15.10.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


టీచర్‌గా అవ్వటము అనగా సౌభాగ్యం యొక్క లాటరీ తీసుకోవడం.

పాండవులు మరియు శివశక్తి సేన లేదా టీచర్స్ కోసం అవ్యక్త బాప్ దాదా యొక్క అవ్యక్త మధుర మహావాక్యాలు -

మీరు ప్రతి కర్మను చేసి చూపించేటందుకు నిమిత్తులు, ప్రతి టీచర్‌ను చూసి నడిచేవారు, చేసేవారు ముందుకు వెళ్ళేటటువంటి వారి యొక్క వరుస ఎంత పెద్దది ఉంటుంది? కనుక టీచర్ అనగా సరైన మార్గంలో నడిపించడానికి నిమిత్తం అయినవారు. అలాంటివారు ఆగిపోతే వెనుక ఉన్న వరుస అంతా ఆగిపోతుంది. మీ వెనుక ఉన్న వరుస యొక్క బాధ్యత మీకు ఉంది. ఇలా బాధ్యతాధారిగా భావించి నడిస్తే ప్రతి కర్మ ఎలా చేస్తారు? మామూలుగా కూడా చెబుతారు బాధ్యత అనేది గొప్ప టీచర్ అని. టీచర్ ఎలాంటి జీవితం తయారు చేసుకుంటారో, అలాంటి జీవితాన్నే తయారుచేసుకునే శిక్షణ ఇచ్చే బాధ్యత కూడా ఉంది. కనుక ప్రతి టీచర్ పైన ఇంత విశాలమైన బాధ్యత ఉంది. ఇలా భావించడం ద్వారా కూడా మీపై మీకు ధ్యాస ఉంటుంది. ఇలాంటి ధ్యాస ఉంటే బాబా మరియు సేవ తప్ప మరేది బుద్ధిలో ఉండనే ఉండదు. బాధ్యత అనేది పెద్దరికాన్ని తీసుకువస్తుంది. బాధ్యత లేకపోతే బాల్య స్థితి ఉంటుంది. బాధ్యత ఉండడం ద్వారా సోమరితనం సమాప్తి అయిపోతుంది. కనుక టిచర్ అయిన వారు ప్రతి సంకల్పం, ప్రతి అడుగు వేసే ముందు ఆలోచించాలి. నా వెనుక ఇంత బాధ్యత ఉందని, ఈ బాధ్యత మనల్ని బరువు చేస్తుంది. భారం అనిపిస్తుందనుకోకండి. ఈ బాధ్యతలు ఎంత తీసుకుంటారో అంతగా అనేకుల యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. అప్పుడు ఆ భారం అంతా సంతోషంలోకి మారిపోతుంది. భారంగా అనిపించవు తేలికగా ఉంటారు. బ్రహ్మబాబా ఎలాగైతే నిమిత్తం అయ్యారో అలాగే మీరందరూ. కనుక మీరందరూ బ్రహ్మబాబాని అనుసరించాలి. బాధ్యత మరియు తేలికతనం రెండింటి సమానత ఉండేది. అదేవిధంగా తండ్రిని అనుసరించండి. టీచర్స్ కి సూక్తి ఏమిటంటే ఫాలో ఫాదర్, తండ్రిని అనుసరించకపోతే సఫలతా టీచర్‌గా కాలేరు. టీచర్ పొందాల్సిన మొదటి సర్టిఫికెట్ స్వయం సంతుష్టంగా ఉండడం, మరియు ఇతరులను సంతుష్టం చేయడం. మొదటి నెంబర్ టీచర్ యొక్క గుర్తు ఇదే, సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టం చేయాలి. టీచర్స్ సంతుష్టంగా ఎందుకు ఉండరు? టీచర్స్ కి ఎన్ని అవకాశాలుంటాయి? ఒకటి - సమర్పణ అయ్యే అవకాశం, రెండు - సేవకు అవకాశం, మూడు - నిమిత్తంగా అవ్వడం వలన మీపై మీకు అటెన్షన్ పెట్టుకునే అవకాశం మరియు నాలుగు - ఎంతమందిని మీ సమానంగా తయారుచేస్తారో అంతగా పురుషార్థంలో సఫలత పొందే అవకాశం. అన్నింటికంటే ఎక్కువగా పురుషార్థంలో మొదటి నెంబర్ తీసుకునే అవకాశం. విద్యార్థులకైతే హంస మరియు కొంగ కలిసి ఉండాల్సి ఉంటుంది. కానీ టీచర్స్ కి అయితే వాతావరణం కూడా మంచిగా లభించే అవకాశం ఉంది. కనుక టీచర్‌గా అవ్వడం అంటే లాటరీ పొందడం. టీచర్స్ కి డ్రామాలో చాలా మంచి పాత్ర ఉంది. టీచర్స్ తమ భాగ్యాన్ని చూసుకుని సంతోషపడాలి. మీకు ఏమి లభించాయో ఆ ప్రాప్తుల యొక్క జాబితాను ఎదురుగా పెట్టుకోండి. ఎన్ని లభించాయి? వాటిని చూసుకుంటున్నారా? అమృతవేళ అందరూ ఆత్మిక సంభాషణ చేస్తున్నారా? ఎవరైతే ఆత్మిక సంభాషణ చేయడంలో ఉన్న రసాన్ని పొందుతారో వారు రోజంతటిలో సఫలులుగా ఉంటారు. సోమరిగా ఉండడం లేదు కదా? సదా మీపై మీకు ధ్యాస ఉంటుందా? రసం కూడా అనుభవం అవుతుందా! ఒకరు నియమాన్ని నిలుపుకునేవారు, ఇంకొకరు ప్రాప్తిని పొందేవారు. మీరందరూ ప్రాప్తిని పొందేవారే కదా! ఓంశాంతి.