23.01.1973        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సంపూర్ణమూర్తిగా తయారయ్యేటందుకు నాలుగు స్తంభాలు.

పిల్లలను సదా స్నేహి, సహయోగీ సర్వశక్తుల్లో సమానంగా తయారుచేసే, సర్వసిద్ధులను ప్రాప్తింపచేసే మరియు ప్రత్యక్ష ఫలాన్నిచ్చే శివబాబా మాట్లాడుతున్నారు.

అందరూ కూడా స్వయాన్ని సంపూర్ణంగా తయారుచేసుకునే పురుషార్థంలో నడుస్తున్నారా? సంపూర్ణమూర్తిగా తయారయ్యేటందుకు ముఖ్యంగా నాలుగు విశేషతలను ధారణ చేయాలి. వాటిద్వారా సహజంగానే సంపూర్ణమూర్తిగా తయారుకాగలరు. ఇతరులకు యోగస్థితిలో సదా ఏకరసస్థితిలో స్థితులయ్యేటందుకు నాలుగు ముఖ్య నియమాలను స్తంభాల రూపంలో చూపించి చెబుతారు కదా! అదేవిధంగా సదా సంపూర్ణమూర్తిగా తయారయ్యేటందుకు ఈ నాలుగు విషయాలు స్తంభాలు, అవి ఏమిటి? ఒకటి - జ్ఞానమూర్తి, రెండు - గుణమూర్తి, మూడు - మహాదానీమూర్తి, నాలుగు - స్మృతిమూర్తి అనగా తపస్వీమూర్తి. ఈ నాలుగు విశేషతలను మీలోకి తీసుకురావడం ద్వారా సంపూర్ణ స్థితిని తయారుచేసుకోగలరు. ఇప్పుడు చూడండి మీ మూర్తిలో ఈ నాలుగు విశేషతలు ప్రత్యక్షరూపంలో అనుభవం అవుతున్నాయా లేదా ఇతరాత్మలకు కూడా కనిపిస్తున్నాయా? జ్ఞానమూర్తి అనగా సదా బుద్ధిలో జ్ఞానస్మరణ జరుగుతూ ఉంటుంది. సదా వాచా ద్వారా జ్ఞానవాక్యాలనే వర్ణిస్తుంటారు. ప్రతి కర్మ ద్వారా జ్ఞాన స్వరూపంగా అనగా మాస్టర్ జ్ఞానసాగరులుగా మరియు మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉంటారు. ఈ ముఖ్యస్వరూపాలు మీ ద్వారా సాక్షాత్కారం అవ్వాలి. అలాంటివారినే జ్ఞానమూర్తి అని అంటారు. అదేవిధంగా మనసా, వాచా, కర్మణా ద్వారా గుణమూర్తి, మహాదాని మూర్తి మరియు స్మృతి అనగా తపస్వీమూర్తిగా ప్రత్యక్షరూపంలో కనిపించాలి. లౌకిక చదువులో కూడా మూడునెలలకు, ఆరునెలలకు, తొమ్మిది నెలలకు పరీక్షలు పెడతారు. దీని ద్వారా ప్రతి ఒక్కరు ఎంత చదువుకుంటున్నారో తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈశ్వరీయ చదువు యొక్క చాలా సమయం గడిచిపోయింది. అందువలన విశేషంగా ఈ నెల అంతా స్మృతియాత్రలో ఉంటూ మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అనగా మీకు మీరే శిక్షకులై, సాక్షి అయి మీ పేపర్ చూసుకోండి. ఇప్పుడిక కేవలం ఫైనల్ పేపర్ మాత్రమే మిగిలి ఉంది. అందువలన మీ రిజల్ట్ చూసుకుని పరిశీలించుకోండి. ఈ నాలుగు విశేషతల్లో ఏ విశేషత ఎంత శాతంలో లోపం ఉందని. అంతిమపేపరులో సంపూర్ణంగా పాస్ అయ్యే యోగ్యులుగా సర్వ యోగ్యతలున్నాయా? ఈ నెల మార్పును చూసే నెల. కొంచెం శాతమైనా తక్కువగా ఉంటే సంపూర్ణ స్థితిని ఎలా పొందగలరు? అందువలన మీ లోపాన్ని తెలుసుకుని దానిని తొలగించుకునే తీవ్ర పురుషార్థం చేయండి. ఇప్పుడు లభించిన ఈ కొద్ది సమయం కూడా డ్రామానుసారం మీ పురుషార్థం కోసం లభించింది. అంతిమ పరీక్ష కంటే ముందు మిమ్మల్ని మీరు సంపూర్ణంగా తయారుచేసుకోవాలి. మీ ఫలితం చూసుకున్నారా? ఈ నెలంతా నలువైపులా స్మృతియాత్ర యొక్క ఉత్సాహ ఉల్లాసాలు ఎలాగైతే పెట్టుకున్నారో, దీనిఫలితం ఏమని భావిస్తున్నారు? ఎన్ని మార్కులు ఇచ్చుకుంటారు? ప్రతి ఒక్కరికి ఎవరి మార్కులు వారికి ఉంటాయి. అయినా కానీ నలువైపులా వాతావరణం వాయుమండలం లేదా పురుషార్థం యొక్క ఉత్సాహ, ఉల్లాసాల ఫలితంలో ఎన్ని మార్కులు వస్తాయి? మొత్తం మీద ఫలితం అడుగుతున్నారు. అందరి పురుషార్ధం యొక్క ప్రభావం మధువనం వరకు చేరుకుంటుంది కదా? త్రికాలదర్శులు కాదా? మీ సమీప పరివారంలోని ఆత్మల యొక్క, పురుషార్థం యొక్క త్రికాలదర్శిగా అవ్వలేరా? కేవలం భవిష్యత్తును చూసే త్రికాలదర్శియేనా, వర్తమానంలో కాదా? తరంగాల ద్వారా మరియు వాయుమండలం ద్వారా పరిశీలించలేరా? వైజ్ఞానికులు భూమి నుండి అంతరిక్షంలోకి వెళ్ళేవారి యొక్క ప్రతీ గతి, విధిని తెలుసుకోగలుగుతున్నప్పుడు, మీరు స్మృతి బలంతో మీ శ్రేష్ట పురుషార్ధం యొక్క గతిని, విధిని తెలుసుకోలేరా? అంతిమంలో తెలుసుకుంటారా? అప్పుడు అవసరమే ఉండదు. ఇప్పుడు ఇలా తెలుసుకునే అభ్యాసం కూడా ఉండాలి. క్యాచింగ్ పవర్ (గ్రహణశక్తి) కూడా కావాలి. ఎలాగైతే విజ్ఞానం దూరంగా ఉన్నవారి ధ్వనిని గ్రహించి నలువైపులా వినిపిస్తుందో, మీరు కూడా శుద్ద తరంగాలు, శుద్ధ ఆలోచనలు లేదా శుద్ద వాయుమండలాన్ని గ్రహించలేరా? ఈ గ్రహణశక్తి ప్రత్యక్ష రూపంలో అనుభవం అవుతుంది. ఈ రోజుల్లో దూరదృశ్యాలను టీవీ స్పష్టంగా చూపిస్తుంది. అలాగే దివ్యబుద్ధి ద్వారా కేవలం ఒకరి స్మృతి యొక్క శుద్ధ సంకల్పంలో స్థితులవ్వడం ద్వారా మీ అందరికీ కూడా పరస్పర స్థితి లేదా పురుషార్ధం యొక్క గతి విధులు స్పష్టంగా కనిపిస్తాయి. విజ్ఞానం కూడా ఎక్కడి నుండి వచ్చింది? శాంతిశక్తి ద్వారానే విజ్ఞానం వస్తుంది. శాంతి అనేది మీ యొక్క వాస్తవిక స్థితి మరియు సంపూర్ణ స్థితిని అర్ధం చేసుకునేటందుకు ఇది ఒక సాధనం. ఎందుకంటే సూక్ష్మ శక్తిని తెలుసుకునేటందుకు తమోగుణీ బుద్ధి కలవారికి ఏదో ఒక స్థూలసాధనం కావాలి. ఏ శ్రేష్ట ఆత్మలో అయితే ఈ నాలుగు విశేషతలుంటాయో సంపూర్ణ శాతంలో అనగా సెంట్ పెర్సంట్లో ఉంటుందో, ప్రత్యక్ష రూపంలో ఉంటుందో, అలాంటి ఆత్మకు సర్వసిద్ధుల యొక్క ప్రాప్తి కనిపించదా? ఈ సిద్ది మీ వర్తమాన సమయం యొక్క పురుషార్థంలో కనిపిస్తుందా? కొంచెం శాతమే లోపం ఉన్నట్లు కనిపిస్తుందా లేక ఇప్పటికీ ఆ స్థితి దూరంగా ఉందా? దగ్గరగానే ఉన్నట్లు కనిపిస్తుందా. ఈనెల నలువైపులా ఉన్నవారి ఫలితం చాలా బాగుంది. ఇప్పుడిక ఏమి చేస్తారు? స్మృతియాత్రలో ఉండడం ద్వారా ఏదైనా కొత్తప్లాన్స్ ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చేటందుకు బయటకు వచ్చాయా? నలువైపులా సంఘటిత రూపంలో స్మృతిశక్తిని స్వయంలో నింపుకునేటందుకు పురుషార్ధం చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఆ రాబోయే రెండునెలలు విశేషంగా ధ్వనిని వ్యాపింపచేసి నలువైపులా బాబాని ప్రత్యక్షం చేసే నగాడా మోగించాలి. ఆ నగాడాల యొక్క ధ్వనిని విని నిద్రపోతున్న ఆత్మలు మేల్కొవాలి. ఈ ధ్వని ఏమిటి? ఈ సమయం ఎలాంటి శ్రేష్ఠ కర్తవ్యం నడుస్తుంది? ఇలా నలువైపులా ఉన్న ప్రతి ఒక్క ఆత్మ యొక్క శ్రేష్ట భాగ్యాన్ని ఇప్పుడే తయారుచేయగలరు. అదేవిధంగా నలువైపులా భిన్న-భిన్న యుక్తుల ద్వారా, భిన్న- భిన్న కార్యక్రమాల ద్వారా బాబాని గ్రహించే విధంగా నగాడా మోగించండి. ఈ రెండు నెలల్లో అందరూ ఈ విశేష కార్యంలో తమతమ విశేషతలను చూపించాలి. ఎలాగైతే స్మృతియాత్రలో ప్రతి ఒక్కరు తమపురుషార్థాన్ని అనుసరించి పోటీలో ముందుకు వెళ్ళే పురుషార్థం చేశారో, అలాగే ఇప్పుడు ఈ రెండునెలల్లో బాబాని ప్రత్యక్షం చేసేటందుకు కొత్త కొత్త ప్లాన్స్ ప్రత్యక్షంలో తీసుకువచ్చేటందుకు పోటీ చేయండి. ఈ పోటీలో ఫస్ట్, సెకెండ్, థర్డ్ ప్రైజ్ తీసుకునేటందుకు ఎవరెవరు నిమిత్తమయ్యారో తరువాత చెబుతాను. చాలా మంచి అవకాశం. ఈ రెండు నెలల్లో శివజయంతి పండుగ కూడా వస్తుంది. కనుక ఇప్పుడు ఫలితం చూస్తాను. ఒకనెల అంతా యోగబలాన్ని ప్రాప్తింప చేసుకుని ఏమి అనుభవం చేసుకున్నారు? ఇప్పుడు యోగబలం ద్వారా ఆత్మలను మేల్కొలిపే కర్తవ్యం చేయండి మరియు రుజువు చూపించండి. ఎలాగైతే బాప్ దాదా నుండి కూడా పురుషార్థానికి ప్రత్యక్ష ఫలం ప్రాప్తిస్తుందో, అదేవిధంగా మీరు కూడా ఫలితంలో ప్రత్యక్షఫలాన్ని చూపించండి మరియు సర్వశక్తివంతుని పాలనకు ప్రత్యక్ష స్వరూపం చూపించండి. సాకార రూపం ద్వారా కూడా చాలా పాలన తీసుకున్నారు మరియు అవ్యక్త రూపం ద్వారా కూడా పాలన పొందారు. ఇప్పుడు ఇతరాత్మలకు జ్ఞాన పాలనను ఇచ్చి వారిని కూడా బాబాకి సన్ముఖంగా మరియు బాబాకి సమీపంగా తీసుకురండి. డ్రామానుసారం ఇప్పుడు ఏదైతే సమయం నడుస్తుందో లేదా ఇప్పుడు ఏ సంవత్సరమైతే జరుగుతుందో, ఈ సంవత్సరంలో చాలా గొప్పవిషయాలు చూస్తారు. దీనికోసం ప్రారంభంలో విశేష స్మృతిబలం నింపుకునే అవకాశం మీకు లభించింది. ఇప్పుడు చాలా త్వరలో, అతి త్వరలో కొత్త కొత్త దృశ్యాలు, కొత్త కొత్త విషయాలు వింటారు మరియు చూస్తారు. దీనికొరకు అవ్యక్త స్థితిని మరియు అవ్యక్త మిలనాన్ని విశేషంగా అనుభవం చేసుకోవాలి. ఏ సమయంలో అయినా బాబా మిలనం ద్వారా, బుద్ధిబలం ద్వారా మీ పురుషార్థ కార్యంలో లేదా విశ్వసేవా కార్యంలో సఫలతామూర్తులుగా తయారుకాగలరు. ఇప్పుడు అవ్యక్త మిలనాన్ని అనుభవం చేసుకున్నారా? ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఏ రూపంలోనైనా మిలనం చేసుకునే అనుభవం చేసుకున్నారా? ఇది అభ్యాసం అయిపోయిందా? కొంచెం అభ్యాసం చేసినప్పుడు దానిని ఇంకా పెంచుకోగలరు కదా? పద్ధతి అయితే అందరికీ వచ్చింది కదా? ఇది చాలా సహజపద్ధతి. ఏదేశంలో, ఏ రూపంలో కలుసుకోవాలని అనుకుంటారో ఆ విధంగా మీ వేషాన్ని తయారుచేసుకోండి. మీ వేషాన్ని ఆవిధంగా తయారు చేసుకున్నట్లయితే ఆ వేషంలో ఆ దేశంలోకి చేరిపోగలరు. ఆ దేశవాసి అయిన బాబాని అనేక రూపాలతో మిలనం జరుపుకోగలరు. కేవలం ఆ దేశం సమానంగా మీ వేషాన్ని ధారణ చేయండి అంతే. అనగా స్థూల వేషము అనగా స్థూల శరీరం యొక్క స్మృతికి అతీతంగా, సూక్ష్మ శరీరం అనగా సూక్ష్మ దేశవాసిగా తయారవ్వండి. మీరు బహురూపి కాదా? ఈ వేషాన్ని ధారణ చేయడం రావడం లేదా? ఈనాటి ప్రపంచంలో ఎలాంటి కర్తవ్యమో అలాంటి వేషధారణ చేస్తారు. అదేవిధంగా మీరు కూడా బహురూపియేనా? ఏ సమయంలో ఏ కర్మ చేయాలనుకుంటే అలాంటి వేషాన్ని ధారణ చేయలేరా? ఇప్పుడిప్పుడే సాకారీ, మరియు ఇప్పుడిప్పుడే ఆకారీ. ఎలాగైతే స్థూల వస్త్రాలను సహజంగా మార్చుకోగలరో, అలాగే మీ బుద్ధి ద్వారా మీ సూక్ష్మ శరీరాన్ని ధారణ చేయలేరా? కేవలం బహురూపిగా అవ్వండి. అప్పుడు సర్వ స్వరూపాల యొక్క సుఖాన్ని అనుభవం చేసుకోగలరు. చాలా సహజం. ఆ స్వరూపం అయితే మీదే కదా! ఎవరిదో నకిలీ రూపం ఏమీ ధారణచేయడం లేదు కదా! ఇతరుల దుస్తులైతే సరిగ్గా సరిపోవు. కానీ మన దుస్తులైతే సహజంగా వేసుకోవచ్చు. అలాగే ఇది కూడా మీ యొక్క రూపం. ఇది ధారణ చేయడం కూడా సహజమే కదా? డ్రామానుసారం ఈ విశేష అభ్యాసం కూడా ఏదో రహస్యం కారణంగా నిర్ణయించబడింది. ఏ రహస్యం నిండి ఉంది దీనిలో? మీకు తెలుస్తుందా ఆ రహస్యం ఏమిటో? మీరు చెప్పేవన్ని యదార్థమైనవే. ఎందుకంటే యదార్థ స్థితిలో స్థితులై ఉన్నారు కదా, వ్యర్ధ స్థితి అయితే లేదు కదా? సమర్ధ శక్తి స్వరూపం యొక్క స్థితిలో ఉన్నారు కదా? ఇప్పుడు డ్రామా యొక్క రీళ్లు త్వరత్వరగా పరివర్తన కానున్నవి. వర్తమానంలో ఏదైతే సమయం నడుస్తుందో ఆ విషయాలన్నీ పరివర్తన కానున్నాయి. వ్యక్తం ద్వారా అవ్యక్త మిలనం ఇవన్నీ తీవ్ర పరివర్తన కానున్నాయి. అందువలన విశేష అవ్యక్తమిలనం యొక్క విశేష అనుభవం విశేష రూపంతో చేయించారు. ఇకముందు కూడా అవ్యక్త స్థితి ద్వారా అవ్యక్త మిలనం యొక్క విచిత్ర అనుభవాలు చాలా చేసుకుంటారు. ఈ సంవత్సరానికి అవ్యక్త మిలనం ద్వారా విశేష శక్తులను ప్రాప్తింపచేసుకునే వరదానం లభించి ఉంది. అందువలన ఈ నెల సమాప్తం అయిపోయింది కదా అని అనుకోకండి. ఈ అభ్యాసాన్ని మరియు ఈ అనుభవాన్ని నిరంతరం ఇక మున్ముందు పెంచుకుంటూ ఉండండి. అలాంటివారికి చాలా కొత్త కొత్త అనుభవాలు అవుతాయి. అర్ధమైందా!

ఈవిధంగా సర్వగుణాల్లో, స్వయాన్ని సంపన్నంగా తయారుచేసుకునే వారికి, తమ సంకల్పం, వాణి మరియు కర్మద్వారా సర్వ విశేషతలను ప్రత్యక్షం చేసేవారికి, బాప్ దాదా యొక్క దివ్యపాలనకి ప్రత్యక్ష ఫలం చూపించేవారికి, బాబాకి సదా స్నేహీ, సదా సహయోగి, సర్వశక్తుల్లో సమానంగా తయారయ్యేవారికి మరియు సర్వ సిద్ధులను ప్రాప్తింపచేసుకునే శ్రేష్ఠ ఆత్మలకు మరియు తీవ్ర పురుషార్ధీ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.