08.10.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


స్వయం సంతుష్టమయ్యే మరియు ఇతరులను సంతుష్టం చేసే విధి.

సర్వులను సంతుష్టం చేసేవారు, శక్తిశాలి స్థితిలో స్థితులు చేసేవారు, అసురీ సంస్కారాలను తొలగించే శివబాబా సంగమయుగీ పిల్లలతో మాట్లాడుతున్నారు -

మీకు మీ యొక్క సంగమయుగీ మరియు భవిష్య స్వరూపం స్పష్టంగా కనిపిస్తుందా? భవిష్యత్తు స్పష్టంగా కనిపించడం ద్వారా పురుషార్థం కూడా సరిగ్గా ఉంటుంది. అంతిమ స్వరూపం మహకాళి అనగా అసురీ సంస్కారాలను సమాప్తం చేసేవారు. అందువలన మీరు సదా స్మృతిలో ఉంచుకోవాలి - నేను మహకాళి స్వరూపాన్ని. కనుక మీలో ఇప్పుడు ఏ అసురీ సంస్కారం ఉండకూడదు. నిమిత్త ఆత్మలైన మీకు సదా ఈ ధ్యాస ఉండాలి - నేను తీవ్ర పురుషార్ధం చేయాలని. తీవ్ర పురుషార్థానికి సూక్తి ఎమిటి? (నేను ఏదైతే కర్మ చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు) ఇదైతే మధ్యమ పురుషార్ధం యొక్క సూక్తి, తీవ్ర పురుషార్థానికి సూక్తి ఏమిటంటే - నేను ఎలాంటి సంకల్పం చేస్తానో నా సంకల్పం ద్వారా అలాంటి వాతావరణమే తయారవుతుంది. సంకల్పం ఆధారంగా వాతావరణం ఉంటుంది మరియు వాతావరణం ఆధారంగా పురుషార్థం ఉంటుంది. మీరు ఏదైతే సంకల్పం చేస్తారో దానిని అందరూ అనుసరిస్తారు. కర్మ అనేది స్థూల విషయం కానీ సంకల్పంపై కూడా ధ్యాస ఉండాలి. సంకల్పాన్ని తేలికైన విషయంగా భావించకూడదు. ఎందుకంటే సంకల్పమే బీజం. సంకల్పమనే బీజం బలహీనంగా ఉంటే ఎప్పుడూ కూడా శక్తిశాలి స్థితి అనుభవం అవ్వదు. ఒక్క సంకల్పం వ్యర్ధంగా అవ్వడం కూడా పొరపాటే. వాచాలో పొరపాటు ఎలాగైతే తెలుస్తుందో అదేవిధంగా వ్యర్థ సంకల్పం యొక్క పొరపాటు కూడా అనుభవం అవ్వాలి. ఎప్పుడైతే ఇలాంటి పరిశీలన చేసుకుంటారో అప్పుడే మీరు ముందుకు వెళ్ళగలరు. లేకపోతే నిమిత్తంగా అయ్యే అవకాశం ఏదైతే లభించిందో దాని లాభాన్ని పొందలేరు. ఇప్పుడు గుహ్యమైన పురుషార్థం కావాలి. స్థూల పురుషార్ధం చేసే సమయం సమాప్తం అయిపోయింది. కర్మ మరియు మాటలో పొరపాట్లు జరగడం ఇది బాల్య స్థితి, ఇప్పుడు వానప్రస్థీ పురుషార్ధం చేయాలి. ఇప్పుడు కూడా బాల్య స్థితి యొక్క పురుషార్ధం చేస్తున్నట్లయితే బాగ్యం అనే లాటరీని పోగొట్టుకుంటారు. ఒక్కొక్కసారి హర్షితంగా, ఒక్కొక్కసారి ఉదాసీనంగా, ఒకసారి తీవ్ర పురుషార్ధం మరియు ఒకసారి మధ్యమ పురుషార్థం ఇవి విశేష ఆత్మ యొక్క గుర్తులు కావు, సాధారణ ఆత్మ యొక్క గుర్తులు. ఇప్పుడు మీ అందరిలో విశేషమైన అతీత స్థితి ఉండాలి. మీ శక్తివంతమైన స్మృతి ద్వారా బలహీన ఆత్మల స్థితిని కూడా శక్తిశాలిగా తయారుచేయాలి. సంతుష్టం అవ్వని కారణంగా సేవ ఆగి ఉంది. ఇప్పుడు ఈ సూక్తిని గుర్తుంచుకోండి - సంతుష్టంగా ఉండాలి కూడా మరియు అందరినీ సంతుష్టం చేయాలి కూడా. అర్థమైందా! మంచిది.