17.05.1973        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ఎలాంటి లక్ష్యమో అలాంటి లక్షణాలు.

జ్ఞానసాగరుడు, సర్వశక్తివంతుడు, ఆనంద సాగరుడు, దయా సాగరుడు, కళ్యాణకారి బాబా మాట్లాడుతున్నారు -

బాబా యొక్క విశేషతలు ఏవైతే ఉన్నాయో వాటిని మీలో అనుభవం చేసుకుంటున్నారా? అందరికీ కూడా ఈ చదువు యొక్క ముఖ్య నాలుగు సబ్జెక్టుల గురించి చెబుతుంటారు కదా! అదేవిధంగా బాబా యొక్క ముఖ్యమైన నాలుగు విశేషతలు ఏమిటో తెలుసా? నాలుగు సబ్జెక్టులను అనుసరించి నాలుగు విశేషతలు. ఒకటి - జ్ఞాన సాగరులు, రెండు - సర్వశక్తివంతులు, మూడు - సేవాధారి నాలుగు - దయాసాగరులు. ముఖ్యమైన ఈ నాలుగు విశేషతలను స్వయంలో అనుభవం చేసుకుంటున్నారా? ఈ నాలుగింటి శాతంలో చాలా తేడా ఉందా లేక కొంచెమే ఉందా? తండ్రిని అనుసరించేవారే కదా! నాలుగు సబ్జెక్టులు జీవితంలో సహజ రూపంలో ఉన్నాయా లేక ఎక్కడ దిగడం అనేది సహజ రూపంలో ఉందా? ఎంత శాతం సహజరూపంలో ఉంది. 14 కళల వరకు సహజ రూపంలో ఉన్నాయా, సంపూర్ణ స్థితిని పొందేటందుకు ఇప్పుడు పురుషార్థం యొక్క వేగం తీవ్రం అవ్వకపోతే సమయం అనుసారంగా స్వయాన్ని సంపన్నంగా తయారుచేసుకోగలరా? తాత్కాలికంగా కార్యం కోసం బాప్ దాదా యొక్క లేదా మీ మతం అనుసారంగా ఏదైతే స్థితి తయారవుతుందో అది వేరే విషయం. కానీ అంతిమ స్థితిని అనుసరించి అంతేవేగంతో ముందుకు వెళ్తున్నారా? మీ వేగంతో మీరు సంతుష్టులేనా? దీనికొరకు కూడా ప్లాన్ తయారుచేసుకుంటున్నారా లేక కేవలం సేవ కొరకే ప్లాన్ తయారుచేస్తున్నారా? సేవ కోసం ఎలా అయితే రకరకాల ప్లాన్లు తయారుచేస్తారో అదేవిధంగా మీ పురుషార్థం యొక్క వేగంతో మీరు సంతుష్టంగా ఉండేటందుకు ఏదైనా ప్లాన్ తయారుచేస్తున్నారా? ప్రత్యక్ష ప్రాప్తి లేదా సఫలత లభించినప్పుడే దాని అనుసారంగానే వేగం తీవ్రం అవుతుంది. మీ వేగంతో మీరు సంతుష్టంగా ఉన్నప్పుడు తిరిగి మరలా శక్తిశాలి ప్లాన్ తయారుచేయాలి కదా! సేవలో సఫలత తక్కువగా ఉంటుందంటే దానికొరకు ఏదోక కొత్త విషయాలు ఆలోచిస్తున్నారు కదా? రకరకాల పద్ధతుల్లో నడుచుకుని ఈ భూమిని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా! స్వయం చేయలేకపోయినా కానీ సంఘటన యొక్క సహయోగం ద్వారా సరిచేస్తున్నారు కదా! అలాగే ఈ విషయం గురించి కూడా అంతే స్పష్టంగా ఉన్నారా? మీపట్ల మీకు అంత సంలగ్నత ఉందా, మీ గురించి మీకు ఎంత చింత ఉంది? ఏమి ప్లాన్ తయారుచేస్తున్నారు. మీ వేగాన్ని పెంచుకునేటందుకు ఏదైనా కొత్త ప్లాన్ తయారుచేసారా? ఏకాంతంలో ఉంటూ స్మృతియాత్రను పెంచుకునేటందుకు ఏదైనా ప్లాన్ తయారుచేశారా? ఎలా అయితే ఎవరైతే విశేష సేవా వేదిక పైకి వస్తారో వారు తమ యొక్క ప్రతి పనిని సెట్ చేసుకునే ప్లాన్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

అదేవిధంగా అమృతవేళ మీ పురుషార్థం యొక్క ప్లాన్ సెట్ చేసుకోవాలి. ఏదోక విషయంపై లేదా ఏదోక బలహీనతపై విశేష ధ్యాస పెట్టి పురుషార్థం యొక్క ధ్యాస పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు తమతమ ధైర్యాన్ని అనుసరించి ఆ ప్లాన్ బుద్దిలో పెట్టుకోవాలి. రోజంతటిలో ఏది ప్రత్యక్షంలోకి తీసుకురావాలో, ఎంత శాతం ప్రత్యక్షంలోకి తీసుకురావాలో బుద్ధిలో పెట్టుకోవాలి. ఈ విధంగా మీ దినచర్యతో పాటు ఈ ప్లాన్ కూడా సెట్ చేసుకోండి. రాత్రి పరిశీలించుకోండి. సెట్ చేసుకున్న మీ విషయాన్ని ఎంత వరకు ప్రత్యక్షంలోకి తీసుకువచ్చారు. ఎంత శాతం ధారణ చేయగలిగారు. ఒకవేళ చేయలేకపోతే దానికి కారణం ఏమిటో కూడా పరిశీలించుకోవాలి. ఒకవేళ చేసినట్లయితే ఏ విశేష యుక్తి ఆధారంగా మీలో ఉన్నతిని అనుభవం చేసుకున్నారో రెండింటి యొక్క రిజల్టు ఎదురుగా తెచ్చుకోవాలి. ఈ రోజు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, కానీ దాంట్లో అంత సఫలత రాలేదు. ఏం ప్లాన్ అయితే తయారు చేసారో అది ప్రత్యక్షంలోకి తీసుకురాలేకపోయారు. అయినా కానీ దానిని వదిలేయకూడదు..

స్థూల కార్యంలో కూడా లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఏ కారణంగా అయినా అది సగమే చేయగలిగితే దానిని పూర్తి చేయడానికి మరలా ప్రయత్నిస్తారు కదా! అదేవిధంగా ఒకరోజు యొక్క ఈ కార్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని సంపన్నంగా చేయాలి. ఒకవిషయంపై విశేష ధ్యాస పెట్టడం ద్వారా విశేష బలం లభిస్తుంది. ఏ కార్యం చేస్తున్నా అదే స్మృతి వస్తుంది. అనగా స్మృతి స్వరూపులుగా అయిపోతారు. బాహ్య జ్ఞానంలో కూడా ఏ పాఠాన్ని అయినా పక్కా చేసుకోవాలంటే దానిని రెండుసార్లు, మూడు సార్లు, నాలుగు సార్లు పక్కాగా చేసుకుంటారు. దానిని వదిలిపెట్టరు. అదేవిధంగా దీంట్లో కూడా మీరు లక్ష్యం పెట్టుకుని ఒక్కొక్క విషయాన్ని పూర్తిచేస్తూ వెళ్లండి, దీంట్లో సోమరిగా కాకండి. అనుకున్నాము, ప్లాన్ తయారు చేసుకున్నాము, కానీ ప్రత్యక్షంలోకి తీసుకురావడంలో ఒకవేళ ఏ పరిస్థితి అయినా ఎదురైతే ఇది చేసి తీరాల్సిందే అని సంకల్పంలో దృఢత ఉండాలి. ఈ దృఢత ఎంతగా ఉంటుందో అంతగా సంపూర్ణతకు సమీపంగా వెళ్ళగలరు. వర్తమాన సమయంలో ప్లాన్ కూడా ఉంది. కానీ ఏది లోపం? దృఢత. దృఢ సంకల్పం చేయడం లేదు. విశేష రూపంగా ధ్యాస పెట్టి చేసి చూపించడంలో లోపం ఉంది. మహారథీలు అనగా సేవాధారీ శ్రేష్ఠాత్మలు. సేవతో పాటు స్వసేవ గురించి కూడా ధ్యాప పెట్టాలి. ఒకటి - స్వ సేవ. రెండు - విశ్వ కళ్యాణ సేవ. రెండింటి సమానత సరిగా ఉంటుందా? ఇప్పుడు ఈ రకంగా మీ శ్రేష్ట సంకల్పాన్ని ప్రత్యక్షంలోకి తీసుకురండి. కేవలం ఆలోచించడం కాదు. ఆలోచిస్తూ, ఆలోచిస్తూ.. సమయాన్ని గడిపేయకండి అని మీరు ఇతరులకు చెబుతారు కదా! అదేవిధంగా మీ ఉన్నతికి కొరకు ప్లాన్ ఆలోచిస్తూ దృఢ సంకల్పంతో ప్రత్యక్షంలోకి తీసుకురండి. రోజూ ఒక విశేషతను ఎదురుగా ఉంచుకుని మీకోసం ఒక ప్లాన్ తయారుచేసుకుని ప్రత్యక్షంలోకి తీసుకువచ్చినట్లయితే కొద్ది రోజుల్లోనే మీలో గొప్ప తేడాని అనుభవం చేసుకుంటారు. ఈ విశేష వరదాన భూమిలో కూడా మీ ఉన్నతి కోసం కొన్ని ప్లాన్లు తయారుచేసుకుంటారు. అవునా, లేదా? కేవలం సేవ కొరకే మీటింగ్ చేసుకుని వెళ్లిపోతారా? మీ ఉన్నతి కొరకు రాత్రి సమయం అనేది అందరికీ ఉంది కదా! విశేష సేవ కోసం ఏదైనా ప్లాన్ చేసినప్పుడు దానిని ప్రత్యక్షంలోకి తీసుకురావడంలో ఆ రోజుల్లో నిద్రాజీత్ అవ్వడం లేదా మీరు. అదేవిధంగా మీ ఉన్నతి కోసం కూడా నిద్రని త్యాగం చేసినా కానీ మీకు సమయం లభించదా? మీకు ఇక వేరే పనులు ఏమున్నాయి? ఇతర ప్లాన్లు ఏవిధంగా అయితే తయారుచేస్తున్నారో, అదేవిధంగా మీ ఉన్నతికోసం కూడా ఏదో ఒక విశేష ప్లాన్ ప్రత్యక్షంలోకి తీసుకురావాలి. ఈ విధంగా ఏవైతే ఉన్నతి యొక్క సాధనను ప్రాక్టికల్ లోకి తీసుకువస్తారో వారికి అన్నివైపులా సహయోగమనే లిఫ్ట్ లభిస్తుంది. లక్ష్యం పెట్టుకుంటూ కూడా దాని అనుసారంగా ప్రత్యక్షంలో లక్షణాలు రావడం లేదు. దానికి కారణం మరియు నివారణ కూడా తెలుసు. జ్ఞాన సాగరులు అయిపోయారు. కానీ ఇక ఏమి లోటు ఉంది? ప్లాన్లు ప్రత్యక్షంలోకి తీసుకురాకపోవడానికి కారణం ఏమిటి? శక్తివంతులు అవ్వని కారణంగా జ్ఞానాన్ని ప్రత్యక్షంలోకి తీసుకురాలేకపోతున్నారు. శక్తివంతులుగా అయ్యేటందుకు ఏమి చేయాల్సి ఉంటుంది? దీనికొరకు ప్రాక్టికల్ ప్లాన్ తయారుచేయండి. ఇప్పటి వరకు మీరే తయారుకాకపోతే మీ వంశావళిని ఎప్పుడు తయారుచేస్తారు. ప్రజలు ఎప్పుడు తయారవుతారు? కనుక ఈసారి ప్రత్యక్షంలో ఏదోకటి చేసి చూపించాలి. పురుషార్ధంలో ప్రతి ఒక్కరికి చాలా మంచి అనుభవాలు అవుతుంటాయి. ఆ అనుభవాలను ఇచ్చిపుచ్చుకుంటూ పరస్పర ఉన్నతి సాధనాలు వింటూ ఉంటే మీలో కూడా బలం నిండుతుంది. ఇలాంటి క్లాస్ ఎప్పుడైనా చేసుకుంటున్నారా? మంచిది.