18.01.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సాక్షాత్కార మూర్తి మరియు ఫరిస్తా మూర్తి అయ్యేటందుకు ఆహ్వానం.

పవిత్ర భవ మరియు యోగీ భవ యొక్క అమర వరదానం ఇచ్చేవారు, సర్వ ఆత్మల స్నేహీ పరమపిత శివ మాట్లాడుతున్నారు -

స్నేహి ఆత్మలందరికీ స్నేహానికి జవాబు స్నేహంతోనే ఇస్తున్నారు. నయనాల యొక్క కన్నీళ్ళ ముత్యాల కంఠహారాన్ని పిల్లలు బాప్ దాదాకి ధరింపచేశారు. దానికి ఫలితంగా ఙ్ఞానరత్నాల మాలను బాప్ దాదా ఇస్తున్నారు. ఈ రోజు అమృతవేళ ప్రతి ఒక్క స్నేహీ పిల్లల యొక్క సంకల్పం, బాప్ దాదా దగ్గరకు చేరుకుంది. ప్రతి ఒక్కరి ఆత్మిక సంభాషణ, ప్రతి ఒక్కరి శుభ సంకల్పం, ప్రతి ఒక్కరు చేసిన ప్రతిజ్ఞ బాబా దగ్గరకు చేరుకున్నాయి. ఆ ఆత్మిక సంభాషణలన్నింటికి జవాబుగా బాప్ దాదా స్వయంగా అవ్యక్తంగా కలుసుకోవాలని అభిలషిస్తున్నారు. తండ్రిని పిల్లలు వ్యక్తంలోకి పిలుస్తున్నారు. మరియు తండ్రి పిల్లలను అవ్యక్త వతనానికి పిలుస్తున్నారు. అవ్యక్తవతనవాసి తండ్రి సమానంగా అవ్వడం - పిల్లల పట్ల తండ్రికున్న శుభ కోరిక ఇదే. ఇప్పుడు చెప్పండి, ఎంత సమయంలో అవ్యక్తవతనానికి వస్తారు. అవ్యక్తవతనం యొక్క కలయిక ఎంత సుందరమైనదో తెలుసా, బాప్ దాదా కూడా పిల్లలు లేకుండా తిరిగి ఇంటికి వెళ్ళలేరు. ఇంటికి వెళ్ళే ముందు అవ్యక్త ఫరిస్తాల సభ అవ్యక్తవతనంలో ఉంటుంది. ఆ సభకి బాప్ దాదా స్నేహీ పిల్లలందరికీ ఆహ్వానం ఇస్తున్నారు. పిల్లలు తండ్రిని పాత ప్రపంచంలోకి ఆహ్వానిస్తారు లేదా పిలుస్తారు. కానీ తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఫరిస్తాల ప్రపంచంలోకి పిలుస్తున్నారు. అక్కడ నుండి జతగా ఆత్మల ప్రపంచానికి వెళ్దామని. ఈ అలౌకిక అవ్యక్త ఆహ్వానం ఇష్టమేనా? ఇష్టమైతే వ్యక్త జన్మ, వ్యక్త భావాన్ని మరిచిపోడం రావడం లేదా? బాబా సమానంగా నిరంతర ఫరిస్తాగా అవ్వడం రావడం లేదా? ఒక్క సెకను యొక్క సంకల్పాన్ని నిరంతరం దృఢంగా చేసుకోవడం రావడం లేదా తయారవవల్సిందే, వెళ్ళవలసిందే ఇలా ఒక్క సెకెను యొక్క టికెట్ తీసుకోవడం రావడం లేదా శక్తి రూపీ ఖజానా (ధనం) ఉండి కూడా ఈ టికెట్ రిజర్వ్ చేసుకోలేకపోతున్నారా? దృష్టితో అద్భుతం చేసి, మీతో పాటు విశ్వంలోని సర్వాత్మలకు ముక్తి -జీవన్ముక్తి అనే వారసత్వం బాబా నుండి ఇప్పించలేరా? బాబా యొక్క, మీ యొక్క భక్తులను భ్రమించడం నుంచి త్వరత్వరగా విడిపించే శుభ సంకల్పం తీవ్ర రూపంగా ఉత్పన్నమవడం లేదా? దయాహృదయులైన తండ్రి యొక్క సంతానం దు:ఖం అశాంతిలో తపిస్తున్న ఆత్మలను చూసి సహించగలుగుతున్నారా? దయ రావడం లేదా? అనేక రకాలైన వినాశీ సుఖ శాంతుల్లో విచలితమైన ఆత్మలు తండ్రిని మరియు స్వయాన్ని మర్చిపోయారు. అలా మరిచిపోయిన ఆత్మల పట్ల కళ్యాణ భావన ద్వారా వారికి యదార్థ గమ్యాన్ని చెప్పి అవినాశి ప్రాప్తి అనే దోసిలి ఇచ్చే సంకల్పం ఉత్పన్నం కావడం లేదా? ఇప్పటి సమయాన్ని అనుసరించి ఏడు రోజుల కోర్సుకు బదులు మీ వరదానాల ద్వారా, మీ సర్వశక్తుల ద్వారా సెకను యొక్క కోర్సు చెప్పండి. అప్పుడే సర్వ ఆత్మలను ఆత్మల ప్రపంచానికి బాబాతో పాటు తీసుకువెళ్ళగలరు. అశరీరి భవ, నిరాకారి భవ, నిరహంకారి మరియు నిర్వికారి భవ అనే వరదానాలు వరదాత ద్వారా ప్రాప్తించాయి కదా? ఇప్పుడు ఇలాంటి వరదానాలను సాకార రూపంలోకి తీసుకురండి. అనగా స్వయాన్ని జ్ఞానమూర్తిగా, స్మృతిమూర్తిగా మరియు సాక్షాత్కారమూర్తిగా తయారు చేసుకోండి. ఎవరు, ఎదురుగా వచ్చినా కానీ మస్తకం ద్వారా మస్తకమణి కనిపించాలి, నయనాల ద్వారా జ్వాల కనిపించాలి. మరియు నోటి ద్వారా వరదానాలే రావాలి. ఇప్పటి వరకు బాప్ దాదా యొక్క మహావాక్యాలను సాకార స్వరూపంలోకి తిసుకువచ్చేటందుకు ఎలాగైతే నిమిత్తమయ్యారో, ఇప్పుడు ఈ స్వరూపాన్ని సాకారం చేసుకోండి. బాప్ దాదా పిల్లల యొక్క స్నేహం, సహయోగం, మరియు సేవ కొరకు మాటిమాటికి సంతుష్టత అనే పుష్పాలను వేస్తున్నారు. శ్రమను చూసి ధన్యవాదాలు ఇస్తున్నారు. దాంతో పాటు భవిష్యత్ కోసం ఆహ్వానం కూడా ఇస్తున్నారు. ఇప్పుడు త్వర త్వరగా తీవ్ర వేగంతో మిగిలిపోయిన ఈశ్వరీయ సేవను సంపన్నం చేయండి. అంటే స్వయాన్ని బాబా సమానంగా తయారు చేసుకోండి. ఆహ్వానం చేస్తూ చేతులు చాచిన బాబా చేతుల్లో లీనమైపోండి. మరియు సమానంగా అయిపోండి. స్నేహానికి ప్రత్యక్ష స్వరూపం సమానంగా అవ్వడం. ఈరోజే బాప్ దాదాతో పాటు వెళ్తారా? ఇలా సదా తయారుగా ఉన్నారా? లేక మిగిలిపోయిన సేవా అనే శుభ సంబంధం లాగుతుందా? సర్వ కార్యాలు సంపన్నం చేసేసారా లేక ఇప్పటికీ మిగిలి ఉన్నాయా? అవి మరలా వతనం నుంచి చేస్తారా? ఒక్క సెకెనులో సర్వసంబంధాలతో సేవ చేసే పురుషార్ధం చేస్తున్నారు. అదేవిధంగా మీ నిజస్వరూపం లేదా వరదానీ స్వరూపం సదా స్మృతిలో ఉండాలి. అపవిత్రత మరియు విస్మృతి యొక్క నామరూపాలు ఉండకూడదు. వరదానాల కోర్సు చేయడం అని దీనినే అంటారు. ఇలాంటి కోర్సు చేసారా లేక చేయాలా? మీరు సప్తాహ కోర్సు పూర్తి చేయకుండా ఏ ఆత్మను క్లాసులో కూర్చోనివ్వరు. అదేవిధంగా బ్రాహ్మణ పిల్లలు ఈ ప్రత్యక్ష కోర్సు చేయకపోతే బాప్ దాదా వారిని ఏ క్లాసులో కూర్చోనివ్వరో తెలుసా? వారు మొదటి తరగతిలోకి రాలేరు. మొదటి తరగతి ఏమిటి? ఎలాగైతే మీరు వారిని క్లాసులోకి వెళ్లనివ్వరో అలాగే డ్రామా కూడా మొదటి తరగతిలోకి (ఫస్ట్ క్లాస్) వెళ్ళే అధికారిగా అవ్వనివ్వదు. మొదటి తరగతిలోకి వెళ్ళేటందుకు ఈ రెండు ముఖ్య వరదానాలు ప్రత్యక్ష రూపంలో ఉండాలి. విస్మృతి లేదా అపవిత్రత అంటే ఏమిటో తెలియని వారిగా అవ్వాలి. మీరు సంగమమంలో ఉన్నారు కదా! ఈ సంస్కారాలు లేదా స్వరూపం నాది కాదు. పూర్వ జన్మలోనివి, ఇప్పటివి కాదు అని అనుభవం అవ్వాలి. నేను బ్రాహ్మణుడిని ఇది శూద్ర సంస్కారం లేదా స్వరూపం ఇలా మీవి కానట్లుగా; ఎవరి సంస్కారాలో అన్నట్టుగా అనుభవం అవ్వాలి. దీనినే అతీతం మరియు అతి ప్రియం అంటారు. ఎలాగైతే దేహం మరియు దేహీ రెండూ వేర్వేరు వస్తువులో, అజ్ఞానానికి వశమై రెండింటినీ కలిపేశారు. నాది అనే దానిని నేనుగా భావించారు. ఈ పొరపాటు కారణంగానే ఇంత అలజడి, దు:ఖం, లేదా అశాంతి ప్రాప్తించాయి. అదేవిధంగా ఈ అపవిత్రత మరియు విస్మృతి అనే సంస్కారాన్ని నావి కాదు లేదా బ్రాహ్మణులవి కాదు శూద్రులవి అని భావించాలి. వీటిని నావిగా భావించడం ద్వారా మాయకు వశమైపోతారు. అప్పుడు అలజడి అనగా బ్రాహ్మణత్వం యొక్క గౌరవం నుండి దూరమైపోతారు. ఈ చిన్న పొరపాటును చెక్ చేసుకోండి. ఇది నా సంస్కారం కాదు. ఇది నా స్వరూపం కాదు. అర్థమైందా. కనుక పవిత్ర భవ మరియు యోగీ భవ అనే వరదానాలను ప్రత్యక్ష స్వరూపంలోకి తీసుకురండి. అప్పుడే బాబా సమానంగా మరియు బాబాకి సమీపంగా రావడానికి అధికారిగా కాగలరు. ఈరోజు కల్పపూర్వపు వారిని, చాలాకాలం నుండి తప్పిపోయి తండ్రి యొక్క స్మృతిలో తపిస్తున్నవారిని, అవ్యక్త మిలనం జరుపుకోవాలనే శుభ సంకల్ప స్మరణ చేసేవారిని, స్నేహమనే త్రాడుతో బాప్ దాదాని కూడా బంధించేవారిని, అవ్యక్తుడిని కూడా తమ సమానంగా వ్యక్తంలోకి తీసుకువచ్చేవారిని కొత్త కొత్త పిల్లలను లేదా సాకారి దేశం నుండి దూరదేశీ పిల్లలను విశేషంగా కలుసుకునేటందుకు బాప్ దాదా కూడా రావాల్సి వచ్చింది. మరైతే ఎవరు శక్తిశాలి అయినట్లు? బంధించిన వారా? లేక బంధింప బడినవారా? బాబా అంటున్నారు -ఓహో పిల్లలు, ఓహో శబాష్ పిల్లలూ.. కొత్తవారి పట్ల బాప్ దాదా విశేషమైన స్నేహం ఉంది. ఎందుకంటే నిశ్చయానిదే సదా విజయం. విశేష స్నేహం కారణంగా కొత్త పిల్లలు సదా అవ్యక్త మిలనం జరుపుకోవాలనే శ్రమలో ఉంటున్నారు. అవ్యక్త రూపం ద్వారా వ్యక్త రూపంగా చేసిన చరిత్రను అనుభవం చేసుకోవాలని సదా శుభ ఆశా దీపాన్ని వెలిగించుకుని ఉంటున్నారు. ఇలా శ్రమించే వారికి ఫలమిచ్చేటందుకు బాప్ దాదాకి కూడా విశేష స్మృతి స్వతహాగానే ఉంటుంది.

అందువలన బాప్ దాదా ఈరోజు స్మృతి మరియు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే మొదట విశేషంగా నలువైపులా ఉన్న కొత్త కొత్త పిల్లలకు ఇస్తున్నారు. వీరితో పాటు అందరు కూడా పిల్లలే, మిగతా వారందరూ కూడా పిల్లలే. అవ్యక్త రూపంలో అవ్యక్త సంభాషణ సదా కాలికమైనది. ఇలాంటి వరదాత యొక్క పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.