24.10.1975        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


శక్తుల యొక్క విశేష గుణం నిర్భయత.

శివశక్తి సేన యొక్క సర్వోన్నత అధిపతి సర్వశక్తివాన్ శివబాబా పంజాబ్ మరియు గుజరాత్ జోన్ శివశక్తులను సంబోధిస్తూ మాటాడిన మధుర మహాకావ్యాలు -

శక్తుల యొక్క విశేష గుణం నిర్బయత అనే మహిమ ఉంది. అది మీలో అనుభవం చేసుకుంటున్నారా? కేవలం మనుష్య ఆత్మలతో నిర్భయంగా ఉండడం అని కాదు. కానీ మాయా యుద్ధంలో కూడా నిర్భయులుగా ఉండాలి. మాయకు భయపడనటువంటివారిని శక్తి అని అంటారు. మాయతో భయపడడం లేదు కదా? ఎవరైతే భయపడతారో వారు ఓడిపోతారు. ఎవరైతే నిర్భయంగా ఉంటారో వారితో మాయ భయపడుతుంది. ఎందుకంటే భయం కారణంగా శక్తిని కోల్పోతారు మరియు తెలివిని కూడా కోల్పోతారు. మామూలుగా కూడా ఎప్పుడైనా భయమేస్తే తెలివి మాయమైపోతుంది. మామూలుగా ఉండే తెలివి కూడా మాయమైపోతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఎవరైతే మాయతో భయపడతారో వారు తెలివిని కోల్పోతున్నారు. అందువలన మాయను జయించలేకపోతున్నారు. పేరు శక్తిసేన, కనుక శక్తి యొక్క విశేషత నిర్భయత ప్రత్యక్షంలో కనిపించాలి, అప్పుడే శక్తులు అని అంటారు. ఏరకమైన భయం ఉన్నా కానీ వారిని శక్తి అని అనరు. ఎవరైతే అబలగా ఉంటారో వారు సదా ఆధీనమై ఉంటారు. వారెప్పుడూ అధికారిగా కాలేరు. మీరైతే అధికారి కదా? భయం కారణంగా ఆధీనం అయిపోరు కదా? పంజాబ్ యొక్క శక్తి సేన ఇలాంటి నిర్భయులేగా? ఎప్పటి నుండి బ్రాహ్మణులుగా అయ్యారో అప్పుడు మాయకు శపథం చేశారు - మాయ! ఎంత యుద్ధం చేయాలనుకుంటే అంతా చేయి, నేను శివశక్తిని అని అన్నారు. మీ యొక్క ఏదోక బలహీనత కారణంగానే మాయకు పరవశం అవుతారు. ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడ మాయ ఉంటుంది; ఎక్కడ మురికి ఉంటుందో అక్కడ దొమలు తప్పకుండా ఉత్పన్నం అవుతాయి. అదే విధంగా మాయ కూడా ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడే ప్రవేశిస్తుంది. బలహీనం అవ్వడం అంటే మాయను ఆహ్వనించటం. మీరే ఆహ్వానిస్తున్నారు. మరియు మీరే భయపడుతున్నారు మరైతే ఆహ్వనించేదే ఎందుకు? మేమే శివశక్తి సేన ఈ నషా పెట్టుకోండి. కల్పపూర్వం కూడా మాయపై విజయీగా అయ్యారు. ఇప్పుడు కూడా అదే పాత్రను తిరిగి పునరావృతం చేస్తున్నారు ఎన్నిసార్లు విజయీ అయ్యారు? అనేకసార్లు విజయీ అయినవారు ఎంత నిర్భయంగా ఉంటారు? భయపడతారా వారు? బాబాని ప్రత్యక్షం చేసే నగాఢా శక్తిసేన ఏమి మ్రోగించారు? కుంభకర్ణులను మేల్కొలిపేందుకు పెద్ద నగాఢా మోగించండి. చిన్న నగాఢా మోగిస్తే కుంభకర్ణులు లేచి మంచిది, మంచిది... అంటూ మరలా నిద్రపోతున్నారు. వారి కొరకు ఇప్పుడు చిన్న చిన్న నగాఢాలతో పని జరగదు. అందువలన తరచుగా సంప్రదింపులను పెంచండి, వారి దోషమేది లేదు, వారు గాఢనిద్రలో ఉన్నారు. మీ పని ఏదో ఒక విశేష కార్యక్రమం పెట్టి వారిని మేల్కొల్పడం. ప్రవృత్తిలో ఉంటూ స్వయాన్ని సేవాధారిగా భావించడం ద్వారానే బాబాని సదా తోడుగా చేసుకోగలరు.

పంజాబ్ నుండి వచ్చిన గోపీలతో సంభాషిస్తున్న సమయంలో అవ్యక్త బాప్ దాదా చెప్పిన మధుర మహావాక్యాలు - ఎలాంటి స్థానమో ఆ స్థానం యొక్క స్మృతి ద్వారా స్థితిలో కూడా బలం లభిస్తుంది. మధువన నివాసీ అవ్వడం ద్వారా ఫరిస్తాస్థితి స్వతహగానే వస్తుంది. ఫరిస్తా అనగా వారికి దేహంతో సంబంధం ఉండదు, కనుక దేహ సంబంధాలన్నింటినీ ఇక్కడే మరిచిపోతారు. కొద్ది సమయం కొరకైనా ఈ అనుభవం చేసుకుంటున్నారు కదా? మధ్యమధ్యలో మధువనం వస్తున్నారు ఎంత కష్టమైనా కానీ, ఈ అనుభవం చేసుకునేటందుకు ఎందుకు వస్తున్నారు? తరచుగా ఈ అనుభవం చేయిస్తుంటారు ఇక్కడ. ఇక్కడి అనుభవం అక్కడ స్మృతిలో బలం నింపుతుంది. కనుక మధువనం రావడం తప్పనిసరి. అక్కడ మీరు ప్రవృత్తిలో ఉంటారు, అది కూడా సేవార్థం. ఇల్లు అని భావిస్తే గృహస్థి అయిపోతారు. సేవాధారిగా భావిస్తే నిమిత్తులు. గృహస్థీలను నలువైపులా కర్మబంధనాలు లాగుతాయి. సేవాధారిగా భావిస్తే నిమిత్త స్థితిలో నాది అనే భావం సమాప్తం అయిపోతుంది. గృహస్థంలో నాది అనే భావం ఉంటుంది. నాది అనే భావం చాలా పెద్దది. ఎక్కడ నాది అనే భావం ఉంటుందో అక్కడ బాబా ఉండరు. ఎక్కడ నాది అనే భావం ఉండదో అక్కడ బాబా ఉంటారు. ఈ స్థితిలో హద్దు యొక్క అధికారిగా అయిపోతున్నారు. నాది అంగీకరించాలి. నాది వినాలి మరియు నా అనుసారంగా నడవాలి... ఇలా హద్దు యొక్క అధికారం ఉంటుందో అక్కడ బేహద్ అధికారం సమాప్తి అయిపోతుంది. కనుక ఇప్పుడు జరిగిపోయిందేదో జరిగిపోయిందిగా భావించి బిందువు పెట్టుకుంటూ వెళ్ళండి. పుల్‌స్టాప్ అనగా బిందువు. పుల్‌స్టాప్ పెట్టడం లేదు అనగా బిందురూపంలో స్థితులవ్వడం లేదు. ఆశ్చర్యార్ధకమో లేదా కామా లేదా ప్రశ్నార్ధకమో పెడుతున్నారు. ఆశ్చర్యార్ధకం అంటే ఏమిటి? ఇలా కూడా జరుగుతుందా? బ్రాహ్మణుల్లో ఇలాంటి విషయాలుంటాయా?.... ఇవే ఆశ్చర్యార్థకాలు, ఇవి కూడా ఉండకూడదు. ఇది ఎందుకు జరిగింది? ఎందుకు, ఏమిటి అని అనటం ప్రశ్నలు. ఇవి కూడా వ్యర్ధ సంకల్పాలను ఉత్పన్నం చేయడానికి ఆధారం అవుతాయి. ఏదైతే జరుగుతుందో దానిని సాక్షి అయి చూడండి. సాక్షి అవ్వడానికి బదులు ఆత్మకు తోడుగా అయిపోతున్నారు. బాబాకి తోడుగా అవ్వడానికి బదులు ఆత్మకు తోడుగా అయిపోతున్నారు. అవునా.. అలాంటి విషయమా.. నేను కూడా అలాగే అనుకుంటున్నాను ఇలా వినటంలో తోడు మరియు వినిపించడంలో తోడు. ఇలా ఎప్పుడైతే ఆత్మకు తోడుగా అయిపోతారో పరమాత్మకు తోడుగా ఎలా అవుతారు? ఎంత సమయం ఆత్మకు తోడుగా ఉంటారో అంత సమయం బాబాకి తోడుగా కాలేరు. ఇది కూడా ఖండిత యోగం. ఖండిత వస్తువుని పడేస్తారు పూజకు యోగ్యమైన మూర్తి ఎప్పుడైతే ఖండితం అయిపోతుందో అప్పుడు ఏ విలువ ఉండదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఎప్పుడైతే యోగం ఖండితం అవుతుందో అప్పుడు శ్రేష్టప్రాప్తి ఉండదు అనగా విలువ ఉండదు. సదా తోడుగా ఉండేవారు అఖండ యోగులు, అఖండ యోగీ మరియు నిరంతరం బాబాకు తోడు. పంజాబ్ నివాసీలు ఇలా ఉన్నారు కదా!