08.05.1973        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సర్వోన్నత స్వమానం.

సర్వ ఖజానాలతో నిండుగా చేసేవారు, మహాదాని, వరదాని, మహాత్యాగి, పదమాపదమ్ భాగ్యశాలిగా తయారు చేసేవారు, వరదానిమూర్తి శివబాబా మాట్లాడుతున్నారు -

వర్తమాన సమయంలో స్వయం ఏ స్వమానంలో ఉన్నట్లు భావిస్తున్నారు? మీ స్వమానాల గురించి తెలుసా? అన్నింటికంటే ఉన్నత స్వమానం ఇప్పుడే ఉంటుంది, ఇది తెలుసా? కానీ ఆ స్వమానం ఏమిటి? దానిని వర్ణిస్తేనే తెలిసిపోవాలి, దీనికంటే ఉన్నత స్వమానం మరేదీ ఉండదని, అది ఏ స్వమానం? ఈ పమయం యొక్క అన్నింటికంటే ఉన్నత స్వమానం ఏమిటంటే ఇప్పుడు మీరు తండ్రికి కూడా యజమాని అవుతున్నారు. విశ్వానికి యజమానిగా అవ్వడానికి ముందు విశ్వ రచయితకి యజమానిగా అవుతున్నారు. శివబాబాకి కూడా మీరు యజమానులు. అందువలనే యజమానికి నమస్కారం అని చెప్తారు. సుపుత్రులు అయిన పిల్లలు తండ్రికి కూడా యజమానులు. ఈ సమయంలో తండ్రిని కూడా మీవారిగా చేసేసుకున్నారు. కల్పమంతటిలో ఈ విధంగా తండ్రిని మీ వారిగా ఎప్పుడూ చేసుకోలేరు. బాబా కూడా ఈ సమయంలో ఎవరి బంధనలో ఉన్నారు? (పిల్లల యొక్క బంధనలో). మరయితే రచయితని కూడా బంధనలో బంధించేవారు మీరు. ఈ స్వమానాన్ని ఎప్పుడు అనుభవం చేసుకోగలరు? రచయితని సేవాధారిగా చేసుకునేవారు, తండ్రిని మీకు బానిసగా చేసేసుకున్నారు మీ సేవ కోసం. ఇది శుద్ధ స్వమానం. దీంట్లో అభిమానం ఉండదు. ఎక్కడ స్వమానం ఉంటుందో అక్కడ అభిమానం ఉండదు. తండ్రిని మీ సేవాధారిగా చేసుకున్నారు. దీంట్లో ఎలాంటి అభిమానం ఉండదు. ఈ విధంగా అభిమానం యొక్క నామరూపాలు లేని, మీ యొక్క శుద్ధ స్వమానంలో స్థితుల్లో ఉంటున్నారా?

ఏవిధంగానైతే బాబా సదా అలాగే పిల్లలు, మధురమైన పిల్లలూ, విశ్వయజమాని పిల్లలు అంటూ పిల్లలను తన శిరోకిరీటాలుగా చేసుకుంటారో, ఆవిధంగా శిరోకిరీటాల స్థితిలో స్థితులై ఉంటున్నారా? బ్రాహ్మణులకు పిలక ఏ స్థానంలో ఉంటుంది? శిరస్సుపై ఉంటుంది కదా! అంటే బ్రాహ్మణులు పిలక వంటివారు అనగా తండ్రి యొక్క శిరోకిరీటాలు. బాబా ఎలాగైతే పిల్లలకు స్వమానం ఇస్తూ తన సమానంగా తయారుచేస్తారో, అలాగే మీరందరు కూడా ప్రతీ ఒక్క ఆత్మకు సదా స్వమానాన్ని ఇస్తూ తండ్రి సమానంగా తయారు చేస్తూ ఉన్నారా? ఒకే తండ్రి నుండి తీసుకోవటం మరియు అందరికీ ఇవ్వటం అనేది ఈ సమయంలో తప్ప మరెప్పుడూ ఉండదు అని, సదా స్మృతి ఉంటుందా? ఆత్మలైన మీరు ఆత్మల నుండి తీసుకోవటం కాదు, మీరు వారికి ఇవ్వాలి. కేవలం ఒక్క తండ్రి నుండి మాత్రమే తీసుకోవాలి. ఏదైతే తీసుకున్నారో అది అందరికీ ఇవ్వాలి. దాతలు కదా! మరయితే ఇది సదా స్మృతిలో ఉంటుందా? లేక ఎక్కడైతే ఇవ్వాలో అక్కడ కూడా తీసుకోవాలనే కోరిక పెట్టుకుంటున్నారా? ఒకవేళ ఆత్మ, ఆత్మ ద్వారా ఏదైనా తీసుకోవాలనే కోరిక పెట్టుకున్నట్లయితే అక్కడ ఏమి ప్రాప్తిస్తుంది? అల్పకాలికంగానే లభిస్తుంది కదా! అల్పజ్జ ఆత్మల ద్వారా ప్రాప్తించేది కూడా అల్పకాలికంగానే ఉంటుంది. సర్వజ్ఞుడైన తండ్రి ద్వారా సదాకాలిక ప్రాప్తి లభిస్తుంది. ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకుని, ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇస్తున్నారా? లేక అప్పుడప్పుడు మార్చేస్తున్నారా? ఒకవేళ ఆత్మ, ఆత్మకి ఏదైనా ఇస్తున్నా కానీ బాబా నుండి తీసుకున్నదే ఇస్తున్నారు కదా? కనుక ఎవరి నుండి కొంచెం కూడా ఏదైనా తీసుకోవాలనే కోరిక అనేది మిమ్మల్ని స్వమానం నుండి క్రిందకి పడేస్తుంది.

అదేవిధంగా మీరు కూడా ఎప్పుడైనా ఏ ఆత్మకి అయినా బాబా ద్వారా లభించిన ఖజానా ఇవ్వటానికి నిమిత్తమవుతుంటే అప్పుడు కూడా ఏమి స్మృతి ఉంటుంది? ఆత్మ దగ్గర తనదంటూ ఏమైనా ఉందా? బాబా ఇచ్చినదే తమదిగా చేసుకున్నారు. కనుక ఇతరులకు ఇవ్వటానికి నిమిత్తమవుతున్నప్పుడు కూడా ఆ సమయంలో కూడా బాబా యొక్క ఖజానాను ఇస్తున్నాను అని స్మృతి లేకపోతే ఆ ఆత్మల యొక్క శ్రేష్ఠ సంబంధాన్ని జోడించలేరు. ప్రతీ కర్మ చేస్తూ ఈ స్మృతిలో ఉంటున్నారా? మీ శ్రేష్ఠ స్వమానం యొక్క నషా కూడా ఉండాలి. దాంతో పాటు ఇంకా ఏమి ఉంటుంది? (సంతోషం) బుద్ధిలో నషా ఎంతగా ఉంటుందో కర్మ అంతగా నమ్రత ఉండాలి. నయనాలలో సదా నమ్రత ఉంటుంది, అందువలన ఈ నషాలో ఎప్పుడూ నష్టం ఉండదు. అర్ధమైందా?

కేవలం నషా పెట్టుకోవటమే కాదు. ఒకవైపు అతి నషా, రెండవ వైపు అతి నమ్రత. చెప్పాను కదా - ఉన్నతోన్నతమైన తండ్రి కూడా పిల్లల ముందు బానిస అవుతున్నారు, అంటే అది నమ్రత అయ్యింది కదా! ఎంత ఉన్నతమో అంత నమ్రత - ఈవిధంగా సమానత ఉంటుందా? లేక ఏ సమయంలో నషాలో ఉంటున్నారో అప్పుడిక ఏమీ తెలియటం లేదా? ఎందుకంటే ఎప్పుడైతే మీరు మీ యొక్క ఈ స్వమానం యొక్క నషాలో ఉంటారో, మేము విశ్వరచయితకి కూడా యజమానులం అని, ఆవిధంగా నషాలో ఉండేవారి కర్తవ్యం ఏమిటి? విశ్వకళ్యాణం, విశ్వకళ్యాణమనేది నమ్రత లేకుండా జరగదు. బాబాని కూడా మీవారిగా ఎప్పుడు చేసుకోగలిగారంటే బాబా కూడా నమ్రతతో పిల్లలకు సేవాధారిగా అయినప్పుడు. ఆవిధంగా తండ్రిని అనుసరించండి.

బాబా నుండి ఎన్ని ఖజానాలు లభించాయి? సదా ఇదే పరిశీలించుకోండి. మీరు ఎన్ని ఖజానాలకు యజమానులో తెలుసా? (లెక్కలేనన్ని) అయినా కానీ ముఖ్యమైనవి వర్ణించవచ్చు కదా! ఈ సంగమయుగంలో ముఖ్యమైన ఖజానాలు ఎన్ని? మీకు ఎన్ని లభించాయి? అన్నింటికంటే ఉన్నతమైన ఖజానా - తండ్రి లభించారు. మొదటి నెంబరు ఖజానా ఇదే కదా! ఎవరికైనా కానీ తాళంచెవి లభించిందంటే అన్నీ లభించినట్లే. అదేవిధంగా బాబా లభించారంటే అన్నీ లభించినట్లే. ఇంకా ఏమి లభించాయి? వాటిని కూడా వెనువెంట వర్ణన చేయండి. జ్ఞానం కూడా లభించింది. అష్టశక్తులు కూడా లభించాయి. ఒకొక్క శక్తిని వేర్వేరుగా వర్ణించండి. వేర్వేరు శక్తులు కూడా ఖజానా రూపంలో ఉంటాయి. అదేవిధంగా బాబా యొక్క గుణాలను ఎలా అయితే వర్షిస్తున్నారో, అదేవిధంగా ఆ గుణాలను కూడా ఖజనాల మాదిరిగా వర్ణన చేయవచ్చు. అదేవిధంగా ఈ సంగమయుగి సమయం యొక్క ఒక్క సెకండు కూడా ఖజానా. ఎలాగైతే ఖజానా ద్వారా ప్రాప్తి లభిస్తుందో అలాగే ఈ సంగమయుగి ఒకొక్క సెకండు ద్వారా శ్రేష్ఠ ప్రాప్తిని మీరు పొందవచ్చు. కనుక ఈ సంగమయుగి సమయం కూడా అనగా ఒకొక్క సెకండు అనేక కోటానుకోట్ల కంటే ఎక్కువ గొప్ప ఖజానా. అనేక కోట్లను కలిపి ఒకవైపు మరియు సంగమయుగం యొక్క ఒక్క సెకండు మరోవైపు పెడితే సంగమయుగం యొక్క ఒక్క సెకండే శ్రేష్టంగా లెక్కించబడుతుంది. ఎందుకంటే ఆ సెకండు ద్వారానే సదాకాలిక ప్రాలబ్దం ప్రాప్తిస్తుంది. అందరికీ చెప్తారు కదా, ఒక్క సెకండులో ముక్తి - జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకోండి అని. అంటే ఒక్క సెకండు కూడా చాలా విలువైనది కదా! కనుక సంగమయుగం యొక్క సమయం కూడా గొప్ప ఖజానా.

ఇప్పుడు ఈ ఖజానాలను పరిశీలించుకోండి - మేము ఈ ఖజానాలన్నింటినీ స్వయంలో ఎంత వరకు ధారణ చేశాము? కొన్ని ఖజానాలు ధారణ అయ్యాయి, కొన్ని అవ్వలేదు... ఇలా లేరు కదా? ఏ ఖజానా అయినా కానీ సగమే లేదు కదా! వంచితులుగా అయితే ఉండరు. కానీ సగమే ప్రాప్తించింది అంటే కూడా చంద్రవంశీ అయిపోయారు, సూర్యవంశీ అవ్వలేదు. సూర్యవంశీయులు అనగా సంపన్నులు. ఏ విషయంలోనైనా సంపన్నులుగా లేకపోతే సూర్యవంశీ అని అనరు. కనుక ఖజానాలన్నింటినీ ఎదురుగా పెట్టుకుని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి - ఈ ఖజానాలు ఎంత వరకు ఉంది? ఎంత శాతంలో ఉంది? కొంచెంలోనే సంతోషం అయిపోయేలా ఉండకూడదు. కనుక ఈ ఖజానాలన్నింటినీ పరిశీలించుకోవాలి. దాంతోపాటు లభించిన ఖజానాలను మహాదాని అయ్యి ఇస్తున్నానా లేక స్వయం కోసమే పెట్టుకుంటున్నానా? ఇది కూడా పరిశీలించుకోండి. మహాదానిగా ఎవరైతే ఉంటారో వారు తమవి కూడా ఇతరులకి ఇచ్చేస్తారు. అయినా కానీ వారు బికారి అవ్వరు. ఎందుకంటే ఎవరైతే ఇస్తారో వారికి స్వతహాగానే ఖజానాలు పెరిగిపోతాయి. అదేవిధంగా పవిత్రత అనే ఖజానాను ఎంత వరకు అందరికీ ఇచ్చాను అనేది కూడా పరిశీలించుకోండి. అలాగే అతీంద్రియ సుఖం యొక్క ఖజానా గురించి కూడా చూసుకోండి. ఎక్కువ మీ కోసం ఉపయోగిస్తున్నారా లేక విశ్వ సేవ కోసం ఉపయోగిస్తున్నారా? మీ కోసం అయితే మీకు లభించాయి కదా? కానీ ఇప్పుడు విశ్వ సేవ కోసం ఉపయోగించే సమయం. కనుక పరిశీలించుకోండి - ప్రతీ ఖజానాను స్వయం కోసం ఎంత ఉపయోగిస్తున్నాను మరియు ఇతరుల కోసం ఎంత ఉపయోగిస్తున్నాను? దీనినే సంపూర్ణ స్థితి అని అంటారు. మరయితే సర్వ ఖజానాలను ఇతరుల కోసం ఉపయోగిస్తున్నారా? జ్ఞాన ఖజానాను, శక్తుల ఖజానాను మీకోసమే ఉపయోగిస్తూ ఉన్నట్లయితే అది కూడా సంపూర్ణ స్థితి కాదు. ఇప్పుడు ఇతరుల కొరకు ఉపయోగించే సమయం. ఒకవేళ ఇప్పటికీ సర్వ ఖజానాలను స్వయం కోసమే ఉపయోగిస్తూ ఉన్నట్లయితే, ఇతరుల కొరకు మహాదాని లేదా వరదానిగా ఎప్పుడు అవుతారు? ఇప్పుడిక మీ కోసం ఉపయోగించనవసరం లేకుండా ఉండాలి, ఈ అభ్యాసం చేయండి. సర్వ ఖజానాలను ఇతరుల కోసమే ఉపయోగించినట్లయితే మీరు ఖాళీ అయిపోతారా? ఎలాగైతే బాబా తన విశ్రాంతి సమయాన్ని కూడా శరీరానికి ఏదైతే అవసరమో, ఆ సమయాన్ని కూడా తన కోసం కాకుండా విశ్వకళ్యాణార్థం ఉపయోగించారో, అదేవిధంగా సర్వశక్తులను కూడా విశ్వకళ్యాణం కోసం ఉపయోగించండి, మీ కోసం కాదు. అందరూ బాబా సమానంగా అవ్వాలంటే బాబా సమాన స్థితిని కూడా ధారణ చేయాలి కదా! ఇతరులకి ఇవ్వటంలో నిమగ్నం అయిపోతే స్వయం సర్వ విషయాల్లో సంపన్నం అవ్వటం అనుభవం చేసుకుంటారు. ఇతరులని చదివించటంలో మీరు చదువుకున్నట్లే కదా! ఇప్పుడు డబల్ సమయం అనగా మీ కోసం వేరుగా, ఇతరుల కోసం వేరుగా ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఒకే సమయంలో రెండు పనులు చేయండి. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది. సమయం తక్కువగా ఉంటే డబల్ కోర్సు చదవాల్సి ఉంటుంది. ఇది కూడా అంతే. సమయం సమీపంగా వస్తూ ఉంది. ఇతరులకి ఇవ్వటంతో పాటు మీ కోసం కూడా జమ చేసుకోండి. మీ కోసం ఉపయోగించుకోకండి. ఒకవేళ ఇప్పటి వరకు కూడా మీ కోసమే ఉపయోగిస్తూ ఉన్నట్లయితే లేదా సమయం పోగొడుతూ ఉన్నట్లయితే, విశ్వ మహారాజులుగా కాలేరు. లక్ష్యం అయితే విశ్వమహారాజులు అవ్వాలని కదా! మొదట్లో జ్ఞాన గంగలు వెలువడినప్పుడు ఆ సమయంలో వారి సేవ యొక్క విశేషత ఏమిటి? ఆ సమయంలో వచ్చిన వారసులలో మరియు ఈ సమయంలో వస్తున్న ఆత్మలలో తేడా ఉంది, ఎందుకు? ఆ సమయంలో నాది అనేది లేదు, విశ్వ కళ్యాణార్ధం తమదంతా ఇవ్వాలనే భావన వారికి ఉంది. పొదుపు మరియు ఒకని పేరునే ప్రసిద్ది చేసేవారు (ఏకానమి మరియు ఏక్ నామి). ఖజానాలన్నింటినీ పొదుపు చేసేవారు. వ్యర్థం చేసేవారు కాదు. సమయం మరియు శక్తి ఏవైతే ఉన్నాయో వాటిని ఇతరుల కోసం ఇచ్చేవారు. అనగా మహాదాని స్థితి ఉండేది. ఎందుకంటే విశేషంగా నిమిత్తమయ్యారు. మరి అప్పటి స్థితి మరియు ఇప్పటి స్థితి రెండింటినీ చూడండి. ఎంత తేడా ఉంటుందో! ఇప్పటి వారికి మొదట స్వయం యొక్క సాధనాల గురించి ఆలోచిస్తారు. ఆ తర్వాత సేవా సాధనం అంటే మొదట సౌకర్యాలు తర్వాత సేవ. కానీ ఆదిలో మొదట సేవ, తర్వాత సౌకర్యాలు లభించినా, లభించకపోయినా పర్వాలేదు. సౌకర్యాలు ఉంటే సేవ చేస్తాం అనేది ఆలోచనమాత్రంగా కూడా ఉండేది కాదు. సాధనాలు ఉంటే సేవ చేస్తాం, సహయోగులు ఉంటే సేవ చేస్తాం, మంచి భూమి అయితే సేవ చేస్తాం... ఇలాంటి సంకల్పాలు ఉండేవి కావు. ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి సౌకర్యాలు ఉన్నా సహనశక్తితో సేవని వృద్ధి చేయాలి. ఇదే మహాదాని స్థితి. స్వయం యొక్క త్యాగం ద్వారా ఇతరుల యొక్క భాగ్యం తయారవుతుంది. ఎక్కడ స్వయం యొక్క త్యాగం ఉండదో, అక్కడ ఇతరుల యొక్క భాగ్యం తయారవ్వదు. కనుక ఆదిలో వారి స్థితిలో స్వయం యొక్క సర్వ సుఖాల త్యాగం ఉండేది, దాని ద్వారానే భాగ్యం తయారయ్యింది. ఎంత త్యాగమో అంత ఇతరుల యొక్క భాగ్యం తయారుచేస్తున్నారు. ఇప్పుడు కనుకనే వారసులు గుప్తం అయిపోయారు. ఇప్పుడు మరలా అదే మహాత్యాగిగా అయ్యే సంస్కారం లేదా సదా సర్వప్రాప్తులు ఉన్నప్పటికీ, సర్వ సాధనాలు ఉన్నప్పటికీ సాధనాలలోకి రాకండి, సాధనలో ఉండండి. ఇప్పుడు సాధన తక్కువ, సాధనాలు ఎక్కువ. ఆదిలో సాధనాలు తక్కువ, సాధన ఎక్కువ. అందువలన ఇప్పుడు నిరంతరం ఆ సాధనలో ఉండండి. అంటే సాధనాలు ఉన్నా కానీ త్యాగవృత్తిలో ఉండండి. దీని ద్వారా కొద్ది సమయంలో ఉన్నత ఆత్మల భాగ్యం తయారవుతుంది. బాప్ దాదా అందరి చేతులలో ఆత్మల యొక్క భాగ్యం తయారుచేసే రేఖను గీసుకునే అధికారం ఇచ్చారు. మీ త్యాగం యొక్క లోపం కారణంగా అనేకాత్మల భాగ్యరేఖను సంపన్నం చేయలేకుండా ఉండకూడదు. చాలా భాద్యత ఉంది. ఎలాగైతే సమయం .

సమీపంగా వస్తూ ఉందో, అలాగే సంకల్పాలను కూడా వ్యర్ధంగా పొగొట్టకుండా ఉండే భాద్యత ప్రతీ ఆత్మపై పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు బాల్యంలో ఉన్నట్లు భావించకండి. చిన్నతనంలో ఏమి చేసినా బావుంటుంది. పిల్లలుగా ఉన్నప్పుడు సోమరిగా ఉన్నా బావుంటుంది, పెద్దవారిగా అయిన తర్వాత సోమరిగా ఉంటే బావుండదు. అందువలన సమయాన్ని అనుసరించి మీ స్వమానాన్ని కాపాడుకుంటూ భాద్యతను సంభాళిస్తూ వెళ్ళండి. అర్థమైందా? మంచిది.

బాబాని సర్వ సంబంధాలతో తమవారిగా చేసుకునేవారికి, సదా సర్వఖజానాలను సర్వాత్మల కోసం దానం ఇచ్చే మహాదాని, వరదాని, మహాత్యాగి మరియు పదమాపదమ్ భాగ్యవంత పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.