16.06.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


హర్షితంగా ఉండటమే బ్రాహ్మణ జీవితం యొక్క విశేష సంస్కారం.

సదా హర్షితంగా ఉండేటందుకు సహజయుక్తి ఏమిటి? సదా హర్షితంగా ఉండే స్మృతిచిహ్నం యొక్క చిత్రం ఏమిటి? దానిలో విశేషంగా హర్షితముఖమే చూపించారు. విష్ణువు శేషపానుపుపై పడుకున్నట్లుగా చిత్రం చూపిస్తారు కదా! జ్ఞానాన్ని స్మరణ చేస్తూ హర్షితంగా ఉన్నట్లు చెప్తారు. విశేషంగా హర్షితంగా ఉండే స్మృతిచిహ్నంగా విష్ణువు యొక్క చిత్రమే చూపిస్తారు. విష్ణువు అంటే దంపత రూపం. మరి మీరందరు విష్ణు స్వరూపాన్ని తయారు చేసుకుంటున్నారా? నరుని నుండి నారాయణుడిగా, నారి నుండి శ్రీమహాలక్ష్మిగా మీరు తయారవుతారా లేదా బాబా తయారవుతారా? నరుడు మరియు నారి ఇద్దరు ఎవరైతే సదా ఙ్ఞానాన్ని స్మరణ చేస్తూ ఉంటారో వారే సదా హర్షితంగా ఉంటారు. అంటే హర్షితంగా ఉండటానికి సాధనం ఏమయ్యింది? జ్ఞానస్మరణ. ఎవరు ఎంతగా జ్ఞానాన్ని స్మరిస్తూ ఉంటారో అంతగానే సంతోషంగా ఉంటారు. మరి ఈ జ్ఞానస్మరణ నడవకపోవడానికి కారణం ఏమిటి? వ్యర్థ స్మరణలోకి వెళ్ళిపోతున్నారు. వ్యర్ధ స్మరణ జ్ఞానస్మరణ కానివ్వటం లేదు. ఒకవేళ బుద్ధి సదా జ్ఞానస్మరణలలో తత్పరులై ఉంటే సదా హర్షితంగా ఉంటారు. వ్యర్దస్మరణ ఉండనే ఉండదు.. జ్ఞానస్మరణ చేసేటందుకు, హర్షితంగా ఉండేటందుకు మీకు చాలా ఖజానా లభించింది. ఈ రోజుల్లో ఎవరైనా ధనవంతుల దగ్గర లెక్కలేనంత ధనం ఉంటే వారు ఎంత సంతోషంగా ఉంటారు! అలాగే మీకు కూడా లెక్కలేనంత జ్ఞాన ఖజానా లభించింది. మరి ఈ లెక్కలేనంత ఖజానా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఏదైనా వస్తువు లోపంగా ఉన్నప్పుడే కదా, మీరు వేరే చోటుకి వెళ్ళిపోతారు. కానీ మీకు ఏ లోపం లేదు, కనుక మీరు సంతోషంగా ఉండాలి కదా! మరి బాబా ఇంత మీకు జ్ఞానఖజానా ఇస్తున్నప్పుడు ఇతర విషయాలు మీకు ఎందుకు ఇష్టమనిపిస్తున్నాయి? చాలా సమయం నుండి అలవాటు అయిపోయింది. కనుక వ్యర్ధం వైపు వెళ్ళిపోతున్నాము అని పిల్లలు అనుకుంటున్నారు. మరి ఇప్పుడు జ్ఞానస్మరణ చేస్తూ ఎంత సమయం అయ్యింది? సంగమయుగం యొక్క ఒక్క సంవత్సరం ఎంత సమయంతో సమానం? సంగమయుగం యొక్క ఒక్క సంవత్సరం కూడా చాలా ఉన్నతమైనది. ఇలా ఈ లెక్కతో చూస్తే చాలా సమయం యొక్క విషయం అవుతుంది కదా! చాలా సమయం సంస్కారం అయిపోయినప్పుడు అనుకోనప్పటికి స్మృతిలోకి వచ్చేస్తుంది. అలాగే ఈ జ్ఞానాన్ని స్మరించటం కూడా మీకు చాలా సమయం నుండి సంస్కారం అయిపోయినప్పుడు మరి స్వతహాగా ఎందుకు ఉండటం లేదు? ఏదైనా క్రొత్త విషయం, తాజా విషయం ఇంకా ఎక్కువ స్మృతి ఉంటుంది కదా! ఎందుకంటే అది వర్తమానానికి సంబంధించినది, తర్వాత అది భూతకాలం అయిపోతుంది. కనుక ఈ వర్తమాన సమయం యొక్క విషయం మీకు గుర్తు ఉండటం లేదు. జరిగిపోయిన విషయం గుర్తు ఉంటుంది. ఎందుకు? మీకు జరిగిపోయిన విషయం గుర్తు ఉంటుంది. మరి ఆ జరిగిపోయిన విషయం స్మృతి చేస్తే దాని ద్వారా ఏమి ప్రాప్తి వస్తుంది? ఆ జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తే ఏ సుఖదాయి ప్రాప్తి మీకు ఉండదు. మరలా వాటిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు? మీకు ఆ ఫలితం ఎదురుగా ఉన్నప్పటికి ఎందుకు జ్ఞాపకం వస్తుంది? మీకు తెలుసు అది వ్యర్ధం అని వ్యర్ధానికి పరిణామం వ్యర్ధంగానే ఉంటుంది కదా! ఆ వ్యర్ధం యొక్క పరిణామం తెలిసినప్పటికి, ప్రత్యక్షంలోకి తీసుకువస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? అది నిర్మలత అని మీకు జ్ఞానం ఉంది. అది తెలుసు అయినప్పటికి నిర్బలంగా ఎందుకు అవుతున్నారు? అధికారిగా ఉండేవారి గుర్తులు ఏమిటి? వారిలో విల్ పవర్ అంటే ఆత్మికశక్తి ఉంటుంది. ఏది కావాలంటే అది చేయగలరు, చేయించగలరు. అందువలనే దానిని అధికారం అని అంటారు. వారినే అధికారం కలిగిన ఆత్మలు అని అంటారు. బాబా మీకు ఏవైతే అధికారాలు ఇచ్చారో అవి పొందలేదా? మీరు మాస్టర్ సర్వశక్తివంతులు కాదా? మరి అధికారులు అంటే సర్వశక్తివంతులే కదా! ఎవరి దగ్గరైతే సర్వశక్తుల అధికారం ఉందో వారు చేయాలనుకుంటున్నా చేయలేరపోతున్నారంటే వారిని సర్వశక్తివంతులు అని అంటారా? అంటే నేనెవరు? అనేది మర్చిపోతున్నారా? ఇది ఈ సమయం యొక్క స్థితే కదా! మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారా? అసలైన స్థితిని మర్చిపోయి నకిలీలోకి వచ్చేస్తున్నారా? ఈరోజుల్లో ముఖాన్ని నకిలీగా చేసుకుంటున్నారు కదా! ఎలాంటి శృంగారాలు చేసుకుంటున్నారు! దీని ద్వారా ముఖంలో అసలైన అందం దాగిపోయి నకిలీ రూపం వస్తుంది. దానిని కృత్రిమ ఆసురీ శృంగారం అంటారు. అసలు భారతవాసీయులు అంటే సర్వ ధర్మాత్మల లెక్కతో చూస్తే చాలా సతోగుణీ ఆత్మలు, కానీ తమ యొక్క నకిలీ రూపాన్ని తయారు చేసుకుని, కృత్రిమ ప్రవర్తన తయారు చేసుకుని కృత్రిమ శృంగారాలు చేసుకుని రోజు రోజుకి స్వయాన్ని ఆసురీగా చేసుకుంటున్నారు. ఇప్పుడు శృంగారం కూడా ఆసురీగా అయిపోయింది. ఎలా అయితే ప్రపంచం వారు అసలైన స్వరూపాన్ని మర్చిపోయి, తమ ఆసురీ స్వరూపాన్ని ప్రత్యక్షం చేస్తున్నారో అలాగే మీరు మీ అసలైన స్థితిని మర్చిపోకండి. మీ అసలైన స్థితిని మర్చిపోవటం ద్వారానే ఆసురి సంస్కారాలు కలిగిన వారిగా అయిపోతున్నారు. ఆ సంస్కారాలు మీలోకి వచ్చేస్తున్నాయి. లౌకిక రూపంలో కూడా శక్తిశాలిగా ఉండేవారు, అన్ని విషయాలలో శక్తిశాలిగా ఉన్న కారణంగా వారి దగ్గరకు వచ్చే ధైర్యం ఎవ్వరికి ఉండదు. అలాగే మీరు సర్వశక్తివంతుని ధైర్యంతో పొజిషన్ లో ఉన్నట్లయితే, ఈ ఆసురీ సంస్కారాలు, వ్యర్థ సంస్కారాలు మీ దగ్గరకు వచ్చే ధైర్యం చేస్తాయా? మరి మీ పొజిషన్ నుండి ఎందుకు క్రిందికి దిగిపోతున్నారు? సంగమయుగం యొక్క అసలైన సంస్కారాన్ని మర్చిపోతున్నారు. బాబా మీకు ఏదైతే జ్ఞానాన్ని ఇస్తున్నారో, మీరు తీసుకుంటున్నారో సదా ఆ జ్ఞాన స్మృతిలో ఉండండి. అప్పుడు చాలా హర్షితంగా ఉండగలరు. ఎందుకంటే బ్రాహ్మణజీవితం యొక్క విశేష సంస్కారమే - హర్షితస్థితి. మరలా దీని నుండి ఎందుకు దూరం అయిపోతున్నారు? దీనిని ఎందుకు వదిలేస్తున్నారు? సంగమయుగంలో ఈ స్థితి మీదే కదా! అవగుణాలు మాయా వస్తువులు. అవి సాంగత్యదోషం ద్వారా లభించాయి. మీ వస్తువులు ఏమిటి? దివ్యగుణాలు. మరి మీ వస్తువులు ఎందుకు వదిలేస్తున్నారు? సంభాళిచడం రావటంలేదా ఏమిటి? మీ ఇంటిని సంభాళించడం వస్తుందా? హద్దు యొక్క పిల్లలు, హద్దు యొక్క వస్తువులు వీటిని సంభాళిస్తున్నారు కదా! మరి బేహద్ గా సంభాళించడం రావటం లేదా? హద్దుని పూర్తిగా వదల లేదా? కొంచెం కొంచెం ఉందా? బేహద్ ఇంటిలో బేహద్ నషాతో ఉంటున్నారా లేదా హద్దు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హద్దు నషాలోకి వచ్చేస్తారా? ఇప్పుడు మీ ఉత్సాహ, ఉల్లాసాలనేవి హద్దులోకి రావటంలేదు కదా? బేహద్ ఉత్సాహ, ఉల్లాసాలలో ఉండండి. హద్దు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ బేహద్ ఉత్సాహ, ఉల్లాసాలలో తేడా రాకూడదు.హద్దుకి వీడ్కోలు ఇచ్చేయండి లేదా ఇప్పటి వరకు ఇంకా హద్దు యొక్క మర్యాదలు ఉన్నాయా? ఈ అలౌకిక జీవితం ఎవరి కోసం ఉంది? హద్దు యొక్క కార్యం ఎవరి కోసం చేయాలి? మీరు అలౌకిక జన్మ ఎందుకు తీసుకున్నారు? ఏ కార్యార్ధం అలౌకిక జన్మ తీసుకున్నారో ఆ కార్యం మీరు చేయకపోతే ఈ అలౌకిక జన్మ ఎందుకు? ప్రజలకు చెప్తారు కదా! తండ్రి పరిచయం తెలుసుకోకపోతే మీరు పిల్లలుగా ఎలా అవుతారు? అని. అలాగే మిమ్మల్ని మీరు అడగండి, బేహద్ బాబాకి బేహద్ పిల్లలు అయ్యారు, అంగీకరించి తెలుసుకుని నడుస్తున్నారు, అయినప్పటికి బేహద్ కార్యంలోకి రాకపోతే, హద్దులోనే ఉండిపోతే మీకు ఇక అలౌకిక జన్మ ఎందుకు? అలౌకిక జన్మలో కూడా లౌకిక కార్యాలలో నిమగ్నమైపోతే ఇక లాభం ఏమిటి? మీ జన్మ మరియు సమయం యొక్క మహత్యాన్ని తెలుసుకోండి. అప్పుడే మహాన్ కర్తవ్యం చేయగలుగుతారు. గ్యాస్ బుడగలా అవ్వకండి. అది పైకి ఎగురుతుంది, కానీ అల్పకాలికంగా ఎగురుతుంది. మరలా గ్యాస్ అయిపోయిన తర్వాత క్రిందికి పడిపోతుంది. అలా గ్యాస్ బుడగల్లాగా అవ్వకండి. సదాకాలిక స్థితిని తయారుచేసుకోండి.