02.08.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ప్రతి కర్మ విధిపూర్వకంగా చేయటం ద్వారా సిద్ధి యొక్క ప్రాప్తి.

స్వయాన్ని విధి ద్వారా సిద్ధి పొందే ఆత్మగా భావిస్తున్నారా? ఎందుకంటే మీరు ఏదైతే పురుషార్ధం చేస్తున్నారో ఆ పురుషార్ధం యొక్క లక్ష్యం ఏమిటంటే - సిద్ధిని పొందటం. ఎలా అయితే ఈ రోజుల్లో ప్రపంచం వారు రిద్ది, సిద్ది చాలా చేస్తున్నారు కదా! కానీ మీకు సిద్ధి అనేది విధి ద్వారా ప్రాప్తిస్తుంది. యదార్ధవిధి మరియు సిద్ది దానినే వారు రిద్ధి, సిద్ధి రూపంగా మార్చేసారు. ఇలా స్వయాన్ని సిద్ది స్వరూపంగా భావిస్తున్నారా? మీరు ఏ సంకల్పం చేస్తున్నా యదార్ధంగా విధిపూర్వకంగా చేసినట్లయితే దాని ఫలితం ఎలా వస్తుంది? ఆ సంకల్పానికి సిద్ధి లభిస్తుంది. ప్రతి సంకల్పం, ప్రతి కర్మ విధిపూర్వకంగా చేయటం ద్వారా సిద్ధి తప్పకుండా లభిస్తుంది. ఒకవేళ సిద్ది లభించటం లేదు అంటే మీరు విధిపూర్వకంగా చేయలేనట్లే. అందువలనే భక్తిలో కూడా ఏ కార్యం చేస్తున్నా లేదా చేయిస్తున్నా విధిపై ఎక్కువగా విలువ ఉంచుతారు. విధిపూర్వకంగా ఉన్నప్పుడే దాని సిద్ది మనకి అనుభవం అవుతుంది. అది కూడా ఇక్కడి నుండే ప్రారంభం అయ్యింది కదా! స్వయాన్ని సిద్ధి స్వరూపంగా అనుభవం చేసుకుంటున్నారా? లేక ఇప్పుడు తయారవ్వాలా? సమయానుసారం రిద్ధి, సిద్ది ఈ రెండు విషయాలలో కూడా 95 శాతం ఫలితం కనిపించాలి. ఎందుకంటే సమయం యొక్క వేగాన్ని మీరు చూస్తున్నారు మరియు ప్రతిజ్ఞ కూడా చేస్తున్నారు. మీరు చేసిన ప్రతిజ్ఞ ఎప్పుడు సంపన్నం అవుతుంది అంటే మీ స్థితి సంపన్నంగా కావాలి. మీరు ఏదైతే ప్రతిజ్ఞ చేస్తున్నారో ఆ పరివర్తన దేని ఆధారంగా జరుగుతుంది? దానికి పునాది ఏమిటి? మీరే పునాది కదా! ఒకవేళ పునాది గట్టిగా లేకపోతే ఇక ముందు కార్యం ఎలా నడుస్తుంది? ఎప్పుడైతే పునాది మంచిగా తయారవుతుందో అప్పుడు దాని తర్వాత నెంబర్ వారీ రాజధాని కూడా తయారవుతుంది. ఎవరైతే రాజ్యం చేసే అధికారులు ఉన్నారో వారు తమ రాజ్యం యొక్క అధికారం తీసుకోకపోతే ఇతరాత్మలకు నెంబర్ వారీ అధికారాన్ని ఏ విధంగా ఇస్తారు? నాలుగు సంవత్సరాలు అని ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా! ఆ లెక్కతో విశ్వపరివర్తన యొక్క కార్యం జరిగినప్పుడు మరి మీరు మీ స్థితి ద్వారా, విధి ద్వారా సిద్ధిని ఎప్పుడు పొందుతారు? ఈ విశ్వకళ్యాణం యొక్క కర్తవ్యంలో సిద్ధి ఎలా పొందుతారు? విశ్వకళ్యాణం యొక్క కార్యంలో సిద్ధి పొందాలంటే మొదట స్వయం సిద్ధి పొందాలి. ఇంత పెద్ద కార్యం కొద్ది సమయంలో సంపన్నం చేయాలంటే మీలో ఎంత వేగం ఉండాలి? ఇప్పటికి స్థాపన అయ్యి 35 సంవత్సరాలు అయ్యింది 50 శాతం తయారయ్యారు. మరి నాలుగు సంవత్సరాలలో 100 శాతం వరకు తీసుకు రావాలంటే మీరు ఏమి చేయాలి? దీని కోసం ఏదైనా ప్లాన్ తయారుచేసారా? వేగాన్ని ఎలా పూర్తి చేస్తారు? సిద్ది స్వరూపంగా కావాలి, సంకల్పం చేయగానే సిద్ధి లభించాలి. ఇది 100శాతం సిద్ధి స్వరూపానికి గుర్తు. సంకల్పం చేయగానే సిద్ది లభించాలి. సాధారణ ఙ్ఞానం ఆధారంగా బయటి ప్రజలు రిద్ది, సిద్ధిని పొందుతున్నారు. మరి మీరు శ్రేష్ఠ జ్ఞానం ఆధారంగా విధి ద్వారా సిద్ధిని పొందలేరా? కనుక నాకు సిద్ధి రావటం లేదు అంటే ఏ విధి లోపంగా ఉంది అని పరిశీలించుకోండి. విధిని పరిశీలించుకోవటం ద్వారా సిద్ధి స్వతహాగా వచ్చేస్తుంది. సిద్ది ప్రాప్తించటం లేదు అంటే మూల కారణం ఏమిటంటే ఒకే సమయంలో మీరు మూడు రూపాల ద్వారా సేవ చేయటం లేదు. ఇప్పుడు మూడు రూపాలు ద్వారా మరియు మూడు పద్ధతుల ద్వారా ఒకే సమయంలో సేవ చేయాలి. నాలెడ్జ్ ఫుల్ (జ్ఞానస్వరూపులు) పవర్‌ఫుల్ (శక్తిశాలి) మరియు లవ్ ఫుల్ (ప్రేమ స్వరూపులు) అయ్యి సేవ చేయాలి. ప్రేమ మరియు నియమం రెండు వెనువెంట ఉండాలి. ఈ మూడురూపాల ద్వారా మూడు పద్ధతుల ద్వారా సేవ చేయాలి అంటే మనసా, వాచా, కర్మణా మూడు పద్ధతుల ద్వారా ఒకే సమయంలో మూడు రూపాలతో సేవ చేయాలి. వాణీ ద్వారా సేవ చేసేటప్పుడు మనస్సులో కూడా పవర్‌ఫుల్ అంటే శక్తిశాలి స్థితి ఉండాలి. మీరు ఎప్పుడైతే శక్తిశాలి స్థితిలో స్థితులై సేవ చేస్తారో అప్పుడు ఇతరాత్మల మనస్సుని కూడా పరివర్తన చేయగలుగుతారు. వాణీ ద్వారా వారిని జ్ఞానస్వరూపంగా తయారు చేయగలుగుతారు మరియు కర్మ ద్వారా అంటే మీ సంపర్కంలోకి వచ్చిన ఆత్మలకు స్వతహాగానే వారికి మేము భగవంతుని కుటుంబంలోకి చేరుకున్నాము అనే అనుభూతి కలుగుతుంది మీ నడవడిక ద్వారా ఇదే నా అసలైన కుటుంబం అని వారికి అనుభూతి కలిగించాలి. ఇలా మనస్సు ద్వారా ఆత్మలను శక్తిశాలిగా చేయాలి. నోటి ద్వారా జ్ఞానాన్ని అందించి జ్ఞానస్వరూపంగా చేయాలి. కర్మ ద్వారా భగవంతుని కుటుంబంలోకి చేరినట్లు ఆ ఆత్మలకు అనుభవం చేయించాలి. ఇలా మూడు పద్ధతులతో సేవ చేయండి, మనస్సుని కూడా అదుపులో ఉంచుకోండి. మాట ద్వారా జ్ఞానాన్ని ఇచ్చి లైట్,మైట్ యొక్క వరదానాన్ని ఇవ్వండి. కర్మ ద్వారా సంపర్కం ద్వారా మీ నడవడిక ద్వారా భగవంతుని కుటుంబంలోకి చేరాము అనే అనుభూతి చేయించండి. ఇలా మూడు రకాలుగా, మూడు స్వరూపాలతో సేవ చేయటం ద్వారా సిద్ది లభించదా? ఇలా ఒకే సమయంలో మూడు పద్ధతులతో, మూడు రూపాలతో సేవ చేయలేకపోతున్నారా? వాచాలోకి వచ్చినప్పుడు మనస్సు కూడా శక్తిశాలిగా ఉండాలి, కానీ అలా ఉండటంలేదు మీ రమణీయక ప్రవర్తన ద్వారా ఎవరు మీ సంబంధ, సంపర్కంలోకి వచ్చినా మనస్సులో కూడా వారు శక్తిశాలిగా తయారవ్వాలి. ఇలా ఒకే సమయంలో మూడు రకాలైన సేవలు చేస్తే సిద్ది తప్పకుండా లభిస్తుంది. ఈ విధంగా సేవ చేసే అభ్యాసం మరియు ధ్యాస ఉండాలి. కానీ ఇప్పుడు ఆత్మలు సంబంధంలోకి రావటం లేదు. లోతుగా సంపర్కంలోకి రావటం లేదు, పై పైకి వచ్చి వెళ్ళిపోతున్నారు. ఆ పై పైకి వచ్చిన వారికి ఆ సంపర్కం అల్పకాలిక అనుభూతినే చేయిస్తుంది. భలే ప్రేమ అనే సంబంధంలోకి తీసుకువస్తున్నారు, కానీ ప్రేమ స్వరూపంతో పాటు శక్తి స్వరూపంగా కూడా తయారుచేయాలి. ఆ ఆత్మలలో శక్తిని నింపాలి. దాని ద్వారా వారు సమస్యలను, వాయుమండలాన్ని, తరంగాలను ఎదుర్కుని సదాకాలికంగా బాబా సంబంధంలో ఉండాలి. ఆత్మలను ఇలా తయారుచేయాలి అయితే జ్ఞానానికి ఆకర్షితం అవుతున్నారు లేదా ప్రేమకు ఆకర్షితం అవుతున్నారు, ఎక్కువ ప్రేమకు ఆకర్షితం అవుతున్నారు. రెండవ నెంబర్‌గా ఙ్ఞానానికి ఆకర్షితం అవుతున్నారు. కాని దానితో పాటు మీరు శక్తిశాలిగా తయారుచేయాలి. దీని ద్వారా వారికి ఏ విషయం ఎదురుగా వచ్చినా చలించకూడదు. ఇలా ఎవరైతే సేవకు నిమితంగా అయ్యారో వారికి ఙ్ఞానం ఎక్కువగా ఉంటుంది, ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ శక్తి తక్కువగా ఉంటుంది. శక్తిశాలి స్తితికి గుర్తు ఏమిటి? ఒక సెకనులో ఎటువంటి వాయుమండలాన్ని అయినా, వాతావరణాన్ని అయినా, మాయ యొక్క ఏ సమస్యనైనా సమాప్తి చేయగలుగుతారు. ఎప్పుడు ఓడిపోరు. ఎవరైతే సమస్యారూపంగా వస్తారో వారు కూడా వారికి బలిహారం అయిపోతారు. దీనినే మీరు ప్రకృతి దాసీ అయిపోతుంది అని అంటారు. ఇలా ఎప్పుడైతే ప్రకృతి యొక్క పంచతత్వాలు దాసీ అయిపోతాయో మనుష్యాత్మలు బలిహారం అవ్వరా? శక్తిశాలి స్థితికి ప్రత్యక్ష రూపం ఇదే - ప్రకృతి దాసి అవ్వటం, మనుష్యాత్మలు బలిహారం అవ్వటం. అందువలనే ఒకే సమయంలో మూడు రూపాల ద్వారా సేవ చేయటం ద్వారా రూపురేఖ తయారవుతుంది. దాని ద్వారా ప్రతి కర్తవ్యంలో సిద్ది లభిస్తుంది. విధి కారణంగా సిద్ధి తప్పకుండా లభిస్తుంది. విధిలో లోపం ఉంటే సిద్దిలో కూడా లోపం వచ్చేస్తుంది. కనుక సిద్ధిస్వరూపంగా అయ్యేటందుకు మొదట ఈ విధిని మంచిగా చేసుకోండి. భక్తిమార్గంలో సాధనాలను ఉపయోగించుకుంటారు. కానీ మీరు ఇక్కడ సాధన చేస్తున్నారు. ఏ సాధన చేస్తున్నారు? బాప్ దాదా యొక్క ప్రతి విశేషతను స్వయంలో ధారణ చేస్తూ చేస్తూ ఉంటే స్వయం విశేషాత్మగా అయిపోతారు. పరీక్ష రోజులు సమీపంగా వచ్చేటప్పుడు పిల్లలు చాలా ఎక్కువగా చదువుకుంటారు కదా! ప్రత్యక్ష పరీక్షలో అన్నింటిలో వచ్చిన ప్రశ్నలను రివైజ్ చేసుకుని పరిశీలించుకుంటారు. నాలో ఏ సబ్జక్టులో ఏమేమి లోపం ఉంది అని. ఇప్పుడు సమయం సమీపంగా వస్తుంది. కనుక మీరు ప్రతి సబ్జక్టులో స్వయాన్ని పరిశీలించుకోండి. ఏ శాతంలో, ఏ సబ్జక్టులో నాలో లోపం ఉంది అని. చిన్న చిన్న పరీక్షలలో కూడా పరిశీలించుకోవాలి, పెద్ద పరీక్షలలో కూడా శాతాన్ని పరిశీలించుకోవాలి. ప్రతి సబ్జక్టు యొక్క లోపాన్ని పరిశీలించుకుని స్వయాన్ని సంపన్నం చేసుకోవాలి. ఇలా మీలో ఉన్న లోపం మీరు రివైజ్ చేసుకుంటూ ఉన్నప్పుడు తెలుస్తుంది. సబ్జక్ట్ అయితే మీకు తెలుసు కదా! ఆ సబ్జక్టుని బుద్ధిలో ధారణ చేసారా లేదా అనే పరిశీలన ఏమిటి? ఇలా పరిశీలించుకుంటూ ఉంటే సిద్ది యొక్క శాతం పెరుగుతూ ఉంటుంది. సమయం కూడా వ్యర్ధం అవ్వదు. కొద్ది సమయంలో ఎక్కువ సఫలత వస్తుంది. దీనినే సిద్ధి అంటారు. ఒకవేళ సమయం ఎక్కువ అవుతుంది, అంటే మీరు ఎక్కువ శ్రమ పడుతున్నారు. అయినప్పటికి సఫలత లభించటం లేదు అంటే మీకు సిద్ధి యొక్క శాతం తక్కువగా ఉన్నట్లే. తక్కువ సమయం పెట్టాలి, తనువుని కూడా తక్కువ సమయం ఉపయోగించాలి. మనస్సు, సంకల్పం అన్ని తక్కువగా ఉపయోగపడాలి, లేదంటే మీరు సంకల్పాలు చేస్తున్నారు, ప్లాన్స్ తయారుచేస్తున్నారు, చాలా నెలలు గడిచిపోతున్నాయి. కానీ వాటిని ప్రత్యక్షంలోకి తీసుకురావటం లేదు. కనుక సమయం శక్తులు మరియు సమయం ఈ ఖజానాలన్నీ కూడా ఎక్కువ సమయం ఉపయోగించకుండా తక్కవ ఖర్చు, ఎక్కువ ఫలితంతో మీరు సఫలత పొందాలి. మీకు ఎలాంటి సంకల్పం రావాలంటే ఆ సంకల్పం సిద్ధించేదిగా ఉండాలి. దీనినే సిదిస్వరూపం అని అంటారు. అన్ని సబ్జక్టులలో మేము ఎంత వరకు పాస్ అయ్యాము అనేది పరిశీలించుకోవాలి. దీని పరిశీలన ఏమిటి? ఎవరు ఎంతగా అన్ని సబ్బక్టులలో పాస్ అవుతారో ఆ సబ్జక్టు అధారంగా లక్ష్యం కూడా పొందుతారు. తర్వాత గౌరవం కూడా లభిస్తుంది. ప్రాప్తి యొక్క అనుభవం కూడా అవుతుంది. జ్ఞానమనే సబ్జక్టు యొక్క లక్ష్యం ఏమిటి? జ్ఞానం ద్వారా లైట్,మైట్ మీకు ప్రాప్తిస్తుంది. అలాగే జ్ఞానం యొక్క సబ్జక్టు ఆధారంగా మీకు అందరి నుండి గౌరవం లభిస్తుంది. దైవీ పరివారం ద్వారా మరియు ఇతరాత్మల నుండి కూడా మీకు గౌరవం లభిస్తుంది. ఈ రోజుల్లో మహానాత్మలు వారికి ఆ గౌరవం ఎక్కడి నుండి లభిస్తుంది? వారు సాధన చేస్తున్నారు, ఏదైతే సబ్జక్టు ఉందో ఆ సబ్జక్టు యొక్క అధ్యయనం చేస్తూ ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అందుకు వారికి అందరి నుండి గౌరవం లభిస్తుంది. ప్రకృతి దాసీ అయిపోతుంది. ఇది జ్ఞానం యొక్క విషయం. అలాగే మీరు కూడా ఎంతెంతగా జ్ఞానమనే సబక్టులో ముందుకి వెళ్తారో, అంతంతగా ఙ్ఞానమనే ప్రకాశం, శక్తి మీకు అనుభవం అవుతుంది. దానితో పాటు దైవీ పరివారం నుండి, ఇతరాత్మల నుండి కూడా మీకు గౌరవం ప్రాప్తిస్తుంది. అలాగే యోగం యొక్క సబ్జక్ట్, దీని యొక్క లక్ష్యం ఏమిటి? యోగం అంటే స్మృతి శక్తి ద్వారా మీరు ఏదైతే సంకల్పం చేస్తారో ఆ సంకల్పం సమర్ధవంతంగా ఉండాలి. ఏ సమస్య మీ ముందు రాకూడదు. ఏదైనా సమస్య వచ్చినా మీకు యోగశక్తి ద్వారా ఇది జరగనున్నది అని మొదటే మీకు అనుభవం అవ్వాలి. ఇలా మొదటే తెలిసిపోయిన కారణంగా మీరు ఓడిపోరు. ఇలా యోగం యొక్క సబ్బక్టులో యోగం యొక్క శక్తి ద్వారా మీ పాత సంస్కారాల బీజాన్నీ సమాప్తి చేసుకోవాలి. ఏ సంస్కారం మీ పురుషార్ధంలో విఘ్నంగా కాకూడదు. ఇలా యోగం యొక్క సబ్బక్టులో మీకు ఏదైతే లక్ష్యం ఉందో అది అనుభవం అవ్వాలి. ఈ లక్ష్యం ద్వారా మీరు గౌరవం పొందగలుగుతారు. ఇలా మీ నోటి నుండి ఏవైతే మాటలు రిపీట్ చేస్తూ ఉంటారో, ఏవైతే ప్లాన్స్ తయారు చేస్తూ ఉంటారో అవి సమర్ధంగా ఉన్న కారణంగా అందరి నుండి మీకు గౌరవం ప్రాప్తిస్తుంది. అంటే ఒకరికొకరు మీరు సలహా ఇచ్చినప్పుడు ఆ సలహాకు అందరు గౌరవం ఇస్తారు. ఎందుకంటే అది సమర్థవంతంగా ఉంటుంది. ఇలా ప్రతి సబ్జక్టుని పరిశీలించుకోండి, అలాగే దివ్యగుణాల సబ్జక్ట్, అలాగే సేవా సబ్జక్ట్ వీటి యొక్క ప్రాప్తి ఏదైతే ఉందో వీటి ద్వారా కూడా మీరు సమీప సంబంధ సంపర్కంలోకి రావాలి. సమీప సంబంధ సంపర్కంలోకి రావటం ద్వారా స్వతహాగానే మీకు గౌరవం లభిస్తుంది. ఇలా ప్రతి సబ్జెక్టు యొక్క లక్ష్యాన్ని పరిశీలించుకోండి. ఈ లక్ష్యాన్ని పరిశీలించుకునే సాధనం ఏమిటంటే అందరి నుండి గౌరవం పొందటం. మీరు జ్ఞానస్వరూప ఆత్మలు మరి మీరు ఇతరాత్మలకు గౌరవం ఇస్తున్నారంటే వారు ఆ జ్ఞానానికి ఇంత గౌరవం ఇస్తున్నారా? జ్ఞానానికి గౌరవం ఇవ్వటం అంటే జ్ఞానస్వరూపంగా అయ్యి మీకు గౌరవం ఇవ్వటం. జ్ఞానం యొక్క సబ్జక్టులో లక్ష్యం ఏమిటంటే సంకల్పాలను సమర్ధవంతంగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకుంటున్నారంటే వారు తప్పకుండా జ్ఞానానికి గౌరవం ఇచ్చినట్లే. ఇలా ప్రతి సబ్జక్టుని పరిశీలించుకోండి. ప్రతి సంకల్పంలో మీ లక్ష్యం మరియు గౌరవం రెండింటి ప్రాప్తి యొక్క అనుభవం మీకు కలుగుతున్నప్పుడు మీరు పరిపక్వంగా అయినట్లు, పరిపక్వంగా అవ్వటం అంటే ఏ లోపం మీలో ఉండకూడదు. శరీరం యొక్క, సంకల్పాల యొక్క సంపర్కంలోకి రావటం ద్వారా వాయుమండలం, తరంగాలు వీటన్నింటి ప్రభావాలకు అతీతంగా ఉండాలి. అటువంటి ఆత్మనే పరిపక్వ ఆత్మ అని అంటారు. అప్పుడు మీరు ఈ సబ్జక్టులో పాస్ అయినట్లు, పరిపక్వంగా అయినట్లు మరి ఇలా తయారవుతున్నారా? మీ లక్ష్యం అయితే ఇదే కదా! కనుక ఇప్పుడు ఎక్కువగా పరిశీలించుకోవాలి. ఇతరులకు సమయంతో పాటు స్వయాన్ని కూడా పరివర్తన చేసుకోండి అని చెప్తారు కదా! అలాగే సదా మీరు కూడా ఇదే స్మృతిలో ఉంచుకోండి. సమయంతో పాటు నేను కూడా స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి అని. ఇలా స్వయం పరివర్తన అవుతూ ఉంటే సృష్టి కూడా పరివర్తన అయిపోతుంది. మీ పరివర్తన ఆధారంగానే సృష్టిలో పరివర్తన తీసుకువచ్చే కార్యం చేయగలుగుతారు. ఈ శ్రేష్టత ఇతరులలో లేదు. వారు కేవలం ఇతరులను పరివర్తన చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు స్వయం ఆధారంగా సృష్టిని పరివర్తన చేస్తున్నారు. కనుక మీరు ఇంత ధ్యాస పెట్టుకోవాలి. మా సంకల్పం వెనుక మొత్తం విశ్వకళ్యాణం యొక్క ఆధారం ఉంది అని అంటే మా సంకల్పం విశ్వకళ్యాణానికి సంబంధం అనే స్మృతి ఉంచుకోండి. కనుక ఆధారమూర్తులు అంటే స్వయం యొక్క పరివర్తనలో సమర్థత లేకపోతే సమయం యొక్క పరివర్తనలో కూడా బలహీనత వచ్చేస్తుంది. కనుక ఎంతెంత మీరు సమర్ధంగా తయారవుతూ ఉంటారో అంతంత సృష్టి పరివర్తన కూడా సమీపంగా వస్తుంది. డ్రామానుసారం సృష్టి పరివర్తన అనేది నిశ్చమైపోయింది. కానీ దేని ఆధారంగా తయారవుతుంది? ఆధారమైతే ఉంటుంది కదా! మరి ఆ ఆధారమూర్తులు మీరే. ఇప్పుడు మీరు అందరి దృష్టిలో ఉన్నారు. నాలుగు సంవత్సరాలు అని ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా! ఇలా ఏవైతే విషయాలు మీరు చెప్తున్నారో వీటిలో చాలా మందికి నిజమా కాదా అని సంకల్పాలు నడుస్తాయి. నాలుగు సంవత్సరాలలో కాకపోతే ఎలా ఈ సంకల్పాలు కూడా వస్తుంటాయి కదా! ఎదుర్కుంటారు ఇది వేరే విషయం కానీ సంకల్పాలు అయితే ఏవోకటి వస్తూ ఉంటాయి కదా! మరి నాలుగు సంవత్సరాలలో అయిపోతుంది అని పూర్తిగా పక్కాగా ఉందా? ఎవరైనా మిమ్మల్ని వినాశనం అవ్వకపోతే ఏం చేస్తారు? అని అడిగితే ఏం చెప్తారు? ఆ సమయంలో వారికి స్పష్టంగా చెప్పాలి. నాలుగు సంవత్సరాలలో పూర్తి వినాశనం అవ్వదు. కానీ వినాశనానికి సంబంధించిన దృశ్యాలు మీకు కనిపిస్తాయి అని అంటే వినాశనం ప్రారంభం అవుతుంది అని చెప్పాలి. వినాశనానికి కూడా సమయం పడుతుంది కదా! ఒకేసారి వినాశనం అవ్వదు. ఇలా స్వయం సంపూర్ణం అయిపోతే కార్యం కూడా సంపూర్ణంగా అయిపోతుంది. ఇలా స్వయమే సంపూర్ణంగా కావాలా? ఎడ్వాన్స్ పార్టీ కూడా తమ కార్యం తాము చేస్తున్నారు. మీ కోసం వారు మొత్తం ఫీల్డ్ తయారుచేస్తున్నారు. ఆ పరివారంలోకి వెళ్ళండి, వెళ్ళకపోండి కానీ స్థాపనకు నిమిత్తమైన ఆత్మలు ఆ స్థాపనాకార్యం చేయడానికి నిమిత్తంగా అయ్యారు. శక్తిశాలి స్థితితో నిమిత్తంగా తయారయ్యారు. వారు శక్తుల ద్వారా స్థాపనాకార్యంలో సహాయకారి అవుతున్నారు. ఈరోజుల్లో ఎక్కువగా మీరు చూస్తున్నారు న్యూ బ్లడ్ అని. క్రొత్త రక్తానికి ఎక్కువ గౌరవాన్ని ఇస్తున్నారు. ఎంత మీరు ముందుకి వెళ్తారో అంతగా చిన్నపిల్లల బుద్ది ఎక్కువగా పనిచేస్తుంది. పెద్దవారిది కాదు, ఇలాంటి పరివర్తన కనిపిస్తుంది. పెద్దవారు కూడా చిన్నవారి సలహాకు గౌరవం ఇస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు పెద్దవారు అనుకుంటున్నారో వారు ఇప్పుడు పాతవారిగా అయిపోయారు. ఈ రోజుల్లో వారికి గౌరవం ఇవ్వటం లేదు, పెద్దవారిగా భావించి నడవటంలేదు. చిన్న పిల్లలలో తెలివి ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా యజమానులుగా అయ్యి నడుస్తున్నారు. ఇది కూడా డ్రామా ఎందుకంటే చిన్న పిల్లలే అద్భుతం చేసి చూపిస్తారు. ఎడ్వాన్స్ పార్టీ కూడా తమ కార్యం తాము చేస్తున్నారు. మీరు కూడా మీ స్థితిని తయారుచేసుకుని ఎడ్వాన్స్ గా వెళ్ళేటందుకు ఆగి ఉన్నారు. వారి కార్యం కూడా మీ కనక్షన్ తోనే నడుస్తుంది. మొత్తం కార్యానికి ఆధారం విశేషాత్మలైన మీరే. నడుస్తూ.నడుస్తూ మీరు శీతలం అయిపోతున్నారు. అగ్ని వెలిగిస్తున్నారు మరలా శీతలం అయిపోతున్నారు. శీతలం అవ్వకూడదు కదా! మానవులు బయట ఈ రూపాన్ని చూస్తున్నారు. పరంపరగా ఈ ఆట నడుస్తూనే వస్తుంది అనుకుంటున్నారు. కానీ నడుస్తూ,నడుస్తూ మీలో శీతలత ఎందుకు వస్తుంది? దీనికి కారణం ఏమిటి? శాతం ఎందుకు తక్కువ అయిపోతుంది? ఉపన్యాసాలైతే చెప్తున్నారు కానీ ఉపన్యాసాలతో పాటు వెనువెంట మీ ముఖకవళికలు కూడా ఆకర్షితం చేయాలి. అప్పుడే ఆ ఉపన్యాసం ప్రభావం వేస్తుంది. కనుక స్వయాన్ని ప్రతి సబ్జక్టులో పరిశీలించుకోండి. ఈ రోజుల్లో ఉపన్యాసాలలో పోటీ పెరిగిపోయింది. దీనిలో ఒకరి కంటే ఒకరు విజయం పొందుతున్నారు. కాని ప్రతక్షస్థితి ఎదైతే ఉందో దానిలో అందరు ఓడిపోతున్నారు. కనుక ముఖ్య విషయం ఏమిటంటే - ప్రత్యక్ష జీవితం. ప్రత్యక్ష జీవితంలో మీరు ఏ ఒక విషయం అయినా చూసిస్తే బయటివారు ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోతారు. ఉపన్యాసాల ద్వారా ప్రత్యక్షభావాన్ని ప్రకటితం చేయాలి. ఆ ఉపన్యాసం ద్వారా అతీతస్థితి కనిపించాలి. మీరు ఉపన్యాసంలో ఏ మాటలైతే మాట్లాడుతున్నారో అవి నయనాల ద్వారా కనిపించాలి. ఏవైతే మాట్లాడుతున్నారో అవి ప్రత్యక్షంగా కనిపించినప్పుడే ఆ అనుభవీమూర్తి స్థితి ద్వారా ఇతరాత్మలకు ప్రభావం వేస్తారు. విని విని అందరు అలసిపోయారు. చాలా విన్నారు. అనేక విషయాలు విని ఉన్న కారణంగా వినటంతో అలసిపోయారు. చాలా విన్నాము అంటున్నారు, ఇప్పుడు అనుభవం కావాలి, ఏదోక ప్రాప్తి కావాలి అని కోరుకుంటున్నారు. ఇప్పుడు మీ ఉపన్యాసంలో ఎంత శక్తి ఉండాలంటే మీ ఒక్కొక్క మాట వారికి అనుభవం చేయంచేదిగా ఉండాలి. మీరు చెప్తారు కదా - స్వయం ఆత్మగా భావించండి, శరీరం కాదు అని. ఈ మాటలో ఎంత శక్తి ఉండాలంటే వినేవారికి ఆత్మ శక్తి అనుభవం అయిపోవాలి. ఒక్క సెకను అయినా వారికి అనుభవం అయితే వారు ఇక దీనిని వదిలిపెట్టరు. ఆకర్షితమై మీ దగ్గరకే వస్తారు. మధ్యమధ్యలో మీరు ఉపన్యాసం చెప్తూ, చెప్తూ వారిని శాంతిలోకి తీసుకువెళ్ళే అనుభవం చేయిస్తూ ఉండండి. ఈ అభ్యాసం పెంచండి. వారిని అనుభవంలోకి తీసుకురండి. ఈ పాతప్రపంచం నుండి బేహద్ వైరాగ్యవృత్తి ఇప్పించాలంటే ఉపన్యాసంలో ఏవైతే పాయింట్స్ చెప్తున్నారో వాటిలో వైరాగ్యవృత్తిని అనుభవం చేయించండి. వారికి నిజంగానే సృష్టి వినాశనం అయిపోతుంది, దీనిపై మనస్సు పెట్టుకోవటం వ్యర్థం అని ప్రత్యక్షంగా వారు అనుభవం చేసుకోవాలి. పండితులు మొదలైనవారు చెప్పటంలో కూడా శక్తి ఉంటుంది. వారు ఒక్క సెకనులో ఆత్మలకు సంతోషాన్ని ఇప్పిస్తారు. ఒక సెకనులో ఏడిపిస్తారు. అప్పుడే దానిని ప్రభావయుక్తమైన ఉపన్యాసం అంటారు. మొత్తం సభను నవ్విస్తారు కూడా. మరలా మొత్తం సభను స్మశాన వైరాగ్యంలోకి తీసుకువస్తారు కూడా! మరి వారి ఉపన్యాసంలోనే అంత శక్తి ఉన్నప్పుడు మీ ఉపన్యాసంలో ఉండదా? అశరీరీగా తయారు చేయాలనుకుంటున్నారంటే అది అనుభవం చేయించలేరా? ఆ అలను వ్యాపింపచేయండి. మొత్తం సభ మధ్యలో అందరికి బాబా స్నేహమనే అల వ్యాపించాలి. దీనినే ప్రత్యక్ష అనుభవం చేయంచటం అంటారు. ఇప్పుడు ఏదైతే ఉపన్యాసం చెప్తున్నారో దానిలో మార్పు రావాలి. వీరి ఉపన్యాసం ప్రపంచంవారి ఉపన్యాసం కంటే అతీతమైనది అని అందరికి అర్ధం కావాలి. వారు ఉపన్యాసంలో సభలో అందరిని నవ్విస్తున్నారు, ఏడిపిస్తున్నారు కానీ వారు అశరీరీ స్థితి యొక్క అనుభవం చేయించలేకపోతున్నారు. బాబాతో స్నేహాన్ని అనుభవం చేయించలేకపోతున్నారు. కృష్ణునితో స్నేహం చేయిస్తున్నారు. కానీ బాబాతో చేయించటంలేదు. వారికి తెలియటంలేదు. కనుక మనం చెప్పే విషయం మనం చేయించే అనుభవం అతీతంగా ఉండాలి. గీతాభగవంతుని గురించి ఎన్నో పాయింట్స్ చెప్తున్నారు. కాని వారికి బాబా అంటే ఎవరు మనం ఆత్మలం, బాబా పరమాత్మ అని అనుభవం చేయించనంత వరకు ఆ గీతాభగవంతుని విషయంలో కూడా సిద్ధి ఎలా లభిస్తుంది! ఇలా మీరు ఏదైనా ఉపన్యాసం చెప్తున్నప్పుడు వారికి అనుభవ చేయించండి. ఆత్మ, పరమాత్మలో రాత్రికి, పగలుకి ఉన్నంత తేడా ఉన్నట్లు అనుభవం చేయించండి. ఇలా ఎప్పుడైతే తేడా వారికి అనుభవం చేయిస్తారో అప్పుడే గీతాభగవంతుడు శివభగవాన్ అనేది సిద్ధి అవుతుంది. కేవలం పాయింట్స్ చెప్తే వారి బుద్దిలో కూర్చోవు అనుభవం అనే అల ఉత్పన్నం చేయాలి. అనుభవం చేయిస్తూ ఉంటే అనుభవం ముందు ఏ విషయం విజయం పొందలేదు. కనుక ఇప్పుడు మీ ఉపన్యాసంలో ఈ మార్పుని తీసుకురండి. కేవలం ఉపన్యాసం, ఉపన్యాసంగా మాటలుగా చెప్పటం కాదు. వారికి అనుభూతి చేయించేవారిగా తయారవ్వండి.