10.02.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సర్వ శక్తుల సహితంగా సేవలో సమర్పణ.

గౌరవం ఇవ్వని వారికి కూడా గౌరవం ఇచ్చేవారు, నిందించే వారికి కూడా గమ్యం చూపించేవారు, త్యాగం ద్వారా సర్వోత్తమ భాగ్యం తయారుచేసే శివబాబా మాట్లాడుతున్నారు -

ఈనాటి ఈ సంఘటన జ్ఞానీ ఆత్మల సంఘటన. ఇలాంటి జ్ఞాని ఆత్మలు లేదా యోగి ఆత్మలు బాప్ దాదాకు కూడా అతి ప్రియం మరియు విశ్వానికి అతి ప్రియం. ఇలాంటి జ్ఞానీ ఆత్మలు మరియు యోగీ ఆత్మలకు భక్తిమార్గంలో మహిమ మరియు పూజ జరుగుతుంది. వర్తమాన సమయంలో కూడా ఆ ఆత్మలు పూజ్యనీయులు మరియు మహిమా యోగ్యులు. పూజ్యనీయులు అనగా ఉన్నత ఆత్మలు మరియు మహిమా యోగ్య ఆత్మలు అనగా ఇలాంటి ఆత్మల గుణాల యొక్క మహిమ లేదా వర్ణన ఇప్పుడు కూడా అందరూ చేస్తారు. భవిష్య మహిమ మరియు పూజకు ఆధారం వర్తమాన సమయం. భవిష్యత్తులో అనగా భక్తిలో ఎవరు ఎంత మహిమ మరియు పూజకు యోగ్యులవుతారో దానిని ఇప్పుడే బుద్ధి బలం ద్వారా సాక్షాత్కారం చేసుకోగలరు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు చూసుకోండి. ఈ సమయంలో కూడా ఆత్మనైన నాకు సర్వాత్మలు అనగా ఎవరైతే సంప్రదింపుల్లోకి వస్తారో మీ బ్రాహ్మణ కుల ఆత్మలు అయినా, వెనువెంట అజ్ఞానీ ఆత్మలు అయినా కానీ వారందరూ మిమ్మల్ని శ్రేష్టంగా అనగా పూజ్యనీయ దృష్టితో చూస్తున్నారా? పూజ్యులు అని పెద్దవారిని కూడా అంటారు. అయితే సర్వాత్మలు ఆ దృష్టితో చూస్తున్నారా? లేక భావిస్తున్నారా? కేవలం కొద్దిమంది ఆత్మలే పూజ్యులుగా అనుభవం చేసుకుంటుంటే వర్తమానం ఆధారంగానే భవిష్యత్ అంతా ఉంటుంది. ఎవరైతే నా తోటి ఆత్మలు లేదా సంబంధంలోకి వచ్చేవారున్నారో ఆత్మనైన నా ద్వారా విశేష గుణాలు అనుభవం అవుతున్నాయా? ఒకవేళ గుణాలు అనుభవంలోకి వస్తే ఇప్పుడు కూడా ఆ ఆత్మలు మనసులోనే లేదా మాటలో కూడా గుణగానం తప్పక చేస్తారు. గుణాలు ఏవైనా కానీ అవి వాటి ప్రభావం తప్పక వేస్తాయి. గుణాలు దాగి ఉండవు. ఈవిధంగా పూజ్యులు మరియు గుణగానం చేయించుకునే జ్ఞానీ ఆత్మ లేదా యోగీ ఆత్మలుగా అయ్యారా? కొద్దిమంది ఆత్మలు చేస్తున్నారా లేదా సర్వాత్మల పట్ల సర్వ గుణాలను మహిమ చేస్తున్నారా? కొన్ని గుణాల మహిమే చేస్తున్నారా? ముందుగానే త్రాసులో గుణాల మహిమ అనే పళ్ళెం బరువుగా ఉందా? సాధారణ నడవడిక అనే పళ్ళెం బరువుగా ఉందా? సమయానుసారం ఇప్పుడు మీ యొక్క అన్ని సబ్జెక్టుల ఫలితాన్ని పరిశీలించుకోండి. ఎంత వరకు జమ చేసుకున్నాను. మనసా, వాచా, కర్మణా ద్వారా ప్రతి సబ్జెక్టును ఎంత వరకు సంపన్నం చేశాను. సర్వ గుణ సంపన్నంగా అయ్యారా లేక గుణ సంపన్నంగా అయ్యారా? కళ్యాణకారి అయ్యారా లేక విశ్వకళ్యాణకారి అయ్యారా? ఇప్పుడు పరిశీలించుకున్న తరువాత సంపన్నం చేసుకునేటందుకు కొంచెం సమయం ఉంది. కానీ కొంచెం సమయం తరువాత సంపన్నం చేసుకునే సమయం కూడా సమాప్తి అయిపోతుంది. అప్పుడేం చేస్తారు.సంపన్నంగా తయారైన ఆత్మలను చూసేవారిగా అవుతారు. పదవిని పొందేవారిగా అవ్వలేరు. కనుక సాక్షాత్కారమూర్తిగా అవ్వాలి. లేదా సాక్షాత్కారం చేయించేవారిగా అవ్వాలి. ఈవిధంగా సాక్షాత్కార మూర్తిగా అయ్యేటందుకు సార రూపంలో స్వయంలో మూడు గుణాలను చూసుకోండి. ఒకటి - సర్వాధికారిగా అయ్యానా? రెండు- పరోపకారి అయ్యానా? మూడు - సర్వులపట్ల సత్కారిగా అయ్యానా? అనగా సర్వులకు గౌరవం ఇచ్చే మరియు తీసుకునే యోగ్యంగా అయ్యానా? గుర్తు పెట్టుకోండి - గౌరవం ఇవ్వటమే తీసుకోవడం. ఈ మూడు విషయాల ఆధారంగానే విశ్వం ముందు విశ్వకళ్యాణకారిగా ప్రసిద్ధమవుతారు. వీటి యొక్క స్పష్టీకరణ మీకు బాగా తెలుసు. సర్వాధికారి అనగా సర్వ కర్మేంద్రియాలపై అధికారి. ఏవిధంగా అయితే ఈ శరీరం యొక్క భిన్న భిన్న శక్తులు చేతులు, పాదాలు మొదలైనవో అదేవిధంగా ఆత్మకు కూడా శక్తులున్నాయి. అవి మనస్సు, బుద్ధి, సంస్కారాలు. ఈ సూక్ష్మ శక్తులపై కూడా అధికారి అయ్యారా, మీ రచన అయిన ప్రకృతిపై అధికారి అయ్యారా, ప్రకృతి యొక్క ఏ తత్వము తనవైపు ఆకర్షితం చేయడం లేదు కదా? విజ్ఞానం ద్వారా ప్రకృతి లేదా భూమి యొక్క ఆకర్షణకు అతీత స్థితికి చేరుకోగలుగుతున్నప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులు, ప్రకృతి యొక్క ఆకర్షణలకు అతీతంగా అనగా వ్యక్తభావానికి అతీతంగా అవ్యక్త లేదా సర్వశక్తివాన్ స్థితిని ప్రాప్తింప చేసుకోవడం కష్టంగా అనుభవం అవటం అనేది బావుండదు. బాబా ద్వారా లభించిన సర్వశక్తుల్లో కొన్నింటిని ఉదాహరణ రూపంలో చిత్రాన్ని కూడా తయారుచేశారు. వారసత్వం రూపంలో ప్రాప్తించిన శక్తులు అనగా స్వయం యొక్క వారసత్వం లేదా సంపదపై మీ అధికారం ఉందా? ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ శక్తి ద్వారా అయినా స్వయాన్ని సఫలం చేసుకోగలగాలి. స్థూల వారసత్వంపై అధికారం ఉంటుంది. కనుక ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో ఆ వస్తువుని ఉపయోగించుకోగలుగుతారు. ఎందుకంటే అది మీ వారసత్వం కనుక. అదేవిధంగా ఈశ్వరీయ వారసత్వానికి ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో, ఏ శక్తి కావాలంటే ఆ శక్తిని కార్యంలో ఉపయోగించగలుగుతున్నారు. ఈ వారసత్వానికి కూడా అధికారులేనా. వీరినే సర్వాధికారి అంటారు. ప్రతి ఆత్మ పట్ల సదా ఉపకార భావన అనగా శుభ భావన మరియు శ్రేష్ఠ కామనలు ఉండాలి. ప్రతి ఆత్మని చూస్తూ ఈ ఆత్మలందరూ ప్రతి సమయం బాబాకి స్నేహిగా మరియు సహయోగిగా అయ్యేటందుకు స్వయాన్ని అర్పణ చేసుకున్నారని అనుభవం అవ్వాలి. ఇలా బలిహరం అవ్వడానికి నిమిత్తంగా ఎందుకయ్యారు? ఎందుకంటే బాబా మీ అందరి ముందు స్వయాన్ని బలిహరం చేసుకున్నారు. అందరి ముందు స్వయాన్ని సర్వశక్తుల సమేతంగా సేవలో సమర్పితం చేసుకున్నారు. తమ సమయాన్ని, సుఖాలను, ప్రాప్తి పొందాలనే కోరికలను సర్వుల పట్ల మహదాని అయి దాత అయ్యారు. ఈ విధంగా తండ్రిని అనుసరించండి. స్వయం కోసం పేరు, ప్రతిష్ఠ, గౌరవం అన్నీ పొందాలనే కోరికను బలిహరం చేసేవారే పరోపకారిగా కాగలరు. తీసుకోవాలనే కోరిక వదిలి ఇచ్చే మహదానులే పరోపకారిగా కాగలరు. అదేవిధంగా సత్కారి అనగా సర్వుల పట్ల గౌరవభావన, సత్కారిగా అయ్యేటందుకు స్వయాన్ని సర్వుల సేవాధారిగా భావించాలి. సేవాధారి యొక్క పరిభాష కూడా గుహ్యమైనది. కేవలం స్థూల సేవ లేదా వాచా ద్వారా సేవ, సంప్రదింపులు లేదా సాధనాల ద్వారా సేవ చేయటం ఇదే కాదు; మీ యొక్క ప్రతి గుణం ద్వారా దానం చేయడం లేదా ఇతరులను కూడా గుణవంతులుగా తయారుచేయడం, మీ సాంగత్యం యొక్క రంగు అంటించడం. ఇది శ్రేష్ఠ సేవ. అవగుణాలను చూస్తూ కూడా చూడకూడదు, స్వయంలోని గుణాల యొక్క శక్తి ద్వారా ఇతరుల్లో ఉన్న అవగుణాలను తొలగించాలి. అంటే నిర్బలులను శక్తిశాలిగా తయారుచేయాలి. నిర్బలులను చూసి వదిలేయకూడదు లేదా అలసిపోకూడదు. నిరాశ చెందిన కేసులను కూడా స్వ సేవ ద్వారా మీ శ్రేష్ట స్వమానంలో స్థితులై గౌరవం ఇవ్వడం ద్వారా సర్వుల సత్కారిగా కాగలరు. స్వయం యొక్క త్యాగం ద్వారా ఇతరులకు గౌరవం ఇస్తూ మీ భాగ్యాన్ని తయారు చేసుకోవాలి. చిన్న - పెద్ద, మహరథీ లేదా కాలిబలం వారిని అందరినీ గౌరవ దృష్టితో చూడండి. గౌరవం ఇవ్వని వారికి కూడా గౌరవం ఇచ్చేవారు, నిందించేవారికి కూడా గమ్యం చూపించేవారు, గ్లాని చేసేవారిని కూడా గుణగానం చేసేవారు అలాంటి వారినే సర్వ సత్కారీ అంటారు. ఈ సంవత్సరం విశేషంగా రెండు రకాల సేవ జరగాలి. ఒకటి - స్వయాన్ని సంపన్నం చేసుకునే సేవ. దీని కోసం ఈ సంవత్సరంలో నలువైపులా విశేష స్థానాల్లో ఉన్నతి యొక్క సాధనాలు యోగభట్టి మరియు ధారణా భట్టీలు పెట్టుకోవాలి. ప్రతి చోటా నలువైపులా గ్రూపుల వారీగా భట్టీ కార్యక్రమం పెట్టుకోండి. స్వతంత్రంగా ప్రతి ఒక్కరికి భట్టీ యొక్క అనుభవం చేయించండి. గత సంవత్సరంలో ఎలాగైతే యోగభట్టీ యొక్క కార్యక్రమం పెట్టుకున్నారో అదేవిధంగా ధారణ మరియు స్మృతి రెండు సబ్జెక్టుల్లో స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకునే భట్టీ ఉండాలి. ఇలాంటి కార్యక్రమం అందరూ కలిసి తయారు చేసుకోండి. రెండవ విషయం - విశ్వ సేవ. దీని కోసం ప్రతి ఒక్క సేవా కేంద్రం మీ యొక్క చుట్టుపక్కల స్థానాల్లో సందేశమిచ్చే కార్యక్రమం తీవ్ర వేగంతో చేయాల్సి ఉంటుంది. మీరు దగ్గరలోని ఏ స్థానం సందేశం ఇవ్వడం నుండి వంచితంగా ఉండకూడదు. వంచితంగా ఉండిపోతే తరువాత సందేశం ఇచ్చే అవకాశం ఉండదు. వంచితం అయిపోయిన ఆత్మల యొక్క భారం నిమిత్త ఆత్మలైన మీపై ఉంటుంది. అందువలన చక్రవర్తి అవ్వండి. మహదాని అనగా మహదానమిస్తూ ముందుకు వెళ్ళండి. నిమిత్తమైన ఒక్కొక్క శ్రేష్టాత్మ కేవలం రెండు నాలుగు స్థానాలు కాదు, దగ్గర స్థానాలన్నీ చుట్టూ తిరగడానికి నిమిత్తం అవ్వాలి. ప్రతీ స్థానంలో మీ వలె వారిని నిమిత్తంగా తయారుచేసి మీరు ముందుకు వెళ్తుండండి. ఆ స్థానంలో కూర్చుండిపోకండి. కనుక ఈ సంవత్సరం చుట్టూ తిరిగే విశేష సేవ చేయాలి. సందేశం ఇస్తూ మీ సమానంగా నిమిత్తంగా తయారు చేస్తూ విశ్వమంతటికి లేదా మీ యొక్క దగ్గరలోని వారికి సందేశం ఇవ్వాలి. ఇప్పుడు సహయోగులను తయారు చేసుకునే కర్తవ్యం చేయండి. సమయానుసారంగా సమయం యొక్క వేగం ఎలాగైతే తీవ్రం అవుతూ ఉందో అదేవిధంగా సేవకు ఫలితంగా ప్రత్యక్షఫలంగా తయారైపోయిన ఆత్మలు నిమిత్తంగా అయ్యేటందుకు సహజంగానే వెలువడుతూ ఉంటారు. కేవలం లక్ష్యం, ధైర్యం మరియు పరిశీలన అవసరం. కల్పపూర్వపు మహిమ ఉంది కదా! పాండవులు బాణం వేశారు, నీరు వచ్చింది. అనగా పురుషార్థం చేశారు మరియు ఫలం లభించింది. ఇది ప్రత్యక్ష ఫలం యొక్క సమయం. అలాంటి సీజన్ సమయం యొక్క వరదానం నుండి దీని యొక్క లాభాన్ని పొందండి. సాధనాలను సమయాన్ని లేదా సంపదను మీకోసం ఉపయోగించడాన్ని త్యాగం చేయండి. అప్పుడే ఈ ప్రత్యక్ష ఫలం యొక్క భాగ్యాన్ని పొందగలరు. సేవ కోసం అర్పణ చేసిన సంపదను స్వయం కోసం లేదా స్వయం యొక్క విశ్రాంతి కోసం ఉపయోగించడం ద్వారా ఎప్పుడూ కూడా సఫలత లభించదు. ఎలా అయితే సేవ యొక్క ప్రారంభంలో తాము తినే రొట్టెలను కూడా తక్కువ చేసుకుని ప్రతి వస్తువును సేవలో ఉపయోగించడం ద్వారా దానికి ప్రత్యక్ష ఫలంగా ఆత్మలైన మీరు వచ్చారు. కానీ మధ్యలో బాబా, డ్రామా, స్వయం కోసం సహజ సాధనాలను ఉపయోగించుకునే అనుభవం చేయించారు. కానీ ఇప్పుడిక అంతిమంలో ప్రకృతి దాసీ అయినా కానీ, సర్వ సాధనాలు ప్రాప్తించినా కానీ, స్వయం కోసం కాకుండా సేవ కోసం ఉపయోగించండి. ఎందుకంటే ఇప్పుడు ఇక మున్ముందు అనేకాత్మలు సాధనాలను తమ సంపదను మీ కంటే ఎక్కువలో ఎక్కువ అర్పణ చేస్తారు. కానీ స్వయం కోసం ఎప్పుడూ స్వీకరించకూడదు. స్వయం కోసం స్వీకరించడం అంటే స్వయాన్ని శ్రేష్ఠ పదవి నుండి వంచితం చేసుకోవడం. అందువలన త్యాగమూర్తులై సేవ యొక్క ప్రత్యక్ష ఫలాన్ని తీసుకురండి. అర్థమైందా!

ఇప్పుడు నిమిత్తంగా అయ్యే వారసులను మరియు సేవలో సహయోగిగా అయ్యేవారి యొక్క పుష్పగుచ్ఛాన్ని బాప్ దాదా ముందు అర్పణ చేయండి. అప్పుడే విశ్వకళ్యాణకారి నుండి విశ్వరాజ్యాధికారి అని అంటారు. దీనికి బహుమతి లభిస్తుంది. బహుమతి ఇవ్వడానికి క్రితం సారి ఫలితం రాలేదు. అందువలన ఈసారి పురుషార్థం చేసి మరలా డబల్ బహుమతి పొందండి. ఇలా అర్పణ చేసేవారు, మొదటి నెంబర్లోకి వచ్చేవారికి, ప్రత్యక్ష ఫలం ఇచ్చేవారికి, బాబాను ప్రత్యక్షం చేసేవారికి, శక్తిసేన, పాండవసేన యొక్క జెండా ఎగురవేసేవారికి, విశ్వం ముందు బాప్ దాదా యొక్క జయజయ ధ్వనులు చేయడానికి నిమిత్తంగా అయ్యే విజయీ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.