09.11.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


జ్ఞాన సూర్యుడు మరియు జ్ఞానచంద్రునితో జ్ఞాన సితారల సంబంధం.

స్మృతి స్వరూప స్పష్ట సితారగా, దివ్య సితారగా స్వయాన్ని భావిస్తున్నారా? వర్తమాన సమయం యొక్క శ్రేష్టభాగ్యం బాప్ దాదా యొక్క నయనసితారలుగా మరియు భవిష్యత్తులో ఏదైతే ప్రాప్తి తయారవుతుందో ఆ ప్రాప్తి యొక్క అదృష్టవంతులుగా, శ్రేష్ట అదృష్ట సితారలుగా స్వయాన్ని భావించి నడుస్తున్నారా? స్వయాన్ని దివ్య సితారగా భావిస్తున్నారా? ఈ రెండు సితారలు స్మృతిలో ఉంటున్నాయా? వర్తమాన భాగ్యం యొక్క సితార, భవిష్య భాగ్యం యొక్క సితార రెండు స్మృతి ఉంటున్నాయా? మీ యొక్క మూడు సితారల యొక్క రూపం సదా స్మృతిలో ఉంచుకోండి. ఎలా అయితే చంద్రుడు, సూర్యునితో సితారలకు సంబంధం ఉంటుందో గుప్త రూపంలో సూర్యునితో సంబంధం ఉంటుంది, ప్రత్యక్ష రూపంలో చంద్రునితో సంబంధం ఉంటుంది. అలాగే మీ చైతన్య సితారలైన మీ సంబంధం కూడా ప్రత్యక్షంగా ఎవరితో ఉంది? చంద్రునితో ఉంది కదా! జ్ఞానసూర్యుడు గుప్తంగానే ఉన్నారు కానీ సాకారరూపంలో, ప్రసిద్ధ రూపంలో తల్లి అయిన బ్రహ్మతో మీకు సంబంధం ఉంది కదా! ఇలా స్వయాన్ని సితారగా భావించాలి, ఎలా అయితే సితారల సంబంధం సూర్యునితో, చంద్రునితో ఉంటుందో అలాగే మీ సంబంధం సదా బాప్ దాదాతో ఉండాలి. ఎలా అయితే సితారలు మెరుస్తూ ఉంటాయో అలాగే స్వయాన్ని కూడా మెరిసేటుంటి జ్యోతి స్వరూప స్థితిలో స్థితులు చేసుకోవాలి. సితారలు సంఘటనగా ఉంటూ కూడా పరస్పరం ఒకరికొకరు స్నేహిగా, సహయోగిగా ఉండాలి. మీ చైతన్య సితారలకు స్మృతిచిహ్నమే అక్కడ స్థూల సితారలు. ఇలా శ్రేష్ట సితారగా అయ్యారా? చైతన్యం మరియు చిత్రం రెండు ఎదురుగా ఉన్నాయా? మీ భిన్న, భిన్న రూపాల యొక్క భిన్న, భిన్న కర్తవ్యాల యొక్క చిత్రం చూస్తూ ఇది నా చిత్రమే అని భావిస్తున్నారా? చైతన్యంలో మరియు చిత్రంలో తేడా సమాప్తి అయిపోయిందా? సితారలు పరస్పరం సంఘటనలో ఉంటూ ఒకరికొకరు స్నేహిగా, సహయోగిగా ఉంటున్నారు. మీరందరు ఈ సమ్మేళనానికి ఎందుకు వచ్చారు? సందేశమిచ్చే సమ్మేళనాలు అయితే చాలా చేసారు. కానీ ఇప్పుడు ఏ సమ్మేళనం ఉంది? అంతిమ సమ్మేళనం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? మొదట సమ్మేళనం యొక్క ఉద్దేశ్యం వినిపిస్తారు కదా! మరి అంతిమ సమ్మేళనం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? దాని తేదీ నిర్ణయించారా?ఎలా అయితే సమ్మేళనం యొక్క తేదీ నిర్ణయిస్తారో అలాగే ఇది నిర్ణయించారా? ఈ సమ్మేళనం అందరు కలిసి చేయాలి. మీ అంతిమ సమ్మేళనానికి చిత్రం కూడా ఉంది. ఆ చిత్రాన్ని ప్రత్యక్షంలోకి తీసుకురావాలి. అందరు సహయోగిగా, అందరు స్నేహిగా, అందరు ఏకరసస్థితిలో ఉన్నదానికి చిత్రం కూడా ఉంది. గోవర్థనగిరి పర్వతాన్ని వ్రేళ్ళతో లేపినట్లుగా చూపిస్తారు కదా! ఆ వ్రేలు కూడా పూర్తిగా నిదానంగా చూపిస్తారు, ఒంకరగా, అటు, ఇటు చలిస్తున్నట్లు చూపించరు. నిదానమైన స్థితిని చూపిస్తారు. అలాగే మీ పురుషార్థం కూడా నిదానంగా ఉండాలి. మధ్య, మధ్యలో ఒంకర మార్గాలలోకి వెళ్ళకూడదు, బుద్ది అటు, ఇటు భ్రమించకూడదు, ఏకరస స్థితిలో స్థితులవ్వాలి. ఇటువంటి పురుషార్ధం చేస్తున్నారు కదా? మీ పురుషార్ధంతో స్వయం సంతుష్టంగా ఉంటున్నారా? ఎలా అయితే భక్తులు కోరిక శ్రేష్టంగా పెట్టుకుంటారు. కానీ శక్తిహీనంగా ఉన్న కారణంగా ఏది చేయాలనుకుంటున్నారో అది చేయలేకపోతున్నారు. అలాగే మీరు కూడా శ్రేష్టంగా తయారవుతున్నారు. మరి ఈ శ్రేష్ట పురుషార్ధం యొక్క లక్ష్యం పెట్టుకున్నా కానీ మీలో సంతుష్టత కనిపించకపోతే ఏమంటారు? మహాన్ జ్ఞానీ అని అంటారా? మీరు సర్వశక్తివంతుని సంతానం అయినప్పటికీ మీలో శక్తి లేదా? చేయలేకపోతున్నాము అని ఆలోచిస్తున్నారా? మీ అంతిమ స్థితిని ప్రత్యక్ష రూపంలోకి తీసుకువస్తున్నారా? లేదా మాలో శక్తి లేదు ఆ స్థితి అంతిమంలో వస్తుంది అని భావిస్తున్నారా? అంతిమ స్థితి అంటే అది అంతిమంలో వస్తుంది అని భావించకండి. ఇప్పటి నుండే మీ సంపూర్ణస్థితిని ప్రత్యక్షంలోకి తీసుకురండి. అప్పుడే అంతిమంలో అంతిమ స్థితిని పొందగలుగుతారు. ఒకవేళ ఇప్పుడు మీ స్థితి సమీపంగా రాకపోతే ఆ స్థితి కూడా దూరంగానే ఉండిపోతుంది. ఆ స్థితిని పొందలేరు. అందువలన ఇప్పుడు పురుషార్థంలో జంప్ చేయండి. ఇప్పుడు నడుస్తూ, నడుస్తూ పురుషార్ధం యొక్క శాతంలో లోపం వచ్చేస్తుంది. అందువలన ఇప్పుడు పురుషార్ధంలో ఏదైతే లోపం ఉందో ఆ శాతాన్ని పూరించండి. ఇప్పుడు మీ పురుషార్థంలో చాలా లోపం ఉంది. ముఖ్య సబ్జక్టు అయిన స్మృతియాత్రలో నెంబర్ వారీగా ఉన్నారు. కానీ మీ స్థితితో పాటు ఇప్పుడే ఏదైతే శాతం ఉండాలో అది కూడా ఇప్పుడు తక్కువగా ఉంది. అందువలన ఇప్పుడు ఏదైతే ప్రభావం కనిపించాలో అది కూడా ఇప్పుడు తక్కువగా కనిపిస్తుంది. కనుక ఎప్పటి వరకు శాతాన్ని పెంచుకోరో అప్పటి వరకు ప్రభావాన్ని వ్యాపింపచేయలేరు. నలువైపుల ప్రభావం పడాలంటే మీ స్థితి యొక్క శాతం పెరగాలి. బల్బ్ యొక్క ప్రకాశం ఎంత ఉంటుందో అంత నలువైపుల కూడా వ్యాపిస్తుంది కదా! అలాగే మీరు బల్బ్ గా అయ్యారు. కానీ మీ ప్రకాశం యొక్క శాతాన్ని పెంచుకోలేదు. కనుక దానిని ఇప్పుడు పెంచుకోండి. ఒకటి, లైట్, రెండు-సర్చ్ లైట్, మూడు - లైట్ హౌస్. ఇలా లైట్ లో కూడా రకరకాల స్థితులు ఉంటాయి. అలా మీరు లైట్ లా అయ్యారు .కానీ లైట్‌హౌస్ లా అయ్యి నలువైపుల ప్రకాశాన్ని వ్యాపింపచేసి అంధకారాన్ని దూరం చేయండి. అందరికి వెలుగుని ప్రసాదింపచేయండి. ఈ విషయంలో స్వయాన్ని పరిశీలించుకోండి. స్వయం మీరు చూసుకోకపోతే ఇతరుల అంధకారాన్ని దూరం చేయలేరు. ఇలా లైట్ హౌస్ గా అవ్వండి, స్వయాన్ని పరిశీలన చేసుకోండి. ఎలా అయితే దర్పణం ముందు స్వయం యొక్క సాక్షాత్కారం అవుతుందో అలాగే మీరు కూడా దర్పణంగా అయ్యారా? స్వయం దర్పణంగా అయ్యి మీ కర్తవ్యాన్ని ప్రారంభించండి. మీ దర్పణంలో నలువైపుల ఉన్న ఆత్మలు స్వయం యొక్క సాక్షాత్కారం చేసుకోవాలి. అప్పుడే జయజయకారాలు వస్తాయి. ఇలా దర్పణంగా అయ్యారా? రోజంతటిలో ఎంతమంది మీ ద్వారా సాక్షాత్కారం చేసుకుంటున్నారు? మీ ఎదురుగా వచ్చినారు మీ దర్పణంలో సాక్షాత్కారం చేసుకుంటున్నారా? ఒకవేళ దర్పణం స్పష్టంగా, శక్తిశాలిగా లేకపోతే ఒక రూపానికి బదులు ఇంకొక రూపం కనిపిస్తుంది. సన్నగా ఉంటే లావుగా కనిపిస్తారు. అలాగే మీరు కూడా శక్తిశాలి దర్పణంగా అవ్వండి. ఎవరు మీ ఎదురుగా వచ్చినా వారు స్వయం వారి సాక్షాత్కారాన్ని స్పష్టంగా చేసుకోగలగాలి. అంటే మీ ఎదురుగా రాగానే దేహాన్ని మర్చిపోయి ఆత్మిక రూపంలో స్థితులవ్వాలి. ఇదే సేవ యొక్క సఫలతా రూపం.

ఇలా సదా సఫలతా మూర్తులుగా ఉండేవారికి, సంస్కారాల కలయిక యొక్క సమ్మేళనం జరుపుకునేవారికి, స్వయం సంపూర్ణ స్థితిని సమీపంగా తీసుకువచ్చేవారికి,దివ్య సితారలకు,సప్ దాదా యొక్క నయన సితారలకు, అదృష్ట సితారను మేల్కొల్పుకునే పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.