06.08.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


వృత్తి చంచలం అయ్యేటందుకు కారణం - వ్రతంలో తేలికతనం.

పరివర్తన భూమిలోకి వచ్చి స్వయంలో పరివర్తన అనుభవం చేసుకుంటున్నారా? భట్టీకి రావటం అంటే బలహీనతలను లేదా లోపాలను భస్మం చేసుకోవటం. ఇలా అనుభవం చేసుకుంటున్నారా? సదాకాలికంగా బలహీనతలకు అతీతంగా అవుతున్నారా? మీలో ఇంత ఆత్మిక శక్తి జమ చేసుకుని వెళ్తున్నారా? ఎందుకంటే ఈ సమయం యొక్క పరివర్తనయే సదాకాలిక పరివర్తన అవుతుంది. ఎలా అయితే అగ్నిలో ఏదైనా వస్తువు వేసినప్పుడు ఆ వస్తువు యొక్క రంగు,రూపం, కర్తవ్యం పరివర్తన అయిపోతాయి. అవి మరలా మొదటి రూపంలా ఉండవు. సదాకాలికంగా వాటి రంగు, రూపం, కర్తవ్యం అన్నీ మారిపోతాయి. ఇలా స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారా? బలహీనతల రంగు, రూపం పరివర్తన అయిపోతున్నాయా? మీ లోపల ధృడసంకల్పం ఉండాలి - నేను పరివర్తన అయ్యి వెళ్ళాలి అని. ఈ ధృడసంకల్పం యొక్క అగ్ని ప్రజ్వలితమై ఉండాలి. ఈ శ్రేష్ట సంలగ్నత అనే అగ్నిలో పూర్తిగా బలహీనతలన్నీ భస్మం అయిపోయాయా? అగ్ని ఎక్కువగా ఉంటే మొదటి రూపమే ఉండిపోతుంది. పరివర్తనా రూపం రాదు. అలాగే మద్యలో ఉండిపోతుంది. కనుక స్వయాన్ని పరిశీలన చేసుకోండి. శ్రేష్ట సంకల్పమనే అగ్ని వేగంగా ఉందా లేదా సాధారణ సంకల్పం చేస్తున్నారా? ప్రయత్నం చేస్తాము, అయిపోతుంది ఇలా మాట్లాడేవారిని తీవ్ర పురుషార్థి అనరు. చేసి చూపిస్తాము అనేవారిని తీవ్ర పురుషార్థి అని అంటారు. ఈ సమయంలో మీరు భట్టీకి వచ్చారు కనుక మీ స్థితిని తీవ్ర పురుషార్ధి స్థితిగా అనుభవం చేసుకుంటున్నారా? ఎవరైతే పరివర్తనా భూమికి వస్తూనే తీవ్ర పురుషార్థి లిస్ట్ లోకి వచ్చాము అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి? తీవ్ర పురుషార్ధం యొక్క అవినాశి ముద్ర పడిందా? అవినాశి బాబా ద్వారా అవినాశి ప్రాప్తిని పొందుతున్నారు కదా! బాబా అవినాశి కనుక ప్రాప్తులు కూడా అవినాశి. అవినాశి ప్రాప్తి ద్వారా మీ స్థితిని కూడా అవినాశిగా తయారు చేసుకుంటున్నారు. మీలో ఈ ధైర్యం అనుభవం చేసుకుంటున్నారా? మీ శుభ వృత్తి ద్వారా ప్రవృత్తిని, పరిస్థితిని, ప్రకృతిని మార్చగలుగుతున్నారా? మీ వృత్తి శ్రేష్టంగా ఉంటే దీని ముందు ప్రవృతి, ఏ రకమైన పరిస్థితి యుద్ధం చేయదు. ఎందుకంటే శుభవృత్తి అంటేనే నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను, జ్ఞాన స్వరూప ఆత్మను, శక్తిశాలి ఆత్మను. ఇలా మీ వృత్తిని శ్రేష్టంగా తయారు చేసుకున్నారా? సదా మీ వృత్తిని పరిశీలించుకోండి. ప్రతి సమయం నా వృత్తి శ్రేష్టంగా ఉందా? సాధారణంగా లేదు కదా? అని. వృత్తిని శ్రేష్టంగా తయారు చేసుకునేటందుకు, ప్రవృతి యొక్క పరిస్థితుల నుండి నివృతి అయ్యేటందుకు సాధనం ఏమిటి? భక్తిమార్గంలో కూడా సాధన ఉండాలి అని చెప్పాను. కదా! అలాగే జ్ఞాన మార్గంలో కూడా సాధన ఉండాలి. అది ఏమిటి? వృత్తి చంచలం అయితే ఏమి చేస్తారు? వృత్తి చంచలం అవ్వడానికి కారణం ఏమిటి? వృత్తి చంచలం అవ్వడానికి, సాధారణం అవ్వడానికి కారణం ఇదే - మొదట మీరు వ్రతాన్ని లేదా ప్రతిజ్ఞను ఏదైతే చేస్తున్నారో దాని నుండి క్రిందికి వచ్చేస్తున్నారు. వ్రతాన్ని భంగం చేసుకుంటున్నారు లేదా ప్రతిజ్ఞను మర్చిపోతున్నారు. మీరు చేసిన మొట్టమొదటి ప్రతిజ్ఞ లేదా మీరు తీసుకున్న మొట్టమొదటి వ్రతం ఏమిటంటే - మనసా, వాచా, కర్మణాలో పవిత్రంగా ఉంటాము అని. ఇది మొదటి వ్రతం. రెండవ వ్రతం - ఒక బాబా తప్ప మరెవ్వరు లేరు. ఈ వ్రతం అందరు తీసుకున్నారు కదా! లేదా మధ్యలో వదిలేస్తున్నారా? భక్తి మార్గంలో కూడా వ్రతం పెట్టుకుని మధ్యలో ఖండితం చేసేస్తే వారిని ఏమంటారు? పుణ్యాత్మకు బదులు పాపాత్మ అంటారు. అలాగే మీరు మీ వ్రతాన్ని ఎంత వరకు ధారణ చేస్తున్నారు? వ్రతం అంటే సదా స్థిరంగా ఉండాలి. భక్తులు ప్రాణం పోయినా కానీ వ్రతాన్ని వదలరు. మరి మీరు ఏదైతే వ్రతాన్ని ధారణ చేస్తున్నారో అది సదా స్మృతిలో ఉంచుకోండి. ఆ స్మృతి ద్వారా మీ వృత్తి ఎప్పుడు చంచలం అవ్వదు. మీ వృత్తి చంచలం కానప్పుడు ప్రవృతి, పరిస్థితి, ప్రకృతి యొక్క ఏ విఘ్నాలకు మీరు వశం కారు. ప్రకృతికి దాసీగా, పరిస్థితిని స్వ స్థితిగా, ప్రవృతిని శుద్ధ ప్రవృతికి ఉదాహరణగా తయారు చేయగలుగుతారు. ఈ వ్రతాన్ని తేలిక చేసేసుకుంటున్నారు. దాని కారణంగానే వృత్తి చంచలం అవుతుంది. రాఖీకి పవిత్రంగా అవ్వండి అని ప్రతిజ్ఞ చేయిస్తారు కదా! మొదట స్వయానికి కంకణం కట్టుకోండి. అప్పుడు ఇతరులను కూడా ఈ కంకణంలో బంధించగలుగుతారు. ఎవరికైతే రాఖీ కడుతున్నారో వారు పవిత్రంగా తయారవుతున్నారా, వారు ఈ వ్రతం తీసుకుంటున్నారా? ఇంత ధైర్యం పెట్టుకోవటం లేదు కారణం ఏమిటి? స్వయం మొదట ఆ రాఖీ కట్టేవారు ఆ వ్రతంలో ఉంటున్నారా? మనస్సులో అయినా అపవిత్రత వచ్చిందంటే దానిని పూర్తి వత్రం అంటారా? దీని కారణంగా అంటే కట్టేవారిలో లోపం ఉన్నప్పుడు ఎవరైతే కట్టించుకుంటున్నారో వారిపై కూడా ఆ పవిత్రత యొక్క ఆకర్షణా ప్రభావం అంతగా పడదు. కేవలం సందేశం ఇస్తారు, కానీ వ్రతం పెట్టించలేరు. వ్రతం తీసుకున్నారా లేదా కేవలం రాఖీ కట్టి సందేశం ఇచ్చి వదిలేస్తున్నారా? వ్రతం తీసుకోవటం లేదా? కారణం ఏమిటి? భాగ్యంలో లేదు అంటారా? వారి భాగ్యాన్ని తయారు చేసేవారు ఎవరు మీరే కదా? భాగ్యం తయారు చేయండి, భాగ్యం తయారు చేసుకునే తీవ్ర ప్రేరణ ఇవ్వండి. ఎప్పుడైతే మీరు మంచిగా తయారవుతారో అప్పుడు వారు మీకు ఆకర్షితమై భాగ్యం తయారు చేసుకోకుండా ఉండలేరు. ఇంత ఆకర్షణ మీలో కనిపించాలి. బయట ప్రపంచంలో మహానాత్మలు మాట్లాడే మాటలకు కూడా శక్తి ఉంటుంది. దాని కారణంగా వారి వెనుక అందరు పరుగు పెడుతూ ఉంటారు. వారి ముందు మీరెవరు? ఎంత శ్రేష్ట ఆత్మలు? ఈరోజుల్లో మహానాత్మలుగా మహిమ చేయబడేవారే వారు మీ ప్రజలకు కూడా ప్రజలు కాదు. ఎందుకంటే స్వర్గం యొక్క అధికారం వారికి లభించదు. ప్రజలకు ప్రజలు అయ్యేవారైనా స్వర్గవాసి అవుతారు. కానీ వారు స్వర్గం యొక్క సుఖాన్ని అనుభవం చేసుకోరు. అసలు స్వర్గంలోకే రారు. అలాంటి మహానాత్మలకే మహిమ జరుగుతున్నప్పుడు మీరెంత శ్రేష్టాత్మలు? కనుక మీరు ఏదోక విశేష కర్తవ్యం చేయాలి కదా? మీ ఒకొక్క మాటలో ఎంత శక్తి ఉండాలి, అంటే మీరు అనుభవీమూర్తి అయ్యి మాట్లాడాలి. వారికి అలా అనుభవం అవ్వాలి. మీరు మాట్లాడుతూ ఉంటే వారు అలా అనుభవం చేసుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో మహాత్మలు, పండితులు మొదలైన వారి మాటల్లో ఎంత శక్తి ఉంటుంది! మరి మాస్టర్ సర్వశక్తివంతులైన మీ యొక్క ఒకొక్కరి మాటలో ఎంత శక్తి ఉండాలి? ఒకొక్క మాట వారికి అనుభవం చేయిస్తూ వెళ్ళాలి. మీరు ఆత్మ అని మొదటి పాఠం చెప్తున్నప్పుడు ఆ మాటతో పాటు వారికి అనుభవం చేయించాలి. ఇది విశేషత. స్థూల ఉపన్యాసమనేది ప్రజలు కూడా చెప్తారు. అలా మాట్లాడటం వారు కూడా నేర్పిస్తారు. కానీ ఇతరులు ఏదైతే చేయలేకపోతున్నారో అది ఇష్టాత్మలైన మీరు చేయాలి. వారు మాట్లాడగలుగుతున్నారు. చెప్పగలుగుతున్నారు కాని అనుభవం చేయించటం లేదు. అది మీరు చేయించాలి. ఆ విశేషత ప్రత్యక్షంలో చూపించాలి. అది ఎప్పుడు జరుగుతుంది? మీలో సర్వ విశేషతలు ధారణ చేయాలి. మీలో విశేషతలు ధారణ చేయకపోతే ఇతరాత్మలను కూడా ధారణామూర్తిగా తయారు చేయలేరు. అందువలన మీ వృత్తిని శ్రేష్టంగా తయారు చేసుకోండి. బాప్ దాదా ఎదురుగా ఏదైతే వ్రతం తీసుకున్నారో దానిలో స్థిరంగా ఉండండి. దాని ఫలితం ఎలా వస్తుంది అనేది చూసుకోండి. ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు అనే వ్రతం తీసుకున్నారు, మరలా బుద్ధి అటు, ఇటు ఎందుకు వెళ్తుంది? ఈ వ్రతం తీసుకున్నారా లేదా కేవలం ఇతరులకు చెప్తున్నారు అంతేనా? నీతోనే వింటాము, నీతోనే మాట్లాడతాము, నీతోనే తింటాము అనే వ్రతం తీసుకున్నారు కదా? మరి ఇతరాత్మల వైపు చంచల వృత్తితో ఎందుకు చూస్తున్నారు? ఎందుకు వింటున్నారు? ఏదైతే బాబా వినిపించారో అదే మాట్లాడండి, అవి కాకుండా ఇతర విషయాలు, వ్యర్థ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలా చేస్తున్నారంటే వ్రతాన్ని తెంచేసినట్లే కదా? ఆత్మాభిమానిగా అయ్యే వ్రతం తీసుకుని దేహన్ని చూస్తున్నారంటే అర్థం ఏమిటి? వ్రతాన్ని త్రేంచేసినట్లే కదా? కనుక అమృతవేళ నుండి స్వయాన్ని పరిశీలన చేసుకోండి. నేను ఏదైతే వ్రతం తీసుకున్నానో దానిపై నడుస్తున్నానా? అని. ఏమి సంకల్పం చేయాలి, ఏమి మాట మాట్లాడాలి,కర్మ చేస్తూ కర్మయోగి స్థితిలో ఎలా ఉండాలి, వీటన్నింటి యొక్క వ్రతం తీసుకున్నారు కదా! ప్రవృతిలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉంటాము అనే వ్రతం తీసుకున్నారు కదా! కమలపుష్ప సమానంగా ఉండేవారు, పరిస్థితులకు ఎలా వశం అవుతారు? కమలపుష్ప సమాన ఆత్మలు అంటే అతీతంగా,ప్రియంగా ఉండాలి కదా! కనుక శ్రేష్ట వృత్తిలో స్థితులై ఉంటే ఏ వాయుమండలం అయినా, తరంగాలు అయినా మిమ్మల్ని అలజడి చేస్తాయా? వృత్తి ద్వారానే వాయుమండలం తయారవుతుంది. మీ వృత్తి శ్రేష్టంగా ఉంటే వృత్తి ఆధారంగా వాయుమండలాన్ని శుద్ధంగా తయారు చేసుకోవచ్చు. ఇంత శక్తి మీలో ఉందా? వాయుమండలం యొక్క శక్తి ఎక్కువగా ఉందా లేదా మీ శక్తి ఎక్కువగా ఉందా? వాయుమండలానికి వశం అవుతున్నారు అంటే మీ మనస్సులో బలహీనత వచ్చింది అని అర్థం. కనుక దానిని సమాప్తి చేసుకోవాలి. ఏం చేయము, వాయుమండలం కారణంగా నా వృత్తి చంచలం అయ్యింది అని అంటున్నారంటే, ఆ సమయంలో స్వయాన్ని ఏమనుకోవాలి? ఆ సమయంలో మీరు ఏ ఆత్మ? బలహీన ఆత్మ. స్వయాన్ని మర్చిపోయారు, లౌకిక రూపంలో కూడా ఎవరైనా స్వయాన్ని మర్చిపోతారా? నేనెవరు? ఎవరి పిల్లవాడిని? నా వృత్తి ఏమిటి? ఇది ఎవరైనా మర్చిపోతే వారిని చూసి అందరు నవ్వుతారు. ఎవరైనా స్వయాన్ని, తమ తండ్రిని, తమ వృత్తిని మర్చిపోతారా? అలాగే ఈ వ్రతాన్ని కూడా ఇప్పుడు పక్కా చేసుకోండి. సదాకాలికంగా ఎలా విజయీగా అవుతారో చూసుకోండి, ఏ విషయాలలో కూడా చలించకూడదు. ఈ వ్రతాన్ని మాటి మాటికి మీ బుద్ధిలో రివైజ్ చేసుకోండి. బాబాతో ఏ ప్రతిజ్ఞ చేసాను, ఏ వ్రతం తీసుకున్నాను? అని ఆ వ్రతం ద్వారా రిఫ్రెష్ అవ్వాలి. ఎంతెంత మీకు ఆ వ్రతం స్మృతిలో ఉంటుందో అంతంత మీకు సమర్ధత వస్తుంది. ఇలా స్వయాన్ని సమర్ధంగా తయారు చేసుకోండి. మేము మొదటి నెంబర్ లోకి రావాలి అని లక్ష్యం పెట్టుకోండి. మొదటి నంబర్ గ్రూప్ కి స్మృతిచిహ్నమే వరదాన భూమిలో మీకు బాబా గుర్తుని ఇస్తున్నారు. ఈ గుర్తు తీసుకుని వెళ్ళాలి. ఈ స్మృతిచిహ్నం ద్వారా మీకు స్మృతి వస్తూ ఉంటుంది. ఇలా మీరు ఉదాహరణగా కావాలంటే విశేషంగా అద్భుతం చేసి చూపించాలి. ఏదోక అద్భుతం యొక్క విషయం చేసి చూపించినప్పుడే సృతిచిహ్నం తయారవుతుంది. ఈ గ్రూప్ ఏ స్మృతిచిహ్నాన్ని గుర్తుగా చేసుకుని వెళ్తారో చూస్తాను. మీ గుర్తు కూడా అవినాశిగా ఉండాలి. ఇప్పుడు స్వయంలో సర్వశక్తుల ప్రాప్తిని అనుభవం చేసుకుంటున్నారు కదా? ధారణామూర్తి పరీక్ష ఇక్కడే జరుగుతుంది. ప్రత్యక్ష పరీక్షలను ఎదుర్కునేటందకు ఇక్కడి నుండే తయారైవెళ్ళాలి. దాని ఫలితం కూడా ఇక్కడే వస్తుంది. బాబా ప్రత్యక్ష పరీక్ష ఇస్తారు. దాని ద్వారా మీలో చాలా పరివర్తన అనుభవం అవ్వాలి. ధైర్యం పెట్టుకోండి. ధైర్యం ద్వారా సహాయం స్వతహాగానే లభిస్తుంది. ధైర్యంలో కొద్దిగా అయినా లోపం ఉంటే సహాయంలో కూడా లోపం వచ్చేస్తుంది. కొంతమంది సహాయం లభిస్తే చేసి చూపిస్తాము అంటున్నారు. కానీ సహాయమనేది ధైర్యం పెట్టుకున్నవారికే లభిస్తుంది. ధైర్యం ఉన్న పిల్లలకే బాబా సహాయం చేస్తారు. ఒక అడుగు ధైర్యంతో వేయండి, బాబా వంద అడుగులు సహాయం చేస్తారు. ఒకవేళ మీరు ఒక అడుగు కూడా వేయకపోతే బాబా వంద అడుగులు కూడా మీకు సహాయం చేయరు. ఎవరు చేస్తారో వారే పొందుతారు. ధైర్యం పెట్టుకోవటం అంటే చేయటం. బాబా సహాయం చేస్తారో, లేదో అని బాబా మీద పెట్టడం, ఇది కూడా పురుషార్థహీన లక్షణం. మనకి సహాయం చేయాలో, లేదో బాబాకి తెలియదా? మీరు చెప్పటం ద్వారానే చేస్తారా? ఎవరైతే చెప్పటం ద్వారా చేస్తారో వారిని ఏమంటారు? స్వయం బాబా దాత, బాబా చెప్పటం ద్వారా చేస్తే అది బాబాకి అగౌరవం కాదా? ఇచ్చేటువంటి దాత ముందు ఐదు పైసలు ఏమి ఇస్తారు? బాప్ దాదాకి కూడా బాప్ దాదా శిక్షణలను స్మృతి ఇప్పిస్తున్నారు. నువ్వు సహాయం చేయాలి అని. కనుక ఇలాంటి సంకల్పాలు చేయకండి. స్వతహాగానే మీకు సహాయం లభిస్తుంది. ఎప్పుడైతే స్వయాన్ని వారసునిగా భావించి పురుషార్థం చేస్తారో అప్పుడు వారసత్వానికి స్వతహాగానే అధికారి అవుతారు. అడగవలసిన అవసరం లేదు. లౌకికంలో కూడా స్వార్థం ఉన్నవారే అడుగుతారు ఇక్కడ మీకు మీ స్వార్థమనేది లేదు కదా? కనుక మీరు బలహీన సంకల్పాలు చేయకండి. బాబా మాకు తోడుగా ఉన్నారు, బాబా మాకు సహాయకారి అనే పూర్తి నిశ్చయబుద్ధిగా ఉండండి. నిశ్చయబుద్ది ఆత్మలే విజయంతిగా కాగలరు. ఇలా సదా స్మృతిలో ఉంచుకుంటూ ప్రతి అడుగు వేస్తే విజయం మీ కంఠహారంగా అవుతుంది. ఎవరైతే విజయాన్ని కంఠహారంగా చేసుకుంటారో వారే విజయీమాలలో మణులుగా అవుతారు. ఇప్పుడు మీరు విజయీగా కాకపోతే విజయీ మాలలోకి కూడా రాలేరు. కనుక ఈ విషయాన్ని స్మృతిలో ఉంచుకుని అడుగు వేయండి. అప్పుడు సదా సిద్ది స్వరూపంగా అవుతారు. ఏ సంకల్పం, మాట, కర్మ సిద్ది లేకుండా ఉండకూడదు. పురుషార్ధం యొక్క విధి యదార్థంగా ఉంటే సిద్ధి లభించకపోవటమనేది ఉండదు. ఏ కర్మ అయినా విధిపూర్వకంగా చేయటం ద్వారానే సిద్ధి లభిస్తుంది. విధిపూర్వకంగా చేయకపోతే సిద్ధి కూడా లభించదు. విధిపూర్వక కర్మకు సిద్ధి తప్పకుండా లభించే తీరుతుంది.