23.06.1973        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


అలౌకిక ఖజానాలకి యజమాని.

బలహీన ఆత్మలందరికీ బలాన్ని ఇచ్చేవారు, సర్వాత్మల తమోగుణి స్వభావ సంస్కారాలను పరివర్తన చేసేవారు మరియు పదమాపద భాగ్యశాలిగా తయారుచేసే శివబాబా మాట్లాడుతున్నారు-

స్వయాన్ని లైట్‌హౌస్ మరియు మైట్‌హౌస్ గా భావించి నడుస్తున్నారా? వర్తమాన సమయం యొక్క స్థితిని అనుసరించి మీ అందరి యొక్క ఏ స్వరూపం విశ్వకళ్యాణ కర్తవ్యం చేయగలదు? ఆ స్వరూపం ఏమిటో తెలుసా? ఈ సమయంలో అవసరమైనది - మైట్‌హౌస్ యొక్క స్వరూపం.సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క సంతానం అయిన మేము కూడా శక్తి గృహాలం (మైట్ హౌస్), అని అనుభవం చేసుకుంటున్నారా? సర్వశక్తులు మీలో ఉన్నట్లుగా భావిస్తున్నారా? శక్తివంతులు కాదు, సర్వశక్తివంతులు. సర్వశక్తులతో సంపన్నం అయిన వారి కొరకే మహిమ ఉంది - బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి శక్తి అనేది లేనేలేదు. దేవతల కోసం మహిమ చేస్తారు కదా - దేవతల ఖజానాలో అప్రాప్తి వస్తువు ఉండనే ఉండదు. అదేవిధంగా బ్రాహ్మణుల యొక్క మహిమ ఏమిటంటే బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి శక్తి అనేది లేదు. ఎందుకంటే మీరు మాస్టర్ సర్వశక్తివంతులు. తండ్రి పేరే - సర్వశక్తివంతుడు, సర్వశక్తుల ఖజానాకి యజమాని అయిన బాబా యొక్క పిల్లలు మీరు, మీరు కూడా సర్వశక్తులకి యజమానులు. అలాంటి వారికి ఏ శక్తి అయినా అప్రాప్తిగా ఉంటుందా? మీరు పిల్లలు మరియు యజమానులు. ఈ విధంగా స్వయాన్ని పిల్లలుగా మరియు యజమానులుగా భావించని వారు ఎవరైనా ఉన్నారా? అందరు యజమానులే కూర్చుని ఉన్నారు కదా! సర్వశక్తులకి మీరు యజమానులే కదా! ఖజానాలకి యజమాని అయిన వారు ఎప్పుడూ కూడా ఇలాంటి సంకల్పాలు చేయరు - మా దగ్గర సహనశక్తి లేదు లేదా మాయని పరిశీలించే శక్తి లేదు.జ్ఞాన ఖజానాని సంభాళించే శక్తి లేదు, లేదా సంకల్పాలను ఇముడ్చుకునే శక్తి లేదు, లేదా ఖజానాలను స్మరణ చేసే శక్తి లేదని. ఏ పనిలోనైనా బుద్ధి ఎంతగా విస్తారంలోకి వెళ్ళినా కానీ ఒక్క సెకనులో విస్తారాన్ని ఇముడ్చుకునే శక్తి లేదా మీకు? యజమాని అయిన వారికి ఇలాంటి మాటలు, సంకల్పాలు వస్తాయా? ఒకవేళ వస్తుంటే వారిని ఏమంటారు? ఆ సమయంలో ఉన్న ఆ స్థితిని యజమాని స్థితి అని అంటారా? యజమాని ఎప్పుడూ యజమానిగానే ఉంటారు. ఇప్పుడిప్పుడే యజమాని, ఇప్పుడిప్పుడే బికారి. మాస్టర్ సర్వశక్తివంతులు అయిన వారు ఇలా ఉంటారా? యజమానుల నుండి మాటిమాటికీ రాయల్ బికారులుగా ఎందుకు అవుతున్నారు? ఎప్పుడైనా కానీ పిల్లలు బాబా ఎదురుగా వచ్చి - బాబా! మాకు సహాయం చేయండి, శక్తినివ్వండి మరియు తోడు ఇవ్వండి అని అంటే దానిని ఏమంటారో తెలుసా? రాయల్ బికారి స్థితి అని అనరా? ఇది భక్తి సంస్కారం. దేవతల ముందుకి వెళ్ళి ఏమంటారు? మీరు సర్వగుణ సంపన్నులు, నేను పాపిని, కపటిని అంటారు. ఈ విధంగా బాబా ముందుకి మాస్టర్ సర్వశక్తివంతులై రాకుండా బాబా మీరు సర్వశక్తుల సాగరులు నాలో ఆ శక్తి లేదు, నేను నిర్బలం, మాయతో ఓడిపోతున్నాను, వ్యర్థ సంకల్పాలను అదుపు చేసుకోలేకపోతున్నాను, మాయా విఘ్నాల నుండి భయపడిపోతున్నాను. ఇలా అనటం భక్తి సంస్కారం అవ్వలేదా? మీకు చెప్పాను కదా - బాబా ఎవరో ఎలాంటివారో ఆవిధంగా అంగీకరించకుండా మీ భావనకి వశమై మీరు సర్వవ్యాపి అని కూడా అన్నారు. ఈ రకంగా మీరు బాబాని అవమానపరిచారు కదా! కఠినాతికఠినమైన మాటలతో నిందించారు. అదేవిధంగా మీరు శ్రేష్ట స్వమానంలో ఉండకుండా, మాస్టర్ సర్వశక్తివంతులు, మాస్టర్ జ్ఞాన సాగరులు, ప్రేమ సాగరులు, ఆనందం అన్నింటిలో సాగరులు అయ్యిండి ఈ శక్తి నాలో లేదు, అని అంటున్నారంటే వారిని మాస్టర్ సాగరులు అని అంటారా? ఒకవైపు స్వయాన్ని మాస్టర్ జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు అని అనుకుంటూనే మరలా ఇలా అడగటం అవమానం కాదా? మిమ్మల్ని మీరే అవమానం చేసుకుంటున్నారు. లేదా ఇది బ్రాహ్మణుల స్వమానమా? ఇలాంటి మాటలు మాట్లాడటం లేదా సంకల్పం చేయటం ఇవన్నీ మిమ్మల్ని మీరు అవమానపరుచుకోవటం మరియు బాబాని కూడా అవమానపరచటం. బాబాని అవమానపరచటం ఎలా? ఎందుకంటే బాబా దాత అంటే తనకుతానుగా ఇచ్చేవారు. ఎవరో చెప్పటం వలన ఇవ్వరు, దాత అయిన బాబాని మనిషిగా చేసేస్తున్నారు. అది అవమానం కాదా? చెప్తే చేసేవారు ఎవరు? మనుష్యులు. మరోవిషయం ఏమిటంటే బాబాకి కూడా స్మృతి ఇప్పిస్తున్నారు. దీని ద్వారా ఏమి రుజువు అయ్యింది? బాబా తన కర్తవ్యాన్ని మర్చిపోయారని మీరు అనుకుంటున్నారా? అందుకేనా మీరు బాబాకి స్మృతి ఇప్పిస్తున్నారు. బాబా మీరు సహాయకారులు కదా! అందువలన నాకు సహాయం చేయండి అని అంటున్నారు. ఇలా అనటాన్ని ఏమంటారు? మహిమ ఏవిధంగా ఉంది - బ్రాహ్మణులు అనగా సర్వప్రాప్తి స్వరూపులు. ప్రాప్తి స్వరూపుల దగ్గరకి అప్రాప్తి ఏవిధంగా వచ్చింది? అందువలన బ్రాహ్మణుల స్థితి పవర్‌హౌస్ లా ఉండాలి. పవర్‌హౌస్ అయిన వారి మాటలు ఈ విధంగా ఉండవు. ఇప్పుడు అంతిమ ఫలితం ప్రకటించబడే సమయం కూడా సమీపంగా వస్తూ ఉంది. అంతిమ ఫలితం ప్రకటించబడే సమయంలో కూడా ఒకవేళ ఎవరైనా మొదటి పాఠాన్ని చదువుకుంటూ ఉన్నట్లయితే లేదా దాంట్లో ఇంకా పక్కాగా కాకపోతే అలాంటి వారికి ఏమి ఫలితం వస్తుంది? అందువలన బాప్ దాదా కొంచెం సమయం ముందుగానే మీకు చెప్తున్నారు - మీలో ఎవరైనా కానీ హైజంప్ చేయాలనుకుంటే అనగా ముందుకి వెళ్ళాలనుకుంటే ఇప్పటి నుండి 6నెలల్లోగా అనగా ఈ సంవత్సరం పూర్తి అయ్యే లోపు మిమ్మల్ని మీరు ఏ స్థితికి చేర్చుకోవాలో, ఏ స్థితిలో స్థితులు చేసుకోవాలో దాని కోసం అవకాశం ఉంది. ఇలా కొంచెం సమయంలో మిమ్మల్ని మీరు సంపన్నంగా తయారుచేసుకోవాలంటే మాత్రం సాధారణ పురుషార్ధం సరిపోదు. తీవ్ర పురుషార్ధం చేయాలి ఇప్పుడు. అంటే సంకల్పం మాట కర్మ ఈ మూడింటిలో సమానత యొక్క అభ్యాసం చేయాలి. అలాంటి వారినే తీవ్ర పురుషార్ధి అని అంటారు. బుద్ధిలో మేము దాత యొక్క పిల్లలం అని అనుకుంటున్నారు లేదా భావిస్తున్నారు. కానీ మాటలో మరియు కర్మలో తేడా వస్తుంది. అదేవిధంగా మేము సర్వాత్మల కంటే ఉన్నతమైన బ్రాహ్మణులం అని సంకల్పంలో ఆలోచిస్తున్నారు. కానీ మాట మరియు కర్మలో తేడా వస్తుంది. అదేవిధంగా మేము విశ్వ కళ్యాణకారి అని అనుకుంటున్నారు. కానీ మాట మరియు కర్మలో తేడా వస్తుంది. ఈ మూడింటిలో సమానత రావాలి, దానినే తీవ్ర పురుషార్థం అనగా బాబా సమానంగా అవ్వటం అని అంటారు. ఈవిధంగా మిమ్మల్ని మీరు బాబా సమానంగా తయారు చేసుకునేటందుకే సమయం ఇస్తున్నారు. 6 నెలల తర్వాత ఈ ఆత్మిక సేన యొక్క మహావీరులు, గుఱ్ఱపు సవారీలు, కాలిబలం అనగా ప్రజలు అందరూ ప్రత్యక్షం అయిపోతారు. పరస్పరంలోనే ప్రత్యక్షం కాకపోతే విశ్వం ముందు ఎప్పుడు ప్రత్యక్షమవుతారు? విశ్వం ముందు ప్రఖ్యాతి కాకపోతే ప్రత్యక్షత ఎలా జరుగుతుంది? కనుక స్వయాన్ని లేదా బాబాని ప్రత్యక్షం చేసేటందుకు లేదా బాబా యొక్క ప్రత్యక్షత చేసేటందుకు ఇప్పుడు చేయాల్సిన అంతిమ పురుషార్థం లేదా అంతిమం నుండి ఆది పురుషార్ధం ఏమి మిగిలి ఉంది? ఏ తీవ్ర పురుషార్థం చేయాలి? ఆ తీవ్ర పురుషార్థమే అంతిమ పురుసార్థ అది ఏమిటో తెలుసా? ఏ పురుషార్ధం చేయాలి? తీవ్ర పురుషారానికి విధి ఏమిటి? దాని ద్వారా బాబా సమానంగా తయారైపోవాలి. ఇది సిద్ధించాలి. విధి లేకుండా సిద్ది రాదు. చాలాసార్లు చెప్పాను, కేవలం ఒకే మాట. చివర్లో వచ్చినా వేగంగా వెళ్ళిపోయే విధి ఏమిటంటే ప్రతిజ్ఞ. ఇది చేయకూడదు లేదా ఇది చేయాలి ఇలా ఏవిషయం గురించి అయినా ప్రతిజ్ఞ చేయాలి. ప్రతిజ్ఞ యొక్క విధి ద్వారానే చివర్లో వచ్చినా కానీ ముందుకి వెళ్ళిపోగలరు. ప్రతిజ్ఞ అనగా సంకల్పం చేశారు మరియు స్వరూపంగా అయిపోయారు. ప్రతిజ్ఞ చేయటానికి ఒక్క సెకను సమయం పడుతుంది, తీవ్ర పురుషార్ధం కూడా ఒక్క సెకనులో జరుగుతుంది. ఎందుకంటే చెప్పాను కదా - చివరి పరీక్ష యొక్క ఫలితం ప్రకటించబడుతుంది. చివర్లో పరీక్షా సమయం ఎంత లభిస్తుంది మీకు. ఒక్క సెకను. పరీక్ష యొక్క సమయం నిర్ణయించబడింది, పరీక్ష కూడా నిర్ణయించబడిపోయింది మరియు ప్రశ్న కూడా చెప్పబడింది. అది ఏమిటంటే నష్టోమోహ స్మృతి స్వరూప. ఒక్క సెకనులో ఆజ్ఞ లభించగానే నష్టోమోహ అయిపోవాలి. ఒక్క సెకనులో నష్టోమోహ స్మృతి స్వరూపంగా అవ్వకపోతే, మీ స్వరూపాన్ని తయారుచేసుకోవటంలో అనగా యుద్ధం చేయటంలోనే సమయం వెళ్ళిపోతే, బుద్ధిని స్థిరం చేయటంలోనే సమయం గడిచిపోతే ఏమవుతారు? ఫెయిల్ అయిపోతారు. ఒక్క సెకనే సమయం లభిస్తుంది, ఇది కూడా ముందుగానే చెప్తున్నాను. ప్రశ్న కూడా ముందుగానే చెప్తున్నాను మరి ఎంతమంది పాస్ అవ్వాలి? తీవ్ర పురుషార్ధానికి విధి - ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ ద్వారా స్వయాన్ని ప్రఖ్యాతి చేసుకోండి మరియు బాబాని కూడా ప్రఖ్యాతి చేయండి. అనగా ప్రతిజ్ఞతో ప్రత్యక్షత చేయండి. ఇది కష్టమా? ధైర్యం, ఉల్లాసం, నషా మరియు గమ్యం... ఇవి మీ తోడుగా ఉంటే అనేక కల్పాల వలె మీరు పూర్తిగా పాస్ అయిపోతారు. కష్టమేమీలేదు. కేవలం ఈ ఆరునెలల్లో మీ యొక్క ముఖ్య నాలుగు సబ్జక్టులను ఎదురుగా పెట్టుకుని పరిశీలించుకోండి - నాల్గింటిలో పాస్ మార్కులు వచ్చాయా? తక్కువలో తక్కువ పాస్ మార్కులు. కానీ ఎవరైతే విశేషాత్మలు ఉంటారో వారు పూర్తి మార్కులు తీసుకునే లక్ష్యం పెట్టుకోవాలి. రెండు మూడు సబ్జక్టులలో మంచిమార్కులు వచ్చి ఒకటి లేదా రెండు సబ్జక్టులలో తక్కువ వస్తే కేవలం పాస్ అవుతారు అంతే. ఒకవేళ ఎవరైనా ఏ సబ్జక్టులో అయినా ఫెయిల్ అయిపోతే ఏమవుతుంది? రెండవసారి పరీక్ష రాయవలసి ఉంటుంది. అప్పుడు వారి యొక్క ఒక్క సంవత్సర సమయం వ్యర్ధం అయిపోతుంది. అంటే ఇక్కడ సూర్యవంశం నుండి మిస్ అయిపోతారు. సూర్యవంశం యొక్క మొదటి రాజభాగ్యం మరియు ప్రకృతి యొక్క మొదటి సర్వ ప్రాప్తి సంపన్న ప్రాలబ్దం నుండి మిస్ అయిపోతారు. ఒకవేళ అలా అలా వృద్ధి అవుతూ ఉన్నట్లయితే త్రేతాయుగంలోకి వస్తారు. వృద్ధి చేసుకుంటూ పూర్తి మార్కులు తెచ్చుకున్నట్లయితే త్రేతాయుగంలో కొంచెం శ్రేష్ట ప్రాలబ్ధాన్ని పొందుతారు. కనుక ఇలా కూడా అనుకోకండి. నాలుగు సబ్బక్టులలో మొదటి తరగతి వచ్చేలా పురుషార్థం చేయండి. పూర్తిగా పాస్ అవ్వాలి, పూర్తి మార్కులు పొందాలి. రెండవ నెంబరు పురుషార్ధం ఏమిటంటే అన్ని సబ్జక్టులలో కేవలం పాస్ అవుతారు అంతే. ఇక మూడవ నెంబరు పురుషార్థం చేయనే చేయరు. ఎందుకంటే మూడవ నెంబరు వారి గురించి ఆలోచించేది కూడా ఏమీలేదు. అయినా కానీ బాబా మీకు సమయం ఇస్తున్నారు. మిమ్మల్ని మీరు అన్ని సబ్జక్టులలో సంపూర్ణం చేసుకోండి. అర్ధమైందా! మూడు గ్రూపుల ఫలితం ప్రకటితం కానున్నది. మొదటి గ్రూపు - ఎవరెడీ గ్రూపు, రెండవ గ్రూపు - రెడీ గ్రూపు, మూడవ గ్రూపు - లేజీ (సోమరుల) గ్రూపు. ఈ 6 నెలల్లో మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకుని మొదటి గ్రూపులోకి రావాలి. అనగా ఎవరెడీ గ్రూపులోకి రావాలి. ఆజ్ఞ లభించగానే చేసేయాలి. ఆజ్ఞని అంగీకరించటంలో సోమరిగా ఉండకూడదు. ఈ మూడు గ్రూపులలో ఏ గ్రూపులో ఉన్నారో మీకు మీకే దర్పణంలో సాక్షాత్కారం అయిపోతుంది. కల్పపూర్వపు బ్రహ్మాకుమార్ (నారదుడు) దర్పణంలో తన సాక్షాత్కారం చేసుకున్నాడు కదా! అదేవిధంగా జ్ఞానమనే దర్పణంలో మిమ్మల్ని మీరే సాక్షాత్కారం చేసుకుంటారు - నేను ఏ గ్రూపులో ఉన్నాను, ఏ తరగతిలోకి వస్తాను అని. ఎలాంటి గ్రూపుయో అలాంటి తరగతి. మంచిది.

సదా స్వయం పట్ల మరియు విశ్వం పట్ల శుభ చింతక స్థితిలో స్థితులై ఉండేవారికి, ప్రతీ సెకను మరియు ప్రతీ సంకల్పం శ్రేష్టంగా చేసుకునేవారికి, సదా తమ యొక్క ఖజానాల యొక్క స్మృతిలో మరియు స్మరణలో ఉండేవారికి, సదా సంతోషమనే భోజనంతో నిండుగా ఉండేవారికి, బలహీన ఆత్మలకు బలాన్ని ఇచ్చే వారికి, సర్వాత్మల తమోగుణి స్వభావ సంస్కారాలను పరివర్తన చేసేవారికి, సాక్షి మరియు సదా సాథీ యొక్క అనుభవం చేసుకునేవారికి కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో కొద్దిమంది అయిన పదమాపద భాగ్యశాలి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.