈ మూడు విషయాలలో ఏదోక విషయం లోపంగా ఉన్నట్లే. కనుక స్వయంలో ప్రతి అడుగులో ఎంత వరకు ఈ మూడు విషయాలను ప్రత్యక్షంలోకి తీసుకువచ్చాను? అని పరిశీలించుకోండి. మొత్తం జ్ఞానంపై, బాబాపై నిశ్చయం ఉండాలి. ఏ కర్మ చేస్తున్నా, మాట మాట్లాడుతున్నా ఈ మూడు లక్షణాలు మీలో కనిపించాలి. ఎప్పుడైతే ఈ మూడు ప్రతి మాటలో, ప్రతి కర్మలో వస్తాయో అప్పుడు ప్రతి మాట, ప్రతి కర్మ సర్వశక్తివంతుని అధికారాన్ని ప్రత్యక్షం చేస్తుంది. ఇప్పుడు స్వయాన్ని సాధారణంగా భావిస్తున్నారు. ఇప్పుడు అందరు వీరి యొక్క అధికారం సర్వశక్తివంతుని బాబా ద్వారా లభించింది అనేది అనుభవం చేసుకోలేకపోతున్నారు. ఈ అధికారాన్ని వదిలేసి మీరు ఏ కర్మ చేయకూడదు, ఏ మాట మాట్లాడకూడదు. అప్పుడు వారు కూడా మీ అధికారాన్ని అనుభవం చేసుకుంటారు. మీరు మీ అధికారాన్ని మర్చిపోతున్న కారణంగా మీ ద్వారా సాధారణ కర్మ జరుగుతుంది. కనుక ప్రజలు కూడా సాధారణతనే అనుభవం చేసుకుంటున్నారు. చివరికి ఫలితంలో ఏమంటున్నారు? మీ విశేషతలను వర్ణణ చేస్తూ మీ విశేషతలతో పాటు సాధారణతను కూడా వర్ణన చేస్తున్నారు. ఇతర సంస్థలలో కూడా ఇలానే ఉంటుంది కదా! ఇలానే చెప్తున్నారు కదా! ఇలా మిమ్మల్ని కూడా ఇతరాత్మల వలె సాధారణంగా తీసుకుంటున్నారు. ఒకటి రెండు విషయాలు మీలో సాధారణంగా కనిపిస్తున్నాయి, కానీ అలా కాదు. మీ యొక్క ప్రతి కర్మ, ప్రతి మాట విశేషంగా అనిపించాలి. మీతో ఎవ్వరిని కూడా పోల్చకూడదు. ఎందుకంటే మీకు లభించిన అధికారం ఏమిటి? సర్వశక్తివంతుని అధికారం. కనుక ఆ సర్వశక్తివంతుని అధికారం ముందు ఏదైనా నిలబడుతుందా? సర్వశక్తివంతుని పిల్లలు అంటే మీ నడవడిక సాధారణంగా ఎలా ఉంటుంది? కనుక పరమాత్మ అధికారానికి, ఆత్మల అధికారానికి రాత్రికి, పగలుకి ఉన్నంత తేడా ఉండాలి. ఇలా మీలో అంటే మీ మాట, కర్మలో ఇతరాత్మలకు, మీకు రాత్రికి, పగలుకి ఉన్నంత తేడా అనుభవం చేసుకుంటున్నారా? రాత్రికి, పగలుకి ఎంత తేడా ఉంటుంది? ఎవ్వరికి చెప్పక్కర్లేదు. స్వతహాగానే తెలిసిపోతుంది. ఇది రాత్రి, ఇది పగలు అని. అలాగే మీరు కూడా సర్వశక్తివంతుడైన బాబా ఆధారంతో ప్రతి కర్మ చేస్తున్నారు, బాబా యొక్క ప్రతి సలహా ప్రకారం నడుచుకుంటున్నారు. కనుక మీకు, ఆ ఆత్మలకు రాత్రికి, పగలుకి ఉన్నంత తేడా కనిపించాలి. ఇలా తేడా కనిపించినప్పుడే వారు అర్ధం చేసుకుంటారు. ఇది సాధారణ స్థానం కాదు, వీరిది సాధారణ జ్ఞానం కాదు అని. ఎప్పుడైతే ఇలాంటి ప్రభావం పడుతుందో అప్పుడే మీ యొక్క అధికారం ప్రత్యక్షం అవుతుంది. శాస్త్రవాదుల మాటలు ఎలా ఉంటాయి? శాస్త్రాల అధికారంతో మాట్లాడతారు. అలాగే మీ యొక్క ప్రతి మాట ద్వారా సర్వశక్తివంతుడైన బాబా యొక్క అధికారం ప్రసిద్ధం అవ్వాలి. ఇదే అంతిమ స్థితి కదా! మీ మాట ద్వారా, ముఖం ద్వారా, నడవడిక ద్వారా అందరికి బాబా మీకు ఇచ్చిన అధికారం తెలియాలి. ఈ రోజుల్లో ప్రపంచంలో చిన్న, పెద్ద అధికారం కలిగిన ఆఫీసర్స్ తమ కర్తవ్యం చేసేటప్పుడు ఎంత అధికారాన్ని కర్మలో చూపిస్తారు, వారికి ఎంత నషా ఉంటుంది? ఆ నషాతో ప్రతి కర్మ చేస్తారు. అది హద్దు యొక్క అధికారం, అది వారి కర్మ ద్వారా సాక్షాత్కారం అవుతుంది. కానీ మీకు ఇచ్చింది అలౌకిక, అవినాశి అధికారం. ఇది కూడా అందరి ముందు ప్రత్యక్షం చేయాలి.
ఇలా అధికారి బాబాను ఎదురుగా పెట్టుకుని అధికారంతో నడిచే పిల్లలకు నమస్తే..