11.10.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


అంత:వాహక రూపం ద్వారా పరిభ్రమణ.

మహారథీ పిల్లలను చూస్తూ బాప్ దాదా అన్నారు -

ఈరోజుల్లో ఈ పాత ప్రపంచంలో విశేషంగా ఏమి నడుస్తుంది? ఈ రోజుల్లో విశేషంగా మీ యొక్క ఆహ్వానం నడుస్తోంది. మరి మీరు ఆ ఆహ్వానానికి బదులిస్తున్నారా, భక్తులు ఏమి కోరుకుంటున్నారు? భక్తుల కోరిక ఏమిటంటే దేవీలు చైతన్యరూపంలో ప్రత్యక్షం అవ్వాలని. జడచిత్రాలలో కూడా చైతన్య శక్తులను ఆహ్వానం చేస్తున్నారు. చైతన్య రూపంలో వరదాని అయి వరదానం ఇవ్వాలని పిలుస్తున్నారు. మరైతే భక్తుల యొక్క ఈ కోరిక ఎప్పుడు పూర్తవుతుంది? ఇప్పుడు భక్తి కూడా చాలా ఎక్కువగా నలువైపులా కనిపిస్తూ ఉంది. దాంట్లో కూడా ప్రత్యక్షంగా బాబా గుప్తంగా ఉన్నారు మరియు శక్తులు ప్రత్యక్షరూపంలో ఉన్నారు. మొదట్లో భక్తిలో కూడా బాబాని ఎక్కువగా పిలిచేవారు, ఓ భగవంతుడా! అని పిలిచేవారు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది భగవతీ రూపంలో పూజ చేస్తున్నారు. భక్తుల యొక్క భావన పూర్తి చేయడంలో శక్తులే నిమిత్తం అవుతారు, అందువలన శక్తులనే ఎక్కువగా ఆహ్వానిస్తున్నారు. కనుక ఇప్పుడు శక్తులలో దయాసంస్కారం ప్రత్యక్షం అవ్వాలి. ఇప్పుడు అందరిలో దయాసంస్కారం ప్రత్యక్షంగా లేదు, గుప్తంగా ఉంది. బాబా ఏవిధంగా అయితే నలువైపులా తిరుగుతూ ఉంటారో అదేవిధంగా మీరు కూడా నలువైపులా తిరుగుతూ భక్తులను చూస్తున్నారా? ఎప్పుడైనా విహరానికి వెళ్ళారా? వారి పిలుపు మీకు వినిపిస్తుందా, మరైతే దయ రావడం లేదా? బాబాతో పాటు శక్తులు కూడా పాత్రను అభినయించాలి. అంత:వాహక శరీరం ద్వారా చుట్టూ తిరుగుతుంటారని శక్తుల గురించి మహిమ ఉంది, అదేవిధంగా బాబా కూడా అవ్యక్తరూపంలో చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంత:వాహక శరీరం అనగా అవ్యక్త ఫరిస్తా రూపంలో విహరించాలి. ఇలా అభ్యాసం ఉండాలి మరియు ఇది కూడా అనుభవం అవ్వాలి. విజ్ఞాన యంత్రమైన దుర్బిణీ ద్వారా దూరదృశ్యాలను దగ్గరగా చూస్తున్నారు, అదేవిధంగా స్మృతి అనే నేత్రం ద్వారా మీ ఫరిస్తా స్థితి ద్వారా దూరదృశ్యాన్ని కూడా సాకార నేత్రాల ద్వారా ఏదైనా దృశ్యాన్ని చూసినంత సహజంగా అనుభవం చేసుకోవాలి, పూర్తి స్పష్టంగా కనిపించాలి అనగా అనుభవం అవ్వాలి. విజ్ఞానమంతటికి ఆధారం కరెంట్. కరెంట్ ఆధారంగానే విజ్ఞానం, విజ్ఞానం యొక్క మెరుపు కనిపిస్తుంది. ఆ కరెంట్‌యే శక్తి. అదేవిధంగా శాంతి శక్తికి ఆధారం - దివ్యదృష్టి. దీని ద్వారా శాంతిశక్తి యొక్క చాలా అద్భుతమైన అనుభవాలు చేసుకోగలరు. ఎలాగైతే స్థూల సాధనాల ద్వారా విహరిస్తారో అలాగే ఎప్పుడు కావాలంటే, అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ అనుభవం చేసుకోగలుగుతారు. కేవలం మీకు అనుభవం అవ్వడం కాదు, కాని ఎక్కడికి మీరు చేరుకుంటారో వారికి కూడా అనుభవం అవుతుంది. ఈ రోజు ప్రత్యక్షంగా వారిని కలిసాము అని. సఫలతామూర్తుల యొక్క సిద్ధి ఇదే. మామూలు ఆత్మలకు కూడా సిద్ధి ప్రాప్తిస్తుంది. ఒకే సమయంలో అనేక స్థానాల్లో తమ రూపాన్ని ప్రత్యక్షం చేయగలరు, అనుభవం చేయించగలరు, కాని వారిది అల్పకాలిక సిద్ది, ఇది జ్ఞానయుక్తమైన సిద్ధి. ఇలాంటి అనుభవాలు కూడా చాలా అవుతాయి, మున్ముందు కొన్ని కొత్త విషయాలు కూడా జరుగుతాయి. ఎలాగైతే ఆదిలో ఇంటిలో కూర్చుని ఉండగానే బ్రహ్మబాబా రూపం సాక్షాత్కారం అయ్యేది, నిజంగా ఎవరో మాట్లాడుతున్నట్లు, సూచన ఇస్తున్నట్లు కనిపించేది, అదేవిధంగా అంతిమంలో కూడా నిమిత్తమైన శక్తిసేనల ద్వారా ఇలాంటి అనుభవాలు అవుతాయి. మహరథీలందరి సంకల్పం ఏమిటంటే ఇప్పుడు ఏదో కొత్తది జరగాలని, కనుక ఇలాంటి కొత్త అద్భుతాలు ఇప్పుడు జరుగుతాయి, కానీ దీని కొరకు ఒకటి చాలా తేలికతనం కావాలి, బుద్ధిపై ఏ రకమైన బరువు ఉండకూడదు మరియు రెండు దినచర్య అంతా బాబా సమానంగా ఉండాలి. అప్పుడు బ్రహ్మబాబా సమానంగా ఆది నుండి అంతిమం వరకు దృశ్యాలను అనుభవం చేసుకోగలుగుతారు. అర్థమైందా! ఇప్పుడు మహారథీలు ఏమి చేయాలో? కేవలం యోగం కాదు, సేవారూపాన్ని పరివర్తన చేయాలి, మహారథీల యొక్క యోగం లేదా స్మృతి ఇప్పుడు కేవలం స్వయం పట్ల కాదు, సేవ పట్ల ఉండాలి అప్పుడే మహదాని మరియు మహజ్ఞాని అని పిలువబడతారు. మంచిది.

సమయం యొక్క సమాప్తికి గుర్తు ఏమిటి? సంఘటన అంతటి యొక్క మాట ఒకటే మేము విజయులము. విజయం మా జన్మ సిద్ద అధికారం లేదా విజయం మా కంఠహరం ఇదే మాట ఉంటుంది. ఈ విధంగా ప్రత్యక్షంగా అనుభవం అవుతుంది, కేవలం చెప్పటం వరకు కాదు, ఈ నషా సదా ఉండాలి, ఎదురుగా కనిపిస్తూ ఉండాలి. విజయం అనే గమ్యం కనిపిస్తుంది కదా? మంచిది.