19.07.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సంఘటన యొక్క గొప్పతనం మరియు సంఘటన ద్వారా సర్టిఫికెట్.

స్వయాన్ని ముత్యంగా లేదా మణిగా భావిస్తున్నారా? మణికి దేని ద్వారా విలువ వస్తుంది? మణి లేదా ముత్యం వేరుగా ఉంటే విలువ ఉండదు. దాని విలువ తక్కువగా ఉంటుంది. మాలలో పూసగా అవ్వటం ద్వారానే విలువ ఎక్కువ వస్తుంది. వేరుగా ఉండటం ద్వారా తక్కువగా ఉంటుంది. కారణం ఏమిటి? సంఘటనలో ఉన్నప్పుడు ఆ ముత్యానికి లేదా మణికి చాలా శక్తి ఉంటుంది. శక్తిశాలిగా ఉంటుంది. ఒకరికొకరు పరస్పరం కలిసినప్పుడు ఒకటి ప్రక్కన ఒకటి పెడితే 11 అంటారు. ఒకటే ఉంటే ఒకటే అంటారు. ఒకటి, ఒకటి రెండు కలిస్తే 11 అయ్యింది. ఎక్కడ ఒకటి? ఎక్కడ 11? ఇంతగా విలువ పెరుగుతుంది. రెండు అయినప్పుడు 11 అంటారు. ఒకటిగా ఉన్నప్పుడు ఒకటే అంటారు. మరి ఒకటికి ఎంత విలువ ఉంది? 11కి ఎంత విలువ ఉంది? ఇలా స్వయాన్ని సంఘటనా శక్తిలో ప్రసిద్ధమయ్యేటందుకు మణిగా భావిస్తున్నారా? ఏ మణిగా భావిస్తున్నారు? మాలలో మణిగా అవుతారా లేదా వ్యక్తిగతంగా మణిగా అవుతారా? మీ యొక్క విలువను చూసుకుంటూ మీ యొక్క శక్తిని అనుభవం చేసుకుంటూ మేము మాలలో మణులం అని భావిస్తున్నారా? సంఘటనలో ఉండే విలువైన ముత్యంగా భావిస్తున్నారా? స్వయమే భావిస్తున్నారా లేదా ఇతరులను కూడా మీ మాలలో మణిగా భావిస్తున్నారా? ఎవరైనా విశేష కార్యం చేస్తున్నప్పుడు విశేష కార్యానికి నిమిత్తమై విజయం పొందినప్పుడు వారికి మెడల్ లభిస్తుంది కదా! అలాగే మీరు ఇప్పటి వరకు ఏదైతే పురుషార్ధము చేస్తున్నారో, దాని యొక్క సర్టిఫికెట్ ప్రత్యక్షంలోకి తీసుకువచ్చేటందుకు మధ్య మధ్యలో ఈ సంఘటన జరుగుతూ ఉంటుంది. ఈ సంఘటనలో ప్రతి ఒక్కరు సంఘటిత రూపంలో నడుచుకుని, ఈ సంఘటిత శక్తి యొక్క విలువ అనే మెడల్ తీసుకున్నారా? యూనివర్సీటీలోకి వచ్చారు కదా? ఇప్పటి వరకు చేసిన పురుషార్థానికి లేదా ఈశ్వరీయ సేవకు సర్టిఫికెట్ తీసుకోవాలి కదా! ఒకరికొకరు ఎంత సంతుష్టంగా అయ్యారు లేదా ఒకరికొకరు ఎంత సమీపంగా అయ్యారు, దీని యొక్క సర్టిఫికెట్ తీసుకోవాలి. మీ సంఘటనలలో లేదా సంపర్కంలో ఎంత సహయోగిగా అయ్యారు మరియు సర్వులకు స్నేహిగా ఎంత వరకు అయ్యారు? ఈ మెడల్ లేదా బహుమతి తీసుకోవాలి. ఈశ్వరీయ సేవలో మీ పురుషార్థం ఎక్కువలో ఎక్కువ బాబాని ప్రత్యక్షంచేయాలి. దీని యొక్క మెడల్ లేదా బహుమతి. ఏ స్థానానికి మీరు నిమిత్తం అయ్యారో ఆ స్థానం యొక్క ఆత్మలు మీతో సంతుష్టం అవ్వాలి. లేదా మీరు స్వయం అందరితో సంతుష్టం అవ్వాలి. ఇది మూడవ బహుమతి. ఈ మూడు బహుమతులు, మెడల్స్ తీసుకోవాలి. ఒకవేళ స్వయం కూడా సంతుష్టంగా లేకపోతే లోపం ఉండిపోతుంది. అలాగే వచ్చే వారిలో ఒకరైనా సంతుష్టంగా లేకపోతే లోపం ఉండిపోతుంది. టీచర్ తో అందరు సంతుష్టం అవ్వాలి. టీచర్ యొక్క చదువులో లేదా సంబంధంలో దీనినే మీరు హ్యాండ్ లింగ్ చేయటం అంటారు. దీనితో అందరు సంతుష్టం అయితే దీనికి కూడా బహుమతి లభిస్తుంది. ఆదిలో మాలను తయారు చేసేవారు, ఎందువలన? ఉత్సాహ, ఉల్లాసాలు పెంచేటందుకు. ఏ సమయంలో ఎవరు ఏ స్థితిలో ఉంటారో, ఆ స్థితిలో కలుసుకోవటం ద్వారా సంతోషం ఉంటుంది. ఉత్సాహ, ఉల్లాసాలు పెంచేటందుకు ఒకరి పరిస్థితి, ఒకరు చూసుకునేటందుకు ఈ సాధనాలు తయారుచేస్తున్నారు. అంతే కానీ ఇవి అంతిమ స్థితి యొక్క మెడల్ అని దాని భావం కాదు. ఇది సమయం యొక్క పురుషార్థానికి బలిహారం. దీని ద్వారా ఉత్సాహ, ఉల్లాసాలు వస్తాయి మరియు ఎవరు ఏ పురుషార్థంలో మరియు ఎంత ధ్యాస పెట్టుకున్నారు మరియు విజయీ అయ్యి అధికారి అయ్యారు అనే ఫలితం తెలుస్తుంది. దీనిని చూసి కూడా సంతోషపడతారు. మీరు ఇప్పుడు కూడా మీ క్లాసులలో ఎవరోకరికి బహుమతి ఇస్తూ ఉంటారు కదా! భలే ఆ బహుమతి చిన్న రుమాలు ఇచ్చిన పెద్దది కాకపోయినా దానికి విలువ ఉంటుంది. ఏ పురుషార్థం చేసారో దాని విజయానికి విలువ ఉంటుంది. కాని వస్తువుకి కాదు. మీరు ఎవరోకరికి కొద్దిగా సేవ చేస్తే బహుమతి ఇస్తున్నారు. క్లాసులో వారి పేరు చెప్తే ఇక ముందు కొరకు వారికి ముద్ర పడిపోతుంది. ఉత్సాహం, ఉల్లాసాల తిలకం పెట్టబడుతుంది. కొంతమంది విశేషాత్మలు కూడా విశేష కర్తవ్యం చేస్తూ ఉంటారు కదా! నిమిత్తంగా అయినప్పుడు తప్పకుండా ఏదోక విశేషత లేదా శ్రేష్టత తప్పకుండా ఉంటుంది. కనుకనే డ్రామానుసారం సమర్పణ అయిన తర్వాత సర్వస్వత్యాగి అయిన తర్వాత ఇతరుల సేవకు నిమిత్తంగా అయ్యారు కదా! ప్రతి ఒక్కరిలో ఏదోక విశేషత తప్పకుండా ఉంటుంది. ఒకరి విశేషతలు ఒకరికి పరిచయం ఉండాలి, లోపాలు కాదు. మీరు పరస్పరం సంఘటన పెట్టుకున్నప్పుడు అన్ని వైపులా సమాచారం ఎందువలన చెప్పుకుంటారు? ప్రతి ఒక్కరిలో ఏదైతే విశేషత ఉందో అది స్వయంలో తీసుకువచ్చేటందుకు. ప్రతి ఒక్కరికి బాప్ దాదా జ్ఞానం ద్వారా ఏదోక విశేష గుణం ప్రాప్తిస్తుంది. మనది కాదు, నా గుణం కాదు, జ్ఞానం ద్వారా లభించింది. ఇలా అనుకుంటే దీనిలో అభిమానం రాదు. ఒకవేళ అది మీ గుణం అయితే గ్రహిస్తే తెలిసిపోతుంది. కానీ మీరు జ్ఞానం లభించిన తర్వాత గుణవంతులుగా అయ్యారు. మొదట్లో భక్తిలో మేము నిర్గుణులం ....... అని పాడేవారు. కనుక ఇది స్వయం యొక్క గుణం కాదు, జ్ఞానం ద్వారా స్వయంలో నింపుకుంటున్నారు. అందువలన విశేషత యొక్క గుణాన్నివర్ణన చేస్తూ జ్ఞానం ద్వారా మాకు లభించింది అనే స్మృతి ఉండాలి. ఇది జ్ఞానం యొక్క గొప్పతనం, మీది కాదు. జ్ఞానస్వరూపం యొక్క గొప్పతనం. ఈ రూపంతో ఒకరికొకరు వర్ణన చేసుకుంటే దీనిలో ఒకరి విశేషతలు ఒకరు తీసుకుంటే లాభం ఉంటుంది. ఆదిలో మీకు ఒక నియమం నడిచేది - వర్తమాన సమయంలో సూక్ష్మ పురుషార్థం ఏమిటి? దాని వర్ణన చేసేవారు. పైపై విషయాలు కాదు, కానీ సూక్ష్మ బలహీనతలను ఏ పురుషార్థము ద్వారా విజయం పొందారు? అది ఒకరికొకరు వర్ణన చేసుకునేవారు. దీని ద్వారా ఒకరికొకరి పరిచయం అయిన కారణంగా ఎవరిలో ఏ విశేషత ఉందో, దానిని వర్ణన చేయటం ద్వారా స్వతహాగా వారి బలహీనత వైపు ధ్యాస తక్కువ అయిపోయేది. విశేషత వైపే ధ్యాస వెళ్ళేది. ఆదిలో పరస్పరంలో ఈవిధమైన సూక్ష్మ, ఆత్మిక సంభాషణ చేసుకునేవారు. కానీ ఎప్పుడైతే స్వయాన్ని చాలా విజయీగా భావిస్తున్నారో, దీని ద్వారా చాలా లాభం ఉంటుంది. ఒకరికొకరు వర్తమాన సమయం యొక్క పురుషార్థం యొక్క విశేషతలను వర్ణన చేసుకోవటం ద్వారా కూడా మంచి వాతావరణం ఉంటుంది. ఎప్పుడైతే ఇదే టాపిక్ అవుతుందో ఇక మిగిలిన టాపిక్స్ అన్ని ఉండిపోతాయి. ఇలా పరస్పరం కలుసుకునే రూపం ఇలా ఉండాలి. ప్రతి ఒక్కరి విశేషత చూడటం చాలా మంచిది.ఎవరూ నాలో ఏ విశేషత లేదు అన్నారు అని అనుకోకూడదు. ఇలా అంటున్నారు అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవటం లేదు అని సిద్ధి అవుతుంది. దృష్టి మరియు వృత్తి స్వతహాగా అయిపోవాలి. ఎలా అంటే మీరు హంస యొక్క ఉదాహరణ చెప్తారు కదా! హంస యొక్క దృష్టి దేనిపై వెళ్తుంది? రాళ్ళను చూస్తూ కూడా ముత్యాలనే చూస్తుంది. అలాగే మన వృత్తి, దృష్టి స్వతహాగా ఎలా అవ్వాలంటే ఎవరి బలహీనత లేదా ఏదైనా విషయం వింటున్నా, చూస్తున్నా కూడా అది లోపలకు వెళ్ళకూడదు మరియు ఏ సమయంలో ఏదైనా బలహీనత చూస్తున్నా లేదా వింటున్నాఈ బలహీనత వీరిది కాదు అనుకోవాలి. ఎందుకంటే మనమంతా ఒకే తండ్రి యొక్క ఒకే పరివారం, ఒకే మాలలో మణులం. ఒకవేళ మాల మధ్యలో అలా, ఇలాంటి మణులు ఉంటే మొత్తం మాల యొక్క విలువ తక్కువ అయిపోతుంది. ఒకే మాలలో మణులు, కనుక ఇది నా బలహీనత కూడా అనే వృత్తి ఉండాలి. తీవ్రపురుషార్థులు స్వయంలో ఏదైనా బలహీనత కనిపిస్తే లభించిన యుక్తుల ఆధారంగా వెంటనే దానిని సమాప్తి చేసుకుంటారు, వర్ణన చేయరు. ఇలా ఎప్పుడైతే స్వయం యొక్క బలహీనతలను ప్రసిద్ధం చేయాలి అని అనుకోనప్పుడు ఇతరుల బలహీనత ఎందుకు వర్ణన చేస్తున్నారు? ఫలానా వారు తోడు ఇవ్వలేదు లేదా ఈ విషయం చేయలేదు. అందువలన సేవ వృద్ధి అవ్వటం లేదు లేదా నా పురుషార్థంలో ఫలానా విషయం, ఫలానా ఆత్మ విఘ్నరూపంగా ఉంది అంటున్నారు అంటే మీ బుద్ధి ద్వారా ఏదోక ఆధారాన్ని తయారు చేసుకుని దానిపై నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ఆధారం పునాది లేనిది. అందువలన అది నిలవటం లేదు. కొద్ది సమయం తర్వాత అదే ఆధారం నష్టదాయకంగా అవుతుంది. అందువలన మీరు పవిత్ర హంసలు కదా! పవిత్ర హంసల నడవడిక ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరి విశేషతను గ్రహణ చేయటం మరియు బలహీనతలను తొలగించే ప్రయత్నం చేయటం. ఇటువంటి పురుషార్థం నడుస్తుందా? మనమంతా ఒకటే ఈ స్మృతిలో ఉంటూ పురుషార్ధం నడుస్తుందా? ఇదే ఈ సంఘటన యొక్క విశేషత లేదా భిన్నత. ఇది విశ్వమంతటిలో ఏ సంఘటనకు లేదు. చూసేవారు, వచ్చేవారు, వినేవారు ఏమి వర్ణన చేస్తారు? ఇక్కడ ఒకొక్క ఆత్మ లేవటం, మాట్లాడటం, నడవటం అందరిది ఒకే విధంగా ఉంది అని. ఏకత మరియు ఒకే విషయం, ఒకే గతి, ఒకే రీతి, ఒకే నీతి అని ఏదైతే మీ విశేషతను మహిమ చేస్తున్నారో దానిని అనుసరించి స్వయాన్ని పరిశీలన చేసుకోండి. వర్తమాన సమయంలో పురుషార్థంలో కారణం అనే మాట సమాప్తి అయిపోవాలి. కారణం అనేది ఏమిటి? ఇప్పుడైతే ముందుకి వెళ్తూ ఉన్నారు కదా! సృష్టిని పరివర్తన చేసే, ప్రకృతిని పరివర్తన చేసే బాధ్యత తీసుకున్నవారు, ప్రతిజ్ఞ చేసేవారు, మీకు కారణం అనే మాట ఏమిటి? కారణానికి రచన ఎక్కడి నుండి వస్తుంది? కారణానికి వస్తువు ఏమిటి? ఏదోక రకమైన అంటే మనస్సు ద్వారా అయినా, వాచా ద్వారా అయినా లేదా సంబంధ, సంపర్కంలోకి రావటంలో బలహీనతయే కారణం. ఈ బలహీనతతోనే కారణం పుడుతుంది. అంటే రచనయే. వ్యర్థం కదా! బలహీన రచన ఏమి ఉంటుంది? ఎలాంటి వస్తువో అలాంటి ఫలం వస్తుంది. రచనయే వ్యతిరేకం అయినప్పుడు దానిని అక్కడే సమాప్తి చేయాలా లేదా దాని ఆధారం తీసుకుని ముందుకి వెళ్ళాలా? ఫలానా కారణం నివారణ అయితే ముందుకి వెళ్తాము, కారణం నివారణ అయితే సేవ పెరుగుతుంది, విఘ్నాలు తొలగిపోతాయి - ఇప్పుడు ఈ భాషను పరివర్తన చేయండి. మీరు అందరికి నివారణ చెప్పేవారు కదా! మీ దగ్గరకు అజ్ఞానీ ప్రజలు కారణాన్ని నివారణ చేసుకునేటందుకు వస్తారు కదా! కనుక ఇలా అనేకుల కారణాలను నివారణ చేసేవారు ఆధారాన్ని ఎలా తీసుకుంటారు? ఎప్పుడైతే ఈ ఆధారాలన్నీ సమాప్తి అయిపోతాయో అప్పుడే దేహాభిమానం, సంస్కారాలు స్వతహాగా సమాప్తి అయిపోతాయి. ఈ విషయాలే దేహాభిమానంలోకి తీసుకువస్తాయి. విషయాలు సమాప్తి అయిపోతే వాటి పరిణామం కూడా సమాప్తి అయిపోతుంది. చిన్న, చిన్న కారణాలలోకి రావటం ద్వారా రకరకాలైన దేహాభిమానం వస్తుంది అంటే ఇప్పటి వరకు దేహాభిమానాన్ని వదలలేదా? చాలా ప్రియంగా అనిపిస్తుందా? ఇప్పుడు మీ భాష మరియు వృత్తిని పరివర్తన చేసుకోండి. ఎవరినైనా, ఏ సమయంలో అయినా, ఏ పరిస్థితిలో, ఏ స్థితిలో చూస్తున్నా కానీ వృత్తి మరియు భావం యదార్థంగా ఉంటే మీపై దాని ప్రభావం పడదు. కళ్యాణ వృత్తి మరియు శుభచింతక భావం ఉండాలి. ఈ వృత్తి మరియు భావాన్ని మంచిగా ఉంచుకుంటే మరలా ఈ విషయాలే ఉండవు. ఎవరు ఏమి చేసినా, ఎవరైనా మీకు విఘ్నరూపంగా అయినా, కానీ వారి పట్ల కూడా మీ భావం శుభచింతక స్థితిలో ఉండాలి. వీరినే తీవ్రపురుషార్థి లేదా పవిత్ర హంసలు అని అంటారు. మీ పట్ల శుభభావనతో ఉన్నవారి పట్ల మీరు శుభభావన పెట్టుకోవటం గొప్ప విషయమేమీ కాదు. అపకారులకు కూడా ఉపకారం చేసేవారు అని మహిమ ఏదైతే ఉందో దీనిలో అద్భుతం చేయాలి. ఉపకారికి ఉపకారం చేయటం గొప్ప విషయమేమీ కాదు, ఎవరైనా మాటి మాటికి పడేయడానికి ప్రయత్నించినా, మీ మనస్సుని అలజడి చేసినా వారి పట్ల కూడా మీకు శుభచింతక స్థితి యొక్క స్థిరమైన భావం ఉండాలి. విషయం ఆధారంగా భావం మారకూడదు. సదా అచంచలమైన, స్థిరమైన భావం ఉండాలి. వారినే పవిత్ర హంసలు అని అంటారు. అప్పుడిక ఏ విషయాలు కనిపించవు. లేకపోతే కనుక వీటిలో కూడా సమయం చాలా వ్యర్థం అయిపోతుంది. చిన్నతనంలో అయితే సమయం వ్యర్థంగా పోతుంది. పిల్లలు సమయం వ్యర్ధం చేస్తే పిల్లలు కదా అనుకుంటారు. కానీ తెలివైన వారు సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. పిల్లలకు సమయం వ్యర్థం చేస్తున్నామనే ఫీలింగ్ కూడా ఉండదు. ఎందుకంటే వారి పనే అది. ఇప్పుడు మీరు ఏ సేవార్థం నిమిత్తమయ్యారో ఆ రూపమే జగత్ మాతా రూపం, విశ్వకళ్యాణకారి రూపం కదా! హద్దులో కళ్యాణం చేసేవారు చాలా మంది ఉన్నారు. విశ్వకళ్యాణ భావనా స్థితి ఏమిటంటే - జగత్ మాతా రూపం. జగత్ మాతా స్థితిలో ఉంటూ ఈ విషయాలతో సమయం వ్యర్థం చేస్తే వారిని ఏమంటారు? పంజాబ్ గురించి కౌరవ గవర్నమెంట్ కి గర్వంగా ఉంటే పాండవ గవర్నమెంట్ కి కూడా గర్వంగా ఉంది. పంజాబ్ విశేషత ఏమిటంటే - బాప్ దాదా కార్యంలో సహాయానికి ఫల స్వరూపం అందరి కంటే ఎక్కువ పంజాబ్ నుండి వచ్చారు. సింధు నుండి వచ్చిన నిమిత్తమైన రత్నాలు మిమ్మల్ని తయారుచేసారు. కనుక ఇప్పుడు మీ కర్తవ్యం ఏమిటంటే - మీరు కూడా మంచి రత్నాలను తీయాలి, గొడవ పెట్టుకునేవారు కాదు. మీ ద్వారా ఏదైతే ఋజువు వస్తుందో దానిని పరిశీలన చేసుకోండి. మీ రచనతో అప్పుడప్పుడు విసిగిపోతున్నారా? ఇదైతే ఆది నుండి నడుస్తూ వస్తుంది. మీకు ఇంకా సహజం. మీరు ఏ స్థూల పాలన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆత్మిక పాలన చేయాలి. కానీ మొదట తయారుచేసేటప్పుడు రెండు బాధ్యతలు ఉంటాయి. ఒక బాధ్యత అయితే పూర్తి చేయటం సహజమే, కానీ రెండు బాధ్యతలు అయితే సమయం పడుతుంది. ఇప్పుడు మీ అందరికి ఇదే లక్ష్యం ఉండాలి. త్వర త్వరగా ఇప్పుడు మన సమీపంగా వచ్చేవారిని మరియు ప్రజలను ఇద్దరినీ ప్రత్యక్షం చేయాలి. ఆ ప్రత్యక్షఫలం చూపించాలి. ఇప్పుడు శ్రమ ఎక్కువ చేస్తున్నారు. కాని ప్రత్యక్షఫలం కనిపించటం లేదు. దీనికి కారణం ఏమిటి? బాప్ దాదా పాలనలో మరియు మీ ఈశ్వరీయ పాలనలో ముఖ్య తేడా ఏమిటి? దీని కారణంగా దీపంపై దీపపు పురుగులు బలిహారం అవ్వాలనుకున్నా బలి అవ్వటం లేదు. డ్రామాలో పాత్ర అనేది వేరే విషయం. కానీ బాబా సమానంగా అయితే అవ్వాలి కదా! ప్రత్యక్షఫలం అంటే ఒక రోజులో వారసులుగా అయిపోతారు అని కాదు. కానీ ఎంత శ్రమ చేస్తారో, నమ్మకం పెట్టుకుంటారో దాని ప్రకారం వచ్చిన ఫలాన్ని ప్రత్యక్ష ఫలం అంటారు. ఇది ఎందుకు రావటం లేదు? బాప్ దాదా ఏ కర్మ యొక్క కోరిక పెట్టుకోవటం లేదు. ఒకటి నిరాకారుడు అయిన కారణంగా ప్రాలబ్దం అవసరం లేదు.ఆ కోరికే ఉండదు మరియు సాకారంలో కూడా ప్రత్యక్ష పాత్ర అభినయిస్తున్నప్పటికీ మాట మరియు కర్మలో తండ్రి స్మృతిలో ఉన్న కారణంగా ఫలం యొక్క కోరిక సంకల్పంలో కూడా ఉండదు. ఇక్కడ ఏది జరిగినా, ఎవరు ఏది చేసినా ఇక్కడే ఆ ఫలం యొక్క ప్రాప్తి ఉంటుంది. ఎలా అయితే వృక్షంలో ఫలం తప్పకుండా వస్తుంది. కానీ అక్కడికి అక్కడే ఫలం తినేస్తే ఫలం పూర్తిగా మగ్గి ప్రత్యక్షంలోకి రాదు. ఎందుకంటే గట్టి ఫలమే తినేసారు కదా! ఇక్కడ కూడా అలాగే. ఏది చేసినా దాని ఫలం యొక్క కోరిక సూక్ష్మంగా తప్పకుండా ఉంటుంది అంటే చేసారు మరియు ఫలం తినేసారు. అంటే ఇక ఫలస్వరూపం ఏమి కనిపిస్తుంది? సగంలోనే ఉండిపోయారు కదా! ఫలం యొక్క కోరికలు కూడా రకరకాలుగా ఉంటాయి. ఎలా అయితే చాలా దుఃఖాల యొక్క లిస్ట్ ఉందో, అలాగే ఫలం యొక్క కోరికలు మరియు వాటికి ప్రతిఫలం తీసుకునే సూక్ష్మ సంకల్పం తప్పకుండా ఉంటుంది. ఒకటి, రెండు శాతం అయినా తప్పకుండా కొంచెం అయినా ఉంటుంది. పూర్తి నిష్కామ వృత్తి ఉండాలి అది ఉండటం లేదు. పురుషార్ధం యొక్క ప్రాలబ్దం యొక్క జ్ఞానం ఉన్నప్పటికీ దాని తగుల్పాటు లేకుండా ఉండే స్థితి తక్కువగా ఉంటుంది.

ఉదాహరణకు మీరు ఎవరికైనా సేవ చేసినప్పుడు 8 మందికి చెప్తారు. దాని ఫలితంలో ఒకరు, ఇద్దరు మీ మహిమ చేస్తారు. రెండవ వారు మహిమ చేయరు, నిందించరు, గంభీరతతో నడుస్తారు. మీ ధ్యాస కూడా ఆ 8 మందిలో ఒకటి, రెండు శాతంలో ఉన్న ఆ ఇద్దరు, ముగ్గురి వైపే వెళ్ళిపోతుంది. (ఎవరైతే మహిమ చేసారో వారి వైపు) వారి గంభీరత యొక్క పరిశీలన తక్కువగా ఉంటుంది. బయటికి ఎవరైతే మహిమ చేసారో దానిని స్వీకరించే సంస్కారం ప్రత్యక్షం అయిపోతుంది. దీనినే మరో మాటలో వీరి స్వభావం, వీరి సంస్కారం కలుస్తుంది అని అంటారు. ఫలానా వారి సంస్కారం కలవటం లేదు. కనుక దూరంగా ఉంటున్నాము అంటున్నారు. కాని వాస్తవానికి ఇది సూక్ష్మ ఫలాన్ని స్వీకరించటం. ముఖ్య కారణం ఏమిటంటే - చేస్తారు మరియు దాని ఫలితం యొక్క నిరీక్షణ ఉంటుంది. వీరు నా గురించి ఏమన్నారు? అని మొదట ధ్యాస దాని వైపు వెళ్ళిపోతుంది. నేను ఉపన్యాసం చెప్పాను కదా, అందరు ఏమన్నారు? దీనిపై ధ్యాస వెళ్ళిపోతుంది. స్వయాన్ని ముందుకి తీసుకువెళ్ళే లక్ష్యంలో ఫలితం తెలుసుకోవటం, స్వయం యొక్క సేవా ఫలితాన్ని తెలుసుకోవటం, స్వ ఉన్నతి గురించి తెలుసుకోవటం ఇది వేరే విషయం. కానీ మంచి మరియు చెడు యొక్క కోరిక పెట్టుకోవటం వేరే విషయం. ఇప్పుడిప్పుడే చేసారు, ఇప్పుడిప్పుడే తీసేసుకుంటే ఏమీ జమ అవ్వదు. దానిలో విల్ పవర్ ఉండదు. వారు లోపల సదా బలహీనంగా ఉంటారు, శక్తిశాలిగా ఉండరు. ఎందుకంటే ఖాళీ, ఖాళీగా ఉంటారు కదా! నిండుగా ఉన్న వస్తువు శక్తిశాలిగా ఉంటుంది. కనుక ముఖ్య కారణం ఇదే. అందువలన ముగ్గిన ఫలాన్ని తీసుకుని ఎదురుగా వచ్చేవారు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఎప్పుడైతే ఈ విషయం సమాప్తి అయిపోతుందో అప్పుడు నిరాకారి, నిర్వికారి, నిరహంకారి - మనసా, వాచా, కర్మణాలో మూడు సబ్జక్టులు కనిపిస్తాయి. శరీరంలో ఉంటూ నిరాకారి ఆత్మిక రూపం కనిపిస్తుంది. ఎలా అయితే సాకార బాబా ముసలివారు అయినా కానీ శరీరం కనపడకుండా ఆత్మను చూసేవారు. వ్యక్తం మాయం అయిపోయి అవ్యక్తం కనిపించేది. సాకారంలో నిరాకారి స్థితి ఉన్న కారణంగా నిరాకారం లేదా ఆకారం కనిపించేది. ఇటువంటి స్థితి ప్రత్యక్షంగా ఉంటుంది. ఇప్పుడు స్వయం కూడా మాటి మాటికి దేహాభిమానంలోకి వస్తే ఇతరులకు నిరాకారం లేదా ఆకార రూపం యొక్క సాక్షాత్కారం అవ్వదు. ఈ మూడు ఉండాలి - మనస్సులో నిరాకారి స్థితి, వాచాలో నిరహంకారి మరియు కర్మలో నిర్వికారిగా ఉండాలి. కొద్దిగా కూడా వికారాలు ఉండకూడదు. అంశం ఉన్నా వంశం వచ్చేస్తుంది. సంకల్పంలో కూడా వికారం యొక్క అంశం ఉండకూడదు. ఎప్పుడైతే ఈ మూడు స్థితులు వస్తాయో అప్పుడు మీ ప్రభావంతో ఎవరైతే వారసులు, ప్రజలు రావాలో వారు వెంటనే వచ్చేస్తారు. మీరు ఇప్పుడు ఏదైతే శ్రమ యొక్క అవినాశి బీజం వేస్తున్నారో దానికి ఫలం మరియు కొన్ని ప్రత్యక్ష ప్రభావాలు రెండు వస్తాయి. మరలా వేగవంతమైన సేవ కనిపిస్తుంది. కనుక ఇప్పుడు కారణం అర్ధం చేసుకున్నారు కదా? దీని నివారణ చేయాలి. కేవలం వర్ణన వరకు ఉంచకూడదు. అప్పుడు ఏమౌతుంది? సాక్షాత్కారమూర్తిగా అయిపోతారు. మూడు స్థితులు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఈ రోజుల్లో అందరు ఇది చూడాలనుకుంటున్నారు. కానీ వినాలనుకోవటంలేదు. ద్వాపరయుగం నుండి వింటూ వచ్చారు. చాలా విని, విని విసిగిపోయారు. భక్తిమార్గంలో కూడా విన్నారు మరియు ఈరోజుల్లో నేతలు కూడా చాలా చెప్తున్నారు. కనుక విని, విని అలసిపోయారు. అందరు ఏదోకటి చేసి చూపించండి. ప్రత్యక్ష ఋజువు ఇవ్వండి అని చెప్తున్నారు. అప్పుడే ఏదో చేస్తున్నారు అని అర్ధం చేసుకుంటారు. మీ యొక్క ప్రత్యక్ష నడవడికయే ప్రత్యక్ష ఋజువు. ప్రత్యక్షంలో ఏ ఋజువు చూపించవలసిన అవసరం లేదు. కనుక ఇప్పుడు ప్రత్యక్ష నడవడికలోకి రావాలి. భవిష్యత్తులో మహా వినాశనం అవ్వవలసిందే మరియు క్రొత్త సృష్టి రావల్సిందే. అది కూడా మీ ముఖకవళికల ద్వారా కనిపించాలి. చూస్తే స్వతహాగా వైరాగ్యం వచ్చేస్తుంది. ఒకవైపు వైరాగ్యం, రెండవ వైపు తమ భవిష్యత్తుని తయారు చేసుకునే ఉత్సాహం వస్తుంది. ఒక కంటిలో ముక్తి, రెండవ కంటిలో జీవన్ముక్తి అంటారు కదా! వినాశనం ముక్తికి ద్వారం మరియు స్థాపన జీవన్ముక్షికి ద్వారం. రెండు నయనాలలో ఇది కనిపించాలి. ఈ పాత ప్రపంచం వెళ్ళిపోనున్నది అని నయనాలు మరియు మస్తకం మాట్లాడాలి. మస్తకం కూడా చాలా మాట్లాడుతుంది. ఎవరి భాగ్యమైనా మస్తకమే చూపిస్తుంది. వీరు చాలా పెద్ద చమత్కారులు అని అనుకుంటారు. అలా ఎప్పుడైతే సేవ చేస్తారో అప్పుడే జయజయకారాలు వస్తాయి. ఇప్పుడు విశ్వం ముందు ఒక ఉదాహరణగా అవ్వాలి. అనేక స్థానాలు, సేవాకేంద్రాలు ఉన్నప్పటికీ అందరు ఒకటిగా ఉండాలి. అందరు బేహద్ బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. బేహద్ యజమాని మరియు మరలా పిల్లలుగా ఉండాలి. కేవలం యజమానులుగా అవ్వకూడదు. పిల్లల నుండి యజమానులుగా, యజమానుల నుండి పిల్లలుగా అవ్వాలి. ఒకరికొకరు ప్రతి ఒక్కరి సలహాకు గౌరవం ఇవ్వాలి. వారు చిన్నవారైనా, పెద్దవారైనా, విద్యార్థులైనా వెంట ఉండేవారైనా - ప్రతి ఒక్కరి సలహాకు తప్పకుండా గౌరవం ఇవ్వాలి. ఎవరికి అయినా మొదట అయితే గౌరవం తప్పకుండా ఇవ్వాలి. తర్వాత మీరు ఏదైనా తెలివి చెప్పటం అది రెండవ విషయం . మొదటే ఇది తప్పు, ఇది జరగదు అని కట్ చేయకూడదు. అది వారి సలహాను అగౌరవపరిచినట్లు. దీని ద్వారా వారిలో కూడా అగౌరవం యొక్క బీజం పడుతుంది. ఎలా అయితే తల్లి, తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు ఆ తల్లి,తండ్రిని కాపీ చేసే సంస్కారం పిల్లలకు స్వతహాగా ఉంటుంది. తల్లి,తండ్రి పిల్లలకు ఏమీ నేర్పించరు. ఇక్కడ కూడా వీరు అలౌకిక జన్మలో పిల్లలు. పెద్దవారు తల్లి, తండ్రితో సమానం.మీరు వారి సలహాను అగౌరవపరిస్తే రేపు వారు మిమ్మల్ని అగౌరవపరుస్తారు. కనుక ఆ బీజం ఎవరు వేసారు? నిమిత్తమైనవారే కదా! ఎలుక మొదట ఊది తర్వాత కాటు వేస్తుంది. కనుక వ్యర్థాన్ని కూడా కట్ చేయాలంటే మొదట వారికి గౌరవం ఇవ్వండి. తర్వాత వారిని కట్ చేయటం కాదు, కానీ మనకు ఈ శ్రీమతం లభించింది అని అర్థం చేయిస్తాము. గౌరవం ఇచ్చి ముందుకి తీసుకువెళ్ళటంలో వారు సంతోషం అయిపోతారు. ఎవరినైనా సంతోషం చేసి ఏ పని అయినా చేయించుకోవటం సహజం అయిపోతుంది. ఒకరి విషయాన్ని ఒకరు ఎప్పుడు కట్ చేయకూడదు. అలాగే, ఎందుకు అవ్వదు, చాలా మంచిది - ఈ మాటలే గౌరవాన్ని ఇస్తాయి.మొదటే కాదు అంటే నాస్తికులు అయిపోతారు. మొదట సదా అలాగే అనండి అది ఏ విషయమైనా కానీ. వారి డబ్బా మంచిగా ఉంటుంది. కనుక ప్రజలు ప్రభావితం అయిపోతారు. అలాగే సంపర్కంలోకి వచ్చినప్పుడు మీ మాట మరియు స్వరూపం కూడా అలా ఉండాలి. రూపంలో కాదు అనే రూపురేఖ ఉండకూడదు. దీనిలో దయ మరియు శుభ కళ్యాణ భావన ద్వారా ముఖంలో ఎప్పుడు మార్పు రాదు. మాటలు కూడా యుక్తియుక్తంగా వస్తాయి. బాప్ దాదా కూడా ఎవరికైనా శిక్షణ ఇచ్చేటప్పుడు మొదట స్వమానం ఇచ్చి తర్వాత శిక్షణ ఇస్తారు. ఈరోజుల్లో వచ్చేవారికి తమ గౌరవం కోరుకునేవారికి, తిరస్కరించేవారికి స్వమానం యొక్క గౌరవం ఇవ్వాలి. అందువలన ఎప్పుడు ఎవ్వరిని అగౌరవపరచకూడదు. మొదట గౌరవం ఇచ్చి తర్వాత తెంచండి. విశేషతను మొదట వర్ణన చేయండి. తర్వాత బలహీనత గురించి చెప్పండి. ఎలా అయితే ఆపరేషన్ చేసేటప్పుడు మొదట ఇంజక్షన్ చేసి తెలివిని మరిపింపచేస్తారు. మొదట వారిని గౌరవంతో ఆ నషాలో స్థిరం చేయండి, తర్వాత ఏ ఆపరేషన్ చేసినా ఆ ఆపరేషన్ విజయవంతం అవుతుంది. ఇది కూడా ఒక పద్ధతి. ఎప్పుడైతే ఈ సంస్కారం నింపుకుంటారో, అప్పుడు విశ్వం నుండి మీకు గౌరవం లభిస్తుంది. ఒకవేళ ఆత్మలకు తక్కువ గౌరవం ఇస్తే ప్రాలబ్దంలో కూడా తక్కువ గౌరవం లభిస్తుంది. మంచిది.