15.04.1974        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


విఘ్నవినాశకులై అంగదుని సమానంగా మాయపై విజయాన్ని పొందండి.

విఘ్నవినాశకుడు, విశ్వపాలకుడు, మాయపై విజయాన్ని ప్రాప్తింప చేసి, ఉత్సాహ ఉల్లాసాలను పెంచే శివబాబా అన్నారు -

అందరూ ఉన్నతి వైపుకి వెళ్తున్నారా? ఎక్కేకళకి గుర్తు ఏమిటో తెలుసా? సదా సంలగ్నతలో నిమగ్నం మరియు విఘ్నవినాశకులు. ఈ రెండు గుర్తులు అనుభవం అవుతున్నాయా? లేక విఘ్నవినాశకులుగా అవ్వడానికి బదులు విఘ్నాలను చూసి మీ స్థితి నుండి క్రిందకి వచ్చేస్తున్నారా? వచ్చినటువంటి తుఫానులు మీ బుద్ధిలో తుఫానుని ఉత్పన్నం చేయటం లేదు కదా? ఎవరి ద్వారానైనా మీకు కానుక లభిస్తే ఆ సమయంలో బుద్ధిలో ఎటువంటి అలబడి ఉండదు కదా! ఉల్లాసం ఉంటుంది. అదేవిధంగా వచ్చిన తుఫానులు ఉల్లాసాన్ని పెంచుతున్నాయా లేక అలజడిని పెంచుతున్నాయా? తుఫానుని తుఫానుగా భావిస్తే అలజడి ఉంటుంది. కానీ తుఫానుని కానుకగా భావించారు లేదా అనుభవం చేసుకున్నారంటే వాటి ద్వారా ఉల్లాసం మరియు ధైర్యం అధికంగా పెరుగుతాయి. ఇదే వృద్ధి కళకు గుర్తు. భయపడడానికి బదులు లోతులోకి వెళ్ళి అనుభవాలు అనే క్రొత్త క్రొత్త రత్నాలను ఈ పరీక్షలనే సముద్రం నుండి పొందుతారు. మరయితే ఇలా అనుభవం చేసుకుంటున్నారా? ఇలా జరుగుతుంది ఏమిటి? ఎందుకు జరుగుతుంది, ఇలా అయితే ఎలా నడిచేది? ఇలాంటి సంకల్పాలు నడవడాన్నే అలజడి అని అంటారు. అలజడిలో రత్నాలు దాగి ఉన్నాయి. పై పైనుండి అంటే బాహ్మార్ముఖత యొక్క దృష్టి మరియు బుద్ధి ద్వారా చూడటం వలన అలజడియే కనిపిస్తుంది లేదా అనుభవం అవుతుంది. కానీ వచ్చినటువంటి ఆ విషయాలను అంతర్ముఖి దృష్టి మరియు బుద్ధి ద్వారా చూడటం వలన అనేక రకాల జ్ఞాన రత్నాలు అంటే పాయింట్స్ లభిస్తాయి.

ఒకవేళ ఏ విషయాన్ని అయినా వినినా లేదా చూసినా ఆశ్చర్యం అనిపిస్తే అది కూడా అంతిమ స్థితి కాదు. డ్రామానుసారం జరిగినా కానీ ఇలా అయితే జరగకూడదే అనే సంకల్పాలు ఉత్పన్నం అయితే దానిని కూడా అలజడి యొక్క రూపం అని అంటారు. ఏదైతే జరిగిందో అది జరగవలసిందే. ఇప్పటి వరకు కూడా ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు ఉన్నాయంటే అలజడి ఉన్నట్లే అర్ధం. విఘ్నం రావటం తప్పనిసరి, రావటం అనేది ఎంత తప్పనిసరియో అంతగా ఈ విషయాన్ని బుద్ధిలో ఉంచుకుంటే, అంతగా అటువంటి మహారథీలు హర్షితంగా ఉంటారు. కొత్తదేమీ కాదు - ఇదే అంతిమ స్థితి. ఒకవేళ ఎవరైనా అలజడి అయ్యి పని చేస్తున్నా లేదా అటువంటి పాత్రను అభినయిస్తున్నా, సముద్రం వలె పైపైకి అలజడి కనిపించినా, కానీ అంటే కర్మేంద్రియాలు అలజడిలోకి వస్తున్నా, కానీ స్థితి మాత్రం క్రొత్తదేమీ లేదు అనే విధంగా ఉండాలి. స్థూల సముద్రం రెండు రూపాలను చూపిస్తున్నప్పుడు మాస్టర్ జ్ఞానసాగరులు ఆవిధంగా చూపించలేరా? ప్రకృతి పురుషుని నుండి కాపీ చేసింది. మీరయితే పురుషోత్తములు. ప్రకృతి తన లక్షణాలను చూపగలుగుతున్నప్పుడు పురుషోత్తములు చూపించలేరా?

ఇప్పుడు సమయం ఎటువైపుకి వెళ్తుందో తెలుసా? అతి వైపుకి వెళ్తుంది. అన్ని వైపుల అతి కనిపిస్తుంది. అంతిమానికి గుర్తు - అతి. ప్రకృతి ఏవిధంగా అయితే సమాప్తి వైపుకి అతిలోకి వెళ్తుందో, అదేవిధంగా సంపన్నంగా అయ్యే ఆత్మల ఎదురుగా పరీక్షలు లేదా విఘ్నాలు కూడా అతిగా వస్తాయి. మొదట్లో ఇవి లేవు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అని ఆశ్చర్యపడనవసరం లేదు. అంతిమ పేపర్ లో ఆశ్చర్యకర విషయాలే ప్రశ్నలుగా వస్తాయి. అప్పుడే పాస్ లేదా ఫైయిల్ అవుతారు. వద్దనుకున్నా కానీ బుద్ధిలో ప్రశ్నలు ఉదయించకూడదు. ఇదే పేపర్ మరియు ఒక్క సెకను యొక్క పేపర్. ఎందుకు అనే ప్రశ్న చంద్రవంశీ వరుసలోకి పంపేస్తుంది. మొదట సూర్యవంశీయుల రాజ్యం ఉంటుంది కదా? చంద్రవంశీయులది తర్వాత నెంబరు. కనుక అటువంటి వారికి రాజ్య సింహాసనాధికారిగా అయ్యే వరుసలో నెంబరు వస్తుంది. అందువలన ఏకరస స్థితిలో స్థితులయ్యే అభ్యాసం నిరంతరం ఉండాలి. సమస్య అనే ఆసనాన్ని సంభాళించుకోవటంలో నిమగ్నం కాకూడదు. ఆసనంపై కూర్చుని సమస్యను ఎదుర్కోవాలి. ఇప్పుడు సమస్య అనేది మీ ఆసనాన్ని స్మృతి ఇప్పిస్తుంది. విఘ్నం వస్తే విశేషంగా యోగం చేస్తారు. మరియు భట్టీ పెట్టుకుంటారు కదా? అంటే శత్రువు శస్త్రం యొక్క స్మృతి ఇప్పిస్తున్నాడు, కానీ స్వతహా మరియు సదా స్మృతి ఉండటం లేదు అని అర్ధం అవుతుంది. నిరంతర యోగులా లేక మధ్యమధ్యలో ఖాళీ వచ్చే యోగులా? బిరుదు అయితే నిరంతర యోగి అనే కదా! శూలం నుండి ముల్లుగా అవ్వటం అనేది కూడా అంతిమ స్థితి కాదు. ముల్లు గ్రుచ్చుకున్న తర్వాత తీయటం ఇది కూడా అంతిమ స్థితి కాదు. ఆ ముల్లుని కూడా మీ సంపూర్ణ స్థితి ద్వారా సమాప్తి చేసుకోవాలి - ఇది అంతిమ స్థితి. ఇటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని మీ స్థితి వృద్ధికళ వైపుకి తీసుకెళ్ళి పెంచుకుంటూ నడవండి. పెద్ద విషయాన్ని చిన్నదిగా అనుభవం చేసుకోవాలి, ఈ స్థితికి మహారథీలు నెంబరువారీగా శక్తిననుసరించి చేరుకున్నారు. కానీ ఇప్పుడు అంశం మరియు వంశం కూడా సమాప్తి అయిపోయే స్థితి వరకు చేరుకోవాలి.

మీరందరు కూడా ధైర్యం, ఉల్లాసం మరియు సదా సర్వుల సహయోగిగా ఉంటూ నడుస్తున్నారు కదా? కలియుగి ప్రపంచాన్ని సమాప్తి చేసేటందుకు లేదా పరివర్తన చేసేటందుకు, మాయకు వీడ్కోలు ఇచ్చేటందుకు సంఘటనగా చుట్టుముట్టారు కదా? గట్టిగా చుట్టుముట్టారా లేక మధ్య మధ్యలో ఎవరైనా ఢీలా అవుతున్నారా లేదా అలసిపోతున్నారా లేదా నడుస్తూ నడుస్తూ ఆగిపోవటం లేదు కదా? ముందుకి వెళ్ళకుండా, వెనక్కి వెళ్ళకుండా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోయే పాఠాన్ని పక్కా చేయటం లేదు కదా? సమయం తోస్తే ముందుకి వెళ్తాం అని అనుకుంటూ ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోవటం లేదు కదా? ఏదోక రకమైన తోడు కోసం వేచి చూస్తూ నిలబడి ఉండిపోవటం లేదు కదా? ఇటువంటి స్థితి గలవారిని ఏమంటారు? దీనినే అంగదుని స్థితి అని అనుకోవటం లేదు కదా? ఒకవేళ ఈ విధంగా ఆగిపోతే చివర్లో వచ్చిన వారు ముందుకి వెళ్ళిపోతారు. పర్వతాలపై ఎప్పుడైనా మంచు అడ్డుగా పడి గడ్డకట్టేస్తే మార్గం మూసుకుపోతుంది. అప్పుడు ఆ మంచుని కరిగించి అడ్డుని తొలగించడానికి ప్రయత్నిస్తారు కదా! అదేవిధంగా ఇక్కడ కూడా మంచు వలె గడ్డకట్టేస్తే యోగాగ్ని తక్కువగా ఉన్నట్లు. యోగాగ్నిని పెంచితే మార్గం స్పష్టం అవుతుంది. బాబా ద్వారా లభించిన ధైర్యోల్లాసాలను పెంచే పాయింట్లను బుద్ధిలో త్రిప్పుకుంటూ ఉండండి. అప్పుడు మార్గం స్పష్టమౌతుంది. ఇప్పటి వరకు ఉన్న ఫలితాన్ని బట్టి ఈ విధంగా సగమే నడుస్తున్నారు. అందువలన దీని కంటే ముందుకి వెళ్ళండి. ఈ ఫలితం పురుషోత్తమ ఆత్మలకు మంచిగా అనిపిస్తుందా? అందువలన పురుషార్ధం యొక్క వేగంలో అంగదునిగా అవ్వకండి, మాయతో ఓడిపోకుండా విజయీ అయ్యేటందుకు అంగదునిగా అవ్వండి.

మంచిది, ఉన్నతోన్నతమైన తండ్రి ద్వారా పాలన పొందేవారికి, విశ్వాన్ని పాలన చేసేవారికి, విష్ణుకులం యొక్క శ్రేష్టాత్మలకు, ప్రకృతిని పరివర్తన చేసే పురుషోత్తమ ఆత్మలకు, విశ్వం ముందు సాక్షాత్తు మూర్తులుగా ప్రసిద్ధం అయ్యే ఆత్మలకు, ఒక్క బాబా తప్ప మరెవ్వరులేరు అనే సంలగ్నతలో నిమగ్నం అయ్యే ఆత్మలకు, యోగి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.