భవిష్యత్తులో అష్టదేవతగా మరియు భక్తిలో
ఇష్టదేవతగా అయ్యే పురుషార్థం.
స్వయాన్ని సదా శివశక్తి స్వరూపంగా భావించి ప్రతి కర్మ
చేస్తున్నారా? మీ యొక్క సదా అలంకారి మరియు అష్ట భుజధారి మూర్తి మీ ఎదురుగా
వస్తుందా? అష్టభుజధారిగా అంటే అష్టశక్తులతో నిండుగా ఉండాలి. సదా మీ యొక్క
అష్టశక్తి స్వరూపం స్పష్టంగా కనిపిస్తుందా? శక్తుల యొక్క మహిమ ఏమిటంటే - శివమయి
శక్తులు, అంటే శివశక్తులు కనుక సదా శివబాబా స్మృతిలో ఉంటున్నారా? శివుడు మరియు
శక్తి రెండింటికి వెనువెంట మహిమ ఉంది. ఎలా అయితే ఆత్మ, శరీరం వెంట ఉంటాయో ఈ
సృష్టి ఉన్నంత వరకు ఆత్మ, శరీరం వేరు అవ్వవు కదా! అలాగే శివుడు మరియు శక్తి
రెండింటికి కూడా చాలా లోతైన సంబంధం ఉంది. అందువలనే మహిమ ఉంది. శివశక్తులు అని
ఇలా సదా బాబాని వెంట అనుభవం చేసుకుంటున్నారా? కేవలం మహిమయే చేస్తున్నారా? మీరు
సదా బాబా వెంట ఎలా ఉండాలంటే ఎప్పుడు ఈ తోడుని వదలకూడదు. ఈ తోడు తొలగిపోకూడదు.
ఇలా అనుభవం చేసుకుంటూ సదా శివశక్తి స్వరూపంలో స్థితులై నడిస్తే ఈ సంలగ్నతలో
ఉన్నప్పుడు మాయ ఏ విఘ్నం వేయదు. ఇద్దరు పదిమందితో సమానం అని చెప్తారు కదా! అలాగే
శివుడు మరియు శక్తులు ఇద్దరు వెంట ఉంటే ఈ శక్తి ముందు ఎవరైనా ఏదైనా చేస్తారా? ఈ
డబుల్ శక్తుల ముందు ఏ శక్తి యుద్ధం చేయలేదు. ఏ శక్తి మిమ్మల్ని ఓడింపచేయలేదు.
ఒకవేళ ఓడిపోతున్నారు లేదా మాయా యుద్ధం జరుగుతుంది, అంటే ఆ సమయంలో మీరు శివశక్తి
స్వరూపంలో స్థితులై ఉన్నట్లా? స్వయాన్ని అష్టశక్తులతో సంపన్నంగా, సంపూర్ణ
స్వరూపంలో స్థితులు చేసుకుంటున్నారా? అష్టశక్తులలో ఒక శక్తి తక్కువ అయినా
అష్టభుజధారి శక్తులు అని మీకు ఏదైతే మహిమ జరుగుతుందో అది జరుగుతుందా? కనుక సదా
స్వయాన్ని చూసుకోండి - మేము సదా అష్టశక్తిధారులుగా, శివశక్తులుగా అయ్యి
నడుస్తున్నామా? అని. ఎవరైతే సదా అష్టశక్తులను ధారణ చేస్తారో వారే అష్టదేవతలలోకి
వస్తారు. ఒకవేళ మీలో ఒక శక్తి అయినా లోపంగా అనిపిస్తుంది అంటే అష్ట దేవతలలోకి
రావటం కష్టం మరియు అష్టదేవతలే సృష్టిలో ఇష్టదేవత రూపంలో మహిమ చేయబడతారు మరియు
పూజింపబడతారు. కనుక భక్తిమార్గంలో ఇష్టదేవతగా మరియు భవిష్యత్తులో ఇష్ట దేవతగా
కావాలంటే మీలో సదా అష్టశక్తుల యొక్క ధారణ ఉండాలి. ఈ శక్తుల యొక్క ధారణ ద్వారా
స్వతహాగా మరియు సహజంగా తయారు కాగలుగుతారు మరియు రెండు విషయాలను అనుభవం
చేసుకోగలుగుతారు. ఆ రెండు విషయాలు ఏమిటి? సదా స్వయాన్ని శివశక్తిగా,
అష్టభుజధారిగా, అష్టశక్తిధారిగా భావించటం ద్వారా 1.సదా సాథీ అంటే బాబా యొక్క
తోడు అనుభవం అవుతుంది .2.సాక్షి స్థితి అనుభవం అవుతుంది. ఒకటి సాథీ, రెండు
సాక్షి ఈ రెండు అనుభవం చేసుకోగలుగుతారు దీనినే మరో మాటలో సాక్షి స్థితి అంటే
దీనిని బిందురూప స్థితి అని కూడా అంటారు మరియు సాథీ స్థితి అంటే ఈ స్థితిని
అవ్యక్తస్థితి అని కూడా అంటారు. కనుక అష్టశక్తులను ధారణ చేయటం ద్వారా సాథీ అంటే
అవ్యక్తస్థితి అనుభవం అవుతుంది మరియు సాక్షి అంటే బిందురూప స్థితి కూడా సహజంగా,
స్వతహాగా అనుభవం చేసుకోగలుగుతారు. బాబా ఎప్పుడు మీ వెంట ఉన్నప్పుడు మీలో
బలహీనతను, ఒంటరితనాన్ని అనుభవం చేసుకోరు. ఇలా సర్వశక్తివంతుడైన శివుడు మరియు
శక్తి రెండింటి స్మృతి ఉండటం ద్వారా నడుస్తూ, తిరుగుతూ సాకారంలో బాబా మీ వెంట
ఉన్నట్లు, బాబా చేతిలో మీ చేయి ఉన్నట్లు అనుభవం అవుతుంది. తోడు మరియు చేయి అని
మహిమ ఉంది కదా! బాబా తోడు అంటే బుద్ధి యొక్క సంలగ్నత మరియు సదా బాబా తోడుగా
ఉండటం అంటే బుద్ధి యొక్క సంలగ్నత ఎప్పుడు బాబాతో ఉండాలి. అలాగే బాబా చేతిలో చేయి
వేసి నడవటం అంటే శ్రీమతరూపి చేతిని అనుభవం చేసుకోవాలి. సదా బాబా శ్రీమతంపై
నడవాలి. ఎలా అయితే ఎవరి చేతిలోనైనా మన చేయి ఉంటే మనకి భయం అనిపించదు కదా!
నిర్భయంగా ఉంటాము మరియు శక్తి రూపంగా ఉండగలుగుతాము. అప్పుడు ఏ కష్టమైన కార్యం
చేయడానికి అయినా తయారవుతాము. అదేవిధంగా బాబా శ్రీమతరూపి చేయి మీపై ఉన్నట్లు మీరు
అనుభవం చేసుకుంటే ఏ కష్టమైన పరిస్థితికి, మాయా విఘ్నాలకు మీరు భయపడరు. బాబా చేతి
యొక్క సహాయంతో, ధైర్యంతో ఎదుర్కోవటం మీకు సహజమనిపిస్తుంది. అందువలనే
భక్తిమార్గపు చిత్రాలలో భక్తులను మరియు భగవంతుడిని ఏ రూపంలో చూపిస్తారు? శక్తుల
యొక్క చిత్రాలలో కూడా వరదాని హస్తం భక్తులపై ఉన్నట్లు చూపిస్తారు కదా! మస్తకంపై
చేయి పెడతారు అంటే దీని అర్థం ఏమిటి? మస్తకం అంటే బుద్ధిలో సదా బాబా శ్రీమతమనే
చేయి, సదా బాబా తోడు ఉంటే మీకు సదా విజయం లభిస్తుంది అని. ఇలా బాబా తోడుని మరియు
చేతిని అనుభవం చేసుకుంటున్నారా? ఎంత బలహీన ఆత్మ అయినా సర్వశక్తివంతుడైన బాబాని
తోడుగా చేసుకుంటే ఆ బలహీన ఆత్మలో కూడా స్వతహాగానే బలం నిండి పోతుంది. ఎంత భయానక
స్థానమైనా కానీ తోడుగా ఉండేవారు బలంగా ఉంటే ఎంత బలహీన ఆత్మకైనా వీరత్వం
వచ్చేస్తుంది. అప్పుడిక వారు మాయతో భయపడరు. మాయతో భయపడటం లేదా మాయ యొక్క
యుద్ధాన్ని ఎదుర్కోవటానికి కారణం ఏమిటంటే బాబా తోడుని, బాబా చేతిని అనుభవం
చేసుకోలేకపోతున్నారు. బాబా తోడుని ఇస్తున్నారు, కానీ తీసుకునేవారు తీసుకోకపోతే
బాబా ఏం చేస్తారు? ఎలా అయితే బాబా పిల్లల యొక్క చేతిని పట్టుకుని వారికి మార్గం
చూపిస్తున్నారో అలాగే బాబా మనందరికి మార్గాన్ని చూపిస్తున్నారు. కానీ మాటి
మాటికి పిల్లలు ఏం చేస్తున్నారు? బాబా చేతిని వదిలేసి తమ మతం వైపు
వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఏమౌతుంది? అయోమయం అయిపోతున్నారు. అలాగే బాబా
సాంగత్యాన్ని అంటే బుద్ధితో బాబా తోడుని మర్చిపోయి, శ్రీమతమనే చేతిని వదిలేసి
వేరే మార్గంలోకి వెళ్ళిపోతున్న కారణంగా అయోమయం అయిపోతున్నారు, అలజడిలోకి
వచ్చేస్తున్నారు, బలహీనం అయిపోతున్నారు. మాయ కూడా చాలా చతురమైనది. మొదట
మిమ్మల్ని ఓడింపచేయడానికి బాబా చేతిని, బాబా తోడుని విడిపించి ఒంటరిగా చేస్తుంది.
ఎప్పుడైతే మీరు ఒంటరిగా అవుతారో అప్పుడు బలహీనం అయిపోతారు. అప్పుడు మీపై యుద్ధం
చేస్తుంది. ఎవరైనా శత్రువులు ఎవరిపైనైనా యుద్ధం చేయాలంటే మొదట వారిని సాంగత్యం
నుండి, ఇతరాత్మల తోడు నుండి విడిపిస్తారు. ఏదోక యుక్తితో వారిని ఒంటరిగా చేసి
అప్పుడు యుద్ధం చేస్తారు అలాగే మాయ కూడా బాబా యొక్క తోడుని, బాబా యొక్క చేతిని
విడిపించి అప్పుడు మీపై యుద్ధం చేస్తుంది. ఒకవేళ బాబా తోడుని, చేతిని మీరు
వదలకపోతే సర్వశక్తివంతుని తోడు మీకు ఉంటే మాయ మీపై యుద్ధం చేస్తుందా? మాయజీత్
గా అయిపోతారు. బాబా చేతిని, బాబా తోడుని ఎప్పుడు వదలకండి. సదా మాస్టర్
సర్వశక్తివంతులై నడవండి. భక్తిలో ఒక్కసారి నా చేయి పట్టుకో అని పిలుస్తూ వచ్చారు
కదా! మరి బాబా మన చేతిని పట్టుకుంటున్నారు, చేతిలో చేయి వేసి నడిపిస్తున్నారు.
అయినప్పటికి బాబా చేతిని వదిలేసి భ్రమిస్తుంటే ఏమౌతుంది? మీకు మీరు
భ్రమించడానికి మీరే నిమిత్తమవుతున్నారు. ఎవరైనా యుద్ధం చేసే వీరులు
యుద్ధమైదానంలోకి వెళ్ళేటప్పుడు తమ సామాగ్రిని, తమ శస్త్రాలను వెంట పెట్టుకుని
తీసుకువెళ్తారు. అలాగే ఈ కర్మక్షేత్ర రూపి మైదానంలో మీరు ఏదైనా కర్మ చేయడానికి
వెళ్తున్నప్పుడు, వీరులుగా అయ్యి యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు మీ
శస్త్రాలను అంటే అష్టశక్తుల రూపి సామాగ్రిని వెంట ఉంచుకుని కర్మ చేయండి. యుద్ధం
చేసేటప్పుడు శత్రువులు ఎదురుగా వచ్చినప్పుడు మీకు ఆ సమయంలో ఆ సామాగ్రి గుర్తు
వస్తే ఏమౌతుంది? ముందు నుండే మీ దగ్గర లేకుండా అప్పుడు గుర్తు వస్తే ఓడిపోతారు
కదా! అలాగే స్వయాన్ని కర్మక్షేత్రంపై కర్మ చేసే వీరులుగా అంటే మహారథీగా
భావించండి. యుద్ధ మైదానంలోకి యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు శస్త్రాలను
వదలకూడదు. వీరులు నిద్రపోయే సమయంలో కూడా తమ శస్త్రాలను వదలరు. అలాగే మీరు కూడా
మీ నిద్రపోతున్న సమయంలో కూడా మీ అష్టశక్తులు అనే శస్త్రాలను మీరు మర్చిపోకూడదు,
ఎప్పుడు వెంట ఉంచుకోవాలి. అంతే కాకుండా ఆ శస్త్రాలను సదా మీ దగ్గరే ఉంచుకోవాలి.
అంతే కానీ మాయ వచ్చినప్పుడు ఆ సమయంలో లేచి కూర్చుని దీనికి యుక్తి ఏమిటీ అని
ఆలోచించటం కాదు. ఇలా ఆలోచించటం వలన ఆలోచిస్తూనే సమయం అంతా గడిచిపోతుంది.
అందువలన సదా ఎవరెడిగా ఉండాలి, సదా ఎలర్ట్(జాగ్రత్త)గా ఉండాలి, ఎవరెడిగా ఉండాలి.
అప్పుడు మాయ మిమ్మల్ని మోసం చేయదు. మోసం చేస్తే ఏమౌతుందో తెలుసా? మిమ్మల్ని చూసి
మీకు మీకే దు:ఖం వస్తుంది. మీ బలహీనతయే మీలో లోపాన్ని తీసుకువస్తుంది. ఒకవేళ
మీలో బలహీనత లేకపోతే మీలో ఎప్పుడు లోపం ఉండదు. మీరు స్వయాన్ని నిశ్చింత
చక్రవర్తులు అని చెప్తున్నారు కదా! మరి ఈ సమయంలో ఇప్పుడు ప్రపంచం అంతా చింతతో
ఉంది. ఇప్పుడు చింత అంటే ఏమిటి. నిశ్చింత అంటే ఏమిటి ఈ జ్ఞానం తెలిసింది కదా!
కనుక ఈ జ్ఞానం తెలుసుకున్నారు. కనుక ఇప్పుడు మీరు ఎలాంటి స్థితిలో ఉండాలి?
నిశ్చింత చక్రవర్తులుగా ఉండాలి. భలే మీరు బీదవారే అయ్యి ఉండచ్చు, కానీ బీదవారు
అయినప్పటికి నిశ్చింత చక్రవర్తులు. ఈ నషాలో ఉండాలి. చక్రవర్తులకు లేదా రాజులకు
రాజ్యం నడిపించే శక్తి స్వతహాగానే ఉంటుంది కదా! ఆ స్వతహా శక్తితో వారు సరిగా
రాజ్యం నడిపించకపోతే ఏమౌతుంది? ఏదైనా వ్యతిరేక కార్యాలలో చిక్కుకుంటే శక్తి
మొత్తం పోతుంది మరియు రాజ్యపదవి కూడా పోతుంది. అలాగే మీరు నిశ్చింత చక్రవర్తులు,
బాబా మీకు సర్వశక్తులను ఇచ్చారు ఏదోక సాంగత్య దోషంలోకి వచ్చి లేదా ఏవోక
కర్మేంద్రియాలకు వశీభూతం అయ్యి మీ శక్తిని పోగొట్టుకుంటే ఆ నిశ్చింత చక్రవర్తి
యొక్క నషాను, సంతోషాన్ని కూడా పోగొట్టుకుంటారు. చక్రవర్తులు కూడా ఒక్కోసారి
అడవులు పాలవుతారు కదా! అలాగే ఇక్కడ కూడా మాయకు ఆధీనం అయితే, మోహంలో చిక్కుకుంటే
అడవులలోకి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు ఏం చేయం, ఎలా చేయం, ఎప్పుడు అవుతుంది ఇలా
అంటూ ఉంటారు. ఇలా మీరు కర్మేంద్రియాలకు వశం అయిపోతే మీ శక్తులన్నీ
పోగొట్టుకుంటారు. అర్ధమైందా! మీరు అష్టశక్తి స్వరూపులుగా, నిశ్చింతా
చక్రవర్తులుగా ఉండాలి. ఈ స్మృతిని ఎప్పుడు మర్చిపోకూడదు. భక్తిలో కూడా సదా నీ
ఛత్రఛాయలోనే ఉంచుకో అని సదా బాబాని పిలిచారు కదా! మరి బాబా ఇప్పుడు బాబా తోడు
మరియు చేతిని ఇచ్చి ఛత్రఛాయను అనుభవం చేయిస్తుంటే ఈ ఛత్రఛాయ నుండి ఎందుకు బయటకు
వచ్చేస్తున్నారు? ఈరోజుల్లో ప్రపంచంలో చిన్న, పెద్ద కర్తవ్యం చేసేవారు కూడా
ఏదోక సహయోగిని వెంట ఉంచుకుంటారు. మా వెన్నెముక శక్తిశాలిగా ఉంది అని సంతోషంలో,
నషాలో ఉంటారు. అంటే వారు వెన్నెముకగా ఎవరోకరి సహయోగిని పెట్టుకుంటారు. సహయోగిని
చూసుకుని మా సహయోగి ఇంత శక్తిశాలిగా ఉన్నారు కదా అని సంతోష పడిపోతారు. మరి మీకు
బ్యాక్ బోన్ అంటే వెన్నెముక ఎవరు? మీకు వెన్నెముక సర్వశక్తివంతుడు.మరి మీకు ఎంత
నషా ఉండాలి? మరి మీకు ఆ నషా ఉంటుందా లేదా పోతుందా? సాగరంలో ఎప్పుడైనా అలలు
సమాప్తి అయిపోతాయా? నదిలో ఎప్పుడు అలలు రావు. సాగరంలో ఎప్పుడు అలలు వస్తూనే
ఉంటాయి. మరి మీరెవరు? మాస్టర్ సాగరులు కదా! మరి ఈ ఈశ్వరీయ నషా, ఈ ఈశ్వరీయ సంతోషం
యొక్క అల మీకు సమాప్తి అయిపోతుందా? ఎప్పుడు సమాప్తి అయిపోతుంది? సాగరుడైన బాబాతో
సంబంధం తెగిపోయినప్పుడు సమాప్తి అయిపోతుంది. బాబా చేతిని బాబా తోడుని
వదిలేస్తున్నారు. అందువలనే సంతోషం యొక్క అల సమాప్తి అయిపోతుంది. బాబా తోడుని
అనుభవం చేసుకుంటే పాపకర్మ నుండి కూడా రక్షించుకోగలుగుతారు. ఎందుకంటే పాపకర్మ
కూడా ఒంటరిగా ఉన్నప్పుడే చేస్తారు. ఎవరైనా దొంగతనం చేయాలన్నా, ఏదైనా వికారానికి
వశమై అబద్దం మాట్లాడినా, ఏవైనా అపవిత్ర సంకల్పాలు వచ్చినా, అపవిత్ర కర్మ జరిగినా
ఒంటరిగా ఉన్నప్పుడే చేసారు కదా! ఎందుకంటే సదా బాబాని తోడుగా ఉంచుకుంటే ఇటువంటి
కర్మలు జరుగవు. ఎవరైనా చూస్తుండగా దొంగతనం చేస్తారా? ఎవరైనా వింటుంటే అబద్దం
మాట్లాడతారా? ఏదైనా వికర్మ లేదా వ్యర్థకర్మ మాటి మాటికి జరుగుతుంది అంటే దీనికి
కారణం ఏమిటంటే - సదా సాథీ అయిన బాబాని తోడుగా ఉంచుకోవటం లేదు. బాబా తోడుని
అనుభవం చేసుకోవటం లేదు. అప్పుడప్పుడు నడుస్తూ, నడుస్తూ ఉదాసీనంగా ఎందుకు
అయిపోతున్నారు? ఒంటిరిగా అయినప్పుడే ఉదాసీనత వస్తుంది. మీరు సంఘటనలో ఉన్నప్పుడు
ఉదాసీనత వస్తుందా? సర్వశక్తివంతుడైన బాబా మీ తోడుగా ఉన్నారు, బీజమైన బాబా మీ
తోడుగా ఉన్నారు. బీజం మీ తోడుగా ఉన్నప్పుడు మొత్తం వృక్షం కూడా మీ తోడుగానే
ఉంటుంది. మరి మీకు ఇక ఉదాసీనత ఎందుకు వస్తుంది? ఒంటరితనం లేకపోతే ఉదాసీనత ఎందుకు
వస్తుంది? అప్పుడప్పుడు మాయా యుద్ధానికి వశమైపోయిన కారణంగా, స్వయాన్ని నిర్భల
ఆత్మగా భావిస్తున్న కారణంగా అలజడి అవుతున్నారు. బలవంతుడైన బాబా తోడుని
మర్చిపోతున్నారు. అందువలనే నిర్బలంగా అయిపోతున్నారు. నిర్బలంగా అయిపోయిన కారణంగా
మీ గౌరవాన్ని మర్చిపోయి అలజడిలోకి వచ్చేస్తున్నారు. మీరు ఏవైతే బలహీనతలు, లోపాలు
అనుభవం చేసుకుంటున్నారో వీటికి కారణం ఏమిటి? బాబా తోడు మరియు చేయి మీకు
లభిస్తున్నప్పటికీ కూడా వదిలేస్తున్నారు. అర్ధమైందా? మొత్తం కల్పంలో ఒక్కసారే
బాబా తోడు లభిస్తుంది అని చెప్తున్నారు. అయినప్పటికి బాబా తోడు వదిలేస్తున్నారు.
ఎవరైనా ఎవరి చేతినైనా వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు?
స్వయానికి స్వయమే అలజడి అయిపోతారు కదా! మరి చాలా సమయం మీరు కూడా ఈ సృష్టిలో బాబా
తోడుని వదిలేసి అలజడి అయిపోతూ వచ్చారు. ఆ స్థితి ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా?
మరి మంచిగా అనిపించనప్పుడు మాటి మాటికి అటువైపు ఎందుకు వెళ్ళిపోతున్నారు? కనుక
ఇప్పుడు తొందర తొందరగా నడవాలి, పురుషార్ధంలో వేగాన్ని పెంచుకోవాలి. సారాన్ని
మీలో నింపుకుని సారయుక్తంగా కావాలి మరియు అసార ప్రపంచం నుండి విడిపించుకోవాలి.
అంటే అసార ప్రపంచం నుండి బేహద్ వైరాగిగా అవ్వాలి.
ఈవిధంగా తోడు మరియు బాబా చేతిని వెంట ఉంచుకునే
నిశ్చింత చక్రవర్తులకు బాప్ దాదా యొక్క నమస్తే.